ఓంకార ప్రాప్తి లక్షణం

వాయువు పలికెను:

ఆపైన ఓంకార ప్రాప్తి లక్షణమును చెప్పబోవుచున్నాను. ఓంకారము మూడు మాత్రలు కలది. ఇచట వ్యంజనముగూడ (హల్లుగూడ) సస్వరము. మొదటి మాత్ర విద్యుత్సంబద్ధమైనది. (వైద్యుతీ) రెండవ మాత్ర తామసీ అనబడును. మూడవ మాత్ర నిర్గుణీ. మాత్రను అక్షరగామినిగా తెలుసుకొనవలెను. గాంధార స్వరమును పుట్టినది గాంధర్వీయము. పిపీలిక అనునది సమాన స్పర్శగలదై ప్రయోగింపబడినది. అది శిరమున కనపడును. ఆ విధముగా ప్రయోగింపబడిన ఓంకారము శిరమున బయలుదేరును. ఆ విధముగా యోగి ఓంకారమయుడై క్షరముకాని ఓంకారమున నాశనములేనివాడగును. ఓంకారము ధనువు. ఆత్మబాణము. బ్రహ్మదానికి లక్ష్యము (గురి). జాగరూకుడైనచో బాణము చేతవలె లక్ష్యము వధ్య మగును. కావున బాణము లక్ష్యమును భేదించి తన్మయమయిన రీతిగా ఆత్మ బ్రహ్మను జేరి బ్రహ్మమయము కావలెను.

ఓం అనునొక్క అక్షరము బ్రహ్మ. దాని పదము గుహారూపమయిన బుద్ధి. ఓం అనునది మూడు లోకములు, మూడు అడెగులు, వామనావతారములోని విష్ణువు యొక్క మూడు పాద విక్షేపములు (భూమ్యాకాశ పాతాళములు). పరమార్థమునకు ఓంకారమున మాత్రలు నాలుగు. ఓంకారమున యోగధారణమును చేసిన యోగి ఓంకార స్వర స్వరూపమును పొందును. ‘అ’ కారము, అక్షరముగను (నాశనములేని దానిగను వర్ణముగను) తెలియవలెను. ‘ఉ’కారము స్వరితముగా చెప్పబడినది. ‘మ’కారము ప్లుతము. ఇది త్రిమాత్రాకముగా గుర్తించబడినది. తరువాత అకారము భూర్లోకము. ఉకారము భువర్లోకము. వ్యంజనముతో గూడిన మకారము స్వర్లోకము అగును. ‘ఓం’కారమైతే మూడు లోకము దాని శిరస్సు స్వర్గము. అది అంతయు భువనాంతము. అస్థానము బ్రహ్మకు సంబంధించినది. మాత్రాస్థానము రుద్రలోకము. మాత్రలులేనిది శివస్థానము. ఈ విధముగ ధ్యాన విశేషముచే ఓంకార పదమును ఉపాసింతురు. కావున ధ్యానాసక్తు డైనవాడు శాశ్వత పదమునుకోరి నిత్యము అమాత్రకమైన ఆ ఓంకార అక్షరమును ప్రయత్నశీలియై ఉపాసింపవలెను.

హ్రస్వమాత్ర మొదటిది. దీర్ఘమాత్ర రెండవది. ఆ తరువాత పుతవతియైన మాత్ర మూడవది అని పండితులు చెప్పుదురు. మొదటిది రెండవది ఇత్యాది అనుపూర్వ క్రమమున ఇవి (పైజెప్పినవి) మాత్రలని తెలియవలెను. శక్తి ఉన్నంతవరకు ఇవి యోగధారణలో ధరింపబడును. ఆత్మయందు ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ఎల్లప్పుడు ధ్యానము చేయుచు ఎనిమిది మాత్రలు కలదానినిగా ఓంకారమును విన్నవాడు ఫలితమును పొందును. ప్రతిమాసమున నూరేండ్లు అశ్వమేధయాగము చేసినంతటి పుణ్యఫలమును ఓంకారములోని ఒకమాత్రను ధ్యానముచేసి పొందగలడు.

ప్రతి మాసమున నూరేండ్లవరకు దర్భకొనతో నీటి బిందువు త్రాగి సంపాదించు నంతటి పుణ్యమును ఓంకారము యొక్క మాత్రను ధ్యానించుటతో పొందును. ఇష్టాపూర్త యజ్ఞమునకు సత్యవాక్యమునకు, మాంస భక్షణము జేయనందుకును, రాగల పుణ్యమును ఓంకార మాత్రధారణచే పొందును. తమ స్వామికొరకు వెనుదిరుగకుండా యుద్ధము చేయువారితో సమానమైన ఫలమును ఓంకార మాత్రధారణతో పొందగలడు. ఉగ్ర తపస్సుచేతను, భూరి దక్షిణలుగల యజ్ఞములచేతను పొందలేనంతటి ఫలమును ఓంకార మాత్రముచే పొందగలడు. అందులో అర్థమాత్రము ప్లుతముగా ఉపదేశింప బడును. గృహస్థులైన యోగులు దీనినే చేయవలెను.

ఇదియే విశేషముగా ఐశ్వర్యముతో సమలక్షణమైనది. విశేషమగు యోగులకు ఎనిమిది రూపములుగల ఐశ్వర్యమునందు సమముగా గుర్తింపదగినది. అది అణిమాదుల కలది అని తెలియవలెను. కావున బ్రాహ్మణుడు యోగమున మనస్సు నిలిపి యోగి కావలెను. ఈవిధముగ యోగి చక్కగా యోగయుక్తుడై శుచియై, కోరికలను అణచిదాంతుడై ఇంద్రియములను జయించినవాడై, ఆత్మను తెలిసికొన్న బ్రాహ్మణుడు సర్వమును పొందగలడు. బ్రహ్మ ధ్యానము చేయువాడు యోగ జ్ఞానమువలన ఋక్కులను యజుస్సులను సామములను (ఋగ్యజుస్సామ వేదములను) వేదోపనిషత్తులను (జ్ఞానమును) పొందగలడు.

సర్వభూతముల లయము జరిగి జన్మించినవాడు జన్మించును. యోగి సంక్రమణమును (పరమాత్మతో కలిసి) చేసి శాశ్వతపదమును పొందును. ఇంతియే కాక, ఇచట (ఓంకారమునందు) నాలుగు హస్తములు, నాలుగు ముఖములు కలిగిన ప్రకృతియైన విశ్వరూపమును ధ్యానించుచున్నవాడై దివ్య చక్షువుతో ఆమెను చూచును.

ఈ ప్రకృతి పుట్టుకలేనిది సామ్యావస్థలో ఉన్న రజన్, సత్త్వ, తమోగుణములు నిండినది. (ఎరుపు, తెలుపు, నలుపు రంగులు నిండినది) అనేక ప్రజలను త్రిగుణములైన మహదాది వికారములు అనేకములైన సంతానములను సృజించుచున్నది. స్వాత్మ స్వరూపమైనది. జన్మరాహిత్యము చెందిన యొక యోగి ఈ పై ప్రకృతిని అనుభవించిన భోగసుఖముగల ఆ ప్రకృతిని బంధమును పెట్టుకొనక వదలివేసి విముక్తుడగును. ఎనిమిది అక్షరములు గలది. పదహారుచేతులు, కాళ్ళు గలది. నాలుగు ముఖములు గలది, మూడు సిగలు గలిగి ఒక కొమ్ము గలదియు అందరికన్న మొదటిదియు, పుట్టుక లేనిదియు, విశ్వమును సృష్టించునదియు, ఆత్మ స్వరూపమైన దానినిగా ఆమెను తెలిసి పండితులు జ్ఞానులు అమృతత్వమును పొందుదురు ప్రణవమును తెలిసికొన్న బ్రాహ్మణులు మరల భూలోకమున సంసారమును పొందరు. ఈ విధమైన ఓంకారము అను అక్షర పరబ్రహ్మ రూపమును తెలిసినవాడుగాని లేదా అవిధముగ ధ్యానముచేసినవాడుగాని సంసార చక్రమును వదలి విడిపోయిన బంధనములు, గలవాడై నిస్సంశయముగా అచలమును, నిర్గుణమును అయిన స్థానమగు శివుని పొందును.

లోకేశ్వరునకు నమస్కారము. సృష్టి ప్రళయములకై మహత్స్వరూపముతో వచ్చు వానికి నమస్కారము. మీకు హితమైన ఆ బ్రహ్మకు నమస్కారము. అంతటను స్థానము గలవానికి, నిర్గుణునకు, చక్కగా సేవింపబడిన యోగీశ్వరునకును నమస్కారము. పైను తామరాకుపై నీటిబిందువువలె యోగి విశుద్ధమైన బ్రహ్మను చేరవలెను. అది పవిత్రములలో పవిత్ర మైనది. పవిత్రముతో పవిత్రము చేరవలెను. పవిత్రముతో నిండిన పవిత్రముతో హ్రస్వ దీర్ఘప్లుత రూపమైన ఓంకారమును శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు (పంచతన్మాత్రలు) లేని దానిని, సంపూర్ణముగా ఉపాసించవలెను. అవిద్య కీశానుడైన వానికిని యోగీశ్వరునకును నమస్కారము. అతనిచే ద్యులోకము ఉగ్రమైనది. పృథివి దృఢమైనది. అతని చేతనే స్వర్లోకము, నాకలోకము వాని మధ్యనుండు అంతరిక్షమును గర్జితములైనవి. ఇవి శ్రేష్ఠములైనవి. దేవతలకు హృదయము, విశ్వరూపుడు. అతనికి ప్రాణాపానములతో పోలికలేదు. ఓంకారము విశ్వమంతయు వ్యాపించిన యజ్ఞము. యజ్ఞమే వేదము. వేదమునకు నమస్కారము. రుద్రునకు నమస్కారము. యోగేశ్వరాధిపతికి నమస్కారము. ఇది సిద్ధి ప్రత్యుపస్థానము. సాయంప్రాతర్మధ్యాహ్నములందు నమస్కారము. సర్వకామ ఫలము రుద్రుడు. పరిపక్వమైన పండు తొడిమనుండి గాలిచే క్రిందబడును. అట్లే రుద్ర నమస్కారముచే పాపము నశించును.

రుద్ర నమస్కారము నిశ్చయముగా సర్వధర్మ ఫలములను ఇచ్చునది. అన్యదేవ నమస్కారముచేత అట్టి ఫలము లభింపదు. కావున యోగి ప్రాతర్మధ్యాహ్న సాయంకాలము లలో మహేశ్వరుని ఉపాసించవలెను. దశవిస్తారకమైనది బ్రహ్మ, కాగా బ్రహ్మ విస్తరమైనది. ప్రభువు అంతట కాలమున (తగిన కాలమున) మొత్తము ఓంకారమును చెప్పెను. అద్దాని చేతనే మహాయశస్కుడు విష్ణుత్వమును నమస్కారమును పొందును. నమస్కారము లాగుననే ప్రణవము (ఓంకారము) ప్రభువును స్తుతించును. యజ్ఞము ప్రణవమును స్తుతించును.

యజ్ఞమును నమస్కారము స్తుతించును. నమస్కారమును రుద్రుడు స్తుతించును. కావున రుద్ర పదము శివము (శివ రూపము). ఈ చెప్పిన అతి రహస్యములను యథాక్రమముగా తెలిసికొన్నవాడు ధ్యానమును తద్వారా పరమపదమును పొందును. (20)