ఋషి వంశాను కీర్తనము

అటు పిమ్మట సూతుడు అనెను:

భృగువునకు ఖ్యాతి పుట్టెను. ఆ తరువాత సుఖ దుఃఖములకు ఈశ్వరులును, సమస్త ప్రాణులకు శుభాశుభములను ఇచ్చువారును, మన్వంతర విచారిణులును దేవతలైన ధాత విధాత అనువారలు పుట్టిరి. వారిలో పెద్దది. అక్క అయినది. లోకభావినియైనది దేవియైన ‘శ్రీ’ అనునామె. ఆమె సుందరుడై దేవుడైన నారాయణుని పతిగా పొందెను. ఆ సాధ్వియైన లక్ష్మీదేవి, నారాయణుని పుత్రులుగా, బల-ఉత్సాహులు అను వారలను కనెను. పుణ్యకర్ములైన దేవతలకు విమానములు నడుపువారును, దివ్యులై చరించువారును ఆమెకు మానస పుత్రులు జనించిరి. విధాతకును ధాతకును ఆయతి నియతి అనువారలు ఇరువురు కన్యలు భార్యలైరి. వారి ఇరువురికి దృఢవ్రతులగు పుత్రులిరువురు, పాండువు మృకండుడు అనువారు కలిగిరి. వారు బ్రహ్మకు (జ్ఞానమునకు) నిధి అయినవారు సనాతనులు. మృకండునకు మనస్వినియందు మార్కండేయుడు పుట్టెను. మార్కండేయునకు మూర్ధన్య అను భార్య యందు వేదశిరుడనువాడు జన్మించెను. వేద శిరునకు పేవరి అను భార్య యందు గోత్ర కర్తలైన పుత్రులు పుట్టిరి. వీరందరు వేదపారగులైన ఋషులై మార్కండేయులె అని ప్రసిద్ధి జెందిరి.

పాండువునకు పుండరీకయందు కుమారుడుగా ద్యుతిమంతుడు సృజవానుడు అను ఇరువురు పుట్టిరి. వారిరువురికిని పుత్రులును మనుమలును కలిగిరి. భార్గవులకు (భృగు సంతానములకు) పరస్పరముగా సంతానములు కలిగినవి. స్వాయంభువమన్వం తరము గడచిపోగా, మరీచి (ప్రజాపతికి) కలిగిన సంతానమును చెప్పుచున్నాను. వినుడు మరీచి భార్య సంభూతి పూర్ణమానుడను కుమారుని కనెను. వారి కన్యలు కృష్టి, పుష్టి, త్విషా, అపచితి, శుభా అనువారు. పూర్ణమాసుడు సరస్వతి అను, తన భార్యయందు ఇరువురు పుత్రులను కనెను. వారు ధర్మిష్ఠుడైన విరజుడు, పర్వసుడు అనువారు. విరజునకు కుమా రుడు విద్వాంసుడైన సుధాముడు అనువాడు ప్రసిద్ధి చెందెను. సుధామసుతుడైన వైరాజుడు తూరుపు దిక్కున (నెలకొనెను) ఆశ్రితుడు అయ్యెను. లోకపాలుడు, చక్కని ధర్మాత్ముడు, గౌరీపుత్రుడై, ప్రతాపవంతుడు అయిన పర్వసుడు సర్వగణములకు ప్రవిష్టుడైన (వారితత్త్వము తెలిసిన) మహాశయుడు. పర్వసుడు పర్వస అను ఆమెయందు ఇరువురు సుతులను కనెను. వారు శ్రీమంతుడైన యజ్ఞకాముడు కాశ్యపుడును వారిరువురికి పుట్టిన పుత్రులు గోత్రకర్తలు, ధర్మపరులుగా నిశ్చయింపబడినవారు. అంగిరసుని భార్య స్మృతి. ఆ ఇరువురు కుమారులను పుణ్యాత్ములు లోకప్రసిద్ధురాండ్రు అయిన నలుగురు కన్యకలను గూడ కనెను. వారు సినీవాలి, కుహు, రాకా, అనుమతి అనువారు, అట్లే వారు ఇరువురును భరతాగ్ని, కీర్తిమంతుడు అను ఇరువురిని కనిరి.

అగ్ని పుత్రుడైన పర్జన్య ప్రభువు సంహుతి అను ఆమెను కనెను. బంగారు రోమములు గల పర్జన్యుడు మారీచియందు ఒకనిని పుట్టించెను. ఆతడు భూత ప్రళయము వరకుండు లోకపాలుడుగా స్మరింపబడెను. కీర్తిమంతుని వల్ల ధేనుక అను ఆమె ఇరువురిని కనినది. వారు వరిష్ఠుడు ధృతిమంతుడు, వీరు అంగిరస వంశీయులలో శ్రేష్ఠులు. వారు ఇరువురికిని అనగా వరిష్ఠ ధృతిమంతులకు పుత్రులు, పౌత్రులును కలిగిరి. వారు వేలకొలదిగా మించిరి. అనసూయకూడ అత్రి పుత్రులనుగా పాపరహితులైన ఐదుగురిని కనెను.

అనసూయ శ్రుతియను కన్యను కూడ కనెను. ఆమె శంఖపదునకు తల్లి. పులిహ ప్రజాపతియైన కర్దముని యొక్క భార్య. సత్యనేత్రుడు, హవ్యుడు, అపోమూర్తి, శనీవరుడు, సోముడు అను ఐదుగురు. స్వాయంభువ మన్వంతరములో ఒక యామము గడచిపోగా, అనసూయ అత్రి మునులకు పుట్టి ఆత్రేయులుగా ప్రసిద్ధిజెందిరి. స్వాయంభువ మన్వంతరమున యామము గడవగా మహాత్ముడైన అత్రి అనుగ్రహమున పై అయిదుగురికి పుత్రులు, పౌత్రులును నూర్లకొలదియు, వేలకొలదియు జనించిరి.

పులస్త్య భార్యయైన ప్రీతిఅను ఆమె యందు దత్తాలి అనువాడు వారి కుమారుడుగా పుట్టెను. పూర్వజన్మలో ఆతడు స్వాయంభువ మన్వంతరమున అగస్త్యుడు అనబడెను. మధ్యముడు, దేవబాహువు, వినీతుడు-అను ఈ ముగ్గురు వారి పుత్రులు. వారి చిన్న చెల్లెలు సద్వతి అను నామె ప్రసిద్ధి చెందినది. పర్జన్య జననియైన శుభ్ర అనునది పౌలస్త్య ఋషికి పత్నియై, మొదట శుభ అనబడినది. ప్రీతికి పుత్రుడై ధీమంతుడైన దత్తాలియొక్క భార్య సుజంఘుడు మొదలగు అనేక పుత్రులనుకనెను. వారందరు స్వాయంభువ మన్వం తమున పౌలస్త్యులు పిలువబడి ప్రసిద్ధి చెందిరి.

పులహ ప్రజాపతియొక్క పుత్రులను క్షమ. అను ఆమె కనెను. వారు అగ్ని తేజస్కులు. వారి కీర్తి సుప్రతిష్ఠితము. కర్దముడు, అంబరీషుడు, సహిష్టుడు అనువారు ఆ మువ్వురు. ఋషియైన ధనకపీవానుడు శుభయైన కన్యపీఠి అను ఆమెయు వారికి జనించిరి. కర్దమునకు శ్రుతి అనునది భార్య ఆత్రేయి అను నామె సుతులను గనెను. పుత్రుడు శంఖపదుడు అనువాడు. కన్యకామ్య అను ఆమె అతడి భార్య. ఆ శంఖపదుడే శ్రీమంతుడై లోకపాలుడై ప్రజాపతి అయ్యెను. దక్షిణ దిక్కునందు ఆసక్తుడై ప్రియవ్రతునకు కామ్యను ఇచ్చెను. ఆ కామ్య ప్రియవ్రతునివల్ల స్వయంభువు అయిన బ్రహ్మతో సమానులగు పదుగురు పుత్రులను, ఇద్దరు కన్యలను కనెను. వారిచేత క్షత్రియజాతి చక్కగా వ్యాపించెను.

పుత్రుడైన ధనకపీవానుడు సహిష్ణువని పేరుపొందెను. యశోధారియైన ఆతడు సుమధ్యముడైన కామదేవుని కనెను. ఋతువునకు, క్రతుసముడైన పుత్రుడు కలిగెను. ఆ సంతతి శుభమైనది. వీరందరికి భార్యగాని పుత్రుడుగాని లేరు. వారందరు ఊర్థ్వరేతస్కులు. ఈ అఱువది వేల మంది వాలఖిల్యులని ప్రసిద్ధి చెందిరి. వీరు సూర్యుని చుట్టుకొని అరుణుని ముందుగా బోవుచుందురు. మహాభూత ప్రళయము వరకు వీరు సూర్యుని తోడుగా నడుచువారే.

పుణ్యాత్మ, సుమతి అను చిన్న చెల్లెండ్రు పూర్ణ మాససుతుడైన పర్వసునకు కోడండ్రు. వసిష్ఠునకు ఊర్జఅను ఆమెయందు ఏడుగురు పుట్టిరి. వారికి పెద్దచెల్లెలు సుమధ్యమయైన పుండరీక అనునామె. ఆమె పాండువైన ద్యుతిమంతుని యొక్క ప్రియ పట్టపురాణి, ఆమె యందు వసిష్ఠ వంశీకులైన ప్రసిద్ధి చెందిన ఏడుగురు జనించిరి. రజసుడు. పుత్రుడు, అర్థబాహువు, సవనుడు, అదనుడు, సుతపుడు, శుక్లుడు-అను వీరందరు సప్తర్షులు అని పిలువబడిరి. రజసుని నుండి మార్కండేయుడు యశస్వినిని కనెను. ప్రతీచి దిక్కునందు క్షత్రియుడైన ప్రజాపతియైన కేతుమంతునికనెను. ఆవాసిష్ఠులైన మహాత్ముల యొక్క పేర్లతోబాటు గోత్రములు స్వాయంభువ మన్వంతరమున గడిచిపోయినవి. అగ్నియొక్క సంతతిని వినుడు అనిచెప్పి ఈ ఋషిసృష్టి సానుబంధముగా చెప్పబడినది. అనుపూర్వితో విస్తరముగా అగ్ని సంతతిని వినుడు. అనెను.