భువన విన్యాసము - 4

సూతుడు అనెను:

అటు తఱువాత ఏ ఏ పర్వతమునందు వివిధములైన ఏ ఏ దేవతలయొక్క ఏ ఏ గృహరాజములు చక్కగా నెలకొన్నవో చెప్పుదును వినుడు. అందులో ఈమహాశైలము ప్రాణులకు శీతలమే మరణమైనట్టి విస్తారములుగలదై, చిధాత్రములైన అనేక శత ధాతువులచే చిత్రమై, అనేక సముద్రములకు నిధానమై, అనేక ప్రాణులకును గుణములకును నెలవైనదై, గొప్పదైన మణులచే, చిత్రములైన బంగారు, వెదురు వృక్షములతో అలంకరింపబడినదై ఉండును. ఆ పర్వతము యొక్క నితంబములు (కొండనడిమి ప్రదేశములు) తుమ్మెదల ఝంకారముల శబ్దము నాదమువలె వినబడుచుండును. పగడపు రంగు ధాతువుల చేతను, బంగారు ధాతువులచేతను చిత్రవర్ణములు గలవి, తటములు మదించిన తుమ్మెదలధ్వనిగల పూవులతో వ్యాపించినవి, వ్రేలాడు తీగలు గలవి, చిత్రములచే చిత్రములైనవి. వందలకొలది ధాతువులచే పూజింపబడినవి, పూవులతో ఒప్పి రత్నచరి యలచే అలంకరింపబడినవి, నిర్మలమై తీయనైన పానీయములైన నీరుగల అనేకములైన కాలువలతో కూడినది, అనేకములైన పూపొదలతో అలంకరింపబడినవి, పూలతెప్పలను వహింపజేయు నదులచే అలంకరింపబడినవి. అంతటా కిన్నరులు తిరుగుగుహలు కలదిగా ఉండును. దాని గుహాగర్భములు యక్షులు గంధర్వులు తిరుగాడు నవి. సుఖముగా సేవింపదగిన చిత్రములైన, లోతైన గుహలచే శోభితమైనది. అనేక ప్రాణిగణములు (ప్రక్ష్యాదులు) వ్యాపించి సుఖాశ్రయములై మంచి పానీయములు గలది. అనేక పుష్ప ఫలములతో గూడిన వృక్షములతో అలంకరింపబడినది.

ఆ పర్వతము అనేక గర్భములుగల గుహలు కలిగి ఆ గుహను ఆశ్రయించి ఉన్న వారితో నిండిన ఆ పర్వతమునందు మహేంద్రుని క్రీడావనము కలదు. అది అన్ని కోరికలకు తగిన గుణములతో కూడినది. అచట దేవరాజైన ఇంద్రునియొక్క పారిజాత వనములను మహావనము గలదు. అది వేద ప్రామాణ్యమున ముల్లోకములలో ప్రకాశమైనదిగా కీర్తింపబడును. లేత సూర్యునితో సమానమైన యెఱ్ఱనై మహాగంధము గలిగి మనోహరములైన పూవులతో నా పర్వతశ్రేష్ఠము చక్కగా అంతట ప్రకాశించును. మహేంద్ర వనము నుండి బయలుదేరిన పారిజాతపుష్పముల గంధమును వాయువు పూర్తి నూరు యోజనముల వరకు గొనిపోయి వ్యాపింపజేయును. అచటి దిగుడు బావులు కమలములతో అలంకరింపబడినవి. ఆ కమలములు సువర్ణములు వైడూర్య నాళములు గలవి. వజ్రపు కింజల్కములుగలవి. సమస్తము సుగంధముతో కూడినవి. మదించిన తుమ్మెదల ఝంకా రములు గలవి. విశాల కోశములుగలిగి బాగా వికసించినవి. ఇట్టి మనోహరములైన కమలములుగలవి. ఆ బావులలో నీటి మధ్యలో బంగారముచేతను, మణులచేతను అలంకరింపబడి కదలని కన్నులుగల వేలకొలది చేపల గుంపులు ప్రకాశించును. అనేక సంస్థానములు కలిగి, సౌవర్ణమణి భూషణములచే అలంకరింపబడి ఎగజిమ్ముచున్న నీరు గలిగిన తాబేళ్ళచే అంతట చిత్రముగా ప్రకాశించుచుండును. అనేక విధములైన రత్నములు వెంట్రుకలు (రెక్కలు) గల పలురంగుల పక్షులచే ప్రకాశించు చుండును. పలుబంగారు పూవులచేతను మణుల తుండములుగల ఏనుగులచేతను ప్రకాశించు చుండును. అంతటను వాలుచున్నవియు చక్కని స్వరములుగలిగి మదోన్మత్తములైన పక్షులచే మేధావియైన ఇంద్రుని యొక్క ఆ క్రీడావనము రమ్యమై ప్రకాశించు చుండును.

ఆ క్రీడావనము మదించిన తుమ్మెదల చక్కని నాదములతోను, పక్షుల కూతలతోను నిత్యము ఆనందవంతముగా చేయబడిన ఆ క్రీడావనము గొప్పది. అది బంగారు ప్రక్క భాగములుగల పర్వతములచేతను, మణులచేతను, ముత్యములచేతను, మణులతో కూడిన పర్వత శిఖరములచేతను ఒప్పినది. అంతట ఎగురుచున్నవియు. చిత్రమైన శరీరములు కలవియు, అనేక రత్నములవంటి శరీర రోమములు కలవియు అయిన కోతుల చేత కూడినది. అనేక వర్ణములుగల తక్కిన ప్రాణులచేత వ్యాకులముగా ఉన్నది, అచట లతలును, పారిజాత (పుష్పముల) వృక్షములును, పిల్ల వాయువులచే కదల్చబడినవై పుష్ప వర్షములు కురియును. అచట విశాలములై రత్నములచే అలంకరింపబడిన శయనములు, ఆసనములు, ద్వారములు-వీనిచే నలంకరింపబడిన విహార భూములును కలవు. అచట ఇంద్ర క్రీడావనములో మంగళకరములైన పక్షులుగలవు. అచట సూర్యుడు మిక్కిలి వేడిగాగాని, శీతలముగాగాని లేక ఎల్లప్పుడు సమశీతోష్ణముగా ఉండును. అచట చైత్ర మాసమున వసంత ఋతువున అనేక పుష్పములతో సువాసితమై వాయువు వీచును. అది నిత్యము కామోన్మాదమును కలుగజేయును. నిత్యము శరీరమును సంగసుఖముచే ఆనందింపజేయును. శ్రమను క్లేశమును నశింపచేయును.

ఆ శుభ్రమైన ఇంద్రవనమున, దేవతలు, దానవులు, పన్నగులు, యక్షులు, రాక్షసులు, గుహకులు, అమిత తేజస్కులైన గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, కిన్నరులును సంతోషముతోకూడి ఉందురు. ఆ తరువాత అప్సరోగణములుకూడ అచట నిత్యము క్రీడాపరాయణులై ఉందురు. ఆ పర్వత శ్రేష్ఠము యొక్క తూరుపు ప్రక్కన మహోచితమైన కుముంజమను పర్వతశ్రేష్ఠము కలదు. దానిపై అనేక నదీ ప్రవాహములు, గుహలును కలవు. దానియొక్క ధాతువిచిత్రమైన శిఖరములయందు మహాపరాక్రములైన రాక్షసుల యొక్క బహువిస్తారములైన ఎనిమిది నగరములు ఉన్నవి.

వజ్రక పర్వతమునకూడ అనేక శిఖరములచేతను గర్భములచేతను పైకి వెలసిన రాక్షస నివాసములు గలవు. అవి పురుషులతోను, స్త్రీలతోను వ్యాకులమైనవి. నీలకులను ఆ రాక్షసులు భయంకరులు, కామరూపులు అనగా కోరిన రూపమును ధరించగలుగు వారు వారు బలపరాక్రమవంతులై అచట నిత్యము ఆసక్తులై ఉందురు. మహా నీలపర్వత రాజమున కూడ పదియైదు పురములుకలవు. అవి గుఱ్ఱపు ముఖముకలిగి కిన్నరులని ప్రసిద్ధిచెందిన మహాత్ములవి. మహాబాహువైన దేవసేనుడు అట్లే ఇంద్రుడు మొదలగువారు ఆపురములకు బలము. అచట కిన్నర రాజులు పదియైదుగురు గర్వితులు, బంగారు ప్రక్క భాగములు గలవారు. సామాన్యముగా అనేక వర్ణజాతులతో వ్యాకులములై బల ప్రవేశములుగల నగరములచే ఆ శైలేంద్రము బాగుగా అలంకరింపబడినది.

అచట మిక్కిలి భయంకరులు, విషపు చూపులు కలవారు, అగ్నివంటి కోపము గలవారు, సమీపింప అలవికానివారు, బంగారమునకు వశమై నడచుకొనువారు అయిన మహోరగులు నూరుగురుగలరు. ఆ పర్వతము నాగులు కలదైనను అచట రాక్షసా వాసములు వేలకొలది కలవు. ధనికుల మేడలు రాజమందిరములు దేవాలయములును పొడవైన ప్రాకారము, తోరణద్వారములను కలిగి ఉండును. వేణువంతమను మహాశైలమున విద్యాధరులవి మూడు పురములున్నవి. అవి ముప్పది యోజనములు వెడల్పు, ఏబది యోజనముల పొడవును గలవి. అచట దేవేంద్రు నితో సమానమైన పరాక్రమములుగల ఉలూకుడు, రోమశుడు, వీర్యవంతుడైన మహా నేత్రుడు- అను విద్యాధరులు వసింతురు.

వైకంకమను శైలము కలదు. దానిలో గుహలు సెలయేరులును కలవు. అందు మహోన్నతమై అందమైన శిఖరములు కలవు. అది అనేక రత్నములచేతను, ధాతువులు చేతను చిత్రింపబడినట్లు ఉండును. అచట నిత్యము గరుడుని కుమారుడైన సుగ్రీవుడను పరాక్రమవంతుడు నివసించుచును. ఆతడు ఉరగుల శత్రువు. దరి చేరనలవి కాని వాడు. మహా వాయువు అంతటి వేగము గలవాడు. మహాప్రమాణములు గలవై, పరాక్రమ వంతములై మహాబల పరాక్రమములు గల సర్పశత్రువులైన పక్షులచే ఆ పర్వతమంతయు అవరింపబడి ఉండును.

కరంజ పర్వతమున ఎల్లప్పుడును సాక్ష్యాద్భూతపతియై, ప్రభుడై, వృషభధ్వజుడై, యోగులకు ప్రభువై మహాదేవుడైన శంకరుడు ఉండును. ఆ కరంజ పర్వతమున చరియలు అన్నియును అనేక వేషములు ధరించి భూతములైనను దరిజేర నలవిగాని ప్రమథ గణముల చేత అంతట వ్యాపించబడి ఉండును.

వసుధారమను పర్వతమున వసువుల యొక్క ఎనిమిది పుణ్య వంతములైన నివాసములు కలవందురు. వారు వసు (ధన)మంతులు. అమిత తేజస్కులు. మహాత్ములు. రత్నధాతువను పర్వత శ్రేష్ఠమున మహాత్ములైన (సప్త) ఋషులయొక్క ఏడు ఆశ్రమములు కలవు. అవి సిద్ధావాసములతో కూడి ఉండును. హేమశృంగమను పర్వతశ్రేష్ఠమున నాలుగు ముఖములుగల ప్రజాపతి (బ్రహ్మ)యొక్క స్థానముకలదు. అది సర్వ భూతములచే నమస్కరింపతగినది. గజశైలమున భగవంతుని నానాభూతగణములతో చుట్టబడిన శూద్రులు గలరు. వారు నిత్య సంతుష్టులు. సర్వభూతములచే నమస్కరింపబడినవారు.

అట సుమేధమను పర్వతము ధాతుచిత్రములతో కూడినది. మేఘముతో సమముగా నల్లనైనది. అనేకములైన గుహలు, ధాన్యములు వాటి క్షేత్రములు పొదలు-మొదలగు వానిచే ప్రకాశించు చుండును. ఆదిత్యుల యొక్కయు, వసువుల యొక్కయు, అమిత తేజస్కులైన రుద్రుల యొక్కయు, అశ్వినీదేవతలయొక్కయు మనోహరములైన గృహ విన్యాసములు గలవు. ఆ నగోత్తమమున సిద్ధులచేత దేవతలయొక్క స్థానములు అచ్చట స్థాపింపబడినవి. అచట యక్ష గంధర్వ కిన్నరులు నిత్యము పూజాపరులై ఉందురు.

హేమకక్షమను పర్వత శ్రేష్ఠమున విశాలమైన గంధర్వనగరి కలదు. అది ఎనుబది (క్రోశముల) పొడవుగల పురివంటిది. గొప్ప ప్రాకారతోరణములు కలది. సిద్ధులు, అపత్తనులను గంధర్వులును యుద్ధమున శోభించువారు అందువలసింతురు. వారి అధిపతి రాజరాజై, దేవుడైన కపింజలుడు. అనల పర్వతమున రాక్షస వాసములు గలవు. పంచ కూటమున గూడ దానవులుగలరు. వారు ఉత్సాహవంతులు మహాబల పరాక్రమములు గల దేవశత్రువులు.

రాగికాంతిగల పర్వతమున అమిత తేజస్కులైన యక్షులకు సంబంధించిన నూరు శిఖరములు గల నూరు పురములు గలవు. అటకద్రువ పుత్రుడైన తక్షకునియొక్క పుర శ్రేష్ఠము కూడకలదు. అనేక వస్త్రములచేతను, గుహలచేతను శుభకరమైన విశాఖమను పర్వత శ్రేష్ఠమున ఎల్లప్పుడు గుహలోనే నివాసముండు గుహుని (కుమారస్వామి) యొక్క గొప్ప భవనము కలదు. మహాభవనములతో అలంకరింపబడిన శ్వేతోదరమను మహా శైలమున మహాత్ముడు, గరుడపుత్రుడు అయిన సునాభుని యొక్క పురముగలదు. పిశాచకమను పర్వత శ్రేష్ఠమున ధనికులైన దేవరాజులయొక్క గొప్ప మేడలచే అలంకరింపబడి నదియు, యక్ష గంధర్వులు తిరుగునదియునై, గొప్పదైన కుబేర భవనముగలదు. హరికూట పర్వతమున దేవుడు సర్వభూత నమస్కృతుడైన హరి ఉండును. ఆయన ప్రభావమువల్ల ఈ పర్వతము మహానాభమై ప్రకాశించును. కుముద పర్వతమున కిన్నరుల నివాసములు ఉండును, అంజన పర్వతమున మహోరగులును వారి నివాసములును కలవు. కృష్ణ పర్వతమునమహాభవన పంక్తులుగల విద్యాధరులయొక్క పురముకలదు. సహస్ర శిఖరమను పర్వతమున ఉగ్రకర్ములు, బాగుగ పైకి ఎదిగినవారు, బంగారు మాలలుగల రాక్షసులయొక్క వేయిపురములు గలవు. ముకుట పర్వతమున నాగులకు ఆవాసములైన అనేక పర్వత శ్రేష్ఠములుగలవు. పుష్పక పర్వతమున నిత్యసంతుష్టులైన మునిగణములు వసింతురు. సుపక్షమను పర్వత శ్రేష్ఠమున వైవస్వతుని యొక్కయు, సోముడు, వాయువు, నాగాధిపుడు ఈ నలువురియొక్క నివాసములు గలవు. అచ్చట గంధర్వులచేతను, కిన్నరులచేతను, యక్షులచేతను, నాగులచేతను, విద్యాధరశ్రేష్ఠులచేతను వారి స్థానములలో నిత్యము హోమములచే ఎక్కువగా పూజలు జరుగుచుండును. (39)