శౌచాచార లక్షణము

వాయువు పలికెను:

ఆపైన శౌచాచారము యొక్క లక్షణమును చెప్పబోవుచున్నాను. దానిని ఆచరించి శుద్ధాత్ముడై మరణించిన తరువాత స్వర్గమునే పొందగలడు. జలమును కోరువాడు మునుల యొక్క శౌచములకు (పవిత్రతలకు) ఉత్తమ స్థానమగును.వాడు శౌచముల విషయములలో అప్రమత్తుడుగా ఉండవలెను. అట్టి ముని నాశమును పొందడు. మానవమానములు అను ఈ రెండే విష - అమృతములని అందురు. అందులో అవమానము విషము మానము అమృతము. వానిలో అప్రమత్తుడైన ముని నాశమును పొందడు. గురువునకు ప్రియమై, హితమైన కార్యమునకు పూనుకొన్నవాడు, సంవత్సరము నుండి గురువును సేవింపవలెను. అతడు అహింసా సత్య ఆస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహరూపములైన యమములోను, శౌచ సంతోష, తపస్, స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన రూపములైన నియమములలోను, ఎల్లప్పుడు అప్రమత్తుడై ఉండవలెను. గురువు దగ్గర ఉత్తమ జ్ఞానమును రాబట్టవలెను. ఆ తరువాత గురువుచే అనుజ్ఞాతుడై అనుమతిని పొందినవాడై ధర్మమునకు విరోధము కాకుండా ఈ భూమినందు అంతయు తిరుగవలెను.

కన్నులు చూచి ఇది పవిత్రమైనది అని చెప్పిన మార్గముననే పోవలెను. వస్త్రముతో వడియ బోసిన పవిత్రమైన నీటినే త్రాగవలెను. అబద్ధము ఏ మాత్రము లేక సత్యముచే పవిత్రమైన మాటనే పలుకవలెను. ఇది ధర్మానుశాసనము, యోగము తెలిసినవాడు ఎక్కడనైనను, శ్రద్ధ యజ్ఞములతో అతిథ్యమును స్వీకరింపరాదు. ఈ విధముగా ఆచరించినచో యోగి అహింసకుడగును. విచారము, పొగలేని అగ్ని ఉన్నచోట, పొగులు లేనిచోట, భక్తజనము ఉన్నచోట అంతటను బుద్ధిమంతుడైన యోగి చలింపవలెను. కాని ప్రతి నిత్యముగా పైచోటులలో చరింపరాదు. సజ్జనుల ధర్మమును నిందింపక, జనులు తనను అవమానింపని విధమున, అట్లే తిరస్కరింపని విధమునను యుక్తుడైన యోగి భిక్షాటనము చేయవలెను. యోగి వేద విహితాచారము గల గృహస్థుల ఇండ్లలో భిక్షాటన చేయవలెను. ఇది యోగ శ్రేష్ఠమైన పరమోత్కృష్టమైన వృత్తి అని ఉపదేశింపబడినది. ఆ పైన మృదు స్వభావము గలవారు, వైదికాచారములందు శ్రద్ధగలవారు, ఇంద్రియ నిగ్రహము గలవారు (కామ క్రోధాలకు వశముకానివారు) వేదశాస్త్రాధ్యయన సంపన్నులు, మహాత్ములు అయిన గృహస్థుల ఇండ్లలో యోగియైన బ్రాహ్మణుడు భిక్షాచరణము చేయవలెను. ఆపైన దుష్టులు గాని పతితులు (భ్రష్టులు) గాని, కానట్టివారి ఇండ్లలో భిక్షాచరణము మిక్కిలి నీచవృత్తి అనబడి యవాగువులు (జవలు), మజ్జిగ, పాలు అలచందలు, ఫలములు కంద మూలములు, వండనివి, తెలకపిండి వీనిని భిక్షలో పొందవలెను. నాచే ఈ పై చెప్పినవి యోగులకు సిద్ధులకు వృద్ధి చేయునట్టి ఆహారము, అది సిద్ధించనిచో భిక్షాచరణము శ్రేష్ఠమైనది.

దర్భ చివరి భాగముతో నీటి బిందువును నెల నెలకు త్రాగినవాడు, న్యాయముగా భిక్షను ఆచరించువాడు పూర్వము చెప్పిన వానికంటె విశిష్టుడు. సమస్త యోగులకును చాంద్రాయణ వ్రతము శ్రేష్ఠము. ఒకటి, రెండు, మూడు నాలుగుగాని యథాశక్తిగా చాంద్రాయణ వ్రతమును చేయవలెను. దొంగతనము చేయకుండుట, బ్రహ్మచర్యము, లోభము లేకుండుట, త్యాగము, ఇవి భిక్షువులకు వ్రతములు, అహింస, పరమార్థమును కోరుట, కోపము లేకుండుట, గురుసేవ, శౌచము, తేలికపాటి ఆహారము (అల్పాహారము) తీసికొనుట, నిత్యము స్వవేదాధ్యయనము ఇవి నియమములు.

మనుష్యుడు బీజము జన్మ కారణమయినవాడు, త్రిగుణములు శరీరమైనవాడు, కర్మలచే బద్దుడును అగును. అడవిలో ఏనుగునకు వలె మనుష్యులకు సైతము కర్మబంధము విధింపబడును. అంకుశముచేత ఏనుగు తన స్వాతంత్య్రము నుండి నివారింపబడి మావటివానికి వశమైననాడు చెప్పిన పనులెల్ల చేయును. అట్లే మనుష్యుడు గూడ కర్మబద్ధుడై స్వాతంత్ర్యము తొలగి వెంటనే ప్రాపంచిక కర్మ చేయుచుండును. కావున శుద్ధమైన జ్ఞానముచే దహింపబడిన జన్మ కారణ బీజము గలవాడై, పాపములు లేనివాడై, బంధములు అన్నియు వదలినవాడై, శాంతుడైన యెడల మనుషుడు ముక్తుడు అనబడును.

వేదములచే స్తుతింపదగినవి సమస్త యజ్ఞక్రియలు. యజ్ఞమునందు జ్ఞానులు జపించి నది మిక్కిలి శ్రేష్ఠము. జ్ఞానము వలన సంగరాగములు లేని ధ్యానము గలుగును. అది లభించినచో శాశ్వతుడు లభించును. దమము, శమము, అకల్మషత్వము, సత్యము, కల్మషము లేమి, మౌనము, అఖిల ప్రాణులయందు కౌటిల్యము లేమి వీనిని జ్ఞానముచే విశుద్ధమైన సత్త్వము (బలము) గలవారు అతీంద్రియ జ్ఞానమునుగాను ఆర్జవముగాను చెప్పుదురు. సమాహితుడు, బ్రహ్మపరుడు, ప్రమాదము చెందనివాడు. శుచి, ఆత్మయందే రతుడైనవాడు, ఇంద్రియములు జయించినవాడు ఈ యోగమును పొందుదురు. అనిందితులును మలినము లేనివారునైన మునులు గూడ నీ యోగమును పొందుదురు.