వాయు మహా పురాణము
చంద్రవంశకీర్తనము
ఋషులు ఇట్లు అనిరి:
“మహాత్ముడైన మరుతుని చేత తన కన్య రాజునకు ఎట్లు ఈయబడినది? మరుత కన్యలు ఏ శక్తిగలవారై మహాత్ములైరి?”
సూతుడు ఇట్లు అనెను:
ప్రతి మాసమున మహాతేజస్వియైన రాజు అన్నకాముడై ప్రజేశ్వరుడైన మరుత్సో ముని అఱువది సంవత్సరములు పిలిచెను. ఆ మరుత్సోమునిచేత మరుతులు సంతోషపెట్ట బడిరి. సంతసించిన మరుతులు సర్వకామ పరిచ్ఛదముగా అక్షయ్యమైన అన్నము ఇచ్చిరి. ఒకమారు వండిన అతని అన్నము సూర్యోదయము మొదలుకొని కోట్ల కొలందులకు ఈయబడుచున్నను, రాత్రింబవళ్లు క్షీణింపదు. సూర్యుని వల్ల ధీమంతుడైన మరుతుని కన్యయందు జ్యోతి పుట్టెను. అతని నుండి పుట్టినవారు మహాసత్త్వులు, ధర్మజ్ఞులు, మోక్ష దర్శులు, గృహధర్మములను సన్యసించి, వదిలి వైరాగ్యమును పొందినవారు. ఈ లోకమున యతి ధర్మమును పొంది బ్రహ్మత్వమును పొందుటకై వారు వెళ్లిరి. తరువాత అనపాయుడు పుట్టెను. అపుడు ధర్మము చక్కగా ప్రకాశించినది. అతని నుండి క్షత్రధర్ముడు పుట్టెను. అతని నుండి మహాతపస్వి ప్రతిక్షుడు, ప్రతిపక్షపుత్రుడు సంజయుడని ప్రసిద్ది చెందినవాడు పుట్టెను. సంజయపుత్రుడు జయుడు, జయపుత్రుడు విజయుడు, విజయునకు జియుడు, అతనికి హర్యంద్వతుడు, హర్యంద్వతుని నుండి రాజై, ప్రతాపవంతుడైన సహదేవుడు, సహదేవునకు ధర్మాత్ముడై అదీనుడని ప్రసిద్ధిచెందినవాడు, అదీనునకు జయత్సేనుడు, అతనికి సంకృతి, సంకృతికి ధర్మాత్ముడై మహాయశస్వియైన కృత ధర్ముడును పుట్టిరి. ఇవ్వరు క్షత్రధర్ములు. నహుష పుత్రులను వినుడు.
నహుషుని పుత్రులు ఆఱుగురు ఇంద్రసమాన తేజస్కులు. ఈ మహౌజస్కులు పితృకన్యయైన విరజయందు నహుషునకు పుట్టినవారు. యతి, యయాతి, సంయాతి, ఆయాతి, ఐదవవాడు ద్వయుడు (అయుడు అను ధువుడు). వారిలో జ్యేష్ఠుడు యతి. యయాతి తరువాతివాడు. అప్పుడు యతి కాకుత్ స్థ కన్యయైన ‘గా’మను కన్యను పత్నిగా పొందెను. సంయాతి మోక్షమున నిలిచి బ్రహ్మభూతుడైన ముని అయ్యెను. ఆ అయిదుగురి మధ్యలో యయాతి రాజు. ఆతడు ఉశనసుని (శుక్రుని) పుత్రిని దేవయానిని భార్యగా పొందెను. వృషపర్వుని పుత్రియై అసురి (రాక్షసపు(త్రి) అయిన శర్మిష్ఠను కూడ భార్యగా పొందెను. దేవయాని యదువు తుర్వసులు అను పుత్రులను కనెను. శర్మిష్ఠ ద్రుహ్యువు, అనువు, పూరువు-అను పుత్రులను దేవ పుత్రులతో సమానమైన వారిని మహావీర్యులను కనెను. రుద్రుడు సంతుష్టుడై అతనికి మిక్కిలి ప్రకాశించునదియు. సంగము (అతుకు) లేనిదియు, బంగారుమయమైనదియు, దివ్యమైనదియు అయిన రథమును, అక్షయములైన అమ్ములపొదులను రెండింటిని ఇచ్చెను. ఆ రథము మనోవేగములైన గుఱ్ఱములు పూన్చి నట్టిది. దానిచేత కన్యను పెండ్లాడెను. ఆ రథోత్తమముచే అతడు భూమిని జయించెను. యుద్ధమున దేవ, దానవ, మానవులచేత జయింపబడనివారు, పౌరవులగు సమస్త రాజు లకు ఆ రథము సంక్రమించెను. వత్సు దేశమునకు ప్రభువైనవాడు కౌరవుడైన జనమే జయుడు. కురుపుత్రుడై రాజైన పారిక్షితునకు నా రథము సంక్రమించినది. ఆ రథము ధీమంతుడైన గార్డ్యుని శాపమున నాశమందెను. బాలుడై రాజైన జనమేజయుడు దుర్భుద్ధియై గార్గ్యుని పుత్రుడును లోహగంధుడైన రాజును హింసించెను. ఆ లోహగంధ రాజర్షి ఇటునటు పరిగెత్తుచు పౌరజానపదులచే వదిలిపెట్టబడినవాడై ఎచ్చట కూడ సుఖము పొందలేదు. ఆ తరువాత అతడు దుఃఖముచే తపింపబడినవాడై ఎచ్చట కూడ జ్ఞానము పొందలేదు. శరణ్యుడై (రక్షకుడై) హేతువైన ఋషిని బాధితుడై శపించెను. ఆ ముని ఉదారబుద్ధి కల బ్రాహ్మణోత్తముడై ఇంద్రోతుడని ప్రసిద్ధి చెందినవాడు. ఇంద్రోతుడైన శౌనకుడు జనమేజయరాజును పవిత్రత కొఱకు అశ్వమేధ యాగము చేయునట్లు చేసెను. ఆ లోహగంధుడు ఆతని నివాసమునుచేరి నశించెను. అతని నుండి ఆ దివ్య రథము ఛేదిపతియైన వసువునకు సంక్రమించెను. అతని నుండి ఇంద్రుడు పొందెను. అతని నుండి బృహద్రథుడు పొందెను. అంత జరాసంధుని (బృహద్రథుని) చంపి భీముడు అత్తమ రథమును పొందెను. కౌరవనందనుడు భీముడు ప్రేమతో వాసుదేవునకు (కృష్ణునకు) ఇచ్చెను. నహుష పుత్రుడై రాజర్షియైన ఆ యయాతి ముసలితనమును పొంది జ్యేష్ఠ పుత్రుడును, వరిష్ఠుడును నైన యదువుతో ఇట్లనెను. నాయనా! నన్ను ముసలితనము, ముడుతలుపడుట, వెంట్రుకలు తెల్లపడుట-ఇవి పూర్తిగా ఆవరించి (పొంది)నవి. శుక్రా చార్యుని శాపమే కారణము. యౌవనమున కామ తృప్తిని పొందలే కుంటిని. ఓ యదూ! నా పాపముతో పాటు ముసలితనమును తీసికొనుము అని అనెను. యదువు ఇట్లు మారుపలికెను. బ్రాహ్మణునకు ఈయదగిన జరాభిక్ష నాకు నిర్దేశింపతగదు. నీకు యౌవనమిచ్చి జరను తీసికొన్న తరువాత నా జరా నివారణము వ్యాయామముతో సాధ్యము గాదు. కావున నీ ముసలితనమును నేను స్వీకరింపను అనెను. పానభోజనములను ప్రభావితము జేయు దోషములు జరకు పెక్కు గలవు. కావున ఓ రాజా! నీ జరను తీసి కొన ఉత్సహింపను. ముసలితనమున శిథిలుడైనవాడు తెల్లని మీసములు కలవాడు, దీనుడును, ముడుతలు పడ్డ శరీరముకలవాడును, వంగిన శరీరము కలవాడును, దుర్దశ కలవాడునై, దుర్బలాకారము కలవాడు అగును. పనులు చేయుటలో అశక్తుడును, యౌవనమున తిరస్కృతుడునునై, మహాభీతులచేతను, ఉప భీతులచేత తిరస్కృతుడు అగును. కావున ఆ జరను (దీసికొన) కోరను. రాజా! నాకంటె మిక్కిలి ప్రియులైన పుత్రులు నీకు పెక్కురు కలరు. ఓ ధర్మజ్ఞుడా! వారు నీజరను గ్రహింతురు గాక. వేరొక పుత్రుని ఎన్నుకొనుము. యదువు ఈ విధముగ చెప్పగనే మహాప్రవక్తయైన యయాతి తీవ్ర కోపముతో తన జ్యేష్ఠ పుత్రుని నిందించుచు ఇట్లనెను. ఓ దుర్బుద్ధి! నన్ను ఆనాదరించిన నీకు నాకన్నవేరైన ఆశ్రమముకాని, ధర్మవిధికాని ఏవికలవు? నాకు కొత్తగురువై ఉపదేశించు చున్నావు. అని ఇట్లని యయాతి కోపియై యదువును. నా హృదయమునుండి పుట్టి నాకు నీ వయస్సు నీయకుంటివి. దానివల్ల ఓ మూఢుడా! నీసంతతి రాజ్యమును పొందదు అని శపించెను. ఓతుర్వసూ! నాపాపమును జరతో బాటు స్వీకరింపుము అని తుర్వసుని అడిగెను.
తుర్వసువు ఇట్లు అనెను:
“ఓ తండ్రీ! కామ భోగములను నశింపచేయు జరను కోరను. పాన-భోజనములను బట్టి వచ్చిన జరా దోషములు అనేకములు కదా! కావున రాజా! నీ ముసలితనమును స్వీకరింపఉత్సహింపను”
యయాతి ఇట్లు అనెను:
నా హృదయము నుండి పుట్టిన నీవు నీ వయస్సు నీయకున్నావు. కావున నీకు ప్రజా సముచ్ఛేదము కలుగగలదు. ఓ మూఢుడా! అది ధర్మముతో ప్రతిలోమజాతి శ్రేష్టులలో కలియకు ఉండును. ధర్మ వ్యతిరేకులు పిశాచాదులు తక్కినవారు వీరికి రాజువు అగుదువు. గురు భార్యలతో సంగమించినవారు తిర్యక్కులగు పశుపక్ష్యాది యోనులలో జనించువారు, పశుధర్మాచారులైన మ్లేచ్ఛులు (గోమాంసముతిని పాపరతులైనవారు)-వీరికి రాజు కాగలవు. సంశయము లేదు.
సూతుడు ఇట్లు అనెను:
ఈ విధముగ తుర్వసుని శపించి, శర్మిష్ఠకు కలిగిన తన పుత్రుడైన ద్రుహ్యునితో యయాతి ఇట్లనెను. ఓ ద్రుహ్యూ! వర్ణ-రూపములు నశింపచేయు నా జరను వేయి ఏండ్లకు గాను దీసికొని నీ యౌవనమును నాకు ఇమ్ము. వేయి ఏండ్లు నిండగనే నీ యౌవ నము మరల నీకిత్తును. నా ముసలితనముతో పాటు నా పాపమును మరల తీసికొందును.
ద్రుహ్యుడు ఇట్లు అనెను:
ముసలివాడు ఏనుగునుకాని, రథమునుకాని, గుఱ్ఱమునుకాని ఎక్కి స్వారి చేయలేడు. అట్లే స్త్రీని గూడ అనుభవింపలేడు. వీరికి ఎవ్వరితోను సంగముకూడ జరుగదు. కావున నేను జరను కోరను.
యయాతి ఇట్లు అనెను:
నా హృదయము నుండి పుట్టిన నీవు నీ యౌవనమును ఈయకున్నావు. కావున ఓ ద్రుహ్యూ! కాముడు నీకు ఎచ్చటను ప్రియమును ఈయడు. నావలతో తెప్పలతో ఉత్తర సంచారము కలచోట నీవు రాచరికముతో ప్రకాశింపని వంశము కలవాడవై నిత్యము ఉందువు. అనూ! నీవు నా పాపమును జరతో పాటు స్వీకరింపుము, అట్లే నీ యౌవనమున వేయి యేండ్లుందును అనెను. “ముసలివాడు నిత్యము జరతో అశుచియై ఒక ఉత్తమ శిశువుగా ఉండును. సకాలమున హోమము చేయలేడు. కావున నా జరను కోరను. అని యయాతికి అనువు చెప్పెను. అటుతర్వాత యయాతి: నా హృదయము నుండి పుట్టిన నీవు నీ యౌవనము నీయకున్నావు. నీవు చెప్పిన ఈ జరాదోషమును నీవు పొందెదవు. అందువలన నీ సంతానము యౌవనమును పొంది నశించును. అగ్ని శోషణపరుడవై నీవు గూడ ఇట్లే అగుదువు అనెను. ఓ పూరూరవ! నీవు నా పాపమును జరతో పాటు గ్రహిం పుము. నా కన్నతండ్రీ! ముసలితనము, ముడుతలు పడుట, వెంట్రుకలు తెల్లపడుట-ఇవి పూర్తిగా అవరించినవి. కారణము శుక్రాచార్యుని శాపము. కాని యౌవనమున కామ తృప్తి చెందలేదు. కొంత కాలము ఈజర నీది అగుగాక. నీ వయసుతో విషయసుఖములను అనుభవింతును. వేయేండ్లు నిండగనే నీ యౌవనమును మరల నీకు ఇత్తును. నా పాప మును జరతో పాటు తీసికొందును.
సూతుడు ఇట్లు అనెను:
ఇట్లనగనే పుత్రుడు పూరువు తండ్రితో “నీవెట్లు ఇష్టపడుదువో! అట్లే ఆచరింతును. ఓ రాజా! నీ పాపమును జరతోపాటు స్వీకరింతును. నా నుండి యౌవనమును స్వీకరింపుము. నీ ఇష్టము వచ్చిన కామములను అనుభవింపుము. నేను నీ ముసలి తనముతో కప్పబడినవాడనై, నీ వయస్సును, రూపమును ధరించినవాడనై, యౌవనమును నీకు ఇచ్చి యథార్థ వృద్ధునివలె ఆచరింతును” అని అనెను.
యయాతి ఇట్లు అనెను:
ఓ పూరూ! నేను సంతుష్టుడను అయితిని. సంతుష్టుడనై, నా ఈ వార్ధక్యమును నీకు ఇచ్చుచున్నాను. నీ రాజ్యమున నీ ప్రజ సర్వకామ సమృద్ధమగును.
సూతుడు ఇట్లు అనెను:
పూరువు నుండి అంగీకారము పొందినవాడై రాజైన యయాతి శుక్రుని అనుగ్రహము వలన తన జరను పూరునకు సంక్రమింపచేసెను. తరువాత నహుష పుత్రుడైన యయాతి పూరువుయొక్క యౌవనముగల వయస్సుచేత ప్రీతియుక్తుడై, తన విషయ సుఖములను అన్నింటిని అనుభవించెను. కామమునకు అనుగుణముగను, ఉత్సాహమునకు అను గుణము గను, కాలమునకు అనుగుణముగను, ధర్మమునకు విరోధముకాకుండా రాజుకు ఎట్లు తగునో అట్లు సర్వభోగములను అనుభవించెను. యజ్ఞములతో దేవతలను, శ్రాద్ధములతో పితరులను, అనుగ్రహములతో దీనులను, ఇష్టకామములతో బ్రాహ్మణ శ్రేష్ఠులను తృప్తి చెందించెను. అన్నపానములతో అతిథులను, పరిపాలనములతో వైశ్యులను, అహింసా, దయలతో శూద్రులను తృప్తిపరచి చెరలో బంధించుటచే, దస్యువులను (దొంగలను) దండించెను. ధర్మములో ప్రజలను అందఱిని సంతసింపచేయుచు, సాక్షాత్తు వేరొక ఇంద్రునివలె యయాతి రాజ్య పాలనము చేసెను. ఆ రాజు సింహపరాక్రముడు, యువ కుడు, దేశమునందు అంతటను కనబడువాడు, ధర్మవిరోధము కాకుండా ఉత్తమ సుఖమును అనుభవించెను. అతడు (రాజు) కామములను మనస్సులో వెదకుచు, దోషములు కనబడుట వలన, అందముగా ప్రకాశించు నందన వనమున దోషములు ఉండవను విశ్వాసముతో క్రీడించెను. అపుడు అతడు వృద్ధాప్యము వృద్ధి చెందుచున్నట్లుగనే చూచెను కాని కామము తృప్తిపడి సమసిపోవుటను చూడలేదు. అపుడు యయాతి పూరుని సమీపమునకు వెడలి తన జరను స్వీకరింపుమని అడిగెను. యయాతి పూరుని యౌవనమును పొంది ఆ కామములను పొంది, తృప్తుడును దుఃఖితుడును అయ్యెను. అంత రాజు వేయి వర్షముల కాలము గడచినట్లు స్మరించెను. కలా-కాష్ఠలతో బాటు ఆ కాలమును పూర్తిగా లెక్కించి, వేయి ఏండ్లు పూర్తి అయినట్లుగ తలచి, పుత్రుడైన పూరువుతో ఇట్లు అనెను. ఓ శత్రుదమను డవైన పుత్రుడా! పూరూ! నీ యౌవనముతో నా చేత యథా సుఖముగ, యథోత్సాహముగ, యథాకాలముగ ప్రాపంచిక సుఖములు సేవింపబడినవి. ఓ పురూ! సంతుష్టుడను అయి తిని. నీకు భద్రమగుగాక. నీ యౌవనమును నీవు తీసికొనుము. ఈ రాష్ట్రమును కూడ తీసికొనుము. నీవే నాకు ప్రియమునుగూర్చిన కుమారుడవు అని, నహుషపుత్రుడైన యయాతి రాజు తన జరను తిరిగి పుత్రుని నుండి పొందెను. పూరువు మరల తన యౌవనమును పొందెను. కనిష్ఠ పుత్రుని రాజ్యమును అభిషేకింపదలచిన యయాతిని ఓ ప్రభూ! శుక్రుని మనుమడు, దేవయాని జ్యేష్ఠపుత్రుడు అయిన యదువును వదిలి పూరువునకు రాజ్యము ఎట్లు ఒసగుచున్నావు? యదువు నీ జ్యేష్ఠ పుత్రుడు. ఆతని తరువాతవాడు తుర్వసువు. తరువాతివాడు శర్మిష్ఠాపుత్రుడు, ద్రుహ్యువు, తరువాతివాడు అనువు, తరువాతివాడు పూరువు. జ్యేష్ఠులు అందరిని వదిలిపెట్టి చిట్టచివరివాడు, చిన్నవాడు రాజ్యమునకు ఎట్లు అర్హుడు? అందువలన ధర్మమును పాలించుమని నిన్ను కోరుచున్నాము. అని బ్రాహ్మణాది సమస్త జాతివారు అనిరి.
అంతట వారితో యయాతి:
“ఓ బ్రాహ్మణాది సమస్త జాతులారా! మీరందరు నా మాట వినుడు. ఎన్ని విధములుగ ఆలోచించినను నా జ్యేష్ఠ పుత్రునకు రాజ్యము ఈయ తగదు. మాతా పితరులు చెప్పినది చేయువాడు పుత్రుడు అని ప్రశంసింపబడును. నా జ్యేష్ఠపుత్రుడైన యదువు నేను చెప్పినది ఆచరింపలేదు. తండ్రికి వ్యతిరేకియైనవాడు పుత్రుడుకాడని సజ్జనుల మతము. తల్లిదండ్రుల ఎడ పుత్రునివలె వర్తించువాడు పుత్రుడు. యదువుచేత నేను తిరస్కరింపబడితిని. అట్లే తుర్వసునిచేత గూడ తిరస్కరింపబడితిని. ద్రుహ్యుచేతను, అనువుచేతను మిక్కిలి తిరస్కరింప బడితిని, పూరునిచే నేను చెప్పినది చేయబడినది. నా మాట విశేషముగా గౌరవింపబడినది. కనిష్ఠుడైన పూరువు నా జరను గ్రహించినవాడగుటచే రాజ్యమును పొండువాడు. పుత్రుడుగా ఆచరించిన పూరువుచే నేను సర్వకామములను అందినవాడను సర్వ కర్మలు చేసినవాడను అయితిని. కావ్యుడు ఉశనసుడు అయిన శుక్రుడు గూడ స్వయముగా-ఓ మహామతీ! యయాతీ! నీ మాటతో నిన్ను అనుసరించిన పుత్రుడు నీ రాజ్యమునకు రాజగునని- వరమిచ్చెను. మీకు ఈ విధముగా సమ్మతుడైన పూరువు రాజ్యమున రాజుగా అభిషేకింప బడుగాక. ఏ పుత్రుడు గుణసంపన్నుడో! ఎల్లప్పుడు మాతాపితరులకు హితుడో! వాడు కనిష్ఠుడైనను ప్రభువై సమస్త కల్యాణమునకు అర్హుడు అగును. ఈ రాష్ట్రమునకు పూరువు అర్హుడు. కారణము అతడు నీకు ప్రియమును చేసినవాడగుట. శుక్రుని వరదానముచేత గూడ అతడే రాజ్యార్హుడు అని చెప్పవలెను అని చెప్పెను. ఈ విధముగా పౌరజానపదులు చెప్పగా నహుషపుత్రుడైన యయాతి తన కనిష్ఠపుత్రుడు అయిన పూరుని తన రాష్ట్రమునకు రాజుగా అభిషేకించెను. తరువాత ఆగ్నేయ దిక్కునకు తుర్వసుని, నైరృతియందు యదు వును, పశ్చిమమున ద్రుహ్యుని, ఉత్తరమున అనువును నివేశింపజేసెను. ఈ విధముగ సప్తద్వీపములతోను, సాగరములతోను కూడియున్న భూమిని నాహుషుడైన అనగా నహు షుని పుత్రుడు అయిన యయాతి జయించి పుత్రులకు ఐదు విధములుగా విభజించి ఇచ్చెను. సప్త ద్వీపములతో పట్టణములతో కూడి ఉన్న ఈ పృథివి అంతయు, ప్రదేశమునకు అనుగుణముగా ధర్మజ్ఞులైన వారిచే ధర్మముగా పరిపాలింపబడుచుండెను. యయాతి ఈ విధముగా భూమిని పుత్రులకు వదిలి, వారియందు సంక్రమింపచేసి సర్వ సంపదగల వాడై సంతసించెను. ధనుస్సును, బాణములను, రాజ్యమును, పుత్రుల యందుంచి భారము అంతయు బంధువులందు (పుత్రులందే) ఉంచి యయాతి ఆనందమును పొందెను. ఇచట మహారాజైన యయాతి పాడిన గీతములు కలవు. యయాతి తన కామములను తాబేలు తన అవయవములవలె ఉపసంహరించుకొనెను. కామమును అనుభవించుటచే ఎప్పుడును కామము శాంతింపదు. నేతిహవిస్సుతో అగ్ని మాటి మాటికి వృద్ధినే పొందును. భూమిలో ప్రభూతములైన బియ్యము, గోధుమలు, బంగారము, పశువులు, స్త్రీలు, వీరం దరును ఒక మనుష్యునకు అనుభవించుటకు సరిపోరు అను విషయమును తెలిసికొనుచు మానవుడు మోహము చెందడు. సర్వ భూతములలో ప్రాణులలోను మనోవాక్కర్మలతో తేజోభావమును భావించువాడు (సర్వము తేజోమయమని భావించువాడు) బ్రహ్మీభూతుడు అగును. ఇతరులను భయపెట్టనివాడు, వీనినుండి భయపడని వాడు), కోరనివాడు, ద్వేషింపనివాడును, బ్రహ్మీభూతుడు అగును. తృష్ణ (ఆశ) దుర్మతులకు త్యజింపనలవిగానిది, జీర్ణించువానికి జీర్ణము కానిది. ప్రాణాంతకమైన రాగముకలది, దోషమయమైనది. అ తృష్ణను త్యజించిన వానికి సుఖము కలుగును. త్యజింపనివానికి కేశములు క్షీణించును, దంతములు క్షీణించును. జీవితాశయు, ధనాశయు తాను క్షీణించుచున్నను క్షీణింపవు. లోకమున కోరిక లేమి సుఖము, దివ్యమైన మహాసుఖము, తృష్ణాక్షయ సుఖము యొక్క పదునారవ భాగమునకు సమానముకావు” అని ఈ విధముగాచెప్పి అ రాజర్షియైన యయాతి, భార్యలతోబాటు వనమునకు బయలుదేరెను. భృగుతుంగమున తపముచేసి అచటనే ఆ మహాయశస్వి నూరు వ్రతములు చేసి స్వర్గమునందెను. అతని వంశములు ఈ ఐదు. ఇవి పుణ్యములు. దేవర్షులుకూడ సత్కరించినట్టివి. సూర్యుని కిరణములు వ్యాపించినట్లు ఈ యైదు వంశములు భూమిలో వ్యాపించినవి. యయాతి చరితమును మొత్తమును చదువుచు వినుచున్న బ్రాహ్మణోత్తముడును, నరుడును సంతానవంతుడు, ఆయుష్మంతుడు, కీర్తిమంతుడునై ధన్యుడగును.