కశ్యపీయ ప్రజాసర్గము

సూతుడు ఇట్లు అనెను:

మునిపుత్రులైన గంధర్వులు, అప్సరసులును పుణ్యులు. చిత్రసేనుడు, ఉగ్రసేనుడు, ఊర్ణాయువు, అనఘుడు, ధృతరాష్ట్రుడు, పులోముడు, సూర్యవర్చుడు, యుగపత్తు, తృణపత్తు, కాలి, దితి, చిత్రరథుడు, పదమూడవవాడు భ్రమశిరుడు, పదునాల్గవవాడు పర్జన్యుడు, పదియైదవవాడు కలి, పదునారవవాడు నారదుడును- అను వీరు మునిపుత్రులైన దేవ గంధర్వులు. వారికి చెల్లెండ్రైన మంగళకరలైన ముప్పది నలుగురు అప్సరసలు కూడ కలరు. వారు అంతర, ద్వారవత్య, ప్రియముఖ్య, సురోత్తమ, మిశ్రకేశి, శాచి, పర్ణిని, అలంబుష, మారీచి, పుత్రిక, విద్యుద్వర్ణ, తిలోత్తమ, అద్రిక, లక్షణ, దేవి, రంభ, మనోరమ, సువర్ణ, సుబాహువు, పూర్ణిత, సుప్రతిష్ఠిత, పుండరీక, సుగంధ, సుదంత, సురస, హేమసార, సుతి, సువృత్త, కమల, సుభుజ, హంసపాద అనువారు. అట్లే లౌకికలైన అప్సరసలును-వీరు మునికి పుత్రులును, పుత్రికలు అయిన గంధర్వాప్సరసలు. గంధర్వుల యొక్క కూతుళ్లు మయనుండి పుట్టినవారు. వారందరి గురించి నేనుచెప్పెద వినుడు. వారిలో మొదటిది సుయశ, తరువాతది గాంధశ్వి, విద్యావతి, చారుముఖి, సుముఖి, వరానన, అనునవి ఆతరువాతి వారి పేరులు. అట్టి వీరు సుయశ యొక్క పుత్రులు మహాబలపరాక్రములు. ప్రచేతసునికి పుట్టినవారు. వారు యక్షులు, వారి పేరులను వినుడు. కంబలుడు, హరికేశుడు, కపిలుడు, కాంచనుడు, మేఘమాలి ఇది యక్షులగణము. సుయశ యొక్క కూతుళ్లు నలుగురు అప్సరసలు. వారి పేరులను చెప్పెద వినుడు. వారిలో లౌహేయి జ్యేష్టురాలు. ఆమె తరువాతిది భరత, తరువాత వారు కృశాంగి, విశాల. ఈమె రూపమున సాటిలేనిది. వారి కంటె వేరైనవారు నలుగురు యక్షగణములు కలరు. వీరు విక్రాంతునికి విశాలునికి జన్మించినవారు. అవి లౌహేయ గణము, భరతేయ గణము, కృశాంగేయగణము, విశాలేయ గణము-అని పురాణమున యక్షుల యొక్క గణములు ప్రసిద్ధములు. ఇట్టి భయంకరులై, మహా బలపరాక్రమవంతులైన, అసురులచేతను, యక్షగణలోకములచేతను, లోకాలోక వేత్తలలో శ్రేష్టులైనవారు కలిసిరి, గంధర్వులును, తరువాత వాలేయులును మహాత్ముడైన విక్రాంతునికి జన్మించినవారు. మహావీర్యవంతులు, మహాగంధర్వ నాయకు లును, విక్రమ-ఔదార్య దానశీల గుణములతో సంపన్నులు, మహాబలపరాక్రమ వంతులును, వారి పేరులను మొదటి నుండి యథాతథముగా చెప్పెదను. మహావీర్యుడైన చిత్రాంగదుడు, చిత్రవర్మ, మహాభాగుడైన చిత్రకేతువు, వీర్యవంతుడైన సోమదత్తుడు అనువారు, అతనికి మువ్వురు పుత్రికలును. మొదటిది అగ్నిక, తరువాతిది కంబల, చివరిది వసుమతి. వీరు రూపమున సాటిలేని ఓజస్సుగలవారు. వారికంటె వేరుగాగల కుమారునిచేత ఈ గణములు పుట్టింపబడినవి. అవి గంధర్వముఖ్యుల యొక్క విక్రాంతములై, యుద్ధదుర్మదములైన మూడు గణములు. ఆగ్నేయగణము, కాలేయగణము, వసుమతీసుత గణము అనునవి. తరువాత వివిధములైన గణములచేత ఈ చరాచరమైన లోకము వ్యాపించినది. ఆ మహాత్ముడైన విక్రాంతునివలన విద్యావంతులును, మహాభాగ్యులైన విద్యాధనేశ్వరు లును పుట్టిరి. పైకి విజృంభించిన తేజము గలిగి, మహాత్ములైన ఆ గంధర్వుల యొక్క నామములను నేను చెప్పదలచితిని. చెప్పెదను వినుడు. హిరణ్యరోముడు, కపిలుడు, సులోముడు, మాగ ధుడు, చంద్రకేతువు, గాంగుడు, గోదుడు, మహాబలుడు అను వారు మొదలుగా గల మహావిద్యా వంతులును విక్రాంతులు అయిన తపస్వులయొక్క గణము. చక్కని కన్నులుగల మరి ఇద్దరు (స్త్రీలు) గలరు. వారి పేర్లు శివ, సుమన. వారియందు మహాత్ముడైన విశ్రవ సునిచే పుట్టినవారు విద్యాచరణ గోచరులు. విక్రాంతులైన శైవేయులు, అట్లే సౌమనసులు అను గణములు. ఈ మూడు విద్యాధర గణములతో ఈ లోకము వ్యాపించినది. విద్యా ధరుల యొక్క విచేష్టితము వలన ఈ పై గణముల నుండి లోకమున ఆకాశాంతరమున చరించు వందలకొలది గణములు పుట్టింపబడినవి. విక్రాంతుడును, అ మహాత్ముని చేతనే అశ్వముఖులు పుట్టింపబడిరి. ఆ గుఱ్ఱపు ముఖముగలవారు కిన్నరులు. వారిని గురించి వినుడు. సముద్రుడు, సేనుడు, కాలిందుడు, మహానేత్రుడు, మహాబలుడు. సువర్ణఘోషుడు, సుగ్రీవుడు, వీర్య వంతుడైన మహాఘోషుడు అనునది మహాత్ములైన కిన్నరుల గణము. విద్వాంసులైన గుఱ్ఱపు ముఖములు గల కిన్నరులచే (లోకము) వ్యాపించినది. ఆ విధముగా చక్కగా పైకిఎదిగిన ఆ మహాత్ముడైన విక్రాంతుని చేతనే పుట్టింపబడినవారు నరముఖులైన కిన్నరులు. వారు శాంశపాయనులు. హరిషేణుడు, సుషేణుడు, వీర్యవంతుడైన వారి షేణుడు, రుద్రదత్తుడు, ఇంద్రదత్తుడు, చంద్ర ద్రుముడు, మహాద్రుముడు, బిందువు, బిందుసారుడును, చంద్రవంశులును, కిన్నరులు-సుశోభనులు అనువీరు శ్రేష్టులైన కిన్నరులుగా ప్రసిద్ధులు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! నృత్య గీతములలో ప్రతిభగల మహాత్ములైన ఈ కిన్నరులయొక్క నూర్లకొలది గణములు లోకమున ఉన్నవి.

యక్షోపశాంతునకు యక్ష, లౌహేయ, రూపశాలిని, సురవింద, ప్రకాశ, సిద్ధ సమ్మాత- అను వారు పుత్రికలు. ఉపాయాకేతన అనువారు కరాలునికి స్వయముగా పుట్టిన గణము. ఆ భూతముల యొక్క నామములను వినుడు. భూతములు భేతగణములు. అవి అవేశక నివేశకములు అను భూమియందు కనబడు గణము. ఆ గణమే ఈ లోకమున భూతము లకు భూతనాయకమైన గణము. వీరు ఆకాశాంతరమున చరించు వారికి ఉత్కృష్టులు అగుదురు. వారు వృక్షముల చివరగల ఆకాశమునందు మాత్రము చరింతురు. సంశయము లేదు. అట ఈ దేవ గంధర్వులు బాహుళ్యముగా నాచే చెప్పబడినారు. వారు దేవోప స్థానములందు ఆసక్తులు. కీర్తిమంతులును- అని తెలుసుకొనవలెను. గంధర్వులతో కూడిన నృత్యగీతముల పండితులును నిపుణులై గానము చేయువారును వాద్యములు వాయించు వారును, సర్వలోకములలో ఉండువారును అయిన దేవతలు; వీరు మహాదేవుడును, ఈశానుడు, జగత్ప్రభువును అయిన శంకరుని; ఇంద్రుడు మొదలుగా గల ఆదిత్యులను (అదితి పుత్రులను), వసువులతోబాటు రుద్రులను; దేవతల గురువు, రజోగుణము లేనివాడు, కమలనేత్రుడు అయిన నారాయణుని (విష్ణువును) అట్లే నాలుగు ముఖములు కలవాడు, స్వయముగా ఉద్భవించినవాడు అయిన హిరణ్యగర్భుని ((బ్రహ్మను) సమీపించి ఉపాసించిరి. వారు జ్యేష్ఠుడైన హంసుడు, కనిష్టుడైన మరొకడు, మధ్యములైన హహా హుహూ అనువారును, నాల్గవవాడు ధిషణుడు, తరువాత వాసి రుచియును, వారిలో ఆఱవవాడు తుంబురుడును తరువాత విశ్వావసుడు-అని పిలువబడుదురు. వీరు పుణ్య లక్షణులైన దివ్య అప్సరసులుగా చెప్పబడిరి. మహాభాగ్యవంతురాలగు వరిష్ఠ దేవ పూజితులైన ఎనమండుగురిని కనెను. అనవద, అనవశ, అస్వత, మదనప్రియ, అరూప, సుభగ, బాసి అరిష్టఅను ఆమె ఎనమండుగురిని కనెను. మనోవతి, సుకేశ అను ఇద్దరు తుంబురుని యొక్క పుత్రికలు. ఐదుజుట్లుగల ఈ దైవికలైన అప్సరసలు పదుగురు. వారు మేనక, సహజన్య, పర్ణిని, పుంజికస్థల, ఘృతస్థల, ఘృతాచి, విశ్వాచి, పూర్వచి, ప్రమ్లోచ, అనుమోచంతి–అనువారు. తరువాత ఆద్యంతములు లేని నారాయణునకు తన తొడ నుండి పుట్టిన సర్వ సుందరాంగి ఊర్వశి పదునొకండవది. మేనుని యొక్క కన్య మేనక. సంతుష్టచేతస్కుడైన బ్రహ్మయొక్క కన్యలు తక్కిన అందరు వారు బ్రహ్మవాదినులు, మహాయోగ్య వతులునుగా ఉండిరి. ఈ అప్సర గణములు పుణ్యులుగను పడునలుగురుగను చెప్పబడిరి. పిలువబడి శోభింపజేయు వీరు పదునాలుగు గణములు. వీరు బ్రహ్మయొక్క మానస కన్యలు. సమస్తమును శోభింపజేయువారైన మనుపుత్రికలు. వేగవతులై అరిష్టకును ఊర్జకును అగ్ని సంభవులైనవారు, ఆయుష్మంతులై సూర్యుని కిరణములందు పుట్టి ప్రకాశించువారు. జలమున పుట్టినవారై అమృతము నుండి పుట్టినవారు. పేరున అమృ తులనబడినవారు. వాయువునకు పుట్టి ‘ముద’లనబడు వారు. భూమి యందు పుట్టినవారై ‘భవ’లనబడువారు. విద్యుత్తునకు పుట్టిన రుచులు (కాంతులు). మృత్యుకన్యలై భైరవులు అనబడువారు. కామగుణులై శోభింపజేయు పదునాలుగు గణములుగా చెప్పబడి, ఇంద్రునితో ఉపేంద్రుడైన విష్ణువుతోను కూడి దేవగణములచే గొప్పరూపముతో నిర్మింపబడినవారు. శుభమైన రూపము కలది, మహాభాగ్యవంతురాలు, దేవలోకమునకు సంబంధించిన స్త్రీ, దేవతాస్త్రీ, ప్రభావతి, రూప యౌవన సంపన్నురాలును తిలోత్తమ అని లోకప్రసిద్ధి చెందిన అప్సరస బ్రహ్మ వలన అగ్నికుండమునుండి పుట్టినది. అట్లే బుద్ధి మంతుడైన బ్రహ్మకు యజ్ఞవేదీతలము నుండి మహాప్రభావవంతురాలైన దేవతాస్త్రీ వేదవతి అనునామె, అట్లే యమునియొక్క పుత్రిక రూపయౌవనములతో ఒప్పినది, శ్రేష్ఠమైన బంగారు వన్నె గలది, దేవనారియైన సులోచనఅను ఆమెలు జన్మించిరి. ఈ విధముగ ప్రకాశములైన అప్సరోగణములు పెక్కువేలు కలవు. వారు దేవతలకును, ఋషులకును భార్యలును తల్లులును అయిరి. సుగంధము గలవారును, చంప పుష్పపు వన్నె కలవారును అయిన అప్సరసలు అందరు అన్ని విధముల సమానులు. కాంతునితో సమాగమమున, మదిర లేకుండగనే మత్తిల్లి మత్తెక్కింతురు. వారియొక్క స్పర్శవలన తనవితీరును, ఆనందము వృద్ధిజెందును.

వినత యొక్క పుత్రులు ఇద్దరు, అరుణుడును, గరుడుడు అనువారు. చెల్లెండ్రు ముప్పది ఆరుగురు. గాయత్రి మొదలగు ఛందస్సులు గరుడునికి సంబంధించిన పక్షులు. ఇవియే అన్ని పగళ్లలో దిక్కులలో సన్నిహితమై ఉండును. కద్రువ చరాచరములైన వేయి నాగులను కనెను. అనేక శిరస్సులు కలిగి ఆకాశమున చరించు అ మహాత్ముల యొక్క తరచుగా ఉండు నామధేయములను వినుడు. వారిలో ప్రధానులైన నాగులు శేషుడు, వాసుకి, తక్షకుడు, సకణీరుడు, జంభుడు, అంజనుడు, వామనుడు, ఐరావతుడు, మహా పద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఐలపత్రుడు, శంఖుడు, కర్కోటకుడు, ధనంజయుడు, మహాకర్ణుడు, మహానీలుడు, ధృతరాష్ట్రుడు, బలాహకుడు, కుమారుడు, పుష్పదంతుడు, సుముఖుడు, దుర్ముఖుడు, శిలీముఖుడు, దధిముఖుడు, కాలీయుడు, శాలిపిండకుడు, బిందుపాదుడు, పుండరీకుడు, నాగుడు, అపూరణుడు, కపిలుడు, అంబరీషుడు, ధృతపాదుడు, కచ్ఛపుడు, ప్రహ్లాదుడు, పద్మచిత్రుడు, గంధర్వుడు, నమస్వికుడు, నహుషుడు, ఖరరోముడు, మణి-అను మొదలైన వారు కాద్రవేయులు. ఖశయులను గూర్చి వినుడు. ఖశ ప్రసిద్ధులైన పురుషులను తినునట్టి ఇరువురను కనెను. పశ్చిమ సంధ్యయందు జ్యేష్టుని, పూర్వసంధ్య యందు మనుజులను కనెను. ఆమె విలోహితుడైన వికర్ణుని పుత్రునిగా మొదట కనెను. నాలుగు భుజములు కలవాడు, నాలుగు పాదములు కలవాడు, రెండు తలలు కలవాడు, వెనుక ముందులైన రెండు విధముల గమనము కలవాడు, సర్వాంగములందు వెంట్రుకలు కలవాడు, స్థూలశరీరుడు, ఎత్తైన ముక్కు గలవాడు, పెద్ద పొట్ట కలవాడు, లావైన తలకల వాడు, గొప్ప చెవులు కలవాడు, దర్భలవంటి వెంట్రుకలు కలవాడు, మనస్సే రథముగా (మనోవేగము) గలవాడు, ఏనుగు పెదవులు కలవాడు, పొడవైన పిక్కలు గలవాడు, గుఱ్ఱము వంటి కోరలు కలవాడు, గొప్పదవడలు కలవాడు, ఎఱ్ఱని నాలుక కలవాడు, కనురెప్పల వెంట్రుకలు జడలు కట్టినవాడు, లావైన ముఖము కలవాడు, పొడవైన ముక్కు కలవాడు, గుహ్యకుడు (తన్ను తాను రక్షించుకొనువాడు), వాడియైన చెవులు కలవాడు, గొప్ప ఆనందము గలవాడు, గొప్ప ముఖము కలవాడును-ఈ విధముగా అతిభయంకరముగ ఉన్న పుత్రుని ‘ఖశ’ అను ఆమె కనెను. అతని తమ్ముడైన రెండవ వానిని గూడ ‘ఖశ’యే కనెను. అతడు మూడు తలలు కలవాడు, మూడు పాదములు కలవాడు, మూడు చేతులు కలవాడు, నల్లని కండ్లు కలవాడు, పైకి నిక్కబొడిచిన వెంట్రుకలు కలవాడు, పచ్చని మీసములుకలవాడు, శిలవంటి శరీరము కలవాడు, దృఢమైనవాడు, పొట్టి శరీరము కలవాడు, మంచిచేతులు కలవాడు, మహాబలుడు, చెవులవఱకు చీల్చిన నోరు కలవాడు, పొడవైన కనుబొమలు కలవాడు, రెండు నాలుకలు, శంఖువు వంటి చెవులు కలవాడు, గోరోజనము వంటి వర్ణముతో పైకి తిరిగియున్న కన్నులు కలవాడు, జడలు కలవాడు, గోరోజనము వంటి రంగు కలవాడు, గొప్ప చెవులు కలవాడు, గొప్ప యెద కలవాడు, నడుములేనివాడు, కృశించిన పొట్ట కలవాడు, గోళ్లుకలవాడు, ఎఱ్ఱని శిరము కలవాడు- ఇట్టి వానిని ఆ ‘ఖశ’ చివరి వానినిగా కనెను. వారు జన్మించిన వెంటనే అంతగా పెరిగి, అన్నింటిని అనుభవించుటకు తగిన శరీరములతో తల్లిని అలంకరించిరి. క్రూరుడైన పెద్దవాడు తల్లిని ఆకర్షించెను (లాగెను) ఓ అమ్మా! ఆకలిచే పీడింపబడితిని. తినుటకు రమ్ము అని అనెను. అట్టి ఈ పెద్దవానిని చిన్నవాడు నిషేధించెను. తల్లియైన ఈ ఖశను ఎల్లప్పుడు రక్షింపుము అని ఆ చిన్నవాడు అనెను. అని పెద్దవానిచేతుల నుండి తల్లిని విడిపించెను. ఇంతలో వారి తండ్రి అచట ఆవిర్భవించెను. వివిధాకారములు గలవారిని చూచి కూర్చొనుడు-అని అనెను. ఆ బలవంతులైన ఇరువురు తండ్రిని చూచి వేగముగా తమ మాయచే తల్లి ఒడిలో ఏడ్చిరి. ఆ తరువాత ఋషి (కశ్యపుడు) భార్యతో-”మేము పూర్వము చెప్పితిమి. చెప్పినదానికి విరుద్ధముగా జరిగినదా? నిజము చెప్పుము. పుత్రుడు మేనమామను (పోలికలలో) పొందును. కన్యక తల్లిదండ్రులను (పోలికలను) పొందును. తల్లి ఎట్టి శీలముగలదో పుత్రుడు కూడ అట్టిశీలముగలవాడు అగును. భూమి ఏ వర్ణముకలదో నిజముగా నీరు ఆ వర్ణము కలదియే అగును. తల్లి శీలదోషముచేతను, అట్లే శీలగుణములచేతను సంతానము అంతయు వేరువేరుగా ఉండును. ఖ్యాతివశమున కూడ అట్లే అగును అని చెప్పెను. కశ్యపుని భార్యలలో బల శీలాదులలో అదితి ధర్మతత్ప రురాలు. ధర్మశీలాదులలోను ఉత్తమ జ్ఞాన బలముతో ఒప్పినది. అట్లే గానశీలము గలది ‘అరిష్ట’. ఇక ‘దనువు’ మాయాశీల అనబడినది. దేవియైన ‘వినత’! ఆకాశ యానమున ఆసక్తి గలది. ‘సరభి’ తపోమయమైన శీలముతో శోభించునది. కద్రువ క్రోధశీల, కోపముతో అసుఖశీలము గలది. ‘దనాయుష’ యొక్క శీలము వైరానుగ్రహ లక్షణము. ఓ మహాభాగ్య వంతురాలైన దేవీ! నీవు క్రోధశీలవు నాకు ఇష్టురాలవు అనునవి మానవుల శీలములు. వారి స్వభావముల చూచినందున తెలియునవి. అవి పనివల్లను, ప్రయత్నముతోను, బుద్ధి తోను, రూపముతోను, బలముతోను, క్షమతోను, భావితమైన అర్థము యొక్క బలముచేతను (శీలములు) వేరువేరుగా అగును. సహజముగా రజోగుణ, సత్త్వగుణ, తమోగుణ ప్రవృత్తుల యందు మేనమామను అనుసరింతురు” అని ఈ విధముగ ఆ సాటిలేని ‘ఖశ’కు చెప్పి, పుత్రులు ఇద్దరిని పిలిచి వారిని చంద్రునివలె శాంతులుగను, భయములేనివారినిగను చేసెను. అప్పుడు ‘ఖశ’ ఆ పుత్రులిరువురు చేసిన దానిని చెప్పెను. పుత్రులు వేరువేరుగా చేసిన పనులను తల్లి చెప్పగా విని, అందులోని ధాత్వర్ధము యొక్క యోగముచే ఆ పనిని వారిపనిగా (వృత్తిగా) చేసెను. ‘యక్ష’ అను ధాతువు తినుట యందును, లాగుటయందును ఉపయోగింపబడును. ‘యక్షయ’ అని చెప్పినందున వీడు యక్షుడగును. అట్లే ‘రక్ష’ అను ధాతువు పాలనయందు విశేషముగ భావింపబడును. నా తల్లిని ఖశను ‘రక్ష’ అనినందున ఆ పేరుతో నీ పుత్రుడు రాక్షసుడు కాగలడు. ఆ కశ్యప ప్రజాపతి అపుడు వారిని ఆ విధ ముగా చూచి ఆశ్చర్యపడి చక్కగా వెదకియు వారు ఇరువురికి రక్త మాంసములను ఆహా రముగా ఆదేశించెను. తండ్రి వారిని ఆకలిగొన్న వారిగా జూచి వారికి ఈ వరమును గూడ ఇచ్చెను. “మీ ఇద్దరి చేతుల స్పర్శ అంతటను రాత్రియందే జరుగును. పగలు ఎవరిని తాకలేరు. మీరు ఇద్దరును రాత్రియందే ఆహార విహారములు కలవారును, పగలు నిద్రా సుఖములను అనుభవించువారును అగుదురు. తల్లిని రక్షించు కొనుడు, బోధించిన ధర్మమును పాలించుడు-అని పుత్రులతో కశ్యపుడు చెప్పి అచటనే అంతర్థానమందెను.

తండ్రి వెడలగనే ఆ ఇద్దరు వీరులు సహజముగనే భయంకరులు వ్యతిరేకముగనే నడచుచున్నవారు కుత్సితమును భుజించువారు, ప్రాణులను హింసించువారు అయిరి. మహాబలులు, మహాసత్త్యులు, మహాకాయులు, సమీపింప అలవిగానివారు, మాయావులు ఇరువురును అంతర్ధానము చెందిరి. వారు ఇరువురు కామరూపులు (ఇష్టమైన రూపమును దాల్చువారు), భయంకరులు, వికార రూపులు, సహజముగా సదా జ్ఞానము లేనివారు. ఆ ఇద్దరును రూపమునకు తగిన ఆహారములతో ప్రభువులుగా సమర్థులు. ఆ రాక్షసులు దేవరాక్షసులను, ఋషులను, గంధర్వులను, కిన్నరులను, పిశాచులను, మనుష్యులను, సర్పములను, పక్షులను, పశువులను ఆహారముగా అంతటను పొందగోరువారుగను, ఇంద్రునిచే సులభముగా చంపబడునట్లును వరములను పొందిరి. యక్షుడు ఎప్పుడు గూడ చాలాకాలము ఒంటరిగా ఉండడు. అతడు ఆహారమును పొందగోరి అరుచుచు తిరిగెనట. ఆతడు (యక్షుడు) జంతుచండులు అను ఇరువురు పిశాచులను సమీపించెను. వారు గోరోజనపు రంగుగల కండ్లు గలవారు. పైకి నిక్కబొడుచుకొన్న వెంట్రుకలు గలవారు. గుండ్రని కండ్లుకలవారు. మిక్కిలి భయంకరులు. రక్త, మాంస, వసలు ఆహారముగ గల వారు. పురుషులను తినువారు. మహాబలులు. ఆ పిశాచులు ఇద్దరు కన్యలతో కూడి యుండిరి. ఆ పిశాచులు ఆ కన్యకలకు ప్రియమును గూర్చుటకై కూడియుండిరి. ఆ ఇద్దరు కన్యలు కామరూపిణులు పిశాచుల ఆచారములు గలవారు. ఆ కన్యకలతో గూడిన ఆ ఇరువురు ఆహారార్థము తిరుగుచుండిరి. అచట వారు కామ రూపియై మహాబలుడైన రాక్షసుని చూచిరి. అకస్మాత్తుగా జరిగిన అతని ఆ కలయికలో పరస్పరము చూచుకొని, ఒకరినొకరు రక్షించుకొనుచునే ఒకరినొకరు చంపదలచుచుండిరి. అంత తండ్రులు-”మీరు అడుగడుగున మొరయుచున్న ఈతని సజీవునిగా పట్టుకొని వేగముగ రండు” అనిరి. అంత కన్యలు అపుడు అతనిని సమీపించి పట్టుకొనిరి. వారిచే పట్టుకొనబడి తండ్రుల సభకు అతడు తీసుకొనిరాబడెను. తరువాత కన్యకలచే పట్టుకొని తీసుకురాబడిన ఆ పిశాచరాక్షసుని-నీవు ఎవ్వడవు? ఎవ్వరివాడవు? అని అడిగిరి. అతడును మొత్తము వృత్తాంతమును చెప్పెను. అట్లు తెలిసికొని ఆరాక్షసశ్రేష్ఠులు అజుని, ఖండుని, ఆతని ఈ పుత్రికలను ఇచ్చిరి. వారిద్దరును (అజుడు ఖండుడు) అతని పనిచే సంతుష్టిచెందినవారై పుత్రికలైన కన్యలు ఇద్దరిని ఇచ్చిరి. పిశాచుల సంప్రదాయ ప్రయుక్తమైన వివాహముతో చక్కని దంతములు గల తమ కన్యల (తో) కట్టబడిన వాహనము గలవాడై అజుడును, ఖండుడును, ఆతని ఈ పుత్రికలను ఇచ్చిరి. ఆ ఇరువురు కన్యకలకు అపుడు ధనమును ఇప్పించిరి. ఖండుడు ఈమె బ్రహ్మధన అనునది. నా కన్యక లోపములు లేనిది. బ్రహ్మయే సత్త్వము ధనము ఆహారమును అయినది-అని (యెదుట) పలికెను. ఈమె జంతు ధన అనునది సర్వాంగ సుందరియైన కన్య. జంతువులు ఈమెకు ధనము ఆహారము అగును. ఈ విధముగా వారిద్దరు (అజుడు; ఖండుడును) ధనమును వినిపించిరి. జంతుధనయను ఆమె సర్వాంగములందు వెంట్రుకలు గల కన్య. బ్రహ్మ ధన కర్ణాంతము లేనిదైనను రోమ ములు లేని కన్య. ఆ కన్యక ధనానుని వల్ల బ్రహ్మధనుని కనెను. ఈ విధముగా ఆ ఇద్దరు పిశాచ కన్యలు రెండు మిధునములను (జంటలను) కనిరి. వారియొక్క ప్రజాసృష్టిని చెప్పెద వినుడు. హేతి, ప్రహేతి, ఉగ్రుడు, పౌరుషేయుడు, వధుడు, విస్ఫూర్జి, వాతుడు, ఆపుడు, వ్యాఘ్రుడు, సర్పుడు- వీరు యాతుధానాత్మజులైన రాక్షసులు పదుగురు. వీరు సూర్యుని అనుచరులు (సేవకులు). అతని తోడనే తిరుగుదురు. హేతు(త్రి) పుత్రుడు లంకుడు. లంకునకు ఇద్దరు పుత్రులు-మాల్యవంతుడు, సుమాలి అనువారు. ప్రహేతి పుత్రు లను వినుము. ప్రహేతి తనయుడు శ్రీమంతుడైపులోమ అను పేర ప్రసిద్ధుడు. వధుని పుత్రుడు నికుంభుడు. ప్రకూరుడైన బ్రహ్మరాక్షసుడు. వాతుని పుత్రుడు విరాగుడు. ఆవుని పుత్రుడు జంబుకుడు. వ్యాఘ్రుని పుత్రుడు నిరానందుడు. జంతువులకు విఘ్నములు కలుగ చేయువాడు అను పేర్లుగల వారందరు అంతట వ్యాపించిన క్రూరులైన రాక్షసులు. యాతుధానులను చెప్పితిని. బ్రహ్మధానులను వినుడు. యజ్ఞుడు, పిత, ధుని, క్షౌముడు, బ్రహ్మ, పాపుడు, యజ్ఞహస్త, స్వాకోటకుడు, కలి, సర్పుడు-అని బ్రహ్మ ధానాత్మజులు పదుగురు. వారియొక్క చెల్లెండ్రు వీరు బ్రహ్మ రాక్షసీలు, చాల భయంకరలు. రక్తకర్ణ, మహాజిహ్వ, అక్షయ, ఉపహారిణి-వీరి వంశమున పుట్టినవారు భూమిలో బ్రహ్మరాక్షసులు. శ్లేషాత్మక తరువులపైన శ్లేష్మమును ఎల్లప్పుడు పోగొట్టు విరిగిన చెట్లపైన ఈ రాక్షసులు తరచుగా నివాసము ఏర్పరచుకొని ఉందురు. యక్షుని యొక్క సృష్టిని వినుడు. యక్షుడు పంచస్థూలయైన స్తనములు, పిరుదులు, ఉపస్థ, చెంపలు, పెదవులు అను అయిదు లావుగాకల క్రతుస్థలి అను అప్సరసను కామించెను. ఆమెను పొందగోరి ఆమెనే చింతిం చుచు అతడు నందన వనమున తిరిగెను. అచట నందనవనమున మిక్కిలి ప్రకాశించు సురభిని (కామధేనువు), చైత్రరథమను ఇంద్రోద్యానమును, అప్సరసలతో కూడ ఉన్న ఆమెను చూచెను. అచట ఆమెను పొందకోరి చింతించుచు తన రూపముతోడను, కర్మతోను దూషితుడు అయినందున ఆమెను పొందు ఉపాయమును కానలేకుండెను. భయంకర రూపముతో చుట్టబడియున్న నన్ను చూచి, ప్రాణులు భయము చెందుదురు. కావున నా సుందరాంగి యైన అంగనను ఎట్లు పొందగలను? అని చింతించి ఆ తరువాత ఒక ఉపాయమును కనుగొని ఆ గుహ్యకుడు బహుమతమైన గంధర్వ రూపమును వహించి తొందరగా మరలెను. తరువాత అతడు అప్సరసల మధ్యనున్న క్రతుస్థలిని పట్టుకొనెను. క్రతుస్థలి అను అప్సరసకూడ ఆతనిని చక్కని సుందరునిగా భావించి అనురాగభావముతోనే ప్రవర్తించెను. అప్సరోగణములతో చూడబడుచు ఆమెతో చాటుమాటునకు పోయెను. ఆ యక్షుడు అచట సిద్ధించిన ఇంద్రియ వాంఛలు కలవాడు అయ్యెను. ఈతనికి ఒక పుత్రుడు వెంటనే పుట్టెను. పరిపక్వము చెందిన ఔన్నత్యములతో కూడి వెలుగుచు శ్రీ చేత వెంటనే అవరింపబడెను. “నేను యక్షుడను. ఈ అప్సర స్త్రీలలో ఉండరాదుగదా” అని తండ్రితో అనెను. నీవిచట పుట్టినందున భయములేదు అని తండ్రి పుత్రునితో అనెను. ఇంకను తండ్రి వీర్యముతో పుత్రుడు తల్లి రూపమునకు అనురూపుడై పుట్టెను. పుత్రుడు అట్లు పుట్టగా గంధర్వ రూపములో ఉన్న యక్షుడు సంతోషముతో తన యక్షస్వరూపమును పొందెను. గొప్పవారైన యక్షులును, రాక్షసులును కామ రూపమున ఉన్నప్పటికిని సంత సించినవారైనను, భీతిజెందినవారైనను, కోపము చెందిన వారైనను, నిద్రించినవారై నను చివరకు మరణించుచున్నవారైనను స్వస్వరూపము (యక్ష, రాక్షస రూపములను) పొందుదురు. అపుడు ఆ యక్షుడు ఆశ్చర్యపడుచున్నవాడై అప్సరసతో ఓ సుశ్రోణి! (చక్కని పిరుదులు గలదానా!) ఉత్తమురాలా! పుత్రునితో కూడిన దానవై నా గృహమునకు వెళ్లుము అని చెప్పెను. అట్లు వెంటనే స్వస్వరూపమును బొందిన ఆ యక్షుని చూచి విభ్రాంతలై భీతిజెందినవారై ఆ అప్పరోగణములు పరుగెత్తెను. అట్లు పోవుచున్న అప్సరోగణములను వెంబడించి వెళ్లుచున్న క్రతుస్థలిని పుత్రుడు తన మాటలతో ఓదార్చుచు గంధర్వ అప్సరసల మధ్య నుండి తల్లిని తీసికొని మరలెను. అప్సరోగణములు యక్షునియొక్క ఆసము త్పత్తినిచూచి “క్రతుస్థలితో నీవు యక్షులకు జనయిత్రి (కన్నతల్లి) వని పలికిరి. తరువాత యక్షుడు తన పుత్రునితోబాటు యక్షులుండు స్థలమైన న్యగ్రోధ రోహిణమను (మట్టిచెట్లు మొలచు స్థలము) తన యింటికి వెళ్ళెను. కావున యక్షులకు మట్టిచెట్టు అంతటను ప్రియ మైన ఆవాసము. యక్షుడైన రజతనాభుడు యక్షులకు తాత (తండ్రి తండ్రి). అతడు అనుహ్లాదుడు అను దైత్యుని యొక్క మిక్కిలి శ్రేష్ఠురాలైన పుత్రియగు ‘భద్ర’ అను ఆమెను పెండ్లాడెను. ఆమె యందు వశియైన మణివరుడు పుట్టెను. ఆమె ఇంద్రసమాన పరాక్రమవంతుడైన మణిభద్రుని కనెను. క్రతుస్థలికి కూతురులై (తమలో) అక్కచెల్లెండ్రైన ఇద్దరు వారిరువురికి భార్యలు. వారి పేరులు పుణ్యజని, దేవజని అనునవి. పుణ్యజని మణిభద్రుని వల్ల శుభులైన ఈ పుత్రులను కనెను. వారు సిద్ధార్థుడు, సూర్య తేజుడు, సుమంతుడు, నందనుడు, కన్యకుడు, యవికుడు, మణిదత్తుడు, వసువు, సర్వాను భూతుడు, ఖంఖుడు, పింగాక్షుడు, భీరువు, మందర శోభి, పద్ముడు, చంద్రప్రభుడు, మఘపూర్ణుడు, సుభద్రుడు, ప్రద్యోతుడు, మహౌజసుడు, ద్యుతిమత్తు, కేతుమత్తు, మిత్రుడు, మౌళి, సుద ర్శనుడు-ఈ ఇరువది నలుగురు శుభులైన పుణ్యజనులు. వారందరు మణిభద్రు నకు పుట్టిరి. వారు పుణ్యలక్షణులు. వారి పుత్రులు, పాత్రులును శుభులైన పుణ్యజనులు. మణి వరాత్మజుని వలన దేవజనని పుత్రులను కనెను. వారు-పూర్ణభద్రుడు, హేమరథుడు, మణిమంతుడు, నందివర్ధనుడు, కుస్తుంబురుడు, విశంగాభుడు, స్థూలకర్ణుడు, మహా జయడు, శ్వేతుడు, విపులుడు, పుష్పవంతుడు, భయావహుడు, పద్మవర్ణుడు, సునేత్రుడు, యక్షుడు, బాలుడు, బకుడు, కుముదుడు, క్షేమకుడు, వర్ధమానుడు, దముడు, పద్మనాభుడు, వరాంగుడు, సువీరుడు, విజయుడు, కృతి, పూర్ణమాసుడు, హిరణ్యాక్షుడు, సురూపుడు- ఈ మొదలైనవారు మణివరుని పుత్రులు వారు యక్షులు గుహ్యకులు అనబడిరి. వారు సురూపులును విరూపులును, పుష్పమాలలు కలవారును, చూచుటకు ఇంపైన వారును. వారి పుత్రులును, పాత్రులును నూర్లు వేలుగా ఉన్నారు. ఖశయొక్క మరొక పుత్రులు రాక్షసులు కామరూపులు. వారిలో ప్రధానులను వర్ణించి చెప్పెద వినుడు. వారు లాలవి, కుధనుడు, భీముడు, సుమాలి, మధువు, విస్ఫూర్జితుడు, విద్యుజ్జిహ్వుడు, మాతంగుడు, ధూమ్రితుడు, చంద్రార్కుడు, సుకరుడు, బుధ్నుడు, కపిలోముడు, ప్రహాసకుడు, క్రీడుడు, పరశునాభుడు, చక్రాక్షుడు, నిశాచరుడు, త్రిశిరుడు, శతదంష్ట్రుడు, తుండకేశుడు, రాక్షసుడు, యక్షుడు, అకంపనుడు, దుర్ముఖుడు, శితముఖుడు-అను వీరు రాక్షసవీరులు, పరాక్రమవంతులు, గుణములే రూపముగా కలవారు, సర్వలోకముల సంచరించువారు. వారు దేవతలతో సమానమైన పరాక్రమము కలవారు.

వీరుకాక మరి ఏడుగురు పుత్రికలు కలరు. వారిని గురించి వరుసగాను పుట్టించిన వారియొక్క ప్రజాసృష్టిని వినుడు. అలంబి, ఉత్కచ, కృష్ణ, నిర్ ఋత, కపిల, శివ, మహాభాగురాలైన కేశిని అని ఈ ఏడుగురును తోబుట్టువులు. వారినుండి లోకుల మాంసమును తినువారు, హంతకులు, యుద్ధములచేత మదము ఎక్కినవారు, గొప్పవారును, శుభకరు లును అయిన ఈ రాక్షసగణములు పుట్టినవి. ఆలంబేయ గణము క్రూరమైనది. అట్లే ఉత్కచేయ గణమును క్రూరము. కార్ణేయ (కృష్ణకు పుట్టినవారు) రాక్షసులు, శైవేయ (శివకు బుట్టినవారు) రాక్షసులును ఉత్తమ గణములు. అట్లే త్ర్యంబకుడైన శివునియొక్క అనుచరుడైన గణేశ్వరుడు అను సేవకునిచే నైర్ఋత గణము అను ప్రజాసృష్టి జరిగినది. బలవంతుడైన గణేశ్వరచరునిచే గొప్ప రాక్షసులు పుట్టిరి. నిర్భతికి సంబంధించిన దేవ, రాక్షసులు విక్రమించినవారు, శౌర్యసంపన్నులును, వారి అధిపతి సమర్థుడు, విరూ పకుడు అను పేర ప్రసిద్ధి చెందినవాడు. గర్వితులైన ఈ మహాత్ముల గణశతములు జగత్ప్రభువైన శంకరుని ఎక్కువగా సేవించును. దైత్యరాజై మహాత్ముడైన కుంభునికి మహాకాయులు, మహావీర్యులు, మహాబలపరాక్రములును పుట్టిరి. కపిలకు పుట్టినవారు మహావీర్యులు, గొప్ప దైత్య రాక్షసులు కంపనుడు అను యక్షునిచేత కేశినికి పుట్టినవారు వేరొక గణమువారు. కేశిని దుహితయైన నీలకు సురసికుడైన ఆలంబేయునిచే పుట్టిన క్షుద్రమనస్కులు నైలులని చెప్పబడి భయంకర పరాక్రమము గలవారై దుర్జయులుగా ఉండిరి. వారు దైవలౌకికులై సమస్త భూమియందు చరింతురు. వారి సృష్టి బహుళ మైనందున చెప్పుటకు సాధ్యపడదు. ఆ నీలకునకు ‘వికచ’ అను రాక్షసి కూతురుగా పుట్టినది. అది సహజముగనే వికృతములైన వెంట్రుకలు కలది. గొప్ప బలపరాక్రమ ములు కలది. ఆ వికచకును నిరఋతి పుత్రుడైన విరూపునిచే రాక్షస ప్రజలు పుట్టింపబడిరి. వారు భయంకరులు. పూర్వానుక్రమముగ వారిని చెప్పెద వినుడు. వారు కోరలతో కుటి లులై వికృతాకారము కలవారు. పెద్ద చెవులు కలవారు. పెద్ద కడుపులు కలవారు. హార కులు (హరించువారు), భీషకులు (భయపెట్టువారు), ఆక్రమించువారు మరికొందరు వైనకులు, పిశాచులు, వామకులు, ప్రాశకులు మరికొందరు-వీరు భూమియందు రాక్షసులుగా తిరుగుదురు. వారు గొప్ప బలసత్వములు కల ఖేచరులు (ఆకాశచారులు). స్వల్పాకారులై స్వల్పముగనే లక్ష పర్యాయములు ఆకసమున చరింతురు. వీరిచేత ఈ లోకము నూర్లకొలదిగను వేలకొలదిగను వ్యాపింపబడినది. భూమి రాక్షసులు అందరి చేతను, అనేకులైన నీచరాక్షసులచేతను, అనేక విధముల రూపములుగలవారి చేతను నానాదేశములు ఆక్రమింపబడెను. రాక్షసమాతలు ఎనమండుగురు. ఈ విధముగా సంగ్రహ ముగా చెప్పబడిరి. పూర్వానుక్రమముగ వీరి విభాగములు ఏడు-అవి ప్రసిద్ధములు. భద్రకులు, నికరులు, కొందరు యజ్ఞ, నిష్పత్తికి కారణులు, మర్త్యలోకమున మిక్కిలి చరించువారు లక్షలు కలరు. పూతనామాత సామాన్యముగా కలవారు (పూతనయే తల్లిగా కలవారు). ప్రాణిభయంకరులు, మనుష్యలోకమున బాలగ్రహరూపులు, వైమాన హేతుకులు, స్కంధ గ్రహాదులు, ఆపకులు, త్రాసకులు మొదలైనవారు వీరిని కౌమారులని గ్రహించవలెను. వీరు బాలగ్రహవృత్తిలో ఉండువారు. ఈ స్కందగ్రహ విశేషములు మాయికములు (మాయాశక్తిగలవి). ఇవి లోకవినాయకములు, పూతన అను పేరుగల భూతములు లక్షల సంఖ్యలలో ఉన్నవి. అవి మర్త్యలోకమున విశేషముగా చరించునవి. ఈ విధముగ నూరు గణములు ఈ భూమియందు చరించును. యక్షులు మిక్కిలి పుణ్యాత్ములు, అట్లే గుహ్యకులనువారును, యక్షులు దేవజనులు, అట్లే పుణ్యజనులును, గుహ్యకులు అందరిలోను రాక్షసులైన అగస్త్యులును, రాక్షసులైన పౌలస్త్యులును, విశ్వామిత్రులు అనబడువారును, యక్షులలోను రాక్షసులలోను పౌలస్త్య అగస్త్యలును-వీరందరికిని రాజు అలకాధిపుడై మహారాజైన కుబేరుడు. యక్షులు ఇచట చూచి కూడ నరుల యొక్క మాంసమును, రక్తమును, వసను త్రావుదురు. రాక్షసులు సైతం పైవారిని అనుసరించి ప్రవేశించుటచేతను, పిశాచులు సర్వత్ర పీడించుటచేతను నరుల మాంస రక్త వసలను త్రాగుదురు. వారు సర్వలక్షణ సంపన్నులు, దేవతలతో సమానమైన క్షేత్రము కలవారు, ప్రకాశవంతులు, బలవంతులు, ఈశ్వరులు, కామరూపులు, నాభిని తిననివారు, విక్రమించువారు, సర్వ లోకములందు సమస్కరింపబడినవారు, సూక్ష్మరూపులు, తేజోవంతులు, పవిత్రులు, వరములను ఇచ్చువారు, యజ్ఞములకు సంబంధించిన వారును, సమాన ధర్మముగల దేవతలలో వారంతటను రాక్షసులుగా పిలువబడిరి. నాలుగింట మూడు భాగములతో గంధర్వులు. ప్రభావములో దేవతలకు తక్కువవారు. సమస్త గుహ్యకులు (యక్షులు) గంధర్వుల కంటే తక్కువవారు. సమస్త రాక్షసులును ప్రభావములో యక్షులకు సమానులు. ఇక పిశాచులు ఐశ్వర్యములో (ప్రభావములో) యక్షుల కంటె మూడు పాళ్లు తక్కువవారు. ఈ విధముగా గంధర్వులు మొదలు పిశాచుల వరకు ఉన్న నలుగురు దేవ యోనులు (దేవ మూలకముగా పుట్టినవారు) ధర్మములోను, ఐశ్వర్యము (ప్రభావము)లోను, బుద్ధిలోను, తపములోను, శాస్త్ర జ్ఞానములోను, పరాక్రమములోను-ఇట్లే ధనములోను, రూపములోను, ఆయుష్యములోను, బలములోను పరస్పరము దేవాసురుల కంటె మూడు పాళ్లు తగ్గి ఉందురు.

సూతుడు ఇట్లు అనెను:

ఇక వినుడు. మీకు భద్రమగును. క్రోధవశాత్మకమైన సంతానముగా క్రోధయందు పండ్రెండుగురు కన్యకలు పుట్టిరి. వారు అత్మసంభవులు, వారు పులహుని భార్యలైరి. వారి పేర్లను వినుడు. మృగి, మృగమద, హరిభద్ర, ఇరావతి, భూత, కపిశ, దంష్ట్ర, నిశ, తిర్య, శ్వేత, స్వర, సురస. మృగికి హరిణములు (లేళ్లు) పుత్రులు. అవి మృగములు, అట్లే తక్కినవి శశములు (కుందేళ్లు), న్యంకువులు (ఇఱ్ఱులు), శరభములు (ఎనిమిది కాళ్ల మృగములు సింహముల చంపునవి), రురువులు (నల్లచారల దుప్పులు), పృషతములు (దుప్పులు)ను పుట్టినవి. మృగమందకు మృగరాజములు (సింహములు), గవయములు (గోవువంటి క్రూర మృగములు గురుపోతులు), మహిషములు (దున్నలు), ఉష్ట్రములు (ఒంటెలు), వరాహములు (పందులు), ఖడ్గమృగములు, గౌర ముఖములును పుట్టినవి. హరిభద్రకు హరులు (కోతులు) పుత్రులు. గోలాంగూలములు (కొండముచ్చులు), తరక్షు వులు (సివంగులు), వానరులు, కిన్నరులు, వ్యాఘ్రములు, కింపురుషులు ఇవి మొదలుగ తక్కినవియు పుట్టినవి. భౌవనుడు సూర్యుని అండతో కపాలముల రెంటిని తెచ్చి రెండు చేతులతో పరిగ్రహించి రథంతర సామమును గానము చేసెను. అట్లు ప్రసూయమానమగు సామముతో వెంటనే గజము పుట్టెను. ఆ భావనుడు ఆ గజమును ఇరావతికి పుత్రునిగా ఇచ్చెను. ఆ భావనుడు ఇరావతికి సుతుడు అయినందున ఐరావతుడు అనబడెను. అది దేవరాజైన ఇంద్రునకు వాహనమైన మొట్టమొదటి గజరాజము. తెల్లని మేఘపుకాంతి కలిగి నాలుగు కోరలు గలదియై శ్రీమంతమైనది ఐరావత గజము, నీటిలో పుట్టినది, ఒకే మూలము కలది, బంగారు వన్నెగలది, ఆఱుదంతములు కలదియు అయిన ఆ భద్రగజమునకు ఔపవాహ్యుడైనవాడు బలుడు, అతనికి పుత్రులు అంజనుడు, సుప్రతీకుడు, వామనుడు, నాలుగవవాడు పద్ముడు అను నాలుగు ఏనుగులును, అభ్రము-అను అడ యేనుగుకు పుట్టినవి. వేగముగా పోవు నాలుగు దిగ్గజములను శ్వేతఅను ఆమె కనెను. భద్రుని, మృగమును, మందుని, సంకీర్ణుని ఈ విధముగ నలుగురు సుతులను కనెను. సంకీర్ణుడైనప్పటికిని అంజనుడు యమునకు వాహనము. సుప్రతీకమను భద్రగజము వరుణుని దిక్కునకు వాహనమైనది. తెల్లనిదై మందమైన పద్మము అను గజము ఐల విలునకు (ఉత్తరదిగధిపతి) కుబేరునకు వాహనమైనది. పద్మోత్తరమైన పద్మగజము వరుణ గణ రూపము. అది ఉపలేపన మేష రూపము. దానికి ఎనమండుగురు పుత్రసంతతి. దాని వంశమున ఉన్నత భావము గలవై, తెల్లని తోకలు గోళ్లును కలిగి గోరోజన వర్ణము గలిగిన శరీరము గల మతంగజములు పుట్టును. ఆ మతంగజములను తక్కిన నాగములను క్రమముగా చెప్పెదను. కపిలము పుండరీకము అను గజములు పుట్టినవి. అవి పుష్పకాంతి గలవి, రథంతర రూపములు (రధంతరసామమున పుట్టినవి). ఆ రెంటికిని సుప్రతిష్ఠ- ప్రమర్ద నములను రెండు గజములు పుట్టినవి, ఆ గజములు-శూలరూపములు, స్థూల ములు, శిరములతో తమింపచేయునవి శుద్ధమైన తోకలు, గోళ్లును గలవి, బలవంతములు, శక్తిమంతములై ఆకులికములైన గజములు అనబడినవి. పుష్పదంతమై, బృహత్సామమై షడ్డంతమై, దంతపుష్పవంతమై, తామ్రవర్ణమైన గజము పుట్టెను. దాని పుత్రుడు సహచారియై కొమ్ములుకలవాడు పుట్టును. ఈతని వంశమున వ్రేలాడు పెదవులు కలిగి, చూడ ఇంపైన శరీరములు కలిగి, నల్లనివి, అందమైనవి, భయంకరమైనవి, అనేక అలంకారములతో విశాలమైన ముఖములు కలిగినవియునైన గజములు పుట్టును. వామ దేవమను గజము కాటుకవలె నల్లనైనది. వామనమను గజము సామము (వేదము) నుండి పుట్టినది. దాని భార్య అంగద. దానికి నీలవంతము లక్షణము అనునవి పుత్రులు. భయంకరములైన తలలు మెడలు గలవియు, విశాలమైన వక్షస్థలములు కలవియు, వేగవంతములైనవియు, నరులచే బద్ధములైన వికారము చెందిన గజములు పై వాని కులములో పుట్టును. సుప్రతీక గజము రూపములో దీనికి సాటియైన గజము లేదు. దానికి-ప్రహారి, సంపాతి, పృథువు- అను మూడు గజములు చిత్తిసుతులుగా పుట్టినవి. అతని వంశముననే మృదువునకు పుట్టినవిగా పొడవైన దవడలు పెదవులును కలవియు, చక్కగా వేరైన శిరము ఉదరమును కలవియునైన మతంగజములు పుట్టినవి. అంజనము నుండి అంజనయు, సామము నుండి అంజనావతియు పుట్టినవి. ఇట్లే వారి తల్లియు, ప్రథితాయువు, అను ఇద్దరు అజుని పుత్రులు జన్మించిరి. అతని వంశముననే పెద్దగా విభజింపబడిన శిరస్సులు గలిగి, దట్టమైన మేఘములతో సమానమై, అందమైనవై చక్కని ఆకారములు గలిగి, పద్మము వంటి నాభిస్థానములు కలవియు, అంతటను గుండ్రముగా ఉన్నవై, బలిసినవియు, పచ్చని విశాలమైన ముఖములు కలవియు అయిన గజములు పుట్టినవి. చంద్రుని సామము నుండి కలువకాంతిగల పింగల (దిగ్గజముల యొక్క భార్య) జన్మించెను. ఆ పింగళకు మహాపద్మ, ఊర్మిమాలినులను రెండు గజములు పుట్టినవి. సమునకు వరము ఇచ్చునవి, భయంకరములైనవి, మిక్కిలి పెరిగిన బలము ఉదరమును కలవియునైన నాగములను (గజములను) గజయుద్ధ ప్రియములు. దేవతలు దేవాసుర యుద్ధమున జయము కొరకై ఈ గజములను గ్రహించిరి. యుద్ధమున కృతార్థులై దేవతలు వదలగా పూర్వోక్తములైన గజములు దిక్కులకు పోయినవి. వీనియొక్క వంశమున పుట్టి వినయవంతములైన గజములను దేవతలు అంగునకును, లోమపాదునకును, సూత్రకారునకును ఇచ్చిరి. రెండు దంతములతో ద్విరదములు అనబడినది. తుండహస్తము వలన హస్తి, కరమొక్కటి ఉన్నందున కరి, వరించుట వలన వారణము, దంతములు (రెంటి)తో దంగి, గర్జించుట వలన గజము, పొదలలో చరించుటచే కుంజరము, నగ (పర్వత) విరోధమున నాగము, మతంగముని వలన పుట్టుటచే మాతంగము. రెండింటితో (నోటితోను తొండముతోను) నీరు త్రాగుటచే ద్విపము అనబడినది. సామగానమున పుట్టుటచే సామజము-(ఇది గజ పర్యాయనామ నిర్వచన క్రమము) ఈ ఏనుగుల నాలుక వెనుకకు తిరిగి అంటి పెట్టుకొన్న ట్లుండుట అగ్ని శాపమువల్ల కలిగినది. తనను సింహాదుల నుండి రక్షింపని బలము ఉండియు, వృషణములు గూఢముగా ఉండుటయు ఈ రెండును ఏనుగునకు స్వయముగా భూసుర శాపమువలన కలిగినవి. దిగ్గజములచేత దేవదానవ గంధర్వులును, పిశాచ-ఉరగ–రాక్షసులును నానాప్రాణులును తరువాత గజములును కన్యలందుపుట్టిరి. సూర్యుడే రాజయిన ఈ గజములు చక్కగా పుట్టుటయు, బహుళముగా పుట్టుయు, నామముల నిర్వచనమును చక్కగా తెలుసుకొనవలెను. కౌశికాదులు సముద్రమునుండియు, తరువాత గంగ నుండియు పుట్టినవి. ఏకమూలమైన అంజనము నకు ప్రాచ్యము నుండి (తూర్పు నుండి) నాగవనము కలదు. వింధ్యకు ఉత్తరమునను, గంగకు దక్షిణమునను, గంగయొక్క ఉద్ద్భేదము నుండి కరూషముల వరకు సుప్రతీక గజము యొక్క వనము కలదు. పశ్చి మముగా ఉత్కలము నుండి వేది వరకు ఐదవది, ఏకభూతాత్మకుడైన ఈ వామన గజము యొక్క వనము అనబడినది. పశ్చిమముగా లౌహిత్యమై (ఎర్రనిదియు) సింధు పర్యంతము ఉన్న వనము యమగజవనము అనబడును. అది పర్వతమును అనుసరించియే ఉన్నది. భూతి (అను గజము) ప్రభువైన రుద్రుని యొక్క అనుచరులైన భూతములను కనెను. వారు స్థూలులు, కృశులు, పొడగరులు, పొట్టివారు, చిన్నవారు సములును, వ్రేలాడు చెవులవారు, వ్రేలాడు పెదవులవారు, పొడవైన నాలుక, స్తనములు, ఉదరములు కల వారును, ఒక్కరూపము కలవారు, రెండు రూపములుకలవారును వ్రేలాడు పిరుదులు కలవారును, లావైన పిండాకారములైన పిరుదులు కలవారును, సరోవర సముద్రాది నదులు ఇసుకతిన్నెలపై ఉండువారును, నల్లనివారును, తెల్లనివారును, నీలమువారును, శ్వేతము వారును, లోహితారుణులును, బభ్రు (బూడిద) వర్ణమువారును, చిత్రవర్ణము వారును, పొగవర్ణము వారును, కద్రు (గోరోజనము) వర్ణము గలవారును, గాడిదవలె భయంకర వర్ణము గల వారును, దర్భలవంటి గరుకైన వెంట్రుకలవారును, హృషీ కేశులును (ఇంద్రి యాధి పతులును), సర్పములు యజ్ఞోపవీతములు కలవారును, విస్పష్టములైన కన్నులు కలవారును, ఒకేకన్ను కలవారును, పెక్కుతలలు కలవారును, తలలేని వారు, ఒకే తల కలవారును, మొత్తము తలయేగలవారును, చందులు, వికటులు, రోమములు లేని వారును, రోమములు నిండినవారును, అంధులు, జడలు కలవారు, కుంజులు, హేషక వామ నులును, సరోవర సముద్రాది నదీపులినములందు ఉండువారును, ఒక చెవిగలవారు, పెద్దచెవులు గలవారు, శంకువు వంటి చెవులు గలవారు, చెప్పులు లేనివారు, కోరలు గల వారు, గోళ్లు గలవారు, పండ్లులేనివారు, రెండు నాలుకలు గలవారు, ఒక చేయి గలవారు రెండు చేతులు గలవారు, మూడుచేతులు గలవారు, చేతులు లేనివారు, ఒక పాదము గలవారు, రెండు పాదములవారు, మూడు పాదముల వారు, బహుపాదముల వారు, మహా యోగులు, మహాసత్త్వులు, సుతులు వంటగాగలవారు, మహాబలులు, అంతటను గానమును ప్రతిఘటించువారు, బ్రహ్మజ్ఞులు, కామరూపిణులు, భయంకరులు, క్రూరులు, పవిత్రులు, శివులు, పుణ్యులు, చక్కగా మాటాడువారు, దర్భలు చేతకలవారు, పెద్ద నాలుక కలవారు పెద్ద చెవులు, పెద్దనోరును కలవారు, చేతులు తినువారు, ముఖములు తినువారు, శిరమును తినువారు, కపాలమును ధరించినవారు. ధనువులు కలవారు, ముద్గరములు ధనముగా కలవారు, ఖడ్గ శూలములు ధరించువారు, మంటలతో ఉన్న ముఖములు, మంటలుకల కన్నులును కలవారు, చిత్రమైన మాలలు లేపనములు కలవారును, అన్నము తినువారు, మాంసము తినువారు, బహురూపులు సురూపులు, రాత్రిచరులు సంధ్యాచరులు, ఘోరులు, ఒకప్పుడు సౌమ్యులు, దివాచరులు, నక్తంచరులు, చూచుటకు అలవికాని వారు-ఇట్టి భయంకర నిశాచరులను ‘భూతి’కనెను. పరత్వమున భయము దైవము. వారందరు గతమనస్కులైరి. వీరికి భార్యలేదు, పుత్రులు లేరు. వారు అందరును ఊర్ధ రేతస్కులు. ఆత్మయోగులైన భూతములు లక్షలుకలవు. ఈ మహాత్ములు అందరు భూతియొక్క పుత్రులు. కపిశ వర్ణముగల కూష్మాండి కుష్మాదులను కనెను. మరల కపిశ వర్ణముతోడనే పిశాచ మిథునములను కనెను. కపిశ వర్ణముగలవారు అగుటచే వారు అందరు పిశాచులు, మాంసాహారులును మరి పదునారు జంటలలో ఉన్నవారు ఆ వంశమువారు. ఆ వంశీకులై పురుషులను తినువారిని పేరులతో చెప్పెదను. ఛగలుడు, ఛగలి, వక్రుడు, వక్రముఖి, ఈ విధముగా పదునారు గణములు కలవు. సూచి - సూచీ ముఖుడు, కుంభపాత్రుడు-కుంభి వజ్రదంష్ట్రుడు, దుందుభి, ఉపచారుడు, ఉపచార, ఉలూఖలుడు, ఉలూఖలి, అనర్కడు, అనర్క, కుఖండుడు, కుఖండిక, పాణిపాత్రుడు, పాణిపాత్రి, పాంశువు, పాంశుమతి, నితుండుడు, నితుండి, నిపుణుడు, నిపుణ, చలాదుడు, ఛలాద, ఉచ్ఛేషణుడు, ఉచ్ఛేషణ, ప్రస్కందుడు, స్కందిక ఈ విధముగ పదునారు, పిశాచుల పదునారు గణములు చెప్పబడినవి. అజాముఖులు, వక్రముఖులు, పూరిణులు, స్కందినులు, విషాదాంగారికులు, కుంభపాత్రులు, ప్రకుందకులు, ఉపచారులు, ఉలూఖలికులు, అనర్కులు, కుఖండికులు, పాణిపాత్రులు, నైతుండులు, ఊర్ణాశులు, నిపుణులు, సూచీముఖో చ్ఛేషణాదులు అని ఈ కులములు పదునారు. ఈవీరు కూష్మాండుల అభిజాతులు అనగా వంశమువారు.

వారు పిశాచులని తెలుసుకొనవలెను. వారు సుకల్పులను వారు. వికృతమైన ఆచారము గల భీభత్సుని పుత్ర పౌత్రులతో అనంతుడైనవానిని కనిరి. కావున ఆ పిశాచుల లక్షణమును వినుడు. సర్వాంగములలో వెంట్రుకలు కలవారు, గుండ్రని ముఖము కలవారు, కోరలు కలవారు, గోళ్లు గలవారు, అడ్డముగా పోవువారు, పురుషులను తినువారు అధోముఖులైనవారు-ఆ పిశాచులు. కేశములు లేనివారు, రోమములు లేనివారు, త్వక్కే (చర్మము) వసగా కలవారు, చర్మమే వస్త్రముగా కలవారు - వీరు కూష్మాండికులైన పిశాచులు. వారు నూవులు తినువారు, ఎల్లప్పుడు మాంసము కలవారు. వంకరయైన చేతులు, కాళ్లు కలవారు, వంకర శీలముతో వచ్చువారు. వంకరగా పోవువారు, కామ రూపులు అయిన వారు వక్ర పిశాచులు. వ్రేలాడు పొట్ట గలవారు, తొండము ముక్కుగా కలవారు, పొట్టి శరీరము, తల భుజములను కలవారు. వీరు నితుందక పిశాచులు. తిల భక్షకులు, చెవులు ప్రియమైనవారు, పొట్టి ఆకారము కలవారు, వదరుబోతులు, గంతులు వేయుచు పోవువారు, వారు అనర్కమర్కులు అను పిశాచులు, వృక్షమునందు వసించువారు, ధనప్రియులును, ఊర్ధ్వ బాహువులు కలవారు, పైకి నిక్కిన రోమములు కలవారు, ఉన్నత వృక్షములు ఆలయముగా కలవారు, అంగముల నుండి ధూళికణములను విడుతురు. కావున వీరు పాంశువులు అను పిశాచులు. ధమనులు (పెద్దనరములు) ఇష్టమైనవారు, ఎండినట్లుండు వారు, మీసములు కలవారు, నారచీరలు ధరించువారు, శ్మశానమున నివసించు వీరు ఉపవీరులైన పిశాచులు. రెప్పపాటు లేక నిలచిన కండ్లు గలవారు, పెద్ద నాలుక గలవారు, నాకుచుండువారు, పైకెత్తిన నోళ్లు గలవారు, ఏనుగువలెను, ఒంటెవలెను లావైన తలలు గలవారు, విరతులు గుండ్రముగా చేసిన పిండమువలె ఉండువారు. వీరు కుంభపాత్రులు అను పిశాచులు. కనబడని అన్నములను భుజింతురు. సూక్ష్మ రూపులు, వెంట్రుకలు కలవారు, గోరోజన వర్ణము కలవారు. వీరు కనబడుచు కనబడకుండుచు తిరుగుదురు. ఆయుక్తులై నిపుణులైన ఆ పిశాచులు ఇచట ప్రవేశింతురు. వీరు చెవుల వరకు చీరియున్న నోళ్లు కలవారు. పొడవైన కనుబొమ్మలు లావైన ముక్కు కలవారు. చేతులతోను పాదములతోను ఆక్రమించిన గణములు కలవారు, పొట్టివారు, భూమియందే దృష్టి కలవారు, బాలుర తినువారు అయిన పిశాచులు. కాన్పు జరిగిన ఇంటిని పట్టుకొని సేవించువారు, వెనుక వైపునకు చేతులును, పాదములును గలవారు, పొట్టివారు, వాయువేగులు మాంసమును తినువారు అయిన ఆ పిశాచులు యుద్ధమున రక్తము త్రాగువారు. నగ్నులు (వస్త్రములు లేనివారు), ఇల్లు లేనివారు, పొడవు వెంట్రుకలు గలవారు, పిండాకారమువారు అయిన పిశాచులు స్కందినులు, తక్కినవారు ఊపిరిని తినువారు. ఇవి పిశాచులయొక్క పదునాఱు జాతులు. ఈ విధముగ పిశాచులను దీనులనుగను, అల్పచేతస్కులుగను జూచి, బ్రహ్మ కారుణ్యముతో వారికి వరమొసంగెను. అంతర్ధానమును (మాయమగు శక్తిని), కామరూపత్వమును, ప్రాతః సాయంసంధ్యలలో చరించుటను, భగ్నములు, శూన్యములు, అల్పజనములు కలవియు, విధ్వంసము చేయబడినవి, అనాచారులుగా ఉన్నవి, చక్కగా అలుకబడనివి, పసుపు కుంకుమ మొదలగు వానిచే సంస్కారము చేయబడనివియు అయిన ఇండ్లు, రాజమార్గమునకు ఉండు మార్గములు, నిష్కంఠములు (మిక్కిలి దుష్టములు) చత్వరములు (నాలుగు దారులు కలిసిన చోటు), ద్వారములు, కోట బురుజులు, మమత్వము లేనివి, సంక్రమించినవి, పథములు, నదులు, తీర్థములు, చైతన్య వృక్షములు (రచ్చచెట్లు), మహాపథములు, వీటన్నింటి స్థానములలో అంతటను పిశాచములు ప్రవేశించి ఉండును. పై వారందరు అధార్మికులు, వర్ణాశ్రమములు, సంకరికులు, కారువులు, శిల్పజనులును, దేవతలచే జీవన ఆధారములుగా చెప్పబడినవి. అమృతముతో సమానమైన బలముగల చోరులు, విశ్వాస ఘాత కులునైన వారి యొక్కయు యనేక దుష్టోపాయములచేత ఆర్జింపబడిన ధనములచేత ఆరంభింపబడిన పనులలో పిశాచులే దేవతలు. మధుమాంసములతో కూడిన అన్నములచేతను, పెరుగుచేతను, నువ్వులపొడి, కల్లు, సారాయిల చేతను, పసువు యొక్క కృశరముల యొక్కయు ధూపములచేత తిలలతో భద్రమైన గుడాన్నములచేత పిశాచులు భుజింతురు. నల్లని వస్త్రములు, ధూపములు, పూవులు - వీనితో కూడిన మంచి బలులు పర్వసంధులలో పిశాచులకు అనుమతించి అధిపతియైన ఆ బ్రహ్మ పై వరములను ఇచ్చెను. సర్వభూత పిశాచములయొక్క శూలపాణియైన గిరీశుని (శివుని) చూచి భామిని వ్యాఘ్రములను, సింహములను పుత్రులనుగా కనెను. ఆమెకు ఏనుగులును, మాంసమును తిను వ్యాలేయులును, ఋషులును, సుతులు, మొత్తముగాగల ప్రజాసృష్టిని వినుడు. ఆమెకు ఐదుగురు కూతుళ్లు. వారి పేరులను వినుడు. వారు మీన, మాత, వృత్త, పరివృత్త అను వారలు. వారి సంతానమును గురించి వినుడు. సహస్ర దంతములుగల మొసళ్లు, రాగివలె ఎఱ్ఱనైన కొఱ్ఱ చేపలు - ఈ మొదలుగాగల గణము విస్తీర్ణమైనది. గ్రాహములు (మొసళ్లు) నాలుగు విధములు. అవి జ్యేష్ఠుని అనుసరించినవి. మాతనిష్కులను శిశుమారులను సంతానముగా కనెను. వృత్తయను ఆమె బలచారులయొక్క అనేకములైన తాబేళ్ల రకములను కనెను. అట్లే నైశకుడు అనేకములైన శంఖముల రకములను పుట్టించెను. అనువృత్త కప్పల రకములను కనెను. అట్లే పరివృత్త అను ఆమె తేళ్ల రకములను, శంబూకముల (కప్ప చిప్పల) రకములను కనెను. పరివృత్త అను ఆమె ముత్యపు చిప్పల రకములను, గవ్వల రకములను, శంఖముల రకమును కనెను. కాలకూట విషపు రకములను జలసమూహ ముచే ఏర్పడిన వానిని గూడ పరివృత్తయే కనెను - ఇది ఋషియొక్క వంశము. దానికి అయిదు శాఖలని పైవిధముగా చెప్పబడినది.

మొట్టమొదటి బహుళమైన వంశవిస్తరము పశుపక్ష్యాది తిర్యగ్జంతువులది. వాని వలన చెమట నుండి పుట్టుట మొదలగు వికారములు గల ప్రాణులు పుట్టును. కోకిల శరీరముల నుండి ఉత్పాదకములైన (పుట్టించునవైన) పక్షులు పుట్టును. మనుష్యులు, స్వేదమలమున పుట్టునవి - ఉశనములను జంతువులు, అనేకములైన చీమల గణములు, పాదములు కట్టియున్న కీటకములు, శంఖములు, రాళ్లు వీని వికార రూపములు, కీలకము వలె తిరుగునవి - ఇట్టివి అనేకములు చెమట వల్ల పుట్టు పార్థివగణములు. అట్లే, ఎండ వేడిమి మొదలగు వానిచే వేడెక్కిన నీటినుండియు, వర్షముల నుండియు, మృగ శరీరముల నుండియు - ఈ అనేక జంతువులు పుట్టును. మీనకములు, పిప్పలములు (బాతులు), దంశములు (దోమలు), తిత్తిరి పుత్రికలు, నీలచిత్రములు, బహువిస్తరములైన అలకలును పుట్టును. జలమున పుట్టునవియు, చెమటలో పుట్టు నవియు అయిన ఈ జంతువులు పుట్టును. కాశము నుండి అంజకములు, కీటనలదములు, బహుపాదములు గలవియు, సింహలములు, రోమలములు, పిచ్ఛిలములుగా చెప్పబడినవి. ఇవి మొదలైనవి జలజమును స్వేదజమునైన గణము. మినుములు, పెసలు వీని యొక్క జలముల నుండియు, నేరేడు, బిల్వము, మామిడి, పోక పలముల నుండియు జంతువులు పుట్టును. పెసళ్ల నుండియు, పనసముల నుండియు, బియ్యము నుండియు, అట్లే తొఱ్ఱలలో ఎండిన వాని నుండియు, అచట ఉండిన వాని నుండియు జంతువులు పుట్టును. వరుసగా చెట్లకు వివిధములైన నల్ల ఈగలుపుట్టును. అట్లే ఎండిన (వృక్ష) వికారముల నుండి పుత్రికలు పుట్టును. నూర్ల కాలికల నుండి అంతట పాములు పుట్టును. చెమట నుండి పుట్టు తేళ్లు ఎండిన ఆవుపేడ నుండి పుట్టును. ఓ ప్రభో! గోవుల నుండి దున్నపోతుల నుండియు జీవ జంతువులు పుట్టును. అనేక విధములైన మత్స్యములు మొదలగునవి. విశేషించి అండము యొక్క పొట్టనుండి పుట్టును. చైవీరికములు, గోజా కులములును తక్కిన సూక్ష్మములైన జలాకాది అనగా జలగ మొదలైన (జలజంతు) జాతులును పుట్టును. ఇక ఇతరములైన ఈగల రకములైన జాతులుగూడ పుట్టును. ఇవి సామాన్యముగా ఉమ్మి నీటి బురదలో ఉండును. దోమల రకములును, తుమ్మెదల రకములును గడ్డినుండియే పుట్టును. అవి - పుత్రికలు, పుత్రభాసకులు, మణిచ్ఛేదములు, సవ్యాలములు (సర్పములు), పోతజములు అనబడినవి. శతవేరి రకములు ఏరుపిడుకల నుండి పుట్టును. ఇంకను లెక్కలేనన్ని స్వేదజ (చెమటవల్ల పుట్టిన) గణము సంగ్రహముగా నాచే చెప్పబడినది. ఇది పూర్వజన్మ కర్మ వశమున కలుగునని చెప్పబడును. అట్లే ఇతరములైన నిర్ఋతికి పుట్టిన ప్రాణులు ఉపసర్గజములుగా చెప్పబడినవి. యోని నుండి పుట్టిన కొన్ని పవిత్రములు, కొన్ని ఔత్పత్తికములు అనబడినవి. సామాన్యముగా దేవతలందరు ఉపపత్తిజులుగా తెలియతగినవారు. కొందరు యోని నుండి పుట్టిన దేవతలు, కొందరు నిమిత్తము లేకయే పుట్టినవారు. తూలాలాఘుడు, కోలుడు, కన్యయైన శివయు, సరమ యొక్క సంతానము. సరమాదులు గణములు. శ్యాముడు, శబలుడు, అర్జునుడు, హరితుడు, కృష్ణుడు, ధూమ్రారుణుడు, తూలాలాఘుడును కద్రుకులు. సురస నూరు తలలను కలిగినదని అందరి సమ్మతము. సర్పములకు తక్షకుడు రాజు. నాగులకు వాసుకి రాజు - ఈ గణము తమోబహుళము, క్రోధవశమైనది. ఇది పులహుని సంతానసృష్టి. తామ్ర వల్ల కలిగిన సంతాన సృష్టిని వినుడు. తామ్రకు వేరుగా మిక్కిలి ప్రసిద్ధి చెందిన వారు పెక్కురు పుట్టిరి. శ్యేని, భాసి, క్రౌంచి, ధృతరాష్ట్రి, శుకీ - అనువారు వారిలో కొందరు - అరుణుని భార్య శ్యేని వీర్యవంతములు మహాబలిష్ఠములునైన పక్షిశ్రేష్ఠముల రెండిటిని కనెను. వారు సంపాతి, జటాయువు అను వారు. సంపాతి ఒక్క పుత్రుని, ఒక కన్యకను కనెను. జటాయువు పుత్రులు, కాక - గ్రుధ్ర - అశ్వకర్ణులు. గరుత్మంతుని భార్యలు: భాసి, క్రౌంచి, శుకి, ధృతరాష్ట్రి, భద్ర - అనువారు. వారిలో గరుత్మంతునకు కలిగిన సంతానము చెప్పబడుచున్నది. శుకి గరుత్మతంతునకు ఆరుగురు పుత్రులనుకనెను. వారు ప్రసిద్ధులు. వారు సుముఖుడైన త్రిశిరుడు, బలుడైన పృష్ఠుడు, మహాబలుడైన త్రిశంఖ నేత్రుడు, సురూపుడు, సుముఖుడు, బలుడైన సురసుడు - అనువారు. ఈ మహాత్ములైన గరుడుల యొక్క పుత్రులు, పౌత్రులును పదునాలుగు వేలు. వారు క్రూరులు పాములను తినువారు. వారి పుత్ర పౌత్ర సృష్టి వలన వారి వంశము విస్తరించినది. వారిచే వ్యాపించిన దేశములను వరుసగా చెప్పెదను. మొత్తము శాల్మలీ ద్వీపము, దేవకూటము అను పర్వతము, మణి మంతము అనుపర్వత రాజము, సహస్రశిఖర పర్వతము, వర్ణమాలము, సుకేశము, శతశృంగము - అను పర్వతము, కౌరజము, పంచశిఖరము, హేమకూటము అను పర్వతము. ప్రచండ వాయువులచే ఏర్పడి ప్రకాశించిన పద్మరాగమణులుగల మహాత్ములైన గరుడ వంశీకులచేత పై పర్వత సమూహములు అన్నియు వ్యాపించి ఉన్నవి. ఇక భాసీపుత్రులు, భాసులు, గుడ్లగూబలు, కాకులు, కోళ్ళు, నెమళ్లు, ఊర పిచ్చుకలు, పావురములు, లావుకపిట్టలును, తిత్తిరి పక్షులును - వీరిని కనెను. క్రౌంచి వార్ధీణసములను కనెను, శ్యేని గోరువంకలను, బెగ్గురు పక్షలను, కొంగలను ఇవి మొదలుగాగల ఇతర మాంసాహార పక్షులను కనెను. ధృతరాష్ట్రి హంసలను, కలహంసలను, భామిని చక్రవాక పక్షులను ఆకాశమున పోవు సమస్త పక్షులను కనెను. వీళ్లను అనంతమైన పుత్ర పౌత్ర సంతతి కలవారుగా కనెను. గరుడునకు ఇరయందు పుట్టిన సంతానమును వినుడు. ‘ఇర’ కమలముల వంటి కన్నులు గల మువ్వురు కన్యలను కనెను. వనస్పతులైన వృక్షములకును తీవలకును తల్లులు - లత, వల్లి, వీరుధ - అనువారు. లత వనస్పతులను కనెను. అట్లే పుష్పఫలములతో కూడిన వృక్షములనుగూడ కనెను. ఇక వల్లి - పొదలను కనెను. వీరుధ – త్వక్ సారములైన గడ్డి జాతులను వాని సంతానమును గనెను. ఈ వంశము ఇక్కడ సమాప్తి చేయబడుచున్నది. వీరును, ఇవియును కశ్యప మహర్షికి పుట్టిన స్థావర జంగమములు. వీరి పుత్ర పౌత్రులచేతనే ఈ జగమంతయు నిండినది. ఇట్లని సృష్టిలో ఒక భాగము నాచేత చెప్పబడినది. ఈ మరీచి మహర్షి పుత్రుడు కశ్యపునకు సంబంధించిన ప్రజాసృష్టి, సంగ్రహముగా చెప్పబడినది. ఓ బ్రాహ్మణులారా! నూరేండ్లవరకైనను దీనిని విస్తరముగా చెప్ప సాధ్యపడదు. కశ్యపుని భార్యలలో అదితి ధర్మశీల, దితి బలశీల - అని అందురు. సురభి తపఃశీల, దనువు, మాయాశీల అని చెప్పబడినది. కద్రువ క్రూరశీల, క్రౌంచి శ్రుతిశాలిని అనగా వేదజ్ఞానముకలది. ఇర గ్రహణశీల. దనాయువు భక్షణ ప్రియ. వినత వాహశీల (భారవ హనశీల). తామ్ర పాశశాలిని. ఇవి అంతటను కనబడు లోకమాతలయొక్క స్వభావములు. వీరు ధర్మముతోను, శీలముతోను, క్షమతోను, బలరూపములతోను రజః సత్త్వతమో గుణములతో ఆవరింపబడినవారై ధార్మిక, అధార్మికులు అగుదురు. కశ్యపునకు పుట్టిన సంతానము (ప్రజలు) తల్లితో సమానులై పుట్టిన వంశమును పెంచిరి. వారు దేవతలు, అసురులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు, పిశాచులు, పశువులు, మృగములు, పక్షులు, తీగలుగా అయిరి. మానుషులైన దక్షుని సంతానములందు వీరు పుట్టి నందున మన్వంతరములలో మానుషులైతే శ్రేష్ఠులు, ధర్మ, అర్థ, కామ, మోక్షములలో మానుషులు సాధకులు. తరువాత అధః స్రోతసులే (క్రిందుగా వీర్యమును స్రవించువారు) గానీ (ఊర్ధ్వరేతస్కులు కారు). సురాసురులు పుట్టుదురు. కార్యసిద్ధి కొరకు మాటి మాటికి మానుషులలో పుట్టుదురు అని ఈ విధముగా తపస్వుల (మునుల) వంశ ప్రభవము పుట్టుక ప్రకర్షముగా చెప్పబడినది. సురులయొక్కయు, అసురుల యొక్కయు, గంధర్వుల యొక్కయు, అప్సరసల యొక్కయు, యక్షుల యొక్కయు, రక్షస్సుల యొక్కయు, పిశాచుల యొక్కయు, గరుడుల యొక్కయు, ఉరగుల యొక్కయు, పక్షుల యొక్కయు, వ్యాలము (సర్పము)ల యొక్కయు, నెమళ్ల యొక్కయు, ఓషధుల యొక్కయు, పురుగుల యొక్కయు, కీటకముల యొక్కయు, పక్షుల యొక్కయు, క్షుద్రములైన జల జంతువుల యొక్కయు, పశువుల యొక్కయు, శ్రీమంతులైన బ్రాహ్మణుల యొక్కయు, పవిత్ర లక్షణము వినదగినది. వారి ఆయుష్యము శ్రీమంతమై, ధనవంతమై, సుభావహమైన వారి జీవనము అసూయ లేకుండా ఎప్పుడును వినదగినదియు గ్రహింపదగి నదియు అయినది. ఈ వంశమును నియమముతో మహాత్ములైన బ్రాహ్మణ వైద్యసభలో చదివినవాడు చక్కని పుష్కలమైన సంతాన లాభమును, శ్రీని, ధనమును పొందును. మరణించిన తరువాత శోభనమైన గతిని కూడ పొందును. (8)