భువన విన్యాసము - 8

సూతుడు పలికెను:

గంధమాదన పర్వతము ప్రక్కన ఒక విశాలమైన పై సందు గలదు. అదితూర్పు, పడమరలకు ముప్పది రెండువేల యోజనములు గలది. దీని పొడవు ముప్పది నాలుగువేల యోజనములు. అచట ఉండు శుభకర్మలు చేయువారు కేతుమాలు లని ప్రసిద్ధి చెందిరి. అచట మానవులందరు నల్లనివారు. గొప్ప తేజము, బలము కలవారు. స్త్రీలుకూడ నల్ల కలువ రేకుల కాంతి కలవారు. వారందరు చూడ చక్కని అందగత్తెలు. అచట షడ్రసములకు ఆశ్రయమైన, ఒక గొప్ప పనసచెట్టు కలదు. బ్రహ్మ కుమారురులు ఈశ్వరుని కుమారులు దాని ఫలరసమును త్రాగి మనోవేగము కలిగి స్వేచ్ఛగా చరించు వారయి పదికాల సంవత్సరములు జీవించుదురు. దాని ఫలరసమును ద్రాగి వారు కలిసి జీవింతురు.

మాల్యవత్పర్వతము యొక్క ప్రక్కనగూడ తూర్పునసందు కలదు. దాని పొడవు వెడల్పులు పడమటి సందునకు ఉన్నంతటివే, అచట ఉండు వారు భద్రాశ్వులు అని పిలువబడుదురు. వారు నిత్యము సంతుష్టమనస్కులు. అచట భద్రమను సాల(మద్ది) వృక్షములవనము గలదు. నల్లని మామిళ్ళు అచటి మహావృక్షములు. అటనుండు పురుషులు శ్వేత (తెలుపు) వర్ణము గలవారు. మహాతేజో బలసంపన్నులు. స్త్రీలు తెల్ల కలువల కాంతి కలవారు. సుందరులు చూడదగినవారు. చంద్రకాంతి గలిగి చంద్ర వర్ణములు కలిగి చంద్రునివంటి ముఖము కలవారు, చంద్రునివలె చల్లనైన ఆ స్త్రీలు కలువ వాసనలు గలవారు. వారి ఆయువు పదివేల ఏండ్లు. నల్లమామిడి పండ్ల రసమును త్రాగి, తవారు ఎప్పుడును ముసలితనములేని యౌవనము గలవారుగా ఉందురు.

ఋషులు అనిరి:

నాలుగు ద్వీపములయొక్క ప్రమాణము, వర్ణము అయువు, సంగ్రహముగానే గానీ, విస్తరముగా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడినది.

సూతుడు అనెను:

ఓ కీర్తివర్ధనులారా! పూర్వ సిద్ధులచేత కీర్తింపబడి ఉదాహరింపబడిన ఆ భద్రాశ్వుల చిహ్నములను సంగ్రహముగా వినుడు. అది భద్రాశ్వ దేశము ప్రసిద్ధమైన సమస్త దేవకూట పర్వతమునకు పరముగా తూరుపు దిక్కుగా అన్ని దిక్కుల యందు ఉన్నట్లు చెప్పబడినది. కులాచలములయొక్కయు, విశేషించి నదుల యొక్కయు, జనపదములు (దేశముల) యొక్కయు, స్వరూపము చూచిన రీతిగను, విన్న రీతిగను నాచే మీకు చెప్పబడినది. శైవాలము, వర్ణమాలాగ్రము, కోరంజము, శ్వేతవర్ణము, నీలము అను ఈ అయిదు కులపర్వతములు, వాని (నుండి పుట్టిన) సంతానమైన ఇతర పర్వతములు బహు విస్తరములై నూర్ల కొలదియు, వేలకొలదియు అయిన కోటికోటుల భూమియందు కలవు. అవి జనావాస దేశములలో (జనపదములలో) కలసి అనేక ప్రాణులతో వ్యాకులమై అనేక విధముల జాతులుగలవై, అనేక రాజులచే పరిపాలింపబడినవి. పరాక్రమ వంతులు శ్రీమంతులైన పురుష శ్రేష్ఠులచే నివసింపబడిన ఆ జనపదములు కీర్తనీయములుగా తేజరిల్లినవి.

సమస్థానములయందును, విషమ స్థానములందును, గిరుల మధ్యలో నివేశించిన వివిధములైన రాష్ట్రములు వానియొక్క పేరులనువినుడు. అట్లే సుమంగళములు, శుద్ధములు, చంద్రకాంతములు, సునందనములు, వజ్రకములు, నీలశైలేయములు, సావీరములు, విజయస్థలములు, మహాస్థలములు, సుకామములు, మహాకేశములు, సుమార్థజములు, వాంతరంహములు, సోపసంగములు, పరివాయములు, పరావాచకములు, సంభాషకములు, మహానేత్రములు, శైవాలములు, స్తనపములు, కుముదములు, శాకముండములు, ఉరః సంకీర్ణ భౌమకములు, శంఖాఖ్యములు, భావిసంద్రములు, ఉత్తరములు, హైమ భౌమకములు, కృష్ణ భౌమములు, సుభౌమములు, మహా భౌమములు అని ఇవియు, మరి ఇతరములు అయిన జనపదములు అనేకములగురించి నేను చెప్పితిని.

ఆ జన పదవాసులు మహాపుణ్యులై మహాగంగయైన మహానది యొక్క జలమును త్రాగుదురు. మొదట ముల్లోకములలోను ప్రసిద్ధిచెందినదియు, ఆ మహానది చల్లని నీటిని ప్రవహించు నదియు అయినది. అట్లే హంసవసతి, మహాచక్ర, వక్రకాంచీ, సురస (అను నదులు), శాఖావతీ, ఇంద్రానదీ, మేఘా, మంగారవాహినీ, కావేరీ, హరితోయా, సోమవార్తా, శతప్రదా, వనమాలా, వసుమతీ, పంపా, పంపావతీ, సువర్ణా, పంచవర్ణా పుణ్యా, వపుష్మతీ, మణివ్రతా, సువప్రా, బ్రహ్మభాగా, శిలాశినీ, కృష్ణతోయా, పుణ్యోదా, నాగపదీ, శైవాలినీ, మణితలూ, క్షారోదా, అరుణావతీ, విష్ణుపదీ, మహాపుణ్యా, హిరణ్యవాహీ, నీలా స్కందకూలా, సురావతీ, వామోదా, పతాకా, వేతాలీ అను ఈ గంగా మహానదులు నాయికలుగా పరిగణింపబడినవి. చిన్న నదులు, పుణ్యవతులుగా చెప్పబడినవి. ఈ నదులను కీర్తించుట (పలుకుట) చేతగూడ మానవుడు పవిత్రుడగునని నా తలంపు.

అది సమృద్ధమైన రాష్ట్రము. విశాలమైనది. అనేక జనపదములు ఉండు దేశములచే వ్యాకులమైనది. అనేక వృక్షములు వనములును గల ఉన్నత దేశము. అనేక పర్వతములతో చక్కగా చుట్టబడినది. పురుష, స్త్రీ గుణములచే వ్యాపించినది. నిత్యము సంతుష్టమైనది. మంగళమైనది. అనేక ధాన్యములచేత, ధనములచేతను కూడినది. అనేక రాజులచే పరిపాలింపబడినది. అట్టి దేశమున బంగారు వర్ణము గలవారును, శంఖపు చిప్పలవలె తెల్లని వర్ణముగలవారును, మహాకాయులును, మహావీర్యులును అయిన పురుషులు పురుష శ్రేష్ఠులుగా చెప్పబడిరి. అచట ప్రజలు మహాభాగ్యవంతులై దేవతలతో గూడ సంభాషణమును దర్శన మును, సమస్థానమున కూర్చుండుట మొదలగు గౌరవములను పొందుచుండిరి. వారి ఆయువు పదివేలయేండ్లు. ఆ మహాత్ములయందు ధర్మాధర్మ భేదము లేదు. అహింస, సత్యవచనము వారిలో సహజముగనే ఉండును. వారు దేవుడగు శంకరునకును పరమ వైష్ణవియగు (విష్ణు సహోదరియగు) గౌరికిని నిత్యమును యాగ పూజా నమస్కారములను చేయుదురు.