వాయు మహా పురాణము
శ్రాద్ధ కల్పము
బృహస్పతి ఇట్లు అనెను:
పితరులకు బంగారు పాత్రగాని, వెండిపాత్రగాని ఉపయోగించవలెను. వెండిది గాని వెండితోకూడినదిగాని అయినపాత్ర పితరులకు శ్రేష్ఠము. పితరులకు వెండిని చూపుట కాని, దానము చేయుటగాని అక్షయమైన స్వర్గము నిచ్చును. ఈ దానము చేత సత్పుత్రులు పితరులను తరింపచేయుదురు. పూర్వము స్వధాభాగమును కోరు పితరులు వెండిపాత్రలో స్వధను చిలికిరట. కావున దానిని ఇచ్చినచో అది అక్షయము అగును. కృష్ణమృగ చర్మమును శ్రాద్ధమున సమీపము అనుసరించినను, దానిని చూపినను, దానిని దానము చేసినను అది రాక్షసులను చంపును, బ్రహ్మ వర్చస్సును ఇచ్చును, అది పితరులను తరింపచేయును. బంగారము, వెండి, రాగి - వీని వస్తువులు, మేనల్లుడిని (కూతురు కొడుకును) భోక్తగా పిలుచుట, దర్భలు, నూవులు, వసతియోగ్యమైన ఇల్లు, పానీయములు (గవ్యములైన పాలు, పెరుగు, నేయి మొదలగునవి). మనో, వాక్, కర్మ దండములు, యోగము, శ్రాద్ధ కర్మలో ఇది సనాతనమై బ్రాహ్మ్యమైన విధి. ఇది ఆయువును, కీర్తిని, సంతతిని వర్థిల్ల జేయును. దక్షిణ - పూర్వ (తూర్పు) మధ్య దిక్కైన ఆగ్నేయ దిక్కున విశేషించి అంతటను (నలువైపుల) పిడిమూర చతురస్రస్థానము పితరుల స్థానముగ కూర్పబడినది, పితరుల ఆజ్ఞవలన ఆ స్థానమును శాస్త్రీయముగా చెప్పెదను. అది ధన్యమైనది, ధనమును ఇచ్చునది, ఆరోగ్యమును ఇచ్చునది. ఆయుష్యమును ఇచ్చునది, బలమును పెంచునది. అచట మూడు గుంటలు చేయవలెను. పిడిమూరెడు పొడవైన మూడు చండ్రచెట్టు దండములను వెండిచే అలంకరింపవలెను. అవి పండ్రెండు అంగుళముల పొడవుగా ఉండవలెను. అంతటను నాలుగు అంగుళములుగలవై ఉండవలెను. అవి రంధ్రములు లేనివై భూమిపైన ఆగ్నేయ ముఖముగా ఉంచి తాను శుచియై దర్భలతో పవిత్రమైన నీటిచే తడుపవలెను. వాక్కులతో (మంత్రములతో) శోధనము చేసిన మేకపాలతోగాని, ఆవుపాలతోగాని ఎల్లప్పుడు తర్పణము చేయుటవలన పితరులకు శాశ్వతమైన తృప్తి కలుగగలదు. త్రిషవణమున (ప్రాతర్మ ధ్యాహ్న సాయం కాలములందు) స్నానముచేసి మంత్రముతో శాస్త్రీయముగా పితరులను అర్చించినవాడు ఈ లోకములోను పరలోకములోను ఎల్లప్పుడు శ్రీమంతుడై సర్వకర్మల తోకూడి చక్కగా అశ్వమేధ యజ్ఞఫలము అందును. భూమిపై నాలుగు అంగుళముల లోతుగల గుంటలో అమావాస్యను స్థాపించవలెను. ఆ యజ్ఞములు ఇరువది యొక్క పేరులు గలవి. వానిచేత ముల్లోకములు తరింపబడును. ఆ విధముగచేసిన వానికి ఐశ్వర్యము, ఆయువు, సంతానము, విచిత్రయైన లక్ష్మి చివరకు మోక్షముగూడ క్రమముగా లభించును. కావున పాపములను పోగొట్టునది, పవిత్రము చేయునది, అశ్వమేధ ఫలము కలది, పితరుల మంత్రము. ఆ విధముగ అశ్వమేధ ఫలముగల ఈ మంత్రము బ్రాహ్మణులచే సత్కరించి పూజింపబడినది. అందువలన బ్రహ్మ నిర్మితమై అమృతమైన ఆ మంత్రమును నేను చెప్పెదను. ఆ మంత్రము “దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ| నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ భవంత్యుత॥” అనగా మహాయోగులై దేవతలైన పితరులకును స్వధకును, స్వాహాకును నిత్యము నమస్కారము చేయుదునుగాక అని శ్రాద్ధము యొక్క ప్రారంభమునను, చివరను ఎప్పుడు మూడుమారులే మంత్రమును జపింపవలెను.
పిండముల నిర్వాపణము నందు గూడ ఏకాగ్రమనస్కుడై ఈ మంత్రమును జపింపవలెను. దీనివలన పితరులు వెంటనే వత్తురు. రాక్షసులు పారి పోవుదురు. శ్రాద్ధమున ఎల్లప్పుడును నియతముగా (నియమబద్ధముగా) బ్రహ్మవాదులచే పఠింపబడు ఈ మంత్రము ముల్లోకములందు పితరులను తరింపజేయును. రాజ్యకాము ఈ మంత్రమును ఏమరు పాటులేక ఎల్లప్పుడు జపింపవలెను. వానికి వీర్యము, శౌచము, ధనము, సత్త్వము, సిరి, ఆయువు, బలమును వర్ధిల్లును. ఏ మంత్రముచేత పితరులు నియతముగ ప్రీతులగుదురో! సర్వకామ ప్రదమై, శుభమై సప్తార్చిషమైన ఆ మంత్రమును చెప్పెదను. యోగనేత్రముతో ధ్యానులైన ఆ పితరులకు నమస్కారము. ఇంద్రాదులకును, సప్తర్షులకును, పితరులకును పుట్టించు వారైనవారు భృగు - మారీచులు. కోరికలను అనుగ్రహించువారికి, నమస్కరింతును. మన్వాదులకును, దేవేంద్రులకును, సూర్యచంద్రులకును కుశలదాయకులైన ఆ పితరులు అందరికిని నమస్కరింతును. చరాదులైన నక్షత్రములకును, ద్యావా పృథ్వులకును (భూమ్యాకాశములకును), పితృపితామహులైన పితరులకును, చేతులు జోడించి నమస్కరింతును. దేవర్షులను పుట్టించిన వారును, సర్వలోకములచే నమస్కరింపబడిన వారును, ఎల్లప్పుడును అభయమును ఇచ్చువారునైన ఆ పితరులకు చేతులు జోడించి నమస్కరింతును. ప్రజాపతియైన కశ్యపునకు సోమునకును, వరుణునకును, యోగయోగేశ్వరులకును చేతులు జోడించి నమస్కరింతును. ఏడు లోకములందలి ఏడు పితృగణములకును, స్వయంభువై యోగనేత్రుడైన బ్రహ్మకు నమస్కారము. ఇప్పుడు చెప్పబడిన మంత్రము సప్తర్షి బ్రహ్మర్షి గణములచే పూజింపబడినది. పవిత్రమైపరమమైనది. శ్రీమంతమై రక్షోవినాశకరమైనది. ఈ విధితో యుక్తుడైననరుడు మూడు వరములను పొందును. వానికి పితృదేవతలు భూలోకమున అన్నమును, ఆయువును, పుత్రులను ఇత్తురు. పరమభక్తితోగూడి, శ్రద్ధగలవాడై, జితేంద్రియుడై ఎవడు నిత్యమును ఏకాగ్రచిత్తుడై ఈ సప్తార్చిషమును 21 నుండి 27 వరకు శ్లోకములతో చెప్పబడిన దానిని జపించునో,వాడు సప్త ద్వీపములుగల భూమియందు ఒకే రాజు అగును. ఆ పితరుల యాయతనమున (నివాసమున్న ఇంట) ఏ భక్ష్య భోజ్యములు వండినను ఎల్లప్పుడును ఆ పితరులకు నివేదింపక భుజింపరాదు. ఈ తరువాత బలి పాత్రములు చెప్పెదను. ఏయే బలిపాత్రకు ఏఏ ఫలములో నా నుండి వినుడు. (12)