గయా మాహాత్మ్యము - 5

సనత్కుమారుడు ఇట్లు అనెను:

ఓ నారదా! ముక్తినిచ్చు గయాయాత్రను చెప్పెద వినుము. పూర్వము ఇది శ్రాద్ధ కర్తలకు ప్రాయశ్చిత్తమని బ్రహ్మచే చెప్పబడినది. గయకు పోవుటకు పూనుకొన్నచో విధి విధానమున శ్రాద్ధముచేసి పవిత్రనదీ జలమును వెంటగొని పోవు యాత్రికుని వేషము వేసికొని గ్రామ ప్రదక్షిణముచేసి బయలుదేరవలెను. గ్రామాంతరమునకు వెళ్ళి శ్రాద్ధ శేషమును భుజింపవలెను. తరువాత ప్రతిదినము ఏ దానమును తీసికొనకుండ వెళ్లవలెను. ప్రతిగ్రహము చేయక సంతుష్టుడై, నియమము కలవాడై, పవిత్రుడై, అహంకారవిముక్తుడై తీర్థయాత్రకు బయలుదేరినవాడు తీర్థఫలమును పొందును. ఎవని పాదములు, చేతులు, మనస్సును, విద్య, తపము, కీర్తియు సుసంయతములో (చక్కని నియమ నిబంధనలతో కూడినవో), ఆతడు తీర్థఫలము అనుభవించును. ఆ తరువాత గయా ప్రవేశమున ముందు (తూర్పున) మహానది ఉన్నది. అచట జలమును చీల్చినట్లుచేసి నిర్మలజలమున స్నానము చేయవలెను. తరువాత దేవాదులకు తర్పణముచేసి, తన వేదశాఖలో చెప్పిన విధమున, అర్ఘ్య-ఆవాహనములు నిర్వహించి యథావిధిగా శ్రాద్ధము చేయవలెను. మరుసటి దినమున పవిత్రుడై ప్రేత పర్వతమునకు పోవలెను. తరువాత బ్రహ్మకుండమున స్నానముచేసి సద్బుద్ధి కలవాడై దేవాదులకు తర్పణము చేయవలెను. ప్రేతపర్వతమున నియమము కలవాడై సపిండులకు (ఏడు తరములలోపలి జ్ఞాతులకు) శ్రాద్ధము చేయవలెను. అపుడు ఆ సద్బుద్ధి దక్షిణము వైపునకు ముఖము చేసినవాడై ప్రాచీనావీతి (అపసవ్య యజ్ఞోపవీతము చేసికొన్నవాడు అనగా కుడి భుజము మీదుగా ఎడమ చేతిక్రిందికి వ్రేలాడు జందెము గలవాడు కావలెను. కవ్యమును మోయు అగ్ని, సోముడు, యముడు, అర్యముడు (సూర్యుడు) అగ్నిష్వాత్తులు (అగ్నులయందు నేయి మొదలగువానిని భుజించువారు), బర్హిషదులు (దర్భలపై ఆవహింపబడి ఉండువారు), సోమపులు (సోమరసమును త్రాగువారు) పితృ దేవతలను ఓ మహాభాగులారా! ఇటకు రెండు నా కులమున పుట్టి నాకు జ్ఞాతులైన నా పితరులు మీచేత రక్షింపబడిరి. వారికి పిండములను ఇడుటకై ఈ గయకు వచ్చి ఉన్నాను. వారందరు ఈ శ్రాద్ధముచేత శాశ్వతముగా తృప్తినందుదురు గాక అని ఆవాహనముచేసి తదుపరి ఆచమనముచేసి తిథి వార నక్షత్ర యోగకరణ రూపమైన పంచాంగ సంకల్పము చెప్పి ప్రయత్నముతో ప్రాణాయామముచేసి, పునరావృత్తిలేని శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తికై ముందుగా శాస్త్రానుసారము క్రమముగా శ్రాద్ధముచేసి, పితరులను ఆవాహనముచేసి మంత్రములతో పూజించి పిండమిడవలెను. తీర్థమున ప్రేతశిలాదులందు ఆ స్థానమును మొదట పంచగవ్యములతో వేరువేరుగా కడిగి నేతితో గూడిన చరువుతో (ప్రత్యేకముగా హోమమునకై వండిన అన్నముతో) ఆ మంత్రములతో దేవతను పూజింపవలెను. పితృ కర్మలలో మనుష్యులు నూవులు చేత పట్టుకొనునంతలోనే, సింహమునకు భయపడిన మృగములవలె, రాక్షసులు పరుగెత్తి పోవుదురు. అష్టకాశ్రాద్ధమున గాని, వృద్ధిశ్రాద్ధమునగాని, గయలో మృత తిథియందుగాని మాతృశ్రాద్ధమును మరల ప్రత్యేకముగా చేయవలెను. వేరొకచోట మాత్రము భర్తతోకలిపి చేయవలెను. వృద్ధిశ్రాద్ధమున మాత్రాదిగను (తల్లితో మొదలుపెట్టి), గయయందు పితృపూర్వకముగను, పిత్రాదులకై దక్షిణాగ్రములైన దర్భలతో వరుసగా పరచి, పాద్య పూర్వకముగా ప్రారంభించి తక్కిన శ్రాద్ధమును గృహ్యోక్తముగ ఆచరింపవలెను. వారికి దక్షిణ భాగమున కుశలను పరచి ఒకమారు తిలోదకమును ఇచ్చి సపిండులకు (ఏడు తరముల జ్ఞాతులకు) శ్రాద్ధము పెట్టవలెను. పితృతీర్థమునందలి జలముతో పిడికెడు సత్తుపిండిని పిండముగా చేసి దోసిలితో అక్షయ్య పిండకమును ఈయవలెను. తరువాత తిల జలములతో దర్భలందు సంబంధినుల ఆవహింపచేయవలె. బ్రహ్మ మొదలుకొని తృణగుచ్ఛము వరకుండు దేవర్షి-పితృ-మానవులు, సమస్త పితరులును, మాతృమాతా మహాదులును, తృప్తి చెందుదురు గాక! బ్రహ్మ లోకమునుండి ఈ లోకమువరకు సప్తద్వీపములందు గడచిన మా కోటి వంశముల వారికి ఈ తిలోదకము తర్పణమగు గాక! తండ్రి, తండ్రి తండ్రి, ఆ తండ్రికి తండ్రి (తాతకు తండ్రి); తల్లి, తల్లికి తండ్రి, తల్లికి తాత (తల్లి తండ్రికి తండ్రి), ఆ తాతకు తండ్రి (మాతృ, మాతామహ, మాతుః పితామహ, మాతుః ప్రపితామహులు) మొదలగువారు- నేను వారికి ఇడిన పిండము అక్షయ్యమగు గాక! గయాశిరమున పిడికెడంతగాని, పచ్చి ఉసిరిక కాయ అంతగాని, జమ్మి ఆకు అంతగాని పిండమును ఇడవలెను. ఆతడు ఏడు గోత్రములు ఉద్ధరించును. నూరు వంశములను ఉద్ధరించును. తండ్రి యొక్కయు, తల్లి యొక్కయు, తన భార్య యొక్కయు, తన అక్క యొక్కయు, తన కూతురి యొక్కయు, తండ్రి చెల్లెలి (మేనత్త) యొక్కయు, తల్లి చెల్లెలి (పిన్నమ్మ) యొక్కయు, గోత్రములు మొత్తము ఏడు గోత్రములని చెప్పబడినవి. ఇరువది నాలుగు, ఇరువదియు, పదునారును, పండ్రెండును, రుద్రాది పసువులు కులములు నూట ఒక్కటిగల వారికి విచణులు తీర్థ శ్రాద్ధమును చేయవలె. ఆవాహనము లేదు దిగ్బంధము లేదు. వర్ష సంభవమువలన దోషము లేదు. కారుణ్యముతో తీర్థ శ్రాద్ధమును చేయరాదు. పిండాసనము, పిండదానము, మరల ప్రత్యవనేజనము, దక్షిణ, అన్న సంకల్పము-తీర్థ శ్రాద్ధములలో ఇది విధి. మా వంశమున పుట్టినవారు, గతిలేనివారు-వారిని, అందరిని దర్భపృష్ఠమున తిలోదకములచే ఆహ్వా నింతును. అను ఈ సజల మంత్రములతో దర్భలందు ధ్యానవంతుడై, వారిని ఆవహించి పూజించి వారికి యథాక్రమముగా పిండములను ఇడవలెను. “మా వంశమున మరణించి గతిలేని వారి ఉద్ధరణమునకై ఈ పిండము నేనిడుచున్నాను. అమ్మమ్మగారి వంశమున గతిలేనివారి ఉద్ధరణమునకైనే ఈ పిండమును ఇడుచున్నాను. బంధువర్గ వంశమున గతిలేనివారి ఉద్ధరణమునకై నేను ఈ పిండమును ఇడుచున్నాను. అగ్నిచే దహింపబడిన వారి యొక్కయు, పిడుగులచేతను, దొంగలచేతను మరణించినవారియొక్కయు ఉద్ధరణమునకై నేను ఈ పిండమును ఇడుచున్నాను. కారుచిచ్చులో కాలినవారియొక్కయు, పులిచే చంపబడిన వారికిని, కోరలు కలవానిచేతను కొమ్మలు కలవానిచేతను చంపబడిన వారికిని నేను పిండమును ఇడుచున్నాను. ఉరితీయబడినవారికిని, విష- శస్త్రములచేత చచ్చిన వారికిని, ఆత్మహత్య జేసికొన్నవారికిని నేను పిండమును ఇడుచున్నాను. అరణ్యమునను, మార్గమునను ఆకలితోను, దప్పికతోను చచ్చినవారికిని భూతప్రేత పిశాచాదులచే చచ్చినవారికిని నేను పిండమును ఇడుచున్నాను. యమపాశమున అంధతా మిస్రమున రౌరవమున (నరకమున) ఉన్నవారి ఉద్ధరణమునకై నేను ఈ పిండమును ఇడుచున్నాను. భయంకరమైన అసిపత్రవనము-కుంభీపాకములు అను యమలోక నరకములో ఉన్న వారి యుద్ధరణమునకై నే నీపిండమును ఇడుచున్నాను. అనేక యాతనలలో ఉన్న వారియొక్కయు, ప్రేతలోకమునకు పోయిన వారియొక్కయు ఉద్ధరణమునకై నేను ఈ పిండమును ఇడుచున్నాను. యమకింకరులచే గొంపోబడి అనేక యాతనలలో నున్నవారి ఉద్ధరణమునకై నేను ఈ పిండమును ఇడుచున్నాను. సమస్త నరకములలో యాతనలలో ఉన్నవారి ఉద్ధరణమునకై నేను ఈ పిండమును ఇడుచున్నాను. పశు యోనిని బొందినవారియొక్కయు పక్షి-కీట-సరీసృపములైన వారి యొక్కయు ఉద్ధరణమునకై నేను ఈ పిండమును ఇడుచున్నాను. తన కర్మతోనే జాత్యంత రములలో భ్రమించుచున్న వారికి మరల మనుష్య జన్మ దుర్లభము. అట్టివారికి నేను ఈ పిండమును ఇడుచున్నాను. దివ్య-అంతరిక్ష- భూములలో ఉన్న పితరులకు, బంధువులు మొదలగు వారికి, మరణించి సంస్కారమును పొందని వారికిని నేను ఈ పిండమును ఇడుచున్నాను. నా ఈ పిండ దానముతో ప్రేత రూపమున ఉన్న నా పితరులు ఎల్లప్పుడును తృప్తినందుదురు గాక! అబాంధవులు, బాంధవులు, వేరుజన్మలలో బాంధవులు అయిన వారికి నేను ఇచ్చిన పిండము అక్షయ్యమగుగాక. పితృవంశమున మరణించినవారు, మాతృవంశమున మరణిం చినవారు, గురు-శ్వశుర-మామ అనగా భార్య తండ్రి బంధువులలో మరణించిన వారు, ఇతర బంధువులలో మరణించినవారు, నా వంశమున భార్యా పుత్రులతో విడిచిపెట్టబడినవారై లుప్తపిండులై శ్రాద్ధక్రియా లోపము చెందినవారు, పుట్టుగ్రుడ్డివారు, కుంటివారు, విరూపులు, ఆమగర్భులు, నా వంశమున తెలిసి తెలియక ఉన్నవారు (మరణించిన) ఈ పై చెప్పిన వారికి నేను ఇడిన ఈ పిండము అక్షయ్యమగు గాక! బ్రహ్మ మొదలుకొని నా పితృ వంశమున పుట్టినవారు, అట్లే మాతృ వంశమున పుట్టిన నా వారు, రెండు కులములలోను నాకు దాసులైనవారు, సేవకులైనవారు, అట్లే ఆశ్రయించి సేవించువారు. మిత్రులు, శిష్యులు, పశువులు, వృక్షములు, కనబడినవారు కనబడని వారునై ఉపకారముచేసిన వారు, నా జన్మాంతరమున నాతో కలిసియున్నవారు -వీరందరికి నేను పిండమును ఇడుచున్నాను” అని ఈ అన్ని మంత్రములతో స్త్రీ లింగాంతముగా ఊహించి పురుషులకు పిత్రాదిక క్రమమునను, స్త్రీలకు మాత్రాదిక క్రమమునను పిండలములను ఇడవలెను. స్వగోత్రమున గాని, పరగోత్రమున గాని దంపతులకు ఏకముగా పిండమును ఇడుట, శ్రాద్ధముచేయుట, పిండ-ఉదక తర్పణములను చేయుటయు నిష్ఫలములు. కావున దంపతులైనను స్త్రీ-పురుషులకు శ్రాద్ధ-పిండ-తర్పణములు వేరువేరుగా చేయవలెను. పిండ పాత్రమున తిలలనువేసి, మంచినీటితో నింపి, మూడు మారులు పరిషేచనముచేసి అందరికి నమస్కరించి ముగింపవలెను. పితరులను విసర్జించి, ఆచమనముచేసి, సాక్షులైన దేవతలకు ఇది వినిపింపవలెను. “ఓ బ్రహ్మ! ఈశానాది దేవతలారా! నేనే గయకు వచ్చి పితరులకు శ్రాద్ధముచేసి ఋణము తీర్చికొంటిని. మీరు సాక్షులుగా ఉందురు గాక! ఓ గదాధరదేవా! విష్ణో! నేను గయకు వచ్చితిని, పితృకార్యమున నీవు సాక్షివి. నేను దేవ- ఋషి-పితృ ఋణముల మూడింటి నుండి విముక్తుడనైతిని. ఓ నారదా! అన్ని స్థానము లందును పిండదానము ఈ విధముగనే ఉండును. ప్రేత పర్వతము మొదలుకొని తీర్థములలో క్రమముగా శ్రాద్ధ పిండ దానాదులను చేయవలెను. ఓ దేవర్షీ! నారదా! ప్రేత పర్వతమున దక్షిణాభిముఖుడై అపసవ్యము చేసికొని తిలలు కలిసిన సత్తు పిండిని ఉంచవలెను. ప్రేతరూపమున ఉన్న నా పితరులందరును ఈ తిలలు కలిసిన సక్తువులతో (సత్తుపిండితో) తృప్తి చెందుదురుగాక! నేను ఇచ్చిన జలముతో బ్రహ్మ మొదలుకొని తృణగుచ్ఛము వరకును ఉన్న చరాచరములు అన్నియు అన్ని విధములుగా తృప్తిచెందుగాక! ఓ నారదా! ఆతని (గదాధర విష్ణుని) మాహాత్మ్యమువలన కర్తయొక్క పితరులు ప్రేతత్వము నుండి విముక్తులగుదురు గాక! అని ప్రార్థించవలెను. అందుచే కర్తయొక్క కులమున ఏ ప్రేతత్వము కలుగదు. గయా శిరమున ప్రేతశిల అనునది ముక్తి కొఱకు ప్రసిద్ధిచెందినది. ఇచట తీర్థ మంత్రాది రూపమున ఆదిగదాధరవిష్ణువు నిలిచియున్నవాడు అని చెప్పగా.