శివపురవర్ణనము

వాయువు:

అసాధారణ వృత్తులుగల హుతశేషాది బ్రాహ్మణులతోను, చూర్ణములోని సూక్ష్మములను కూడ (పరమాణువులను కూడ చూచునట్టి ధర్మ వైశేషికులతోను, దేవతలతోనుకూడ, మహర్లోకమున నివసించువారు ఉందురు. ఈ మనువులు పదు నలుగురుగను కీర్తిని పెంచువారుగను పండితులు చెప్పుదురు. గడచినవారును ప్రస్తుతము ఉన్నవారును, భవిష్యత్తులో రాబోవువారును ఋషులతో, దేవతలతో, గంధర్వ రాక్షసులతోను, మన్వంతరాధికారములలో ఇట మరలమరల పుట్టుదురు. దేవతలు, సప్తర్షులు, మనువులు, పితరు లును, అందరును క్రమమును మించిన సురులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులతోపాటు మహర్లోకమును ఆశ్రయింతురు. సత్యము అచరించువారును, సమర్థులును, శ్రద్ధగల వారును, మదములేనివారును, శ్రౌతస్మార్త ధర్మములందును వర్ణాశ్రమ ధర్మములందును నిలచినవారును అగు అత్రిజాతీయులచేత ఆ దేవతలు మన్వంతర క్షయము వరకు అధికారము లేనివారగుదురు అని చెప్పెను.

ఋషులు:

“ఓ వాయు ప్రభో! మహర్లోకమని నీవు చెప్పిన లోకమునందు కర్తవ్యమేమి? దానిని గూర్చి చెప్పుము. ఎంతవరకు అలోకములు దహింపబడక ఉండినవై అనేకులచే అధిష్ఠితములు అగునో ఈ విషయమును ప్రేమతో మాకు చెప్పుము. నీవే అందున్నది ఉన్నట్లు తెలియుదువు” అని అడిగిరి. ఈ విధముగా వినయవంతులైన మునులు అడుగగనే తత్త్వవేత్త అయిన వాయువున్న సత్యమును మధుర వాక్కులతో చెప్పెను.

వాయువు:

మానవులు ఉండు లోకములు అనబడు స్థానములు పదునాలుగని ఋషులు చెప్పిరి. వానిలో ఏడు కృతములనియు మరియేడు అకృతములని అందురు. ఇచటి లోకములుగా భూరాది లోకములు - కృతములు అనబడినవి. ప్రాకృతములైన (ప్రకృతి నిర్మితములైన) ఏడు స్థానములు అకృతములు. స్థానములు స్థానులతో (స్థానవాసులతో) బాటు కృతములని నిబంధనము, పృథివి, అంతరిక్షము, దివ్యము, మహస్సు, ఈ నాలుగు స్థానములు అర్జవకములు అనబడును. ఇవి క్షయ - వృద్ధులతో కూడుకొన్నవి. అట్లు క్షయ వృద్ధులతో ఉక్తములుకాని వానినిగూర్చి చెప్పెదను. అవి నైమిత్తికములు. భూత సంప్లవము వఱకును ఉండును. జనోలోకము, తపోలోకము, సత్యలోకము - ఈ మూడు స్థానములు ఐకాంతికములు. ఇచట ప్రసంయమము (ప్రళయము)వఱకు ప్రాణులుండును. ఇక వ్యక్తములైన ఏడు స్థానములను చెప్పెదను. వానిలో మొదటిది భూర్లోకము. రెండవది భువర్లోకము, మూడవది స్వర్లోకము, నాలుగవది మహర్లోకము, ఐదవది జనలోకము, ఆఱవది తపో లోకము, ఏడవది సత్యలోకము. ఆ తరువాత నిరాలోకము. బ్రహ్మ పూర్వము భూః - అనగనే భూలోకము ఏర్పడెను. ‘భువః’ అనగనే భువర్లోకము, దాని నుండి అంతరిక్షము ఏర్పడినవి. ‘స్వః’ అనగనే స్వర్గము ఏర్పడెను. బ్రహ్మ ఈ మాటలతో బ్రహ్మ లోకమును ఏర్పరచెను. తరువాత, భూమి పార్థివలోకము భూమినుండి అంతరిక్షము అనబడెను. స్వర్లోకము దివము అని పురాణమున నిశ్చయము నందెను. భూతమునకు (భూమికి) అధిపతి అగ్ని. అందువలన అగ్ని భూతపతి అనబడెను. భువర్లోకమునకు వాయువు అధిపతి. దాన వాయువు భువఃపతి. దివమునకు సూర్యుడు అధిపతిగాన సూర్యుడు దివస్పతి. బ్రహ్మ ‘మహః’ అనగానే మహర్లోకము ఏర్పడెను. పోయిన అధికారములుకల దేవతలకు అచట క్షయము. జనమనునది ఐదవ లోకము దాని నుండి జనులు పుట్టుదురు. ఆ స్వాయంభువాది ప్రజలు జనించుట వలన ‘జన’ లోకమైనది. ఆ లోకము కల్పదగ్ధము కాగా పూర్వము చెప్పబడిన స్వాయంభువాదులు తపమున (తపోలోకమున) కూర్చుందురు. ఋభువు, సనత్కుమారాదులను ఊర్ధ్వరేతస్కులు ఆ తపోలోకమున ఉందురు. వారు అచట తపస్సుతో భావితాత్ములై ఉందురు కావున అది తపోలోకము అనబడినది. సత్యము అనునది బ్రహ్మయొక్క (వాచకమైన) శబ్దము. సత్తా మాత్రమును చెప్పునది అందురు. అందువలన బ్రహ్మలోకము, సత్యలోకము ఏడవ భాస్కరుడు (సూర్యుడు), గంధర్వులు, అప్సరసలు, యక్షులు, గుహ్యకులు, రాక్షసులు, సర్వభూత పిశాచులు మనుష్యులతో కూడ నాగులును సమస్త దేవతలును భూమియందు నివసించువారు. మరుతులు, మాతరిశ్వులు, రుద్రులు (రుద్ర దేవులు), అశ్వినులు అంతరిక్షమున ఉండని వారై భువర్లోక వాసులైన దివౌకసులు (స్వర్గ వాసులు). ఆదిత్యులు, ఋభువులు, విశ్వులు, సాధ్యులు, పితరులు, ఋషులు, అంగిరసులను భువర్లోకమును ఆశ్రయించిరి. ఈ విమానములలో పయనించు దేవతలు తారాగ్రహ నివాసులు - అను ఈ బ్రహ్మవచనమున పుట్టిన లోకములు క్రమముగా చెప్పబడినవి. అవి భూర్లోకము మొదలుకొని మహర్లోకాంతము వరకున్న లోకములు అనబడినవి. తన్మాత్రలచేత ఆరంభింపబడును. వారిలో అవి పరస్పరములు శుద్ధములు. శుక్రాదులు చాక్షుషాంతములు అయిన కడచినవారు భూలోకమును ఆశ్రయించిరి. నాలుగవది మహర్లోకము. దానియందు వారు కల్పవాసులు. భూర్లోకము మొదలుకొని మహదంతములైన లోకములను అన్నింటిని ఆ యేడుగురు సూర్యులు తమ కిరణములచే దహించివైతురు. మరీచి, కశ్యపుడు, దక్షుడు, స్వాయంభువు, అంగిరుడు, భృగువు, పులస్యుడు, పులహుడు, క్రతువు - అను మొదలగు ప్రజాపతులు అందరును వారితో గూడ (మరీచ్యాదులతో కూడ) మహర్లోకమున ఉందురు. అచటి వారు నిస్సత్త్వులు, నిర్మములును, ఊర్ధ్వ రేతస్కులునై ఉందురు. ఋభువు, సనత్కుమారాదులును వైరాజ్యులై, తపోధనులు అగుదురు. వారు సావర్ణ మన్వంతరములు అన్నింటికిని, పదునాలుగు మన్వంతరములకును పునరుత్పత్తి హేతువులు అగుదురు. యోగమును, తపమును, సత్యమును, తమ ఆత్మయందు చక్కగా నిలిపి ఆయా అహస్సులు మారగనే ఆరవ కాలమున మరలి పోవుదురు. సత్యము ఏడవ లోకము. అది మరల మార్గమున పోనివారికి ప్రతిఘాతములేని (ఎదురు దెబ్బలేని) బ్రహ్మ లోకముగా చెప్పబడినది. పర్యాసపారిమాణ్యముతో భూర్లోకము సమితి అనబడినది. సూర్యుని నుండి భూమి మధ్య భాగము, భూమి యొక్క అంతరిక్షము అనబడును. సూర్య ధ్రువుల మధ్య భాగము స్వర్గ లోకము, దివము అనబడును. ఏడు లోకములగురించి విపులముగా చెప్పబడిన వాని సిద్ధులను చెప్పెదను. భూలోకవాసులు అందరును అన్నదాతలు రసాత్మకులు. భువమున స్వర్గమునను ఉన్నవారు అందరును సోమము, నేతిని హవిస్సుగా త్రావువారు. నాలుగవదైన మహర్లోకమును ఆశ్రయించని వారి మానసీ సిద్ధి అయిదు లక్షణములు కలది. వారికి మనస్సుతో కోరినది అంతయు వెంటనే సిద్ధించును. ఈ దేవతలు సమస్త యజ్ఞములతో అతీతులను, వర్తమానులను, రాగల వారిని పరస్పరము పూజించుకొందురు. అంత దేవగణము అతీతముకాగా, మొదటివారు తరువాతివారితో యజ్ఞము చేసియు, తరువాతివారు అప్పటివారితో యజ్ఞము చేసియు సంబంధము ఉన్నంతవరకు నివర్తింతురు (మరలి పోవుదురు). అధికారముల నుండి మరలినవారికి సిద్ధి మానసికముగానే కలుగును. వారికి శుద్ధమైన సిద్ధి పరంపర మానసికముగానే కలుగునని తెలుసుకొనవలెను. ఓ బ్రాహ్మణులారా! నాలుగు లోకములను, జనలోకము యొక్కయును విధిని సంగ్రహముగా చెప్పితిని. మరల దానిని మీకు వివరింతును.

వాయువు ఇట్లు అనెను:

“మరీచి, కశ్యపుడు, దక్షుడు, వశిష్ఠుడు, అంగిరుడు, భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు - మొదలగువారు, పూర్వము బ్రహ్మయొక్క మనస్సుతో ఇచట పుట్టుదురు. తరువాత వారు ప్రజలను నిలబెట్టి, జనలోకమును ఆశ్రయింతురు. అపుడు ఆ కాలములు కల్ప దాహమున(ప్రళయాగ్ని జ్వాలల) మండిపోగా, భూర్లోకాది మహర్లోకాంతములు అగ్నిచే చాలా ఎక్కువగా వ్యాపింపగా జనులు, మహర్లోక నివాసులైన యామాది గణములను, సంవర్తక ప్రళయాగ్ని జ్వాలలు పొందురు. మహర్లోకములు మండిపోగా వారు జన లోకమునే ఆశ్రయింతురు. అచట ఉన్నవారందరు సూక్ష్మశరీరులుగా ఉందురు. అచటికి వచ్చినవారు అచటి స్థానికులతో సమాన సామర్ధ్యము, సమాన ఆకారమును కలవార గుదురు. జగములు జలప్రళయమున ఉన్నంత వరకు వారు జనలోకములో ఆ విధముగా మార్పుచెంది ఉండుచుందురు. రాత్రి తెల్లవారగానే దిన ప్రారంభమున, అవ్యక్తయోనియైన బ్రహ్మవలన పూర్వము వలెనే క్రమముగా ఇట జనింతురు. స్వాయంభువాది మరీచ్యంత సాధకులు, వారి దేవతలును మరల ఇచట వారి నిధనములందు (సమాధులందు) జనింతురు. యామాదులు కనిష్ఠాదులును ప్రజాపతివలన మొదటివారు మొదటను, తరువాతి వారు తరువాతను జనింతురు. దేవతావంశమున దేవతలు ఏడు సంభూతులుగా చెప్పబడిరి. వారిలో కడచిన వారు కల్యజులు. తక్కినవారు ముగ్గురు శిష్టులు. ఈ క్రమముతో ఆ దేవతలు అంతటను తిరుగుచున్నవారై మాటి మాటికి పదిమారులు జనంతవీ భావమును పొందుదురు. తరువాత అ సమస్త గణములు భావములలో (స్థితులలో) అనిత్యత్వమును చూచి, జరుగబోవు దాని బలము వలనను, పుణ్యఖ్యాతి బలమునను, నివృత్త వృత్తులై (వదిలి పోయిన వ్యాపారములు కలవారై) వారందరు స్వస్థులై, అట్లే సుమనస్కులై ఆ జన లోకమును వదలి వైరాజమున ఉందురు. తరువాత కొంత కాలమునకు, నిత్య యోగులైన తపస్వులై ధర్మకథనమున వైరాజుల వంశమున వారు జనింతురు. ఇచట పుట్టినవారై, తరువాత వారు దేవత్వమునను, ఋషిత్వమునను, మనుష్యత్వమునను అంతటగల స్థానములను నింపుదురు. ఈ విధముగ దేవగణములు పదిమారులు మరలి, వైరాజములందున్నవారై, పదియుప్లవముల వరకు ఉందురు. ఆ తరువాత వైరాజకమున నుండి కల్పము పూర్ణముకాగా, పూర్వపూర్వ క్రమమున మరల బ్రహ్మలోకమున మరలివత్తురు. వైరాజకకల్పము గడచిపోగా ఈ బ్రహ్మ లోకమునందు మరల కూడ వైరాజము అను కల్పస్థానమును కల్పించిరి. ఈ విధముగ బ్రహ్మలోకమున ఉన్న పూర్వాను పూర్వక్రమముతోవారు గడచిపోగా, తపము చేత పరికల్పితమైన వైరాజమునకు చేరుదురు. ఈ విధముగ పదిమారులు మరలును. బ్రహ్మలోకమున ఋషులతోపాటు నిధనమును (మరణమును) పొందిన వారికి ఈ విధముగ వేలదేవయుగములు ఇచ్చటగడచి పోయినవి.

సూతుడు ఇట్లు అనెను:

“కాలము అనాది అగుటయు, అన్ని విధముల లెక్కింప లేకపోవుటయును. ఇందుకు కారణము ఈ విధముగ చెప్పినంత వరకు సందేహము లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పితిని”. ఋషులు ఆ వాక్యార్థమును విని సంశయముతో కూడినవారై మహామతియు, వ్యాస శిష్యుడును, పురాణజ్ఞుడు అయిన సూతునితో ఇట్లనిరి.

ఋషులు ఇట్లు అనిరి:

“వైరాజులు అనువారు ఎవరు? వారి ఆహారము ఏమి? వారి బలము ఎట్టిది? వారి ఆశ్రయము ఏమి? వారుఉన్న కాలము ఏది? ఇది ఉన్నది ఉన్నట్లు మాకు చెప్పుము. ఋషులు అడిగిన పైమాటను విని, లోకార్థతత్త్వవేత్తయైన సూత పౌరాణికుడు వినయముతో ఇట్లు చెప్పెను. “తరువాత, శుద్ధతములైన వారందరు అట శుద్ధిని పొందిరి. ఆ భూత సంప్లవము (భూత, జల ప్రళయము) వరకు అటనుండు జనులు పదుగురు ఉందురు. వారందరు సూక్ష్మశరీరులు, విద్వాంసులు, గొప్ప ఆకారములుకలవారు. ఉన్న లోకమున ఉండనందున వారికి భూతము లేదు. యోగధర్మము కలిగి సిద్ధులైన సనత్కుమారాదులు వరుస క్రమమురాగా, ఆ వైరాజుల ఖ్యాతిని నైమిత్తికమని చెప్పుదురు. స్థాన త్యాగము జరుగగా, మనస్సుగూడ ఒకే మారు ప్రవర్తిల్లును. అపుడు శుద్ధబుద్ధులందరు వైరాజులతో అన్యోన్యముగా పలికిరి. ఈ విధముగనే ఆ మహాభాగులు ప్రణవమును ప్రవేశించి బ్రహ్మలోకమున ప్రవర్తిల్లిరి. అది మనకు శ్రేయము కాగలదు. ఈ విధముగా పలికి అపుడు అందరును బ్రహ్మాంతమున ప్రయత్నశీలురైరి. అపుడు వారందరు ఆత్మ యోగము చేసి యోగధర్ములుగా ఉందురు. దీపజ్వాలలు చల్లారినట్లు బ్రహ్మలోనే సంప్రతీయ మానులు అగుదురు. పునరావృత్తి దుర్లభమైన బ్రహ్మ శరీరమున ఉందురు. వారందరు భావనామయమైన ఆ లోకమును పొంది, బ్రహ్మానందమును పొందియు అమృతత్త్వమునకు పోయిరి. తరువాత, వైరాజులకంటె ఊర్ధ్వమున షడ్గుణాంతరమున బ్రహ్మలోకము ప్రసిద్ధమై ఉండును. అచట బ్రహ్మ పురోహితుడై ఉండును. వారందరును ప్రణవాత్ములై బుద్ధమై శుద్ధమైన తపముకలవారై బ్రహ్మానందమును పొంది అమృతత్వమును పడయుదురు.

భావత్రయము పడినవారై శీతోష్ణాది ద్వంద్వములచే బాధింపబడరు. ఆ మహౌజస్కులు ఒక ఆధిపత్యము దక్క తక్కిన వాటిలో బ్రహ్మతో సమానులు. లౌకికులైన వారందరు ప్రభావ, విజయ, ఐశ్వర్య, స్థితి, వైరాగ్య, దర్శనములచే మారునట్టి మార్గమును పొంది బ్రహ్మను చేరుదురు. బ్రహ్మతో పాటు దేవతలతో ప్రతిసంచరము రాగా, తపము యొక్క చివర క్రియాత్ములై బుద్ధావస్థ కలవారై విద్వాంసులైన వారందరు క్షణదర్శినులై అవ్యక్తమున లీనము చెందుదురు. ఇది అమృతము, శుక్రము, నిత్యము, అక్షయము, అవ్యయము. దేవర్షులు సనాతనమైన ఆ బ్రహ్మ పత్రమును ఉపాసింతురు. అపునర్మార్గాగాదులై ఊర్ధ్వరేతస్కులైన వారియొక్క కర్మాభ్యాసమున - వచ్చిన శుద్ధి వేదాంతములందు (ఉపనిషత్తులందు) లభించును. అచట ఆ అభ్యాసము చేయువారు యోగయుక్తులై పరాకాష్ఠయైన బ్రహ్మను ఉపాసింతురు. వారు శరీరమును పాపమును వదలి అమృతత్వమునకు పోవుదురు. రాగములేనివారు, కోపమును జయించినవారు, మోహములేనివారు, సత్యము పలుకువారు, శాంతులు, బ్రహ్మయందు ఉంచిన ఆత్మగల వారు, దయావంతులు, ఇంద్రియములు జయించినవారు, సంగము లేనివారు, శుద్ధులైన వారును అగు వారు బ్రహ్మ సాయుజ్యమును పొందువారని చెప్పబడిరి. కామయోగము లేక వీరులై తపములచే పాపముల దహించిన వారికి అంతులేని సుఖముకల లోకములు జారిపోవును. దివ్యమై, పరమమై, ఆకాశమున భాస్వరమైన ఈ బ్రహ్మ పదమును పొంది దుఃఖములేనివారై బ్రహ్మతో పాటు అమరులు అగుదురు.

ఋషులు ఇట్లు అనిరి:

“దేని నుండి పరార్ధము? పరుడు ఎవడు? దీనిని తెలియతలచితిమి. ఓ ముని సత్తమా! మాకు దానిని చెప్పుము”

సూతుడు ఇట్లు అనెను:

“పరార్ధమును పరముయొక్క పరిసంఖ్యను (పరిగణనమును) గురించి చెప్పు చున్నాను వినుడు. లెక్కలో ఒకటి, పది, నూరు, వేయి అని ఒకటినుండి వేయి వరకు తెలియవలెను. పదివేలు - అయుతము (10,000). ఒక నూరు వేలు - నియుతము (లక్ష 1,00,000), అని బుధులచే చెప్పబడును. అట్లే శతసహస్రముల శతము లేక (1,00,00,000) కోటి అనబడును. పదికోట్లు అర్బుదము, కోటినూర్లు అబ్జము - అని తెలియుదురు. కోటివేలు ఖర్వమని విద్వాంసులు చెప్పుదురు. పదికోటివేలు నిఖర్వమని తెలియుదురు. కోటివేలు నూరులు శంకువు (1000000000000) మరల పదితో గుణించిన పై అంకెలు అనగా వేయికోట్ల వేల సముద్రమని సంఖ్యావేత్తలు చెప్పుదురు. (10000000000000) దశధా పునః అన్నందున ప్రతిపూర్వ సంఖ్య పదితో గుణింపబడి ప్రతి ఉత్తర సంఖ్యయైనది అనవచ్చును. వేయికోట్ల అయుతములు (10000000000000) మధ్యము అనబడును. కోటివేల నియుతములు (10000000000000) అంతము అనబడినది. కోటి కోట్ల వేలు పరార్ధము అనబడినది. (10000000000000000) పరార్ధ ద్విగుణమును (పరార్ధము యొక్క రెండింతలు) పరమని విద్వాంసులు చెప్పుదురు. (ఒకటిపైన 34 సున్నలు). అవి నూరు పరిదృఢము అనియు, వేయి పరిపద్మకము అనియు తెలియవలెను. కావున తరువాత అవి వేఱువేఱు సంఖ్యలు వరుసగా అయుతము, ప్రయుతము, అర్బుదము, నిర్బుదము, ఖర్భుదము, ఖర్వము, నిఖర్వము, శంకువు, పద్మము, సముద్రము, మధ్యమము, పరార్థము, అపరము ఈ విధముగా గణన విధిలో అంకెలకు 18 స్థానములు ఉండును.

మహర్షులచే పేర్కొనబడిన సంఖ్యలు నూరు. కల్పసంఖ్యతో ప్రవృత్తుడైన బ్రహ్మకు సంబంధించిన పరార్ధము ఇదియే. ఈతని కాలము అంతవరకే మిగిలి ఉండును. దాని చివర ప్రతిసృష్టి చేయబడును. పరము పదార్ధము అంకెల పేర్లతో లెక్కింప (సూచింప)బడినవి. బ్రహ్మది ఉత్కృష్టమైన వీర్యము, ఉత్కృష్టమైన ఆయువు. ఉత్కృష్టమైన తపము, ఉత్కృష్టమైన శక్తి, ఉత్కృష్టమైన ధర్మము. ఉత్కృష్టమైన విద్య, ఉత్కృష్టమైన ధైర్యము. ఈతడు అత్యుత్కృష్టమైన బ్రహ్మ, ఉత్కృష్టమైన జ్ఞానము, ఉత్కృష్టమైన ఐశ్వర్యము, బ్రహ్మకన్న పరతరమైన (ఉత్కృష్టతరమైన) వేరొక భూతము లేదు. సర్వార్థములందును అన్నింటికిని పరమున ఉన్న వీడు పరుడు. కావున ఈతడు పరుడు. పరుడు బ్రహ్మఅని చెప్పబడును. అతని యొక్క అర్ధము పరార్ధత. సంఖ్యేయుడైనను అసంఖ్యేయుడు. ఎల్లప్పుడును త్రికస్వరూపుడు. సంఖ్యచేత సంఖ్యేయుడుగా చూడబడిన ఆతనిని గూర్చి అపరార్ధము వలన విభాషింపబడుచున్నది. ధాన్యాదుల రాశి అని చెప్పుటయే కానీ ధాన్యములు సంఖ్య ఉండదు. అది అసంఖ్యము లెక్కింపను అలవిగానిది. ఇది అసంఖ్యము. యొక్క లక్షణము. కాని శుద్ధులైనందున ఈశ్వరులచే దివ్యదృష్టులచే ఆ రాశి లెక్కింపబడును. ఈ విధముగా జ్ఞానమునందలి ప్రతిష్ఠ ఉండుటచే బ్రహ్మసర్వమును చూచును. ఇది విని నైమిశారణ్యవాసులైన తపస్వులు (మునులు) ఆనందమున కన్నీరు నిండినవారై గద్గద కంఠస్వరము కలవారైరి. ఆ బ్రహ్మవాదులు అందరును వాయు దేవుని ఈ విధముగా అడిగిరి. “ఓ భగవత్ప్రభూ! బ్రహ్మలోకము ఎంత దూరమున ఉన్నది? ఎన్ని యోజనాగ్రములలో లెక్కింపబడినది? ఎన్నియోజన సాధ్యమేమి? క్రోశము యొక్క పరిమాణము ఎంత? ఇది యథార్థముగా వినదలచితిమి. తెలుపుము అనగా వారి ఆ మాటవిని వాయుదేవుడు వినయముతో కూడి మధురములైన మాటలతో చూచిన విధముగా క్రమముగా ఇట్లు చెప్పసాగెను. నేను చెప్పదలచిన దీనిని మీకు చెప్పెదను వినుడు. అవ్యక్తముకంటె వ్యక్త విభాగము మహాస్థూలము. విశేషముగా చెప్పబడును. మహత్తుల యొక్క భాగములు పదియే. భూతాది స్థూలము అనబడును. దశభాగమునకన్న అధికమైనది భూతాది పరమాణుకము. పరమాణువు మిక్కిలి సూక్ష్మము. లోకమున కంటితో దాని స్థితి తెలియ రానిది, మిక్కిలి అభేద్యము (భేదింపనలవిగానిది) ఇది పరమాణువు. కిటికీ రంధ్రము నుండి వచ్చిన సూర్య కిరణమున కనబడు అతిసూక్ష్మమైన దుమ్ముకణముతో సమాన పరిమాణముగల దానిని పరమాణువు అందురు. ఎనిమిది పరమాణువులు కలిసిన సముదాయము త్రసరేణువు అనబడును. అది పద్మ రజము అని కూడా అనబడును. ఎనిమిది త్రసరేణువులు ఒక రథరేణువు. రథరేణువులు ఎనిమిది కల్గిన దానిని బుధులు బాలాగ్ర (వాలాగ్ర వెంట్రుక చివర) అనిరి. ఎనిమిది వాలాగ్రములు ‘లక్ష’అగును. ఎనిమిది రీక్షలు ‘యూక’ అగును. ఎనిమిది యూకలు ‘యవము అనిరి. ఎనిమిది యవలు అంగుళము. పండ్రెండు అంగుళ భాగములు వితస్థి స్థానము. ఇరువదియొక్క అంగుళ భాగములు ‘రత్ని’. ఇరువది నాలుగు అంగుళములు హస్తము (మూర). రెండు రత్నులు అనగా నలుబది రెండు అంగుళములు - ‘కిష్కువు’. తొంబది ఆఱు అంగుళములు ధనువని విద్వాంసులు అందురు. ఇది ధనుష్పాదముల గవ్యూతి సంఖ్యలోనిది. ధనువు, దండము, యుగము, నాభి - ఇవి అంగుళములతో సమానములు. సంఖ్యా వేత్తలైన జనులు ముప్పది ధనువులు ‘నల్వ’ము అనినారు. రెండువేల ధనువులు గవ్యూతి అనబడును. (వేయి ధనువులు క్రోశము - కోసు). ఎనిమిదివేల ధనువులు యోజనము అనబడును. ఈ ధనువు చేతనే యోజనము పూర్తిచేయబడును. సంఖ్యాజ్ఞానవిశారదులు వేయి యోజనములు శక్ర క్రోశాంతరము అని తెలిపిరి. ఈ యోజనాగ్రముతో బ్రహ్మ అంతరమును వినుడు. భూతలము నుండి వేయి నూర్ల (లక్ష) యోజనముల ఊర్ధ్వమున సూర్యుడు ఉండును. సూర్యుని కంటెవేయి యోజనముల ఊర్ధ్వమున చంద్రుడు. చంద్రునకు నూరువేల (లక్ష) యోజనముల ఊర్ధ్వమున సమస్త నక్షత్రమండలము ప్రకాశించును. దానికి రెండు లక్షల యోజనముల పైన మేరువు ఉండును. ఇక నక్షత్ర మండలములకు ఊర్ధ్వమున గ్రహములు అంతరము (దూరము) వినుడు. సమస్త తాంగ్రహములకు అధోభాగమున బుధుడు చరించును. అతనికిపైన శుక్రుడు, అతనికి పైన కుజుడు, అతనికి పైన బృహస్పతి, ఆతనికి పైనశనైశ్చరుడు, శనైశ్చరునకు లక్ష యోజనముల పైన మొత్తము సప్తర్షి మండలము ప్రకాశించును. లక్ష యోజనములపైన ఋషులు ప్రకాశింతురు. ఈ దివమున తారామయమై చిన్నదైన దివ్య విమానమున ఉత్తాన పాదపుత్రుడు ధ్రువుడు ఇరుసువలె స్తంభీభూతుడై ఉండును. ఈ త్రైలోక్యపు పై పొడవు (ఎత్తు) యోజనములలో నాచే చెప్పబడినది. అచట మన్వంతరములలో దేవతల పూజాయజ్ఞములు లౌకికములు. ఈ లోకమున వర్ణాశ్రమముల కన్న యజ్ఞము ప్రవర్తిల్లును. ఈ సమస్త దేవయోనుల స్థితికి బ్రహ్మయే కారణుడు. ఇది త్రైలోక్యము, ఆ తరువాత వినుడు. ధ్రువునకు ఊర్ధ్వమున మహర్లోకము, అచటివారు కల్పవాసులు. అది ఒక కోటి యోజనముల దూరమున ఉన్నది. మహర్లోకము నుండి రెండుకోట్ల యోజనములలో జనలోకము ఉన్నది. అచటివారు కల్పవాసులు. అచట బ్రహ్మపుత్రులైన దక్షాదులు సాధకులు ఉందురు అనబడినది. జనలోకమునకు నాలుగింతల దూరమున ఊర్ధ్వమున తపోలోకము ఉండును. అచట భూతదాహములు లేని దేవతలగు వైరాజులు ఉందురు. తపోలోకమున కన్న ఆఱింతల దూరమున సత్యలోకము ఉన్నది. అపునర్మారకములకు (మరల మన్మథకామము లేని వారికి) అది బ్రహ్మలోకము. అచట చేరినవాడు మరల భ్రష్టుడుకాడు. బ్రహ్మనే ఉపాసించును. సత్యలోకమున కన్న ఒక కోటి యేబది లక్షల యోజనముల దూరమున బ్రహ్మలోకము ఉండును. బ్రహ్మలోకము నుండి (బ్రహ్మ) అండము యొక్క ఊర్ధ్వ భాగము నాలుగుకోట్ల అరువది యైదు లక్షల యోజనముల దూరమున కలదు. ఇది బ్రహ్మలోకము యొక్క సగభాగముయొక్క విస్తారము. ‘గత్యంతము’ తరువాతిది. యోజన అగ్రమునుండి ధ్రువ అగ్రము వివరముగా చెప్పబడినది.

అధోగతి గల ప్రాణులకు జరిగిన స్థానకల్పనను చెప్పుదును. ఘోరకర్మలు చేసిన వారు తమ కర్మల కారణముగా అచటికి పోవుదురు. నరకము, రౌరవము, రోధము, సూకరము, తాలము, తప్తకుంభము, మహాజ్వాలము, శబము, విమోచనము, కృమి, కృమిభక్షము, లాలాభక్షము, వివంసనము, అధఃశిరము, పూయవహము, రుధిరాంధము, వైతరణము, కృష్ణము, అసిపత్రవనము, అగ్నిజ్వాలము, మహాఘోరము, సందంశము, శ్వభోజనము, తమము, కృష్ణసూత్రము, లోహము, అసిజము, అప్రతిష్ఠము, వీచ్యశ్వము - మొదలగునవి నరకములు. తామసములైన నరకములు అన్నియు యముని యొక్క దేశమున (లోకమున) ఉన్నవి. వానిలో పాపకర్ములు అందరు వేరువేరుగా పడుదురు. భూమికి క్రింద రౌరవాదులైన సమస్తములును ఉన్నట్లుగా చెప్పబడినవి. కపట సాక్ష్యము చెప్పువాడు, అబద్ధముగా నిందించువాడు, పక్షవాదియై సత్యములేని నరుడు క్రూర గ్రహములుకల రౌరవ నరకము అనబడును. గోహత్యజేయువాడు, భ్రూణ (గర్భమును) హత్య చేయువాడు, పురమును అగ్నితో కాల్చువాడు, రోధములను నరకమున పడును. బ్రహ్మహత్య చేయువాడు, సురాపానము చేయువాడు, బంగారమును దొంగిలించువాడు సూకర నరకమున పడుదురు. క్షత్రియుని, వైశ్యుని చంపినవాడు, బ్రహ్మహత్య చేసినవాడు గురుభార్యను సంగమించినవాడును తాలమను నరకమున పడుదురు. చెల్లెలిని సంగమించినవాడు, రాజభటుడు, తప్తకుంభ (కాచిన కుండ) నరకమున పడుదురు. అశ్వ వ్యాపారి, బంధనము (జైలు) నుండి రక్షించినవాడు, పతివ్రతను అమ్మువాడు, భక్తుని వదిలినవాడును తప్తలోహ (కాచిన ఇనుప వెంక) నరకమున పడుదురు. కూతురిని, కోడలిని సంగమించినవారు మహాజ్వాలా నరకమున పడుదురు. వేదమును అమ్ముకొను వాడు, వేదమును తిట్టువాడు, గురువులను అవమానించువాడు, వారిని మాటల కొరడాలతో కొట్టువాడు, పొందరాని దానిని పొందువాడును అగు నరులు శబల (చిత్ర)మను నరకమున పడుదురు. విమోహమునను, పతితుని యెడను, దొంగతనమునను మర్యాదను దాటి చెడుమార్గము నిర్మించువాడు కీటలోహమను నరకమునుపొందును. దేవ - బ్రాహ్మణులను ద్వేషించువాడు, గురువులను పూజింపనివాడు, రత్నమును నిందించువాడు, కృమి భక్ష్యము (కృములతో తినబడు) నరకమునపడును. మిత్ర పుత్రియైన బ్రాహ్మణస్త్రీని అనుభవించువాడు దుర్గంధమైన లాలాభక్షమను నరకమున పడును. కాండకర్త, కుమ్మరి వాడు, బంగారు నాణెములు హరించువాడు, చికిత్సకుడు, తోటలను కాల్చువాడు విశంసన మనునరకమున పడుదురు. చెడును ప్రతిగ్రహించువాడు, యజ్ఞము చేయింపతగని వానిని యజ్ఞము చేయించువాడు, నక్షత్రములతో (జ్యోతిష్యముతో) జీవించువాడును అధోముఖ నరకమున పడుదురు. పాలను, సురను, మాంసమును, లాక్షను (లక్కను), గంధమును, రసమును, తిలలను మొదలగు వానిని అమ్ముచుండువాడు పూయవహము (చీము ప్రవాహము) అను నరకమున పడును. కోళ్లను, పిల్లులను, పందులను, పక్షులను, లేళ్లను, మేకలను బంధించువాడును ఈ నరకమున పడును. అ జీవకుడు, మాహిషికుడు (రాణివాస పాలకుడు), చక్రధ్వజి (చక్రము ధ్వజముగా గలవాడు), నాటకరంగము ఆధారముగా బ్రతుకు బ్రాహ్మణుడు, శాకుని గ్రామయాజకుడు (పక్షిద్రావమున యజ్ఞము చేయించువాడు), ఇండ్లను తగులబెట్టువాడు, విషమును ఇచ్చువాడు, కుండలో భుజించువాడు, సోమమును అమ్మువాడు, సురాపానము చేయువాడు, మాంసమును భక్షించువాడు, పశువులను చంపువాడు, దున్నలు మొదలగువానిని కోయువాడు, మృగములను చంపువాడు, పర్వకారుడు, సూచి, మిత్రుల చంపువాడు - వీరందరు రుధిరాంతమను నరకమున పడుదురు - అని విద్వాంసులు చెప్పుదురు. ఏకపంక్తిలో కూర్చున్న వానిని విషమముగా భుజింప చేయువారు అశుద్ధము తిను ఘోరనరకమున పడుదురు. ఇందు సంశయములేదు. అసత్యములు ఆడువాడు, మిక్కిలి ఎలుగెత్తి ఏడ్చువాడు, అశుభుడును, పాపము చేయు వాడును మూత్రము నిండిన నరకమున పడుదురు. మధువును తీసికొన్నవారిని చంపువారు వైతరణిని (నరక నదిని) పొందుదురు. పిచ్చివారు, చిత్తభంగము చెందినవారు, శౌచాచారమును వదిలిన వారు, కోపస్వభావముకలవారు, పరులకు దుఃఖము కలిగించువారు, మోసగించువారు, దున్నిన భూమిలో నడచువారు, చెఱకుతోటను ఖండించువాడు, గొఱ్ఱెల సముదాయపు వారును, మృగముల వేటాడువారును భయంకరములైన కత్తెరలతో వికారముగ కత్తిరింపపడుదురు. ఆశ్రమమున విరుద్ధముగ ఉన్నవారు, అగ్నిజ్వాలఅను నరకమున పడుదురు. నల్లగను చిత్రవర్ణములో ఉన్న ముక్కులతో కాకులచేత పొడిచి తినబడుదురు. యజ్ఞములో వ్రతలోపము వలన సందంశ నరకమున (పట్టుకార్ల నరకమున) పడుదురు. బ్రహ్మచర్య వ్రతమున ఉన్నవారు స్వప్నమున వీర్యస్ఖలనము కావించినను, పుత్రులచే చదివింపబడిన వారును, పుత్రులచే ఆజ్ఞాపింపబడినవారును, శ్వ భోజనమను (కుక్కలు పీకుకొని తిను) నరకమును పొందుదురు. క్రోధహర్షములతో కూడినవారై వర్ణాశ్రమ విరుద్ధములైన పనులనుచేయు వారందరును నిర్ణయమను నరకమును పొందుదురు. దానికిపైన తెల్లనిది భయంకరమైనది ఉష్ణ స్వరూపము కలదియు అయిన మహారౌరవ నరకము. దానికి క్రింద మిక్కిలి భయంకరమైనది శీత స్వరూపము కలదియు అయినది తపమను నరకమనబడును. ఈ క్రమముతో వర్ణింపబడు నరకములను వినుడు. భూమికి క్రిందుగా ఏడు నరకములు కలవు. అవి అధర్మపుత్రులు, అంధతామిశ్రకము మొదలగునవి. వానిలో రౌరవము  మొదటిది, మహారౌరవము. దీనికి క్రింద మరొకటి చల్లనిది తపమనబడినది మూడవది కాలసూత్రము మహాహవవిధి అనబడినది. నాలుగవది అప్రతిష్ఠము, ఐదవది అవీచి అనబడినది. లోహపృష్ఠము ఆఱవది. వానిలో ఏడవది అవిధేయము. ఘోరమైనందున రౌరవము  అనబడినది. సాంభకము (ధ్వనికలది) అనునది దహనము (అగ్ని) అనబడును. సుదారుణము అయినది చల్లనిది, దాని క్రింద తపము అధమము. కత్తిరించు సర్పము భయంకరమైన కాలసూత్రమని చెప్పబడినది. అప్రతిష్ఠమున స్థితిలేదు. దానిలోని భ్రమ (సుడి) భయంకరమైనది. యంత్రముల సంపీడనము వలన అవిచి అనున్నది భయంకరము అనబడును. దాని కంటెను మిక్కిలి భయంకరమైనది లోహ నరకము. కారణము ఇది చేసిన కర్మలను (అనుభవింపజేసి) నశింపజేయుట. అట్టిదే, చేయదగని పనులు చేయుట వల్ల ఏర్పడిన శరీరము గలదై, అవిధి అనబడినది. అది పీడనము, బంధనము, వధ - వీనితో కూడినందున ఎదురులేనిది. పైన పర్వతములంతటివి నిరాలోకములు అనబడినవి. వీని అన్నింటి యందును అధర్మ కారణముగా దుఃఖాతి శయము ఉండును. పైన లోకములతో కలిసి ఉన్నవి నిరాలోకములు. అవి రెండు నిప్పు కుప్పలు అంతటి శరీరము (ఆకారము) కలది, మూత్రదాకయము (మూత్రమును పొందించునది) అనుభవించుటకు సమర్థములైన (అనుభవింపతగిన) కర్మలచే అచట వెంటనే జనింతురు. వారందరిలోను దుఃఖాతిశయము భయమును ఉండును. అట్లే నరకవాసులకు లెక్కలేనన్ని తీవ్ర వేదనలు ఉండును. అచట దుఃఖము అనుభవింపబడును. కృతకర్మ క్షీణింపగనే మరల పశుపక్ష్యాది యోనులలో పుట్టుదురు. కర్మశేషము కడచిపోగా, ఊర్ధ్వ లోకములలోను అధోలోకముల లోను దేవతలును, నరకవాసులుగాను వరుసగా ఉందురు. ధర్మాధర్మ నిమిత్తముగా వెంటనే వారికి మూర్తులు (ఆకారములు) కలుగును. ఔపపత్తిక కర్మలవల్ల వానిని అనుభవించుటకు ఉత్పత్తి కలుగును. దేవతలు నరకవాసులను తలక్రిందు ముఖములు కలవారుగను, క్రింది లోకమును పొందినవారిగను చూతురు. అట్లే నరక వాసులు దేవతలు అందరిని అధోముఖములు కలవారిగను (క్రిందనున్న వారిని చూచునపుడు అధోముఖముగా చూచుట ఉండును) చూతురు. లోకాలోకమున, మొదలు - చివరలు లేనందునను, సహజముగనే ధారణ ఉండుటవల్లను పైన - క్రింద అను భావముండదు. ఈ స్వాభావికమైన సంజ్ఞ లోకాలోకమున ప్రర్తిల్లును. అని చెప్పగా అపుడు సత్రయాగము చేయు మునులు, బ్రాహ్మణులు వాయువుతో ఇట్లనిరి.

లోకాలోక నివాసులైన సమస్త ప్రాణులలో ఎంతమంది జననమరణ ప్రవాహమున ప్రవహించుచున్నారో, వారిని అంకెలతో లెక్కించి తరువాత మొత్తమును తెలుపుము. ఋషుల ఆ మాటను విని వాయుదేవుడు ఇట్లు చెప్పెను.

ఎట్లైనను సమస్త ప్రాణులను లెక్కించుట సాధ్యము కాదు. ఆద్యంతములు లేక కలిసిపోయినవి. ఊహతో మాత్రమే వ్యవస్థితములైనవి. అనంతముగా చెప్పబడినవి. కావున వీని గణనము ప్రవర్తింపదు. దివ్యనేత్రముతోగాని జ్ఞానముతోగాని లెక్కింప సాధ్యము కాదు. అందువలన చివరకు నరాధిపుడు నేత్రముతో లెక్కించుట సాధ్యముగాదు. పూర్ణ జ్ఞానము కానందునను, తెలియరానిదైనందునను, ఇట ప్రశ్న ఉండదు. బ్రహ్మచే గుర్తింపబడిన దానిని మాత్రము చెప్పెద వినుడు. ఈ లోకమున స్థావరములలో వేయవ భాగమున సంకేతాదులలో పార్థివకృములు పుట్టును. సంసేకమువల్ల (తడుపుట వల్ల) పుట్టినవాని వేయవ భాగముతో ఔదక జంతువులు (జలజంతువులు) అన్నియు సమానముగ కూడి ఉండునని నిశ్చయముగా భావింపబడినది. జలనివాసులైన ప్రాణులు వేయవ భాగమునకు సమానముగా లౌకికములైన పక్షులు అంతట ఉండును అని తెలియవలెను. పక్షుల యొక్క వేయవ భాగముతో సమానముగా లౌకికములైన నాలుగు కాళ్ల పశువులు ఉండునని తెలియవలెను. మొత్తము నాలుగు కాళ్ల జంతువుల వేయవ భాగమునకు సమానముగా ఈ లౌకికమునంతట రెండుకాళ్ల ప్రాణులు ఉందురని తెలియవలెను. రెండుకాళ్ల ప్రాణుల భాగము నందలి వేయవభాగముతో సమానమైన భాగముతో ధార్మికులు ఉందురు. వారిలో ధార్మికుల వేయవ భాగమునకు సమానముగా మోక్షమును పొందినవారు ఉందురు. సర్గోపపాదకులతో సమానముగా, యాతనా (నరక) వాసులు ఉందురు. ఉన్నత ప్రదేశము నుండి చూర్ణముగాపడిన వారైన దురాత్ములు మరణింతురు. వీరు రౌరవ - తామస నరకములలో శీతమును ఉష్ణమును పొందుదురు. తీవ్ర బాధగలవారై యాతనా నరక స్థానమునకు వచ్చినవారై, స్తబ్ధులు అగుదురు. రౌరవము  వేడియైన నరకమని తెలియవలెను. తేజస్సు భయంకరమైన రస ద్రవ్య రూపము కలది. తరువాతిది ఘన రూపము, ఎల్లప్పుడును చల్లనైనది. అది తపము అనునరకము. ఈ విధముగా సత్పురుషులై ధార్మికులైన నరులు స్వర్గమున కూడ లభింపరు. స్వయంభువుడు అయిన ఈశ్వరునిచే చేయబడిన సంఖ్య ఈ సంఖ్య. ఈ సంఖ్య లెక్కింపరానిదై బ్రాహ్మియు, మానుషియు అయినది.

ఋషులు ఇట్లు అనిరి:

మహము, జనము, తపము, సత్యము, భూతము, భావ్యము, భవము - లోకముల అంతరములతో ఈ లోకములు నీచేత చెప్పబడినవి. ఇక లోకాంతరము ఎట్లుండును? దానిని ఉన్నది ఉన్నట్లు చెప్పుము, ఊర్ధ్వరేతస్కులైన ఆ ఋషుల మాటనువిని ఆ వాయు దేవుడు చూచి తత్త్వార్థము కలవాడై (నిజమైన అర్థమును తెలిసిన వాడై) ఈ తత్త్వమును చెప్పెను.

వ్యక్తమైన (ఇంద్రియ గోచరమైన) దాని తత్త్వమును తర్కముతో (హేతువాద దృష్టితో) చూతురు. యోగము వలన తత్త్వమును ప్రత్యక్షముగ చూతురు. క్రియాత్ములు విషయముల నుండి తమ ఇంద్రియములను నివర్తించుట చేతను, ధ్యానముచేతను తత్త్వమును చూతురు. ఋభువు, సనత్కుమారాదులు, చక్కగా తత్త్వమును తెలిసినవారు, కలుషితము కాక శుద్ధమైన బుద్ధులు కలవారును. వారు శోకము తొలగినవారు, రజో గుణము లేని వారును, వారు సత్పురుషులు, బ్రహ్మవలె సత్పురుషోత్తములు. యోగులు నిత్య సంతోషముతో కూడినవారై, అక్షయులై(నాశము లేనివారై) బ్రహ్మయందు నివసింతురు. వాలఖి ల్యాదిఋషుల ప్రభువులైన వారిచే చూడబడిన విధముగనే, బంధింపబడక సత్కృ తార్థులైన వారి యొక్క ఆలయమైన ఈశ్వరాలయము సన్నిధిలో ఉన్న నాచేత చూడబడినది. ఈశ్వరుడు పరమాణు స్వరూపుడగుట వలననే విద్వాంసులకు భావ గ్రాహ్యుడు (అంతర్ని గూఢమైన ఇచ్ఛతో గ్రహింపదగినవాడు). జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, తపము, సత్యము, క్షమ, ధృతి, ద్రష్టృత్వము, ఆత్మ సంబంధము, అధిష్ఠాసత్వము ఈ పది అవ్యయములై (నాశము లేనివై) ఆ శంకరునిలో ఉండును. యోగాగ్ని విభువైనందున బ్రహ్మయొక్క అనుగ్రహమున ఆసక్తమై అది లోకాకారము దాల్చి సహాయపడును. ఆ ఈశ్వరుని యొక్క మాత్రస్థానము అక్షరము, ధ్రువము, అవ్యగ్రము, అష్టమమై యౌపసర్గికము. అది మాయా మయమై పరమైనది. మాయకలిగి మాయియైన మహేశ్వరుడు మాయచే చేయబడిన దానిని చెప్పును. దేవతల ఉపసంహారము దాని ప్రమాణమును చెప్పబడును. దానిని విస్తరముగను అనుపూర్వితోను చెప్పెదవినుడు. భూర్లోకము నుండి బ్రహ్మ లోకము పద మూడు కోట్ల పదియైదు లక్షల యోజనముల దూరమున ఉన్నదని చెప్పబడును. బ్రహ్మ లోకమునకు పరమున ఊర్ధ్వమున ఒక కోటి యేబది లక్షల యోజనములు భాగవతాండము (బ్రహ్మాండము) ఉండును. ఈ ఊర్ధ్వగ ప్రచారము తరువాత గత్యంతము చెప్పబడినది. తరువాత ప్రకృతులు నిత్యములు, అపరి సంఖ్యేయములు, (లెక్కించుటకు అలవిగానివి) పరస్పర గుణాశ్రయములని తెలుసుకొనవలెను. అవి సూక్ష్మములు ప్రసవ ధర్మము కలవి అనబడినవి. వాని నుండి ఒక అధికర్త, బ్రహ్మ సంజ్ఞితుడైన క్షేత్రజ్ఞుడు జనించెను. ఆ ప్రకృతులలో ప్రకృతిమత్తు, సూక్ష్మము, అధిష్టాతృత్వము, అవ్యయము, పుట్టింపబడనిది, పరమధామము అయినది, పరమాణువు అయినది, పరమున శయనించునది. నాశములేని వాడు, మోయబడనివాడు, ఆకారము లేని ఈతడు మూర్తిమంతుడు. పుట్టుక, తిరోభావము (మాయమగుట), స్థితియు అనుగ్రహమే. ఈతని విధి సాటిలేనిది. పరమాణువు మహేశ్వరుడు. తేజముతో కూడిన ఈతడు తమస్సునకు ఆవల ప్రకాశకుడు (వెలుగు చూపించువాడు) మొదట సువర్ణ అండముగా ఉన్నది ఔపసర్గికము. పెద్దది, అంతట గుండ్రముగా చుట్టుకొని ఉన్నది. అది ఈశ్వరుని నుండియే పుట్టెను. ఈశ్వరుని బీజనిర్భేదము జరుగును. క్షేత్రజ్ఞుడే (జీవుడే) బీజము అనబడును. యోనిని ప్రకృతినిగా చెప్పుదురు. అది నారాయణాత్మకము. విభువు లోకము యొక్క సృష్టికొఱకు లోకసంస్థానమునే చేసెను (లోకము నందుండెను). చక్కని సృష్టిగలవాడై తనువుతో ఆ మహాత్ముని లోకధాతువయ్యెను. బ్రహ్మలోకము యొక్క ముందుకును బ్రహ్మయొక్క అండమునకు క్రిందికిని, ఈ రెంటి మధ్యమున ఒక పురముగలదు. అది ఆ ఈశ్వరుని యొక్క మనోమయమైన స్థానము. అది అమితౌజస్కుడై ఆకారము తాల్చిన, ఈశ్వరుని యొక్క స్థానము. అది ఆ ఈశ్వరుని యొక్క మనోమయమైన స్థానము. అది శివమనుపురము. జన్మభయము కలవారికి శరణ (రక్షక) మైనది. ఓ బ్రాహ్మణోత్తములారా! నిండైన లక్ష యోజనముల దూరమున వ్యాపించిన భూమండలమున అది ఉన్నది. పరతేజములను పరిభవించు మధ్యాహ్న సూర్యుని తేజముగా ప్రకాశించి, గొప్పనైన బంగారు కోటగోడతో చుట్టబడినది. సూర్యకాంతితో విరాజిల్లునవియు, ముత్యాల హారములచే నలంకరింపబడినవియునైన నాలుగు బంగారు ద్వారములచేతను అలంకరింపబడినది అది అకాశమున ఉన్న పురము, రమ్యమైనది, దివ్యమైనది, ఘంటాదులతో ధ్వనింపబడినది. అచట మృత్యువు అడుగిడదు. తపము ఉండదు, ముసలితనము ఉండదు, శ్రమ ఉండదు. ఆ పురమునకు ఇతరములతో సాటియే లేదు. అది దశదిక్కులలో నిండుగా లక్ష యోజనములు విస్తరించి ఉన్నది. ఆ పురము గోవృషాంకుడైన (వృషభధ్వజుడైన) శివుని తేజముతో వ్యాపించి ఉండును. మనోభావముతోనే బంగారుమయమైన భూమి ఏర్పరుపబడినది. రత్నముల ఇసుకలో పొదుగబడినదై ఆ భూమి మిక్కిలి ప్రకాశించినది. అచట వనములందును (జలము లందును) తోటలందును దివ్యములైన పద్మములు ప్రకాశించును. అవి కొన్ని శరత్కాల చంద్రునివలె తెల్లని కాంతిగలవి. కొన్ని బాలసూర్యునివలె ఎఱ్ఱనివి. కొన్ని సగము తెల్లనివి, సగము ఎఱ్ఱనివి. బంగారుమయమైన వియును. అవి మరకత కాంతులు కలిగి రథచక్రము లంతటి పద్మములు. సుకుమారమైన రూపముతోను సాటిలేని సుగంధముతోను గూడినవి యా దివ్యపద్మములు. కొన్ని తుమ్మెదలవలె నల్లనివి, కొన్ని బంగారు వన్నెకలవి, సగము నలుపు, సగము ఎఱుపు కలవి. సుకుమారమైన మధ్యభాగములు కలవి. కొన్ని గొడుగు లంతటి పరిమాణములు కలవి. కమలములతో చుట్టబడినవి. అచట ఏడు మహానదులు కలవు. వాని పేరులను వినుడు. వరా, వరేణ్యా, వరదా, వర్షార్హా, వరవర్ణినీ, పరమా, వరభద్రా - ఇవి ఆయుత్తమమైన శివపురమునందలి రమ్యములైన నదులు. అచటి నదీ శ్రేష్ఠములు ప్రవహించు జలములు పద్మ - ఉత్పల దళములతో మిశ్రితములైనవి. అలల నురుగులు, సుళ్లు మొదలగు రూపములు ధరించినవి. మణిదళములతో సమానమైన కాంతి కలవి. బ్రహ్మర్షులు గాని, దేవతలుగాని, అసురులుగాని, పితరులుగాని, ఇతరులు గాని జ్ఞానాతీతుడైన ఈశ్వరుని ఆ పురమును తెలియరు. అచట అవ్యగ్రులై (ఏకాగ్రచిత్తులై) జితేంద్రియులై చక్కగా యోగయుక్తులైన మహాత్ములు గోవృషాత్ముడైన శివుని పురమును చూతురు. సాటిలేని తేజస్వియైన శివుని యొక్క ఆ పురవరము యొక్క మధ్యమున మిక్కిలి గొప్పదియు, మేరు పర్వతమువలె ప్రకాశించునదియు, దివ్యమైన దియు, భద్రశ్రీలతో చుట్టబడినదియు, బంగారు మయమైనదియు, శుభమైన వేయి కిరణములుగల సూర్యునివలె ఉండు భవనము గలదు. అది సాటిలేని రత్నములతో అంతట అలంకరింపబడినది. చంద్రునితో సమాన కాంతిగల స్ఫటిక మణులతోను, సోమునితో సమాన కాంతిగల చంద్రకాంత మణులతోను, వైడూర్యమణులతోను, బాలసూర్య కాంతి మణులతోను, అగ్నిసంభవములైన సువర్ణములతోను, వెండితోను చేయబడిన (పాషాణములలో) శుభములైన ఇంద్రనీల మణులతోను ఆ భవనము శోభిల్లెను. దృఢమైన వజ్రమయ మణులతో అది చక్కగా కూర్చబడినది. అనేక ఆకారములతో ఏర్పరుపబడి జలములతో (జలావాసములతో) ఒప్పినది. చంద్రకిరణ కాంతులుగల పతాకలతో అలంకరింపబడినది. (శ్వేత ధ్వజములతో అలంకరింపబడినది). నిత్యము బంగారు గంటల నాదములతో సంధ్యాకాల మేఘములవలె ప్రకాశించిన కిన్నరుల యొక్క భవనములతోను ప్రతి నిత్యము సంతసిల్లిన ఉత్సవములు కలది. హిమశిఖరములతో మేరుపర్వత శ్రేష్టమువలె చుట్టంతట బంగారు పుష్పోదక కాంతులతోను, బంగారు మయములైన పతాకలతోను ప్రకాశించును. ఈ విధముగా భవన శ్రేష్ఠము అనేక భూమికలతో (రచనలతో) విరాజిల్లును. త్ర్యంబకుడు అగు శివుని ఇంట వసంత ప్రతిమయు, శ్రీ, లక్ష్మి, మాయ, కీర్తి, శోభ, సరస్వతి దేవితో కూడిన వీరందరు రూప గంధములతో కూడినవారై నిత్యలై, లెక్కలేనివారై, పరస్పరగుణముల ఆశ్రయించినవారై ఉందురు. కాంతి విలాసములకు ప్రత్యేకమై సర్వ రత్నములకు అలంకారమైనది ఆ భవనరాజము. ఈ మహాభాగ్యవంతులు తమ్ముతాము నూరు కోట్లు విభజించుకొని ఏ మాత్రము ఏమరుపాటులేనివారై భగవంతుడై మహాత్ముడైన శివుని సంతోషపెట్టి ఆనందింతురు. వారిలో వేలకొలది ఇతరులు వెనువెంబడి ఉండు పరిచారికలు, రూపవతులు, శ్రీతో కూడిన వారు. అందరును కమలముల వంటి కన్నులు గలవారు. లీలా విలాసములతో కూడిన అతిమనోహర భావములచేతను వారు శైలముల వలె ఉండి, అగ్నివలె పవిత్రులైన గణములతో పాటు ఆనందింతురు. కొందరు స్త్రీలు కుబ్జలు (పొట్టివారు), కామనికామములతో శ్రేష్ఠమైన శరీరము కలవారు, గుఱ్ఱపు ముఖములు కలవారు, విభూతిరేఖలు కలవారు, వికటవేషములు, క్రూరులు, చప్పిడి ముక్కులు, లావువ్రేలాడు కడుపులు కలవారు, పొట్టి భుజములు కలవారు, వికార నేత్రములు కలవారు, పొట్టి పాదములు కలవారు, సింహముఖము కలవారు, మరికొందరు ఏనుగు వంటి ముఖము కడుపు కలవారు. అట్లే మరికొందరు ఏనుగు ముఖము కలవారు, సింహ ముఖము, పెద్దపులి ముఖము, ఎఱ్ఱని కన్నులు, పెద్ద స్తనములు, సుందరులై, సుందర నేత్రములు కలవారు, పొట్టిగా ముడుచుకొన్న తలవెంట్రుకలు, కొందరు కామరూపిణిలు అనగా ఇచ్చవచ్చిన రూపములు ధరింపకలవారు, అనేక వేష ధారిణులు అయిన స్త్రీలు అంతఃపురమునుండి దేవావాస గృహములకు తగినవారు. భగవంతుడై పది బాహువులుకల మహేశ్వరుడు ఆ భవనమున విశ్రమించెను. నందితోను, విశ్వరూపులై మహాత్ములైన గణములతోను, సమానమైన ఔదార్యము పరాక్రమమును కల రుద్రగణముల తోను, అగ్నిపుత్రులతో సమానులై, యూపమువంటి కోరలతోను భిన్నముఖములుకల శివపరులైన ప్రమథగణ భక్తులతో నమస్కరింపబడుచు, మహేశ్వరుడు పూజింపబడు చుండును. తన ఎదపైఉన్న సర్వ ఋతువులలో పూయు పుష్పముల మాలను వాసన చూచుచుండును. నల్ల కలువలవలె నల్లనివాడు, విశాలమై, ఎఱ్ఱనైన కన్నులు కలవాడు. కొద్దిక్రూరమై వ్రేలాడు పెదవులు కలవాడు. వాడియైన కోరలు గణములతో కూడినవాడు. ఆరు ఊర్థ్వ నేత్రములు కలవాడు, చూడనలవికానివాడు, సుందరుడు, నారచీరను ధరించిన వాడు. యుద్ధములలో అలయనివాడు, దేవతల శత్రువులను నశింప చేయువాడు, ఎడమ ప్రక్కన చేతిలో చేతిని మధ్యన చొప్పించి ఉన్న వాడును - అయిన మహేశ్వరుని పూజింప వలెను. అపదిశగా అతనియొక్క ఎడమ అరచేతిలో కనబడునదియు, మహాభయంకరమైన ధ్వనికలదియు, బలముచే సాటిలేని ఓజస్సు కలిగినదియు, విచిత్రమైన పది వర్ణములతో మిక్కిలి శోభించునదియు. విద్యుత్తుతో ప్రకాశించునదియు, శత్రువులను నశింపచేయు నదియు, శరీరముతో జ్వాలలతో మండుచున్నదియు అగు శివకాంతితోకూడి పరమమైన త్రిశూలముల మిక్కిలి శోభతో ప్రకాశించును. వేదియందు అగ్ని శిఖవలె మహాత్ముడైన దేవేశుని యొక్క కత్తి, తేజోమయమైన శరీరముతోను, కాంతితోను ప్రకాశించును. ఓజస్సులలో శ్రేష్ఠుడైన చంద్రుడు కూడ అట్లే (శిరమున) ప్రకాశించును. మహేశ్వరుని యొక్క ముందు బంగారుమయమై సుందరమై శోభించు ఆ జలములతో కూడిన పెద్ద కమండలము ప్రకాశించెను. అంగములలో కత్తిని ప్రవేశింపజేసి, తెల్లని వస్త్రమును ధరించినదై, ముత్యములతో ప్రకాశించు పెద్ద ఎదకప్పుతోను, నాలుగు భుజములుకలదై, మహాభాగ్యవతియైన విజయలోక సమ్మతయై ఉండును. దేవికి మొదటిదై రెండవ శ్రీవలె సాటిలేనిదై, మహేశ్వరునకు అంజలి ఘటించినదై ప్రతీహారి ప్రకాశించు చుండును. ఆ ప్రతీహారికి వెనువెంటనే వచ్చు మరి కొందరు స్త్రీలు అప్సరోగణములతో కూడినవారై అభినవులైన కాంతులతో (భర్తలతో) శంకరుని సమీపమున సేవకై ఉందురు. గంధర్వ యోనులైన (జాతియు) గణములు సర్వలక్షణ సంపన్నులై వాద్యములతో కూడినవారై దేవేశుడైన పరమేశ్వరుని గానము చేయుదురు. ఆ ఈశ్వరుని ఇంట ఎత్తైనదియు, పెద్ద మూపురము కలదియు, శరత్కాల మేఘమువలె తెల్లనైనదియు, గోపతియైన వృషభరాజము సంతసించు చున్నదై ప్రకాశించును. ఈశ్వరుని కుమారుడు వీర్యవంతుడు, ఎఱ్ఱ వస్త్రమును ధరించినవాడు, శ్రీమంతుడు, ఉత్తమమైన కమలదళములతో సమానమైన నేత్రములు కలవాడు, సపరివారుడు అయిన స్కందుడు (కుమారస్వామి) ప్రకాశించును. అతనికి శాఖుడు, విశాఖుడు, నైగమేయుడు, చాష్టవంతుడు - అనువారు పరివారము, వీరు ఏ వ్యసనములు లేనివారు, అక్రూరులు, ప్రజాపాలనమున ఆసక్తులు. వారితోబాటు ఆ మహావీర్యవంతుడైన నెమిలి వాహనముగాకల కుమారస్వామి శోభిల్లును. అతడు అచట సర్పములతోను ఆటవస్తువులతోను సర్వతో ముఖుడై అడును. దేవేంద్రులకు బంగారము నిచ్చు రాజులును, స్వంత ఇండ్లలో నుండి గృహస్థులై బ్రహ్మవాదులైన బ్రాహ్మణులును, రహస్యమైన స్వాధ్యాయము (వేదాధ్యయనము) తపమును కలిగి ఉంఛవృత్తులుగలవారు (రోళ్లు ప్రక్కనబడి బియ్యపు గింజలను ఏరుకొని జీవనము గడుపువారును), ఆ దేవేశునకు ఇష్టులైన సభాసదులు (సభలో కూర్చుండువారు). ఈ విధముగా అనేక మన్వంతరములు మరల మరల అచట నడచినవి. ఆ దేవదేవుడైన ఈశ్వరుని యొక్క ఉత్తమమైన భవిష్యమగు ఆశ్చర్యకరమైన విషయమును వినుడు. అచట బంగారువన్నె కలవియు, వేగము గలవియు అయిన పెద్దపులులు వెంబడి వచ్చునవై ఉండును. స్వేచ్ఛగా చరించు వానినన్నింటిని దేవదేవుడైన ఈశ్వరుడు నిర్మించెను. అవి మృత్యువుకే మృత్యువుతో సమానమైనవి. కావున యముని గర్వమును ఉపహరించునవి. ఇక ఈశ్వరుని యొక్క లెక్కలేని ఐశ్వర్యమును ఎవడు చెప్పక ఉండగలడు? అంతకంటెను భవునిచే భూతముల అనుగ్రహమునకై చేయబడిన మహాద్భుతము కలదు. దానిని వినుడు. మందరాదుల కాంతి కలవియు, బలముతో సాటిలేని తేజస్సు కలవియు, హారమువలె మల్లెమొగ్గవలె చంద్రునివలె తెల్లనై నవియు, మెఱుపు మేఘములవలె గర్జించునవియు, చూడామణిని ధరించునవియు, మేఘముతో సమానమైన వస్త్రములు కలవియు శ్రీ వత్సాంకిత వజ్రములు కలవియు. వ్రేళ్లు శూలములుగాకల చేతులు కలవియు, ఆ ఉత్తమములైన శివపుర శివభవనము యొక్క ముఖ్య స్తంభములందు వేర్వేరుగా బంధించిన అగ్నిమయములైన సంకెల (గొలుసుల)లతో ఒప్పినవియు, ఆ శివ భవనమున సుఖముగా నివసించునవియు అయిన వేలమాయా సింహములు ఆ శివ భవనమున ఒప్పుచుండును. స్తంభమునను షష్టమును తొలగించి ఉండును. తరువాత వాయుదేవుని మాటను గౌరవించి, ఆశ్చర్యము చెందినవారై, నైమిశారణ్యమున తపస్వినులైన ఋషులు.

ఓ భగవంతుడా! సర్వ భూతములకు ప్రాణస్వరూపుడా! అంతటను పోవువాడా! ఓ వాయుదేవ ప్రభూ! ఆ సింహ మహాభూతములు ఎవరు? అవి ఎక్కడ పుట్టినవి? ఏ స్వరూపము కలవి? భూతముల ప్రభువులైన శివునిచే ఏ అపరాధముతో అగ్నిమయ పాశములచే వేరు వేరుగా కట్టబడినవి? అని ప్రశ్నించిరి. ఋషులు ఆ మాటలను విని వాయుదేవుడు మహాత్ముడైన ఈశ్వరుడు వేయిసింహములను తన దేహమునుండి తొలగించగా అవి క్రోధాకారములైనవి. అపుడు ఈశ్వరాజ్ఞచే ప్రాణులకు అభయమిచ్చి యజ్ఞ భాగనిమిత్తమై పూర్వము అగ్నిపాశ బంధనమున ఉన్నవి. వాని ఈ బంధన విధానము నుండి విడివడిన ఒక సింహముచే దేవి కోపించిన కోపముగా తెలిసి దక్షయజ్ఞము ధ్వంసము చేయబడినది. ఆత్మకర్మసాక్షియైన మహాదేవి (సతీదేవి) చేత మహేశ్వరియైన మహాకాళి తన వెంబడివచ్చు భూతములతో సహా బయలుదేరినది. ఆయా భగవత్స్వరూప అయిన క్రోధము రుద్రావాసము ఇల్లుగా చేసికొన్నదై దేవియొక్క కోపమును చల్లార్చు అప్రమేయాత్ముడైన (కొలవలేనంతటి శరీరము కలిగిన) వీరభద్రుడయ్యెను. ఆతని ఇల్లు మిక్కిలి రహస్య స్వరూపుడైన దేవాధీశుని యొక్క చక్కని ఇల్లు. అది సాటిలేనిది అని చెప్పి, ఇది నేను మీకు ఇంతకుముందే చెప్పితిని. ఆతరువాత, రమ్యమైనదియు ఉత్తమోత్తమము అయినదియు అయిన ఆ శివపురమునను, ఆకాశ భూములలోను అచట నివసించు వారిని గురించి చెప్పెదను. ఆ ఆకాశభూములు అనేక రత్నములతో విచిత్రములైనవి, పతాకలతో నిండినవి, సర్వకామ సమృద్ధములు, వనములు ఉపవనములు - వీనితో ప్రకాశించునవి. వెండితోను, బంగారుతోను నిర్మితములైనవి, సంధ్యాకాల మేఘములవలె ఉన్నవి, కైలాసముతో సమానమైనవి. ఇష్టములైన శబ్దాది భోగములచే శివుని అనుసరించువారై సువ్రతులైనవారు ఆ శ్రేష్ఠములైన మేడలు అనెడు పుష్పములు కల ఆకాశభూములందు అనందింతురు. ఆ సువ్రతులు వేదఘోషలతో ఎడతెగనివారు, అనేక విధములై శుభములైన కథలను చెప్పుకొనువారు, గీత - వాద్యఘోషలు కలవారు, అంతటను పరిచయస్తులు కలవారు, ఒకచోట కూడినవారు, సాటిలేనివారు, అనేక ఆశ్రయములు చేసినవారును. వారి మేడల చివర ఉండును. ఆ భవనము (మేడ) దేవ గృహము సహస్ర పాదము (సూర్యునివలె సహస్రకిరణ ప్రకాశము కలది). బంగారముతో నిర్మితమైనది, శుభమైనది. సాటిలేని శ్రేష్ఠరత్నములతో అంతటను అలంకరింపబడినది. చంద్రకాంత మణికాంతుల తోను, స్ఫటికమణులతోను, వైడూర్యమణి కాంతులతోను, బాలసూర్యమయ కాంతులతోను, అగ్ని సంభవములైన సౌవర్ణకాంతులతోను, ఆ భవనములు అలంకరింపబడినవి. నైమిశారణ్యవాసులైన తపస్వినులైన ఋషులు ఇదివిని అక్రోశించిరి. సంశయమును పొందినవారై వాయు దేవునితో ఇట్లనిరి.

“శివుని అనుసరించుచున్న వారై శివునిచే మిక్కిలి అనుగ్రహింప తగినవారై, ఆ పురోత్తమమున అనందించువారు ఏ మహాత్ములో?” అని ఋషులు అనగా విని వాయువు ఇట్లనెను.

దేవదేవుడైన శివుని భక్తిని పొందినవారిని వినుడు. వారు హ్రీమంతులు (సిగ్గుగల వారు), చక్కని దృఢులు, సర్వేంద్రియములను అణచి దాంతులైనవారు, శౌర్యముతో కూడినవారు, లోభములేనివారు, మధ్యాహారులు, సూక్ష్ములు, ఆత్మయందే రమించువారు, ఇంద్రియములు జయించినవారు, శీతోష్ణాది ద్వంద్వముల జయించినవారు, మహోత్సాహము కలవారు, సౌమ్యులు, మత్సరము లేనివారు, సర్వప్రాణుల భావములో ఉండువారు, ఇతర వ్యాపారములేనివారు, వ్యాకులము చెందనివారు, కర్మతోను, మనస్సుతోను, మాటతోను, విశుద్ధమైన అంతరాత్మతోను ఈశ్వరైక మనస్కులై మహేశ్వరుని పొందినవారు. వారు రుద్రసాలోక్యమును (రుద్రుడున్న లోకమున ఉండుట) పొందిరి. నాశము లేని శాశ్వత శివపదమును పొందిరి. అత్యంత ఉత్తమోత్తమమైన శివుని రూప సాదృశ్యమును (సారూప్యమును) పొందింపబడిరి. అచటి అందరును అగ్నిముఖులు, విశ్వరూపులు, జటాజూటము కలవారు, నీలకంఠులు, తెల్లని కంఠము కలవారు, వాడియైన కోరలు కలవారు, ముక్కంటులు. అర్ధచంద్రునితో అలంకరించిన తలపాగా కలవారు, జటయును కిరీటమును ధరించినవారు. అందరును పది భుజములు కలవారు. వీరులు, పద్మాంతరము లోని సుగంధము కలవారు. బాలసూర్యునితో సమానులు. వారు అందరును పచ్చని వస్త్రములు కలవారు. పినాక ధనువును చేత పట్టినవారు. అందరును తెల్లని అబోతు వాహనముగా కలవారు. శ్రీతోకూడినవారు, కుండలములు కలవారు, ముత్యముల హారములతో అలంకరింపబడినవారు, తేజమున దేవతలందరిని మించినవారు, సర్వజ్ఞులు, సర్వమును చూడగలవారు. జరామృత్యువులను వదలి, తమను అనేక విధములుగా విభజించి, పొందరాని భోగములను పొంది, అనేక భావములతో క్రీడింతురు. స్వేచ్ఛాగమనము కలవారు, సిద్ధులు. ఇతర సిద్ధులతో మేలుకొల్పబడినవారు. అనేక మహాత్ముల యొక్కయు, ఏకాదశ రుద్రుల యొక్కయు కోట్ల స్వరూపులు. అచటి వారందరును సర్వాత్మనా ఈశ్వర స్వరూపులు. వీరందరితో కూడి దేవదేవుడైన మహేశ్వరుడు మహాత్ముడు గదా! ఆతడు భక్తులను దయదలచువాడై, భగవంతుడై, పార్వతీప్రియుడై ఆనందించును. నేను, ఆ రుద్రులలో గాని, మహాత్ముడైన శివునిలో గాని నానాత్వము (అనేకత్వము)ను చూడను. ఏకత్వమునే చూతును. మీకీ సత్యమును చెప్పుచున్నాను” అని వాయుదేవుడు ఈ పుణ్యమైన కథను చెప్పెను. ఈశ్వరుడు గూడ చెప్పెను. ఆ తరువాత, సూర్యునితో సమానమైన కాంతిగల ఆ ఋషులు అందరు ఈ పరమ పుణ్యమై ముక్కంటికి సంబంధించిన ఈ కథను విని, మిక్కిలి శివానుగ్రహమును పొంది, ఉత్తమ సంతోషమును కూడ అందియు, ఈ కథను చక్కగా మనమున భావించి, మహాబలుడైన వాయుదేవునితో ఇట్లనిరి.

“ఓ వాయుదేవా! మహాభాగ్యవంతుడా! ఓ సర్వవ్యాపీ! ఈశ్వరుని యొక్క పవిత్రమైన ఉత్తమమైన ఎనిమిదవ ఔపసర్గికమును మీరు మాకు చెప్పితిరి. పరమాత్మ గంధముచే సమృద్ధమై ఉత్కృష్టమైన ఆ పరమేశ్వరుని స్థానమును ప్రమాణమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పితిరి. తన మాహాత్మ్యయోగముతో వేల రూపములు ధరించి అంతులేని యోజస్సు కల ఆ మహాదేవుని మాహాత్మ్యము దేవతలకు కూడ తెలియుటకు అలవికానిది. ఆ ఈశ్వరునకు భక్తులయెడ ఏమాత్రము ఏమరుపాటు ఉండదు. భక్తుల దయదలచుట కొరకే బ్రాహ్మ లక్ష్మితో స్వయముగా కూడినదై ఈశ్వరశక్తి ఒక ప్రతిమగా ఒప్పియుండును. అది వెన్నెలతో ఆకాశమున వ్యాపించి, విశ్వరూపమును ధరించునదై చంద్రునియందు ఉంచబడినదై, దేవదేవుడైన శివుని ఇంట ఐశ్వర్యమై మిక్కిలి ప్రకాశించును. ఆ మహాదేవునకు సమానులై మహాత్ములైన రుద్రుల యొక్క ముఖము నుండి ఆ విభూతి యంతయు ఒక అమృత ప్రవాహమైనది. ఓ సువ్రతులారా! దానిని ద్రావక, భక్తిచే మాచే తెలియరానిది మరొకటేదియు లేదా? ఓ దేవశ్రేష్ఠ! ప్రాణవాయుదేవా! ఈ ప్రశ్నకు సమాధానము ఉన్నది ఉన్నట్లు చెప్పుడు” అని అడిగిరి. అందుకు.....

సూతుడు వారితో ఇట్లు అనెను:

అ భగవంతుడైన వాయువు “నేనింకేమి ప్రవర్తిల్ల జేయవలెనో? నేనేమి చెప్ప వలెనో? ఓ సువ్రతులారా! దానిని చెప్పెద వినుడు” అనెను.

ఋషులు ఇట్లు అనిరి:

ఆదిత్యులు, వారి ప్రక్కన నుండు మాఠరపింగళ దండాదులును, క్రోధ విక్రములైన సింహములు, అగ్నులు, భూతగణములు, వ్యాఘ్రములును వెంబడివచ్చువారును వీరు భయంకరమైన మహాభూత జల ప్రళయమున సర్వప్రాణులును నశింపగా, ఏ అవస్థలు కలవారు అగుదురు? దానిని చెప్పుడు. సింహవ్యాఘ్ర గణములతో పాటు వీరందరిని గురించి మీరు (వాయువు చెప్పితిరి. నేను ఈపరతత్త్వమును చెప్పెదను వినుడు. అది అవ్యక్త ప్రభవమైనది. ఈశ్వరుడు ఉన్నాడను దానిని తెలియవలెను. అచట పూర్వము ఉన్న వారిలో కుమారులు బ్రహ్మయొక్క పుత్రులు. వారు సనకుడు, సనందుడు, మూడవవాడు సనాతనుడు. వారిలో వోధుడు, కపిలుడు మహాయశస్వియైన ఆసురియు, మునియైన పంచశిఖుడు, ఈ మొదలుగా గల తక్కిన ఇతరులును బ్రహ్మ పుత్రులు తరువాత, కాలము గడచిపోగా, కల్పముల యొక్క అతిక్రమణము జరిగిపోగా, మహాభూతముల వినాశము చివర ప్రళయము కలుగును. అప్పుడు అనేక రుద్రకోటులు, ప్రసన్నురాలైన మహేశ్వరియు, సత్యము యొక్క ఎనిమిది విధముల అశ్రయించుటచే శబ్దాది విషయభోగములను అనుభవించి, సర్వ భూతములను ప్రవేశించి, జ్ఞానయుక్తమైన తేజముతో అనంతమైన ఆకాశ (దివ్య) పదమును పొంది, ప్రాణుల విషయమైన దయచే, ఆ మహాత్ములందరు అచట పరమాణు స్వరూపుడైన మహేశ్వరుని చేరుదురు. మిక్కిలి గొప్ప సుడులు కలిగి, జన్మ మృత్యువులను జలములు గల నదిని తరింతురు. తరువాత ప్రళయ కాలములో భూతములను హింసించు శర్వుడను పరబ్రహ్మస్వరూపుడైన శివుని దర్శింతురు. అచట దేవితో కూడియుండు దేవులు ఏడుగురు అనబడిరి. వేయి సింహములు, వేయి ఆదిత్యులును, అగ్ని, భూత భవిష్య త్ర్పాణులు, వెనువెంబడి వచ్చువారును, వారందరిని తన ఆత్మయందు ఆవేశింపజేసి, అట్లే ఉపద్రవములను (రానున్న పీడలను) లెక్కించి చెప్పి, ఈ సమస్తములైన ఏడు లోకములను, ఐదుమహా భూతములను, విష్ణువుతో కూడునట్లుగా చేయును. విడిపోవనట్లు కూడచేయును. ఇట్లు చేయువాడు రుద్రుడు. అతడు సామ వేదమయుడు అట్లే యజుర్వేద మయుడును. ఆ యీ రుద్రుడు వెలుపలను లోపలను ఓతప్రోతముగా (పడుగు పేకగా) నిశ్చయముగా అల్లుకొని ఉండును. ఓ బ్రాహ్మణులారా! ఒకడే భగవంతుడు, నాథుడు, భావాతీతుడు, శాంతమును చేయువాడు. తరువాత సూర్య సమాన కాంతిగల ఆ ఋషులు అందరును తమ ఆత్మ యందు తమ తమ ఆశ్రమముల నెలకొన్న అగ్నిని ఆరోపించుకొని, కర్మతో మనస్సుతో, మాటతో, విశుద్ధమైన అంతరాత్మతో మహేశ్వరైక మనస్కులై మహేశ్వరుని పొందుదురు. వ్రతోపవాసములందు నిరతులై సర్వ ప్రాణులందు దయాపరులై, సంశయములు అన్నింటిని ఛేదించి, సాటిలేని దివ్యమైన యోగమును పొందుదురు. అట్లు దివ్య యోగమును పొంది, పరమ భక్తితోను, జ్ఞానముతో కూడిన చిత్తముతోను, రుద్రసాలోక్యమును (సమాన లోకవాసమును) అవ్యయమై శాశ్వతమైన పదమును పొందుదురు. వాయుదేవుడు చెప్పిన ఈ స్తుతిని తపోయుక్తుడై చదివిన బ్రాహ్మణుడుగాని, క్షత్రియుడుగాని, వైశ్యుడుగాని తన శివయోగ క్రియాసక్తుడైనవాడు రుద్ర సాలోక్యమును పొందును. మహాభూత ప్రళయము వరకును ఎదురులేనివాడై సర్వకామ రూపమైన స్థానమును గాని గాణపత్యమును గాని పొందును. మద్యపానము చేయువాడు మద్యపానము చేయు భూత సంఘమలుతో పాటు ఆనందించును. భూమిలో పూజింపబడుచు మర్త్యులకు (మరణశీలురైన మానవులకు) కోరిన వరములు ఇచ్చువాడు అగును - అని భగవంతుడై శ్రేష్ఠుడైన వాయుదేవుడు ఈ వాక్యముల చెప్పెను. (39)