వాయు మహా పురాణము
మహేశ్వరావతారయోగము
అని చెప్పి తిరిగి వాయువు ఇట్లు పలికెను:
ముప్పది ఒకటవ కల్పము పీతవాస కల్పము అనబడినది. అచట మహా తేజుడైన బ్రహ్మ పీత (పసుపు) వర్ణమును పొందెను. పుత్రకాముడై ధ్యానము చేయుచున్న ఆ పరమేష్టిబ్రహ్మకు, మహాతేజస్వి అయిన పసుపు వస్త్రము ధరించిన కుమారుడు పుట్టెను. అతడు పసుపు గంధమును పూసికొన్న అంగములు గలవాడు. పసుపు మాలలు ధరించినవాడు యువకుడు పసుపు యజ్ఞోపవీతమును ధరించినవాడు పసుపుతలపాగా గలవాడు, మహాభుజములు గలవాడు.
ప్రభువు అయిన ఆలోకేశ్వరుని చూచి బ్రహ్మ మనస్సుతోనే ఆ లోకస్రష్ట అయిన పరమేశ్వరునికి నమస్కరించెను. తరువాత బ్రహ్మ ధ్యానమునందు ఉండి, పరా స్వరూపిణియు మహేశ్వర ముఖమునుండి వెలువడి, మహేశ్వరియై, విశిష్టరూపముగల గోవును చూచెను. ఆ గోవు నాలుగు పాదములు గలది, నాలుగు నోళ్లు గలది, నాలుగు చేతులు గలది, నాలుగు స్తనములు గలది, నాలుగు నేత్రములు గలది, నాలుగు కొమ్ములు గలది. నాలుగు కోరలుగలది. నాలుగు ముఖములుగలది. ముప్పదిరెండు లోకములతో కూడు కొన్నది. అన్ని వైపుల ముఖములుగలది సర్వాధికారిణియైన ఈశ్వరియైనది.
సర్వ దేవతలచే సమస్కరింపబడినవాడు మహాతేజోవంతుడు అయిన మహాదేవుడు మహేశ్వరియైన ఆ మహాదేవిని చూచి మరలెను. మతిస్మృతి బుద్ధి అని మాటి మాటికి గానము జేయుచుండెను, మరల మరల రారమ్మనెను. ఆ మహాదేవి కూడ చేతులు జోడించి చాలా ఎక్కువగా పైకి లేచెను. యోగముచే విశ్వమును ఆవరించి జగత్తును అంతయు వశము చేసుకొందువు మహాదేవునిచే నీవు రుద్రాణివి (రుద్రుని భార్యవు) అగుదువు. బ్రాహ్మణుల హితము కొఱకు పరమార్థము కలదానవు అనెను.
ఆ తరువాత పుత్రకాముడై ఈమెను ధ్యానము జేయుచున్న పరమేష్టికి, దేవదేవేశుడు నాలుగు పాదములు గల మహేశ్వరిని ఇచ్చెను తరువాత ధ్యానయోగముతో ఆమెను పరమేశ్వరిగా తెలిసికొన్న లోకములచేత నమస్కారము బ్రహ్మలు గ్రహించువాడగు ఆ మహేశ్వరిని పొందెను. తరువాత చక్కని నియమబద్ధుడై గాయత్రిని, రౌద్రిని, ధ్యానించెను అని ఈ విధముగా వైదిక విద్యా రూపిణిని దేవదేవేశునిచే అర్పింపబడిన (ఈయబడిన) గాయత్రీ రూపిణియైన రౌద్రీ రూపిణి కావుననే రుద్రలోక నమస్కృతమైన మహాదేవిని జపించెను. తరువాత ధ్యానయుక్తమైన చిత్తముతో మహాదేవుని పొందెను.
అటు పిమ్మట మహాదేవుడు, బ్రహ్మకై మరల తన దివ్యయోగమును స్మరించెను. అట్లు స్మరించి ఐశ్వర్యమును, జ్ఞాన సంపదను వైరాగ్యమును కూడ ఇచ్చెను. ఆ తరువాత ఈశ్వరుడు భయంకరమైన ఉజ్జ్వలమైన అట్టహాసమును (పెద్ద నవ్వును) చేసెను. ఆ నవ్వు నుండి అన్నివైపుల వెలుగులు విరజిమ్మిన కుమారకులు పుట్టిరి. వారు పసుపుపచ్చని మాలలు, వస్త్రములు ధరించినవారు, పసుపు గంధములు, పై పూతలును పూసికొన్నవారు, పసుపురంగు తలపాగాలు గలిగి పసుపు పచ్చని ముఖములు తల వెంట్రుకలు కలవారు. తరువాత వేయి సంవత్సరముల చివరవరకు ఉండి ఆ విమల తేజోవంతులు, యోగాత్ములైనవారు బ్రాహ్మణుల హితమును కోరిన వారై స్నానము చేసిరి. వారు ధర్మ బలమును యోగబలమును కలవారై, దీర్ఘ సత్రయాగముచేయు ఋషులకు యోగమును ఉపదేశించి, రుద్రుడైన ఈశ్వరునిలో ప్రవేశించిరి. ఈ విధానములతో మహేశ్వరుని పొందినవాడును నియమబద్ధమైన ఆత్మలుగల వారును ధ్యానయుక్తులై ఇంద్రియములను జయించిరి. వారందరు పాపములను వదలి తేజోవంతులై, పునర్జన్మ లేనివారై, రుద్రుడైన మహాదేవునిలో ప్రవేశించిరి.
వాయువు పలికెను:
తరువాత ఆ పసుపుపచ్చని కల్పము గడచిపోగా స్వయంభువుడగు బ్రహ్మనుండి సీతకల్పుడను పేరు మరొకడు బయలుదేరెను. అపుడు సమస్తము ఏక సముద్రముగా అయినది. దివ్యములైన వేయియేండ్లు గడచినవి. దుఃఖితుడైన బ్రహ్మ ప్రజలను సృష్టింప దలచి ధ్యానించెను. ఆ విధముగా ధ్యానించుచున్న పుత్రకామియైన బ్రహ్మయొక్క వర్ణము నల్లని వర్ణమయ్యెను. తరువాత ఆ మహాతేజోవంతుడగు బ్రహ్మ ఆవిర్భవించిన ఒక కుమారకుని చూచెను. ఆ కుమారుడు నల్లనివాడు, మహావీర్య (బల)ము గలవాడు. తన తేజముచే వెలుగులు విరజిమ్మువాడు, నల్లని వస్త్రము, తలపాగా, యజ్ఞోపవీతములు కలవాడు, నల్లని తలగలవాడు. నల్లని మాలలు, మైపూతలు కలవాడు.
అమరుడు, ఘోరమైన ఆలోచన గలవాడు, దేవదేవేశుడు, నలుపు గోరోజనము వంటి ఎరుపును కలవాడు అగు విశ్వేశునికి బ్రహ్మ నమస్కరించెను. ప్రాణాయామపరుడైన తేజోవంతుడగు బ్రహ్మ మహేశ్వరుని తన హృదయమునందు నెలకొల్పుకొనె. ధ్యానయోగముతో ఉన్న అయతీశ్వరుని మనస్సుతో పొందెను. తరువాత బ్రహ్మ అఘోర అని అనుచు పరబ్రహ్మనే ధ్యానించుచుండెను. ఈ విధముగ ధ్యానించు పరమేష్ఠి బ్రహ్మను గూర్చి, భగవంతుడైన రుద్రుడు మహా శబ్దముతో పెద్దగా నవ్వెను. తరువాత ఆ రుద్రుని ప్రక్కల నుండి నల్లని నలుగురు కుమారకులు జనించిరి. వారు నల్లని మాలలను, లేపనములను ధరించినవారు. మహాత్ములు. నల్లని వస్త్రములు తలపాగాలు ధరించినవారు. నల్లని ముఖములు నల్లని కప్పు వస్త్రములుగలవారు. వారు గూడ పెద్దగా నవ్విరి. గొప్పగా హూంకరించిరి. మాటిమాటికి పెద్దగా నమస్కారములను కూడ చేసిరి.
తరువాత వేయిసంవత్సరముల చివర యోగధారణచేత ఆ పరమేశ్వరుని ఉపాసించి మహాభాగులై శిష్యులకు ఆ యోగమును ఇచ్చిరి. తరువాత వారు ఆ యోగముచే సుసంపన్నులైన మనస్సుతో నిర్మలము, నిర్గుణము, శివము, విశ్వేశ్వరము అగు స్థానమున ప్రవేశించిరి. ఇట్లు ఈ యోగముచే తక్కిన బ్రాహ్మణులు సైతము యోగవిధానమును తెలిసిన వారై, అవ్యయుడైన రుద్రుని స్మరించి అతనిని చేరిరి.
ఆ భయంకరమైన కృష్ణ రూపమైన కల్పము గడచిపోగా తరువాత విశ్వరూపమను పేరుగల మరొక కల్పము వచ్చినది. సర్వ సంహారము జరిగి మరల చరాచర (ప్రపంచ)ము సృష్టింపబడినది. పుత్రకామియై ధ్యానము చేయుచున్న పరమేష్టియగు బ్రహ్మనుండి మహానాదము కలిగి విశ్వరూపమైన సరస్వతి ఆవిర్భవించినది.
సమస్త మాలలను, వస్త్రములను ధరించినవాడు, విశ్వమే యజ్ఞోప వీతముగాగల వాడు, విశ్వమే తలపాగగా గలవాడు సమస్త గంధములు గలవాడు, విశ్వమే స్థానముగా గలవాడు మహాభుజములు గలవాడును అగు ఆ ఈశ్వరుని యోగయుక్తుడై బ్రహ్మ తన మనస్సుతో ధ్యానించెను. సర్వేశ్వరుడై సర్వమునందున్న ప్రభువగు ఈశాన దేవునికి, ఆ బ్రహ్మ నమస్కరించి ఓం ఈశానుడవగు నీకు నమస్కారము. ఓ మహాదేవ! నీకు నమస్కారము అని స్తుతించెను. ఈ విధముగా ధ్యానమందుండి నమస్కరించుచున్న బ్రహ్మను గూర్చి ఈశానుడు నేను సంతసించితిని నీకేమి కావలెను అని పలికెను. అప్పుడు బ్రహ్మ మహేశ్వరునకు నమస్కరించి వాక్కులతో స్తుతించెను. అంతట సంతుష్టుడైన బ్రహ్మ “నీ ఈ విశ్వగమైన విశ్వేశ్వరమైన రూపమును తెలుసికొన కోరుచున్నాను. ఈ పరమేశ్వరుడు ఎవరు? ఈ భగవతియైన దేవి ఎవరు? ఈమె నాలుగు పాదములు కలదియు నాలుగు ముఖములు కలదియు, నాలుగు కొమ్ములు కలదియు నాలుగు నోళ్లు కలదియు, నాలుగు దంతములు కలదియు, నాలుగు స్తనములు కలదియు, నాలుగు చేతులు, నాలుగు నేత్రములు కలదియునై విశ్వరూపమైనట్లు ఎట్లు తలపబడినది? ఈమె పేరేమి? ఈమె ఆత్మ యెవరు? ఎట్టి క్రియలవలన ఏమి బలముగలది? తెలియగోరుచున్నాను” అని బ్రహ్మ అనెను.
మహేశ్వరుడు అనెను:
ఇది సర్వ మంత్రములలో రహస్యమైనది. పవిత్రమైనది. పుష్టిని వృద్ధి చేయునది. ఆదిసృష్టిలో ఉన్నది ఉన్నట్లుగా, ఉన్న అతి రహస్యమును వినుము. ప్రస్తుతము నడుచుచున్న కల్పమునకునకు విశ్వరూపకల్పము అని పేరు. దీనిలో భవుడు మొదలుగా గల ఇరువది ఆఱుగురు మనువులు చెప్పబడినారు. ఓ విభువైన బ్రహ్మ! నీవు ఈ బ్రహ్మ స్థానమును పొందినప్పటి నుండి ఇది ముప్పది మూడవ కల్పము. నీ ముందే నూరువేల (కోటి) స్వయంభువులు (బ్రహ్మలు) గడచిపోయిరి ఓ మహామునీ! వారిని గురించి తెలుసుకొనుము. ఇది (ముప్పది మూడవ కల్పము) ఆనందము. ఇదీ నీ యొక్క మహాలయ రూపమైన ఆనందము. గాలవ్యగోత్రము గలవారి తపస్సుచేత నా పుత్రుడవై నీవు వచ్చితివి. నీ యందు యోగము సాంఖ్యము, తపస్సు, విద్యావిధి, క్రియలు భూతము, సత్యము, అహింస, సంతతి క్రమములు, ధ్యానము, శాంతి, విద్య, అవిద్య, ధృతి, కాన్తి, శాన్తి, స్మృతి, మేధ, లజ్జ, శుద్ధి, సరస్వతి, తుష్టి, పుష్టి, క్రియ, లజ్జ, క్షాంతి, ప్రతిష్ఠితములై ఉన్నవి. ఈ ప్రకృతిని తెలుసుకొనుము. ఆమె ఇరువది అరుతద్గుణములు కలది. ముప్పది రెండక్షరముల పేరుకలది. ఓ బ్రహ్మా, ఈమెకు ప్రకృతిగాను, నిన్ను కన్న మహేశ్వరినిగాను తెలియుము. అట్టి ఆమెను తత్త్వచింతకులు ప్రధానమనియు ప్రకృతి అనియు చెప్పుదురు.
ఈమె అజ అనగా జన్మలేనిది. లోహిత అనగా రజోగుణవతి, శుక్లయు కృష్ణయు, అనగా సత్వగుణవతి, తమోగుణవతి, విశ్వములను చక్కగా సృష్టించుచున్నది. చక్కని రూపము గలది. ఇట్టి ఈ ప్రకృతి రూపము గాయత్రిగా (గానము చేయు వానిని రక్షించు దానినిగా) గోవునుగా, విశ్వరూపనుగా (విశ్వరూపిణిగా) తెలిసికొని నేను అజుడను (జన్మలేనివాడను) అయితిని, అని మహాదేవుడు అనెను.
ఈ విధముగా చెప్పి మహాదేవుడు (శివుడు) చప్పట్లధ్వని కహాకహ అను ధ్వని యునుగల అట్టహాసమును చేసెను. తరువాత మహాదేవుని ప్రక్కనుండి దివ్యులై సర్వ రూపములు గల కుమారకులు జన్మించిరి. జటి (జడలు గలవాడు) ముండి (గొరిగిన తలగలవాడు) శిఖండీ (నెమిలి ఈక తలపైనగలవాడు) అర్థముందుడు (సగము తలగొరిగి కొన్నవాడు) వీరు మహాదేవుని ప్రక్కల నుండి జన్మించినవారు. అంత వారు శాస్త్రోక్తమైన యోగములతో చక్కని గొప్ప ఓజస్సుగలవారై, దేవయానపు వేయియేండ్లు మహేశ్వరుని ఉపాసించిరి. తరువాత శిష్టులకు యోగపూర్ణమై దృఢమై నియతమైన ధర్మోపదేశము చేసిరి అట్లే నియతాత్మలై ఈశ్వరుడైన రుద్రునిలో ప్రవేశించిరి.
వాయువు పలికెను:
తరువాత ఆశ్చర్యము పొందిన లోకపితామహుడగు బ్రహ్మ భక్తి యుక్తమయిన చిత్తముతో మహాదేవుని శరణు పొంది జేరి, ఓ విభో, మహాదేవ, నీకు అంతట శ్వేతత్వము (తెలుపుదనము) ఎట్లు వచ్చినది? అని అడిగెను. భగవంతుడు శివుడు పలికెను. శ్వేత కల్పము ఉన్నప్పుడు నేను శ్వేతుడను అయితిని, తెల్లని తలపాగా గలవాడను తెల్లని మాలలు గలవాడను తెల్లని వస్త్రములు గలవాడను, శివుడను, తెల్లని ఎముకలు, మాంసము వెంట్రుకలు కలవాడను. తెల్లని చర్మముగలవాడను. తెలుపు, ఎఱుపు వర్ణము కలవాడను అయితిని. ఆ కారణముననే అప్పుడీ కల్పము శ్వేత కల్పమని ప్రసిద్ధి చెందినది. నా అనుగ్రహముననే దేవేశుడయిన బ్రహ్మ శ్వేతాంగుడు తెలుపు, ఎఱుపు వర్ణము గల వాడయ్యెను. అపుడు గాయత్రి (సరస్వతి) శ్వేతవర్ణమై బ్రహ్మీ అని పేర్కొనబడినది. ఓ! దేవేశుడవైన బ్రహ్మా! నీ చేత నేను రహస్య పదమునందు ఉన్నందునను, నా తపస్సుచేతను సద్యోజాతుడైన సనాతనునిగా తెలియబడితిని. సద్యోజాతమను నీ పరబ్రహ్మము రహస్యమని చెప్పబడినది. కావున రహస్యత్వమును పొందిన నన్ను తెలిసిన ద్విజాతులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు) పునర్జన్మ లేని శివ సామీప్యమును పొందుదురు.
నేను పేరుతో లోహితుడనై మరల ఉన్నప్పుడు నా వర్ణముచేతనే ఆ కల్పము లోహిత కల్పము అనబడినది. అప్పుడు గాయత్రీ రూపిణియగు గోవు ఎర్రని మాంసము ఎముకలు పాలుకలదై, ఎఱ్ఱని కన్నులు, స్తనములు కలదై కీర్తింపబడినది. ఆ తరువాత లోహితుడు అగుటచే వర్ణము తారుమారు కాగా యోగము వామమయినందున, వామ దేవత్వము పొందబడెను. అయినను ఆత్మను వశీకరించి మహాబలవంతుడను అగుటచే శ్వేతవర్ణము తోనే తెలియబడితిని. కావున వర్ణోత్తముడను అయితిని. ఆ తరువాత భూమిపైన వాయు దేవునిగా ప్రసిద్ధి పొందితిని. నా వామదేవత్వమును తెలిసిన ద్విజాతులు ఈమెను రుద్రాణియై గాయత్రియైన మాతనుగా తెలుసుకొని సర్వపాపముల నుండి విముక్తులై రజోగుణము వీడిన వారై, బ్రహ్మతేజము గలవారై పునర్జన్మలేని రుద్రలోకమును పొందగలరు.
నేను కృష్ణవరుడనై (నల్లనివాడనై) భయంకరునిగా ఉన్నప్పుడు, నాచే చేయబడిన వర్ణముచేత, నా కల్పము గూడ కృష్ణ కల్పమనబడినది. అచట నేను కాలముతో సమానమైన వాడను. కాలము లోకమును ప్రకాశింపచేయును. ఓ బ్రహ్మా! నేను ఘోరుడను అఘోర పరాక్రముడను అని నీవు ఎఱుగుదువు. కావున భూమిపైన నన్ను భయంకరత్వమును పొందినవానిగా తెలిసిన వారికి, నేను అభయంకరుడను, శాంతుడను, అవ్యయుడను అగుదును. కావున భూమిపై నన్ను విశ్వత్వమును పొందిన వానిగా తెలిసిన వారికి నేనెల్లప్పుడు శివుడను సౌమ్యుడను అగుదును. కావున ఈ కల్పము విశ్వరూప కల్పమనబడినది. అట్లే ఈ సావిత్రి కూడ విశ్వరూప అనబడినది. అట్లే సర్వరూపములు గల వీరందరు నీయొక్క పుత్రులైనారు. వారు లోకసమ్మతమై, నాలుగు పాదములుగా చెప్పబడిరి. కావున నాకు సర్వ వర్ణములు గల సంతానము కలిగియుండుట జరుగగలదు. వర్ణములను బట్టి ప్రజ సర్వభక్ష్యములును పవిత్రములు కాగలవు. మోక్షము ధర్మము అర్థము కామము అను ఈ నాలుగు ఉండగలవు. కావున తెలిసికొనువాడును, తెలియదగినదియు నాలుగు విధములుకాగలదు. భూతసమూహములు (పృధివ్యప్తేజస్సులు) నాలుగు. అట్లే ఆశ్రమ ములు (బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు) గూడ నాలుగు. ధర్మము యొక్క పాదములు నాలుగు అను నలుగురు పుత్రులు. కావున చరాచరమైన జగము నాలుగు యుగావస్థలు (కృత త్రేతా ద్వాపర కలి రూపములు) కలది. అట్లు నాలుగు విధములుగా ఉన్నదియు (ప్రతిది) నాలుగు పాదులు కలదిగా కలదు. 1. భూర్లోకము; 2. భువర్లోకము; 3. స్వర్లోకము; 4. మహర్లోకము; 5. జనోలోకము; 6. తపోలోకము; 7. శాంతలోకము; 8. రుద్రలోకము. వీనిలో మూడవది స్వర్లోకము, నాలుగవది మహర్లోకము అనబడునవి. అచట లోకము ఉత్కృష్టమైన స్థానము. అది యోగులకు పరమమైన స్థానము. అచట వారు నిర్మములు (మమకారము లేనివారు) నిరహంకారులు, కామ క్రోధములు లేనివారు, తద్విదులై (పరమాత్మను తెలిసిన వారై) యోగధారణమున ఉన్నవారు, పరబ్రహ్మ ధ్యాన తత్పరులునై కనబడుదురు. నీవు సరస్వతిని నాలుగు పాదములుగల దానినిగా చూచితివి. ఆమె అట్లు ఉన్నందున అన్ని పశువులును నాలుగు పాదములు కలవిగాకలవు. కావుననే వానికి నాలుగు స్థనములుండగలవు. మంత్ర సంయుక్తమైన సోమము నా ముఖమునుండి జారిపడినదై స్థనములనుండి మొత్తము ఘృతమును (నేతిని) త్రాగి, ఓ బ్రహ్మా! ప్రాణులకందరికి జీవమైనందున జగమంతయు సోమ మయముగను అమృతముగను చెప్పబడినది. ఆకారణముననే నాలుగు పాదములు ఉండగలవు. దీనికి ఆశ్వేతత్వము గూడ దానిచేతనే ఉండగలదు. ఈ లోకభావినియై సావిత్రియైన మహేశ్వరి ఈ విధమైన క్రియ గలదై ద్విపాదగా (రెండు పాదములు గలదిగా) చూడబడినందున నరులందరు రెండు పాదములు రెండు స్థనములును గలవారైరి. మహాసత్త్వము గలదై సర్వప్రాణులను ధరించునదై పరారూపిణియైన మహేశ్వరి అజయ్ (మేకయై జన్మలేనిదై) సర్వవర్ణములు కలదిగా నీచే చూడబడినందున అజములకు (మేకలకు విశ్వరూపత్వము రాగలదు. మహాతేజమైన మేకగూడ మహాతేజము కలది కాగలదు. ఈ మేక ముఖమున అంతటను అగ్నిహోత్రుడు వ్యర్థముగా (నిసఫలమైన) రేతస్సు గలవాడగును. కావున అగ్ని పశురూపియై, అంతట ఉన్న వాడై కూడ పవిత్రుడే. తపస్సుచే భావితమైన ఆత్మలు గల ద్విజులు ఈశిత్వముచేత శివత్వము చేత సర్వగతుడై అంతటను స్థిరుడైన వానినిగా, నన్ను (ఈశ్వరుని) చూచినవారు, రజస్తమో గుణములను వదలి భూమిజ మానుష్యక రూపమును గూడ వదలియు, పునరావృత్తిలేని (పునర్జన్మలతో లభ్యముగాని) నా సమీపమును పొందుదురు. ద్విజులారా!” అని ఈ విధ ముగ రుద్రునిచే చెప్పబడగా, బ్రహ్మ నమస్కరించి పరిశుద్ధుడై మరల ఈ విధముగా పల్కెను.
బ్రహ్మ పలికెను:
ఓ భగవన్! ఓ దేవదేవేశ! విశ్వరూపియైన మహేశ్వర! ఓ మహాదేవ! ఈ నీ తనువులు లోకవందితములైనవి. ఓ విశ్వరూప! ఓ మహాసత్త్వ! ఓ మహాభుజములు గలవాడా! ద్విజాతులు ఏ యుగ సంభూతి యందు నిన్ను జూడగలవు? ఓ మహాదేవ! ద్విజాతులకు ఏ తత్త్వయోగముతో లేదా ఏ ధ్యానయోగముతో నీ తనువులను జూడ శక్య మగును?
భగవంతుడు పలికెను:
తపస్సుచేతగాని, యోగముచేతగాని, దానధర్మఫలముచేతగాని, తీర్థ (యాత్రా) ఫలయోగము చేతగాని, దక్షిణలతో గూడిన యజ్ఞములచేతగాని, వేదములను చదివించుట చేతగాని, చిత్తముతోడి నివేదనముల చేతగాని నేను మనుష్యులకు కనబడను. కేవలము ఒక్క ధ్యానము చేతనే గనబడుదును. ముల్లోకములకు ఈశ్వరుడై విష్ణువైన నారాయణుడు గూడ ఈ లోకమున సాధ్యుడు కాగలడు. పేరుతో అతడు వారాహుడని ప్రసిద్ధుడు. నాలుగు బాహువులు నాలుగు పాదములు నాలుగు నేత్రములు నాలుగు ముఖములును గల ఆతడు అప్పుడు సంవత్సరము గానయి యజ్ఞరూపుడు అగును. అతడు ఆఱంగములు గలవాడు. మూడు శిరములు గలవాడు. మూడు స్థానములలో మూడు శరీరములు గలవాడును అగును.
కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము-అని నాలుగు యుగములు, దీనియొక్క పాదములు నాలుగు అంగములు, క్రతువులు, భుజములు నాలుగు వేదములు, ఋతువు సంధి ముఖములు (షడంగకములు) రెండు ముఖములు రెండు అయనములు నాలుగు నేత్రములు. ఫాల్గుణ, ఆషాఢ, కార్తిక మాసములు అను మూడు సర్వములు మూడు శిరములు దివ్య అన్తరిక్ష-భౌమములనునవి మూడు స్థానములు సంభవము ప్రళయము అనునవి రెండు ఆశ్రమములు ప్రభువై విష్ణువై నారాయణుడు కాలరూపుడై వరాహత్వమున ఉన్నప్పుడు సాధ్యుడు కాగలడు.
అప్పుడు ఓ దేవేశ! నీవు నాలుగు ముఖములతో కూడి ఉన్నావు. ప్రభువైన విష్ణువైన నారాయణుడు బ్రహ్మా. లోకమునకు నమస్కరింపదగినవాడు. భూమి అంతయు సముద్రము కాగా దానిలో తెప్పపై పడుకొనుచున్న పురుషుడై దేవేశుడై, ధ్యానయుక్తుడై మహామునియైన హరిని నీవు చూడగలవు. అప్పుడు మీరు ఇద్దరు నా యోగ శక్తిచే మోహితులై చిత్తమును కోల్పోవుదురు. రాత్రిలో ఒకరినొకరు తెలియక పోటీపడిన వారగుదురు. మానుషులైన బ్రహ్మ, నారాయణులు ధ్యాన(యోగ)ము వలన ఒక్కొకరి కడుపులలో ఉన్న చరాచర లోకములను చూచి తెలిసికొని ఆశ్చర్యము నొందుదురు.
తరువాత నీవు పద్మమున పుట్టినవాడవు. సనాతనుడైన విష్ణువు పద్మము నాభి యందు గలవాడై పద్మనాభుడు అయ్యెను నీవు పద్మాంకితుడవై గొప్ప ప్రసిద్ధిని పొందగలవు.
ఆ తరువాత ప్రభువు యొక్క వరాహ కల్పములో మరల మహాతేజుడైన విష్ణువు కాలుడై లోక ప్రక్షాళణుడు అగును. అప్పుడు వైవస్వతుడను మనువు నీ పుత్రుడు కాగలడు. నాలుగు యుగావస్థలుగల ఆ యుగాంతకమైన కల్పమునందు శిఖతో కూడుకొని శ్వేతుడు అను మునినై ఉండగలను. అపుడు నాకు రమ్యమైన హిమగిరి శిఖరమున మేకలతో నిండిన పర్వత శ్రేష్ఠమున శివయోగ్యులైన నలుగురు శిష్యులుగా ఉందురు. వారు శ్వేతుడు. శిఖుడు, శ్వేతాశ్వుడు. శ్వేతలోహితుడు అనువారు ఆ నలుగురు వేదపారగులు, మహాత్ములునైన బ్రాహ్మణులు కావున వారు పరబ్రహ్మ మార్గమును చూచి బ్రహ్మమయులై పునరావృత్తి లేని ఆ బ్రహ్మ సమీపమును అనగా నా సమీపమును చేరుకొందురు.
మరల నా దేవేశుడైన ప్రభువు ద్వితీయ ద్వాపరమున బ్రహ్మయైనపుడు సత్యుడను పేరుగల వ్యాసుడు ఉండగలడు. అపుడు లోకహితము కొఱకు లోకమును అనుగ్రహించుటకై యా కలియుగములో సుతారుడను పేరుతో ఉండగలను. అచ్చట గూడ నాకు పుత్రులు కలుగగలరు. వారు దుంధుభి, శతరూపుడు, ఋచీకుడు, క్రతుమాన్ - అనువారు. వారు యోగమును, జ్ఞానమును, సనాతనమైన బ్రహ్మను పొంది పునరావృత్తి లేని బహు జన్మలలో లభ్యముగాని రుద్రలోకమును బొందగలరు.
మూడవ ద్వాపరమున భార్గవుడు వ్యాసుడై యుండును. అపుడు యుగాన్తమున దమునుడనై నేను ఉండగలను. అచటగూడ నాకు నలుగురు పుత్రులు ఉందురు. వారు విశోకుడు, వికేశుడు, విశాపుడు శాపనాశనుడు అనువారు. వారు గూడ ఆయోగోక్త మార్గముననే గొప్ప ఓజోవంతులై పునరావృత్తిలేని రుద్రలోకమును బొందగలరు.
నాలుగవ ద్వాపర యుగమున అంగిరసుడు వ్యాసుడనబడును అపుడు నేను సుహో త్రుడు అను పేరుతో నుండగలను. అక్కడ గూడ తపోధనులు దృఢవ్రతులు యోగాత్ములు, బ్రాహ్మణశ్రేష్ఠులునైన నలుగురు నలుగురు సత్పుత్రులు కలుగుదురు. వారు సుముఖుడు, దుర్ముఖుడు, దుర్దముడు, దురతిక్రముడు-అనువారు వారు సూక్ష్మమైన యోగమార్గమును పొంది పాపముల దహించి నిర్మలులు అగుదురు. వారు కూడ ఆ యోగమార్గముననే (పూర్వులవలె) నిశ్చయముగా రుద్ర లోకమును బొందుదురు.
ఐదవ ద్వాపర యుగములో సవిత వ్యాసుడగును. అపుడు లోకానుగ్రహమునకై యోగాత్ముడను మహాతపస్విని అనేక కార్యముల జేయువాడను. అయిన కంగుడను వాడనుకాగలను. మహాభాగ్యవంతులు, రజోగుణము లేనివారు. పరిశుద్ధ జన్యులు, దృఢ వ్రతులు, యోగాత్ములునైన నలుగురు నాకు పుత్రులు గలుగ గలరు. సనుడు, సనందనుడు, ప్రభువులైన సనాతనుడు, ఋతువు, సనత్కుమారుడు, వీరు మమకారము లేనివారై, అహంకారము లేనివారై అనేక జన్మలచే కూడ పొందరాని నా సమీపమును (రుద్ర లోకమును) పొందగలరు.
తిరిగివచ్చిన యారవ ద్వాపర యుగమున విభువైన మృత్యువు వ్యాసుడగును. అపుడు నేను లోకాక్షి అను పేరున ఉండగలను. దివ్వులు దృఢవ్రతులు యోగాత్ములు లోకసమ్మతులు వైన నలుగురు నాకు శిష్యులు (పుత్రులు) కలుగగలరు. వారు సుధాముడు, విరజుడు, శంఖపాదుడు, రవుడు అనువారు యోగాత్ములైన వారందరు పాపములను దహించి మహాత్ములై యా యోగ మార్గముననే నిస్సంశయముగ నా రుద్ర లోకమును బొందుదురు.
తిరుగుచు వచ్చిన యేడవ ద్వాపర యుగమున మహాతేజస్కుడైన విభువైన శతక్రతువు వ్యాసుడగును. అపుడుగూడ ఆ యుగాన్తకమైన కలిలో సమస్త యోగులలో శ్రేష్ఠుడనై జై గీషవ్యుడని ప్రసిద్ధి చెందిన వాడను గాగలను. అచ్చట గూడ నా యుగములో నాకు నలుగురు పుత్రులు గలుగుదురు. వారు సారస్వతుడు, సుమేధుడు, వసువాహుడు, సువాహనుడు అనువారు. వారు గూడ అదే మార్గమున ధ్యాన యోగమును ఆశ్రయించి మహాత్ములై రుద్రలోక పరాయణులు (చేరినవారు) కాగలరు.
తిరుగుచు వచ్చిన ఎనిమిదవ ద్వాపరయుగమున వసిష్ఠుడు వ్యాసుడగును. కపిలుడు. ఆసురి, మునియైన పంచశిఖుడు, మహాయోగియైన వాగ్బలియు వీరందరు గొప్ప ఓజస్సు గలవారు. వీరు ధ్యానయోగులై పాపముల దహించి మహేశ్వర యోగమును బొంది పునః పునః జన్మలలో గూడ లభింప అలవిగాని నా సమీపమును (రుద్రలోకమును) జేరుదురు.
తరువాత తిరుగుచు వచ్చిన తొమ్మిదవ ద్వాపరమున సారస్వతుడు వ్యాసుడగును. అపుడు నేను ఋషభుడను పేరుతో నుండగలను. అచట గూడ నాకు మహాతేజస్సు గల పుత్రుడు గలుగుదురు. వారు పరాశరుడు గార్గ్యుడు, భార్గవుడు, అంగిరుడు అనువారు. వారందరు మహాత్ములు వేదపారగులు, తపోబలముచే గొప్పవారు శాపమిచ్చుటలోను ఉపసంహరించి యనుగ్రహించుటలోను సమర్థులు. వారు గూడ యోగోక్త మార్గమునే తపస్వినులై ధ్యానమార్గమును పొంది నా రుద్రలోకమును జేరుదురు.
పదియవ ద్వాపరమున త్రిధాముడనువాడు వ్యాసుడగును. ఓ బ్రాహ్మణులారా అపుడు మరల నేను రాగలను. హిమాలయ శిఖరమున కొండచరియలతో ఎత్తైన పర్వతము గలదు. దాని పేరు భృగువుయొక్క శిఖరము. కావున ఆ శిఖరము భృగువైనది. అచటనే దృఢ వ్రతులైన (యా) పుత్రులు నాకు గలుగుదురు. వారు బలబంధువు, నిరామిత్రుడు కేతుశృంగుడు తపోధనువారు. వీరు యోగాత్ములు, మహాత్ములు, ధ్యానయోగముతో గూడిన వారు. వీరు తమతపస్సులచే తప పాపములను దహింపజేసిన వారై రుద్రలోకమును జేరగలరు. పదునొకండవ ద్వాపరమున త్రివృత్ అనువాడు వ్యాసుడుగును అప్పుడుగూడ కలి ఎదుట గంగా ద్వారమున నేనురాగలను. అచటనే ఉగ్రులను వారు మహానాదము గలవారై నాకు పుత్రులు కాగలరు. వారు గొప్ప ఓజస్సుగలవారు మంచినడవడి గలవారు లోక ప్రసిద్ధులు. వారిపేరులు లంబోదరుడు, లంబుడు, లంబాక్షుడు, లంబకేశుడు. వారు మహేశ్వర యోగమునుపొంది రుద్రలోకమునకు బయలుదేరుదురు. వారుగూడ ఆ మార్గమున (ధ్యాన యోగమార్గమున)నే పరమగతిని (రుద్ర లోకమునకు) బొందుదురు.
పండ్రెండవ ద్వాపరమున శతతేజుడను మహాముని మహాసత్త్యుడై కవివరుడైన వ్యాసుడు కాగలడు. అపుడుగూడ యుగాంతమునవి: అనుపేరుతో హైమక వనమునందు (బంగారు లేక మంచుగల వనమును) బొంది యోగమును బూని భూతలమున నుండ గలను. ఇచట గుణభస్మతో స్నానముజేసి భస్మను బూసికొన్నవారు మహాయోగులు రుద్రలోక పరాయణులైనవారు నాకా పుత్రులు గలుగగలరు. వారు సర్వజ్ఞుడు, సమబుద్ధి, సాధ్యుడు, సర్వుడు అనువారు. వారు ధ్యానయోగపరాయణులై రుద్రలోకమును బొందగలరు.
క్రమముగా పదమూడవ పరిభ్రమణమైన ద్వాపరమురాగా నారాయణుడను ధర్ముడు వ్యాసుడుకాగలడు. అపుడు నేను గంధమాదన పర్వతమున పుణ్యమైన వాలఖల్యాశ్రమమున వాలి అను మహామునిగా రాగలను. అచటగూడ నాకు పూర్వమున కలిగిన తపోధనులు పుత్రులు కాగలరు. వారు సుధాముడు, కాశ్యపుడు, వసిష్ఠుడు, విరజుడు అనువారు. మహా యోగబలముతో గూడి విమలురై ఊర్ధ్వ రేతస్కులైన వారు గూడ ఆ యోగ ధారణము తోనే రుద్రలోకమును చేరగలరు.
పదునాలుగవ పర్యాయమైన ద్వాపరమున సురక్షణుడనువాడు వ్యాసుడు అగును. అచట కూడ యుగాన్తమున అంగిరస వంశ శ్రేష్ఠుడనై గౌతముడను యోగవేత్తనుగా రాగలను. ఆ గౌతముని నుండియే యా గౌతమ వనము ఏర్పడగలదు. అచట గూడ కలిలో నాకు నలుగురు పుత్రులుకలుగగలరు. వారు అత్రి, ఉగ్రతపుడు, శ్రావనుడు స్రవిష్టుడు - అనువారు. యోగాత్ములు, మహాత్ములు, ధ్యానయోగపరాయణులునైన వారు గూడ ధ్యానయోగ మార్గముననే రుద్రలోకవాసులు అగుదురు.
పర్యాయ క్రమమున వచ్చు పదియైదవ ద్వాపరమున ప్రభువైన ఆరుణియనువాడు వ్యాసుడు కాగలడు. ఓ బ్రాహ్మణులారా అపుడు నేను కూడ వేదశిరుడను పేరు వాడను కాగలను. అచట పరమేశ్వర దేవతాకమైన వేదశిరోనామ కాస్త్రము కలుగగలదు. అది మహావీర్యవంతమైన యస్త్రము. హిమవత్పర్వతపు వెనుకటి బాగమును ఆశ్రయించి సరస్వతీనదీ తీర్థస్థమైన పర్వత శ్రేష్ఠమున (సరస్వతీ పర్వతముకా వచ్చును) వేద శీర్షమను పర్వతము గూడ ఉండును. అపుడు కూడ నాకు ఆ తపోధనులు నలుగురు పుత్రులుగా జన్మింతురు. వారు కుణి, కుణిబాహువు, శుశరీరుడు, కునేత్రకుడు అనువారు. యోగాత్ములై మహాత్ములై (బ్రహ్మిష్ఠులై (బ్రహ్మము నందున్న వారై) ఊర్థ్వ రేతస్కులైన వారు గూడ యోగ ధారణము చేతనే రుద్ర లోకమును జేరిరి.
పర్వాయక్రమమున తిరుగుచు వచ్చు పదునారవ ద్వాపరమున సంజయుడను వ్యాసుడు ప్రభువు కాగలడు. అప్పుడు గూడ గోకర్ణుడను పేరుతో నుండగలను. ఆ గోకర్ణుని నుండియే గోకర్ణమను నా వనము ఏర్పడగలదు. అచట గూడ మహౌజస్కులైన పుత్రులు నలుగురు కలుగగలరు. వారు కశ్యపుడు, ఉశనుడు, చ్యవనుడు, బృహస్పతియను వారు గూడ యోగధారణ మార్గముననే పరమపదమైన రుద్రలోకమును బొందగలరు.
తరువాత పర్యాయ క్రమమున తిరిగి వచ్చు పదునేడవ ద్వాపరమున దేవకృతం జయుడనువాడు వ్యాసుడు కాగలడు. అపుడు గూడ నేను గుహావాసి అనుపేర ఉండ గలను. ఎత్తైన హిమాలయ పర్వత శిఖరమున మహాలయమను దానియందు మహాపుణ్య వంతమైన మహాలయమను సిద్ధి క్షేత్రము ఉండగలదు. అటగూడ బ్రాహ్మణ్యులు యోగమును తెలిసినవారు, మహాత్ములు సర్వజ్ఞులు నిరహంకారులైన యా పుత్రులు నాకు గలుగగలరు. వారు ఉతథ్యుడు, వామదేవుడు, మహాకాలుడు, మహాలయుడు - అనువారు వారికి లక్షమంది శిష్యులు ధ్యానయోగ సాధనము చేయుదురు. అప్పుడా కల్పమున వారందరు ధ్యానయోగులు కాగలరు. వారు ధ్యానయోగధారణమును చక్కగా జేసి హృదయమున మహేశ్వరుని నిలిపి మహాలయమున (అన్ని ప్రాణులు లీనమగు గొప్ప యాలయమైన శివపదము) అడుగిడి నాశరహితుడైన శివునిలో ప్రవేశింతురు. ఇతరులైన మహాత్ములుగూడ నా యుగాన్తమైన కాలమున ధ్యానయుక్తమైన మనస్సుతో నిర్మలులై శుద్ధమైన బుద్ధులు గలవారై మహాలయమును బొంది మహేశ్వర పదము (స్థానమును) చూచి, వెంటనే వేగముగా తమకు పదితరముల పూర్వులను పదితరములు యందు వారిని తరింపజేయుదురు. తనతో కలిపి మొత్తము ఇరువది ఒక్కరిని మహాసముద్రమును తరింపజేసి జ్వరములేనివారై రుద్రలోకమును జేరుదురు. తరువాత పర్యాయ క్రమమున తిరిగివచ్చు పదునెనిమిదవ ద్వాపరమున ఋతుంజయుడను ముని వ్యాసుడు అగును. అపుడు గూడ నేను శిఖండియను పేరున ఉండగలను. సిద్ధి క్షేత్రమై మహాపుణ్యమై దేవదానవులచే పూజింపబడినదై హిమాలయ శిఖరమున శిఖండియను పర్వతముండును. అచటనే ఋషులచేతను, సిద్ధులచేతను సేవింపబడిన (నివసింపబడిన) శిఖండివనము (నెమలి వనము) ఉండును. అచట గూడ ఆ తపోధనులైన వారు నా0కు పుత్రులు కాగలరు. వారు వాచఃశ్రవుడు, ఋతీ (చీ)కుడు, శావాసుడు దృఢవ్రతుడు అనువారు. యోగాత్ములై మహాశక్తి గలవారైన వారందరు వేదములను అంతముల వరకు చదివి తెలిసికొన్నవారు. వారు మహేశ్వరమైన యోగమును బొంది వారు రుద్ర లోకమును జేరుదురు.
ఆ తరువాత పర్యాయ క్రమమున వచ్చు పందొమ్మిదవ ద్వాపరమున భరద్వాజు డను మహాముని వ్యాసుడగును. అటగూడ నేను జటామాలి అను పేర జటాయుపర్వత మున్న రమ్యమైన హిమాలయశిఖరముపైన నుందును. అటగూడ మహౌజస్కులైన యా పుత్రులు నాకు గలుగుదురు. వారు హిరణ్యుడు, కౌశిల్యుడు, కాక్షీపుడు, కుథిముడు, అనువారు. యోగధర్మము గలిగి ఈశ్వరులైన వారందరు ఊర్థ్వరేతస్కులు. వారు మహేశ్వర యోగమును బొంది రుద్రలోకమును జేరుదురు.
తరువాత పర్యాయక్రమమున తిరిగి వచ్చు ఇరువదియవ ద్వాపరసృష్టిలో మహామతి యైన వాచఃశ్రవుడనువాడు వ్యాసుడు కాగలడు. అప్పుడు గూడ నేనే అట్టహాసి యను పేర ఉండగలను. అపుడు నరులందరు అట్టహాస (పెద్దనవ్వు) ప్రియులగుదురు. సిద్ధులు చారణులు నివసించు ఆ హిమాలయముపైన నాకు మహౌజస్కులైన ఆ నల్గురు పుత్రులు కలుగుదురు. వారు యోగముతోగూడిన ఆత్మలుకలవారు. మహాబలులు, ధ్యానయోగము కలవారు నియతమైన వ్రతములు కలవారు. వారు సుమంతుడు, విద్వాంసుడైన వర్వరి సుబంధువు, కుశికంధరుడు అనువారు. వారు మాహేశ్వర యోగమును బొంది రుద్ర లోకమును చేరుకొందరు.
పర్యాయక్రమమున తిరిగివచ్చు ఇరువది యొకటవ ద్వాపరమున వాచస్పతి అను ఋషి సత్తముడు వ్యాసుడు అగును. అపుడు కూడ నేను దారుకుడను పేర ఉందును. అందు నుండియే గొప్ప నైపుణ్యమైన దేవదారు వనము ఏర్పడగలదు. అటగూడ నాకు నా మహౌజస్కులైన పుత్రులు గలుగగలరు. వారు ప్లక్షుడు, దాక్షాయణి, కేతుమాలి, బకుడు అనువారు. యోగాత్ములు మహాత్ములు నియతులు, ఊర్ధ్వ రేతస్కులు అట్లే అనఘులు (పాపరహితులు) అయిన, వారు పరమయోగమున నుండి రుద్రుని బొందుదురు.
పర్యాయక్రమమున తిరిగివచ్చు ఇరువది రెండవ ద్వాపరమున శుక్లాయనుడనువాడు వ్యాసుడు అగును. అప్పుడుగూడ నేను మహామునినై నాగలి ధరించిన (లాంగలియైన) భీముడను పేర ఉండగలను. అచట ఇంద్రునితో కూడిన దేవతలు కలిలో అవతరించిన హలాయుధుని (భీమునిగా) జూడగలరు. అచటగూడ నాకు సుధార్మికులైన యా పుత్రులు గలుగగలరు. వారుతుల్యార్చి మధువు పింగాక్షుడు, శ్వేతకేతువు అనువారు. వారు గూడ మహేశ్వర యోగమును అవలంబించి ధ్యానపరాయణులై రజోగుణము లేనివారై బ్రహ్మమయులై రుద్రలోకమునకు వెళ్ళెదరు.
పర్యాయ క్రమమున తిరిగి వచ్చు ఇరువది మూడవ ద్వాపరమున తృణబిందువను ముని వ్యాసుడు అగును. ఆ వ్యాసుడు బ్రహ్మ అపుడు, నేను శ్వేతుడను పేర మహాకాయుడనై, మునిపుత్రుడనై, సుధార్మికుడనై, యుండగలను. అట్టి నేను పర్వత శ్రేష్ఠములలో గూడ ఉత్తమమైన పర్వతమున (హిమాలయమున) కాలమును గడుపగలను. ఆ కారణమున నా పర్వతము కాలంజరమను పర్వతముకా గలదు. అచటగూడ నాకు ఆ మహౌజస్కులైన పుత్రులు గలుగగలరు. వారు ఉషిజుడు, బృహదుక్థుడు, దేవలుడు, కవి అనువారు. వారు మాహేశ్వరయోగమును పొంది రుద్రలోకమును పొందుదురు.
పర్యాయక్రమమున తిరిగివచ్చు ఇరువది నాలుగవ ద్వాపరమున ఋక్షుడనువాడు వ్యాసుడు కాగలడు. ఓ బ్రహ్మ! అచట కలియుగ సమీపమున యోగివందిత మయిన నైమిషమున (నైమిషారణ్యమున), శూలయను పేర మహాయోగినై యుందును. అచటగూడ నాకు తపస్వినులైన యాపుత్రులు కలుగగలరు. వారు శాలిహోత్రుడు, అగ్నివేశ్యుడు, యువనాశ్వుడు, శరద్వసువు అనువారు. వారుగూడ యోగ బలముతో కూడిన వారై సువ్రతులై రుద్రుని చేరుదురు. పర్యాయక్రమమున తిరిగివచ్చు ఇరువది అయిదవ ద్వాపరమున వసిష్ఠుడను వ్యాసుడు శక్తియను పేర నుండగలడు. అపుడు కూడ నేను దండినై (దండధారినై) ముండినై (శిరో ముండనము జేసికొన్నవాడనై), శరుడనై, ప్రభువునై, దేవతలచే పూజింపబడిన కోటి వర్షమను నగరమును బొంది ఉండగలను. అచటగూడ నాకు ఆ క్రమాగతులైన పుత్రులు కలుగగలరు. యోగాత్ములు, మమాత్ములునైన వారందరు ఊర్థ్వరేతస్కులు. వారు ఛగలుడు, కుంభకర్షిశ్యుడు (కుంభకర్ణాస్యుడు) కుంభుడు, ప్రబాహుకుడు అనువారు. వారు మాహేశ్వర యోగమును బొంది పూర్వము వారివలెనే రుద్ర లోకమును జేరుదురు.
పర్యాయక్రమమున తిరిగివచ్చు ఇరువదియారవ ద్వాపరమున పరాశరుడనువాడు వ్యాసుడగును. అపుడుగూడ నా కలియుగ సమీపమున రుద్ర వనమును బొంది నేను సహిష్ణువను పేర నుండగలను. అచటగూడ నాకు సుధార్మికులైన ఆ పుత్రులు గలుగగలరు. వారు ఉలూకుడు, వైద్యుతుడు, సర్వకుడు, అశ్వలాయనుడు అనువారు. వారు గూడ మాహేశ్వర యోగమునుపొంది పూర్వము వారివలెనే రుద్రుని జేరగలరు.
పర్యాయక్రమమున తిరిగి వచ్చు ఇరువది యేడవ ద్వాపరమున జాతూకర్ణ్యుడను తపోధనుడు వ్యాసుడగును. అపుడుగూడ నేను సోమశర్మ యను పేర బ్రాహ్మణోత్తముడనై ప్రభాసతీర్థమును జేరి యోగాత్ముడనై లోకప్రసిద్ధుడను కాగలను. అచట గూడ నాకు ఆ తపోధనులైన పుత్రులు కలుగగలరు. వారు అక్షపాదుడు, కణాదుడు, ఉలూకుడు, వత్సుడు, అనువారు, వారు యోగాత్ములు, మహాత్ములు, నిర్మలులు శుద్ధమైన బుద్ధులు గలవారు. వారు గూడ మహేశ్వరయోగమును బొంది రుద్రలోకమును జేరుదురు.
పర్యాయక్రమమున తిరిగివచ్చు ఇరువది ఎనిమిదవ ద్వాపరమున, పరాశరుని కుమారుడు శ్రీమంతుడైన విష్ణువు లోకపితామహుడు (లోకబ్రహ్మయై ద్వైపాయనుడను పేర వ్యాసుడై ప్రభువగును. అపుడు నా ఆరదవ అంశమున కృష్ణుడైన పురుషసత్తముడు (పురుషోత్తము డగు విష్ణువు), వసుదేవుని నుండి యదుశ్రేష్ఠుడై వాసుదేవుడు అవతరింప గలడు. అపుడు గూడ నేను యోగాత్ముడనై యోగమాయచేత లోకమును ఆశ్చర్యపరచుటకై బ్రహ్మచారి శరీరముగలవాడను అగుదును. శ్మశానమున చనిపోయి వదలిపెట్టబడిన యనాథయైన లోకమును చూచి బ్రాహ్మణుల హితముకొరకై విష్ణువుతోను నీతోను సహి తముగా యోగమాయచే పుణ్యమై దివ్యమై (దేవ సంబంధమైన) మేరుపర్వతము యొక్క గుహను బ్రవేశింతును. అప్పుడు ఓ బ్రహ్మా! నకులీయను పేర ఉండగలను. అపుడు భూమి యున్నంతవఱకు ఇది కాయా రోహణమను సిద్ధి క్షేత్రము కాగలదు. అచట గూడ నాకు ఆ తపస్వినులు పుత్రులుకాగలరు. వారు కుశికుడు, గార్గ్యుడు, మిత్రకుడు, రుష్టుడు అను వారు. యోగయుక్తులై మహాత్ములై వేదపారగులైన బ్రాహ్మణులై వారు మాహేశ్వర యోగ మునుపొంది విమలులై యూర్థ్వరేతస్కులునై పునః పునః జన్మలతో లభింప నలవిగాని రుద్రలోకమును జేరగలరు. అని ఈ విధముగా మనువు మొదలుకొని కృష్ణుని వరకు ఇరువది యెనిమిది యుగములు వరుసగా నాచేత అవతారములలోని లక్షణము జెప్పబడినది.