భువన విన్యాసము - 11

సూతుడు అనెను:

ఇది విని ఆ ఋషులు సమాధానమును వినగోరినవారై సంతసముతో లోమహర్షుణుని ఋషులు ఈ విధముగా అడిగిరి:

భారతవర్షమును గూర్చి ఉన్నది ఉన్నట్లు చెప్పినట్లే ఓసూతా మాకు కింపురుష వర్షమును గూర్చియు హరివర్షమును గూర్చియు తత్త్వస్థితిని చెప్పుము అనగా ఈ విధముగా బ్రాహ్మణులుచే అడుగబడిన సూతుడు మునులు పూర్వము అడిగినట్లుగా విశేషించి ప్రశ్నానుగుణముగా ఈ విధముగా చెప్పెను. ఓ బ్రాహ్మణులారా! మీరు వినగోరినది సంతోషముతో వినుడు. ప్లక్ష ఖండము అను కింపురుష దేశము చాల గొప్పది. అది నందనవనమును పోలి ఉండును. కింపురుష దేశమున మానవుల స్థితి పదివేల యేండ్లు. అచటి మానవులు బంగారువన్నెగలవారు. స్త్రీలు అప్సరసలవలె అందగత్తెలు. వారు అందరు రోగములులేని వారు. దుఃఖములేనివారు. నిర్మలమైన మనస్సు గలవారు.

అట మానవులు కాచిన బంగారు కాంతిగలవారై పుట్టుదురు. ఆ పుణ్యమైన కింపురుష దేశమున తేనెలువహించు మంగళకరమైన ప్లక్ష (జువ్వి)చెట్టుగలదు. కింపురుష దేశవాసులు అందరు దాని ఉత్తమ రసమును త్రావుదురు. కింపురుష దేశము తరువాత హరివర్షము దేశము గూర్చి చెప్పెదను. అచట మానవులు బంగారుకాంతిగలవారై పుట్టుదురు. అంతటను వారు దేవలోకమునుండి జారినవారై దేవరూపులుగా ఉందురు. హరివర్ష దేశమున మానవులు అందరు శుభమైన చెరుకురసం త్రాగుదురు హరివర్థము అను మానవులు సంతుష్ట మనస్కులై పదునొకండు వేల యేండ్లు జీవింతురు. అచట నరులను ముదిమి బాధింపదు. వారు క్షీణింపరు నాతో ఇంతకు ముందు

ఇలావృత వర్ష(ము) దేశము చెప్పబడినది. అచట సూర్యుడు ప్రకాశింపడు. మానవులు క్షీణింపరు. ఇలావృత దేశమున చంద్రసూర్యుల ప్రకాశము ఉండదు. అచటి మానవులు పద్మపు రంగుగలవారు. పద్మకాంతిగలవారు, పద్మదళములవంటి కన్నులు కలవారు. జంబూరస, ఫలములు ఆహారము కలవారు. కంపములేనివారు. సువాసనగలవారు. మానవంతులు. సుఖములను అనుభవించినవారు. సత్కర్మ ఫలములను అనుభవించు వారు. వీరు అందరు దేవలోకమునుండి జారివచ్చి, యిచ్చట అజరామరులై (ముదిమి చావును లేనివారై) పుట్టుదురు. ఆ నరశ్రేష్ఠులయొక్క ఆయుః ప్రమాణము పదమూడు వేలయేండ్లు. ఇలా వృతము మేరువు యొక్క ప్రతి దిక్కున తొమ్మిదివేల (యోజనముల) విస్తారముగల దేశము. ఇచట మానవులు. వేలయేండ్లు జీవింతురు. దాని విస్తారము ఇరువది ఆరు యోజనములు. అంతట చతురస్రముగను అదే ప్రమాణములో ఉన్నది. అది మూకుడువలె ఉండును.

మేరువుయొక్క తొమ్మిదివేల యోజనముల పరిమితమైన పశ్చిమభాగమున గంధ మాదన పర్వతముగలదు. అది ఉత్తర, దక్షిణములుగా నీలనిషధ పర్వతముల వరకు ముప్పది నాలుగువేల యోజనముల పొడవుకలదు. భూతలమునుండి నలుబదివేల యోజనముల ఎత్తు పెరిగినది. వేయి యోజనముల వరకు భూమిలో మునిగి ఉన్నది. అది వేయి యోజనము వరకే? విస్తారములో నిలచియున్నది.

తూర్పు వైపుగా ఉన్న మాల్యవత్పర్వతము అంతే అనగా గంధమాదనమంతే ప్రమాణము కలది. అది నీల పర్వతమునకు దక్షిణముగా నిషధ పర్వతమునకు ఉత్తరముగా గలదు. వాటి మధ్యలో మహామేరుపర్వతము మంచి ప్రమాణము కలదిగా చెప్పబడినది. అది అన్ని శైలములకు లోతుగా ఉన్నట్లుండును. దాని విస్తారము గూడ అంతే ప్రమాణము కలదు. పొడవున లక్షప్రమాణము కలదని చెప్పబడినది. సముద్రము చుట్టుగా గుండ్రముగా ఉండుట వలన భూమండలమని భావము గలదు. మొత్తముగా పొడవులు చతురస్రములుగా తగ్గును. చదుకముచే చుట్టబడనివై మధ్యనున్నవి వేరు అగును.

అచట మర్దించిన కాటుకవలె నల్లనైన జంబూఫల రసముగల నది (జంబూనది) కలదు. మేరు పర్వతమునకు దక్షిణప్రక్కగా నిషధపర్వత(దేశ)మునకు ఉత్తరముగా ప్రాచీనమైన సుదర్శనము అను ఒక పెద్ద జంబూ వృక్షము కలదు. అది నిత్యము పుష్ప ఫలములతో కూడియుండును. సిద్ధులచేతను చారణులచేతను సేవింపబడును. ఆ జంబూవృక్షము పేరుతోనే పిలువబడు జంబూద్వీపమున జంబూ వృక్షము వృక్షరాజము. ఈ మహావృక్షము ఎత్తు లక్ష యోజనములు. అది అంతట ఆకాశమును తాకును. తత్త్వద్రష్టలైన మునులు ఆ జంబూఫల ప్రమాణమును ఎనిమిది వందల అఱువదియొక్క మూరలు (861) లెక్కించి చెప్పిరి. భూమిపై పడుచుండు ఆ జంబూ ఫలములు విశాలమైన ధ్వనిని కలుగజేయును. ఆ భూమియందు జంబూఫల రసము నదిగా ప్రవహించును. మేరువును ప్రదక్షిణము చేసి క్రింది జంబువృక్షమును ప్రవేశించును. అచటివారు జంబూరసఫలములచే చుట్టబడినవారై ఆ రసమును సంతుష్టులై త్రాగుదురు. వారు జంబూఫల రసమును త్రాగి ముదిమిని పొందరు. గుఱ్ఱపు సుడిని పొందరు. రోగమును పొందరు. మరణమును కూడ పొందరు. అచట జాంబూనదమున బంగారము దేవభూషణమై ఉండును. అది ఆరుద్ర పురుగువలె ఎఱ్ఱనిదై ప్రకాశవంతమగును. అది అన్ని వర్ష(దేశ) వృక్షముల యొక్క శుభమైన ఫలరసము. అది స్ఖలితమై శుక్రమగును. అది దేవభూషణమై బంగారము. వారి మూత్ర పురీషములను అన్ని దిక్కులలో భాగములుగా భూమి గ్రహించును. మృతులైన వారినిగూడ (భూమి) గ్రసించును. రాక్షసులు, పిశాచులు, యక్షులు అందరు హైమవతు లుగా జెప్పబడిరి. హేమకూటమున ఉన్నవారు అప్సరోగణములతో గూడిన గంధర్వులుగా తెలియ వలెను. నిషధమున శేష - వాసుకి తక్షకులైన సమస్త నాగులు గలరు. మహా మేరువున ముగ్గురు యాజ్ఞికులు తిరుగుచుందురు. వైడూర్యమయమైన నీల పర్వతమున సిద్ధ బ్రహ్మర్షులు తిరుగుదురని తెలుసుకొనవలెను. దైత్యులకు, దానవులకును శ్వేత పర్వతము తిరుగు స్థానమని చెప్పబడినది. పర్వత శ్రేష్ఠమైన శృంగవత్పర్వతము పితృ దేవతలు సంచరించు స్థానము, ఒక విభాగముగా ఉన్న ఈ అన్ని, తొమ్మిదింటిలో నివసించియున్న భూతములు గమనము గలవియు స్థిరముగా ఉండినవియుగా ఉన్నవి. వారిలో దేవ, మనుష్యుల వివృద్ధి ఎక్కువగా కనబడును. అనుభవింపగోరు వానిచేత చక్కగా లెక్కించుట సాధ్యపడదని విశ్వసింపవలెను.