వాయు మహా పురాణము
పృథువంశాను కీర్తనమ్
సూతుడు ఇట్లు అనెను:
సముద్రాంతమైన ఈ భూమి మేదిని అని ప్రసిద్ధముగా చెప్పబడుచున్నది. వసువును (ధనమును) ధరించుటచేత వసుధఅని చెప్పబడెను. పూర్వము మధుకైటభుల మేధస్సుతో అంతటను ప్రవాహితమైన భూమి ధీమంతుడై రాజైన పృథువును చేరెను. కావున ఈ సముద్రాంతమైన భూమి మేదినియని ప్రసిద్ధి చెందినదై, పుత్రత్వమును పొందినదై పృథివి అని పిలువబడినది. ఈ విధముగ పేరు గాంచినది. అట్లే విభజింపబడినదై, వసుంధరయై రాజుచే శోభిల్లినది. అట్లే పంటలకు నిధానమైనదై పట్టణ సమూ హములు మాలగాగలదై, నాలుగు వర్ణములతో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులతో నిండినదై బుద్ధిశాలి అయిన ఆ పృథువుచే రక్షింపబడినది.
ఆ వైన్యరాజు రాజులలో కెల్ల మంచి శ్రేష్ఠుడై ఇట్టి ప్రభావముగల వాడుఅయ్యెను. ప్రాణి సమూహముచే అంతట అతడు నమస్కరింపదగిన వాడును, పూజింప తగినవాడును అయ్యెను. బ్రహ్మయోనియై సనాతనుడైన పృథువే వేద వేదాంగముల సారము నెరిగిన మహాభాగులైన బ్రాహ్మణులచే నమస్కరింపదగినవాడు. మహాకీర్తిని పొందగోరిన మహా భాగులైన రాజులచేతకూడ ఆదిరాజై ప్రతాపవంతుడై వైన్యుడైన పృథువే నమస్కరింప తగినవాడు. యుద్ధమున జయముకోరు యోధులచేతగూడ నరులకు ఆదికర్త అయిన పృథువే నమస్కరింప తగినవాడు. పృథురాజును కీర్తించి రణమునకు ఏగిన యోధుడు భయంకర యుద్ధమున గూడ జయమంది క్షేమముతో కీర్తిమంతుడై తరించును. వైశ్య వృత్తిలో ఉన్న వైశ్యులచేత గూడ తమకు వృత్తి (వ్యాపార జీవనము) నిచ్చు మహాకీర్తి మంతుడైన పృథువే నమస్కరింపతగినవాడు. వీరు (ఈ క్రిందివారు) వత్స విశేషములు (ప్రత్యేకమైన దూడలు), పాలు పితుకువారును, సమస్తములైన పాలు పితుకు పాత్రలును-క్రమముగా నాతో చెప్పబడినవి. మొదట వాయువును దూడగాచేసి మహాత్ముడైన బ్రహ్మ పృథివి (అను ఆవు) నుండి భూతలమున బీజములను పితికెను. తరువాత స్వాయం భువమన్వంతరమున స్వాయంభువ మనువును దూడగా జేసి గ్రీష్మునిచే భూమి పితుకబడినది. పూర్వము స్వారోచిష మన్వంతరమున స్వారోచిష మనువును దూడగా జేసి బుద్ధిశాలియైన చైత్రవునిచే భూమి నుండి సస్యములు పితుకబడినవి. ఉత్తమ మన్వం తరమున ఉత్తమ మనువును దూడగా జేసి బుద్ధిమంతుడై ఉత్తముడైన దేవభుజునిచే భూమి నుండి సర్వసస్యములు పితుకబడినవి. పంచమమగు తామస మన్వంతరమున తామస మనువును దూడగాజేసి మరల ఈ భూమినుండియే బల బంధువుచే (సర్వ సస్యములు) పితుకబడినవి. చారిష్ణవ దేవుని మన్వంతరమున చారిష్టవుని వత్సమునుగాచేసి ఈ భూమి పురాణునిచే పితుకబడినది. చాక్షుష మన్వంతరము రాగానే చాక్షుష మనువును దూడనుగా జేసి పురాణునిచే ఈ భూమి పితుకబడినది. నేను పూర్వము చెప్పినట్లే వైవస్వ తమున చాక్షుష మన్వంతరము గడచి వైవస్వతము రాగా వైన్యునిచే మరల ఈ భూమి పితుకబడినది. గడచిన మన్వంతరములలో గూడ పూర్వము ఈ భూమి ఈ దేవాదుల చేతను, మనుష్యులచేతను, భూతాదులచేతను పై జెప్పిన వారిచే గూడ పితుకబడినది.
ఈ విధముగనే ఇచట భూత, భవిష్య మన్వంతరములలో తెలియవలెను. ఈ మన్వంతరములో పృథువు యొక్క సంతానమును దేవతలను గురించి వినుడు. పృథువు నుండి అంతర్ధిపాలురు పరాక్రమవంతులు అయిన ఇరువురు పుత్రులు జనించిరి. అంతర్ధానుని నుండి శిఖండిని హవిర్దానుని గనెను. హవిర్దానుని నుండి షడాగ్నేయియైన ధిషణ సుతులను కనెను. వారు ప్రాచీన బర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, ప్రజాజినులు అనువారు, భగవంతుడైన ప్రాచీన బర్హి గొప్ప ప్రజాపతి అయ్యెను. ఈతడు బలము చేతను, పాండిత్యముచేతను, తపముచేతను, వీర్యము (పరాక్రమము) చేతను భూమిలో అందరిని పాలించు ఒకే ఒక రాజుగా అయ్యెను. అతని దర్భలు ప్రాచీనాగములు (తూరుపు వైపు కొసలు గలవి). కావున అతడు ప్రాచీనబర్హి అయ్యెను. ఆ ప్రభువు సముద్ర తనయను భార్యగా చేసికొనెను. ఆమె మహాతమస్సుయొక్క పాతమున సవర్ణయైనది. తఱువాత సాముద్రి (సముద్ర తనయ) యైన సవర్ణ ప్రజాపతి వలన పదుగురను ప్రాచీన బర్హిషులను గర్భము ధరించి కనెను. వారందరు ప్రచేతసులనువారు, ధనుర్వేదపారగులు. ఏకధర్మము ఆచరించునట్టి వారు. సముద్ర జలమున పరుండినవారై పదివేల యేండ్లు మహాతపమును చేసిరి. ఆ ప్రజేతసులు తపము చేయుచుండగా, వృక్షములు రక్షణములేని భూమిని చుట్టివైచినవి. అంత ప్రజాక్షయము జరిగినది. చాక్షుష మన్వంతరము ఈ విధముగ గొట్టబడగా, వాయువు వీచలేకపోయినది. ఆకాశము వృక్షములతో చుట్టబడినది. పదివేలయేండ్లు ప్రజలు కదలజాలకపోయిరి. అది విని తపములతో గూడిన ప్రచేతసులు అందరు కోపించినవారై ముఖముల నుండి వాయువును అగ్నిని సృష్టించిరి. ఆ వాయువు పెకిలి పడిన వృక్షములను అన్నింటిని శోషింప జేసెను. వానిని ఆ భయంకరమైన అగ్ని దహించివైచెను. ఈ విధముగ వృక్షముల నాశము జరిగినది. తరువాత రాజైన సోముడు వృక్షనాశమును తెలిసి, అందులో కొన్ని మిగిలి ఉండగా, సమీపించి ఈ ప్రచేతసులతో ఇట్లనెను. లోకముల సంతానమునకు కారణమైనందున వృక్షముల సమస్త ప్రయోజనమును చూచి ఓ రాజరూపులైన ప్రాచీన బర్హిషులారా! (అగ్ని స్వరూపులారా!) కోపమును వదలుడు. వృక్షములు భూమిలో (ప్రాణులను) జన్మింపజేయ గలవు. ఓ అగ్ని-వాయువులారా! శమించుడు. రత్నము వంటిదై ఉత్తమురాలైనది ఈ వృక్షముల యొక్క కన్య. భవిష్య త్కాలమును తెలిసిన నేను గోవులతో పెంచితిని. ఈమె మారిషయను కన్య వృక్షముల చేతనే నిర్మింపబడినది. సోమగర్భముతో వృద్ధిజెందిన ఈ కన్య మీకు భార్యఅగుగాక. మీ సగము తేజముచేతను, నా సగము తేజముతోను ఈ మారిష యందు విద్వాంసుడైన దక్షుడను ప్రజాపతి జనించును. ఆ దక్షప్రజాపతి మిక్కిలి దగ్ధమైన భూమిని మీ తేజముతో నిండిన అగ్నితో అగ్నిసముడై ప్రజలను వృద్ధి చెందింపగలడు. తరువాత సోమునిమాట వలన ఆ ప్రచేతసులు కోపమును ఉపసంహరించి, వృక్షముల కొఱకై వాటికన్యయైన మారిషఅను కన్యను పత్నిగా గ్రహించిరి. తరువాత వారు మారిషయందు గర్భమును ధరింపజేసిరి. పదుగురైన ప్రచేతసులవలన మారిషయందు సోముని యొక్క అంశచే వీర్యవంతుడును, మహాతేజస్వియునైన దక్షుడను ప్రజాపతి జనించెను. దక్షుడు మొదట మానస సృష్టిగా కొందరిని సృష్టించి తరువాత మైథునముతో సృష్టించెను. దక్షుడు అచరులను (నడవలేనివారిని), చరులను (నడువగలవారిని), రెండు కాళ్లుగల మాన వాదులను, నాలుగు కాళ్లుగల పశ్వాదులను, మనస్సుతో సృష్టించెను. తరువాత (వాని) స్త్రీలను సృష్టించెను. ఆ దక్షుడు యమధర్మరాజునకు పదిమంది స్త్రీలను, కాశ్యపునకు పదముగ్గురు స్త్రీలను, కాలమును నడుపుటలో సమర్థులైన ఇరువది ఏడుగురు స్త్రీలను చంద్రునకును ఇచ్చి, తక్కిన నలుగురు స్త్రీలను అరిష్టనేమికిని ఇద్దరిని బాహుపుత్రునకును, ఇద్దరిని అంగిరసునకును, ఒక్కరితను కృశాశ్వునకును భార్యలుగా ఇచ్చెను. వారివల్ల గలిగిన సంతానమును చెప్పుచున్నాను వినుడు. ఇచట ఆఱవదియైన చాక్షుష మన్వంతరము క్షీణించును. ఏడవదైన వైవస్వత మన్వంతరములోని యేడవ ప్రజాపతికి సంబంధించినది ప్రారంభమగును. ఆ దక్ష కన్యలందు, దేవతలు, ఖగములు, గోవులు, నాగులు, దితిజులైన దైత్యులు, దనువునకు బుట్టిన దానవులు, గంధర్వులు, అప్సరసలు పుట్టిరి. ఇతరములైన జాతులు కూడ పుట్టినవి. అప్పటి నుండి ఈ లోకమున సంతానము మైథునము వల్ల కలిగినది అయ్యెను. పూర్వుల యొక్క సృష్టి సంకల్పము వల్లను, దృష్టివల్లను, స్పర్శవల్లను కలుగు చుండెడిదని చెప్పబడినది.
ఋషులు అనిరి:
“పూర్వము దేవతల యొక్కయు, దానవుల యొక్కయు, దేవర్షుల యొక్కయు, నీ యొక్కయు మహాత్ముడైన, దక్షుడైన దక్షుని యొక్కయు సంభవము (పుట్టుక) నీచే చెప్పబడినది. ప్రాణము నుండి దక్షప్రజాపతి పుట్టుక అని నీచేత ఈ వరకు చెప్పబడినది. మహాతపస్వియైన అతడు మరల ప్రచేతస పుత్రత్వము ఎట్లు పొందెను? ఇది మా సందేహము. ఓ సూతా! ఈ విషయమున వివరించి చెప్ప మనవి. ఆ పుత్రి పుత్రుడైన సోముడు మామ ఎట్లు అయ్యెను?” అని అడుగగా
సూతుడు ఇట్లు అనెను:
ఓ మంచి పండితోత్తములారా! ప్రాణులయందు ఉత్పత్తియు, వాని నిరోధమును, (మరణమును) నిత్యము జరుగుచుండును. ఈ విషయమున ఋషులును విద్యావంతులైన నరులును మోహము చెందరు. దక్షాదులైన ద్విజులు వీరందరును ప్రతి యుగమున పుట్టుదురు. మరల గిట్టుదురు. విద్వాంసులు ఆ విషయమునను మోహము చెందరు. ఓ ద్విజోత్తములారా! పూర్వమువారిలో పెద్ద చిన్నల భేదము లేదు. ఇచట గొప్ప తపస్సు ప్రభావమును కారణముగా ఉండెను. చాక్షుష మన్వంతరముయొక్క ఈ చరాచర సృష్టిని దెలిసిన వానికి ప్రజలకును ఆయువు తన అంతమును దాటును. అతడు స్వర్గలోకమున గొప్పవాడై పూజింపబడును. చాక్షుష మన్వంతరము యొక్క ఈ సృష్టి సంగ్రహముగా చెప్పబడినది. ఈ విధముగా గడచిన మన్వంతరాత్మకములైన విసర్గలు (విసృష్టులు) ఆఱు - స్వాయంభువ మన్వంతరము మొదలు చాక్షుష మన్వంతరము వఱకు వరుసగా సంక్షేపముగా చెప్పబడినవి. ఓ బ్రాహ్మణ పండితోత్తములారా! నా ప్రజ్ఞను అనుసరించి ఈ సృష్టులు చెప్పబడినవి. వైవస్వత మన్వంతర సృష్టితో వాని విస్తరము తెలియదగును. వివస్వతుని యొక్క సృష్టులన్నియు అనంతములు అతిరిక్తములు కానివియు (వేరుగా ఉండనివియు) అయినవి. అసూయ లేక వీనిని పఠించువాడు ఆరోగ్యాయుః ప్రమాణమును బట్టి ధర్మార్థ కామములతో ఈ గుణములనే పొందును. ఇక ఇప్పటివాడైన, గొప్పవాడైన వైవస్వతుని యొక్క సర్గమును (సృష్టిని) సంగ్రహముగను, విస్తారముగను చెప్పెదను. నా నుండి వినుడు.