కశ్యపుని యొక్క ప్రజా సర్గము

అనిచెప్పి సూతుడు ఇట్లు అనెను: ఆ తరువాత దనువు యొక్క పుత్రులను గురించి చెప్పెదను వినుడు. దనువు పుత్రులు తమ వంశమున పేరుగాంచిన మహాసురులుగా ఉండిరి. వారు విప్రచిత్తి ప్రధానులైన నూరుగురు. తీవ్రమైన పరాక్రమము కలవారు. వారందరును చక్కగా తపము చేసినవారును వరములు పొందినవారును, సత్యసంధులు, పరాక్రమించిన వారు, క్రూరులు, మాయావులును, మహాబలులు, యాగము చేయనివారు, అబ్రహ్మణ్యులును బ్రాహ్మణ హితము కోరనివారు, చంపదగనివారును అయిన వారు దను పుత్రులైన దానవులు. ప్రాధాన్యమును అనుసరించి వీరిని చెప్పెద వినుడు. ద్వి మూర్ధుడు, శంకువర్ణుడు, శంకు నిరామయుడు, శంకుకర్ణుడు, మహావిశ్వుడు, గవేష్ఠి, దుంధుభి, అజాముఖుడు, భగవంతుడు, శిలుడు, వామనుడు, మరీచి, అక్షకుడు, మహా గార్గ్యుడు, అంగిరావృతుడు, విక్షోభ్యుడు, సుకేతువు, సువీర్యుడు, సుహృదుడు, ఇంద్రజిత్తు, విశ్వజిత్తు, సురవిమర్దనుడు, ఏకచక్రుడు, సుబాహువు, తారకుడు, మహాబలుడు, వైశ్వానరుడు, పులోముడు, ప్రవీణుడు, మహాశిరుడు, స్వర్భానువు, వృషపర్వుడు, ముండకుడు, మహాసురుడు, ధృతరాష్ట్రుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, తాపిసుడు, సూక్ష్ముడు, నిచంద్రుడు, ఊర్ణనాభుడు, మహాగిరి, అసిలోముడు, సుకేశుడు, బలకుడు, దశుడు, గగన గగనమూర్ధుడు, కుంభనాభుడు, మహోదరుడు, ప్రమోదాహుడు, కుపథుడు, హయగ్రీవుడు, వీర్యవంతుడు, అసురుడైన విరూపాక్షుడు, మహాసురుడైన సుపథుడు, అజుడు, హిరణ్మయుడు, శతమాయుడు, శంబరుడు, శరభుడు, శలభుడు, సూర్యచంద్రులు ఇద్దరును. ఈ ఇద్దరు అసురులలో సురులు. సురలలో సాంప్రతులు (ఇప్పటికి ఉన్నవారు) అని దనువు యొక్క వంశమువారైన పుత్రులు ప్రధానులు. వారికి గూడ పుత్రపౌత్రాదులు లెక్కకు మిక్కుటము అనంతము అని దితిపుత్రులై దనుపుత్రులైన రాక్షసులు. స్వర్భానువు దితిసుతుడుగ చెప్పబడినాడు. అనుభానువు దనుపుత్రుడు. వీరు దనువు యొక్క వంశాను గతులైన పుత్రులు. ఏకాక్షుడు, ఋషభుడు, అరిష్టుడు, ప్రబంధనకరులు ఇద్దరును, ఇంద్రబాధన కేశియు, మేరువు, శంబుడు, ధేనుకుడును, గవేష్టి, గవాక్షుడు, వీర్యవంతుడైన తాలకేతువును, వీరు మనుష్యధర్ములైన దనుపుత్రులు. దైత్యదానవులు కలిసిన సంతోషమున పుట్టినవారును, భయంకర పరాక్రమముకలవారును, సింహికయందు విప్రచిత్తికి జనించిన పుత్రులు వీరు. వీరు సైంహికేయులని ప్రసిద్ధి చెందిన పదునలుగురు మహాసురులు. శతగాలుడు, బలవంతుడు, వ్యాసుడు, శాంబుడు, అసులోముడు, శుచి, వాతాపి, సీతాంశుకుడు, హరుడు, కల్పుడు, కాలనాభుడు, భౌముడు, నరకుడు వీరందరికి జ్యేష్ఠుడు రాహువు. ఈతడు చంద్రసూర్యులను విమర్శించు (మ్రింగు) వాడు. అను వీరు సింహికా పుత్రులు. దేవ తలకు గూడ జయింప అలవికానివారు. భయంకరులైన బంధువులు కలవారు, క్రూరులు. వారందరును బ్రహ్మను ద్వేషించువారు మరి పదివేలు సైంహికేయ గణమును కలరు.

ఈ గణము జమదగ్నిపుత్రుడై, మహాబలశాలియైన భార్గవునిచేతిలో (పరశు రామునిచే) చచ్చిరి. స్వర్భానువునకు ప్రభఅను కన్య కలదు. అట్లే పులోమునకు శచిఅను కన్యయు గలదు. ఈమె ఉపదానవి, ఈమెకు వృషపర్వుని కూతురుగా శర్మిష్ఠ జన్మించినది. పులోమయు, కాలికయు ఇద్దరు, వైశ్వానరుని పుత్రికలు. ప్రభయొక్క పుత్రుడు నహుషుడు. శచియొక్క పుత్రుడు జయంతుడు. తరువాత, శర్మిష్ట పురువును కనెను. ఉపదానవి దుష్యంతుని కనెను. ఈ పులోమ, కాలికలు ఇరువురును వైశ్వానర పుత్రికలు. ఆ ఇద్దరు కన్యలును మారీచుని వివాహము ఆడిరి. వారిరువురివలన హిరణ్యపురవాసులకు వేల పుత్రులును, అఱువది దానవశ్రేష్ఠులును ఇతరులు పదునలుగురును కలిగిరి. పౌలోములు అను కాలకేయులు అయిన దానవులు గొప్ప బలము గలవారు. వారు దానవులకు వధింప అలవిగాని వారు. సవ్యసాచియైన అర్జునునిచే చంపబడిరి. మయునకు పుట్టిన పుత్రులు అందరును వీరులు, పరాక్రమవంతులును. వారు మాయావి, దుందుభి, వృషుడు, మహిషుడు, బాలికుడు, వజ్రకర్ణుడు, మందోదరి అను కన్యయును (మయ సంతానము). ఇది దైత్యులయొక్కయు దానవుల యొక్క సృష్టి అని చెప్పబడినది. దనాయుష యొక్క పుత్రులు అయిదుగురు. వారు మహాబలులు. వారు అరూరువు, బలి, జంభుడు, విరక్షుడు, విసుడు-అనువారు. అరూరువుయొక్క పుత్రుడు క్రూరుడైన ధుంధువు అను మహాసురుడు. అతడు ఉత్తంకుని మాటచే కువయాశ్వునిచే చంపబడెనట. బలియొక్క పుత్రులు ఇరువురు మహా వీర్యవంతులు. ఆ ఇరువురును పరాక్రమములో సాటిలేనివారు. వారు కుభిలుడు, వర్ముడు అనువారు. ఈ వర్ముడు పూర్వజన్మలో కర్ణుడు విరక్షునకు గూడ కాలకుడు వరుడు-అను ఇరువురు పుత్రులు. విషునకు నలుగురు పుత్రులు కలిగిరి. వారు క్రూర కర్ములు. వారు శ్రాద్ధహంత, యజ్ఞహంత, బ్రహ్మహంత, పశుహంత అనువారు. వృత్రునకు కలిగిన దనా యుషా పుత్రులు పరాక్రమవంతులు. వారిని గురించి తెల్పుచున్నాను, వినుడు. వారు ఇంద్రునితో యుద్ధము చేయుచున్న వృత్రునియొక్క భయంకరమైన ఊపిరి నుండి పుట్టిరి. మహా బలవంతులైన రాక్షసులు (తమ మనస్సుతో) తాము భర్తలుగా చెప్పబడిరి. లక్షల కొలదిగా ఆ రాక్షసులు మహేంద్రుని అనుచరులు కలరు. వారందరు బ్రహ్మవేత్తలు, సౌమ్యులు, ధార్మికులు, సూక్ష్మ మూర్తులును. ప్రజలలో అంతర్గతులై ధార్మికులై వారందరు నివసింతురు. ఇది దైత్యుల యొక్కయు దానవుల యొక్కయు సృష్టిఅని చెప్పబడినది. యజ్ఞమున ప్రవాహిఅను ఆమె ఉత్తమ గాయకులైన పుత్రులను కనెను. వారు సత్త్వనుడు, సత్త్వాత్మకుడు, కలాపుడు, వీర్యవంతుడు, కృతవీర్యుడు, బ్రహ్మచారి, ఏడవవాడు సుపాండువు. పనుడు, తరణ్యుడు పదవవాడు సుచంద్రుడు. ఈ చెప్పబడిన వీరు గంధర్వులుగా తెలుసుకొనవలెను.