విష్ణు వంశ కీర్తనము

సూతుడు ఇట్లు అనెను:

సాత్వతియైన కౌశల్య రూప సంపన్నులైన సుతులనుకనెను. వారు భజి, భజమానుడు, దివ్యుడు, దేవావృధుడు, అంధకుడు, మహాభోజుడు, యదునందనుడైన వృష్టి అనువారు. 

వారియొక్క సృష్టులు నాలుగు. విస్తరముగా వినుడు. భజమానునకు శృంజయియందు బాహ్యకుడు ఉపరిబాహ్యకుడు కలిగిరి. శృంజయుని యొక్క పుత్రికలు ఇరువురు. బాహ్య కుడు వారిని పెండ్లాడెను. ఆ సృంజయ సుతలైన సోదరస్త్రీలు బాహ్యకుని భార్యలు. వారు బహుపుత్రులనుకనిరి. వారు నిమి, పణవుడు, శత్రుపురములను జయించు వృష్టి అనువారు. బాహ్యకార్యులు, శృంజయియందు భజమానుని వల్ల పుట్టినవారు. వారిలో పది లక్షలకోట్లను జయించినవాడైన వామకుడును పుట్టెను. భజమానుని వల్ల భగినియందు పుట్టినవారు బాహ్యకార్యులు. వారిలో దేవావృథరాజు మహాగొప్ప తపమునుచేసెను. సర్వగుణములతో కూడినవాడు నాకు పుత్రుడు కావలెను అని ఆత్మసంయోగము కావించి సవర్ణయైన ఆమె జలమును స్పృశించెను. ఆమె జలమును స్పృశించుటచే నదియై నర పత్నిని రాజర్షిగాచేసెను. ఈ విధముగా ఆ నదీశ్రేష్ఠ రాజునకు కల్యాణమును (శుభమును) చేసెను. తరువాత చింతాపరివృతాంగియై సర్వగుణోపేతుడైన పుత్రుని కనదగు స్త్రీ కనబడ కున్నది. అట్టి సర్వగుణోపేతుడైన పుత్రుడు రాజైన దేవావృధునకే కలుగును. కావున అతనికి నేను స్వయముగా భార్యను అగుదును అని ఒక నిశ్చయమునకు వచ్చెను. ఆమెకు దేవావృధుని భావమునకు అనుగుణముగనే స్వయముగా హస్తుడనువాడు పుట్టెను. ఆ తరువాత సావిత్రి కుమారియై కన్యయై రాజును గూర్చియే చింతించెను. రాజు కూడ ఆమెను కోరెను. ఉదార ధీమంతుడైన దేవావృధుడు ఆమెయందు గర్భమున తేజస్విని ధరింపచేసెను. తరువాత తొమ్మిదవ నెలలో ఆ నదీశ్రేష్ఠ దేవావృధుడు కోరిన విధముగా సర్వగుణోపేతుడైన పుత్రుని కనెను. మహాత్ముడైన దేవావృథుని యొక్క గుణములను కీర్తించుచు దేవావృథుడు దూరము నుండి వినబడి నట్లుగనే దగ్గరి నుండియు కనబడును. మనుష్యులలో బభ్రువు శ్రేష్ఠుడు. దేవావృధుడు దేవతలలో సమానుడు. అతని నుండి బభ్రువు నుండియు డెబ్బది వేల అఱువదియైదుగురు అమృతత్త్వమును పొందిరి. అతడు యజ్వ, దానపతి, వీరుడు, సత్యవచనుడు, బుధుడు, కీర్తిమంతుడు, మహాభాగుడు, సాత్వతులలో అతడిని మహారథుడు అని కీర్తింతురు. అతని వంశమున మార్తికావలులైన సుమహోభోజులున్నారు. వృష్టికి గాంధారి, మాద్రిఅను ఇరువురు భార్యలు ఉండిరి. గాంధారి మిత్రులను ఆనందింపజేయు సుమిత్రుని కనెను. మాద్రి దేవతలకు శివుని వంటివాడైన యుధాజిత్తును, అనమిత్రుని కనెను. వారిద్దరును పురుషోత్తములు. అన మిత్రుని పుత్రుడు నిఘ్నుడు. అతని పుత్రులు ఇద్దరు. మహాభాగుడైన ప్రసేనుడు, శక్రజిత్తు. వారిలో మొదటివాడు అయిన ప్రసేనుడు శక్రజిత్తునకు స్నేహితుడు ప్రాణ సమానుడును అయ్యెను. ఆ రథి శ్రేష్ఠుడైన శక్రజిత్తు వేకువ జామున సూర్యోపస్థానము చేయుటకు నీటి తీరము నుండి నీటిని తీసికొనుటకు వెళ్లెను. ఆ విధముగ నీటితో ఉపస్థానము చేయు చున్న శక్రజిత్తు ఎదుట అస్పష్టమూర్తియు, భగవంతుడును, తేజోమండల వంతుడును, విభువునైన సూర్యుడు సాక్షాత్తుగా నిలిచెను. తరువాత శక్రజిత్తు రాజు తన యెదుట నిలిచిన సూర్యునితో ఇట్లనెను. ఓ వెలుగుల రేడా! నిన్ను ఆకాశమున తేజో మండలు నిగా ఎట్లు చూతునో! అట్లే నా ఎదుట ఉన్నప్పుడును చూచుచున్నాను. ఓ సూర్యుడా! సాక్షాత్తుగా నీవు కనబడుటలో విశేషమేమి? అని అడిగెను. ఇది విని సూర్యభగవానుడు మణిశ్రేష్ఠమైన స్యమంతకమణిని తన కంఠము నుండి తీసి శక్రజిత్తుని కంఠమున వేసెను.

అపుడు ఆ శక్రజిద్రాజు సూర్యుని ఆకారవంతునిగా చూచెను. (పూర్వము స్యమంతక మణి కాంతిలో సూర్యుని అకారము కనపడలేదు). అపుడు ముహూర్త కాలము సూర్యుని ఆకారమును చూచి ఒక క్షణము అట్లే నిలిచెను. మరల వేగముగా బయలుదేరిన అగ్నితో సమానమైన వర్ణము కలిగి లోకములను దిరుగు సూర్యునితో-నీవు ఆకాశమునకు పోవకముందే ఆ మణిరత్నమును నాకు ఇమ్మని అడిగెను. సూర్యుడు ఆ స్యమంతకము అను మణిని శక్రజిత్తునకు ఇచ్చెను. ఆ శక్రజిద్రాజు ఆ మణిని కంఠమున ధరించి నగరమున ప్రవేశించెను. జనులు అతనిని ఇతడే సూర్యుడు (భూమిపై) పోవుచున్నాడు అని అతనిని చూచుటకు పరువిడిరి. శక్రజిత్తు రాజసభను అంతఃపురమును తన ప్రవేశముతో ఆశ్చర్యము కలుగజేసెను. శక్రజిత్తు ఆ దివ్యమైన ఉత్తమమైన స్యమంతక మణి రత్నమును ప్రేమతో భ్రాతయైన ప్రసేనజిత్తునకు ఇచ్చెను. స్యమంతకమను మణి ఎవ్వని రాష్ట్రమున ఉండునో, ఆ రాష్ట్రమున పర్జన్యుడు (వరుణుడు) సకాలమున వర్షించును. వ్యాధి భయము ఉండదు. కృష్ణుడు ప్రసేనునుండి ఆ మణిని పొందకోరెను. కాని అతడు ఈయనందున పొంద లేదు. తాను ఆ మణిని తీసికొన సమర్థుడైనను అమణిని కృష్ణుడు హరింపలేదు. ఒకప్పుడు ప్రసేనుడు ఆమణిని అలంకరించుకొని వేటకువెళ్లెను. స్యమంతకమణి కొఱకై సింహముచే దారుణముగా వధింపబడెను. భల్లూక రాజైన జాంబవంతుడు ఆ సింహమును చంపి, దివ్యమైన స్యమంతకమణిని తీసికొని తన గుహబిలమున ప్రవేశించెను. తరువాత వృష్టి- అంధకులపెద్దలు, అ దుష్కార్యము మణిని పొందగోరిన శ్రీకృష్ణునిపనియే అని శ్రీకృష్ణుని శంకించిరి. బలవంతుడై, శత్రు సంహారకుడైన, కృష్ణభగవానుడు వారి నుండి ఆ అసత్య నిందను సహింపనివాడై వనమున సంచరించెను. తరువాత ప్రసేనుని వేటాడిన చోటున తిరిగెను. తరువాత ఆప్తకారులు అయిన పురుషులతో ప్రసేనుని స్థానమును చేరెను. ఋక్ష వంతమను పర్వత శ్రేష్ఠమును, వింధ్యపర్వత శ్రేష్ఠమును వెదకి పరిశ్రాంతుడై ఆ మహా మనస్వి కృష్ణుడు గుఱ్ఱముతోసహా చంపబడిన ప్రసేనుని కనుగొనెను. కాని అచట మణిలేదు. తరువాత ప్రసేనుని శరీరమునకు సమీపములోనే భల్లూకముచేత చంపబడిన సింహమును చూచెను. తరువాత భల్లూక పాదచిహ్నములతో సూచింపబడిన జాంబవంతుని గుహను వెదకెను. అచట ఆడవారితో పెద్దగా పాటపాడుచున్న మాటలను వినెను. దాది జాంబ వంతుని కుమారుని తీసికొని సంతోషముతో -ఏడవకుము అన్నమాటను వినెను. ధాత్రి (దాది): సింహము ప్రసేనుని చంపెను. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. ఓ సుకుమారకా! ఇక ఏడువకుము. ఈ శ్యమంతకము నీదే! అని అనెను. వినబడిన ఈ శబ్దమును అనుసరించి వేగముగా అ బిలములోనికి కృష్ణుడు వెళ్లెను. ఆ గుహాబిల సమీ పమున చీల్చబడిన ప్రసేనుని చూచెను. వెంటనే ఉదారబుద్ధి గల భగవంతుడైన కృష్ణుడు ఆ బిలములో ప్రవేశించి భల్లూక రాజైన జాంబవంతుని చూచెను. వాసుదేవుడు ఇరువది యొక్క దినములు జాంబవంతునితో బాహువులతో యుద్ధముచేసెను. కృష్ణుడు బిలమున బ్రవేశింపగా వాసుదేవునికి తోడుగా వచ్చినవారు మరల ద్వారకకు వచ్చి కృష్ణుడు చంపబడి నట్లుగా నివేదించిరి. వాసుదేవుడు మాత్రము మహాబలుడైన జాంబవంతుని జయించి, భల్లూకరాజైన జాంబవంతునకు ఇష్టురాలైన కన్యయగు జాంబవతిని పొందెను. శ్రీకృష్ణుని తేజముతో పరాజితుడైన జాంబవంతుడు ప్రభతో గూడిన మణిని, జాంబవతి అను తన కన్యను విష్వక్సేనుడైన శ్రీకృష్ణునకు ఇచ్చెను. కృష్ణుడు తనపై నిందను పోగొట్టు కొనుటకై స్యమంతక మణిని స్వీకరించెను. తరువాత జాంబవంతునితో వెళ్లివత్తునని బిలమునుండి బయలుదేరెను. ఈ విధముగా మణిని దీసికొని వచ్చి తాను తనపై నున్న అపనిందను తొలగించి సాత్వతుని సన్నిధిలో ఆ మణిని సత్రాజిత్తునకు ఇచ్చెను. తరువాత కృష్ణుడు జాంబవతితో జనార్దనుడైన తాను ఆ అపనింద నుండి విముక్తుడనైతిని అనెను. శ్రీకృష్ణుడు ఈ అపనింద పోగొట్టుకొన్న విధమును తెలిసినవాడు ఎక్కడగూడ అపనిందను పొందడు.

సత్రాజిత్తు నుండి వారిలో వారు తోబుట్టువులైన పదుగురు భార్యల నుండి నూరుగురు పుత్రులు జన్మించిరి. వారిలో ముగ్గురు ప్రసిద్ధి చెందినవారు. వారిలో మొట్టమొదటివాడు భంగకారుడు, (సత్రాజిత్తు) వీరుడైన వ్రతపతి, సుప్రియుడైన అపస్వాంతుడు. భంగకారునకు మంచి సంతానముగల ద్వారావతి భార్య. ఆమె రూపగుణాన్వితలైన ముగ్గురు పుత్రికలను కనెను. ఆ స్త్రీలలో ఉత్తమురాలు సత్యభామ. ఆమె దృఢవ్రత, తపస్విని. తండ్రి ఆమెను కృష్ణు నకు ఇచ్చెను. కృష్ణుడు సత్రాజిత్తునకు ఇచ్చిన మణిరత్నమైన స్యమంతక మణిని అపుడు శతధన్వుడైన భోజుడు తీసికొనెను. అపుడు అక్రూరుడు మణిరత్నమైన స్యమంతకమణిని కోరుచు అనిందితయైన సత్యాభామను అడిగెను. తరువాత మహాబలుడైన శతధన్వుడు భద్రకారుని (సత్రాజిత్తును) జంపి రాత్రియందు ఆ మణిని తీసికొని వచ్చి అక్రూరునకు ఇచ్చెను. అపుడు నరశ్రేష్ఠుడైన అక్రూరుడు కారణమును చెప్పి నీవీ మణిని ఇతరులు తెలియకుండ మెదలవలెనని నియమము చేసెను. కృష్ణునిచేత నీవు భయపెట్ట బడుదువు అని మాకు తెలియును. నాకు ద్వారకా ప్రజలందరు వశమునందున్న వారు, సందేహము లేదు అనెను. తండ్రి చంపబడగా యశస్వినియై సత్యభామ దుఃఖార్తయై రథమును ఎక్కి వారణావత నగరమునకు వెళ్లెను. సత్యభామ శతధన్వుడైన భోజుని యొక్క ఆచర్యను (తన తండ్రిని చంపుటను) భర్తయైన కృష్ణునకు నివేదించి దుఃఖపీడితయై కృష్ణుని ప్రక్కనచేరి కన్నీరుకార్చెను. అపుడు దహింపబడిన పాండవులకు కృష్ణుడు జలతర్పణాది క్రియనుచేసి, అదే క్రియను తనసోదరులకు చేయుటకై సాత్యకిని నియోగించెను. తరువాత కృష్ణుడు తొందరగా ద్వారకకువచ్చి, తన అన్నయైన బలరామునితో ‘మణికొరకు ప్రసేనుడు సింహ ముతో చంపబడెను. ఆ మణికొరకే శతధన్వునిచేత సత్రాజిత్తు చంపబడెను. ఓ ప్రభూ! బలరామా! నేనాతని మార్గమున స్యమంతకమును జూతును. నీవు అతనిని చంపుము అనెను. కావున తొందరగా రథమెక్కుము. మహాబలుడైన భోజుని (శతధన్వుని) చంపుము. ఓ మహాబాహో! శ్యమంతకము మనది అగును అనెను. తరువాత భోజకృష్ణులకు తుముల యుద్ధము జరిగెను. శతధన్వునికి ఏ దిక్కునగూడ అక్రూరుడు కానరాలేదు. ఎక్కిన గుఱ్ఱు ములును దిగకుండా భోజజనార్దనులు యుద్ధముచేసిరి. అక్రూరుడు తానుగూడ యుద్ధము చేయ శక్తుడైనను శ్యమంతకమణి రక్షణము సాధ్యమైనందునను వార్ధక్యము వల్లను కృష్ణునితో యుద్ధము చేయలేదు. భోజుని అడ గుఱ్ఱము విజ్ఞాత హృదయమను నూరు యోజనములు బోపు దివ్యమైన గుఱ్ఱము. దానితోనే శత ధన్వుడు కృష్ణునితో యుద్ధము చేసెను. మిక్కిలి పెంచిన వేగముకల ఆడగుఱ్ఱము నూరు యోజనముల మార్గమునుదాటెను. ఇది శతధన్వుని కొంత బాధించెను. ఓ ఋషులారా! తరువాత ఆ గుఱ్ఱములు శ్రమవల్లను, భేదము వల్లను, ఆకాశమునకు ఎగసినవి. వాని ప్రాణములుకూడ ఆకాశమునకు ఎగసినవి. అంత కృష్ణుడు బలరామునితో గుఱ్ఱములందు దోషము కనబడినది. ఓ మహాబాహో! బలరామా! మీరు ఇచటనే ఉండుడు. పాదములతోనే నడచివెళ్లి శతధన్వుని కడనున్న శ్యమంతకమణి రత్నమును హరింతును అని చెప్పెను. తరువాత కృష్ణుడు పాదములతో నడచియే వెళ్లి మిథిలాధిపతియు పరమాస్త్రవేత్తయు నైన శతధన్వుని చంపెను. మహా బలుడైన భోజుని చంపినను అతని వద్ద శ్యమంతకమణిని కానలేదు. ఆ విధముగ (లేక) మరల వచ్చిన కృష్ణుని బలరాముడు మణిని ఇమ్మని అడిగెను. కృష్ణుడు మణిలేదు అనెను. అంత బలరాముడు కోపించినవాడై ధిక్కారము ధిక్కారము అని మాటిమాటికి ధిక్కారమును బలికి కృష్ణునితో అన్నను అగుట వలన దీనిని సహించుచున్నాను. నీకు శుభమగుగాక, నేను వెళ్లుచున్నాను. నాకు ఇక ద్వారకతోను, నీతోను, వృష్ణులతోను పనిలేదనెను. తరువాత శత్రుమర్దనుడైన బలరాముడు మిథిలలో ప్రవేశించెను. ఆ మిథిలలో కోరిన అన్నింటితోను మిథిలారాజుచేత పూజింపబడెను. ఈ కాలములోనే బభ్రువను మహాబుద్ధిశాలి అనేక విధములైన సమస్తములైన క్రతువులను ఏ విఘ్నములులేక చక్కగా చేసెను. గాధిపుత్రుడై మహాయశస్వియైన రాజు (అక్రూరుడు) శ్యమంతకమణి రక్ష కొఱకు దీక్షామయమైన కవచమున ప్రవేశించెను. అర్థములను, శ్రేష్ఠములై వివిధములైన రత్నములను, అఱువది ఏండ్లు గడచిన కాలములో యజ్ఞముల వినియోగించెను. ఇవి అక్రూర యజ్ఞములని ఆమహాత్ముడైన అక్రూరుని యజ్ఞములు ప్రసిద్ధిచెందినవి. అవి అన్నియు బహ్వన్నములు బహుదక్షిణాకములు సర్వకామములను ఇచ్చునవి. తరువాత రాజై, ప్రభువైన దుర్యోధనుడు మిథిలానగరమునకు వెళ్లి బలరాముని నుండి గదాశిక్షను (విద్యను) పొందెను. తరువాత విప్రులు వృష్టి- అంధక మహారథులచే అనుగ్రహింపచేసెను. మహాత్ముడైన కృష్ణునిచే ద్వారకకు తీసుకొని రాబడెను. పురుష శ్రేష్ఠుడై బలవంతుడైన కృష్ణుడు బంధుమంతునితో బాటు శత్రుఘ్నుని (శత్రుహంతను) యుద్ధమున చంపి అంధకులతో బాటు అక్రూరుని దగ్గరకు వచ్చెను. భంగకారునకు శ్వఫల్క తనయయైన ‘నర’ యందు నరసత్తములును, మహాబలవంతులు, ప్రసిద్దులు అయిన తనయులు పుట్టిరి. అంధక ముఖ్యుని పుత్రులైన వారు శత్రుఘ్నుడును బంధుమంతుడును. భంగకారుని వధకొఱకు కృష్ణుడు సంతుష్టుడు కాడు. జ్ఞాతులలో భేదము పుట్టునను భయముచేత అక్రూరుని చంపుటకు ఉపేక్షించి వదలెను. ఆ విధముగ అక్రూరుడు వెడలిపోగా ఇంద్రుడు వర్షింపలేదు. అనావృష్టి పీడిత మైన రాష్ట్రముగల ఆతనిని చంపుటకు బయలుదేరెను. తరువాత, కుకురాంధకులు అక్రూరుడు ద్వారావతికి వచ్చుటకు అనుగ్రహింపచేసిరి. అపుడు దానపతియైన అక్రూరుడు మరల ద్వారావతికి రాగా ఇంద్రుడు సముద్ర మధ్యన (ద్వారావతిలో)వర్షించెను. యదుశ్రేష్ఠుడై శ్రీమంతుడైన అక్రూరుడు తన కన్యను, శీలసమ్మతయైన చెల్లెలిని ప్రీతికొఱకై కృష్ణునకు ఇచ్చెను. అంత, కృష్ణుడు యోగ శక్తితో బభ్రువు దగ్గర ఉన్న మణిని తెలిసి సభామధ్యమున అక్రూరునితో ఇట్లనెను. ఓ ప్రభూ! నీ హస్తగతమై ఉన్న స్యమంతకమణి రాజము దానిని ఇమ్ము. ఇచట వ్యతిరేకమతిని చూపకుము. అరువది ఏండ్లు గడచిన కాలమున నుండిన నా కోపము ఆ కాలమున ఆశ్రయించి సుదృఢమై ఒక్కసారిగా నాలోనికి మహత్తెవచ్చినది అనెను. తరువాత, కృష్ణుని మాటవలన, బభ్రువు (అక్రూరుడు)మహామతియై ఏ క్లేశము లేకుండగనే సర్వసాత్వత సభలో ఆ మణిని ఇచ్చెను. తరువాత, అది దమనుడైన కృష్ణుడు బభ్రు హస్తము నుండి అకుటిల మార్గమును పొందిన ఆ శ్యమంతకమణిని సంతసించిన మన స్సుతో మరల బభ్రునకే ఇచ్చెను. కృష్ణుని చేతినుండి ఆ శ్యమంతకమణిని రాజ్యమును పొంది గాందినీ పుత్రుడైన బభ్రువు (అక్రూరుడు) కంఠమున బంధించుకొని సూర్యునివలె ప్రకాశించెను. కృష్ణుని అపనింద విశుద్ధమై ఉత్తమమైన విధమును తెలిసినవాడు ఏ విధముగ అయినను అపనిందను పొందడు.

కనిష్ఠ వృష్టి నందనుడైన అనిమిత్రునివల్ల శిని పుట్టెను. సత్యవాక్కు సత్య సంపన్నుడయిన సత్యకుడు శినియొక్క పుత్రుడు. సత్యక పుత్రుడు సాత్యకి. యుయుధానుడు అయిన ఆ సాత్యకికి పుత్రుడు ‘భూతి’. భూతికి కుమారుడు యుగంధరుడు అని భౌత్యులు చెప్పిరి. పృశ్నికి శ్వఫల్కుడు చిత్రకుడును పుత్రులు. శ్వఫల్కుడు మహారాజు. ఆ ధర్మాత్ముడు ఉన్నచోట వ్యాధి భయములేదు. అనావృష్టి భయము లేదు. ఓ బ్రాహ్మణోత్తములారా! ఒకప్పుడు ప్రభువైన కాశిరాజు రాజ్యమున ఇంద్రుడు మూడేండ్లు వర్షింపలేదు. అపుడు కాశిరాజు అచ్చట పరమార్చితుడైన శ్వఫల్కుని నివసింపజేసెను. శ్వఫల్కుడుండుటచేత ఇంద్రుడు వర్షించెను. శ్వఫల్కుడు కాశీరాజు యొక్క పుత్రికను, అనిందితయైన భార్యగా స్వీకరించి గాందిని అను గోవును గ్రహించెను. అది నిత్య ధనమును విప్రునకు ఇచ్చెను. ఆమె (గో గర్భమున ఉన్న కూతురు) తల్లి గర్భములో పెక్కు వందల యేండ్లు వసించుచుండెనేగాని జన్మించుట లేదు. అపుడు గర్భములో ఉన్న ఆమెతో ఆమె తండ్రి తొందరగా జన్మింపుము. నీకు భద్రమగుగాక. ఎందుకు గర్భములో ఉండుచున్నావు? అని అడిగెను. అంత గర్భస్థయైన కన్నెగోవు - ప్రతిదినము నేను ఈయబడినచో ఉండును. నేనున్నచో ఓ తండ్రీ నన్ను కోరుకొనుము - అని అనగా అది అట్లే అగుగాక అని దానిపిత దాని కోరికను పూరించెను. ఆమె పుత్రులుదాత, యజ్వ, శూరుడు, శాస్త్రజ్ఞాని, అతిథి ప్రియుడు, యజ్ఞములందు భూరి దక్షిణలు ఇచ్చువాడునైన అక్రూరుడు, అతడు శ్వఫల్కుడును, ఉపమంగువు, మంగువు, మృదురుడు, అరిమేజయుడు, గిరిరక్షుడు, యక్షుడు, శత్రుఘ్నుడు లేదా అరిమర్దనుడు, ధర్మభృత్తు, శృష్టచయుడు, వర్గమోచుడు, అపరుడు, ఆవాహ ప్రతివాహులు, వసుదేవ అను వరాంగనయును అనువారు. అక్రూరుని వల్ల ఉగ్రసేని యందు ఇద్దరుకుల సంతోషకారులు పుత్రులు - దేవుడు, అనుదేవుడు అనువారు పుట్టిరి. వారు దేవతలతో సమానులు. చిత్రకునకు పుత్రులు - పృథువు, విపృథువు, అశ్వగ్రీవుడు, అశ్వబాహువు, సుపార్శ్వకుడు, గవేషణుడు, అరిష్టనేమి, అశ్వుడు, సువర్మ, వర్మచర్మభృత్తు, అభూమి, బహు భూమి, శ్రీ విష్ఠ - శ్రవణా అను స్త్రీలును జన్మించిరి. సత్యకుని వల్ల కాశిదుహిత (కూతురు) నలుగురిని కుమారులను కనెను. వారు కకుదుడు, భజమానుడు, శమీకుడు, బలబర్హిషుడు. అనువారు. కకుదునకు వృష్టి, వృష్టికి కపోతరోముడు, వానికి రేవతుడు పుత్రులు. ఆతనికి తుంబురు సఖుడైన విద్వాంసుడు పుత్రుడు. అతని పేరనే చందనోదక దుందుభి ప్రసిద్ధమైనది. ఆతనికి అభిజిత్తు, అభిజిత్తునకు పునర్వసు పుత్రుడు. అభిజిత్తు పుత్రునికోరి అశ్వ మేధము చేసెను. దానియొక్క అతిరాత్ర సదోమధ్యము నుండి మిథునము పైకివచ్చెను. తరువాత విద్వాంసుడు, ధర్మజ్ఞుడు, దాత, యజ్వయైన పునర్వసువు పుట్టెను. ఆతనికి కూడ పుత్రమిథునము పుట్టినది. అది బాహు, బాణములచే జయింపబడనిది. అ మిథునము - ఆహుకుడు ఆహుకి, అని బుద్ధిమంతులలో శ్రేష్ఠులు. అమ్ముల పొదులు ధ్వజములు (జండాలు) రథముల నొగళ్ల చివరి మ్రానితుండ్లుకల పదివేల సేనల యొక్కయు, మేఘధ్వని గల రథముల యొక్కయు బలముకలవాడు ఆహుకుడు అని ఆ ఆహుకుని గూర్చి ఒక శ్లోకములను పెద్దలు ఉదాహరింతురు. అతడు అసత్యము పలుకనివాడు, యాగము చేయక ఉండనివాడు, వేయికి తక్కువ దక్షిణలు ఈయనివాడు, అశుచిగా ఉండనివాడు, అధర్మము లేనివాడు, విద్వాంసుడు అయినవాడు, కృశింపని వాడునై ఉండెను. ఆహుకునకు పుత్రుడు ధృతి. ఆతడు తెల్లని పరిచారముతో కిశోరముల వలెనున్న లక్ష ఎనుబది గుఱ్ఱములను కలిగి ఆహుకునితో సమానుడు అయ్యెను. తూర్పుదిక్కున భోజునకు వెండి బంగారు కక్షలుకల ఇరువది యొక్క వేల ఏనుగులు ప్రకాశించినవి. భూపాలుడైన భోజునకు ఉత్తర దిక్కున కూడ అన్నివేల (21000) ఏనుగులు ప్రకాశించి, చిరుగంటలు మ్రోగించినవి. ఆహుకుడు తన చెల్లెలిని ఆహుకాంధునకు ఇచ్చెను. ఆహుకాంధునకు కూతురు దేవకుడు, ఉగ్రసేనుడు అనువారు ఇద్దరు పుత్రులును కలిగిరి. వీరిరువురు దేవగర్భసములు. దేవకునకు దేవతలతో సమాన వీరులు పుత్రులు. దేవతలకు కూడ దేవుడైనవాడు (దేవ దేవుడు), సుదేవుడు, దేవ రంజితుడనువారు. వారి తోబుట్టువులు అయిన స్త్రీలు ఏడుగురు ఉండిరి. వారిని వసు దేవునకు ఇచ్చెను. వృకదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవ, శాంతిదేవ, మహాదేవ, ఏడవది సునామ. ఆమె సుందరరూపము కలది. ఉగ్రసేనుని పుత్రులు తొమ్మండుగురు. వారిలో కంసుడు మొదటివాడు. న్యగ్రోధుడు, సునాముడు, కద్వశంకుడు, భూమయుడు, సుతనువు, రాష్ట్రపాలుడు, యుద్ధతుష్టుడు, సుపుష్టిమంతుడు. వారి చెల్లెండ్రు ఐదుగురు. కర్మధర్మవతి, శతాంకూ, రాష్ట్రపాలా, కహ్వా, వరాంగనా. కుకుర వంశమున పుట్టిన ఉగ్రసేనుడు మహాపత్యుడుగా ప్రసిద్ధుడు. అమిత తేజస్కులైన కుకురుల ఈ వంశమును గురించి తెలిసికొన్న నరుడు విపుల వంశమును పొందును. సంతానవంతుడు అగును. భజమానుని యొక్క పుత్రుడు రథి ముఖ్యుడైన విదూరథుడు, రాజ్యాధిదేవుడు, శూరుడు, విదురుడుఅను సుతులు ఉండిరి. ఆ శూరునికి మిక్కిలి బలవంతులైన సుతులు పుట్టిరి. వారు - వాతుడు, నివాతుడు, శోణితుడు, శ్వేత వాహనుడు, శమి, గదవర్మ, నిదాతుడు, శక్ర శక్రజిత్తు అనువారు. శమిపుత్రుడు ప్రతిక్షిపుడు. ప్రతిక్షిప్తుని పుత్రుడు స్వయం భోజుడు, స్వయం భోజునకు హృదికుడు పుట్టెను. హృదికునకు భీమపరాక్రమవంతులు పదుగురు పుత్రులు. కృతవర్మ, శతధన్వుడు, కృతుడు, దేవార్హుడు, వనార్హుడు, భిషక్కు, ద్వైతరథుడు, సుదాంతుడు దియాంతుడు, నకవంతుడు, కనకోద్భవుడు - అనువారు. దేవార్హుని సుతుడు విద్వాంసుడైన కంబలబర్హిషుడు. అతని పుత్రుడు అసమౌజుడు, ప్రసిద్ధుడైన సుమహౌజుడు. అపుత్రుడైన అసమౌజసునకు వీరిని ఇచ్చెను. సుదంష్ట్రుడు, సురూపుడు, కృష్ణుడు - అను వీరంధకులు అనబడిరి. అంధకుల ఈవంశమును నిత్యము కీర్తించువాడు తనయొక్క విశాల వంశమును పొందును. సంశయము లేదు.

శూరుడు అస్మకి యందు దేవమానుషిని పుట్టించెను. అతడు మాషియందు దేవమీఢుషుని పుట్టించెను. భోజయైన భాషియందు శూరుని వల్ల పదుగురు జనించిరి. వారికి మహాబాహువైన వసుదేవుడు జనించెను. మొదట ఈతడు ఆనక దుందుభి. ఆతడు జనింపగనే అతని దుందుభి (భేరి) ఆకాశమున మ్రోగెను. అట్లే పెద్ద తప్పెటల చప్పుడు కూడ ఆకాశమున మ్రోగెను. శూరుని భవనమున పెద్ద పుష్పవర్షము కురిసెను. మొత్తము మనుష్య లోకమున కూడ రూపమున వసుదేవునితో సమానుడు లేడు. పురుష శ్రేష్ఠుడైన ఆతని కీర్తి చంద్రుని వెన్నెల వలె వ్యాపించి ఉండెను. తరువాత మహాబాహువు. తరువాత దేవభాగుడు పుట్టిరి. తరువాత దేవశవుడు పుట్టెను. అనాదృష్టిపరుడు, నందనుడు, భృంజనుడు, శ్యాముడు, శమీకుడు, గండూషుడు, నలుగురు శ్రేష్ఠ స్త్రీలునుపుట్టిరి. వారు పృథ, శ్రుతవేద, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాధిదేవి - ఈ అయిదుగురు వీరమాతలు. వసుదేవుడు సంతానములేక వృద్ధుడైన కుంతిభోజునకు పృథను ఇచ్చెను. కుంతిభోజుడు ఆమెను కూతురినిగా చేసికొనెను అప్పటి నుండి పృథ కుంతి అనబడెను ఈ కుంతిని పాండురాజు వివాహము ఆడెను. కావున భోజాత్మజయైన పృథ కుంతి అని ప్రసిద్ధి గాంచెను. కురువీరుడై ముఖ్యుడైన పాండువు భోజునినుండి కుంతిని భార్యగా పొందెను. తరువాత పృథ (కుంతి) అగ్ని సమాన తేజోవంతులైన మువ్వురు పుత్రులను కనెను. వారు లోకమున ఎదురులేని వీరులు, ఇంద్ర సమానపరాక్రములు. యమధర్మరాజు వల్ల యుధిష్ఠిరుని, వాయుదేవుని వల్ల భీముని, ఇంద్రునివల్ల అర్జునుని పుత్రులనుగా కనెను. మాద్రవతియందు అశ్వినులు (అశ్వినీ దేవతల పుత్రులు) పుట్టిరని ప్రసిద్ధి వచ్చినది. వారు నకులుడు, సహదేవుడును. వీరురూపము సత్త్వము గలవారు. వృద్ధశర్మకు శ్రుతదేవ యందు పుత్రుడు పుట్టెను. అతడు కరూష దేవాధిపతి, వీరుడు, దంతవక్త్రుడను వాడు, మహాబలుడు. కేకయరాజ పుత్రియైన శ్రుతకీర్తియందు సంతర్ధనుడు, చేకితాన - బృహత్ క్షత్రులు, అట్లే ఇతర మహాబలులును పుట్టిరి. వారు విందానువిందులు, వీరవంతి దేశపు రాజులు, సోదరులు, మహాబలులు, శ్రుతశ్రవయందు చేది దేశాధిపతియైన శిశుపాలుడు పుట్టెను. దమఘోషుడను రాజర్షికి ఈతడు పుత్రుడు. విఖ్యాతమైన పౌరుషము కలవాడు. ఈతడు పూర్వజన్మలో శత్రుమర్దనుడై దశగ్రీవుడైన రావణుడుగా ఉండెను. ఆతనికి యదుశ్రవుడు అనుజుడు, రుజుకుడు మరొక అనుజుడు. వసుదేవుని భార్యలు పదముగ్గురు శ్రేష్ఠ స్త్రీలు. పౌరవి, రోహిణి, మదిర, అపర, భద్ర, వైశాఖి, ఏడవది దేవకి, సుగంధి, వనరాజి, తక్కిన ఇద్దరు పరిచారికలును. రోహిణి, పౌరవియు వల్మీకునకు పుత్రికలైరి. వసుదేవునియొక్క జ్యేష్ఠపత్ని రోహిణి, జ్యేష్ఠుడైన పుత్రునిగా బలరాముని పొందెను. అట్లే సారణుని నిశవుని, దుర్దముని, దమనుని, శుభ్రుని, పిండారక - కుశీతకు లను, చిత్రయను పుత్రికను, రోహిణిని ఈ ఎనమండుగురిని కనెను. బలరామునకు ఇద్దరు పుత్రులు పుట్టిరి. వారు నిశిత - ఉత్సుకులు. పార్శ్వి, పార్శ్వనంది, శిశువు, సత్య, ధృతి, మంద బాహ్యుడు, రామాణ - గిరికులు, గిరుడు, శుక్లగుల్ముడు, గుల్ముడు, దరిద్రాంతకుడు - వీరు పుత్రులు. పుత్రికలు మొదటివారు ఐదుగురు. పేరులతో వారిని వినుడు. అర్చిష్మతి, సునంద, సురస, సువచ, శతబల - వీరు సారణుని సుతలు. భద్రాశ్వుడు, భద్రగుప్తి, భద్రవిఘ్నుడు, భద్రబాహువు, భద్రరథుడు, భద్రకల్పుడు, సుపార్శ్వకుడు, కీర్తిమంతుడు, రోహితాశ్వుడు, భద్రజుడు, దుర్మదుడు, అభిభూతుడు వీరు రోహిణి యొక్క కులమున పుట్టినవారు. నంద - ఉపనందులు, మిత్రుడు, కుక్షిమిత్రుడు అచలుడు, చిత్ర - ఉపచిత్ర అను కన్యలు, స్థితుడు, పుష్టి, అపరుడు సుదేవుడు - వీరు మదిర యొక్క సుతులుగా పుట్టిరి. ఉపబింబుడు, బింబుడు, సత్వదంత మహౌజసులు - మహాబలులైన ఈ నలుగురు భద్రాపుత్రులు, శౌరి వైశాఖయందు కైశికుడను ఉత్తమ పుత్రుని పొందెను. దేవకియందు శౌరి, సుషేణుడు, కీర్తిమంతుడు, తదయుడు, భద్రసేనుడు, యజుదాయుడు, భద్రుడు, విదేకుడు - అనువారిని కనెను. వీరినందరిని (శౌరిదక్క) కంసుడు వధించెను. తరువాత అట్టి అవస్థలో ఆయుష్మంతుడు, లోకనాథుడు, మరల వచ్చిన విష్ణువు, ప్రజాపతియునైన పూర్వకృష్ణుడు పుట్టెను. అతని తరువాత కృష్ణ భద్రభాషిణియైన సుభద్ర జన్మించెను. తరువాత కృష్ణ సుభద్రఅని ఆ వృష్ణికుల నందిని అని తెలుసుకొనవలెను. సుభద్రయందు అర్జునునివల్ల రథియైన అభిమన్యుడు పుట్టెను. వసుదేవుని భార్యలైన ఏడుగురు మహా భాగ్యవంతు రాండ్రయందు పుట్టిన శూరులైన వారిపేర్లును వినుడు. ఇతనికి సహదేవయందు శూరుడైన అభయాసఖుడు పుట్టెను. శారదేవుని గర్భంనుంచి తాబుడు అనువాడు పుట్టెను. శౌరి కులోద్ధారకులైన ఉపసంగుని, వసువును - అను దేవరక్షితులైన పుత్రులను కనెను. ఈ విధముగ వసుదేవునకు పదుగురు పుత్రులు. వారిని కంసుడు చంపించెను. ఉపదేవ - విజయుని, రోచనుని, వర్ధమానుని, ఈ మహాభాగులను అందరిని కనెను. వృకదేవి మహాత్ముడైన స్వగాహవుని కనెను. ఈతనికి ఆగాహి చెల్లెలు. ఆమె సురూపను, శిశిరాయణిని కనెను. దేవకి ఏడవ పుత్రునిగా కృష్ణుని కనెను. సునాసభువుని (భూమిని) కనెను. మహాభాగుడై యుద్ధమున చిత్రముగా యుద్ధముచేయు గవేషణుని కనెను. ఈ గవేషణుడే పూర్వము వనమున శ్రాద్ధదేవుని కనెను. శౌరి శైబ్యయందు నాశములేని కౌశికుని ఇచ్చెను. సుగంధి, వనరాజియు శౌరి పెండ్లాడినవారు. పుండ్రుడు, కపిలుడును, వసుదేవ పుత్రులు. వారిలో పుండ్రుడు రాజయ్యెను. కపిలుడు వనమునకు పోయెను. ఆమెయందు వసుదేవ పుత్రుడై బలవంతుడు పుట్టెను. ఆతడు రాజైన నిషాదుడు. ఈతడు మొదటి ధనుర్ధరుడు. దేవరాతునకు మహాభాగుడై ప్రసిద్ధుడైనవాడు పుత్రుడుగా పుట్టెను. దేవశ్రవసునివల్ల పుట్టినది పండిత సమ్మతమైనదిగా పెద్దలు చెప్పుదురు. నివర్తుడు అస్మకియందు యశస్వియైన అనాదృష్టిని, ఇంద్ర శత్రువును చంపు మహాబలుడైన శ్రాద్ధ దేవుని పుత్రునిగా పొందెను. శ్రాద్ధ దేవుడు నిషధునిగా తెలిసినందున మహావీర్యుడైన ఏకలవ్యుడు నిషాదులచే పెంచబడెను. సంతసించిన కృష్ణుడు సంతానములేని గండూషునకు ఇద్దరు పుత్రులను ఇచ్చెను. వారు చారుదేష్ణుడు, సాంబుడును. వీరు అస్త్రముల ప్రయోగమును నేర్చినవారు ప్రశస్త లక్షణములు కలవారు. కనకునకు తంతిజుడు, తంతి మాలుడును స్వపుత్రులు. ప్రతాపవంతుడైన వసుదేవుడు అపుత్రకుడైన వస్తావనికి తంతిజ - తంతి మాలులను ఇచ్చెను. సౌతి వీరుడైన సుతుని శౌరిని కౌశికుని కూడ ఇచ్చెను. తప్పుడు, కోధనుడు, విరజుడు, శ్యామ - సృంజిములు కనకపుత్రులు. శ్యాముడు అనపత్యుడు అయ్యెను. శ్యామకుడు వనమునకు ఏగెను. భోజత్వమును ఏవగించుకొనుచు రాజర్షిత్వ మును పొందవలెను. నియతవ్రతముగా ఈ కృష్ణ జన్మమును పఠించువాడు బ్రాహ్మణునకు వినిపించినవాడును మహాసుఖమును పొందును.

పూర్వము దేవదేవుడును, మహాతేజస్వియు, ప్రజాపతియు అయిన నారాయణ ప్రభువు మనుష్యులలో విహరించుటకై కృష్ణుడుగా జన్మించెను. వసుదేవుని చేతతన తపస్సుతో దేవకియందు పుట్టినవాడు, కమలాక్షుడు విష్ణువు. నాలుగు బాహువులు కలవాడు, దివ్య రూపుడు, లక్ష్మితో కూడినవాడు. అతడు మానుష రూపమును పొంది భూమిలో యోగియై ప్రకాశించిన భగవంతుడైన కృష్ణుడు. అతడు అవ్యక్తుడు (సత్య స్వరూపము ప్రకాశింపని వాడు) వ్యక్తలింగుడు (ప్రకాశించిన లక్షణములు కలవాడు). ఆతడే భగవంతుడు, ప్రభువు. ఆతడు నారాయణుడు, ఆతని నుండి సర్వము పుట్టినది. అతడు నాశములేనివాడు. దేవుడై నారాయణుడై (మోక్షస్థానమై) సనాతనుడైన హరి అతడే. అతడు పూర్వము ఆదిపురుషుడు అయిన బ్రహ్మను సృజించెను. ఇపుడు ఈ యాదవ నందనుడైన కృష్ణుడు.

అదితికి పుత్రుడై, ఇంద్రునకు తమ్ముడై, దేవుడైన విష్ణువని ఖ్యాతి చెందెను. అతడు అదితికి పుత్రుడు అగుటకు కారణము దేవ శత్రువుడైన దైత్య, దానవ, రాక్షసుల వధకొఱకై అనుగ్రహించుటయే. యయాతి వంశమున పుట్టిన ధీమంతువైన వసుదేవుని కులము పుణ్యమయము. నారాయణ ప్రభువు ఆ కులమున జన్మకర్మ నందుట దానికి కారణము. అతడు యాదవ కులమున పుట్టగనే సాగరములు కంపించినవి. పర్వతములు చలించినవి. అగ్నిహోత్రములు ప్రజ్వలించినవి.

జనార్దనుడు (కృష్ణుడు) పుట్టినపుడు - అభిజిత్తను నక్షత్రము, జయంతి అనురాత్రి, విజయమను ముహూర్తము వర్తిల్లుచున్నవి. అవ్యక్తుడు, శాశ్వతుడు, హరి, నారాయణుడు, ప్రభువు అగు శ్రీకృష్ణభగవానుడు ప్రజలను మోహింప చేయుచు జన్మించెను. దేవేంద్రుడు ఆకాశమునుండి పుష్పవర్షమును కురిపించెను. వేలకొలది మహర్షులు గంధర్వులతో కూడి మంగళ వాక్యములతో స్తోత్రము చేయుచు శ్రీకృష్ణుని కడకు వచ్చిరి. వసుదేవుడు మాత్రము ఆ రాత్రియందు పుట్టిన విష్ణువును చూచెను. ఆకాశమున వ్యాపించిన దివ్యములైన మంచి లక్షణములతోను, శ్రీ వత్సచిహ్నముగల ఆ వాసుదేవుని చూచి ఓ ప్రభో! దివ్యమైన నీ స్వరూపమును ఉపసంహరింపుము. తండ్రీ! నేను కంసుని వల్ల భయము చెందినాను. నీకంటె జ్యేష్టులును, ఆశ్చర్యకరమైన రూపము కలవారును అయిన నా పుత్రులు ఆ కంసునిచే వధింపబడిరి. కావున నీ స్వరూపమును ఉపసంహరింపుమని ప్రార్థించుచున్నాను. అని అడిగెను. వసుదేవుని మాటవిని, ప్రభువు గూడ తన స్వరూపమును ఉపసంహరించెను. కృష్ణ భగవానునిచే అనుమతింపబడినవాడై, తండ్రి నందగోప గృహమునకు వెళ్ళెను. అచట ఉగ్రసేనుని అనుమతితో కృష్ణుని యశోదకు ఇచ్చెను. యశోదా దేవకులు ఇద్దరును సమాన కాలమున గర్భిణులు. నందగోప పతియైన, నందగోవుని పత్ని యశోద. విష్ణు కులప్రభువైన కృష్ణుడు ఏ రాత్రిలో పుట్టెనో! ఆ రాత్రియందే యశోద కూడ కన్యకను కనెను. మహాయశస్వియైన వసుదేవుడు పుట్టిన వానిని రక్షించుటకై ఆ పుత్రుని యశోదకు ఇచ్చెను. తాను ఆమె కన్యను గ్రహించెను. ఈ విధముగ పుత్రుని నందగోపునకు ఇచ్చి నన్ను రక్షింపుము అనెను. నందగోపుడు అపుడు వసుదేవునితో - నీ పుత్రుడు యాదవులకు సమస్త కల్యాణములను ఇచ్చువాడు అగును. ఈ దేవకీ గర్భము (కృష్ణుడు) మన కష్టములను నివారింపగలడు అనిచెప్పెను.

ఉగ్రసేనపుత్రి అయిన దేవకియందు వసుదేవునకు కన్య కలిగినదని చెప్పి శుభలక్షణయైన ఆ కన్యను కంసునకు నివేదించెను. కంసుడు తన చెల్లెలియందు కన్య జన్మించెనని నమ్మలేదు. తరువాత ఆ కన్యను గూడ ఆ దుష్టాత్ముడగు కంసుడు, సంతోషముతో పైకివిసిరి వదలివేసెను. వ్యర్థబుద్ధి కంసుడు కన్యగూడ చంపబడినది అని మరల మరల అనుచు జపించునంతలో ఆ కన్య వృష్టి (యాదవుల) ఇంట పూజితురాలై వృద్ధి చెందెను. దేవతలు పుత్రునివలె (కృష్ణుని) పరిపాలించుచున్నవారై, దైవవిధితో పుట్టిన ఆ కన్యను ప్రజాపతిగా చెప్పుదురు. విశ్వరక్షణకై జన్మించిన విష్ణువు యొక్క పదునొకండవ అవతారముగా ఆమెను దేవతలందరును యాదవులును పూజింతురు. దివ్యశరీరము కల దేవుడైన కృష్ణుడు ఈమెచే రక్షింపబడినాడు అని తెలుపగా...

ఋషులు ఇట్లు అనిరి:

“భోజవంశ రాజైన కంసుడు వసుదేవుని పుత్రులను బాలురునే ఎందులకు చంపెను. దానిని మాకు వివరింపవలెనని కోరుచున్నాము.”

సూతుడు ఇట్లు అనెను:

కంసుడు వ్యర్థమతియై వసుదేవుని పుత్రులను పుట్టినవారిని పుట్టినట్లే ఉన్న శిశువులను అందరిని ఎందులకు కుత్తుక పిసికి చంపెనో, అట్లే భయమువలన మహా బాహువైన కృష్ణుడు పుట్టగనే యశోదకడకు ఎట్లు చేర్చబడెనో, పురుషోత్తముడైన గోవిందుడు గోవులలో ఎట్లు పెరిగెనో - వినుడు. కంసుడుయువ రాజైనపుడు దేవకికిని ధీమంతుడైన వసుదేవునకును రథమెక్కించి సారథ్యము చేసెనని చెప్పెడివారు. అపుడు ఆకాశమున ఒకానొక దివ్యభూతము యొక్క వాణి వినబడెను. అది పుష్కలమై ఆకాశమయమై లోకసాక్షిణి అయినది. దానిచేత కంసుడు ఎల్లప్పుడు భయపడెను. పరకారణమున నీవు రథములో గొనిపోవు నీ చెల్లెలి యొక్క ఏడవ గర్భము నీకు మృత్యువు కాగలదు అని ఆ వాణి పలికెను. కంసుడు అపుడు ఆ దివ్యవాణిచేత బాధితుడై, మతిచెడినవాడై, కత్తిదీసి ఆ చెల్లెలిని చంప కోరెను. అంత మహాబాహువైన, ప్రతాపవంతుడు అయిన వసుదేవుడు సౌహార్దము తోను ప్రేమతోను ఉగ్రసేన పుత్రుడైన కంసునితో ఇట్లనెను. ఏ క్షత్రియుడైనను స్త్రీని ఎప్పుడు చంపడు. ఓ యాదవ నందనా! ఈ విషయమున నాకు ఒక ఉపాయము తోచినది. ఓ రాజా! ఈమె ఏడవ గర్భమున పుట్టినవానిని నేను నీకిత్తును. వానిని నీకు తోచిన క్రమమున చేయుము. ఓ భూరిదక్షిణుడా! (యజ్ఞములందు భూరిదక్షిణలు ఇచ్చిన వాడా!) ఈ మీ చెల్లెలి యొక్క అందరి పుత్రులను పుట్టగనే నీ వశము చేయుదును. ఇక నీవు ఇపుడు స్వేచ్ఛగా (భయము వీడి) వర్తింపుము. అని ఈ ఆకాశవాణి అసత్యము అగును అని ఈ విధముగా వసుదేవునిచే అనునయింపబడిన కంసుడు వసుదేవునకు దేవకియందు పుట్టిన తనయులను అందరినిగ్రహించెను. వసుదేవుడు ఆ భార్యను పొంది సంతుష్టుడయ్యెను. మతిచెడిన కంసుడు పాపకర్ముడై దేవకీ పుత్రులను అందరిని చంపెను.

ఋషులు:

విష్ణువును జనింపజేసిన ఈ వసుదేవుడు ఎవరు? ఈ యస్వినియైన దేవకీయు ఎవతె? ఈ నందగోపుడు అనువాడు ఎవడు? విష్ణువును పెంచి మహాయశ్వసిని అగు ఈ యశోద ఎవతె ? అని ప్రశ్నించిరి.

సూతుడు ఇట్లు అనెను:

కశ్యపునకు ఆదిత్యులైన (అదితి సంతానమైన) పురుషులును స్త్రీలును సంతానముగ ఉండిరి. ఆ తరువాత మహాబాహువు (విష్ణువు) దేవకియొక్క కామములను బాగుగా వర్ధిల్ల చేసెను. ఆ విష్ణుదేవుడు భూమి అంతయు తిరిగెను. యోగాత్ముడై యోగమాయచే సర్వభూతములను మోహింపచేయుచు, మనుష్య శరీరమున ప్రవేశించెను. అపుడు ధర్మము నశించెను. అపుడు ధర్మ సంస్థాపనమును అసురుల నాశమును, చేయుటకై స్వయముగ విష్ణువు వృష్టి కులమున జన్మించెను. ఈ కృష్ణునిచేత రుక్మిణి అను కన్య హరింపబడినది. నగ్న జితునిపుత్రి సత్య, సత్రాజిత్ ప్రుత్రి సత్యభామ, జాంబవతి, రోహిణి, శైబ్య, సుదేవి, మాద్రి, సుశీల, కాళింది, మిత్రవింద, లక్ష్మణ, జాలవాసిని వీరు మొదలుగా గలవారు, దేవతా స్త్రీలును, పదునాఱు వేలమంది ఇతర స్త్రీలను, కృష్ణుడు పెండ్లిచేసుకొనెను. స్వర్గమున పదునాలుగు గణములని చెప్పబడు అప్సరసలు విశిష్టులైనవారు. వీరు దేవతలతో చింతించి ఇంద్రునిచే ఇచటికి పంపబడిరి. వారు వాసుదేవుని భార్యలు అగుటకు రాజుల ఇండ్లలో పుట్టిరి. ఈ మహాభాగ్యవతులైన స్త్రీలు విష్వక్సేనుని (విష్ణువైన కృష్ణుని) భార్యలుగా ప్రసిద్ధి చెందిరి. ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుధేష్ణుడు, శరభుడు, చారువు, చారుభద్రుడు, భద్రచారువు, చారువింధ్యుడును చారుమతిఅను కన్యయు రుక్మిణి యందు పుట్టిన కృష్ణుని సంతానము. (ఇక సత్యభామా సంతానము) సానువు, భానువు, అక్షుడు, రోహితుడు, మంత్రులును, జరాంధకుడు, తామ్రవక్షుడు, భౌమరి, జరంధముడు, వారి నలుగురు చెల్లెండ్రును గరుడధ్వజ విష్ణువైన కృష్ణునకు పుట్టిరి. వారిలో భానువు, భౌమరికా, తామ్రపర్ణి, జరంధమ - వీరందరు సత్యభామా సంతానము. జాంబవతీ సంతానమును వినుడు. భద్రుడు, భద్రగుప్తుడు, సప్తబాహువని పేరుగలవాడును, భద్రావతి, సంబోధినియను కన్యలును - జాంబవతీ సంతానము. సంగ్రామజిత్తు, సహస్రజిత్తును, సుదేవికిని కృష్ణునికిని గలిగిన పుత్రులు. వృకుడు, వృకాశ్వుడు, వృకజిత్తు, వృజిని, సురాంగన, మిత్రబాహువు, సునీథుడును, నాగ్నజితికి గలిగిన కృష్ణుని సంతానము. ఈ విధముగ వేల పుత్రులు - అని తెలుసుకొనుడు. పదిలక్షలు వాసుదేవుని పుత్రులని చెప్పబడినది. రణవిశారదులు అయిన శూరులు పదునెనిమిది వేలు. ఇది జనార్ధనుని (శ్రీకృష్ణుని) వంశము.

మహాత్ముడైన శౌనేయునకు నర్తకులచే పైకి తీసికొనిరాబడినదియు, మంచి నీతిలో సంగతయైనదియు అయిన బృహతి అను కన్య కలిగినది. ఆమె పుత్రులు ప్రసిద్ధులు, సభలో సుందరులు, వారు, అంగదుడు, కుముదుడు, శ్వేతుడు, శ్వేతఅను కన్య, అవగాహుడు, చిత్రుడు, శూరుడు, చిత్రవరుడు, చిత్రవరుని సుతుడు చిత్రసేనుడు, కన్య చిత్రవతి. తుంబుడు, తుంబబాణుడు, జనస్తంబుని ఇరువురు పుత్రులు. ఉపాంగుని సుతులు ఇరువురు. వజ్రారుడు, క్షిపుడు. గవేషుని పుత్రులు ఇరువురు భూరీంద్ర సేనుడు, భూరియును. యుధిష్ఠిరుని యొక్క కన్య సుతనువని ప్రసిద్ధి గాంచినది. ఈ సుతనువునందు అశ్వసుతుడై వజ్రుడను మహాయశస్వి జన్మించెను. వజ్రునకు ప్రతి బాహువు, అతనికి సుచారువును పుత్రులు. కాశ్మసుపార్ముని కనెను. సాంబతరస్వినిని కనెను. మహాత్ములైన యాదవులకు మూడు కోట్లమంది పుత్రులు. అరువది లక్షలమంది వీర్యవంతులైన మహాబలులు. వీరందరుకూడ దేవాంశలు కలవారై ఇచట జన్మించిరి. వారు మహాతేజోవంతులు. మహాతపస్వులై దేవాసుర యుద్ధమున చంపబడినవారు ఇచట మనుష్యులలో పుట్టినవారై, సర్వమానవులను బాధింతురు. వారిని పెరికివేయుటకై దేవతలు యాదవకులమున పుట్టిరి. మహాత్ములైన యాదవుల యొక్క కులములు పదునొకండు కలవు. కాని అన్నియు ఒకే వైష్ణవ కులమున ఏకమై మెలగును. వారికి ప్రమాణమునగాని, ప్రభుత్వమునగాని, విష్ణువే (కృష్ణుడే) నిలచి ఉండును. అతని ఆదేశమున ఉండు వారిచేత అందరు మానవులును కట్టుబడి ఉందురు. ఇది వృష్ణుల వంశము సంగ్రహ విస్తారములతో చెప్పబడినది. దీనిని కీర్తించినందువల్ల అభీప్సిత సిద్ధి కలుగును. (34)