వాయు మహా పురాణము
తిథి విశేష శ్రాద్ధఫలము
బృహస్పతి ఇట్లు అనెను:
ఆ తరువాత శ్రాద్ధ కర్మలో పూజితమైన దానిని చెప్పెదను వినుడు. శ్రాద్ధకర్మలో నిత్యము కామ్యమైనవియు, నైమిత్తికమైనవియు, మాటిమాటికి చేయునవియు అయిన పనులను చెప్పెదను. పుత్రుడు భార్య, ధనము-ఇవి మూలముగాకల మూడే అష్టకములు (శ్రాద్ధ విశేషములు). పూర్వ పక్షము శ్రేష్ఠమైనది. అందులో పూర్వము (మొదటిది ప్రతి పత్తిథి) చిత్రి అనబడినది. ద్వితీయా తిథి ప్రాజాపత్యకము, తృతీయా తిథి వైశ్వదేవికము. మొదటిది పిండివంటలతో చేయదగినది. తరువాతిది మాంసములతో చేయదగినది. తృతీయాతిథి శాకములతో చేయదగినది. ఇది తిథులకు ద్రవ్యముతో విధించిన విధానము. పితరుల యన్వష్టకా శ్రాద్ధము నిత్యము చేయవలసినట్టిది. తరువాతిది చతుర్థి. దానిని విశేషముగ చేయవలెను. చతుర్థులలో పండితుడు, తన సర్వస్వముతో కూడ శ్రాద్ధము చేయవలెను. ఇహపరలోకములలో అన్నింట సుఖి అగును. పూజకులకు ఎప్పుడును ఉత్కర్షము. నాస్తికులకు అధోగతి. సర్వ కాలములందు పితరులు. కాని తిథి కాలములందు దేవతలు, ఆవులు జలాశయమును చేరినట్లు అందరును పురుషుని కడకువత్తురు. వారు సురపూజితములైన అష్టకములకు వెళ్లరాదు. ఆతని లోకము జలాశయమును చేరినట్లు అందరును పురుషుని కడకు వత్తురు. ఆతని లోకము వ్యర్థమగును. లభించినది కూడ నశించును. దానము చేయువారు దేవతలను పొందుదురు. అట్లుకాక దానము చేయనివారు అడ్డముగా (పక్కకు) పోవుదురు. పూర్ణిమ యందు శ్రాద్ధము చేయువాడు మొదట సంతానమును, పుష్టిని, స్మృతిని, మేధను, పుత్రులను, ఐశ్వర్యమును పూర్ణముగా అనుభవించును. ప్రతిపత్తిథి ధనలాభమును కలిగించును. లభించినది నశింపదు. ద్వితీయయందు శ్రాద్ధము చేసినవాడు రెండు పాదములుకల మానవులకు అధిపతి అగును. తృతీయా శ్రాద్ధము వరము కోరువారి శత్రువులను చంపును. పాపములు నశింపచేయును. చతుర్థియందు శ్రాద్ధము చేసినవాడు శత్రువు యొక్క లోపములను చూచును. పంచమీ శ్రాద్ధకర్త మహాశ్రీని పొందును. షష్ఠీ శ్రాద్ధకర్తను బ్రాహ్మణులు పూజింతురు. సప్తమీ శ్రాద్ధకర్త మహాసత్రమును పొందును. గణములకు అధిపతి అగును. అష్టమీ శ్రాద్ధకర్త సంపూర్ణాభివృద్ధిని పొందును. నవమీ శ్రాద్ధకర్త ఐశ్వర్యమును కోరిన స్త్రీని పొందును. దశమీ శ్రాద్ధకర్త బ్రాహ్మీ సంపదను (విద్యా సంపదను) పొందును. సర్వవేదములను పొందును. వాని పాపములు అన్నియు నశించును. ఏకాదశీ శ్రాద్ధదానకర్త ఎల్లప్పుడు ఐశ్వర్యమునందును. ద్వాదశీ శ్రాద్ధకర్త రాష్ట్రలాభమును జయమును ధనములను పొందునందురు. త్రయోదశీ శ్రాద్ధకర్త సంతానమును, బుద్ధిని, పశువులను, మేధను, స్వాతంత్య్రమును, ఉత్తమ పుష్టిని, దీర్ఘాయుష్యమును, ఐశ్వర్యమును పొందును. ఇంట యువకులు మరణించినను, శస్త్రములతో చచ్చినను- వారికి చతుర్దశీ శ్రాద్ధము చేయవలెను. విషమముగా పుట్టినవారికిని, కవలలకును మరణించినచో శుచియై ప్రయత్నముతో అమావాస్యా శ్రాద్ధము జేయవలెను. ఆ శ్రాద్ధకర్త సర్వ కామములను పొంది అనంతమైన స్వర్గమునందును. అమావాస్యయందు ఋతమును (జలమును) ఈయవలెను. సోమరసమును ఇచ్చినచో అది పితరులకు మిక్కిలి సంతృప్తిని కలుగ చేయును. ఈ విధముగ తృప్తి చెందిన సోమము ముల్లోకములను ధరించును. సిద్ధ, చారణ, గంధర్వులచే నిత్యము స్తుతింపబడుచుండును. స్తుతులచేతను, మనోహరమైన కోరిన అన్ని వస్తువులచేతను; వేలకొలది అప్సరసలతోడి నాట్యములచేతను, వాద్య సంగీతములచేతను, గానములచేతను, ఆటస్థలములచేతను, విమానములతోను దేవగంధర్వులు సిద్ధ సంఘములును పితృభక్తుడైన దృఢవ్రతుని సేవింతురు. అమావాస్యా శ్రాద్ధమున పితృ భక్తుడు సర్వకామములను పొందును. ఆనాడు ఆతనిచే ఎల్లప్పుడును పితరులు ప్రత్యక్షముగ అర్చింపబడినవారు అగుదురు. మఘా నక్షత్రము పితృదేవతాత్మకమైనది. ఆ మఘలయందు శ్రాద్ధము అక్షయము. దానియందు పితృ కార్యము చేయుదురు. విశేషించి పండితుడు చేయును. కావున పితరులు కూడ నిత్యమును ‘మఘ’నే కోరుకొందురు. ఆ శ్రాద్ధమున పితృ దైవత భక్తులు పరమగతిని పొందుదురు. (19)