కార్తవీర్యార్జునోత్పత్తి వివరణము

సూర్యుడు ఇట్లు అనెను:

శ్రేష్ఠుడు, ఉత్తమ తేజస్కుడు అయిన యదువు యొక్క వంశమును ఆనుపూర్వితో విస్తరముగ చెప్పెదను వినుడు. యదుపుత్రులు ఐదుగురు దేవ పుత్రులతో సమానులు. సహస్రజిత్తు, కోష్టువు, నీలుడు, జితుడు, లఘువు అనువారు. సహస్రజిత్తు పుత్రుడు శ్రీమంతుడైన శతజిత్తను రాజు. శతజిత్తుయొక్క పుత్రులు విఖ్యాతులైన మువ్వురు పరమ ధార్మికులు. హైహయుడు, హయుడు, రాజైన వేణుహయుడు అనువారు. హైహయుని పుత్రుడు ధర్మతత్త్వుడని వినికిడి. ఆతనికి ధర్మతంత్రుడు, కీర్తి, సంజ్ఞేయుడు అను వారు పుత్రులు. సంజ్ఞేయుని పుత్రుడు మహిష్మంతుడు అను రాజు. మహిష్మంతుని పుత్రుడు ప్రతాపవంతుడైన భద్రశ్రేణ్యుడు. ఈతడు వారాణసికి అధిపతియైన రాజని ముందే చెప్పబడినది. భద్రశ్రేణ్యుని పుత్రుడు దుర్మదుడు అను రాజు. దుర్మదుని పుత్రుడు బుద్ధి శాలియై కనకుడని ప్రసిద్ధి చెందినవాడు. కనకుని పుత్రులు నలుగురు లోకప్రసిద్ధులు. కృతవీర్యుడు, కార్తవీర్యుడు, కృతవర్మ, కృతుడు, జాతుడు అనువారు. కృతవీర్యుని నుండి వేయి బాహు వులతో సప్త దీపాధిపతియైన రాజు (కార్తవీర్యార్జునుడు) పుట్టెను, అతడు మిక్కిలి దుశ్చరమైన (ఆచరింపనలవిగాని) తపమును పదివేలయేండ్లు చేసి అత్రి కుమారుడు అయిన దత్తాత్రే యుని ఆరాధించెను. ఆ దత్తాత్రేయుడు కార్తవీర్యునకు మహా తేజోవంతములైన నాలుగు వరములు ఇచ్చెను. కార్తవీర్యుడు, ముందు, మొదటి వరముగా వేయి బాహువులను కోరెను. అధర్మమున ఈయబడు దానికి సజ్జనులతో నివారణము, ధర్మముతో భూమిని జయించి ధర్మముతోనే దాని పరిపాలనము. వేలకొలది శత్రువుల వధించి బహు యుద్ధములలో జయించుట రణమున యుద్ధము చేయుచున్నపుడు తనకంటె అధికజాతివానిచే తన వధ జరుగుట. ఆ కార్తవీర్యునిచే సద్వీపయై, సపట్టణయై, సప్త సముద్రములు చుట్టుగా ఉన్నదైన ఈ సమస్త భూమియు, అందలి జనులును క్షాత్ర విధానముతో పరిపాలింపబడినది. కార్తవీర్యుడు యుద్ధము చేయుచున్నపుడు అతనికి వేయిబాహువులు, యుద్ధ ధ్వజము, రథము మాయచే ప్రాదుర్భవించును. ఆ ధీశాలి చేత ఆ సప్త ద్వీపములలో పదివేల యజ్ఞములు నిరర్గళముగా జరుపబడినవని వినబడినది. ఆ మహాబాహువు యొక్క సమస్త యజ్ఞములు భూరి తేజస్సుగలవై ప్రకాశించినవి. అవి అన్నియు బంగారు వేదులు బంగారు యూప స్తంభములు కలవి. అవి మహాభాగులైన దేవతలచే విమానముల నుండిదిగి అలంకరింపబడినవి. గంధర్వాప్స రసలచే ప్రకాశించినవి. ఇది అతని యజ్ఞముల వైభవము. గంధర్వుడును నారదుడును ఆ రాజర్షియొక్క చరితమును మహిమను సాక్షాత్తుగా చూచి గాథలుగా గానముచేసిరి. యజ్ఞ, దాన, తపములలోను, పరాక్రమమునను, పాండిత్యమునను మానవులు నిశ్చయముగా కార్తవీర్యుని మార్గమున పోలేరు. సప్తద్వీపములలో అతడే ఖడ్గధారి, శ్రేష్ఠ బాణధనుర్ధారి, రథి, అతడితో సమానమైన రాజు వేరొండులేడు. ఉన్నను అతడు కార్తవీర్యుని అనుచరుడుగనే కనబడును, ఎదురు నిలుచువాడుగా కాదు. ప్రజలను ధర్మముతో రక్షించుచున్న కార్తవీర్య మహారాజ ప్రభావ ముతో ప్రతివాడును నశింపని ద్రవ్యములు కలవాడుగనే ఉండెను. శోకము లేదు. అశ్చర్య భ్రమలు లేవు. ఆ రాజు ఎనుబదియైదు వేలయేండ్లు రాజుగా ఉండి తొమ్మిది పర్యాయములు సమ్రాట్టై చక్రవర్తి అయ్యెను. అతడే పశుపాలుడై, క్షేత్రపాలుడై పర్జన్యుడై వర్షించి, యోగి అగుటచే అర్జునుడు అయ్యెను. అతడు అల్లెత్రాటి దెబ్బలచే కరుడు బారిన వేయి బాహు వులచే, వేయికిరణములచే ప్రకాశించు శరత్కాల సూర్యునివలె ప్రకాశించును. ఆ రాజు వేయి ఏనుగులతో మాహిష్మతి పురియందు కర్కోటకుని సభను జయించి ప్రవేశించినవాడు. కార్తవీర్యార్జునుడు వర్షాకాల మేఘమువలె నల్లనైన కన్నులు గలవాడు. సముద్రము యొక్క అలల వేగమున క్రీడించెను. ఆ క్రీడాసుఖమున ఉద్వేగము పొందెను. దాని వలన అతని వేయి బాహువులు వేగముగా అన్ని వైపులు కదలుటచే సముద్రపు నీరు ఎగజిమ్మి పడుటచే అచట వర్షాకాలము అయ్యెను. ఈ విధముగ వర్షాకాల సముద్రమీనము వలె కన్నులున్నవాడు సుభోద్విగ్నుడై ఆడుచున్న వానివలెనే వర్షాకాలము చేసెను. ఒకమారు నర్మదానది కార్తవీర్యుడు క్రీడించుటచే దొరలినది. అతని బంగారు హారముల మాలలు కలదైనది. తన అలలు అనెడు బొమ్మముడి గలదై చక్కని నాదముకలదై శంకించి ధారలు కలదైనను అలలచేతనే మరలివచ్చినది. పూర్వము ఆనర్మదను అనుసరించుచు కార్తవీర్యుడు మహా సముద్రమును ప్రవేశించెను. అది తెలిసి వెంటనే తన వేయి చేతులతో పైకి లేచెను. దానితో సముద్రమును అలలతో చెలియల కట్టను తగులునట్లు చేసెను. దానివల్ల లేచిన తుంపరలు సముద్ర జలమును, తీరమునందుగల వనమును ఆవరించెను. కార్తవీర్యుని వేయి బాహువులచే ఆ సముద్రము మథింపబడినట్లు అయ్యెను. అపుడు పాతాళమున ఉన్న మహాసురులు నిశ్చేష్టులై దాగియుండిరి. మహాతరంగములు అన్నియు చూర్ణములైనవి. వానిలో మీనములు లీనమైనవి. వీనితో గూడిన తరంగజలములు సుడులుపడి దుస్సహమైన నురుగు సమూహమున పడినవి. దేవాసురులు క్షీరసాగరమును మందరముతో మధించినట్లు కార్తవీర్యార్జున మహారాజు తన వేయి బాహువులచే మథించి వైచెను. మందర పర్వత మథనమున కలిగిన అమృత జలములని శంకించి వెంటనే బయలుదేరి వచ్చినవారు ఆ భయంకరుడైన కార్తవీర్యార్జున రాజోత్తముని చూచి భయపడిరి. సాయంకాలమున వాయువు లేమి నిశ్చలములుగా ఉన్న అరటిచెట్ల గుంపువలె మహాసర్పములు అన్నియు తలలు వంచి నిశ్చలముగా నిలిచి ఉండెను. మహా ప్రౌఢుడైన అతడు (కార్తవీర్యుడు) ఐదు బాణములతో లంకలో రావణుని ససైన్యముగా మూర్ఛిల్లచేసి జయించెను. బలముతో బంధించెను. ధనువులు బెట్టు రథమున బంధించి తీసికొని వచ్చి మాహిష్మతి పురమున బంధించెను. తరువాత పులస్త్యుడు వెళ్లి కార్తవీర్యార్జునుని శాంతింపజేసి అనుగ్రహించునట్లు చేసెను. అపుడు కార్తవీర్యరాజు పులస్త్యునిచే అనుపాలితుడైన పౌలస్త్యుని (రావణుని) బంధము నుండి వదిలివేసెను. వేయిబాహువులు కల అతని వింటినారి ధ్వని ప్రళయాంతమున పిడుగువలన చీల్చబడిన అంబుద ధ్వనివలె ఉండెను. ఆశ్చర్యము. అట్టి కార్త వీర్యార్జునుని బాహువుల వేయింటిని బంగారు తాడిచెట్ల వనమును ఖండించునట్లు భార్గ వుడు (పరశురాముడు) ఖండించెను. రణమునందలి ఆతని మహావీర్యమును ఏమని పొగడవలెను? ఒకనాడు అగ్నిదేవుడు కార్తవీర్యార్జునుని భిక్షము అడిగెను. ఆ రాజు ఆత నికి సప్తద్వీపములు గల పృథివిని భిక్షగా నిచ్చెను. అగ్ని అతని బాణములను దహింపదలచి నగరములను, గొల్లపల్లెలను, గ్రామములను, పత్తనములను అంతట దహించివైచెను. ఆ పురుషేంద్రుడైన కార్తవీర్యుని ప్రభావముచే మహాయశస్వియైన అగ్ని కార్తవీర్యుని యొక్క శైలములను వనములను దహించెను. ఆ అగ్ని వరుణుని ఆత్మజునియొక్క (వశిష్ఠునియొక్క) శూన్యమైన ఆశ్రమము నంతటిని, వన ద్వీపములను హైహయునితో కూడినవాడై దహించెను. పూర్వము వరుణుడు ప్రకాశవంతుడై ఉత్తముడైన పుత్రుని పొందెను. ఆతడు వశిష్ఠుడు అను మునిని ఆప్తుడని ప్రసిద్ధుడు. శ్రితుడని వినబడెను. అచట విభువైన ఆప దుడు (ఆపవుడు వశిష్ఠుడు) కోపముతో కార్తవీర్యార్జునుని శపించెను. “ఓ హైహయ! కార్తవీర్య! అగ్నికి దానమిచ్చునపుడు ఈ నా వనమును వదలలేదు. కావున దుష్కర్మ నీచే చేయబడినది. నిన్ను అన్యుడు క్షత్రియేతరుడైన అధికుడు బ్రాహ్మణుడు చంపగలడు. కుంతీ పుత్రుడైన అర్జునుడు అను వాడును రాజుగాడు. ఓ కార్తవీర్యార్జున! ఖడ్గప్రహారము చేయువారిలో శ్రేష్ఠుడై మహావీర్యుడు అయిన పరశురాముడు బలవంతుడై వేగముగా నీ బాహువులు వేయింటిని ఖండించును. తపస్వియై, బ్రాహ్మణుడైన పరశురాముడు మహా బలుడై కార్తవీర్యా! నిన్ను చంపును” అని పల్కెను, ఈ విధముగా ధీమంతుడైన వశిష్టుని శాపమున పరశురాముడు కార్తవీర్యునకు మృత్యువు అయ్యెను. ఆ కార్తవీర్యరాజుచేతనే పూర్వము స్వయముగా ఈ వరము కోరుకొనబడినది. కార్తవీర్యునకు నూరుగురు పుత్రు లుండిరి. వారిలో ఐదుగురు మహారథులు. అస్త్రములు కలవారు, బలవంతులు, శూరులు, ధర్మాత్ములు, యశోవంతులు. వారు-శూరుడు, శూరసేనుడు, వృష్ట్యాద్యుడు, వృషుడు, జయధ్వజుడు అనువారు కార్తవీర్యునకు అవంతి దేశములో పుత్రులు. జయధ్వజుని పుత్రుడు ప్రతాపవంతుడైన తాలజంఘుడు. ఆతనికి నూరుగురు పుత్రులు వారు తాల జంఘులని పిలువబడిరి. మహాత్ములై, హైహయులైన వారిలో ఐదుగణములు ప్రసిద్ధము లైనవి. లెక్కలేనంత మంది వీరహోత్రులు. అట్లే భోజులు, ఆవర్తయులు, తుండికేరులు, విక్రాం తులు, తాలజంఘులు అనువారు. వీరహోత్రసుతుడు అనంతుడు అను రాజు. అతని పుత్రుడు దుర్జయుడు.వాడు శత్రువులను చూడని వాడు. అతని ద్రవ్యములు నష్టములు కానివిగా ఉండెను. ఆ మహారాజు తన ప్రభావముతో ప్రజలను పరిపాలించెను. అతనికి ధననాశము లేదు. నశించినదానిని అతడు మరల పొందును. ధీమంతుడైన కార్తవీర్యుని జన్మ వృత్తాం తమును ఈ లోకమున చెప్పినవాడు భూలోకముననే విత్తవంతుడు అగును. ఆతని ధర్మము వర్ధిల్లును. త్వష్టవలెను బ్రహ్మవలెను స్వర్గమున పూజింపబడును.