వాయు మహా పురాణము
గయా మాహాత్మ్యము - 3
సనత్కుమారుడు అనెను:
“ఓ నారదా! ముక్తినిచ్చు శిలా మాహాత్మ్యమును చెప్పెద వినుము. ఆ శిలామాహాత్మ్యమును దేవతలు, మునిశ్రేష్ఠులును గానము చేయుదురు. శిలయందున్న ఆ ధర్మవ్రత భూమిని మిక్కిలి పవిత్రము చేయునది. అచటి విచిత్రమను శిలాతీర్థము ముల్లోకములలో ప్రసిద్ధిచెందినది. ఆ శిలాస్పర్శవలన సర్వలోకములలోని జనులు వైకుంఠమునకు పోయిరి. అప్పుడు ముల్లోకములు శూన్యముకాగా, యమపురి కూడా శూన్యము అయ్యెను. యముడు ఇంద్రాదులతో వెళ్ళి బ్రహ్మతో ఆశ్చర్యముగ ఇట్లనెను. ఓ పితామహా, బ్రహ్మా! నా అధికారమైన యమదండమును తీసికొనుము. అనగానే బ్రహ్మ యమునితో నీ స్వగృహమున దానిని ధరింపుము అనెను. అనగానే ధర్మరాజు గృహమున దానిని ధరించెను. యముడు పాపుల శాసించుట మొదలగు తన అధికారమును నిర్వహించెను. ఈ విధముగా శిల జగమున మిక్కిలి బరువైనదని ప్రసిద్ధి చెందినది. బ్రహ్మాండమున, బ్రహ్మవలెను. విష్ణువు వలెను, మహేశ్వరుని వలెను, మేరువు వలెను ఈమె దేవరూపిణియై ఉండును. బరువైనదిగా గయాసురుని శిరమున ధరింపబడి నందున, రెండు పవిత్రముల యోగము పితరులకు మోక్షదాయకము. రెండు పవిత్రముల యోగమున బ్రహ్మ హయమేధ యాగముచేసెను. అందలి భాగమునకై వచ్చిన విష్ణ్వాదులను చూచి శిల “పితరుల ముక్తి కొఱకు శిలయందు ఉండుమని ప్రతిజ్ఞను చేయుడు” అనగనే, అట్లేఅని ఆ శీలయందు ఆ విష్ణ్వాదులు ఉండిరి. దేవతలు శిలారూపమున ఆకారముతోను, పాదముల రూపమునను, పూర్వ ప్రతిజ్ఞచే మూర్తామూర్త (ఆకార నిరాకార) రూపమున ఉండిరి. గయాసురుని తలవెనుకభాగమున ఆ శిల ఉన్నందున, నది ముండ పృష్ఠాద్రి అనబడినది. అది పితరులకు బ్రహ్మలోక ప్రాప్తినిచ్చును. శిలాపాదము ప్రభాసించు పర్వతముతో కప్పబడినందునను, సూర్యునితో ప్రకాశింపబడినందునను, అట ప్రభాసము ఏర్పరుపబడినది. ఆ ప్రభాసమును భేదించుకొని శిలయొక్క అంగుష్ఠము బయల్పడినది. ఆ అంగుష్ఠము నుంచి లేచిన ఈశుడు ప్రభాసేశుడనబడెను. శిలాంగుష్ఠము యొక్క ఒక భాగము ప్రేతశిల అనబడినది. అచట పిండదానము చేయుటచే నరుడు ముక్తుడగును. మహానదీ-ప్రభాసాదుల యొక్క సంగమున స్నానముచేయు నరుడు ముక్తుడగును. అచట రాముడు తనదేవి సీతతో పాటు స్నానము చేసినందున, మహానదిచేత “ఓ రామా ఇచట స్నానము చేయుము”- అని రాముడు ప్రార్థింపబడినందున ఇది రామతీర్థము అని ముల్లోకములలోను ప్రసిద్ధి చెందినది. రామతీర్థమున స్నానము చేసినందున నూరు జన్మాంతరములలో నేనుచేసిన పాపములు పూర్తిగా అన్నియు నశించుగాక అను మంత్రముతో ఇట స్నానముచేసి శ్రాద్ధముచేసిన రామతీర్థమున పిండమును పెట్టు మానవుడు, విష్ణు లోకమునకు పోవును. రాముడు అట్లేయని సీతతో పాటు అచట నిలిచెను. ఓ రామా! రామా! మహాభుజములు కలవాడా! దేవతలకు అభయము ఇచ్చువాడా! ఇచట దేవేశుడవైన నీకు నమస్కరించుచున్నాను. నా పాతకము నశించుగాక” - అను మంత్రముతో స్నానముచేసి సపిండముగా శ్రాద్ధము చేసినవాని పితరులు ప్రేతత్వమును వీడి పితృదేవతలు అగుదురు. “ఓ దేవేశా! నీవు నీరు. తేజస్సులకు పతివి, ఓ దేవేశ! నాయొక్క మనో- వాక్-కాయ- కర్మల వల్ల గలిగిన పాపమును నశింప చేయుము” అని ప్రార్థించు మానవుడు ప్రభాసేశునికి నమస్కరించి ప్రకాశించుచున్నవాడై శివుని పొందును. ఆ శివునికి నమస్కరించిన తరువాత యమబలిని (పూజను) చేయవలెను. రాముడు వనమునకేగగా, భరతుడు ఈ శైలమునకు వచ్చి యుండెను. అచట పితృపిండాది కర్మలను చేసి, రాముని సంస్థాపించి, రాముని, సీతను, లక్ష్మణుని, మునులను ఆ ప్రభువు నిలిపెను. పవిత్రమైన భరతుని ఆశ్రమమున మతంగ మహాముని పదము మిక్కిలి పుణ్యాత్ములచే నిత్యము చుట్టబడి సర్వమానవులకు కనబడును. ఈ లోకముయొక్క ధర్మ సర్వస్వము నిదర్శనముగా స్థాపింపబడినది. మతంగముని పదమున శ్రాద్ధము చేయువాడు పితరులనందరిని తరింపచేయును. రామతీర్థమున స్నానము చేసి, రాముని, సీతను పూజించి, రామేశ్వరునకు నమస్కరించి దేహము ధరించిన నరుడు మరల జన్మింపడు.
ఆ శిలయొక్క జఘన భాగము (పిరుదులున్న భాగము) మరల ఒక నగరముతో (పర్వతముతో) ఆక్రమింపబడినది. ధర్మరాజుచే ‘నగచ్ఛ! (పోవకుము) అని చెప్పబడుటచే ఆ పర్వతము నగమైనది. యమరాజ, ధర్మరాజులు గయాసురుని నిశ్చలతకై అచట (శిల యందు) ఉండిరి. వారిరువురికి పితరుల విముక్తి కొఱకు బలిని ఇత్తురు. “రెండు కుక్కలు నలుపు చిత్ర వర్ణము గలవి. వైవస్వతకులమున పుట్టినవి. వానికి బలిని ఇత్తును. అవి హింసింపనివి అగు గాక! తూరుపు, పడమర, వాయవ్యము, దక్షిణము, నైరృత్యము- ఈ దిక్కులలో ఉన్న కాకులు మరల నేను ఉంచిన పిండమును ప్రతిగ్రహించుగాక. ఓ మహాబలా! వాయుదేవా! నీవు యముడవు, యమదూతవు. కాకివి. నేనిచ్చిన బలిని తిని ఏడు జన్మలలో చేసిన పాపమును నశింపజేయుము” అని ప్రార్థించవలెను. రాముడు వనమునకు వెళ్లగా, భరతుడు ఇటకు వచ్చి పిండదానాది కర్మలజేసి రామేశ్వరుని స్థాపించెను. ఈ తీర్థమున స్నానము చేసి రామసీతాసమేతుడైన రామేశునికి నమస్కరించి, అచట సపిండకముగా శ్రాద్ధముజేసిన నరుడు నూరుతరముల పితరులతో సహా విష్ణుపురమునకు పోవును. శిలయొక్క కుడిచేతియందు కుండపర్వతము స్థాపింపబడినది. చీకటి పోగొట్టు సూర్యుడు, ఈశాన-భర్గులు, మహేశ్వరులు, అగ్ని, ఇద్దరు వరుణులు, నలుగురు రుద్రులును పితరులకు మోక్షమును ఇచ్చువారు. భరతాశ్రమమునకు వచ్చి నరుడు వారికి నమస్కరింపవలెను. ఓ నారదా! భరతాశ్రమములో ఎచ్చటనైనను స్నానము చేసి శ్రాద్ధముచేసినచో నరుడు ఆ కల్పమున కూడ నశింపడు, పితరులతో పాటు పాపముల నుండియు, ఉపపాపముల నుండియు విముక్తుడు అగును. గయలో చేసిన శ్రాద్ధము, జప-హోమ-తపములును అక్షయములగును. భరతాశ్రమములో దానము ఇచ్చినది అంతయు అనంతమగునని అందురు. నాలుగు యుగముల స్వరూపములలో చూడబడియు, తాకబడియు, పూజింపబడిన నాలుగు రవి మూర్తులు పితరులకు ముక్తిని ఇచ్చునవి. ముక్తివామనుడనువాడే తారకము అను విధి శ్రేష్ఠమైనది. సంసార సముద్రమున తపించినవారికి ఈ సురేశ్వరులు నౌకలు. మరణించినవారందరికిని, జీవించుచున్న వారందరికిని ఈ బ్రహ్మతారకము తరింపచేయునట్టిది. మూడడుగులు వేసి విశ్వమంతయు ఆక్రమించిన బ్రహ్మరూపియైన పురుషోత్తముని (విష్ణువును) ఇచ్చట చూచినవాడు ధర్మాత్ముడై పితరులతో పాటు పరమపదమును చేరును.
అచట ఉద్యంతకమను కుండము గీతవాదిత్రకము అను పర్వతమును కలవు. శిలయొక్క ఎడమ పాదమున కూడఅట్లే అభ్యుద్యంతకమను పర్వతము స్థాపింపబడినది. అచట పిండమునిడినవాడు తన పితరులను బ్రహ్మపురమునకు కొనిపోవును. అచట ఉద్యంతకమను కుండమున బ్రహ్మను తన తపముచే చేసెను. అచట సావిత్రి తన ఇరువురి కుమారులతో కూడ ఉండినది. హా హా హూ హూ మొదలగు (గంధర్వులు) అచట గీతి నాదమును చేసిరి. అచట భగవంతుడైన అగస్త్యుడు ఉగ్రమైన తపము చేసెనట. భూమిలో దుర్లభమైన వరమును బ్రహ్మనుండి పొందెను. అట్లే లోపాముద్ర అను భార్యను పొందెను. పితరుల పరమగతిని పొందెను. అచట స్నానముజేసి, మధ్యాహ్నమున సావిత్రిని ఉపాసించినవాడు, కోటిజన్మలలోగూడ బ్రాహ్మణుడై ధనాఢ్యుడై వేదపారగు డగును. అగస్త్య పదమున స్నానము చేసి పిండమునిడువాడు బ్రహ్మలోకమునకు పోవును. ఆ ధర్మాత్ముడు పితరులతోసహా దేవతలకు పూజింపతగినవాడు అగును. ఇట, బ్రాహ్మణ జాతిలో పుట్టినవాడు పరబ్రహ్మనుచేరి యోని సాంకర్యమునుండి విముక్తుడగును. గయాకుమారుని నమస్కరించిన నరుడు బ్రాహ్మణ్యమును పొందును. సోమకుండము స్నానము చేసినవాడు పితరులను సోమలోకమునకు చేర్చును. కాకశీలయందు ఇచ్చిన బలి (బలిగా ఈయబడిన అన్నము) కాకుల నుండి ఋణమోక్షము నిచ్చును. స్వర్గద్వారేశ్వరునకు నమస్కరించి స్వర్గము నుండి బ్రహ్మ పురమునకు పోవును. ఆకాశగంగయందు పిండమిడువాడు నిర్మలుడై పితరులను స్వర్గమును పొందించును. నారదా! భస్మ కూటమును శిలయొక్క కుడిచేత బ్రహ్మ ధరింపచేసెను. ఆ తరువాత ఇది భస్మ కూటాద్రియై భస్మముచే స్నాతమైనది. ఓ బ్రహ్మచారీ నారదా! అచట వటేశ్వరుడై విష్ణువు ఉన్నవాడు. మతంగ పదమున పిండమిడువాడు తన పితరులను స్వర్గమునకు చేర్చును. దానికి ముందు రుక్మిణీ కుండమున్నది. పశ్చిమమున కపిలానదికలదు. కపిలానదియందు స్నానముచేసి కపి లేశునకు నమస్కరించినవాడును మాహేశీ కుండమున శ్రాద్దముచేసినవాడును, స్వర్గగామి అగును. అచటి గౌరి మంగళయై సర్వ సౌభాగ్యములను ఇచ్చును. భస్మ కూటమున జనార్దనుడు ఉండును. ఆతని హస్తమున పిండమిడు వాడును, తనయొక్కగాని, ఇతరుల యొక్కగాని, జీవించువారి యొక్క గాని, ఎడమ చేతియందు తిలలు లేక పెరుగుకలిపిన మిశ్రమమును మంత్రముతో ఇడువారందరు విష్ణు లోకమునకు పోవుదురు. “ఓ జనార్దన! ఈ పిండమును నీ చేత నిడితిని. నేను మరణించినపుడు నాకై యీ పిండమును గయా శీర్షమున నీవు ఇవ్వవలెను. ఓ జనార్దనా! పితృరూపివైన నీకు నమస్కారము. పితృపతివైన నీకు నమస్కారము. ముక్తికి హేతువైన నీకు నమస్కారము. జనార్దనా! గయలో నీవు పితృరూపమున ఉన్నావు. ఓ లక్ష్మీపతీ! నీకు నమస్కారము. పితరులకు మోక్షమొసగువాడా! నీకు నమస్కారము అని ప్రార్థనచేయుచు నరులు పుండరీకాక్షుని (కమలనేత్రుడైన విష్ణువును) ధ్యానించి మూడు (దేవ- ఋషి-పితృ) ఋణముల నుండి విముక్తులు అగుదురు. అట్టి పుండరీకాక్షుని పూజించి నరులు నిశ్చయముగా స్వర్గమును పొందిరి. ఎడమ మోకాలు భూమిపై నుంచి భీముడు జనార్దనునకు (విష్ణువునకు) నమస్కరించి సపిండకముగా శ్రాద్ధముజేసి సోదరులతో సహా విష్ణు లోకమైన వైకుంఠమునకు పోయెను. శిలయొక్క ఎడమ పాదమున ప్రేతకూటము అను పర్వతము ధరింపబడినది. ధర్మరాజు తనపాదములతో ప్రేతశిలాశ్రయమైన పర్వతము శిలయొక్క పాపభారము నుండి దూరముగా కరగ్రహణ కాననమున ప్రేతభావ స్వరూపముతో ఉంచబడినది. ధర్మవ్రత శిలయొక్క అంగస్పర్శవలన ప్రేతకూటము పవిత్రమైనది. శ్రాద్ధాదులకు కారణమైనందున ఈ తీర్థము నరులకు పితృముక్తిని ఇచ్చును. ప్రేతకూటము అక్కడ ఉన్నది. దేవతలు అచటి పదమున ఉన్నారు. అచట శ్రాద్ధాదులను చేసి పితరులకు ప్రేతత్వము నుండి విముక్తి పొందింపవలెను. ఓ నారదా! శిలాసమీపమున ఉన్న భయంకరులైన ప్రేతరూపు అందరును యమ లోకమునను భూమిలోను తిరుగుచుందురు. పుణ్యమై ప్రేతాది వర్జితమైన గయాసుర శిరమున బ్రహ్మాదులు ఉన్నారు. దానివలన వాడుగూడ పవిత్రుడైనాడు. కీకటదేశమున గయ పుణ్యమైనది. రాజవనమైన గృహము పుణ్యము. చ్యవనుని ఆశ్రమము పుణ్యము, పునఃపునః అను నది పుణ్యమైనది. వైకుంఠమున హేమదండము పుణ్యమైనది. హేమ కూటమను గిరి పుణ్యమైనది. అచట శ్రాద్ధము చేయువాడు పితరులకు బ్రహ్మ లోకమును పొందించును. శిలయొక్క దక్షిణ (కుడి) పాదమున గృధ్రకూటమను పర్వతము ధరింపబడినది. ధర్మరాజుచే సుస్థైర్యమును కలుగచేయుటకై అది చక్కగా పవిత్రమైనది. అచట మహర్షులు గద్దల రూపములో తపము చేసి విముక్తులైరి. కావున ఇది గృధ్రకూటమైనది. అచట గృధ్రేశ్వరుడు ఉన్నాడు. అచట గృధ్రేశ్వరుని చూచి నరులు శివపదమును పొందుదురు. అచట గృధ్రవటమునకు (మఱ్ఱిచెట్టును) నమస్కరించి కోరికలు తీరినవాడై స్వర్గమునకు పోవును. అచట గృధ్రగుహలో పిండమునిడువాడు శివలోకమును పొందును. అచ్ “టనే మాహేశ్వరీధార (జలధార)కలదు. అచట పిండమిడువాడు పితరులను స్వర్గము చేర్చును. అచట మూల క్షేత్రమను సరస్సుగలదు. అచట పిండమిడువాడు బ్రహ్మలోకమును పొందును. అచట శివుని చూచి ఋణవిముక్తిని, పాప విముక్తిని పొంది చివరకు శివుని చేరును. శిలయొక్క కడుపు ఆదిపాలమను పర్వతముచే ఆక్రమింపబడినది. అచట గజరూపముతో (ఏనుగు రూపమున) విఘ్నేశుడు విఘ్నముల నశింపచేయువాడై ఉండును. ఆతని నాభిలో పిండమిడువాడు పితరులను బ్రహ్మపురము చేర్చును. తలవెనుకకు మూపురము భాగమున దేవదారు వనము కలదు. తలవెనుకన అరవిందాద్రిని చూచిన నరుడు పాపమును నశింప చేసుకొనును. క్రౌంచ రూపమున ప్రవేశించిన ముని అచట తపము చేసెను. దాని అడుగులతో చిహ్నితము అయినందున అది క్రౌంచపాదము అనబడినది. అచటి జలాశయమున స్నానముచేసినవాడు మూడు కులములను (మాతృ- పితృ-శ్వశృ వంశములను) స్వర్గమును చేర్చును. సాక్షాత్తు లక్ష్మీపతియైన విష్ణువు దేవతలు అందరితో వ్యక్తావ్యక్తాత్మతతో (సూక్ష్మ రూపమునను, వ్యక్త రూపమునను) ఉన్నవాడు. కావున ఈ శిల దేవమయియైనది.
బ్రహ్మ దేవతలతో సహా నైమిశారణ్యము ప్రక్క యజ్ఞము చేసెను. ఆ తీర్థము ముఖ్యము అను పేరుగలది. అచట దేవతలు అడుగున ఉందురు. ఓ మునిశ్రేష్ఠ! నారదా! ఆ మూడు పదములంటే ఏదైన అశుభకర్మ ఉన్నచో అది నశించును. ఆ నైమిశవనము పుణ్యమైనది. అది పుణ్య పురుషులైన వ్యాసుడు, శుకుడు, పైలుడు, కణ్వుడు, బ్రహ్మ, శివుడు, హరి- వీరిచే సేవింపబడినది. వారియొక్క దర్శన మాత్రమున నరుడు పాతకముల నుండి ముక్తుడగును. ఆ శిలయొక్క (ధర్మవ్రత శిలయొక్క) ఎడమచేతి యందు ఉద్యంత కమను పర్వతము కలదు. ఆ పర్వతము మహాత్ముడైన అగస్త్యునిచే తీసికొని రాబడినది. అచట బ్రహ్మ, హరుడును ఉగ్రమైన తపమును చేసిరి. అచట ముల్లోకముల దుర్లభమై శ్రేష్ఠమైన అగస్త్యుని కుండము కలదు. అచట ఎనమండుగురు మునులు తపముచేసి శివుని చేరిరి. ఆ కుండమున ఎనమండుగురు మునులకు నమస్కరించి నరుడు పితరులను బ్రహ్మపురమునకు చేర్చును. ఓ దేవర్షీ! నారదా! మహాత్ముడు అయిన అగస్త్యుడు తపము చేసి ఉదయాద్రి నుండి ఒక శుభమైన పర్వత శ్రేష్ఠమును చేర్చెను. ఆ పర్వతమే శిలయొక్క ఎడమచేతి యందు స్థాపింపబడినది. అది వీణా-వేణు-మృదంగాది వాద్యములచేతను, దివ్యములైన గీతముల చేతను శ్రేష్ఠమై ఒప్పిన వాదిత్రకగిరి. అచట విద్యాధరుడు అనువాడు గంధర్వాప్సరో గణములతో సహదివ్యములైన గీతముల గానము చేయును. మోహనుడు, సునీథుడు, శైలూజుడు, మోహనోత్తముడు, పర్వతుడు, నారదధ్యాని, సంగీతి, పుష్ప దంతకుడు, హాహాహూహూ మొదలగువారు అచట గీత దానముచేసిరి. అట్లే ఈ పర్వతము నందు సర్వగంధర్వులతో కూడిన చిత్రరథుడు మధురములైన గీతములను ఉత్సవముగా గానము చేయును. కావున ఇప్పటికిని నిత్యము ఆ పర్వతము దేవతలచే సేవింపబడును. అచట ధర్మజులు, భస్మమే మైపూతగాగల దేవేశుడైన హరుడు ఉందురు. గీతములచే ప్రతిధ్వనించిన ఆ పర్వతమున పార్వతీ సహితుడైన రుద్రుడు పూజింపబడి సంతసించును. ఆతడు ధ్యానింపతగినవాడు. అది పితరులకు పరమగతిని ప్రసాదించును. ఓ నారదమునీ! గయలో పరమాత్మ గోపతియైన గదాధరుడు(విష్ణువు). అచట రుద్రార్చనతో వైష్ణవీమాయ నశించును. శిలయొక్క కుడిచేతియందు భస్మకూటము అను గిరి ధరింపబడినది. అచట ధర్మరాజుతో అగస్త్యుడు భార్యతో కూడియుండును. అగస్త్యుని పదమున స్నానముచేసి పిండమిడువాడు బ్రహ్మ లోకమునకు పోవును. అగస్త్యుడు భూలోకమున దుర్లభమైన మాహాత్మ్యమును బ్రహ్మనుండి వరముగా పొందెను. పితరులకు పరమగతి రూపమైన లోపాముద్రఅను భార్యనుకూడ పొందెను. సీతాద్రికి దక్షిణమున ఉన్న గిరియందు దండి నాథుడు తపము చేసెను. అచట వటశ్రేష్ఠమైనవటము (మఱ్ఱి వృక్షము) ప్రపితామహుడై (విష్ణువై) అచ్చట ఉన్నవాడు. పితరులకు ముక్తిని కలిగించును, దాని ఎదుట రుక్మిణీ కుండము, పశ్చిమమున కపిలానది, నదీతీరమున కపిలేశుడును ఉందురు. అమావాస్యతో సోముడు కలిసిఉన్నపుడు దర్శయందు- (దర్శ అనగా సూర్య చంద్ర సంగము). కపిలానదిలో స్నానముచేసి, కపిలేశుని పూజించి, నరుడు శ్రాద్ధమున పిండదానము చేయగా పితరులు మోక్షము చెందుదురు. అచట ఉద్యంతక పర్వతమును అనుసరించి అగ్నిధార వచ్చినది. అచట సరస్వతి చేత సారస్వతమను కుండము కల్పింపబడినది. అచట ప్రభువైన శుక్రుడు షండామర్కాద్రి పుత్రులతో పాటు ఉండును. “ఓ నారదముని సత్తమా! అటనట మునీంద్రుల పదములలో స్నానము చేసి శ్రాద్ధ పిండాదులను ఇడువాడు పితరులను తరింపచేయును. శిలయొక్క ఎడమ చేతియందు గృధ్రకూటము అను గిరి ధరింపబడినది. అచట మహర్షులు గృధ్ర రూపమున ఉండి తపముచేసి, సంసిద్ధులైరి. అందువల్ల అది గృధ్రకూటమైనది. అచట గృద్ధేశ్వరుడు ఉన్నవాడు. ఆ గృద్ధేశ్వరుని చూచి, నమస్కరించి, నరుడు శివ పదమును చేరును. అచట గృధ్రగిరిలో గుహయందు పిండమిడువాడు శివలోకము నందును. అచట గృధ్రగిరియందు. వటవృక్షమునకు నమస్కరించి, కోరికలు నిండినవాడై స్వర్గమునకు పోవును. అచట శివుని దర్శించి, ఋణవిముక్తిని, పాపవిముక్తిని పొంది శివుని చేరును. అచట, శూలక్షేత్రమున్నది. అచట పిండమిడువాడు పితరులకు స్వర్గమును అందించును. శిలయొక్క ఉదరమున (కడుపు భాగమున) ఆదిపాల అను గిరి ఆక్రమించి ఉన్నది. అచట విఘ్నేశుడు గజరూపమున విఘ్ననాశనుడై ఉన్నాడు. ఆతని దర్శించి విఘ్నముల నుండి విముక్తుడు అగును. పితరులను బ్రహ్మ పురమును చేర్చును. శిలయొక్క తలవెనుకల మధ్యన దేవదారువనము కలదు. గయానాభిలో సుషుమ్నయందు పిండము నిడువాడు పితరులను స్వర్గమును పొందించును. శిలయొక్క ఎడమ పాదమున ధర్మ రాజుచేత ప్రేత పర్వతము స్థాపింపబడినది. శిలయొక్క పాదభాగము నుండియు, పాపముల నుండియు ప్రేతశిల అనునది పాదముతో దూరమున ఉంచబడినది. ఐనను ఆ శిలా సంసర్గము వలన ప్రేతకూటము పవిత్రమైనది. అచట ప్రేతకుండము కూడ నున్నది. అచట పదమున దేవతలున్నారు. అచట కుండాదులను ఇడి, పితరులను ప్రేతత్వము నుండి విముక్తి పొందించవలెను. దీనికి వేరుగా ఉన్న చాలమందియు విఘ్నకారులే. ఈ తీర్థమున శ్రాద్ధాదులు చేసినవారి పితరులను విముక్తి పొందించును ప్రేతలు ధానుష్క (ధనుస్సులు ధరించినవారి) రూపమున కరగ్రహణకారకములు అగును. దేవపాదముల గుర్తులు కలిగిన ఆ శిలయొక్క తలవెనుక భాగమున మహాదేవుడు (శివుడు) ఉండును. ఆతనిని దర్శించినవాడు పాపముల నుండియు, ఉపపాతకముల నుండియు విముక్తుడు అగును. సర్వపాప వివర్జితమైన శిలాశిరమున నేను ఉంటిని. అది ప్రేతాదులచే వదలబడినదై అతి పవిత్రమై శ్రేష్ఠమైనది. కీకటదేశమున గయ పుణ్యమైనది. రాజగృహమైన వనము పుణ్యమైనది. చ్యవనుని ఆశ్రమము పుణ్యమైనది. పునఃపున అను నది పుణ్యమైనది. వైకుంఠము, లోహదండము, గృధ్రకూటము, శోణకము- ఇచట చేసిన శ్రాద్ధాదులతో నరుడు సమస్త పితరులను బ్రహ్మపురమును చేర్చును. శిలయొక్క ముండపృష్ఠమున (తలవెనుక) ముని క్రౌంచపక్షిరూపమున తపము చేసెను. ఆతని పాదములచే అంకిత మైనందున అది క్రౌంచ పాదము అనబడినది. అట జలాశయమున స్నానము చేసినవాడు తన వంశమును స్వర్గమునకు చేర్చును. కాకశిలయందు కాకులకిచ్చినబలి ఋణమోక్షము ఇచ్చును. లోమశుడు లోమహర్షణుడును (అనువారు) ఇరువురు ముండపృష్ఠమున పర్వతపు చరియయందు మహా తపముజేసి పరమసిద్ధిని పొందిరి. లోమశునిచేత నదీశ్రేష్ఠములు అచటికి పిలువబడినవి. అవి-మహానది, శరావతి, వేత్రవతి, చంద్రభాగ, సరస్వతి, కావేరి, సింధువు, ఈర, చందన, వాశిష్ఠి, సరయు, గంగ, యమున, గండకి, ఇందిర, మహావైతరణి, నిక్షర, (ఇవి స్వర్గస్థములు), సావని, అలకనంద, ఉదీచి, కనకాహ్వయ, కౌశికి, బ్రహ్మద, జ్యేష్ఠ, సర్వాఘ విమోచని, కృష్ణవల్వ, చర్మవతి. ఇవి ముక్తిదాయకములు. లోమహర్షణునిచే సాహసమున పిలువబడినవి. అట్లే అతనిచే తపః ప్రభావమున పిలువబడిన నది నర్మద. ఓ నారదా! ఆ అన్ని నదులందు స్నానముచేసి పిండమును ఇడువాడు పితరులను స్వర్గమునకు చేర్చును. ఇచట బ్రాహ్మణ యోనిలో ప్రవేశించి వెలువడినవాడు (బ్రాహ్మణ జాతిలో పుట్టినవాడు) యోని సంకటము నుండి విముక్తుడై పరబ్రహ్మను చేరును. నిక్షర అను పుష్కరిణిలో స్నానముచేసి, నియమముతో మూడు వాసరములు క్రౌంచపదమున శ్రాద్ధాదికమునుచేయు నరుడు పంచపాపులనైనను సమస్త పితరులను స్వర్గమును పొందించును. భస్మ కూటమున జనార్దనుడు ఉండును, ఆతని హస్తమున పిండమునిడువాడును, ఇతరులకుగాని, తనకుగాని పిండమిడువాడును, తిలలు లేక సవ్యముతో పెరుగుతో కలిపి జీవించువారికి పిండమునిడువాడు- వీరందరును విష్ణు లోకమునకు పోవువారు. ఓ జనార్దనా! విష్ణో! ఓ ప్రభో! నేను నీచేత నిడిన పిండము, నేనెవరికి ఇచ్చితినో మరణించిన తరువాత వారికి దానిని నీవు చేర్చవలెను. ఓ జనార్దనా! నేను నీచేత యిడిన ఈ పిండము నా అంత్య కాలమున (మరణమున) నీవు నాకు గయాశిరమున నా పిండము నీయవలె. ఓ జనార్దన! పితరులకు మోక్షమును ఇచ్చువాడా! నీకు నమస్కారము. ఓ పితృపతీ! నీకు నమస్కారము. పితృరూపివైన నీకు నమస్కారము. గయలో జనార్దనుడు స్వయముగా పితృరూపమున ఉండును. ఆ పుండరీకాక్షుని చూచి దేవ పితృగురు ఋణముల నుండి విముక్తుడు అగును. ఋణత్రయ విమోచకుడవైన ఓ పుండరీకాక్షా! నీకు నమస్కారము. ఓ లక్ష్మీకాంతా! నీకు నమస్కారము. నా పితరులకు మోక్షమునిమ్ము. భీముడు ఎడమ మోకాలును భూమియందు ఉంచి జనార్దనునకు నమస్కరించి, సపిండకముగా శ్రాద్ధముచేసి, సోదరులతో సహా బ్రహ్మ లోకము నందెను. ఆ ధర్మాత్ముడు తన నూరుతరముల వంశమును గూడ బ్రహ్మలోకము అందించెను. లక్ష్మీ పతియైన విష్ణువు శిలయందు దేవతలతో బాటు వ్యక్తరూపమునను, వ్యక్తావ్యక్త రూపమునను (ఇంద్రియ గోచరుడుగను, ఇంద్రియములకు గోచరుడై గోచరుడుకానట్లును) ఉన్నవాడు. కావున ఈ ధర్మవ్రతశిల సర్వదేవమయి అయినది అని సవిస్తరముగా తెలిపెను.