సోమోత్పత్తి వర్ణనము

అని సూతుడు ఇట్లు అనెను:

ఓ బ్రాహ్మణులారా! సోముని తండ్రి భగవంతుడైన అత్రి అను ముని. ఆ భగవంతుడు తన తేజముతో సమస్త లోకములలోను మించి ఉండెను. పూర్వము అతడు మనో, వాక్, కాయములతో శుభములనే ఆచరించుచు, కాష్ఠమువలెను గోడ యందలి (చిత్తరువు) రాతివలెను కదలక చేతులు పైకెత్తిన వాడై, మహాతేజస్వియై, దేవమానములో మూడు వేలయేండ్లు చరింపనలవికాని మహాతపమును చేసెనని మేము వింటిమి. దేవత్వమును కోరి ఊర్ధ్వ రేతస్కుడై అట ఉన్న అతని శరీరము సోమత్వమును పొందెను. మహాబుద్ధి శాలియైన అద్విజుడు (అత్రిముని) భావితాత్ముడైన అత్రియొక్క ఆ సోమత్వము ఊర్ధ్వమును అంతయు ఆక్రమించెను. అపుడు ఆ సోముడు అతని రెండు కన్నుల నుండియు పది దిక్కులను ప్రకాశింపచేయుచు స్రవించెను. అపుడు పదుగురు దిద్దేవతలు విధిచే ఆదేశింపబడినవారై ఆ సోముని గర్భముగా ధరించిరి. ఆ దిగ్దేవతలు అందరును ఒక్కచో కలిసియే ఆగర్భమును ధరించిరి. కాని తరువాత దానిని ధరించుటకు అసమర్థులైరి. వెంటనే ఆ గర్భము సర్వభావనుడై, శీతాంశువై, ఆ దిక్కుల నుండియే లోకములను అన్నింటిని ప్రకాశింపచేసెను. దిగ్దేవతలు ఆ గర్భమును ధరింపజాలనందున ఆ సీతాంశుడు దిగ్దేవతా గర్భముల నుండి భూమిపైపడెను. ఆ విధముగా పడుచున్న చంద్రుని చూచి లోకపితామహుడైన బ్రహ్మ లోకహితమును కోరి అతనిని రథము ఎక్కించెను. ఓ బ్రాహ్మణులారా! అతడు దేవమయుడు. సత్యమే సంగరముగా కలవాడు. ఆ రథము వేయి తెల్లని గుఱ్ఱములతో పూన్చబడినదని వింటిని. పరమాత్మ స్వరూపుడైన ఆ అత్రి పుత్రుడు పడగనే ప్రసిద్ధులైన బ్రహ్మమానస పుత్రులు ఏడుగురును స్తోత్రము చేసిరి. అచటనే అంగిరసుడును, అతని యొక్కయు, భృగువు యొక్కయు పుత్రులును, అనేకములైన ఋక్కులచేతను యజుస్సుల చేతను అధర్వాంగిరసముల చేతను స్తోత్రము చేసిరి. తరువాత ఆ స్తుతింప బడుచున్న, ప్రకాశించు సోముని (చంద్రుని) తేజస్సు ఆప్యాయమానమగుచు అంతటను ముల్లోకములను భావించుచుండెను. సమముగ ఉన్న రథశ్రేష్ఠముచే సాగరాంతమైన భూమిని ప్రకాశముతో సంతృప్తి పరచి, విశాలుడై ఇరువది యొక్క మారులు భూప్రదిక్షణము చేసెను. అట్లు తిరుగుచున్న అతని ఆ తేజము పృథివిని చేరెను. అచట పుట్టిన ఆ ఓషధులు ఆ తేజముతో చక్కగా ప్రకాశించినవి. ఈ సోముడు ఆ ఓషధులచే లోకములను, నాలుగు విధములుగా ఉన్న ప్రజలను ధరించును. ఓ బ్రాహ్మణోత్తములారా! ఈ విధముగా భగవంతుడైన సోముడు జగమును పోషించువాడు. స్తోత్రములచేతను, కర్మలచేతను తపముచేతను పొందిన తేజస్సుకల ఆ సోముడు మహాభాగుడై నూరు పద్మసంఖ్యల (లక్ష లక్ష కోట్ల) ఏండ్ల తపము చేసెను. తన కర్మతో ప్రసిద్ది చెందిన సోముడు తమ బంగారు వర్ణముతో జగమును ధరించు దేవులకు విభుడు అయ్యెను. తరువాత ఓ ద్విజులారా! బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మ విప్రులయొక్కయు, నీళ్లయొక్కయు బీజౌషధులందు రాజ్యము ఇచ్చెను. మహాతేజస్వియైన సోముడు మహా రాజ్యముతో రాజరాజుగా అభిషేకింపబడినవాడై, తపస్వి శ్రేష్ఠుడైన అతడు లోకములను సహజముగనే భావింప సాగెను. ప్రచేత సుపుత్రుడైన దక్షుడు తనపుత్రికలగు దాక్షా యణులలో మహావ్రతముకల ఇరువది ఏడుగురిని చంద్రునికి ఇచ్చెను. వారిని అందరు నక్షత్రములుగా అనగా అశ్విని మొదలగు రేవతి అంతములుగా తెలియుదురు. అచట ఆ మహారాజ్యమును పొంది సోమవంతులకు ప్రభువైన ఆ సోముడు లక్షదక్షిణలుకల రాజసూయ యాగమును చేసెను. అందు హిరణ్యగర్భుడు ఉద్గాతఅయ్యెను. బ్రహ్మ బ్రహ్మత్వమును పొందెను. భగవంతుడును ప్రభువును హరియు అయిన నారాయణుడు సదస్యుడు అయ్యెను. అతడు సనత్కుమారుడు మొదలగు ఆద్యులైన బ్రహ్మర్షులచే పరివృతుడై ఉండెను. ఓ బ్రాహ్మణులారా! సోముడు ఆ యాగమున నా సదస్యులకును బ్రహ్మర్షి ప్రముఖులకును ముల్లోకములను దక్షిణగా నిచ్చెనని మేము వింటిమి. అతనిని సిని, కుహువు, నపువు, పుష్టి, ప్రభ, వసువు, కీర్తి, ధృతి, లక్ష్మి అను తొమ్మండుగురు దేవులు సేవించిరి. తరువాత రాజసూయ అవభృథ స్నానమును జేసి, ప్రశాంతచిత్తుడై, సమస్త దేవతల చేతను ఋషులచేతను పూజింపబడినవాడై రాజాతి రాజేంద్రుల మించినవాడై దిక్కులను పది విధములుగ తపింపచేసెను.

అప్పుడు పొందనలవికానిదియు ఋషులచే స్తుతింపబడినదియు అయిన ఐశ్వర్యమును పొంది, సోముడు విలాసమతియై వినయము కోల్పోయెను. వెంటనే అంగిరసుని సుతులను అవమానించి బృహస్పతియొక్క యశస్వినియైన భార్యయగు తారను అపహరించెను. దేవతలును దేవర్షులును అడిగినను, తారను బృహస్పతికి ఈయలేదు. ఓ బ్రాహ్మణులారా! శుక్రుడు అంగిరసుడైన బృహస్పతి పార్ణ్షిని (మడమను) వెనుకనుండి గ్రహించెను. (అనగా శత్రువు అగుట వలన వెనుకనుండి కాళ్లులాగు శత్రువు అయ్యెను, దేవగురుద్వేషియైన రాక్షసగురువగుట వలన బృహస్పతికి శత్రువై వెన్నంటి ఉండెనని భావము). శివునకు పుత్రుడు శుక్రుడు. ఈతడు పూర్వము బృహస్పతి తండ్రియగు అంగిరసునకు శిష్యుడు. కాగా శుక్ర సహాధ్యాయి, అందువలన శుక్రునకు బృహస్పతి స్పర్థలో ద్వేషి. కాని శుక్రుని తండ్రియగు శివునకు మాత్రము బృహస్పతియందు తన పుత్రునకు సహాధ్యాయి అన్న స్నేహము ఉండినది. ఆ స్నేహముచేతనే రుద్రుడు తన యావద్గణములతో పినాకము అను ధనువును ధరించి బృహస్పతికి వెన్నంటి ఉన్న రక్షకుడుగా అయ్యెను. శుక్రునిచేత (చంద్రునిచేతను) (బ్రహ్మర్షులు మొదలగు (చంద్ర పక్షము) వారిపై పరమాస్త్రము (సోమాస్త్రము) ప్రయోగింపబడెను. అట్లే మహాత్ముడైన రుద్రునిచే దేవతలపై కూడ పరమాస్త్రము (బ్రహ్మ శిరోనామ కాస్త్రము) ప్రయోగింపబడెను. వాని వలన వీరు ఇరువురి కీర్తియు నశింపజేయబడినది. అచట ఆ దేవదానవుల యుద్ధము ప్రత్యక్షముగ తారకామయమై (చుక్కలురాలచేయునదై), గొప్పలోక నాశకమైన యుద్ధముగా అయ్యెను. అందు మువ్వురు దేవతలు మిగిలిరి. వారు తుషితులు అనబడిరి. వారు ఆదిదేవుడై పితామహుడైన బ్రహ్మను శరణముపొందిరి. అంత పితామహుడైన బ్రహ్మ స్వయముగ శుక్రుని, జ్యేష్ఠుడగు శంకరుని రుద్రుని యుద్ధము నుండి నివారించి తారను అంగిరసుడైన బృహస్పతికి ఇచ్చెను. విప్రుడైన బృహస్పతి చంద్ర ముఖియైన తారను గర్భవతిగా జూచి ‘నీవు గర్భమును వదులుచు లేవు, వదులుము’ అనెను. ‘ఏమైనను సరియ; నాకు సంబంధించి ఉన్న శరీరయోనియందే గర్భము ధరించవలెను అనెను. తరువాత నా తారదస్యుహంతముడైన (దస్యులను మిక్కిలి చంపు వాడైన) కుమారుని పుట్టించెను (గర్భమును జార్చెను). పుట్టిన వెంటనే భగవంతుడైన ఆ చిన్నవాడు ముండ్లదుబ్బును చేరి మండుచున్న అగ్నివలె ఉన్నవాడై దేవతల శరీరమును కప్పివైచెను. అంత, సంశయమును పొంది దేవతలు తారను ఈతడు ఎవరి పుత్రుడు? నిజముగా చెప్పుము. సోముని పుత్రుడా? లేక బృహస్పతి పుత్రుడా? అని అడిగిరి. సిగ్గుపడుచున్నదై దేవతలకు ఆమె మంచి, చెడులలో ఏదియు చెప్పలేదు. అపుడు కుమారుడైన దస్యు హంతముడు శపింపబోయెను. బ్రహ్మ ఆతనిని వారించి “చంద్రునకు గూడ సంశయము (తనవాడా! కాడా!) కలుగుచున్నది అనెను. అపుడు ఆ తార చేతులు జోడించి వరదుడై ప్రభువైన బ్రహ్మతో మహాత్ముడై కుమారుడైన దస్యుహంతముని చంద్రుని కుమారునిగా చెప్పెను. అంత సోముడు ఆకుమారుని శిరమున మూర్కొనెను. ధాతయైన ప్రజాపతి అతని బుద్ధిమంతుడైన పుత్రునకు “బుధుడు అని నామకరణము చేసెను”. సూర్యుడు పూర్వదిక్కున పొడసూపినపుడు బుధులు అతనికి ఎదురుగా లేచి నిలుతురు. ఆ సమయమున రాజపుత్రికయైన తార పుత్రుని బుధుని కనెను. అతని పుత్రుడు మహా తేజస్వియై ఇలా పుత్రుడైన పురూరవుడు. ఆతనికి ఊర్వశీయందు ఆరుగురు మహౌజస్కులు పుత్రులు కలిగిరి. మహాశయుడైన అత్రి అతని పాపములను శమింపచేసెను. చంద్రుడు రాజయక్ష్మనుండి ముక్తుడై కాంతితో అన్ని విధములుగ ప్రకాశించెను. ఓ బ్రాహ్మణోత్తములారా! సోముని జన్మ చెప్పబడినది. ఆతని వంశమును గురించి చెప్పెద వినుడు. ధనమును ఇచ్చునది, ఆరోగ్యమును ఇచ్చునది, ఆయుష్యమును ఇచ్చునది, పుణ్యమైనది, పాపముల శుద్ధి చేయునదియు అయిన జన్మను గురించి వినినంతనే సర్వ పాపముల నుండి విముక్తుడు అగును.