స్వాయంభువ వంశానుకీర్తనము

సూతుడు అనెను:

“భూత భవిష్యత్కాలపు మన్వంతరములు అన్నింటిలోను ఇచట నామ, రూపములతో సమాన అభిమానములు కలిగి, అనేక విధములైన ఏ యే దేవతలు ఎందరు పుట్టిరో, వారు ఆ మన్వంతరమున అధిపులు. ఋషులును మానవులు కూడ అందరును (దేవతల వలెనే) సమానముగా (నామ రూపములలో) అభిమానులు. మహర్షుల సృష్టి చెప్పబడినది. ఇక స్వాయంభువ మనువుయొక్క వంశమును అనుక్రమముగా విస్తారముగా చెప్పెద వినుడు”.

స్వాయంభువ మనువునకు అతనితో సమానులైన పదుగురు పుత్రులు ఉండిరి. వారు సప్త ద్వీపములు కలిగి, సముద్రములు నిధులుగల ఈ భూమి అంతటను ప్రతి సంవత్సరము వ్యాపించి నివాసముగా చేసికొరి. అపుడు స్వాయంభువ మన్వంతరమున మొదటి త్రేతాయుగము,

ప్రజాసృష్టికి తగిన తపము యోగముగలవారును, స్వాయంభువునకు పౌత్రులును (మనుమలును) అయిన ప్రియవ్రతుని పుత్రులచే ఈ భూమి అంతయు నివాసభూమిగా చేసికొనబడినది. వీరుడైన ప్రియవ్రతునివలన సంతానవంతులైనారు. స్వాయంభువ మనువునకు కన్య (దేవహూతి) కలిగెను. ఆ మహాభాగ్యవంతురాలు కర్దమ ప్రజాపతికి భార్యయైనది. ప్రియవ్రతునకు సమ్రాట్, కుక్షి అను వారలు ఇరువురు కన్యలును, నూరుగురు పుత్రులును కలిగిరి. ఆ ఇరువురి కన్యల సోదరులైన పదుగురు శూరులు ప్రజాపతితో సమానులు. వారు (1) అగ్నీధ్రుడు (2) వపుష్మంతుడు (3) మేధుడు (4) మేధాతిథి (5) విభువు (6) జ్యోతిష్మంతుడు (7) ద్యుతిమంతుడు (8) హవ్యుడు (9) సవనుడు (10) సర్వుడు అనువారు. ప్రియవ్రతుడు ధర్మ ప్రకారముగా ఈ ఏడుగురిని ఏడు ద్వీపములందు పట్టాభిషిక్తులను చేసెను. ఆ ద్వీపములను గురించి వినుడు.

ప్రియవ్రతుడు మహాబలుడైన అగ్నీధ్రుని జంబూ ద్వీపమునకు రాజుగా చేసెను. మేధాతిథిని ప్లక్ష ద్వీపమునకు, వపుష్మంతుని శాల్మల ద్వీపమునకు, జ్యోతిష్మంతుని కుశ ద్వీపమునకు, ద్యుతిమంతుని క్రౌంచ ద్వీపమునకు, హవ్యుని శాక ద్వీపమునకు, సవనుని పుష్కర ద్వీపమునకు రాజుగా చేసెను.

పుష్కర ద్వీపమున సవనునకు మహవీతుడను పుత్రుడు కలిగెను. (మహావీతుడు) ధాతకియును అను ఈ ఇరువురు పుత్రులు, శ్రేష్ఠులైనపుత్రులు. మహాత్ముడైన ఆతని పేర ఆ దేశము మహావీతవర్ధమని పిలువబడినది. ధాతకి అను పేర ధాతకీ ఖండమని కూడ ఆ దేశమును పిలిచెదరు.

ప్రభువైన హవ్యుడు శాకద్వీపరాజులైన పుత్రులనుకనెను. వారు జలదుడు, కుమారుడు, సుకుమారుడు, మణీచకుడు, వసుమోదుడు, సుమోదాకుడు, మహాద్రుముడు అను ఏడుగురు. జలదునిది జలదవర్షము (దేశము) మొదటిది. కుమారునిది కౌమార వర్షము రెండవది. సుకుమారునిది సుకుమార వర్షము మూడవది, మనీచకునిది మణీచక వర్షము నాల్గవది, వసుమోద వర్షము ఐదవది, మోదాకునిది మోదక వర్షము ఆరవది, మహా ద్రుమునిది మహాద్రుమ వర్షము ఏడవది. వీరియొక్క నామములతోనే ఈ ఏడు దేశములు ప్రసిద్ధి పొందినవి.

క్రౌంచ ద్వీపరాజైన ద్యుతిమంతునకు గూడ ఏడుగురు పుత్రులు ఉన్నారు. వారు కుశలుడు, మనుగుడు, ఉష్ణుడు, పీవరుడు, అంధకారుడు, ముని దుందుభి-అనువారు వారి స్వనామములతో వెలసి క్రౌంచద్వీపాశ్రయములైన దేశములు శుభములు. ఉష్ణుని దేశము ఉష్ణము అనబడినది. పీవరునిది పీవరమనియు, అంధకారకుని దేశము అంధ కారమనియు, మునియొక్క దేశము ముని అనియు, దుందుభీది దుందుభి అనియు అనబడినవి. క్రౌంచ ద్వీపములోని ఈ ఏడు దేశములు భాస్వరములు, ప్రకాశవంతములు,

కుశద్వీపమున జ్యోతిష్మంతునకు చక్కని మహాతేజస్వులైన ఏడుగురు పుత్రులు కలరు. వీరు-ఉద్భిదుడు, వేణుమంతుడు, స్వైరథుడు, లవణుడు, ధృతి, ఆరవవాడు ప్రభాకరుడు, ఏడవవాడు కపిలుడు. మొదటి వర్షము (దేశము) ఉద్భిదము, రెండవది వేణు మండలము. మూడవది స్వైరథాకారము. నాలుగవది లవణము. ఐదవది ధ్రుతి మద్వర్షము ఆఱవది ప్రభాకర వర్షము, ఏడవది కపిలునిది కపిలము, కుశ ద్వీపములో ఉన్న వారి ద్వీపములు వారి పేరులతోనే వెలసినవి. అవి బ్రహ్మచర్యాది ఆశ్రమములతోనూ, ఆచారములతోను కూడిన ప్రజలచే అలంకరింపబడినవి.

(శాల్మలరాజైన) వపుష్మంతుని పుత్రులు ఏడుగురు. వారు శాల్మల ద్వీపాధిపతులు వారు-శ్వేతుడు, హరితుడు, జీమూతుడు, రోహితుడు, వైద్యుతుడు, మానసుడు, ఏడవవాడు సుప్రభుడు అనువారు. శ్వేతునిది శ్వేతదేశము రోహితునిది రోహితము, జీమూతునిది జీమూతము, హరితునిది హారితము, వైద్యుతునిది వైద్యుతము, మానసునిది మానసము, సుప్రభునిది సుప్రభము. ఈ ఏడుగురు ఈ దేశములకు పాలకులు.

జంబు ద్వీపము తరువాత సప్తద్వీప సముదాయమున జరిగిన విషయమును చెప్పెదను. ప్లక్ష ద్వీపాధిపతియైన మేధాతిథి యొక్క పుత్రులు ఏడుగురు ప్లక్ష ద్వీప రాజులైరి. వారిలో జ్యేష్ఠుడు శాంతభయుడు ఆ ఏడు వర్షములను (దేశములను) ఏలెను. ఆ శాంత భయుని తఱువాత శిశిరుడు, సుఖోదయుడు, ఆనందుడు, ధ్రువుడు, క్షేమకుడు, శివుడు అనువారు ఆ ఏడు వర్షములను ఏలిరి. ఆ యేడు వర్షములు ఏడు భాగములుగా వారి వారి పేరులతోనే పూర్వము స్వాయంభువ మన్వంతరమున పరిపాలింపబడినవి.

ప్లక్ష ద్వీపమున సప్త ద్వీపనివాసులైన మేధాతిథి పుత్రులచేత ప్రజలు వర్ణాశ్రమా చారములు కలవారుగా పాలింపబడిరి. ప్లక్ష, శాల్మల, కుశ, క్రౌంచ, శాక ద్వీపములు అయిదింటిలోనే వర్ణాశ్రమ విభాగము ప్రకారము ధర్మము ఉండెనని తెలుసుకొనవలెను. సుఖము, ఆయువు, రూపము, బలము, ధర్మమున్ను ఈ ఐదు ద్వీపములందు నిత్యము సర్వ సాధారణముగా ఉండెడివి.

ఏడు ద్వీపములతో చుట్టియున్న జంబూద్వీపమును గూర్చి వినుడు. ఆగ్నీధ్రుడు జ్యేష్ఠదాయాదుడు, కన్యాపుత్రుడు, మహాబలుడు, ప్రియవ్రతుడు. అతనిని జంబూ ద్వీపమునకు అధిపతియైన రాజునుగా పట్టాభిషిక్తుని చేసెను. అతనికి తొమ్మండుగురు పుత్రులు ఉండిరి. వారు బ్రహ్మతో సమానమైన తేజము గలవారు. వారిలో జ్యేష్ఠుడు నాభి అను వాడుగా ప్రసిద్ధిచెందెను. అతని తమ్ముడు కింపురుషుడు అనువాడు. మూడవవాడు హరివర్షుడు. నాలుగవవాడు ఇలావతుడు. ఐదవ కుమారుడు రమ్యుడు. ఆరవవాడు హరిన్మంతుడు. ఏడవవాడు కురువు. ఎనిమిదవవాడు భద్రాశ్వుడు. తొమ్మిదవవాడు కేతుమాలుడు అనువారు. వారి వారి దేశములను గురించి వినుడు.

అగ్నీధ్రుడు తన మొదటి కుమారుడైన ‘నాభి’కి హిమమను పేరుగల దక్షిణ వర్షము నిచ్చెను. కింపురుషునకు హేమకూట వర్షము నిచ్చెను. హరివర్షునకు నైషధము అను వరదేశము ఇచ్చెను. ఇలావృతునకు మేరువుయొక్క మధ్యదేశమును ఇచ్చెను. రమ్యునకు నీలము అను దేశము ఇచ్చెను. హరిన్మంతునకు ఉత్తరమునగల శ్వేతము అను వర్షము. ఇచ్చెను. కురువునకు శృంగవంతమునకు ఉత్తరదేశమును ఇచ్చెను. భద్రాశ్వునకు మాల్యవంత దేశము నిచ్చెను. కేతుమాలునకు గంధమాదన వర్షము ఇచ్చెను. ఇవి గొప్పవైన తొమ్మిది వర్షములు ఇవి. ధర్మాత్ముడైన అగ్నీధ్రుడు పైన జెప్పిన అన్ని (తొమ్మిది) వరుసగా తన పుత్రులను దేశములలో అభిషేకించి తాను తపమున ఉండెను. ఈ విధముగా స్వాయంభువుని పౌత్రులైన ప్రియవ్రతుని ఈ ఏడుగురి పుత్రులచే సమస్తములైన సప్తద్వీపములు రాజ్యము చేయబడినవి. కింపురుషాదులైన ఎనిమిది శుభవర్ష(దేశ)ములు స్వభావ సిద్ధముగనే యత్నము లేకుండగనే సుఖముతో నిండినవి. ఆదేశములలో సుఖ వ్యతిరేకమైన దుఃఖము లేదు. ముసలితనము మరణముల భయము లేదు. ఆ క్షేత్రములలో ధర్మాధర్మములు ఉత్తమ, అధమ, మధ్యమములును యుగావస్థయును లేవు.

హిమవర్షమున నాభిఅను నాతని సృష్టిని చెప్పుడును. దానిని వినుడు. మహాద్యుతి యైన ‘నాభి’ మేరుదేవియందు ఋషభుని కనెను. ఋషభుడు సమస్త క్షత్రియజాతికి మొదటివాడైన రాజశ్రేష్ఠుడు. ఋషభునివలన భరతుడు పుట్టెను. అతడు వీరుడు, నూరుగురు కుమారులలో మొదటివాడు. భరతుడు తనపుత్రునకు రాజ్యాభిషేకము జేసి సన్యాసమును స్వీకరించెను. ఋషభుడు దక్షిణ హిమవర్షమును భరతునకు ఇచ్చినందున దీనిని భారతమను పేర పండితులు పిలిచిరి. భరతుని కుమారుడు విద్వాంసుడు ధార్మికుడు అయిన సుమతి అనువాడు, భరతుడు తన రాజ్యమును అతనికి ఇచ్చెను. పుత్రునకు రాజ్యమును సంక్రమింపజేసి, భరతుడు వనమునకు వెళ్లెను అతని కుమారుడు తేజసుడు. తేజసునకు పుత్రుడు శత్రుజేత అయిన ప్రజాపతి, తేజసుని మనుమడు (ప్రజాపతి పుత్రుడు) విద్వాంసుడైన ఇంద్రద్యుమ్నుడు. తండ్రి మరణానంతరము ఇంద్రద్యుమ్నుడు అందరికిని ఇష్టమైన వాడుగా ఉండెను. అతనికి ప్రతీహార కులమున ‘ప్రతిహర్తయను పేర పుత్రుడు కలిగెను. ప్రతిహర్తకు భూమినుండి ఉన్నేత అను పుత్రుడు కలిగెను. ఉన్నేతకు ఉద్దీథుడు, ఉద్గాదునకు ప్రతావి అనువాడును కలిగిరి. ప్రతానికి విభువు, విభువునకు పృథువు, పృథువునకు నక్తుడు, నక్తునకు గయుడు, గయునకు నరుడు, నరునకు విరాట్టు, విరాట్టునకు మహావీర్యుడు, మహావీర్యునకు ధీమంతుడు పుట్టిరి. ధీమంతునకు మహానుడు, మహానునకు భావనుడు, భౌవనునకు త్వష్ట, త్వష్టకు అరిజుడును పుట్టిరి. అరిజునకు రజుడు, రజునకు శతజిత్తు పుట్టిరి. శతజిత్తునకు నూరుగురు పుత్రులు గలిగిరి. వారందరును రాజులే అయిరి. ఎవరిచేత ఈ ప్రజలు విశ్వజ్యోతిని వెలిగించుటయే ప్రధాన లక్ష్యము గలవారుగా వర్ధిల్లజేయబడిరో, వారిచేత ఈ భారత వర్ష(దేశము ఏడు ఖండములు గలదిగా పూర్వము చేయబడినది. వారి వంశమున పుట్టిన వారి చేతనే ఈ భారతభూమి కృత త్రేతాదులతో గూడిన డెబ్బది యొక్క యుగములు పరిపాలింపబడినది. ఆయుగములతో గతించిన రాజులు పూర్వము స్వాయంభువ మన్వంతరమున వందలు, వేలుగా ఉండి ఆ వంశము నకు చెందినవారే. ఇది స్వాయంభువ సృష్టి, దీనిచే జగము నిండినది. ఈ ఋషులచేతను, దేవతలచేతను, పితరులచేతను, గంధర్వులచేతను రాక్షసులచేతను, యక్ష భూత పిశాచుల చేతను, మనుష్య-మృగ-పక్షుల చేతను వారి ఈ సృష్టి లోకమున యుగములతో పాటు మారుచుండును. (33)