వాయు మహా పురాణము
భువన విన్యాసము - 10
శాంశపాయనుడు:
“ఓ ప్రభో! సూత! తూర్పు - పడమరలందు కలవని పేర్కొనబడిన రెండు దేశములను గూర్చి మాకు చక్కగా చెప్పితివి. ఇటు తరువాత ఉత్తర - దక్షిణ దేశములను గురించి అచటి పర్వత నివాసులను గురించి విశదముగా మాకు చెప్పుడు.
సూతుడు శాంశపాయునితో ఇట్లు అనెను:
“శ్వేత పర్వతమునకు దక్షిణమున నీలపర్వతమునకు ఉత్తరమున రమణకమను దేశము ఉండును. అచట మానవులు పుట్టుచుందురు. వారు అన్ని ఋతువులలోను కామమును ఇచ్చువారు. ముసలితనము(పు) దుర్గంధములేనివారు తమ తెల్లని జాతి జనముతో కూడియున్నవారు. అందరును అందమైనవారు. అచటగూడ రోహణమను గొప్ప వటవృక్షము గలదు. వారు దాని ఫలరసములను త్రావుచుందురు. అ మహాభాగ్యవంతులు పదకొండువేల అయిదు వందల సంవత్సరముల పాటు నిత్యసంతుష్టులై, మానవ శ్రేష్ఠులై జీవింతురు.
శ్వేత పర్వతమునకు ఉత్తరమున శృంగ సాహ్వ పర్వతమునకు దక్షిణమున హిరణ్యతమను దేశముకలదు. అచట హైరణ్యతీ అను నదికలదు. అచట మహాబలులు, మంచి తేజస్కులు అయిన మానవులు పుట్టుచుందురు. అచ్చటి ప్రాణులు అన్ని ఋతువులలోను కామమును అనుభవింతురు. వారు ధనికులు, అందమైనవారు. అమితౌజస్కులైనట్టి వారు పండ్రెండువేల అయిదు సంవత్సరముల ఆయువు ప్రమాణముగా కలవారు. ఆ దేశమున ఆఱు రసములకు నెలవైన మహావృక్షము గజనిమ్మచెట్టు కలదు. దాని ఫల రసమును త్రావి అచటి మానవులు జీవింతురు. అచటి పర్వతమునకు మూడు ఉన్నత శిఖరములు గలవు. అందులో ఒకటి మణిమయము, మరొకటి బంగారముతో నిండినది. మూడవది సర్వరత్నమయమై మేడలతో ప్రకాశించునది.
ఉత్తర సముద్రముపు చివర ‘కురులు’ ఉందురు. ఆ కురుదేశము పుణ్యమై సిద్ధులచే సేవింపబడినది. అచట వృక్షములు తీయని ఫలములు గలవి. నిత్యము పుష్ప - ఫలములను ఇచ్చునవి. ఫలములందు వస్త్రములను, ఆభరణములను ప్రసవించును. కొన్నిచోట్ల అచటి వృక్షములు సర్వకామములను ఫలములుగా ఇచ్చునవై, మనోహరములు గంధవర్ణముతో, రసముతో కూడిన ఉత్తమమైన మధువును స్రవించును. అచటగల మరొక వృక్షములు, క్షీరవృక్షములు, అవి మనోహరములు. అవి ఆఱు రసములు కలిగి అమృతముతో పోలిన క్షీరమును స్రవించును. అచటి భూమియంతయు మణిమయమై సన్నని బంగారు ఇసుక కలదిగా ఉండును. ఆనదీ తీరము అంతయును సుఖస్పర్శగలది. బురుద లేనిదై రోగములు లేనిదై శుభకరమైనది. అచట దేవలోకమునుండి జారిన వారు మానవులై జన్మింతురు. శుభకరులు. తెల్లని శుద్ధమైన తనజాతి బంధుజనముతో కూడినవారు. వారందరు స్థిరమైన యౌవనము గలవారు. స్త్రీ, పురుషుల జంటలను ప్రసవింతురు. స్త్రీలుగూడ మిక్కిలి మనోహరులు వారు అందరు అమృతముతో సమానమైన క్షీరవృక్షము యొక్క క్షీరమును త్రాగుదురు. వెంటనే జంట జనించును. సమముగనే పెద్ద వారగుదురు. శీలము రూపము సమమే. సమముగనే మరణింతురు. చక్రవాక పక్షులవలె అన్యోన్యము అనురక్తులు ఆరోగ్యవంతులు, దుఃఖము లేనివారుగా ఉండి నిత్యము సుఖములచే సేవింప బడుదురు. పదునాలుగు వేలయైదు సంవత్సరములు మహావీర్యులై అన్య స్త్రీలను సేవింపనివారై జీవింతురు.
ఈ కురువుల విషయమును గూడ విస్తరముగా వినుడు. ఉత్తరపుదైన జూరుధి అను పర్వతరాజమునకు ఉత్తరముగాగల కురువుల విషయమును చెప్పుచున్నాను వినుడు. చంద్రకాంత శైలము, సూర్యకాంత శైలము - అను మిక్కిలి గొప్ప మహోన్నతములైన రెండు కులపర్వతములు అచటఉన్నవి. అవి అనేకకందరములు (నీటితో చీల్చబడి ఏర్పడిన గుహలు)దరులు (స్వయముగా అలంకరింపబడినవి. అనేకములైన పొదలచేతను, వనముల చేతను కూడినవి. చిత్రములైన ధాతువులచే అలంకరింపబడినవి. పుష్పములు, కంద మూలములు, ఫలములతో కూడినవి. సిద్ధులచేతను చారణులచేతను సేవింపబడినవి. (నివసింపబడినవి). ఆ రెండు కులపర్వతముల చేతను అనేకములైన వందల శిఖరముల చేతను, ఆ ద్వీపము దగ్గరగా ఉండి సేవింపబడినది. ఆ చంద్రకాంత - సూర్య కాంత పర్వతముల మధ్యగా భద్రసామ అను మహానది ప్రవహించుచున్నది. ఇతరములైన వేలకొలది నదులు నిర్మలములై, సురసములైన జలములు కలవై, కురుదేశవాసులు అందరి స్నాన పానములకే కాక ఈదుటకును సరిపోవునట్లుగా జలముతో ప్రవహించినవి. అట్లే మరికొన్ని వేల మహానదులు క్షీరములను ప్రవహించును. తేనెలను, మైరేయమును, నేతిని ప్రవహించినవి. అచట పెరుగు మడుగులు వేలుగలవు. తీయని రుచ్యమైన అన్న పర్వతము కలదు. అమృతమువలె తీయని పండ్లు అనేకములు గలవు. గంధవర్ణ రసముతో ఒప్పిన కంద మూలములు ఫలములు కలవు. అవి అయిదు యోజనముల వరకంతట గంధముల విరజిమ్మును. పలురంగుల, పూవులు వేలకొలదియు, గొప్పనైన భోగ్య వస్తువులు మంగళములును వేలకొలది కలవు. గంధము, రంగు, రసము వీనిచే ఒప్పినవై సుఖస్పర్శగల తమాల, అగురు, గంధ, చందనవనములు కలవు. అచట వనములు వికసించిన పూవులతో, వానిలో తిరుగాడు తుమ్మెదలతో కూడిన వృక్షములు పొదలు తీగలును గలవు. ఓ బ్రాహ్మణోత్తములారా! తుమ్మెద గీతులతోను పక్షులతోను నిండిన కమలములతో, కలువలతోను ఒప్పిన వేలకొలది సరస్సులు అచ్చట కలవు. భక్ష్యముల తోను, పూవులు మొదలగు వాని మాలలతోను, సమృద్ధములు ఆ పర్వతములు అనేకములైన మాలలు పూసికొను గంధాదులును కలవి. అందమైన ముఖములతో చిత్రమైనవి. పక్షి సంఘముల కూతలచే ధ్వనింపబడినవి. పడుకొను పరుపులు కూర్చొను ఆసనములు మొదలగు భోగములు గలవియు అనేక గుణవిస్తారములు కలవియునుగల రమ్యమైన విహార భూములు అందుకలవు. అవియన్ని ఋతువులలో సుఖప్రదములు. ఉద్యానవనములు అంతటను ఎక్కువగా కలవు. మణులతోను, బంగారముతోను అలంకరింపబడిన శిలాగృహములు వృక్ష గృహములు శ్రేష్ఠములైన అరటి చెట్ల గృహములునుగలవు. అంతటను వేలకొలది సుఖదములైన తీవపొదరిండ్లు, శుద్ధ శంఖపు చిప్పవలె తెల్లనైన నూర్లకొలది భూ గృహములును కలవు. మణుల జాలాంతరములుగల బంగారు గవాక్షములుఅను కిటికీలుగలవు. అంతటకూడ విశాల సువర్ణమణి చిత్రములుకలవు. వేలకొలది శ్రేష్ఠములైన మహావృక్షము అంతటను గలవు. సన్నని యనేక ఆకారములుగల సుఖకరములైన వస్త్రములు గలవు. మృదంగములు, వేణువులు, చేతి వాద్యములైన (డక్కీ) పణవములు, చాలవిస్తారముగా ఉన్నవి. లక్షలకొలది కల్ప వృక్షములు ఫలించుచుండును. అట్లే అంతటను గల ఉద్యానములు ఆ పురము అంతట వ్యాపించినట్లు ఉండును. సర్వ ద్వీపములలోను ఆ కురుదేశం మిక్కిలి సంతుష్టమైనది. స్త్రీ, పురుషులతో వ్యాకులమైనది. అచట వాయువు అనేక పుష్ప సుగంధముగలదై బాగుగా వీచును. శ్రమను పోగొట్టునా ద్వీపమున నిత్యము సంగ సుఖసంతోషము ఉండును. స్వర్గమునుండి భ్రష్టులైన నరులు ఎల్లప్పుడు అచట జన్మించుచుందురు. అది భూతల స్వర్గము. అది సుగుణములలో సర్వోత్తమమైనది.
అచటివారు చంద్రునివంటి కాంతిగల (తెల్లని) వారు నరశ్రేష్ఠులు. తూర్పు తీరమున పుట్టినవారు నల్లని అంకములు (చుక్కలు) గలవారు. నలుపు, తెలుపువారు సుఖవంతులు. సూర్యుని వంటి కాంతిగల (ఎఱ్ఱని) శ్రేష్ఠులైన ప్రజలు. ఆ దేశములోని నరులు శ్రేష్ఠులు, దేవతలతో సమానమైన బలపరాక్రమములు గలవారు. ఎల్లప్పుడు విహరించువారు. అందరును స్వేచ్ఛావృత్తిచే మంచి తేజస్సు గలవారు. కంకణములు, చేతులు మొదలగు అవయవములందును, భుజములందును ధరించు భుజకీర్తులు మొదలగునవి. కంఠహారములు, చెవి కుండలములు - వీనిచే అలంకరింపబడినవారు. పూలమాలలు ధరించిన వారు. చిత్రములైన కిరీటములు ధరించినవారు. చిత్రమైన కప్పు వస్త్రములు గలవారు. తరగని యౌవనము గలవారు. ప్రియమైన సుందరులు. ఇట్టి ప్రజలు పెక్కువేల యేండ్లు జీవింతురు. వారు ప్రసవించుట అనెడి ధర్మము కలవారు కారు. వంశమును క్షీణింపజేయు విధానము లేదు. వృక్షము నుండి మిధునము(లు) పుట్టును. అందరును సామాన్యమైన సంపదలు గలవారు. మమత్వమును వదలినవారు. అచట ధర్మములేదు. దుర్బుద్ధిలేదు. శ్రమలేదు. కాలము నిండగనే వారు నీటి బుడగలవలె నశింతురు. ఈ విధముగవారు అత్యంత సుఖవంతులు, సర్వదుఃఖములు వదలినవారు. రాగులై (ప్రేమగలవారై) ధర్మమును చూడరు. దుఃఖము వలననే అధర్మము పుట్టును.
ఉత్తర కురుదేశములకు ప్రక్కన దక్షిణమున సముద్రము కలదు. అది తరంగ మాలలతో ఒప్పినది. కావున అనేక స్వరములతో అలంకరింపబడినది. ఐదువేల యోజనములు దాటి దేవతలకు నిలయమైన చంద్రద్వీపమని పేరొంది, చంద్రమండల మందు ఉన్న(ట్లున్న) ద్వీపము కలదు. దాని పరిమండలము వేయి యోజనములు. అనేక పుష్ప - ఫలములతో కూడినది. గొప్ప సమృద్ధితో కూడినది. నూరు యోజనముల విస్తీర్ణము గలది. నూరు యోజనముల ఔన్నత్యము కలది. దాని మధ్యన గిరి శ్రేష్ఠము గలదు. అది సిద్ధుల చేతను, చారణులచేతను సేవింపబడినది. చంద్రసమాన కాంతులుకలవియు, మనోహరము లైనవియు, చంద్రాకారమున ఉన్నవియు, మంచి లక్షణములు (చిహ్నములు) కలవియు. తెల్లనివియు వైడూర్య వర్ణము గలవియు అయిన కలువలతో ఈ పర్వతము కుముద ప్రభయై (కలువల కాంతి నిండినదై) ఉండెను. అది అనేక చిత్రముల ఉద్యానవనములు కలది. అనేకములైన సెలయేరులుగల గుహలుకలది. రకరకములైన గొప్ప చరియలు గుహలు పొదరిండ్లచే చక్కగా అలంకరింపబడినది. ఆ శైలమునుండి మహా పుణ్యకరమైనది, చంద్ర కిరణములవలె నిర్మలములైన జలములు కలదియు అత్యుత్తమమైన చంద్రావర్త అనునది కలదు. అది నక్షత్రాధిపతియైన చంద్రునియొక్క ఉత్తమ స్థానము. అచట గ్రహనాయకుడైన చంద్రుడు ఎప్పుడు అవతరించును. అచట చంద్రుని పేర పర్వతము కీర్తిని పొందినది. చంద్రద్వీపము అను మహాద్వీపము స్వర్గమునను ఇచటను ప్రకాశమైనది. అచట అందరు చంద్రునితో సమానమైనవారు, నిండు చందురుని మోము గలవారు, చంద్రకాంతిగల ప్రజలు నిర్మలులు, చంద్రుడే దైవముగా గలవారు, అత్యంత ధార్మికులు, సౌమ్యులు, సత్యసంధులు, మహాతేజస్కులును అయిన ప్రజలు అచట సదాచారులు, వేయి ఏండ్ల ఆయువు గలవారు.
పశ్చిమ ద్వీపమునకు పశ్చిమముగా, నాలుగువేల యోజనముల మహోదధిని దాటి, అంతటను పదివేల యోజనముల పరిమండలముగల భద్రాకరమను ద్వీపము కలదు. అది అనేక పుష్పములతో ప్రకాశించినది. మిక్కిలి ధనధాన్యములతో నొప్పినది. అనేక రాజులతో పాలింపబడినది. నిత్యసంతుష్టమై ఉబ్బినది. మహాశైలములతో ప్రకాశించినది. అచట వాయువు యొక్క భద్రాసనము గలదు. అది నానారత్నములచే అలంకరింపబడినది. అచట ఆకారము దాల్చిన వాయువు ఎల్లప్పుడు పర్వదినములలో పూజింపబడును. అచటి ప్రజలు మంచి బంగారు వన్నెగలవారు, బంగారుతో అలంకరింపబడిన వారు దేవతలతో సమానులై చిత్రమైన వస్త్రములు పూలమాలలు గలవారై, వీర్య వంతులై, మహాభాగ్యవంతులై, ఐదువేలయేండ్ల ఆయువు గలవారై, సత్యసంధులై, సంతుష్టులై, వాయువు దైవముగా గలవారునై ఉందురు” అని చెప్పి
“భారత యుగమున ఈ సృష్టి ఈ విధముగనే పరమ తత్త్వజ్ఞులచే చూడబడినది. నేను ఇంకేమి చెప్పవలెను?” అని ఈ విధముగా బుద్ధిమంతుడగు సూతుడు అడుగగనే మరల ప్రత్యుత్తరమును వినుటకై ఋషులు
ఇది భారత వర్షము. దీనియందు స్వాయంభువు మొదలగు పదునలుగురు మనువులు ప్రజాసృష్టికై జన్మింతురు. ఆ వృత్తాంతమును తెలిసికొన గోరుచున్నాము. కావున దానిని మాకు వివరింపవలెను” అని సూతుని వేడుకొనిరి. సూత పౌరాణికుడు భావితాత్ములైన ఋషుల వచనములు విని సమాహిత మనస్కుడై మరల వారితో ఇట్లు పలికెను.
సూతుడు ఇట్లు అనెను:
ఈ పైన కురుదేశముల యథార్థ స్వభావస్థితి, భారతము యొక్క యథార్థమైన స్వభావస్థితిని చెప్పబోవుచున్నాను వినుడు. ఓ బ్రాహ్మణోత్తములారా! పూర్వ పశ్చిమ (సముద్రములవరకు పొడవైన దక్షిణ హిమాచల పుణ్య క్షేత్రమున దక్షిణముగా వ్యాపించి యున్న జానపదముల (జనావాస దేశముల) విస్తరమును గూడ వినుడు. ఈ భారత దేశమున వసించు ప్రజలను మీకు వర్ణించి చెప్పుదును. ఇది హిమవత్పర్వతమునకు దక్షిణముగను సముద్రమునకు ఉత్తరముగను వ్యాపించి ఉన్న శుభాశుభ ఫలములు లభించు స్థానము. ఇది భారతము అను దేశము. ఇచటి ప్రజలు భారతీయులు. ప్రజలను భరించుటచే మనువు భరతుడు అనబడుచున్నాడు. ఈ నిరుక్త వచనమువలన ఈ దేశము భారతము అనబడినది. అక్కడి నుండియే స్వర్గము, మోక్షము, మధ్య శ్రాంతమును స్వర్గ మోక్షములకు మధ్య విశ్రాన్తి మార్గము లేదా జీవన్మోక్షము పొంద బడును. ఇచట తప్ప వేరొకచోట భూమిలో మర్త్యులకు (మరణ స్వభావులగు మానవులు మొదలగు వారికి) కర్మ చెప్పబడ లేదు. ఒక్క భారతదేశమునకు ఎనిమిది భేదములు చెప్పబడినవి. అవి సముద్రములో మునిగినవై, పరస్పరము తెలియరానివి. ఇంద్రద్వీపము కసేరు ద్వీపము, తామ్రద్వీపము, సూర్యద్వీపము, నాగద్వీపము, సౌమ్య (సోమ) ద్వీపము, గంధర్వ ద్వీపము, వారుణద్వీపము. ఈ భారత ద్వీపమనునది తొమ్మిదవది. ఇది పూర్వపశ్చిమ దక్షిణ సముద్రములచే చుట్టబడినది. ఇది దక్షిణోత్తరముగా వేయి యోజనములు గలది. కుమారీ నది వరకుగాని గంగోత్పత్తి స్థానమువరకుగాని అడ్డముగా తొమ్మిదివేల యోజనములు విస్తీర్ణము కలది. ఈ ద్వీపము చివరలలో మ్లేచ్ఛులు నిత్యము నివసింతురు. ఈ ద్వీపము యొక్క తూర్పు చివరలో కిరాతులు పశ్చిమముచివర యవనులును ఉన్నట్లు చెప్పబడినది. ఇక మధ్యన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు క్రమముగా యుగములచే, యుద్ధములచే, వ్యాపారములచేతను వృత్తులను నిర్వహించువారై యుండిరి. వారిలో పరస్పర తగవు - న్యాయము జరుగుచుండును. వర్ణములవారు తమ కర్మలలో ధర్మార్థకామ సంయుక్తులుగా ఉండిరి. సంకల్పమే అయిదవ ఆశ్రమముగా గల బ్రహ్మచర్య గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమములు యధావిధిగా జరుగుచుండును. ఇచటి స్వర్గ - మోక్షముల కొరకై మానవుల ప్రవృత్తి (ఆచరణము) ఉండెడిది. అడ్డముగా పొడవుగా ఉన్న తొమ్మిదవదైన ఈ ద్వీపమును అంతయు జయించినవాడు సమ్రాట్ అనబడును. ఈ లోకము సమ్రాట్టనియు (ఈ లోకమును జయించినవాడు సమ్రాట్టు అనియు) అంతరిక్షలోకము విరాట్టనియు (అంతరిక్షమును జయించినవాడు విరాట్టనియు), వీరిరువురి కంటె వేరొక స్వరాట్టు అను లోకము కలదు. విస్తరమును మరల చెప్పెదను (స్వరాట్టు అనగా ఆత్మను జయించిన వాడు: పర బ్రహ్మము).
ఈ భారతదేశమున గొప్ప చరిత్రలుగల ఏడు కులపర్వతములు గలవు. మహేంద్ర పర్వతము, మలయపర్వతము, సహ్యపర్వతము, శుక్తిమత్పర్వతము, ఋక్షపర్వతము, వింధ్యపర్వతము, పారియాత్రపర్వతము - ఇవి ఏడును కులపర్వతముల పేర్లు. వాని సమీపములలో తక్కిన పర్వతములు వేలకొలది కలవు. అవి ఉత్తమ వంశమున పుట్టినవి. అన్ని గుణములు గలవి. విశాలములైనవి. చిత్రమైన చరియలు గలవి. పర్వత శ్రేష్టమైన మందరము, విహారయోగ్యమైన దర్దుర పర్వతము, కోలాహల పర్వతము, నాగమాతతో గూడిన మైనాక పర్వతము, వైద్యుత పర్వతము, పాతంధమ పర్వతము, పాండుర పర్వతము, గంతుప్రస్థ పర్వతము, కృష్ణగిరి, గోధనగిరి, పుష్పగిరి, ఉజ్జయన్త పర్వతము, రైవతక పర్వతము, శ్రీపర్వతము, కారుపర్వతము, కూటశైల పర్వతము, వీనికంటే వేరైనవి. చిన్నవి ఆశ్రయించిన ప్రాణులు స్వల్పముగా ఉన్నవియు అయిన పర్వతములు మరికొన్ని కలవు. వానితో కలిసిన జనపదములు నిత్యము ఆర్య, మ్లేచ్చులు కలవి. వారు ఈ నదుల నీటిని త్రాగుదురు. గంగ, సింధు, సరస్వతి, శతద్రు, చంద్రభాగ, యమున, సరయూ, ఇరావతీ, వితస్త, విపాశ, దేవిక, కుహు, గోమతి, ధుతపాప, బాహుద, దృషద్వతి, కౌశికి, నిశ్చిర, గండకి, ఇక్షు, లోహిత - ఇవి హిమవత్పర్వత (పాద) ప్రత్యంత పర్వతముల లోహిత - ఇవి నుండి బయలుపడి స్రవించినవి. వేదస్మృతి, వేదవతి, వృత్రుఘ్ని, సింధు, వర్ణాశ, చందన తీరములతో గూడిన మహతి, పరా, చర్మణ్వతి, విశద, వేత్రవతి, శిప్ర, అవంతి - ఇవి పారియాత్ర కులపర్వతమును ఆశ్రయించిన నదులు. మహానదమైన శోణ, మహావృక్షములు గల నర్మద, మందాకిని, దశార్ణ, చిత్రకూట, తమస, పిప్పల, శ్రేణి కరతోయ, పిశాచిక, నీలోత్పల, విపాశ, జంబుల, వాలువాహినీ, సీతేరజ, శుక్తిమతి, మక్రుణ, త్రిదివ - ఇవి నక్షత్రపాతము వలన బయలుదేరిన మణిసమాన జలములుగల నదులు, తాపి, పయోష్ణి, నిర్వింధ్య, మద్ర, నిషద, పేన్వ, వైతరణి, శితిబాహు, కుముద్వతి, తోయ, మహాగౌరి, దుర్గ, అంతశిల, వింధ్యపాదములైన ప్రత్యంత పర్వతముల నుండి బయలువెడలిన పుణ్యజలములు గలిగిన శుభనదులు, గోదావరి, భీమరథి, కృష్ణవేణి, వంజుల, తుంగభద్ర, సుప్రయోగ, కావేరి - ఇవి దక్షిణాపథ నదులు. సహ్యపర్వత పాద ప్రత్యంత పర్వతములనుండి బయలుదేరినవి. కృతమాల, తామ్రవర్ణ, పుష్పజాతి, ఉత్పలా వతి - ఇవి మలయపర్వతము నుండి పుట్టిన నదులు, ఇవి అన్నియు శీతజలములు గలవి. మంగళములు, త్రిసామ, ఋతుకుల్య, ఇక్షుకుల్య, త్రిదివ, లాంగులిని, వంశధార - ఇవి మహేంద్ర పర్వతమునుండి పుట్టిన నదులు. ఋషీక, సుకుమారి, మందగ, మందవాహిని, కూప్ర పలాశిని - ఇవి శుక్తి మత్పర్వతమున పుట్టిన నదులు. అన్ని నదులును పుణ్యవంతములు, సరస్సులు కలవి, అన్నియు గంగలే సముద్రమునకు చేరబోవునవి. అవి అన్నియు విశ్వమునకు తల్లులు. అంతేకాక ఉపనదులును నూర్ల కొలదియు, వేల కొలదియును కలవు. ఇవి కురు పాంచాలదేశములు జాంగల దేశముతో కూడినవి. సేన దేశము, భద్రకారము, బోధము, శతపథేశ్వరులతో గూడిన వత్సదేశము, కిసష్టము, కుల్యము, కున్తలము, కాశికోశములు ఈ దేశముల ప్రక్కన తిలింగదేశము వృక దేశముతో కూడిన మగధ దేశమును - గలవు. ఈ విధముగా మధ్య దేశములోని జనపదముల గురించి చాలవరకు తెలుపబడినవి.
సహ్య పర్వతమునకు ఉత్తరమున గోదావరిఉన్న ప్రదేశము మొత్తము భూమిలో రమ్యమైన ప్రదేశము. అచట గోవర్ధన పర్వతము గలదు. అది ఇంద్రునిచే నిర్మింపబడినది. పరశురాముని సంతోషమునకై ఇది స్వర్గముగా చేయబడినది. భరద్వాజ మునిచేత శ్రీరాముని సంతోషమునకై వృక్షములు ఓషధులును, అవతరింపజేయబడినవి. ఆయన చేత అంతఃపుర వనప్రదేశము మనోహరముగా సృష్టింపబడినది. వాహ్లీకుములు, వాఢధామములు, ఆభీరుములు, కాలతోయకములు, అపరీతములు, శూద్రములు, పహ్నవములు, చర్మఖండికములు, గాంధారములు, యవనములు, సింధు, సావేరీ, భద్రకములు, శకములు, వ్రాదములు, కులిందములు, పరితములు, హర్షపూరికములు రమటములు, రద్దకటకములు, కేయులు, దశమానికములు, క్షత్రియోప నివేశములు, వైశ్యశూద్ర కులములును, కాంభోజములు, దరదములు, బర్బరములు, ప్రియకౌశికములు, పీసములు, తుషారములు, పహ్లవములు, బాహ్యతోదరములు, ఆత్రేయములు, భరద్వాజములు, ప్రస్థలములు కేసరకములు, లంపాకములు, స్తనపములు, జహుడములతో గూడిన పీడికములును, అపగములు, అలియచూలికములు, ఆహుకములు, పూర్ణదర్వులును - అను ప్రదేశములు ఉదీచ్యదేశము. ఇక ప్రాచ్యదేశములను వినుడు. ఆంధ్రవాకములు, సుజరకములు, అంతర్గిరి - బహిర్గిరులు, ప్రవంగ - వంగేయములు, మాలదములు, మాలవర్తి దేశములు. బ్రహ్మోత్తరములు, ప్రవిజయులు, భార్గవములు, గేయమర్థకములు, ప్రాగ్ జ్యోతిషములు, ముండములు, విదేహములు, తామ్ర(త్రు)లిప్తకములు, అలములు, మగధములు, గోవిందములు ఇవి ప్రాచ్య దేశములు అనబడినవి. ఇక దక్షిణాపథమున ఉన్న ఇతర దేశములు పాండ్యము, కేరళములు, చౌల్యములు, కుల్యములు, సేతుకములు, మూషికములు, కుమనములు వనవాసికములు, మహారాష్ట్రములు, మాహిషకములు, కళింగములు, చౌషికములతోడి అభీరములు, వరములైన అటవ్యములు, పులింగములు, వింధ్యమూలికములు, దండకములతోడి వైదర్భములు, పౌనికములు, మౌనికములు, అస్మకములు, భోగవర్థన ములు, నైర్ణికములు, కుంతలములు, ఆంధ్రములు, ఉద్భిదములు, నీలికాలికములు, ఇవి ప్రాచ్యదేశములు, ఇక తక్కిన దాక్షిణాత్య దేశములను వినుడు. శూర్పకారములు, కోలవనములు, కాలీతకములతోడి దుర్గములు, పురేయములు, సురాలములు, తాపసములతోడి రూపసములు, సురసితములు, సమస్తపర క్షరములు, నాసిక్యములు, అంతర నర్మదములు, భానుకచ్ఛములు, సమములు, హేయములు, శాశ్వతముల తోడి సహసములు, కచ్ఛీయములు, సురాష్ట్రములు, అర్బుదములతో అనర్థములు, అనునవి చక్కగా చుట్టి ఉన్న దేశములు. వింధ్యవాసి దేశములను వినుడు. మాలవములు, కరూషములు, ఉత్కలములతోడి వేకలములు, ఉత్తమర్ణములు, దశార్ణములు, కిష్కింధముల తోడి భోజములు, తోసలములు, కోసలములు, త్రిపురములు, వైదికములు, తుమురములు, తుంబురములు, నిషధములతోడి షట్సురములు, అనుపములు, తుండికేరములు, వీతి హోత్రములు, అవంతులు, ఇవి మొత్తము వింధ్య పృష్ఠమున ఉన్న దేశములు. తరువాత పర్వతాశ్రయి దేశములను చెప్పెదను. నిగర్హరములు, హంసమార్గములు, క్షుపణములు, తరంగణములు, ఖసములు, కుశస్రావరణములు, హూణములు, బహూదకములతో కూడిన దర్వములు, త్రిగర్తములు, మాలవములు, తామసములతో గూడిన కిరాతములు. భారత దేశమున నాలుగు యుగములని పండితులు తెలియుదురు. అవి కృతయుగము, త్రేతా యుగము, ద్వాపరయుగము, కలియుగము - అని నాలుగింటిని గురించి. వాని యొక్క స్వభావమును ముందు చెప్పెదను వినుడు.