దేవవంశవర్ణనము

సూతుడు ఇట్లు చెప్పెను:  

దక్షుని విషయమై శివునివల్ల ఇచట నడచిన మీ కథ పాప ప్రణాశినిగ అంగీకరింపబడినది. పితృవంశ ప్రసంగమున ఈ కథ చెప్పబడినది. ఆ తరువాత పితరుల అనుక్రమమున దేవతలను గురించి చెప్పబోవుచున్నాను. పూర్వము త్రేతాయుగ ప్రారంభమున స్వాయంభువ మన్వంతరమున దేవతలుండిరి. యజ్ఞమున పుట్టిన ఆ దేవతలు ‘యాగములు’ అని అనబడిరి. జితులు, జిదజితులు అనువారు బ్రహ్మయొక్క పుత్రులైన అజితులు. వీరు స్వాయంభువునకు మానస పుత్రులు శుక్రులను పేరుగలవారు.

వీరు తృప్తిమంతులై దేవతల మూడో గణములుగా తలపబడిరి. ఛందోగులైన ముప్పది మువ్వురుందరు స్వాయంభువునివారు. యదువు, యయాతి, అను ఇద్దరు దేవతలు, దీధయుడు, స్రవసుడు, మతి, విభాసుడు, క్రతువు, ప్రజాతి, విశతుడు, ద్యుతి, వాయసుడు, మంగలుడు అను ఈ 12 గురుయాములు (యాములును దేవతలే)గా చెప్పబడిరి. అభిమన్యువు, ఉగ్రదృష్టి, సమయుడు, శుచివ్రతుడు, కేవలుడు, విశ్వరూపుడు, సుపక్షుడు, మధుపుడు, తురీయుడు, నిర్హపుడు, యుక్తుడు, గ్రావజినుడు-అనువారు, యమినుడు, విశ్వుడు, దేవాద్యుడు, యవిష్ణుడు, అమృతవంతుడు, అజిరుడు, విభువు, విభావుడు, మృలికుడు, దిదేహకుడు, శ్రుతి శృణుడు, బృహచ్ఛక్రుడు అను వారును పండ్రెండుగురు దేవతలు.

వీరు స్వాయంభువ మన్వంతరమున సోమపాయులై (సోమ రసమును త్రాగువారుగా ఉండిరి. వీరు వెలుగు విరజిమ్ము గణములు. వీరవంతులు, మహాబలులును కూడా వారికి ఎల్లప్పుడు మొదటి విభువు విశ్వపాలకుడునునై ఇంద్రుడు ఉండెను. అప్పుడు అసురులు అనువారు, వారికి దాయాదులైన బాంధవులు (ఆస్తిని పంచుకొనదగిన సోదరులు). సుపర్ణయక్ష, గంధర్వులు, పిశాచ, ఉరగ-రాక్షసులు, అశ్వినీ దేవతలు ఇరువురును కలిసి ఎనమండుగురును పితృదేవతలతో గలిపి దేవయోనులు (దేవజాతిలో పుట్టినవారు). స్వాయంభువమన్వంతరమున వీరి సంతానము వేలకొలది గతించిరి. వారు ఆయుష్యము, బలము, ప్రభావము, రూపము వీనితో చక్కగా గూడుకొన్న వారు. ఇచట అనవసర ప్రసంగము జరగగూడదని వారిని గూర్చి విస్తరముగా జెప్పబడుట లేదు. ప్రస్తుత స్వాయంభువ మనువు సృష్టి కాలమని తెలుసుకొనవలెను. స్వాయంభువ మనువు కాలము గడవగా వైవస్వతమనువు సృష్టి కాలము ప్రజలచేతను, దేవతలచేతను, ఋషులచేతను, పితరులచేతను వర్తమానముగా చూడబడినది.

వారిలో పూర్వము సప్తర్షులుగా ఉన్నవారిని వినుడు. భృగ్వంగిరుడు, మరీచి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వసిష్ఠుడు. వీరు స్వాయంభువ మన్వంతరమున ఏడుగురు ఋషులు. అగ్నీధ్రుడు, అతిబాహుడు, మేధుడు, మేధాతిథి, వసువు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, సవనుడు, పుత్రుడు అను ఈ మహాతేజస్వులు పదిమంది స్వాయంభువమనువు యొక్క పుత్రులు.

వాయువుచే చెప్పబడిన వీరు, మహాబలవంతులై స్వాయంభువ ప్రథమాంతరమున ఉండిన రాజులు. అసురులతోను, గంధర్వులతోను, యక్ష, ఉరగ, రాక్షసులతోను; పిశాచ, మనుష్యులతోను; సుపర్ణ, అప్సరో గణములతోను వీరి అనుక్రమము నూరేండ్లలో కూడ చెప్పతరము గాదు. అట్లే బహుత్వమువలన వీరి కులమునందు వీరి నామధేయముల సంఖ్యయు చెప్పవలనుపడదు. స్వాయంభువ మన్వంతరమున ఏయే పేరిట కులములు ఉండెనో అవి అన్నియు దక్షిణ, ఉత్తర అయనముల యొక్కయు, ప్రభవాది సంవత్సరముల యొక్కయు, కృతాది యుగముల యొక్కయు క్రమములతో బహుళమైన కాలముతో గతించినవి అని చెప్పెను. అంతట.....

“సర్వ భూతములను అపహరించు భగవంతుడైన కాలుడు ఎవరు. అతని వల్ల ఏమి సంభవించును? అతనికి మూలమేమి? అతని తత్త్వము (నిజస్వరూపము) ఏమి? ఆతని జనకుడు కుమారుడు ఎవరు? అతనికి ఏది కన్ను? ఏది మూర్తి? అతని అవయవము లేవి? ఆతని పేరేమి? అతని ఆత్మ యెవరు? మాకు ఇదంతయు చెప్పుడు” అని ఋషులు అడిగిరి.

సూతుడు చెప్పెను:

కాలము యొక్క ఉనికి ఎట్టిదో వినుడు. విని చక్కగా బుద్ధియందు నిలుపు కొనుడు. కాలమునకు సూర్యుడు యోని (పుట్టు స్థానము) అది నిమేషము (కనురెప్ప పాటు కాలము) సంఖ్య కన్ను. ఆకారము రాత్రిపగలును. అవయవములు నిమేషములు. నూరేండ్లు ఈతని నామము, ఆత్మకళ (30 కాష్టల కాలము=540 కనురెప్ప పాట్ల కాలము) భూత, భవిష్యత్, వర్తమానకాలరూపమైనది ఆత్మ. ప్రజాపతి (బ్రహ్మ), ఐదుగా విభజించిన కాలావస్థను (స్థితిని)వినుడు. దినములు, పక్షములు, నెలలు, రెండేసి నెలలతో ఏర్పడిన ఋతువులు, అరేసి మాసములతో ఏర్పడిన ఆయనములు. ఇవి కాలము యొక్క అయిదు దశలు. మొదటి మొత్తము సంవత్సరము. రెండవది పరివత్సరము, మూడవది ఇద్వత్సరము, నాలుగవది అనువత్సరము. ఐదవది (అనగా ఐదేండ్లకాలము) కాలము. అది యుగము అను పేరుగలది. వానియొక్క తత్త్వమును చెప్పెద వినుడు.

ఋతువు అగ్ని అని చెప్పబడినది సంవత్సరముగా సమ్మతమైనది. సూర్యునిలో సారభూతమైనది కాలాగ్ని పరివత్సరము. అతని గతి (నడక)యు శుక్లపక్ష, కృష్ణపక్ష రూపమైనది. జలసారముతో నిండినవాడు ఖగుడు (సూర్యుడు, చంద్రుడు) ఆతడు ఇడా వత్సరము, సోముడు (చంద్రుడు), అని పురాణమున నిశ్చయమైన మతము. ఏడు గుఱ్ఱము (కిరణము)ల రూపమున ఉన్న శరీరములచేత లోకములను తపింపజేయువాడు, లోకములను వేగముగా సృష్టించువాడు అయిన వాయువు ఆ సంవత్సరము అహంకారం వలన బ్రహ్మనుండి రోదించుచు పుట్టినవాడు రుద్రుడు అనువత్సరమువానికి ఐదేండ్లు. యధిపతులకు, (అగ్ని, సూర్య, సోమ, వాయు, రుద్రులకు) నీలలోహితుడు (నలుపు, ఎరుపు వర్ణముగల) శివుడు కలిగెను. వారితత్త్వమును చెప్పెదను వినుడు. అంగ ప్రత్యంగ సంయోగము వలన కాల స్వరూపుడు బ్రహ్మ, అతడు ఋగ్వేద, సామవేద, యజుర్వేదములు పుట్టినచోటు. పై అయిదు విధములైన వత్సరములకు పతియైన ఈశ్వరుడు. అతడు అగ్ని, యజుస్సు, సోముడు, అతడు భూతము, అతడు ప్రజాపతి(బ్రహ్మ). అతడే సంవత్సరము అనియు, సూర్యుడనియు, అగ్నిఅనియు విద్వాంసులచే చెప్పబడెను. ఈ విధముగ కాలవిభాగములైన మాస, ఋతు, ఆయనములకును అట్లే గ్రహ నక్షత్ర శీత, ఉష్ణ, వర్ష, ఆయుః కర్మలకును, కాలప్ర విభాగములైన దివసములకును జోడింపబడినవాడు సూర్యుడు. అతడు వైకారికుడు (కాలమునుబట్టి వికారమును జెందువాడు) నిర్మలాత్ముడు. బ్రహ్మ పుత్రుడు. బ్రహ్మయును, ఒక్కడయ్యును అనేక స్వరూపములు గలవాడు. దినము, మాసము, ఋతువు-వీని స్వరూపములుగలవాడు పితామహుడు (తండ్రులను పుట్టించిన వాడు). అదితికి పుట్టినవాడు విశ్వమును కన్నవాడు, కాంతితో ప్రకాశించువాడు, ప్రాణులను జీవింప చేయువాడు, బ్రహ్మచే సత్కరింపబడినవాడు, ప్రాణులకు పుట్టుకయైన వాడు, నాశనమైన వాడును. కావున భాస్కరుడు (కాంతి కలుగజేయువాడు). తారాభిమానియై సోముడు (చంద్రుడు) మూడవ పరివత్సరముగా తెలియదగినవాడు. అతడు అన్ని ఓషధులకు పతి కావున ప్రపితామహుడు (బ్రహ్మ). సర్వ ప్రాణులకు జీవనాధారము, యోగక్షేమములు కలుగ జేయువాడు (కోరినది కూర్చి రక్షించువాడు). తన కిరణములచే చూచుచున్నవాడై జగమును ఎల్లప్పుడు రక్షించును. తిథులకును, పర్వసంధులకును పూర్ణిమ, అమావాస్యలకును కారణభూతుడు. నిశాకరుడు (రాత్రి అంతయు తన కాంతిచేత సుఖకరముగ చేయువాడు) అమృత స్వరూపుడు (సముద్రము నుండి అమృతం తోడబుట్టిన వాడు). కావున ప్రజాపతి (బ్రహ్మ). కావున ఆ సోముడు పితృమంతుడు, ఋగ్యజుర్వేదాత్మ కుడు. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన రూపములైన పంచ ప్రాణ వాయువుల క్రియలచేత లోకమున ప్రాణుల సర్వ చేష్టలను చేయించువాడు, ప్రాణ, అపాన, మాన వాయువులను కూడ నడిపించువాడు. మనోబుద్ధిస్మృతి (జల) స్వరూపములైన పంచేంద్రి యముల యొక్క (త్వక్, చక్షు, శ్రోత, జిహ్వా, ఘ్రాణముల యొక్క) క్రియలను చేయించు దానివలె సమాన కాలమునకు సాధనమైనవాడును, సర్వాత్ముడును సర్వ లోకముల తను ఆవహవాయువుతో ఆవహించి ఉండువాడు. (ఆవాహ) ప్రవహ, సంవహ, ఉద్వహ, వివహ, పరివహ, పరావహములను ఏడు వాయువులచే సర్వ ప్రాణులను సృష్టించువాడు, నిత్యము సర్వసామ్య ప్రతిపత్తితో జగముయొక్క స్థితిని నిర్వహించువాడు, ప్రభంజనుడు (విజృంభించి నపుడు సర్వమును ధ్వంసము చేయువాడును), అగ్నికిని (దానినుండి పుట్టినందున జలమునకును (దానినుండి పుట్టినందున భూమికిని, సూర్యునకు చంద్రునకును పుట్టు స్థానమైన వాయువు ప్రజాపతియే (బ్రహ్మ). పంచభూతములలో ఒకటి. వాయు రూపమున లోకమంత నిండిలో కస్వరూపమైనది. కావున ప్రపితామహుడు (బ్రహ్మ). భూమిలో ఓషధులు క్షీణించినపుడు చక్కగా ఇష్ట ఫలములను కోరిన బ్రహ్మ మొదలగు దేవతలచే మూడేమూడు కపాలములచేతను అంబకములచేతను భగవంతుడు హోమము చేసి పూజింపబడుటచే త్ర్యంబకుడు అనబడెను. గాయత్రి, త్రిష్టుప్, జగతి అని ఉన్న ఛందస్సులే త్ర్యంబకములను పేరులతో ఆసవనమునకు (యజ్ఞమునకు) యోనులుగా (నిర్వహణ సాధనములుగా) ఉండును. తమ శక్తితో ఏకత్వమును పొందినవియై త్రివిధములైన ఆ గాయత్రి, త్రిష్టుప్, జగతీ ఛందస్సులచే మూడు సాధనములుగల పురోడాశము కలదిగను, మూడు కపాలములు కలదిగను ఆ సవనము తలంపబడినది.

ఈ విధముగా విద్వాంసులచే ఐదేండ్ల యుగము చెప్పబడినది. దానినే ద్విజులు (బ్రాహ్మణులు) ఐదు విధముల స్వరూపముగల సంవత్సరము అనిరి. అది వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిరములను ఋతువులను ఆరింటిని జనింపజేసెనట. ఋతువులు పుత్రులుగా గలవి యైదేడులు. ఇది సంగ్రహముగా సృష్టి-అని ఈ విధముగా ఈవాయువు ప్రాణులకు జీవితప్రాయుడు. నది తన వేగముతోగూడిన దానిని సంహ రించుచు పరుగిడినట్లే, కాలము (వాయువు) కూడ తన వేగముతో కలిపికొని సర్వమును సంహరించుచు పరుగిడును. కావున కాలవాయువు అహోరాత్రములు చేతులుగా గలద య్యెను. ఈ వాయువులే ప్రజలకు పతులై సర్వప్రాణులకు ప్రధానులుగను, సర్వలోకములకు పితరులుగను లోకాత్ములుగను కీర్తింపబడిరి. భవుడు (శివుడు) ధ్యానము చేయుచున్న బ్రహ్మ యొక్క ముఖమునుండి పైకి వెడలుచు పుట్టెను. అతడు ఋషి, విప్రుడు, మహాదేవుడు, ప్రాణులకు ఏకాత్మ, బ్రహ్మ. అతడు సర్వప్రాణులకు ఈశ్వరుడు. ప్రణవమునకు తగిన అర్థమగును. తన ప్రవేశముతో ప్రాణుల అంగ ప్రత్యంగములలో చక్కగా నుండువాడు. అతడు అగ్ని సంవత్సరము, సూర్యుడు, చంద్రుడు, వాయువు గూడను. అతడు యుగాభి మాని, కాలస్వరూపుడు, నిత్యము జగమును ఉపసంహరించువాడు, విభువు. అతడు పిచ్చెత్తింపచేయువాడు (మత్తిల్ల చేయువాడు), అనుగ్రహించువాడు, ఇద్వత్పరుడని గూడ చెప్పబడును. ఈ జగము భగవంతుని చేతన తేజముతో (వత్సరము) రుద్రావిష్టమైనది. తన శరీరముల (అష్టమూర్తులచేతను అనంత నామములచేతను ఆశ్రయా శ్రయి భావ సంయోగమున గూడ వత్సరము రుద్రావిష్ట మైనది. తరువాత అతని (శివుని) వీర్యముచే (బలముచే లోకానుగ్రహము చేయునదియై రెండవదియైన మంగళ సంయోగము విశాలముగ వ్యాపించిన దానిని ఏకము చేయును. దేవత్వము, పితృత్వము, కాలత్వము, దీని కంటెను పరమైన (ఉత్కృష్టమైనది. దాని కంటెను అన్ని విధములుగా భద్రమైనవాడుగా తద్వేత్తలచే శివుడు పూజింపబడును. ఆ భగవంతుడు నీలలోహితుడు పతులకుపతి, ప్రజాపతులకు ప్రజాపతి, సర్వ ప్రాణులకును సర్వులకును భవనము. ఆ రుద్రుడు క్షీణిం చిన ఓషధులను మరల మరల నాటి పోషించి పెంచును. ఈ విధముగ ఈ దేవతల సంతా నము ఇంతఅని చెప్ప అలవికాదు. అది బహువిధమై అనంతమైన పుత్ర పౌత్రులు కలది అగుట దానిని లెక్కించుటకు అలవి కాదు. పుణ్యకర్ములు, స్థిరమైన కీర్తిగల వారు, మహాత్ములునైన ప్రజాపతులయొక్క ఈ వంశమును కీర్తించినవాడు మహా సిద్ధిని బొందును.