వాయు మహా పురాణము
మహాస్థానతీర్థవర్ణనము
దుస్తరమైన ఆ మాటను విని ఋషులు సూతునితో ఓ మహామతీ! పూర్వము వేదములు ఎట్లు విశాలములై వ్యాకులత నొందినవి? దానిని మాకు చెప్పుము అని అడిగిరి. సూతుడు వారితో స్వాయంభువ మన్వంతరమున ద్వాపరయుగము జరిగిపోగా బ్రహ్మ మనువుతో ఇట్లనెను. ఓ మహామతీ! దానిని చెప్పెదను. యుగము జరిగిపోగా, ఓయీ! యుగ దోషముచే చుట్టబడినవాడై వరుసగా ద్విజాతులు అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అందరు స్వల్పవీర్యులు అగుదురు. యుగవశమున, కృతయుగమునుండి నశించుచు పదివేల భాగమున కలి మిగిలినదై అల్పశిష్టముగా కనబడును. వీర్యము, తేజము, బలము, మాటయును సర్వమును నశించును. వేదముల నుండి వేదములు (అధ్యయనముతో) వచ్చునట్లుగా చేయవలయును. వేదవినాశనము కారాదు. వేదనాశము కలిగిన యజ్ఞము నాశమందును. యజ్ఞము నశింపగా దేవతల నాశము, దానివలన సర్వనాశము సంభవింపగలదు. మొదట వేదము చతుష్పాదము. లక్ష సంఖ్య గలది. మరల అది పదిరెట్లు అధికమైనది. మొత్తము యజ్ఞము సమస్త వాంఛలను తీర్చునది.
లోకహితమునందు ఆసక్తి గల మనుప్రభువు ఈ విధముగా అడుగబడి, అట్లే చెప్పెదనని నాలుగు పాదములు గల ఒకే వేదమును నాలుగు విధములుగా విభజించెను. ఓయీ! బ్రహ్మ అజ్ఞవలన లోకహితమును కోరి ప్రస్తుత కాలముతో మీకు వేదకల్పనము చెప్పెదను. ఓ సత్తములారా! (ఓ మిక్కిలి జ్ఞానులారా!) ప్రత్యక్షముగ గాని, పరోక్షముగ గాని దానిని వినుడు. ఈ యుగమున పరమతపస్వియైన పరాశర పుత్రుడు వ్యాసుడు. అతడు ద్వైపాయనుడని ప్రసిద్ధి చెందినవాడు. విష్ణువు యొక్క అంశము. బ్రహ్మచే ప్రేరేపింపబడినవాడై ఆతడు ఈ యుగమున వేదమును విభజించుటకు పూనుకొనెను. తరువాత అతడు వేదకారణమున నలుగురును శిష్యులను గ్రహించెను. వారు జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు నాల్గవవాడు పైలుడు, ఐదవవాడు లోమహర్షణుడును. ఋగ్వేద శ్రావకునిగా ద్విజుడైన పైలుని స్వీకరించెను. యజుర్వేద ప్రవక్తగా వైశంపాయనుని స్వీకరించెను. సామవేదార్థ శ్రావకునిగా జైమినిని స్వీకరించెను. అట్లే అథర్వవేద శ్రావకునిగా ఋషిసత్తముడైన సుమంతుని స్వీకరించెను. భగవంతుడై ఈశ్వరుడైన ప్రభువైన ఆ పారాశర్యవ్యాసుడు ఇతిహాస పురాణములకు చక్కని వక్తనుగా నన్ను (సూతుని) స్వీకరించెను. యజుర్వేదము ఒక్కటే ఉండును. దానిని (వ్యాసుడు) నాలుగు విధములుగా విభజించెను. దానియందు చతుర్హోత్రము పుట్టెను. దానితో యజ్ఞమును కల్పించెను. యజుస్సులతో ఆధ్వర్యమును, ఋక్కులతో హోత్రమును, సామములతో ఉద్గాత్రమును, అధర్వములతో బ్రహ్మత్వమును చేసెను. యజ్ఞమున అధర్వణ వేదముతో బ్రహ్మత్వమును చేసెను. దాని నుండి ఋక్కును ఉద్ధరించి ఋగ్వేదమును కల్పించెను. దానిచేత యజ్ఞవాహమై జగద్ధితమైన హోతృకము కల్పింపబడును. సామములతో సామవేదమును, దానితో ఉద్గాత్రమును ప్రకాశింపజేసెను. అధర్వణ వేదముతో రాజుయొక్క అన్ని కార్యములను చేయించెను. పురాణార్థ విశారదు (పండితు)డు ఆఖ్యానములతోను, ఉపాఖ్యానములతోను, గాథలచేతను, కులకర్మల చేతను పురాణసంహితలను చేసెను. యజుర్వేదమున మిగిలిన దానితో యజ్ఞమును కూర్చెను. ఆ విధముగా యజుర్వేదమున యజ్ఞమును కూర్చుచున్నవాడు అయ్యెనని శాస్త్ర నిర్ణయము.
పదములు ఎత్తి తీసికొనుట వలన యజుస్సులు విషయములు. ఆ కారణముచేత వేదసారమును తెలిసిన ఋత్విక్కులచేత అతడు ఉద్ధృతవీర్యుడు అయ్యెను. అతనిచేత అశ్వమేధయాగము ప్రయోగింపబడెను. దానిచే అతడు యోగ్యుడు అయ్యెను. పైలుడు ఋక్కులను గ్రహించి మరల వానిని రెండు విధములుగ విభజించెను. ఆ ప్రభువైన పైలుడు ఆ విధముగా రెండుగాచేసి సంయుగమున (పోరున) ఇద్దరు శిష్యులకు ఇచ్చెను. ఒకదానిని ఇంద్రప్రమతికి, రెండవ దానిని బాష్కలునకును ఇచ్చెను. బ్రాహ్మణ విద్వాంస శ్రేష్ఠుడైన బాష్కలి ఋగ్వేదమును నాలుగు సంహితలుగా జేసి వానిని సేవా పరాయణులై హితులు అయిన శిష్యులకు నేర్పించెను. బోధుని ప్రథమశాఖను, అగ్నిమాఠరునికి ద్వితీయశాఖను, పారాశరునికి తృతీయశాఖను, యాజ్ఞవల్క్యునికి నాలుగవ శాఖను చదివించెను. బ్రాహ్మణ పండితోత్తముడైన ఇంద్రప్రమతి మహాభాగ్యుడై, కీర్తి మంతుడైన మార్కండేయుని, ఒక సంహితను చదివించెను. మహాయశస్వియైన ఇంద్రప్రమతి తన జ్యేష్ఠపుత్రుడైన సత్యశ్రవసుని చేత చదివించెను. ద్విజుడైన సత్య శ్రవసుడు మరల సత్యహితుని చదివించెను. విభువైన సత్యహితుడు తన పుత్రుడైన సత్యతరుని చదివించెను. ఈ సత్యతరుడు చేత సత్యశ్రీ కలవాడు, మహాత్ముడు సత్యధర్మ పరాయణుడును. ఆ సత్యతరునకు మహాతేజస్వులైన ముగ్గురు శిష్యులు గలరు. వారు సత్యమైన సిరిగలవారు, విద్వాంసులు, శాస్త్ర గ్రహణమున తత్పరులును వారిలో శాకల్యుడు మొదటి వాడు. మరొకడు రథంతరుడు, తరువాతివాడు బాష్కలి. ఆ తరువాతివాడు భరద్వాజులు అను వీరు శాఖా ప్రవర్తకులు. దేవమిత్రుడైన శాకల్యుడు జ్ఞానము, అహంకారముచే గర్వితుడు. ఆ బ్రాహ్మణుడు జనకుని యజ్ఞమున వినాశమును పొందెను.
శాంశపాయనుడు అనెను:
జ్ఞానగర్వితుడైన ఆ ముని ఎట్లు వినాశ మందెను? జనకుని యొక్క అశ్వమేధముతో వాదము ఎట్లు జరిగెను. వాదము ఎందులకు జరిగెను? ఎవరితో జరిగెను? ఇది అంతయు ఉన్నది ఉన్నట్లు నీకు తెలిసినది పూర్తిగా చెప్పుము. ఋషుల ఈ మాటను వినిన తరువాత దానికి సమాధానముగా సూతుడు ఇట్లు చెప్పెను.
జనకుని యొక్క అశ్వమేధ యాగమున గొప్ప పండిత సమావేశము జరిగెను. అచట అనేక విధములుగా వేలకొలది ఋషులు రాజర్షియైన జనకుని యజ్ఞమును చూడగోరి వచ్చిరి. వీరిలో బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఎవడు? ఈ విషయమున నిశ్చయము ఎట్లు కలుగును? అని అనుకొని జనకమహారాజు మనసులో ఆలోచించెను. తరువాత వేయిగోవులను అధికమైన బంగారమును, రత్నములను, దాసులను, గ్రామములను (వాని దానపత్రములను) తెప్పించి ఆములతో జనకుడు ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణోత్తములారా! సభలో శ్రేష్ఠభాగులైన మీ అందరికిని శిరస్సుతో ప్రణమిల్లుచున్నాను. మీలో మిక్కిలి శ్రేష్ఠుడైనవానికై ఈ ధనము అంతయు విద్యాధనముగా ఇవ్వబడును అని అనెను. ఆ వేదార్హులైన మునులు జనకుని మాటనువిని, మహాసారమైన ధనమును చూచి, ధనాతిశయ కారణమున దానిని పొందదలచినవారై, వేదజ్ఞానమదముచే పొంగినవారై, పరస్పరముగా ఆ ధనమును పొందుటకై శ్రద్ధ వహించిరి. మనస్సుతో ఆ ధనమును పొంది - ఈ ధనము నాదియనియు, మరొకడు ఈ ధనము నాదేనా కాదా? అనియు ఎందులకు సంశయించుచున్నారో చెప్పుము. (నాదే అనుట నిశ్చయము) అనియు ధన దోషముతో అనేక విధములుగా వాదములు చేసిరి. అట్లే అచట విద్వాంసుడు, బ్రహ్మ వాహుని (వేదములను పూర్తిగా చదివినవాని) పుత్రుడును, కవియు మహాతేజస్వియై బ్రహ్మ వేత్తలలో అత్యుత్తముడైన బ్రహ్మయొక్క అంగమునుండి పుట్టి బ్రహ్మవేత్తలలో శ్రేష్టుడైన యాజ్ఞ వల్క్యుడు శిష్యునితో సుస్వరముగా ఇట్లు పలికెను. ఓయి ఈ ధనము అంతయు తీసికొని వెళ్ళుము. ఈ ధనము నాదే, సంశయము లేదు. అన్ని వేదములలో నేను వక్తను. నాతో సముడు మరొకడు ఎవ్వడు లేడు. దీనికి ఇష్టపడని బ్రాహ్మణుడు వెంటనే ఆలసింపక నన్ను వాదమునకు పిలుచుగాక” అనెను. అంత బ్రహ్మసముద్రము బ్రాహ్మణ మునులను (సముద్రము) మహా ప్రళయములోవలె అల్లకల్లోల మయ్యెను. యాజ్ఞవల్క్యుడు నవ్వుచున్నవాని వలె ఆ మునులతో ఇట్లనెను. ఓ విద్వాంసులారా! కోపింపకుడు. మీరు సత్యవాదులు. యుక్తాయుక్తమును తెలుసుకొనదలచుకున్న వారమై పరస్పరము వాదించు కొందము. అంత వారెదురుకు చేరిరి. సూక్ష్మదర్శనమువలన కలిగిన శుభార్థములతో వారి వాదములు అనేక విధముల నడచినవి. లోకమునను, వేదమునను, ఆధ్యాత్మమునను విద్యా స్థానములతో అలంకరింపబడినవియు, శపింపగల ఉత్తమగుణములతో కూడి నవియు, రాజసమూహములకు దూరమైనవియునైన ఆ మహాత్ముల వాదములు ధనకారణముగా అచట జరిగినవి. ఋషులు అందఱు ఒకవైపును యాజ్ఞవల్క్యుడు ఒక వైపును అయిరి. ధీశాలియైన బ్రహ్మరాశియు (జ్ఞానరాశియు) మహాతేజస్వియైన యాజ్ఞవల్క్యుడు ఆ మునులందరిని జయించి వెంటనే వాదము చేయనున్న శాకల్యునితో ఇట్లు అనెను. “ఓ శాకల్య! చెప్పదలచిన దానిని చెప్పుము. చింతించుచు ఎందులకు ఊరకున్నావు? గాలి ఊదిన తిత్తివలె స్తబ్ధమైన అభిమానముతో నిండినవాడవు” ఈ విధముగ యాజ్ఞవల్క్యునితో తిరస్కరింపబడినవాడైన, శాకల్యుడు కోపమువలన ఎఱ్ఱని మోము, కన్నులు కలవాడై మునుల సన్నిధిలో పురుషుడైన ఆ యాజ్ఞవల్క్యునితో ఇట్లనెను. ఓ యాజ్ఞవల్క్యా నీవు మమ్ములను గడ్డిపోచగా వదిలి ఈ మునులను గూడ అట్లే వదిలి మహాసారమైన విద్యాధనమును నీ అంతట నీవే గ్రహింప తలచితివి అని అడిగెను. శాకల్యుడు ఈ విధముగా అడుగగా వారితో యాజ్ఞవల్క్యుడు “బ్రహ్మిష్ఠు (జ్ఞాననిష్ఠు)ల యొక్క బలము విద్య యొక్క తత్త్వార్థదర్శనము అని తెలియుము. కామము అర్థముతో సంబద్ధమైనది. కావున అర్థమును (ధనమును) కోరుకొనుచున్నాము. కామప్రశ్నయే ధనముగా గలవారు బ్రాహ్మణులు కావున కామ ప్రశ్నలనే చెప్పుచున్నాము. ఈ రాజర్షి యొక్క పందెముకూడ ఇదియే. కావుననే నాచే ధనము తీసికొనిపోబడినది అని పల్కెను. యాజ్ఞవల్క్యుని ఈ మాటను విని కోపముతో యాజ్ఞవల్క్యునితో ఇపుడు నాచే ఉద్దేశింపబడిన కామ ప్రశ్నలను యథార్థముగా చెప్పుము అని కామ ప్రశ్నార్థముగల వాక్కులను పలికెను. తరువాత బ్రహ్మవేత్తలైన వారిరువురికి గొప్పవాదము జరిగెను. శాకల్యుడు యాజ్ఞవల్క్యుని తీక్ష్ణమైన వేయి ప్రశ్నలను అడిగెను. అపుడు ఋషులు వినుచుండగా అన్ని ప్రశ్నలకు సమాధానము చెప్పెను. శాకల్యుడు వాద ప్రశ్నలు లేనివాడు కాగా యాజ్ఞవల్కుడు అతనిని ఓ శాకల్యా నీవు నాయొక్క కామికమైన ప్రశ్నకు సమాధానము చెప్పుమనెను. ఈ వాదమునకు పందెము ప్రశ్నకు సమాధానము చెప్పనివాడు మరణము నొందవలెను. తరువాత ధీశాలియైన యాజ్ఞవల్క్యునిచే ప్రశ్న అడుగబడినది. శాకల్యుడు దానికి సమాధానము తెలియక వెంటనే మరణము నొందెను. ఈ విధముగ ప్రశ్న వ్యాఖ్యానముచే పీడింపబడిన వాడై శాకల్యుడు మరణించెను. ఋషులకును, యాజ్ఞ వల్క్యునకు ధనార్థులైన మునులతో గొప్పవాదము జరిగెను. ఓ మునీ! అందరిచేత అడుగబడిన నూర్లకొలది, వేలకొలది ప్రశ్నలను వానిసారమును మహాజ్ఞానియు ఇంద్రియాదులను వశమందుంచుకొన్న వాడునై యాజ్ఞవల్క్యుడు వ్యాఖ్యానించి, ధనమును తీసికొని, కీర్తిని వ్యాపింపజేసి స్వస్తుడై శిష్యునితో కూడుకొని గృహమునకు వెళ్ళెను.
దేవమిత్రుడైన శాకల్యుడు మహాత్ముడు. బ్రాహ్మణ పండితోత్తముడు, పదవేత్తలలో ఉత్తముడైన ఆ బుద్ధిమంతుడు, ఐదు సంహితలను చేసెను. ఆతనికి ఐదుగురు శిష్యులు ఉండిరి. ముద్గలుడు, గోలకుడు, ఖాతీయుడు, మత్స్యుడు ఐదవవాడు శైశిరేయుడు, శాకపూర్ణరథీతరుడు మూడు సంహితలను చెప్పెను. బ్రాహ్మణ పండితోత్తముడైన నిరుక్తుడు నాల్గవ సంహితను చెప్పెను. అతని శిష్యులు నలుగురు కేతవుడు, దాలకి, ధర్మశర్మ, దేవశర్మ వీరందరును వ్రతమును ధరించిన ద్విజులు. శాకల్యుడు మరణింపగనే వారందరు బ్రహ్మహత్యజేసినవారైరి. అపుడు మిక్కిలి చింతను పొంది వారందరు బ్రహ్మ సమీపమునకు వెళ్ళిరి. బ్రహ్మ మనస్సుతోనే వారిని దెలిసికొని పవన పురమునకు పంపెను. మీరు వెంటనే పవనపురమునకు పొండు మీ పాపము వెంటనే నశించును అనెను. అచట ద్వాదశార్కునకు, వాలుకేశ్వరునకు నమస్కరించి పదకొండు మంది రుద్రులను, విశేషించి వాయుపుత్రునికి గూడ నమస్కరించియు నాలుగు కుండములలో స్నానము చేసి బ్రహ్మహత్య నుండి తరించుడు అనెను. అంత అందరును మిక్కిలి వేగము గలవారై అ పవనపురమునకు వచ్చిరి. చెప్పినట్లు విధివిధానముగా స్నానము ఆచరించిరి. చేయబడినది. దేవతలదర్శనము కూడ చేయబడినది. ఉత్తరేశ్వరునకు నమస్కరించి బ్రాహ్మణుల అనుగ్రహమున వారు అందరును పాపముక్తులై సూర్యమండలము చేరిరి. అది మొదలు ఆ తీర్థము పాతకనాశన తీర్థమయినది. పూర్వము వాయువుచే నిర్మింపబడినదిగాన పవిత్రమైన వాయువు యొక్క పురము, అంజనాదేవి గర్భమున పుట్టిన హనుమంతుడైన పవనపుత్రుడు, సత్యపరాక్రముడునులయిన మహాదేవ హనుమంతుడు పుట్టినపుడు బ్రహ్మ నుండి పుట్టిన వాయువుచే ఆ తీర్థము ఇట్లు నిర్మింపబడినది. భూమిలో జనించిన శూద్రులు, బ్రాహ్మణులకు నివేదింపబడిరి. వృత్తి కొరకును బ్రహ్మయజ్ఞము కొఱకును వారిలో గొప్ప పన్ను విధింపబడినది. ఈ విధానముతో విప్రుల యొక్క బ్రాహ్మణుల శాసనము పెద్దది అయ్యెను. గోవును చంపినవాడుగాని, చేసిన మేలు మరచినవాడుగాని, సురాపానము చేసినవాడుగాని, గురుభార్యను పొందినవాడుగాని,వాడు ఆదిత్యునికి నమస్కరించి సర్వపాముల నుండి విముక్తుడు అగుచున్నాడు.