వాయు మహా పురాణము
శ్రాద్ధ కల్పము
బృహస్పతి ఇట్లు అనెను:
ఇక, పవిత్రములైనవియు వర్ణింప తగినవియు అయిన శ్రాద్ధకర్మలను, దానములను వాని ఫలములను చెప్పెదను. మంచుపడినపుడును అగ్ని హోత్రమును చేయవలెను. లేక మంచునైనను అచటినుండి తీసివేయవలెను. అచట(శ్రాద్ధ) అగ్నిహోత్రము పరమ పుణ్యము. రాహుదర్శనము కానపుడు రాత్రి శ్రాద్ధము చేయరాదు. రాహుదర్శనమున వేగముగా సర్వస్వముచేత శ్రాద్ధమును చేయవలెను. రాహుగ్రస్త సూర్య చంద్రగ్రహణ సమయమున శ్రాద్ధము చేయనివాడు బురదలోని గోవువలె నశించును. అప్పుడు శ్రాద్ధము చేయువాడు సముద్రమునందునావవలె పాపమగ్నులను ఉద్ధరించును. విశ్వదేవ సంబంధమైనదియు, సోమసంబంధమైనదియు అయిన, బహుమాంసపరము అయిన హవిస్సును వదలవలెను. ఖడ్గమృగముయొక్క కొమ్మును వదలవలెను. పూర్వము మహాత్ముడైన దేవేంద్రునిచే వారింపబడుచు, త్వష్ట, శచీపతియైన ఇంద్రుని సోమమును త్రాగుచు భూమియందు పడిపోయెను. ఆతనియొక్క తెరచికొన్న ముక్కుల నుండి వెలువడిన సోమ బిందువులు పితరులపై శ్యామాకములుగా (చామలుగా) పుట్టి పూజింపబడినవి. ఆ శ్లేష్మములు (ముక్కు నుండి వెలువడ్డ జల్లు బిందువులు) చల్లనివై చెరకుల వలె మధురము లైనవై మనోహరములైనవి. శ్యామాకములచేతను చెరకులచేతను పితరులు సార్వకామికమైన ఆగ్రయణమును(శ్రాద్ధమును)చేయవలెను. అతడు వేగముగ సిద్ధిని పొందును. చామలు, హస్తి నామకము పొట్ల,ములకపండు, తీవ్రమైన అగస్త్య శిఖ (అగిసె కొస), అన్ని కషాయములును, మొదలగునవియు, తక్కిన స్వాదువులు మధురములును, శొంఠి దీర్ఘమూలకము (తీగతుమడి), రుచ్యములైన వెదురు మొలకలు, సర్జకము (జీవకమను గంధద్రవ్యము), భూస్తృణములు - ఇవి అన్నియు శ్రాద్ధమున ఈయదగినవి. ఇక శ్రాద్ధ కర్మలో నిత్యము వదలవలసిన వానిని చెప్పెదను. గృంజనమైన లశునము (నమలునపుడు కరకరమను వెల్లుల్లి), పలాండువు (గడ్డయే వేరుగాగల నీరుల్లి లేక ఎఱ్ఱ ఉల్లి), కరంభాదులు (పెరుగు గలిపిన వేపుడుపిండి), తక్కిన రసగంధములు లేనివియు, ఇవన్నియు శ్రాద్ధకర్మలో వదిలి వేయతగినవి. ఈ వదలివేయుటకు కారణము ఏమనగా? పూర్వము దేవాసుర యుద్ధమున దేవతలచే జయింపబడిన ‘బలి’ యొక్క గాయముల నుండి పైకి వచ్చుచున్న రక్తబిందువులు భూమిపైపడి లశునాదులు (వెల్లుల్లి మొదలగునవి)గా ఉద్భవించినవి. అందువల్ల ఇవి శ్రాద్ధకర్మలో నిత్యము వదిలివేయతగినవి. తరువాత వేదమున చెప్పిన చెట్లజిగురులు, ఊషరములైన లవణములు, శ్రాద్ధకర్మలో వదలతగినవి. రజస్వలలైన స్త్రీలుకూడ వదిలివేయ దగినవారే. దుర్గంధముకలది, నురుగు కలదియునైన జలము, ఆవునకు తృప్తినీయలేని మగగోవు, రాత్రియందుచరించు గోవు - ఇవి అన్నియు శ్రాద్ధమున వర్ణ్యములు. గొఱ్ఱె, మృగము, ఒంటె, గిట్టలు చీలనిగుఱ్ఱము మొదలగునవి, బఱ్ఱె, చమరీ మృగము - వీని పాలు శ్రాద్ధమున తెలిసి వాడరాదు.
ఈ తరువాత శ్రాద్ధమున వదలవలసిన దేశములను చెప్పెదను. శ్రాద్ధము చూడరాని వారు, శ్రాద్ధములో మొత్తము శౌచాశౌచములు - వీనిని చెప్పెదను. వన సంబంధములైన కందమూలములు, ఫలాహారములు - వీనిచే శ్రద్ధగా శ్రాద్ధము చేసినవాడు కోరిన రాష్ట్రమును పొందును. యశస్కరమగు స్వర్గమును మోక్షమును పొందును. అనిష్ట శబ్దముల కల్లోలమును, జంతువుల వ్యాప్తిని, దుర్గంధ భూమిని శ్రాద్ధకర్మలో వదలవలెను. ఆగ్నేయ దిశా ద్వారముగా సాగర పర్యంతము పోవు నదులు, త్రిశంకుదేశమును పండ్రెండు యోజనముల విస్తీర్ణముగా శ్రాద్ధమున వదిలివేయవలెను. మహానదికి ఉత్తరమున, కైకటమునకు దక్షిణమునను ఉన్న దేశము త్రైశంకుదేశము, సింధువునకు ఉత్తరమున ఉన్న దేశము - ఇవి ప్రనష్టములైన ఆశ్రమ ధర్మములుగల దేశములు. వీనిని శ్రాద్ధమున ప్రయత్నపూర్వకముగ వదిలి వేయవలెను. సువ్యవస్థితమైన శ్రాద్ధమును దిగంబర నగ్న సన్యాసులు మొదలైనవారు చూడరాదు. వారిచేత చూడబడినవి పితరులనుకాని, పితామహులనుకాని చేరవు.
అంతటశంయువు:
ఓ బ్రాహ్మణ ముఖ్యులలో శ్రేష్ఠా! భగవన్! నగ్నాదులను గూర్చి అడుగుచున్న నాకు వారి విషయమై ఇంకను విస్తరముగా చెప్పుము అని అడుగగా... ఈ విధముగ అడుగబడిన మహాతేజస్వి బృహస్పతి ఆ శంయువుతో - సర్వప్రాణులకు త్రయీ సంవరణము, ఋక్, యజుస్, స్సామవేదత్రయము చెప్పినవాని, ఇష్టపూర్వకముగా ఆచరించవలెను. అజ్ఞానమున దానిని త్యజించినవారు అగ్నులు. అలంబములేని నరుడు, అలంబము లేనివృషభము గూడ ప్రలీనము చెందును (నశించును). వృషభమును వదిలి వేరొకచో మోక్షమును వెదకువాడు ప్రలీనుడు అగును. వృషభము వేదములతో సమానమైనది. - దీనిని చక్కగా చూడనివాడు, ప్రలీనుడు అగును. పూర్వము దేవాసుర యుద్ధమున అసురులు పరాజితులైరి. అకారణమున బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులును అన్ని విధములుగ అంతటను వ్యాపించిరి. ఇది పాషండ వైకృత స్థానమున బ్రహ్మ సృష్టికాదు. ద్విశ్రాద్ధకుడు, నిర్గ్రంధులు, శాక్యులు - పుష్టికలంశకులు, వారు ధర్మమును అనుసరింపరు. వారు నగ్నాదులైన జనులు, వ్యర్థముగ జడలు ధరించు వాడు, వ్యర్థముగ ముద్రల ధరించువాడు, వీరందరు నగ్నాదిజనులు. కులంధములు (కుల నాశకులు), నిషాదులు, పుష్టి వినాశకులు, కృత కర్మాక్షితులైన వీరు కుమారులుగా చెప్పబడినారు. వీరిచే నిర్వర్తింపబడినదియు లేక చూడబడినదియు అయిన శ్రాద్ధమునకు వెళ్లిన మానవులు, బ్రహ్మహత్య చేసిన వాడు(రు), చేసినమేలు మరచినవాడు(రు), నాస్తికులు, గురుతల్పగులు (గురు భార్యతో సంగమించినవాడు), దస్యులు (దొంగలు), క్రూరులు - వీరు చూచిన, శ్రాద్ధములను వదలివేయవలెను.
ఇతర పాపకర్ములనుకూడ శ్రాద్ధమును చూడనీయరాదు. విశేషించి దేవదేవర్షుల నిందలో ఆసక్తులైన వారిని శ్రాద్ధమునకు వదిలివేయవలెను. పైవారిచే చూడబడిన శ్రాద్ధములు రాక్షసులను యాతుధానులను చేరునుకాని పితరులను చేరవు. కృతయుగము బ్రాహ్మముగా (బ్రాహ్మణ సంబంధిగా) చెప్పబడినది. త్రేతాయుగము క్షత్రియయుగము అనబడినది. ద్వాపరము వైశ్య యుగము అనిరి, కలియుగము శూద్రము అనబడినది.
పితరులు ఇట్లు అనెను:
కృతయుగమున వేదములు పూజింపతగినవి, త్రేతా యుగమున దేవతలు పూజ్యులు, ద్వాపరమున నిత్యము యుద్ధములు ప్రకాశింపదగినవి. కలియుగమున పాషండులు పూజ్యులు. అవమానుడైన అపవిత్రుడైనవాడు, కోడియు, ఊరపందియు, కుక్కయును - ఇవి దర్శన మాత్రమున శ్రాద్ధమును ధ్వంసము చేయును. శవ - సూతకము తగిలినవాడు, దీర్ఘ రోగములు తగిలినవాడు, మలినులు, పతితులు, వీరిచేత ఏవిధముగ నైనను శ్రాద్ధము చూడబడరాదు. వీరు శ్రాద్ధాన్నము చూచిన అది హవ్య కవ్యములకు పనికిరాదు. వారిచేత తాకబడిన ప్రధానమైన వస్తువు సంస్కారశ్వాపద అగును. (సంస్కారమునకై నిలబడిన క్రూరము అగును). హవిస్సుల సమూహములు పూర్వమే వదలబడినవి. ఇక మట్టితో గూడిన నీటి ప్రోక్షణము విధింపబడును. తెల్ల ఆవాలను, నల్ల నూవులను చల్లవలెను. గురు, సూర్య, అగ్నివస్తువుల దర్శనము ప్రయత్నపూర్వకముగా చేయవలెను. ఆసనములను ఎక్కుచుండగా పాదములచే త్రొక్కబడినిదియు, అపవిత్రములై చరించు మృగములు చూచి నదియు, ఎండినది, చలిదియైనదియు, తిన్నదియు, అంతట చెడిపోయినదియు, అగ్రమున నాకబడినదియు, ఇసుక, వెంట్రుకలు, రాళ్లు, కీటకములు, వీనిచే కలిసినదియు, తిలయవాదులలో సారము తీసిన పిడుచరూపమును, ప్రత్యక్షముగా ఉప్పుగా చేయబడిన సిద్ధాక్షతములైన భక్ష్యములు, వస్త్రములతో విదిల్చబడినవియు శ్రాద్ధ కర్మలో వదిలివేయదగినవి. వేద విరోధముచే కొందరు తమను విజ్ఞానులుగా భావించువారు ఉందురు. అజ(య)జ్ఞపతులను అట్టివారు శ్రాద్ధమునకు రజస్సు వంటివారు. పెఱుగు - శాకము అట్లే తినగూడనివి, శుక్తమును (పులి కడుగు మాంసము) - ఇవి వదిలివేయతగినవి. వంకాయను వదిలివేయవలెను, అన్ని రసాయనముల అభిషవములను, సైంధవ లవణమును, అట్లే మానససంభవమైన దానిని చిత్తము తలచని దానిని ఈయవలెను. ఇది పవిత్రమై పరమమై ప్రత్యక్షముగ కూడ ఉండును. దానిని అగ్నిలోవేసి చేతులను కప్పి ప్రయత్నముతో బంధింపవలెను. తరువాత దానిని శిరమును పొందింపవలెను. అదియే బ్రహ్మతీర్థము అనబడినది. ద్రవ్యములను చూచుటయును తరువాత ఆవపనము చేయుటయును చేయవలెను. అటనుంచి నీటిచే తడుపవలె, అట్లే నీళ్లలో ఉంచవలెను. అరిష్టములు ఎక్కువగా ఉన్నపుడు బిల్వమును, ఇంగువ - శ్వదనములను ఉంచవలెను. విదలములైన వాని అన్నింటికిని ధర్మమునకువలె శౌచము చేయదగినది. అట్లే దంత, అస్థి, దారువులకును, కొమ్ములకును అవలేఖనము చేయవలెను. అనగా క్రిందుగా రాపిడి చేయవలెను. అన్ని మట్టివస్తువులను మరల కాల్చుటతో శుద్ధి అగును. మణి, వజ్ర, ప్రవాళములకు, ముక్తా, శంఖమణికిని, తెల్లవాలకల్కము (మడ్డి)తోగాని, నూవుల కల్కముతోగాని శుద్ధి అగును. అవికములయొక్క సర్వ వాలములకు అన్ని విధముల శుద్ధి అగును. అన్ని ఆవికముల వాలములకు మట్టి నీళ్లతో శుద్ధి విధింపబడును. ఆద్యంతములో పవిత్రములైన వానిని మరలనీటితో కడుగవలెను. నూలు వస్త్రములకు భస్మముతో శుద్ధి చెప్పబడినది. ఫల, పుష్పశలాక (బాణ)ములకు నీటిలో ముంచి తేల్చుటతో శుద్ధి. ఊడ్చుట, ప్రోక్షణము, అలుకుటయు భూమికి శుద్ధి క్రియలు, గ్రామము వెలుపల నుండి వెలువడిన భూమి వాయువుచేత పవిత్రమగును. ధనుష్మంతునకును పక్షులకును మట్టితోనే శుద్ధి చెప్పబడినది. ఇది శౌచము యొక్క ఉత్తమ విధి. ఈ తరువాత నేను చెప్పునది వినుము.
ప్రొద్దున గృహమునకు వాయవ్యదిశగా బాణము వేయునంత దూరమున బండి కన్ను అంత స్థానమునుచేసి అట దొడ్డికి వెళ్లవలెను. అపుడు తలను గుడ్డతో కప్పుకొనవలె, శిరమును చేతితో తాకరాదు. ఎండిన గడ్డితోకాని, కట్టెలతోకాని, అకులతోకాని, వెదురు టాకుతోకాని, మట్టిపాత్రలతోకాని, భూమిని కప్పివేయవలెను. తోడిన నీళ్లను మట్టిని తెచ్చుకొనవలెను. మౌనము వహింపవలెను. పగలు తూర్పువైపు మొగముచేసియు, రాత్రి దక్షిణమువైపు మొగముచేసియు మలవిసర్జనము కూర్చొనవలెను. కుడిచేత కమండలమును తీసికొనవలెను. ఎడమచేతితో గుదమున మూడు పర్యాయములు మట్టించి శుద్ధి చేసి కొనవలెను. తరువాత ఎడమచేత క్రమమున పది పర్యాయములు మట్టి వేయవలెను. లేదా రెండు చేతులతో ఐదు పర్యాయములైనను మట్టిని (దొడ్డికి వెళ్లిన చోట) వేయవలెను. మట్టితో పాదములు కడుగుకొని, యథావిధిగా ఆచమనము చేయవలెను. సూర్య, అగ్ని, వాయు, జల దేవతలకు మూడుమారులు జలమును వదలవలెను. పండితుడు కమండులువును నీటి యందు దగ్గరగా ఉంచవలెను. వీటిచేత అసత్కార్యమును అనగా మలవిసర్జనము చేయవలెను. శాస్త్రీయముగా మొదట పాద ప్రక్షాళనము చేయవలెను. రెండవదిగా ఆచమనము, తరువాత దేవకార్యము (పూజ) చేయవలెను. దుష్టహస్తమున (స్పర్శచేత) మూడు రాత్రములు ఉపవాసము చేయవలెను. దుష్టుని స్పర్శదూరముగా ఉన్నను సాంతపనాది వ్రతముచే ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. కుక్కనుగాని, కుక్కను వండి తినువానినిగాని తాకినచో తపకృచ్ఛ్రములను వ్రతమును ఆచరింపవలెను. మనుష్యుల ఎముకలను తాకినచో, శుద్దికారణముగా ఉపవాసము చేయవలెను. అది మూడు రాత్రులుగాని, స్నేహముతో (నేతితో) ఏకరాత్రముగాని ఉపవాసము చేయవలెను. కారస్కరులు, పులిందులు, అంధశబరాదులు వీరిని తాకినచో, వీటిని త్రాగిన శుద్ధి, ఐశ్వర్యము పోయినచో బండినొగనుచేరి ధరించిన శుద్ధి, సింధువునకు ఉత్తర పర్యంతముగను, అట్లే దివ్యంతరమునను పాపజనులచే నివసింపబడిన పాప దేశములు నూరు కలవు. అవి వేదపారగులై బ్రాహ్మణులైన శిష్టులచే వదిలిపెట్టబడినవి. అట్టి పాపదేశములకు వెళ్లినవాడు సమస్తపాపమును అనుభవించును. మనస్సును వ్యక్తపరచుట, అగ్ని, సకాలమున గోమయాదిలేపనము, శౌచములు ప్రకాశనము. ఇవి శౌచ సాధనములు. కాని వీనిని నిత్యము తెలియకుండుట పాపము. కావున అజ్ఞానము వలన శౌచమునకు సాంకర్యము చేయువాని కార్యఫలములు పిశాచములకు యాతుధాను లను నిస్సంశయముగా అందును. శౌచమున శ్రద్ధ వహింపనివాడు మ్లేఛ్ఛ జాతులలో పుట్టును. యజ్ఞము చేయనివాడు, పాపి, పశుపక్ష్యాది యోనిలో పుట్టినవాడైనను, నరుడు శౌచముచే మోక్షమును పొందువాడై స్వర్గవాసి అగును. శుచికాములైన దేవతలు కూడ ఇట్లే అగుదురు -అని దేవతలే చెప్పిరి. దేవతలు ఎల్లప్పుడు బీభత్సుని, అశుచిని వదిలి వేయుదురు. శుభకర్ములను గూర్చి న్యాయముగా మూడు శౌచముల (మనో, వాక్, దేహ)ను చేయుదురు. బ్రాహ్మణహితుడు, ఆతిథ్యము స్వీకరించువాడు, శౌచములతో కూడినవాడు, బుద్ధిమంతుడు, పితృ భక్తుడు, ఇంద్రియములను దమింపగలవాడు, దయగలవాడును అయినవారికి, బ్రాహ్మణులు, యోగమును వర్ధిల్లజేయువారగు పితరులును ఆయా చర్యలచే సంతుష్టి చెందినవారై, మనస్సుతో కోరిన ముల్లోకములలోని కోరికలను నెరవేర్తురు.