వాయు మహా పురాణము
జ్యోతిష్ర్పచారము
సూతుడు అనెను:
క్రింది ప్రమాణమును పైని ప్రమాణమును నాచే వర్ణింపబడు దానిని వినుడు. పృథివి, వాయువు, ఆకాశము, జలము, తేజస్సు - అని ఇవి (పంచ భూతములు) ఐదు. ఇవి అనంత (లెక్కలేని - ఆకాశముయొక్క) ధాతువులు. ఇవి వ్యాపించు నవి సర్వప్రాణులను సర్వభూతములను (పంచ భూతములను) ధరించునది పృథివి. ఇది అనేక జనపదములతో నిండినది. అనేక అధిష్ఠానములు పట్టణములు (బహుజనా వాసములు వ్యాపార నగరములు) కలది. అనేక నదులు (తూర్పు సముద్రములో కలియునవి) నదములు (పశ్చిమ సముద్రములో కలియునవి), పర్వతములును కలది. అనేక జాతులతో నిండినది. ఈ విధముగా భూదేవి బహు విస్తరయై అనంతముగా (అనంతము లేనిదిగా, ఆకాశము కన్నుకలదిగా) కీర్తింపబడును. నదనదీ సముద్రములలో ఉన్నవియు, అట్లే చిన్న చెరువులను గుంటలను ఆశ్రయించి ఉన్నవియు, పర్వతము నందును ఆకాశమున మేఘములతోను ఉన్నవియు, భూమి లోపల ఉన్నవియునైన జలములు అనంతముగానే తెలియవలెను. అట్లే అగ్నియు సర్వలోక నివాసియై, అనంతమని చెప్పబడుచున్నది. అది వ్యాపించినది, అన్నింటికిని పుట్టుకకు కారణము అట్లే ఆకాశము నిరాధారమై రమ్యమై అనేకములు ఆశ్రయముగా కలది. అది అంతయు అనంతమని ప్రసిద్ధిచెందినది. ఆకాశమునుండి పుట్టిన వాయువుకూడ అట్టిదే. జలము భూమియందు (పైన - లోపల) జలమునందు పైన భూమియు ఉన్నవి. ఆకాశము మీదను క్రిందను కలదు. మరల భూమి మరల జలము. ఈ విధముగ భౌతికమైన ఆకాశమునకు అంతములేదు. ఇది పూర్వము దేవతలచే నిశ్చితముగా చెప్పబడినది. వినుడు. భూమి, జలము తరువాత ఆకాశము అని వరుస క్రమము. ఈ ఏడవ రసా తలమున (పాతాళ భాగమున) స్థితి ఈ విధముగా ఉండును.
పదివేల యోజనములు కలది ఒకే భూమికి సంబంధించిన రసాతలము (పాతాళము) అని, ఒక్కొక్కటి బహు విస్తరమైనదిగా సజ్జనులు అందురు. మొదటిది అతలము, తఱువాతిది సుతలము. ఆ తఱువాతది బహువిస్తరమైన వితలము. ఆ తఱువాతది నభస్తలము అనునది. దాని తఱువాతది మహాతలము. ఆ తఱువాతిది శ్రీతలము. ఆ తఱువాత పాతాళమును ఏడవదిగా చెప్పుదురు. అందులో కృష్ణ భౌమము మొదటి భూమిభాగము పాండుభౌమము రెండవది. మూడవది మృత్తికము. నాలుగవది పీత భౌమము. ఐదవది శర్కరాతలము (ఇసుకఏరు). ఆఱవది శిలామయము. ఏడవది సౌవర్ణ (బంగారు) తలము. మొదటి తలమున రాక్షసరాజ భవనము, ఇంద్రశత్రువైన నముచి యొక్క, మహానాథుని యొక్క భువనములుకలవు. శంకుకర్ణుని పురమును, కబంధుని భవనమునుకలవు. సంతుష్ట జనముతో నిండిన నిష్కులాదుని పురము కూడ కలదు. రాక్షసుడైన భీముని యొక్క శూలదంతుని యొక్క భవనములు కలవు. లోహితాక్ష కళింగులయొక్క నగరము కలదు శ్వాపదునికి, ధనంజయునికి, మహాత్ముడైన మహేంద్రునికి చెందిన నగరములు కలవు. ఈ విధముగా కృష్ణ భౌమతలమున నాగ, దానవ, రాక్షసులు యొక్క వేరుపురములు కలవు.
ఓ విప్రులారా! రెండవదైన పాండు భౌమతలమున కూడ, దైత్యరాజైన సురక్షసునికి మహాజంభునికి చెందిన భవనములు కలవు. అట్లే మొదటి హయగ్రీవుని, కృష్ణుని (రెండవ హయగ్రీవుడు కృష్ణుడు), నికుంభుని భవనములు కలవు. శంఖుడును వానియొక్క పురము, గోముఖునియొక్క నగరమును కలవు. రాక్షసుడైన నీలునికి, మేఘునికి, కథనునికి చెందిన పురము కలదు. కురుపాదుని, మహోష్ణీషుని భవనములు కలవు. కంబలునికి, నాగునికి, అశ్వతరునికి చెందినవి, కద్రువ పుత్రుడై మహాత్ముడైన తక్షకుని పురము కూడ కలదు. ఈ విధముగా రెండవదైన పాండు భౌమమునందు నాగ, దానవ, రాక్షసుల యొక్క వేల పురములు గలవు.
రక్త మృత్తిక (పీతభౌమ) మను మూడవ తలమున మహాత్ముడైన ప్రహ్లాదుని యొక్కయు, దైత్యరాజైన మహాత్ముడు ప్రహ్లాదుని యొక్కయు ప్రసిద్ధమైన పురముగలదు. తారకుడు అనువాని పురమును అట్లే త్రిశిరస్సుని పురమునుకలవు. హృష్ఠ పుష్ట జనులతో నిండిన శింశుమారునియొక్క పురముగూడ గలదు. చ్యవనుడు అను రాక్షసుని యొక్క భవనము కూడా అందే ఉన్నది. రాక్షసరాజైన కుంభిలుని, ఖరుని పురముకూడా కలదు. క్రూరుడైన విరాధుని యొక్కయు, ఉల్కాముఖుని యొక్కయు పురముగలదు. హేమకుని, నాగుని అట్లే పాండురకులపురములు కలవు. మణిమంత్రునిపురము. కపిలుని భవనమును, నందుని, ఉరగపతియైన విశాలుని భవనములు కలవు. ఓ విప్రులారా! ఈ విధముగా మూడవదగు రక్త మృత్తికము అను తలమున నాగ దానవ రక్షస్సుల యొక్క వేల పురములుగలవు.
నాలగవ (ప్రీతభౌమము అను) తలమున దైత్య శ్రేష్ఠుడైన కాలనేమి, గజకర్ణుని పురములు కలవు. కుంజరుని నగరము కూడ కలదు. రాక్షసేంద్రుడైన సుమాలియొక్క బహువిస్తరమైన పురము కలదు. లోకనాథుడైన మంజుని యొక్కయు వృకవక్త్రుని భవనములు కలవు. అనేక వేల యోజనములు కలదియు, అనేక పక్షులతో నిండినది అయిన, వైనతేయు (గరుడు)ని నగరము ఈ నాలుగవ రసాతలమున కలదు. బహు యోజనములు విస్తరించిన ఐదవ శర్కరాభౌమమున దైత్య శ్రేష్ఠుడై ధీమంతుడైన విరోచనుని నగరముగలదు. వైదూర్యునికి, అగ్నిజిహ్వునికి, హిరణ్యాక్షునికి చెందిన భవనములు గలవు. రాక్షసుడై, బుద్ధిమంతుడైన విద్యుజ్జిహ్వునియొక్క పురముగలదు. మహామేఘునికి, రాక్షసేంద్రుడైన శాలి, కర్మారుడు, నాగుడు, స్వస్తికుడు, జయులకు చెందిన పురములు కలవు. ఈ విధముగానే ఐదువది అయిన శర్కరానిలయమున నాగ, దానవ, రక్షస్సుల యొక్క వేల ఇండ్లు ఎల్లప్పుడునుగలవు.
ఆఱవదైన శిలాభౌమతలమున దైత్యపతియైన కేసరి యొక్క నగర శ్రేష్ఠము కలదు. సుపర్వణుని, సులోముని, మహిషుని నగరములు కలవు. రాక్షసరాజై మహాత్ముడైన ఉత్ర్కోశుని పురము కలదు. అచట సంతోషముతో కూడిన సురసాపుత్రుడగు శతశీర్షుడు కలడు. కశ్యపమహర్షి సుతుడై, శ్రీమంతుడైన, వాసుకి అను నాగరాజుకలడు. ఈ విధముగ ప్రఖ్యాతమై ఆఱవదైన శిలాభౌమమున, పాతాళమున నాగ, దానవ, రక్షస్సుల యొక్క వేల పురములుకలవు.
అన్నింటికిని పశ్చిమముగా ఉండి ఏడవదైన పాతాళమున (సౌవర్ణ భౌమమున) మిక్కిలి సంతుష్టమైనదియు స్త్రీ పురుషులతో నిండిఉండు బలియొక్క పురముగలదు. విజృంభించిన దేవశత్రువులైన రాక్షస సర్పములచే నిండినదై, రాక్షసుడైన ముచుకుందుని యొక్క మహానగరము అచ్చటనే కలదు. దితిపుత్రులైన రాక్షసులయొక్క విశాలములైన అనేక మహాపురములచేతను, అట్లే సుసంపన్నములైన వేలకొలది నాగనగరములచేతను, దైత్యుల యొక్కయు, దానవులయొక్కయు విశాలములైన మహాపురములచేతను, విశాలములైన అనేక రాక్షస భవనములచేతను ఆ సౌవర్ణభౌమ పాతాళతలము నిండియున్నది.
ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! బహుయోజన విస్తారముగల పాతాళము అనంతరమున జరామరణములులేని మహాత్ముడైన ఎఱ్ఱకమలముల వంటి కన్నులుగల శ్రీమహావిష్ణువు ఉండును. కడిగిన శంఖమధ్య భాగమువలె తెల్లని శరీరముకలవాడును, నల్లని వస్త్రము కలవాడును, పెద్దభుజములు కలవాడును, విశాలమైన పడగలు కలవాడును, చక్కని కాంతి కలవాడును, చిత్రమైన మాలలను ధరించినవాడును, బలుడును అయిన శేషుడు అచటనే ఉండును. బంగారు కొమ్మలచే పచ్చనై వెలిగిన ముఖముచే ప్రకాశించుండు ప్రభువైన ఆ కుండలి (శేషుడు) వేయి ముఖములతో ప్రకాశించును. చంచలమైన అగ్ని యొక్క మంటలుగల నాలుక వరుసతో, (రుద్రుని) జ్వాలామాలలచే వ్యాపించిన కైలాస పర్వతమువలె ఆశేషుడు కనబడును. ఆ శేషుడు, బాలసూర్యునివలె ఎఱ్ఱనైన రెండు వేల కన్నులతో ప్రకాశించుచు దట్టముగా దేహముతో చుట్టుకొన్న మండలము కలవాడై వెలుగుచుండును. మల్లెలవలెను, చంద్రునివలెను, తెల్లనైన ఆతని యొక్క అక్షమాల (అకారాది క్షకారాంత వర్ణమాల) హిమాలయపర్వత శిరస్సులపై ప్రతిబింబించి ఉన్న ప్రాతఃకాలోదిత సూర్యుల పంక్తివలె ఉన్నది. జటలతో భయంకరుడుగా ఉన్న ఆశేషుడు శయనాసనమున (పడుకొని ఉండు యోగాసనము) కనబడును. అప్పుడు ఆతడు సహస్ర శిఖరములుగల పర్వతము భూమిపై విస్తరించినదా అన్నట్లుండును. మహాతేజస్వియై మహానాగులకు పతియైన శేషుడు గొప్పపడగలు కలిగి, మహాభాగ్యవంతులైన మహా బలవంతులైన మహానాగులచే స్వయముగా ఉపాసింపబడును. అతడు సర్వ నాగులకును రాజు. మహాతేజస్సుగలవాడు. శేషుడుఅను పేరుగలవాడు. అతని అ సర్పశరీరము మహావిష్ణువునకు సంబంధించినదై మర్యాదలో అందరిచే గౌరవింప బడి ఉన్నది. ఈ విధముగా ఏడు పాతాళ లోకములు ఉన్నవి. అవి దేవ, అసుర, మహానాగ, రాక్షసులకు ఎల్లప్పుడును నివాసముగా ఉండును.
ఓ బ్రాహ్మణోత్తములారా! సిద్ధ సాధువులకుగూడ చూచుటకు అలవికానిది, పోవుటకు అలవికానిది, దేవతలకు కూడ తెలియనిది, ఏ వ్యవహారములు లేనిది అగు చేత ఇట్లే పృథివి, అగ్ని, జల, వాయు, ఆకాశముల గొప్పతనము ఋషులచేత వర్ణింపబడును.
ఆ పైన సూర్య చంద్రుల గతిని చెప్పెదను. ఈ సూర్య చంద్రులు ఎంతవరకు తిరుగుచుందురో, అంతవరకు మండలాకారములతో ఉండి తమ కాంతులతో ప్రకాశింతురు. సప్తసముద్రముల యొక్కయు, ద్వీపముల యొక్కయు విస్తరము పూర్వము చెప్పబడినదే భూమియొక్క విస్తరమునకై వెలుపలగా మరొకచోట విస్తరము ఉండును. చంద్ర సూర్యులు పర్యాసపారిమాణ్యమునుబట్టి (భ్రమణ, పరిభ్రమణముల పరిమాణమును బట్టి) ప్రకాశింతురు. ఈ భ్రమణ పరిభ్రమణముల పరిమాణము భూమికి ఆకాశము సమానము అని చెప్పబడినది. పరిభ్రమించుచు మూడు లోకములను సూర్యుడు ప్రకాశింపచేయును.
ఆ తరువాత చంద్ర సూర్యుల ప్రమాణమును చెప్పెదను. ఈ భారతవర్ష (దేశ)ము యొక్క విరివి మిక్కిలి విస్తారమైన మండలము. తరువాత సూర్యుని యొక్క యోజనముల విస్తారమును వినుడు. సూర్యుని యొక్క విస్తారము తొమ్మిదివేల యోజనములు. ఈ విస్తారమునకున్న మూడింతలు వైశాల్యము విష్కంభము మండలమునకు ఉన్నంతటిదే. చంద్రుడు సూర్యునికన్న రెండింతలవాడు. తరువాత భూమియందలి ప్రమాణములను యోజనములతో సహా చెప్పెదను. సప్తద్వీప సముద్రములుగల భూమియొక్క విస్తారము మండలమును, పరిమాణముగా ఇది ఇట్లు అని ఇచట లెక్కించి చెప్పబడిన దానిని అభిమానులచే సాంప్రతులచే లెక్కించి చెప్పెదరు. ఇచట అభిమాన వ్యతీతులు ఎవరో వారు సాంప్రతులతో సమానులు. రూపనామములచే అతీతులైన దేవతలు కూడ సాంప్రతులతో సమానులు. కావున సాంప్రతులైన దేవతలచే వసుధాతలమును చెప్పుదురు. ఆకాశము యొక్క సన్నివేశము అంతటను సాంప్రతుల చేతనే యేర్పడినను, భూమి మొత్తము ఏబది కోట్ల విస్తారముకలదని చెప్పబడినది. మేరువు యొక్క చాతురంతరము ఇరువది అయిదు కోట్ల ప్రమాణముతో ఉండును. లేదా భూమియొక్క సగము విస్తారము యోజనము యొక్క అగ్రమునుండి ఉండును. మేరువు మధ్యనుండి ప్రతి దిక్కున పదునొకండు కోట్లు (విస్తారము) చెప్పబడినవి. లేదా అట్లే నూరువేలును మరల ఎనుబది తొమ్మిదియు, ఏబదివేలును, పృథివియొక్క సగము విస్తారము, భూమియొక్క మొత్తము విస్తారము యోజనములలో మూడుకోట్లు విస్తారము కలదు. అది నాలుగు దిక్కులది. అట్లే నూరువేల ఎనుబది తొమ్మిది అని చెప్పబడును. సప్తద్వీప సముద్రములుగల భూమి యొక్క విస్తారము చెప్పబడినది. పృధివ్యంతముయొక్క మండలముపై విస్తారమునకన్న మూడింతలుగలది. యోజనాగ్రము గణింపబడినది పదునొకండు కోట్లని చెప్పబడినది. అట్లే నూరువేల ముప్పది ఏడును. ఈ విధముగ పృథివ్యంతముయొక్క మండలము లెక్కించి చెప్పబడినది. ఆకాశమున తారకల సన్నివేశము మండలముగా ఎంత వరకు ఉండునో, భూమి సన్నివేశము యొక్క పర్యాసము (చుట్టుఉనికి) అంతవఱకు మండలము పర్యాసపారిమాణ్యముచేత భూమికి సమానము ఆకాశము అని చెప్పబడినది. ఏడు లోకములకుగూడ ఇదియే పరిమాణము కలదు. మండలాను గతమైన పర్యాసపారి మాణ్యము చేతపైపై లోకములయొక్క మండలము ఛత్రమువలె ఉండును. ఈ విధముగా ప్రాణులుండు లోకములయొక్క స్థితి అంతయు చెప్పబడినది. ఇది అండ కటాహముయొక్క బ్రహ్మాండము అను కడవ (తాబేటిచిప్ప) యొక్క ప్రమాణము. ఆ మండలము యొక్క లోపల సప్త ద్వీపములుకల భూమి అంతయు ఉన్నది. భూలోకము, భువర్లోకము, మూడవదైన స్వర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, ఏడవది అయిన సత్యలోకము ఈ యేడు లోకములు సృష్టింపబడి (భూమికి) ఛత్రాకారములుగా (పైపైన) నిర్మింపబడినవి. అవి తమ తమ ఆవరణములచే వేరువేరుగా ధరింపబడుచున్నవి. పది భాగములు అధికముగాకల ప్రకృతులచేతను వెలుపల ఉత్పన్నములైన విశేషముల చేతను పరస్పరము ధరింపబడుచున్నవై ఉండును.
ఈ అండము అంతటను గొప్ప సముద్రము ప్రవేశించి ఉన్నది. భూమండలము అంతయు మహాజలములతో ధరింపబడుచున్నది. ఆతరువాత మహాజలమునకు పరముగా (పైగా) గొప్ప తేజస్సుచే (భూమి ధరింపబడును. తరువాత గొప్ప వాయువుచే (మండలముచే) ధరింపబడుచున్న భూమిని నిలుపుటకు ఆ గొప్ప వాయువు మండలము తరువాత ఆకాశము మహాత్మయై భూతాదిచే మొత్తము ఆవరింపబడినది. మహత్తు నాశములేని స్వరూపము కలిగి, అనంతమైన ప్రధానముచేత (ప్రకృతిచేత) ఆవరింపబడినది. ఇక లోకపాలురయొక్క పురములను క్రమముగాను, జ్యోతిర్గణ ప్రచారము యొక్క (నక్షత్ర, తారాగ్రహ సంచారము యొక్క) ప్రమాణమును చెప్పెదను.
మేరువునకు తూర్పుదిక్కునను, అట్లే మానస సరోవరముయొక్క శిరమున నుండి మహేంద్రునకు సంబంధించినదియు పుణ్యమై బంగారుచే అలంకరింపబడిన వస్వోకసార (బంగారు నిధులసారము గలది అమరావతి) అను పురము కలదు. తరువాత మేరువునకు దక్షిణముగా మానససరస్సుయొక్క శిరస్సుననే సంయమనము అను పురమున సూర్య పుత్రుడైన యముడు నివసించును. మేరువునకు పశ్చిమమున మానససరస్సు యొక్క శిరముననే సుఖము అను పేరుగలది బుద్ధిమంతుడైన వరుణునియొక్క పురము కలదు. తరువాత మేరువు యొక్క ఉత్తరదిక్కున మానస సరస్సు యొక్క శరీరముననే మహేంద్రపురితో (అమరావతితో) సమానమైన సోమునియొక్క పురి విభావరి అనునదికలదు. ధర్మ వ్యవస్థ కొరకును లోకసంరక్షణము కొరకును మానస సరస్సు యొక్క ఉత్తర పృష్టి (వెనుక) భాగమున నాలుగు దిక్కులలో లోకపాలురు ఉన్నారు. దక్షిణాయనమున అంతటను కాష్ఠాగతుడైన (ఆ దిక్కు నందున్న) లోకపాలకులైన సూర్యుని యొక్క గమనమును చెప్పెద వినుడు.
సూర్యుడు దక్షిణాయనమున వేసిన బాణమువలె పోవును. ఆ విధముగా సూర్యుడు జ్యోతిస్సులయొక్క నక్షత్రతారాగ్రహముల చక్రమును వెంటబెట్టుకొని ఎల్లప్పుడు తిరుగుచునే ఉండును. సూర్యుడు మధ్యన నుండి అమరావతియందు ఎప్పుడూ ఉండునో, అప్పుడు యమపురియైన సంయమనమున సూర్యోదయముఅని చెప్పబడును. అట్లై ఎప్పుడు సూర్యుడు మధ్యగుడు అగునో, వరుణపురియైన సుఖమునందు అర్థరాత్రము అగును. ఆతరువాత వరుణపురియైన సుఖయందు ఉదయించుచు సూర్యుడు కనబడును. సోమపురియైన విభా(వరి) యందు అర్థరాత్రి అగును. మహేంద్రియైన అమరాతి యందు సూర్యోదయము అగును. అప్పుడు ఆగ్నేయ దేశములకు అర్ధరాత్రి అగును అట్లే నైఋత్య దేశవాసులకు పూర్వాహ్ణము అగును. ఉత్తరాపథమున ఉండువారికి అపరరాత్రి అగును. ఈశాన్య దేశవాసులకు పూర్వరాత్రి అగును. ఈ విధముగనే ఉత్తర దేశములందలి భవనములపై సూర్యుడు విరాజిల్లుచుండును. ఆతరువాత, వారుణ్య పురియైన ‘సుఖ’ యందు సూర్యుడు ఉదయించును. అపుడు అమరావతియందు అర్థ రాత్రియు, యమపురియైన సంయమనమున సూర్యుడు ఉండును. సూర్యుడు మహేంద్రుని అమరావతిలో ఉదయించునపుడు యమపురి అర్థరాత్రియు, వరుణపురి యైన ‘సుఖ’ సూర్య అస్తమయము జరుగును. ఆ సూర్య కొలువులతో చేయబడిన చక్రమువలె వేగముగా పోవును, వేగముగా చుట్టిపోవుచు భ్రమించును (పరిభ్రమించును) ఆకాశమున సూర్యుడు తిరుగుచునే తిరుగుచున్న నక్షత్రములను చుట్టివచ్చును. ఈ విధముగా దక్షిణ దిక్కు చివరగా సూర్యుడు (దక్షిణాయనమున) నాలుగు ద్వీపములలో తిరుగును. ఈ సూర్యుడు తన ఉదయము అస్తమయములచే మరల మరల పైకి లేచును. సూర్యుడు పూర్వాహ్ణమునను, అపరాహ్ణము నను రెండేసి దేవాలయములను ప్రకాశింపజేయును. ఆ కిరణములతోనే సూర్యుడు మధ్యాహ్నమున ఒక దేవాలయమును తపింపజేయును. ఉదయించిన సూర్యుడు మధ్యాహ్నము వరకు వృద్ధి చెందుచున్న తన కిరణములచేత తపింపచేయుచు పోవును. అట్లే ఆతరువాత తన క్షీణించు కిరణములచేత తపింపజేయుచు, అస్తమయము చెందును. సూర్యుని ఉదయమున పూర్వదిక్కు అనియు, అస్తమయము అగు దిక్కును పశ్చిమదిక్కు అని పిలువబడును. సూర్యుడు ఎంతవరకు ముందు ప్రకాశించునో, అంతియే వెనుకను, ఇరు ప్రక్కలను ప్రకాశించును. ఎచట సూర్యుడు ఉదయించుచు కనబడునో వారికి అది సూర్యోదయము అనబడును. ఎచట సూర్యుడు కనపడకుండ పోవునో వారికి అది సూర్యఅస్తమయము అనబడును. అందరికిని ఉత్తరమున మేరువు ఉండును దక్షిణమున లోకాలోక పర్వతము ఉండును. సూర్యుడు మిక్కిలి దూరముగా ఉండుటచేతను, భూమి యొక్క మండల రేఖచే అవరింపబడిన సూర్యుని యొక్క కిరణములు హరింపబడినందున రాత్రియందు సూర్యుడు కనబడడు. గ్రహనక్షత్ర తారల యొక్కయు సూర్యుని యొక్కయు దర్శనము, వాని యెత్తుయొక్క ప్రమాణమును బట్టి సూర్యోదయము అస్తమయములును తెలుసుకొనవలెను. అగ్నియును, జలమును తెల్లని కాంతిగలవి. భూమి నల్లని ఛాయ (కాంతి) గలది. మిక్కిలి దూరము ఉండుటచే సూర్యునకు కిరణములు లేమి ఏర్పడును. కిరణములు లేనందున ఎఱుపు లేక పోవుటయు, ఎఱుపు కలిగియుండుట వలన వేడి లేక పోవుటయు కలిగినవి. ఒక వరుసరేఖలో ఉన్న సూర్యుడు ఎచట కనబడునో వేయి యోజనములపైకి వెళ్ళినను అతడు అచటనే కనబడు చుండును. సూర్యుడు అస్తమించగానే సూర్యునియొక్క కాంతిలో పావుభాగము రాత్రియందు అగ్నిలో ప్రవేశించును. కావున అగ్నియు దూరమునుండి ప్రకాశించును.
ఉదయించిన సూర్యుడు మరల అస్తమాన రూపమున అగ్నిని ప్రవేశించును. తరువాత అగ్నితోకలిసిన సూర్యుడు పగలు ఎండకాయును. క్రమముగా ప్రకాశ రూపమై అదియు వేడిరూపమైనదియు అయిన సూర్య, ఆగ్నేయ తేజస్సులు పరస్పరముగా అనుప్రవేశించుటచే పగటిని, రాత్రిని తృప్తిచెందించెదరు. ఉత్తరమున భూమియొక్క సగభాగమునను, అట్లే దక్షిణమునను సూర్యుడు ఉదయించుచుండగా త్రిజలములలో ప్రవేశించును. అందువలన పగలు రాత్రియందు ప్రవేశించుటచే జలములు రాగివలె ఎఱ్ఱన అగును. మరల సూర్యుడు అస్తమించగా పగలు జలములయందు ప్రవేశించును. అందువలన రాత్రియందు పగటి ప్రవేశము వలన జలములు తెల్లనివి అగును. ఈ క్రమయోగముచే దక్షిణ, ఉత్తరముల భూమి సగభాగములందు సూర్యునియొక్క ఉదయము, అస్తమయములలో అహోరాత్రములు (పగలును, రాత్రియును) క్రమముగా జలములలో ప్రవేశించును. పగలు సూర్య ప్రకాశము అను పేరుగలది. రాత్రి చీకటిది అనబడును. ఆ కారణమున సూర్యుడు లేనిది రాత్రి అనియు, సూర్యునితో చూడదగినది పగలు అనబడును.
ఈ విధముగా సూర్యుడు ఆకాశ మధ్యమున పోవుచున్నపుడు భూమిపైన ముప్పది అంశకములను (30/100) ఒక ముహూర్తకాలముననే (రెండు గడియలలో = 48 నిమిషములలో) దాటిపోవును. యోజనాగ్రము నుండి ముహూర్తమునకు ఈ సంఖ్యను వినుడు. అది ఒక లక్ష ముప్పది ఒకటి. ముహూర్త (రెండు గడియల కాలమున) గమనము ఇంక ఏబది వేలు అధికమని సూర్యుని విధింపబడినది. ఈ గతియోగముచే సూర్యుడు దక్షిణదిక్కును తిరిగి చేరునపుడు ఆ సూర్యుడు మాఘ మాసమునకే చేరును. దక్షిణ దిక్కునందు యోజనములచే (పరిమండలము) మండలము చుట్టు తొమ్మిది కోట్లని లెక్కింపబడినది. అట్లే అహోరాత్రముల నుండి సూర్యుని ఈ గతి ఒక లక్ష నలుబదియైదని విధింపబడినది.
దక్షిణమునుండి మరల ఈ సూర్యుడు రాత్రి, పగలు సమముగా నుండు కాలమైన విషువత్తులో ఎప్పుడుఉండునో (అప్పుడు)క్షీర సముద్రముయొక్క ఉత్తరాంతములైన దిక్కులను చరించుచు ఉండును. సూర్యుని భ్రమణమండలము. విషువన్మార్గము మూడు కోట్లు యోజనముల విస్తీర్ణము కలది. అట్లే మరల ఒకకోటి ఎనుబదియొకటి అధికమైనది. శ్రవణానక్షత్రమున ఉత్తరదిక్కున సూర్యుడు ఉన్నప్పుడు ఆఱవదైన కాశద్వీపము యొక్క ఉత్తరాంతములైన దిక్కుల అందు చరించుచుండును. ఉత్తరదిక్కున మండలముయొక్క ప్రమాణము యోజనాగ్రమునుండి ఒక కోటి. ఇచట ఎనుబది లక్షల ఏబది ఎనిమిది యోజనము. నాగవీధి, ఉత్తరావీధి, అజవీథి, దక్షిణావీథి (వీనిలో) (ఉత్తర)అషాఢ నక్షత్రమున అజవీధి ఉదయముగా గలవి మూడును మూలము. అభిజిన్నక్షత్రమునకు పూర్వముగా స్వాతినక్షత్రమున నాగవీథి ఉదయముగా గలవి మూడును మూలము. దిక్కులయొక్క మధ్య దూరమును యోజనములతో చెప్పెదను. ఇది ఒక కోటి ముప్పది యొక్క యోజనములు. ఇతరములు ముప్పది మూడు అధికముగాగలవి. ఈ దిక్కులయొక్క మధ్య దూరము యోజనాగ్రమునుండి ముప్పదిమూడు యోజనములచే ప్రతిష్ఠితమైనది. దిక్కులకును లేఖలకును దక్షిణోత్తరములు అంతరములు (ఎడమ) వానిని యోజనములతో లెక్కించి చెప్పెదను. దానిని వినుడు. ఆ దిక్కుయొక్కయు బాహ్యము అభ్యంతరముల మధ్య దూరము అనబడును. ఉత్తరాయణమున మండలములు అభ్యంతరమును (రవి) చుట్టివచ్చును.
వెలుపల దక్షిణమునను ఎల్లప్పుడు క్రమమును తప్పక రవిచరించును. నూట ఎనుబది మండలముల మొత్తము ఉత్తరమున రవి చరించును. దక్షిణమున గూడ సూర్యుడు అంతవరకే తిరుగును. తరువాత మండలము యొక్క ప్రమాణము యోజనాగ్రము నుండి వినుడు. అది ఇరువది యొక్క వేల రెండు వందల ఇరువది యొక్క యోజనములు. ఈ ప్రమాణము యోజనములలో చెప్పబడినది. అది మండలము, మండలము యొక్క విష్కంభము ఇది. అది అడ్డముగా విధింపబడుచున్నది. ప్రతిదినము మండల క్రమముగా అన్ని యోజనములు రవిచరించును. కుమ్మరివాని చక్రము, చివరకు శీఘ్రముగ మరలివచ్చునట్లే, దక్షిణాయనమున సూర్యుడు శీఘ్రముగ తిరిగివచ్చును. అందువలననే ఎక్కువ భూమిని కొద్దికాలములోనే పయనించును. సూర్యుడు పండ్రెండు ముహూర్తములతో (24 గడియలు) దక్షిణోత్తర భాగములలో చరించును. ఒక పగటితో సూర్యుడు పదమూడున్నర నక్షత్రములు తిరుగును. పదునెనిమిది ముహూర్తములలో ఒక రాత్రిని చరించును. కుమ్మరి చక్రము యొక్క మధ్యభాగము మెల్లగా తిరిగినట్లే ఉత్తరాయణమున సూర్యుడు మెల్లని నడకగలవాడై, చరించును. సగము దినముతో పదమూడున్నర నక్షత్రములను చరించును. కావున ఎక్కువ కాలముచే తక్కువ భూమిని సూర్యుడు పయనించును. పదునెనిమిది ముహూర్తములతో ఉత్తరాయణము పశ్చిమదినము అగును. రవి దానిని మెల్లని నడకతో చరించును. అర్ధదినముతో పదమూడున్నర నక్షత్రములను రవి చరించును. పదునెనిమిది ముహూర్తములతో రాత్రియందు అన్నియే నక్షత్రములను (13 ½) చరించును. కుమ్మరి చక్రము మధ్యనున్న మట్టిముద్ద ధ్రువమై (చలింపనిదై) ఎట్లు తిరుగునో, అట్లే అహోరాత్రలచేత సూర్యచక్రము మిక్కిలి మెల్లగా తిరుగును. రెండు దిక్కుల మధ్యన ముప్పది ముహూర్తములలో ఒక అహోరాత్రకాలమును ధ్రువుడు స్థిరుడై తిరుగును. కుమ్మరి చక్రపునాభి అచ్చటనే అనగా ఉన్నచోటనే తిరుగునట్లు ధ్రువుడు కూడఉన్న చోటనే తన చుట్టు తాను తిరుగును. రెండు దిక్కులమధ్యన మండలముల తిరుగు సూర్యునకు పగలును, రాత్రియును మందగతియు, శీఘ్రగతియు కలుగును. ఉత్తరాయణమున పగలు చంద్రునిగతి మందము అట్లే రాత్రియందు సూర్యుని గతి శీఘ్రమైనది. దక్షిణాయనమున పగలు (చంద్రగతి) శీఘ్రముగా ఉండును. అట్లే రాత్రి సూర్యగతి మందమని కూడ అనబడినది. ఈ విధముగ చంద్ర సూర్యగతి విశేషముచే రాత్రి, పగళ్లను విభజించి చంద్రసూర్యులు సమయముగను విస్మయముగను మార్గమును చరింతురు.
లోకాలోకమున నలుదిక్కుల ఉన్న లోకపాలుర కన్న పైననే ఈ విధముగ గతి విశేషములచేత అగస్త్యుడు (నక్షత్రము) వేగముగా తిరుగును. దక్షిణమున నాగవీథి యందు లోకాలోకమునకు ఉత్తరముగా వైశ్వానర (అగ్ని) మార్గము వెలుపల లోకసంచారకుడై, ఈతడు (అగస్త్యుడు) చరించుచుండును. లోకాలోకము (పర్వతము) యొక్క వెనుక ఎంత కాలము సూర్యకాంతి ప్రకాశించుచుండునో అంతవరకు లోకాలోక (పర్వత)ము యొక్క ఇరు ప్రక్కలను వెనుకను అంతట(అగస్త్య నక్షత్రము)ప్రకాశించును. అ గిరి పదివేల యోజనముల ఎత్తు పది మండలములుగా ఉన్నదై అంతటను ప్రకాశముగను, అప్రకాశముగను ఉండును. ఆ లోకాలోక గిరియొక్క లోపలనే నక్షత్ర, చంద్ర, సూర్యులు తమ తారాగణములతో కూడి ప్రకాశింతురు. ఇంతవరకే లోకము (లోకపర్వతము). ఆ తరువాతది నిరాలోక (ఆలోకపర్వత)ము. లోకాలోకము ఒకేవిధము. నిరాలోకము అనేక విధములు. ఏ కారణమున సూర్యుడు లోకాలోకములను పరిగ్రహముగా (చుట్టివచ్చు దానినిగా) సంధించునో, ఆ కారణముననే ఉషా - వ్యుష్టుల (రేయి - పగలుల) మధ్య కాలమును సంధ్య అని అందురు. ఉషఅనగా రాత్రి, వ్యష్టిఅనగా పగలు. సంధ్యా కాలములలో రాక్షసులు సూర్యుని మ్రింగబోవుదురు. ఈ దురాత్ములకు బ్రహ్మ నియోగముతో (ఆజ్ఞతో) శాపముగలదు. వారి దేహమునకు నాశము లేమియు చావులేమియు వరముగా పొందిరి. ప్రసిద్ధులైన మందేహులు అను మూడు కోట్ల రాక్షసులు వారు. వారు ప్రతిదినమున సూర్యుని ప్రార్థింతురు, ఉదయింతురు. ఆ దురాత్ములు తపింపజేయుచు సూర్యుని తినివేయతలంతురు. ఆ తరువాత, సూర్యునకును, ఆ రాక్షసులకును భయంకర యుద్ధము అగును. అంతలో దేవతలు, బ్రాహ్మణులు, మహాసజ్జనులు (మునులు) సంధ్యని ఉపాసించుచు మహాజలమును విడుతురు. ఆ మహాజలము ఓంకార బ్రహ్మతో కూడినది, గాయత్రీ మంత్రముతో అభిమంత్రింపబడినది. మంత్రముతో వజ్రముగా అగు ఆ జలముతో ఆ రాక్షసులు దహింపబడుదురు.
ఆ తరువాత మరల తేజస్వియై మహాకాంతి పరాక్రమములుగల సూర్యుడు, లక్ష యోజనములపైకి లేచును. ఆ తరువాత సూర్యభగవానుడు బ్రాహ్మణులచేతను కృతార్థులై కిరణములతో కూడిన వాలఖిల్య మునులచే చుట్టబడినవాడై ఆకాశమున పోవును. పదునైదు నిమేషములు (కనురెప్పపాట్లు) ఒక కాష్ఠ. ముప్పదికాష్ఠలు ఒక కల(ళ). ముప్పది కలలు ఒక ముహూర్తము. ముప్పది ముహూర్తములు రాత్రింబవళ్లు కలిసి ఏర్పడిన కాలము. అహర్భాగములతో దివసములయొక్క క్షయవృద్ధులు వరుసగా ఇట్లుండును. సంధ్యయొక్క ముహూర్తపరిమాణము (రాత్రింబవళ్ళ) క్షయవృద్ధులలో గూడ సమానముగనే ఉండును (మారదు). తరువాత, సూర్యుడు తన బింబములోని రేఖ మాత్రోదయము మొదలుకొని మూడు ముహూర్తములవరకు ఆకాశమున పైకివచ్చు కాలము ప్రాతఃకాలము. అది పగటిలో అయిదవ భాగము ఉండును. (15ముహూర్తములు పగలు 15/5=3వ భాగము). దానినుండి (ప్రాతఃకాలము) మూడు ముహూర్తముల కాలము సంగమకాలము (3 నుండి 6 ముహూర్తకాలము). సంగమమునుండి మూడు ముహూర్తముల కాలము మధ్యాహ్నము. మధ్యాహ్నము నుండి మూడు ముహూర్తముల కాలము అపరాహ్ణము. దానినుండి మూడు ముహూర్తముల కాలము సాయాహ్నము. పదియైదు ముహూర్తములలో మూడేసి ముహూర్తములు ప్రాతస్సంగమ మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాలములు విషువత్తునందు పదునైదు ముహూర్తముల పగలు ఉండును. పదునైదు ముహూర్తములు కలిపిన రాత్రితో గలిపి పగలు రాత్రి సమముగా విషువత్తునందు ఉండును. దక్షిణ ఉత్తరాయణములు రాత్రి, పగళ్లు వృద్ధి, క్షయమును పొందుచుండును. రాత్రి పగటిని, పగలు రాత్రిని గ్రహించు (ఆక్రమించు) చుండును. విషువత్కాల (సమరాత్రి దినకాల)ము నుండి శరత్ - వసంత ఋతువుల మధ్యన చంద్రుడు అహోరాత్రములలో ఏడు కల(ళ)లను తినును.
అట్లే పదునైదు దినములు పక్షము అనబడును. రెండు పక్షములు మాసము. రెండు (లోపలి) మాసములు ఋతువు. మూడు ఋతువులు అయనము, రెండు ఆయనములు వర్షము లేక సంవత్సరము అనబడును. కనురెప్పపాటు కాలమైన నిమేషాదులతో ఏర్పడునది కాలము. కాష్ఠలో పదునైదు కాలములు ఉండును. కళలో ముప్పదియవది కాష్ఠ. అది నూట అఱువది మాత్రల (చిటుకల) కాలము. ఇరువది తొమ్మిది మాత్రల కాలము శతఘ్న. ముప్పది యారు మాత్రలదియు, అరువది రెండు మాత్రల కాలము గలదియు, ముప్పది మూడు మాత్రల కాలము గలదియు చల అగును. నలుబది వేల ఎనిమిది వందలు విద్యుతి. అక్కడనే నిశ్చయముగా దెబ్బదియు, తొంబదియు అని తెలిసికొనుము. (7108, లేక 9108 కావచ్చును) వైధసంయుగమున నాలుగే వందలని అందురు. ఇది చరాంశగా తెలియగవలెను. ఇచట నాళిక కారణము. సంవత్సరము మొదలైన అయిదు నాలుగు మాసములతో విడివిడిగా కల్పింపబడినవి. మొత్తము కాలము యొక్క నిశ్చయము యుగము అనబడును. మొదటి సంవత్సరము ప్రథమము అనబడును. రెండవది పరివత్సరము, మూడవది ఇద్వత్సరము, నాలుగవది అనువత్సరము. వానిలో అయిదవ వత్సరమునకు కాలమని పేరు. పూర్తిగా రెండువేల పర్వముల కాలము రవియొక్క యుగము, (పర్వము అమావాస్యా ప్రతిపత్తుల సంధి, విషువదాది, పూర్ణిమ). నలుబది ఎనిమిది పర్వములు భాస్కరునియొక్క ఉదయము. సూర్య సంబద్ధములైన ఋతువులు ముప్పది, పది అయనములు. నూటతొంబదియైదు మాసములును. ముప్పది అహోరాత్రములు (30 దినములు) భాస్కర మాసము. అఱువదియొక్క అహోరాత్రములు ఒక అనువు అని భావింపబడును. నూట ఎనుబదిమూడు పగళ్లు (ఒక ఏడుగా) అగును. సూర్యుని యొక్కయు భువనము యొక్కయు మాసమును (పరిమాణమును) తెలియవలెను. సౌరము అనియు, సౌమ్యము అనియు, (చాంద్రము), న(నా)క్షత్రము అనియు, సావనము అనియు మానము జ్యోతిషమానము నాలుగు విధములని పురాణము తెలుపుచున్నది.
ఆకాశమున దాని ఉత్తరముగా “శృంగవాన్” అను పర్వతము గలదు. దాని మూడు శిఖరములు ఆకాశమును అంటుచున్నవా అన్నట్లుండును. వానిచేత గూడ ‘శృంగ వాన్’ అని అంతట ప్రసిద్ధి చెందినది. దాని విస్తారము, విష్కంభము ఒకే మార్గమున ఉండును. దానికి అంతట శృంగములు గలవు. మధ్యది బంగారపుది. దక్షిణపుది శృంగము స్ఫటిక కాంతిగలదైన వెండిది. ఉత్తమమైన ఉత్తర శృంగము ఒకటి సమస్త రత్నములతో నిండినది. ఈ విధముగా పర్వతమునకు సంబంధించిన మూడు శృంగములచేత ఆ పర్వతము ‘శృంగవాన్’ అని ప్రసిద్ధిచెందినది. శరత్ - వసంత ఋతువుల మధ్యన ఆకాశమధ్య గతియందున్నవాడై, సూర్యుడు విషువంతమయిన శృంగమును చేరును. చీకటి పోద్రోలు సూర్యుడు రాత్రిని పగటితో సమముగా చేయును. మహారథమున కట్టబడిన పసుపు పచ్చనివైన దివ్యములైన గుఱ్ఱములు పద్మములవలె ఎఱ్ఱని కిరణములచే అప్పుడే పూయబడినవా అన్నట్లు ప్రకాశించును. మేషరాశి అంతమునకు తులారాశి అంతమునను సూర్యోదయమువలన పగలును రాత్రియు పదునైదు ముహూర్తములుగలవే అగును. కృత్తికా నక్షత్ర ప్రథమ పాదమునను సూర్యుడు ఉన్నప్పుడు, చంద్రుడు విశాఖా నక్షత్ర చతుర్థపాదమున ఉండునని గ్రహింపవలెను. సూర్యుడు విశాఖనక్షత్ర తృతీయ పాదమున ఉన్నప్పుడు, చంద్రుడు కృత్తికా శిరస్సున ఉండును. అపుడు విషువంతమును తెలుసుకొనవలెను. సూర్యునితో విషువమును తెలియవలెను. సోముని(చంద్రుని)చే కాలమును తెలుసుకొనవలెను. రాత్రి - పగలు సమానములైనప్పుడు విషువత్తము అగును. విషువత్తులో పితృ దేవతలకై దానములను చేయవలెను. విశేషించి బ్రాహ్మణులకు దానము చేయవలెను. బ్రాహ్మణులు దేవతలకు ముఖముతో సమానులు. ఊనరాత్ర అధిక మాసములు, కలా, కాష్ఠా, ముహూర్తములు, పౌర్ణమాసీ, అమావాస్యా, సినీవాలీ (చంద్రకళ కనబడిన అమావాస్య) కుహూ (చంద్రకళ కనబడని అమావాస్య) రాకా (పూర్ణచంద్రుడు గలపూర్ణిమ), అనుమతి (ఒక చంద్రకళ తగ్గిన పూర్ణిమ) వీనిని అన్నింటిని తెలుసుకొన వలెను. మాఘ, ఫాల్గుణ మాసములు, చైత్ర వైశాఖ మాసములు, జ్యేష్ఠము ఆషాఢ మాసములును కలిసి ఉత్తరాయణము అగును. శ్రావణ, భాద్రపద మాసములు, ఆశ్వయుజ, కార్తీక మాసములు, మార్గశీర్ష పుష్య మాసములును కలిసి దక్షిణాయనము. తరువాత సంవత్సరములను బాగుగా తెలుసుకొనవలెను. ఐదు సంవత్సరములు బ్రహ్మయొక్క పుత్రులు తరువాత ఋతువులు తెలుసుకొనతగినవి. ఋతువులు అంతరములు అనబడినవి. దాని తరువాత పర్వమునకు అనుముఖయైన అమావాస్యను తెలుసుకొన వలెను. తరువాత పితృదేవతలకు హితమైన విషువమును ఎల్లప్పుడును తెలుసుకొనవలెను. ఈవిధముగా తెలిసిన మానవుడు దైవ కార్యముల విషయములోను పితృకార్య విషయములోను మఱపుజెందడు. అందు వలననే విషువత్తు ప్రజలకు అందరికి ఎల్లప్పుడును తెలియ వలసినదిగా చెప్పబడినది.
ఆలోకాన్తము (ఆలోకపర్వతము చివరివరకు) లోకము అనియు, (లోకపర్వతము అనియు), లోకాంతము (లోకపర్వతము) చివరివరకు, లోకము అనియు (భూలోకము అనియు) చెప్పబడును. లోకాలోక(పర్వత)ముల మధ్యగా లోకపాలురు ఉన్నారు. మహాత్ములైన ఆ నలుగురు భూత ప్రళయమునుండి ఉందురు. వారు వైరాజైన సుధాముడు, శంకృపుడైన కర్దముడు, పర్జన్యుడైన హిరణ్యలోముడు, జాత నిశ్చయుడైన కేతుమంతుడు అనువారలు. వారు సాటిలేనివారు, నిరభిమానులు, నిస్తంత్రులు (ఏ సిద్ధాంతములేనివారు), నిష్పరిగ్రహులు (దానమును స్వీకరింపనివారు) అయినవీరు లోకాలోక పర్వతమున నాలుగు దిక్కులకు లోకపాలురుగా ఉన్నారు. అగస్త్యునకు (నక్షత్రమునకు) ఉత్తరముగను, అజవీధికి దక్షిణముగను, వైశ్వానర (అగ్ని) మార్గమునకు వెలుపలను ఉన్న మార్గము పితృయాణము (పితరుల మార్గము) అచట అగ్నిహోత్ర హోమము చేయువారును సంతాన వంతులైన మునులు ఉందురు. పితృయాన మార్గమున ఉన్నట్టివారు, లోకమునకు సంతానమును కలుగజేయువారు భూతముల ప్రారంభమునకై చేసినది కర్మ. ఆశీస్సుచే ‘ఋత్విక్’ అనబడును. లోకకాములై వారు ప్రారంభింతురు. వారియొక్క మార్గము ఆదక్షిణము.
వారు చలితమైన ధర్మమును మరల ప్రతి యుగమున సంతతిచేతను, తపస్సు చేతను, మర్యాదలచేతను, వేదపాండిత్యముల చేతను స్థాపింతురు. ముందు వారు తరువాతి వారి ఇండ్లలో జనియింతురు అపూర్వులు చావగా మరల తరువాతి (పశ్చిమములు) జనింతురు. ఇట్లు జనన, మరణములచే తిరుగుచున్నవారై వారు భూత ప్రళయము నుండి భూత ప్రళయము వరకు ఉందురు. క్రియావంతుల యుద్ధములో శ్మశానములకు పంపబడిన వారు! ఆ గృహమేథు (గృహస్థాశ్రమ) వాసులైన ఎనుబది ఎనిమిది వేల మునులు సూర్యునియొక్క దక్షిణ మార్గమును ఆచంద్రతారకము ఆశ్రయించిరి. పంచ భూతముల ప్రారంభముచే కలిగిన లోకసంబంధ వ్యవహారముతోను, ఇచ్ఛాద్వేష ప్రకృతితోను, శరీరకృతమైన మైథునమును పొందుట చేతను, విషయ సుఖములను సేవించుటచేతను ఇటువంటి అకారణములచేత సిద్ధులు శ్మశానములను పొందిరి. నాగవీథికి ఉత్తరమునను, సప్తర్షులకు (నక్షత్రములకు) దక్షిణముగను, సూర్యునియొక్క ఉత్తర (దిక్కు) మార్గమును దేవయానము అందురు. అక్కడున్న సిద్ధులు విమలురు, బ్రహ్మచారులు. వారెప్పుడును దయ చూపుదురు. దానివలన వారిచే మృత్యువు జయింపబడినది. ఊర్ధ్వరేతస్కులైన ఆ ఎనుబది ఎనిమిదివేల సిద్ధులు సూర్యునియొక్క ఉత్తమ మార్గమును భూత ప్రళయము వరకు ఆశ్రయించిరి. ఇట్టి ఆశుద్ధ కారణములచే వారు అమృతత్త్వమును పొందిరి. పంచమహాభూత ప్రళయము వరకు ఉండుట అమృతత్వమని భావింపబడినది. ఇది పునర్జన్మతో మరల ఉత్తరరాయణమున పోని వానియొక్క ముల్లోకముల ఉండు కాలము. బ్రహ్మహత్య అశ్వమేధములచే పుణ్య - పాపములజేసినవానికి వేఱొకటి. ఊర్థ్వరేతస్కులుగూడ పంచమహాభూత ప్రళయము తరువాత నశింతురు. సప్తర్షులకు ఊర్థ్వముగా పైకి ఉత్తరముగా ధ్రువుడు నక్షత్రము ఉన్న పథము దివ్యమైన విష్ణు పదము. అది మూడవది. అకాశమున ప్రకాశించునది. అచటికి పోయినవారు దుఃఖమును పొందరు. అది విష్ణువు యొక్క పరమ పదము. అచట ధర్ముడు, ధ్రువుడు మొదలగు లోకసాధకులు ఉందురు. (50)