వాయు మహా పురాణము
వైవస్వత సర్గ వర్ణనము
సూతుడు ఇట్లు అనెను:
ఆ తరువాత ఏడవ పర్యాయమున వైవస్వత మన్వంతరమున మరీచి పుత్రుడైన కశ్యపునివలన దేవతలు పరమరులును పుట్టిరి. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాధ్యులు, విశ్వేదేవులు, మరుద్గణములు, భృగువులు, అంగీరసులు. ఈ ఎనమండుగురు దేవ గణములు అనబడుదురు. ఆదిత్యులు, మరుతులు, రుద్రులు వీరిని కశ్యపాత్మజులు. సాధ్యులు, విశ్వేదేవులు ధర్మపుత్రులు అను మూడు గణములు. భృగువు నుండి బుట్టినవాడు భార్గవదేవుడు. అంగిరుడు అంగిరసుని పుత్రుడు. ఈ వైవస్వత మన్వంతరమున వారు నిత్యస్వేచ్ఛతో జనించిన దేవతలు. ఈ సృష్టి మారీచముగా (మరీచ మహర్షి నుండి పుట్టినదిగా) తెలియవలెను. వీడు సాంప్రతుడు, శుభుడు. వారిలో తేజస్వి సాంప్రతుడు. ఇంద్రుడు పేరుతో మహాబలుడు. భూత, భవిష్యత్, వర్తమానములందు ఉన్న మన్వంతరేంద్రులు అందఱును సమాన లక్షణములుగలవారే. భూత, భవిష్యత్, వర్తమాన కాలముల ప్రభువైనవాడు, సహస్రాక్షుడైన పురందరుడు (ఇంద్రుడు). ఆ ఇంద్రులు అందఱును శృంగములు గలవారై వజ్రమునుచేత ధరించినవారు. వారందరు వేరు వేరుగా నూరు యాగములను చేసిరి. ముల్లోకములలో నడకగలిగి దుర్బలములైన ప్రాణులను ధర్మాది కారణములచే తిరస్కరించి నిలుతురు. వారు తేజము చేతను, తపము చేతను, బుద్ధిచేతను, బల పాండితీ - పరాక్రమముల చేతను భూత, భవిష్య, వర్తమానములకు ప్రభువులై ఏ విధముగ సమర్థులైరో దానిని అంతయు చెప్పెదను. నేను చెప్పువిషయములను వినుడు.
భూతము, భవ్యము, భవిష్యము అనునవి పండితులచే లోకత్రయముగా చెప్పబడినవి. భూర్లోక అను ఇది భూమి (భూతము) అనబడినది. అంతరిక్షం (అకాశము) భువము అనబడినది. భవ్యమే అనునది దివము అనబడినది. వానికి సాధనమును చెప్పెదను. పూర్వము పుత్రునికోరిన బ్రహ్మ ముందు ‘భూః’ అని ఉచ్చరించెను. అప్పుడు ఇది భూర్లోకము అయ్యెను. ‘భూ సత్తాయాం’ అని భూ ధాతువు సత్తార్థమున (ఉండు అను అర్థమున) చెప్పబడినది. అట్లే ఇది లోక దర్శనార్థమున కూడ చెప్పబడినది. అంతకూప్పుడు భూతమైనందునను, దర్శనమైనందునను ఇది భూలోకమైనది. కావున ఇది మొదటి లోకము, భూతమైనది (మొదట ఏర్పడి ఉన్నది) కాన పండితులచే ‘భూమి’ అనబడినది. ఇది ఇట్లు జరుగగా బ్రహ్మచే మరల రెండవదిగా ‘భవత్’ అనబడినది. పుట్టు చుండుటచే ‘భవతి’ అనునది కాలశబ్దముగా చెప్పబడినది. భవనాత్ భువర్లోకః= ఉండుట వలన భువర్లోకమని నిరుక్తము తెలిసిన వారిచే చెప్పబడినది. అందువలన ఆకాశము, భూమికంటె వేరుగా రెండవలోకముగా చెప్పబడినది. భువర్లోకము ఈ విధముగ పుట్టగా మరల బ్రహ్మ మూడవదిగా ‘భవ్య’ అని ఉచ్చరించెను. అందువలన అపుడు భవ్యము అను లోకము ఏర్పడెను. భవిష్యకాలమున ‘భవ్య’ అను శబ్దము సంభావింపబడు చున్నది. కావున భవ్యము అను ఈ లోకము పేరుతో స్వర్గము అని చెప్పబడినది. స్వర్గమని వేరుగా చెప్పబడిన మూడవది అపుడు ‘భావ్య’ అనబడినది. ‘భావ్య’ అను ఈ ధాతువు భవిష్యత్కాలార్థమున విశేషముగ భావింపబడుచున్నది. ‘భూః’ అను ఇది భూమి అనబడినది. భువము అను ఇది అంతరిక్షము అనబడినది. అట్లే దివము భావ్యము అనబడినది. ముల్లోకమున ఇది సంగ్రహము. ముల్లోకముతో కూడిన వ్యాహారములచే (ఉచ్ఛారణ మాటలచే)మూడు వ్యాహృతులైనవి. ధాతువులు తెలిసిన పండితులు ‘నాథ’ ధాతువును పాలించుట అను అర్థము గలదిగా చెప్పిరి. భూత, భవిష్య, వర్తమాన లోక త్రయమునకు నాథులైన (పాలకులైన) వారుగా ఇంద్రాదులు చెప్పబడిరి. దేవేంద్రులు ప్రధానులుగాను అప్రధానులుగాను ఉందురు. మన్వంతరములలోని దేవతలు యజ్ఞములు పొందువారు అగుదురు. యక్షులు, గంధర్వులు, రక్షస్సులు, పిశాచులు, ఉరగులు, దానవులు - వీరు అంతటను దేవేంద్రుల మహిమలు గలవారు. ఈ లోకమున దేవేంద్రులు, గురువులు, పాలకులైన రాజులు, ఆ దేవతాశ్రేష్ఠులును ఈ ప్రజలు అందరిని ధర్మముగా రక్షింతురు. అని ఈదేవేంద్రుల లక్షణము సంగ్రహముగా చెప్పబడినది. ఇప్పుడు ఆకాశమున ఉన్న సప్తర్షులను చెప్పెదను. గాధి పుత్రుడును కౌశికుడును, ధీమంతుడును మహా తపస్వియు అయిన విశ్వామిత్రుడు అగు భృగు పుత్రుడును, ఊరువు నుండి పుట్టిన వాడును, ప్రతాపవంతుడునైన జమదగ్ని, బృహస్పతి కుమారుడును, మహాతపస్వియునైన భారద్వాజుడు, ఉతథ్య పుత్రుడును, విద్వాంసుడును, శరద్వంతుడు, ధార్మికుడు అయిన గౌతముడు, స్వాయంభువుడు, భగవంతుడు, బ్రహ్మకోశుడు అయిన అత్రి ఐదవవాడు, ఆఱవవాడును, వసుమంతుడును, లోక ప్రసిద్ధుడు అయిన వాసిష్ఠ పుత్రుడు (వసిష్ఠుడు), వత్సారుడైన కాశ్యపుడు (కశ్యపుడు) ఈ ఏడుగురు సాధుసమ్మతులు, సిద్ధులైన సప్తర్షులు. ఇప్పటి మన్వంతరమున ఉందురు. ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడైన శర్యాతి, విఖ్యాతుడైన నరిష్యంతుడు, నాభుడు, ఉద్దిష్టుడు, కరుషుడు, పృషధ్రుడు, వసుమంతుడు - అను వీరు వైవస్వతమనువు యొక్క తొమ్మండుగురు పుత్రులుగా చెప్పబడినారు. నాచేతగూడ వీరు చెప్పబడినారు. ఇది ఏడవ మన్వంతరము. ఓ ద్విజులారా! ఈ విధముగా రెండవ పాదము విస్తరముగను అనుపూర్వితోను నేను చెప్పితిని. మరల నేను ఇంకేమి నేను వర్ణించి చెప్పవలెను? అని అడుగగా