వాయు మహా పురాణము
బ్రాహ్మణ పరీక్ష
ఋషులు ఇట్లు అనిరి:
ఓ బుద్ధిమంతుడవైన సూతుడా! ఋషులచే చెప్పబడిన శ్రాద్ధకల్పమును వింటిమి. అది మిక్కిలి విశేష విస్తరముగ చెప్పబడినది. ఓ మహాప్రాజ్ఞ! ఆ ఋషికి సంబంధించిన మిగిలిన విషయమును యథా మతముగా చెప్పుము.
సూతుడు ఇట్లు అనెను:
ఓ బ్రాహ్మణులారా! శ్రాద్ధమును గూర్చి ఆ ఋషియొక్క మతమును విస్తరముగ చెప్పెదను వినుడు. నాచే నీ వరకే శ్రాద్ధము, శ్రాద్ధకర్మలయందు విధియు చెప్పబడినవి. ఇప్పుడు శ్రాద్ధ బ్రాహ్మణులను గూర్చి వరుసగా చెప్పెదను.
బ్రాహ్మణులు ఎప్పుడును మంచివారని కాని, చెడువారనికాని విచారింపదగరు. ఇది పవిత్రమైనది. ఉత్తమమైనది. కాని దైవకార్యమునను పితృ కార్యమునను దోషములు కనబడిన బ్రాహ్మణుని, సజ్జనులచే వదిలిపెట్టబడినవానిని, అతి ప్రయత్నముతో ఇంటినుండి వెడలగొట్టవలెను. పండితుడు అర్హుడా అని తెలియని బ్రాహ్మణుని శ్రాద్ధమున(కు) అర్హుడా అని పరీక్షింపవలెను. కారణము సిద్ధులు బ్రాహ్మణ రూపమున భూమిలో చరింతురు గదా! కావున వచ్చుచున్న అతిథికి చేతులు జోడించి ఎదురేగవలెను. పాదోదకముతోను, పాదాభ్యంజన భోజనములతోను పూజింపవలెను. అట్లే ఈ యోగేశ్వరులైన దేవతలు కూడ ప్రజలను ధర్మముతో పాలించుచు, అనేక రూపములతో సాగర పర్యంతమైన భూమిలో చరింతురు. నరుడు అతిథియైన బ్రాహ్మణుని పూజించి వ్యంజనములను, భక్ష్యములను, పండ్లను ఈయవలెను. పాలతో అతిథి పూజచేసిన అగ్నిష్టోమఫలము లభించును. తేనెతో అతిరాత్ర హోమఫలము సిద్ధించును. శ్రద్ధవహించి విద్వాంసుడైన నరుడు అతిథిని కోరినవాని అన్నింటితో భుజింపజేసినచో తాను కోరినవన్ని సిద్ధించును.వాడు సర్వార్థముల ఇచ్చువాడై, సర్వవిప్రులకు ఆతిథ్యము ఇచ్చువాడై సర్వమేధ యజ్ఞము యొక్కఫలమును నిత్యము పొందును.
శ్రాద్ధమునకాని, దైవకర్మయందుకాని, అతిథిని పిలిచి అవమానించిన వానిని - హోతపరమైన వసువునువోలె దేవతలు నిరసింతురు. లోకానుగ్రహకారణమున దేవతలును, పితరులును, అగ్నియు ఆ అతిథులైన బ్రాహ్మణులను ఆవేశించి భుజింతురు. అపూజితులైనచో వారు దహింతురు. పూజితులైనచో కోరికలను తీర్తురు. కావున అతిథులను ఎల్లప్పుడు తమసర్వస్వముతోకూడ పూజింపవలెను. వానప్రస్థుడు, గృహస్థుడు, గృహమునకు వచ్చినవాడును, దుఃఖితులైన బాలురు, యతియు - వీరిని అతిథులనుగా తెలియవలెను. అభ్యాగతుడు యాచకుడగును. అతిథి అయాచకుడు అగును. అతిథికి అతిథి శ్రేష్ఠుడు. ఆ అతిథి యోగము అనబడును. ఘోరుడు గానివాడు, సంకీర్ణుడు కానివాడు, విద్యావంతుడు, విశేషములను తెలియనివాడు, సంతుడుగానివాడు, సంపన్నుడుకాని వాడు, సేవకుడుగానివాడు ఎప్పటికిని తిరుగు వాడును - అతిథి. యజ్ఞ ఫలమును గోరువాడు దప్పిగొన్నవాడును, అలసినవాడును, కళ్లు తిరిగినవాడును, మిక్కిలి ఆకలిగొన్నవాడును అయిన వానిని సత్కరించి అన్నాదులు ఒసంగవలెను. శివుని కొండలందు ఎక్కియు, పుణ్యయైన సరస్వతీనదిని పొందియు, సముద్రమును చేరు గంగా నదిని పొందియు మానవుడు పాప విముక్తుడగును. గంగాదేవి మహానది. హిమవత్పర్వతమున పుట్టిన నదులు, తక్కిన ఋషి పూజితములైన నదులు, సరస్సులతో, తీర్థములతో గుర్తింపతగిన నదులు, క్రొత్తగా ప్రవహించు నదులు. ఈ నదులకు వెళ్లి స్నానాదులు చేసినచో పాప విముక్తుడగును. స్వర్గమున నిత్యము పూజింపబడును.
బ్రాహ్మణునకు విశేషముగా మృత సూతకము పది రాత్రులు అశౌచము చెప్పబడినది. క్షత్రియ విషయమున పండ్రెండు రాత్రులు, వైశ్యునకు పదియైదు దినములు. శూద్రుడు నెలకు అశౌచమునుండి శుద్ధినందును. రజస్వలయైన స్త్రీ అన్ని జాతులలోను మూడు రాత్రులకు శుద్ధినందును. రజస్వలాస్త్రీని, బాలెంతరాలిని, కుక్కను మంగలవానిని, మాలవానిని, పీనుగపైని హారములను - తాకినచో శౌచము విధింపబడినది. కట్టుబట్టలతో స్నానము చేసి పండ్రెండు మట్టిపూతలతో స్నానము చేసిన శుద్ధినందును. సంభోగమునందుగూడ ఇదియే శౌచపద్ధతి. తొమ్మిది మట్టిపూతలు, చేతులను మట్టితో గడిగికొని నరుడు శౌచవిధిని జేయవలెను. నీటితో చేతులుగడిగి, మట్టితో మరల స్నానము చేసి, గుహ్యస్థానమున మట్టిని, మరల రెండుమారులు పూసి కడుగవలెను. ఈ విధముగా సర్వజాతులందు శౌచవిధి నిర్వహించవలెను. మూడు పర్యాయములు మట్టిని పూసికొని కాలుచేతులను కడిగికొనవలెను. ఇది అరణ్యమైన శౌచము.
ఈ తరువాత గ్రామ్య శౌచమును చెప్పెదను. పాదముల శుద్ధికై మూడు మృత్తులే! హస్తముల శుద్ధికైగూడ మూడు మృత్తులే! (మృత్తు ఒక నియత పరిమాణము గల మట్టి). అమేధ్యమున (అపవిత్రమున) హస్తాదుల విభాగమును బట్టి పదిహేను (మృత్తులు). చివర నీటితో కడుగుటచే శుద్ధి అగును. మెడనుగాని, తలనుగాని కప్పుకొని రాజమార్గమున పాదములతో ఉన్నను పాదముల శౌచముచేసికొనక అచమనము చేసినను శుద్ధిని పొందడు. అశుచియే అగును. ప్రక్షాళనము చేసికొని, పాత్రను అచటనుంచి, ఆచమనముచేసి మరల అభ్యుక్షణము (చేతిని బోర్లగానుంచి నీటిని చల్లుట) చేయవలెను. (చేతిని వెల్లకిలగా నుంచి నీటిని జల్లుట ప్రోక్షణము. చేతిని కొద్దిగ అడ్డముగా పంచి నీటిని చల్లుట అవోక్షణము.) వేఱక వస్తువునకు కూడ అట్లే మరల అభ్యుక్షణము చేయవలెను. పూలు మొదలగు వానికిని, గడ్డి పోచలకును ప్రోక్షణము చేయవలెను. హవిస్సులకును, తీసివేసిన పదార్థములుగల ద్రవ్యములకును అచట నుంచి అభ్యుక్షణము చేయవలెను. శ్రాద్ధమునను, దైవమునను ప్రోక్షితమైన దానిని కొద్దిగా దీసికొనవలెను. వేదియందు ఉత్తరముగా తీసికొనవలెను, దక్షిణముగా విసర్జింపవలెను. వ్యతిరేకముగా చేసినచో పితృకార్యముకాని లేక దైవకార్యముకాని విచ్ఛిన్నము అగును. కుడిచేతితో దక్షిణవేదిని ఆలేఖింపవలెను. దేవతలకు చేతులతోను, పితరులకు చేతులతో గాక వికరముగా (బదులుగా దేనితోనైనను) ఆలేఖించిన శుభము. క్షుభితునియందు స్వప్నమునందును, మూత్ర - పురీషములందును, బయల్పడిన ఉమ్మియందును, భుజించి కప్పుకొనక ఉండునపుడు, ఉమ్మిని తాకినపుడు, పాదములు తడిపినపుడు, వదిలిపెట్టబడినవాని మంచిమాటయందు, సమస్త సందేహములందు, జుట్టుముడి విడిచినపుడును, నియమము గలవానికి శౌచము ఉండదు. యజ్ఞోపవీతము లేక అజ్ఞానమున ఆచమనము చేసినచో దంతముతో పెదవితాకినప్పుడు, మాలవానిని చూచినపుడు, దంతములలో చిక్కిన దానిని నాలుకతో తాకినపుడు, వ్రేళ్లతో శబ్దముచేసి ప్రణతుడై చూచువాడును, అశుచి అగును. అజ్ఞానమున ధర్మమునందుండి ఆచమనము చేసినను అశుచి అగును. శుచియైన ప్రదేశమున ఈశాన్య దిక్కునకు మొగమై కూర్చుండవలెను. కాళ్లు చేతులు కడుగుకొని మోకాళ్ల మధ్యన చేతులు కలవాడై ఆచమనము చేయవలెను. పరిశుద్ధుడై యేకాగ్రచిత్తుడై నిర్మలమైన నీటిని మూడు మారులు త్రాగవలెను. రెండు మారులే మార్జనమును (నీళ్లు చల్లుకొనుట - తుడుచుకొనుట) జేయవలెను. తరువాత ఒక్కమారు అధ్యుక్షణము (అరచేతిని తల్లక్రిందుగాచేసి నీళ్లు జల్లుట) చేయవలెను. ఇంద్రియములను, తలను, తనను, కాలు సేతులను అట్లే అభ్యుక్షణము చేయవలెను. ఇట్లే అతనికి ఆచమనము, వేదములు, యజ్ఞములు, తపములును, దానములు, బ్రహ్మచర్యమును అట్లే సఫలములు అగును. అజ్ఞానమున ఆచమనము చేయకయే క్రియను (యజ్ఞాది క్రియను) చేయువాడు నాస్తికుడు అగును. అతనికి ఈ క్రియలన్నియు వ్యర్థములగును. సంశయములేదు. వాక్కు చేతను భావముచేతను శుద్ధమైనదియు దుష్టముగాదు నిందితము గాదు. వీనిని పవిత్రములుగా తెలియవలెను. వీనికి విరుద్ధమైనది దుష్టము. ఎప్పుడును బ్రాహ్మణుడు బాధితుడుగా ఏమాత్రము చెప్పబడరాదు. సత్కరించి అతనికి ఇచ్చినది యూపములేని యజ్ఞము అనబడినది. కృశవృత్తిగలవానికి, యాచకుడుగాని వానికి, ఏకాంతముగ ఉండి స్వభావము గలవానికి, సిగ్గుగలవానికి ఎప్పుడును శ్రాద్ధమున మాడని అన్నమును, వండిన అన్నమును భుజింప చేయవలె. మాలవారికి శ్రాద్ధాన్నము పెట్టువాడు బ్రహ్మహత్య చేసిన వాడును, దురాత్ముడును అగును. శ్రాద్ధమున ఒకేపంక్తిలో విషమముగా బ్రాహ్మణులను (భోక్తలను) భుజింపచేయువాడు నూరుజన్మలందినను పాపవిముక్తుడుకాడు. నియుక్తుడుగాని, అనియుక్తుడుగాని పంక్తిచేత దుష్కృతము హరించును. ఇష్టాపూర్తములు నశించును. (యజ్ఞాదులు ఇష్టములు. బావులు, చెఱువులు త్రవ్వించుట మొదలగునవి పూర్తములు).
యతి, బ్రాహ్మణులు అందఱిలోను శ్రాద్ధ ఉత్సవమున ముందుగా పూజింప దగినవాడు. మహాభారతేతిహాసమే ఐదవదిగాగల నాల్గు వేదములు చదివిన బ్రాహ్మణోత్తముడును పూజింప తగినవాడు. ఆ తరువాత బాగుగా తెలిసికొని యోగ్యతను అనుసరించి శ్రాద్ధమున బ్రాహ్మణుని నియోగింపవలెను. ఆ తరువాత (చతుర్వేది లేనిచో) మూడు వేదములు చదివినవాడు, అతడు లేనిచో రెండు వేదములు చదివినవానిని, అతడు లేనిచో ఒక వేదము చదివిన వానిని, అతడు లేనిచో న్యాయశాస్త్రమును చదివిన వానిని శ్రాద్ధ బ్రాహ్మణునిగా నియోగింపవలెను. శ్రాద్ధభోక్తల పంక్తియొక్క పవిత్రతకై వారిని చెప్పుచున్నాను వినుడు. పూర్వము చెప్పబడినవారందరు పూర్వానుక్రమముగను, షడంగియు (శిక్షా, వ్యాకరణ, చ్ఛందో, నిరుక్త, జ్యోతిషములు చదివినవాడు) యోగియు, అన్నితంత్రములు తెలిసినవాడును, యాయవరుడు (ఔషధజ్ఞాని లేక ఋషి)ని భోజ్యపంక్తిలో పవిత్రులు. పదునెనిమిది విద్యలలో ఒక విద్యయందు పారుగుడైనవాడును భోజ్య పంక్తి పావనుడే. ఉన్నది ఉన్నట్లు నడుచుకొను వారందరును పంక్తి పావనులే. త్రిణాచికేతుడు (నాచికేతాగ్నిని ఉపాసించినవాడు) త్రైవిద్యుడు (మూడు విద్యలు గలవాడు) ధర్మములను చదివినవాడు అయిన బ్రాహ్మణుడు, బార్హస్పత్య (ధర్మ) శాస్త్ర పారంగతుడు అగు బ్రాహ్మణుడు, వీరు అందరును భోజ్యపంక్తి పావనులుగా చెప్పబడిరి. శ్రాద్ధభోక్తగా పిలువబడి స్త్రీని సేవించినవాని పితరులువాని రేతస్సున పరుందురు. శ్రాద్ధమును జేసికొని శ్రాద్ధభోజనము జేసికొని మైథునమును సేవించినవాని పితరులు వాని రేతస్సున ఉందురు. ఇట సంశయములేదు. కావున అతిథికి శ్రద్ధ దానము చేయవలెను. బ్రహ్మచారిని భుజింపజేయవలెను. ధ్యాననిష్ఠునకు దయామయునకు శ్రద్ధ దానము చేయవలెను. ధార్మికుని, యతిని, వాలఖిల్యులను (వాలఖిల్యులవలె సూర్యోపాసకులను) శ్రాద్ధ కర్మలో భుజింపచేయవలెను. వానప్రస్థునకు ఉపకరించువాడు పూజా మాత్రముతో సంతుష్టుడు అగును. శ్రాద్ధమున - గృహస్థుని భుజింపచేసిన విశ్వేదేవులు (సమస్త దేవులు) పూజితులు అగుదురు. వానప్రస్థుని భోజనమున ఋషులు పూజితులు అగుదురు. వాలఖిల్య భోజనమున ఇంద్రుడు పూజితుడు అగును. యతులను పూజించిన సాక్షాత్తు బ్రహ్మనే పూజించిన వాడును అగును. ఐదాశ్రమములు పావనములు. ఉపధలచే (పరీక్షలచే) ఆశ్రమములు కావు. శ్రాద్ధమునను దైవమునను నాలుగు ఆశ్రమములు పూజ్యములు. నాలుగు ఆశ్రమముల బాహ్యులైనవారికి శ్రాద్ధదానముచేయరాదు. నాలుగు ఆశ్రమములకు బాహ్యుడై ఉన్నవాడు ఆకలిగా ఉన్నవాడును యతిగాక మోక్షవాదియు, ఈ ఇరువురు భోజ్య పంక్తి దూష్యులు. వ్యర్థముగా తల గొరిగించుకొన్నవాడు, వ్యర్థముగా జడలు పెంచుకొన్నవాడు, కపటులు అందరును శ్రాద్ధభోజ్యపంక్తికి దూష్యులు. నిర్ఘృణులను (కఠినులను) భిన్నమైన వృత్తముకలవారిని, సర్వభక్షులను (భక్ష్యా భక్ష్యములను అన్నింటిని తినువారిని), శ్రాద్ధ భోజ్యపంక్తికి వదిలివేయవలెను. శిల్పులు మొదలగువారిని, అనాచారులను, సర్వవేదములచే బహిష్కరింపబడినవారిని, గాయకులను, దేవపూజాది వృత్తిగలవారిని, హవ్య - కవ్యముల విషయమున వదిలివేయవలెను. బ్రాహ్మణుల విషయములో హాని చేసిన వానిని శ్రాద్ధ కర్మలో వదిలివేయవలెను. వీరిలో ఉన్నవాడు సమస్తవర్ణమును చేరును. శూద్రునితో సహభుజించువారందరు పంక్తి దూష్యులు. చంపుట, శక్తిని పూర్తిగా చంపుట, కృషి (వ్యవసాయము), వ్యాపారము, పశుపాలనము గురువు గానివాని సేవించుట, రహస్యముగా చేయరాని పనిచేయుట - ఇవి బ్రాహ్మణునికి పనికి రావు. నిత్యము జ్ఞానులై, ధ్యానులైన బ్రాహ్మణులు పూజ్యులు. కాని మిథ్యాసంకల్పులు, దుర్వృత్తులైన అందరు బ్రాహ్మణులును, విథ్యాతత్త్వ విదులు ఉపపాతకములతో గూడినవారు, విశేషించి పాతకములతో కూడిన వారును, వేదమున నియోగము (ఉద్యోగము) ఇచ్చువారు, లోభ - మోహ ఫలములను కోరువారును, వేదము (విద్య)ను అమ్ముకొనువారు, శ్రాద్ధకర్మలో వదలబడినవారు, బ్రాహ్మణునికి పనికిరావు. వేదములకు నియోగము (ఉద్యోగము) లేదు. ఆ విధముగ వేదములకు నియోగించువాడుపాపి. ఆ నియోగఫలము (వేతనము) భుజించువాడు ముఖ్యమైన వేదఫలమునుండి భ్రష్టుడగును. ఆ వేతనము ఇచ్చువాడు దానఫలము నుండి భ్రష్టుడగును. (ఆ విధముగ వేదము చదువు వానికి వేద ఫలమురాదు. వేదవిద్యా దానము జేయువానికి దానఫలము రాదు). ధనము తీసికొని వేదము చెప్పువాడును, ధనమిచ్చి వేదము చదువువాడును వేదమును అమ్ముటచేతను కొనుటచేతను శ్రాద్ధమునకు బ్రాహ్మణులుగా ఉండదగరు. జీవనమునకై వేదము అమ్మువారు, కొనువారును మిక్కిలి నిందితులు. ఇది వైశ్యుని యొక్క వృత్తి, బ్రాహ్మణునకిది పాతకము. వేదవేత్తలపై కాని, వేదములపైకాని ఆధారపడి జీవించువారు ఇరువురును శ్రాద్ధమునకు తగరు. కూతురు మొగుడు కూడ శ్రాద్ధమునకు తగడు. వ్యర్థముగా భార్యను భోగించువాడును, అధ్వరమున వ్యర్థముగా యాగము చేయువాడును ఇరువురును శ్రాద్ధభోక్తకు తగరు. నాస్తిక బ్రాహ్మణుడును తగడు. తన కొఱకు అన్నమును వండుకొనువాడును, దేవ - అతిథులకు అన్నమును దానము చేయనివాడును ఇరువురును శ్రాద్ధ భోక్తకు తగరు. వారు పతితులై బ్రహ్మరాక్షసులు అగుదురు. ఎవరి స్త్రీలు, రాత్రియందే ఆసక్తులో! ఎవరు పరస్త్రీల అందు ఆసక్తులో! ఎవరు అర్థ, కామములందు మాత్రమే ఆసక్తులో! వారిని శ్రాద్ధమున భుజింపజేయరాదు. వర్ణాశ్రమ ధర్మములకును, శ్రాద్ధ కర్మకును విరోధులైన వారును, దొంగయును, అందరిని యజ్ఞము చేయించువాడును, వీరందరును శ్రాద్ధ భోజనపంక్తికి నింద్యులు. పందివలె తినువాడును, అరచేతితో తినువాడును, వామముగా (ఎడముగా) తినువాడును తిన్న అన్నము పితరులకు చెందదు. స్త్రీకిని, శూద్రునకును, దగ్గరికిరానివానికి శ్రాద్ధోఛ్ఛిష్టమును ఇప్పింపరాదు. రాగ మోహములవలన ఇట్లు ఇచ్చినచో అది ఎప్పుడును పితరులకు చెందదు. కావున శ్రాద్ధ కర్మలో నేయి, పెరుగు తక్క ఉచ్ఛిష్టములైన అన్నాదులను ఎవరికిని ఈయ రాదు. శిష్యుని విషయమునగాని పుత్రుని విషయమున గాని వేరుగాదు. శ్రాద్ధమున అనుచ్ఛిష్టమునే విశేషించి అట్టి అన్నమునే ఈయవలెను. పుష్ప, మూల, -ఫలములతోను, అన్నము వల్ల నుపితరులు తుష్టిని పొందుదురు. అన్నాదులు పవిత్రములుగా ఉన్నంత వరకు అవి చల్లారనంత వరకును, భోక్త వానిని మాటాడకుండ తినునంత వరకను పితరులు ఆ అన్నాదులు భుజింతురు. దానము, ప్రతిగ్రహము, హోమము, భోజనము, బలియు, అంగుష్ఠముతో గలిపి చేయవలెను. అపుడు అవి అసురులకు పోవు. ఇవియే అన్నియును విశేషించి దానాదులును శ్రాద్ధమున చేయదగినవి తగనివియును. మోకాళ్ల మధ్యలో (చేతులుంచి) ఆచమనము చేయుట అన్నింటికిని సమానము. ముండులను (తలగొరిగి కొన్న సన్న్యాసులను), జడలను, కాషాయ వస్త్రములను ధరించిన వానిని శ్రాద్ధకాలమున కూడ రానీయరాదు. శిఖలు గలవారికిని, త్రిదండి సన్న్యాసులనుగాని ప్రయత్నపూర్వకముగా శ్రాద్ధమున భోక్తలుగా జేయవలెను. నిత్యమున వ్రతమునందున్న వారును, జ్ఞానులును, ధ్యానులును, దేవభక్తులైన మహాత్ములును దర్శనమాత్రమున శ్రాద్ధమును పవిత్రము చేయుదురు. ఈ ముల్లోకములు అన్నియు యోగేశ్వరులచే ఎల్లప్పుడును వ్యాపించి ఉన్నవి. కావున జగత్తులో ఉన్నయే కొంచెమైనను సమస్తమునైనను జూపుదురు. వ్యక్తావ్యక్తమును వశపరచుకొని సర్వమునకును పరమై సంసద్రూపమై చూడబడినది! మహాత్ములకు సదసద్రూపమైనది. మహాత్ములయొక్క సర్వజ్ఞానములును మోక్షాదులును చూడబడినవి. కావున వానిలో ఎల్లప్పుడు ఆసక్తుడైనవాడు అనుత్తమమైన (దేనికంటే ఉత్తమమైనది ఏదియు లేదో ఆ పరమపద రూపమైన) అశుభమును పొందును. ఋక్కులను తెలిసినవాడు వేదములు తెలియును. యజుస్సులను తెలిసినవాడు యజ్ఞములను తెలుసు కొనును. సామములను తెలిసినవాడు బ్రహ్మను తెలుసుకొనును. మానసమును తెలిసినవాడు సర్వము తెలియును.