ప్రతిసంధి వివరణ - ఉపోద్ఘాత పాదము

ఇట్లు ప్రక్రియా అను మొదటి పాదము కీర్తింపబడినది. దానిని విని సంతోషముతో నిండిన మనస్సు గలవాడై, కాశ్యపేయ మహర్షి, సూతుని సంబోధించి, తరువాతి గాథను చెప్పుమని కోరెను. కల్పములను ఎరిగిన ఓ మహర్షీ! మాకు ఇప్పుడు గడచిన కల్పమునకు, గడచుచున్న కల్పమునకు మధ్యగల కాలము (ప్రతిసంధి)ను గూర్చి చెప్పుము. మాకు ఈ ప్రతిసంధినిగూర్చి తెలుసుకొనవలెనను ఇచ్చ కలదు నీవు దీనిని వర్ణించుటలో నిపుణుడవు అని వినతి చేయగా....

లోమహర్షణుడు ఇట్లు పలికెను:

ఈ యజ్ఞశాలలో మీకు నేను గడిచిన, గడుచుచున్న కల్పములకు మధ్యగల ప్రతిసంధిని వివరించెదను. గొప్ప యజ్ఞమును చేయుచున్న ఓ ఋషులారా! ఏయే కల్పములలో ఏయే మన్వంతరములు గలవో చెప్పెదను. ప్రస్తుతము గడచుచున్న మంగళ ప్రదమగు వారాహ కల్పమును గురించి కూడా చెప్పెదను. ఈ కల్పమునకు పూర్వమందలి కల్పమును, దానికి దీనికి మధ్యగల కాలమును గురించి తెలుసుకొనుడు.

పూర్వకల్పము పూర్తికాగానే ప్రతిసంధి, మరియు తరువాతి కల్పము జనలోకము నుండి మరల మరల ప్రవర్తిల్లును. ఒక కల్పమునకు మరియొక కల్పముతో సంబంధమును కలుపు కాలము, ప్రతిసంధి అనబడును. కల్పము పూర్తికాగానే సర్వకర్మలు అంతము అగును. ఒక కల్పమునకు మరియొక కల్పముతో సంబంధమును కలిపు ప్రతిసంధియే గాక, మన్వంతరములకు, యుగములకు మధ్యకూడా సంధులు గలవు. వాటి యందు కూడా కర్మలు అంతమగును. ప్రక్రియా పాదములో సంగ్రహముగా చెప్పబడిన కల్పములు మన్వంతరములతో, యుగములతో కూడి ప్రవర్తిల్లుచుండును. బ్రహ్మ యొక్క ఆయుర్దాయముపరము. దానిలో సగము పదార్ధము. మొదటి పదార్ధములోని అంతిమ కల్పము గడచినది. ఓ ద్విజులారా! ద్వితీయ పదార్ధములోని మొదటి కల్పము ప్రస్తుతము నడచుచున్నది. మిగిలిన కల్పములు క్రమముగా రాగలవు. పూర్వ పదార్ధము, ద్వితీయ పదార్ధము కలిసి పరము అగును. ఇంతవరకు స్థితి కాలము, తరువాత ప్రళయము సంభవించును. వేయి మహాయుగములు, పదునాల్గు మన్వంతరములు కల పూర్వకల్పము గడచిపోయినది.

అప్పుడా కల్పము క్షీణించి దాహకాలము వచ్చినది. అప్పుడా కల్పమున దేవతలు వైమానికులై యుండిరి. నక్షత్ర గ్రహతారలు, చంద్ర సూర్య గ్రహములును, సుకృతాత్ములు (పుణ్యాత్ములు) ఇరువది ఎనిమిది కోటులును ఉండిరి. అట్లే ఒక మన్వంతరమునను పదు నాలుగు మన్వంతరములలోను మూడు వందల కోటులును ఒక కోటి తొంబది రెండును, ఏడు వందల ఎనిమిది వేలును ఉండిరని పూర్వము స్మరింపబడినది. వైమానికులైన దేవతల కల్పము గడచిన తరువాతగూడ ఒక్కొక్క కల్పమున ఉన్న దేవతలుగూడ వైమానికులుగనే పరిగణింపబడిరి.

అంత పదునాలుగు మన్వంతరములలో స్వర్గమున దేవతలును, పితరులును, మునులును ఉండిరి. వారి సేవకులైన మనుపుత్రులును అట్లే వర్ణాశ్రమ ధర్మములు ఆచరించు వారిచే స్తుతింపదగిన దేవతలు కూడ ఉండిరి. మన్వంతరములలో దేవలోకమున నివసించు దేవతలు వారితో కలిసియున్న వారితో బాటు సంకలనమును (మొత్తముగా లెక్కింపబడిరి) పొందిరి. తుల్యనిష్ఠలుగల ఆ అందరు ‘ఆభూత సంప్లవము’ (పంచ భూతముల విప్లవము - ప్రళయము) రాగా, ఆ విప్లవములో వారి తంతు గూడ తప్పక జరుగునని తెలిసికొనిరి. ఆ విప్లవము రాగా ముల్లోకములలో ఉండు దేవతలు. ఉత్సాహము వీడిన దుఃఖముతో తాముండు స్థానములను వదిలి కలతచెందిన మనస్సులు గలవారై మహర్లోకమునకు పోవుటకు తలపెట్టిరి. వారు మహస్సులో ఉన్న శరీరములచే (చిన్న శరీరములచే) కూడుకొన్నవారై చక్కగా ఉన్నారు. వారందరు విశుద్ధితో నిండినవారై మానసీ సిద్ధిని పొంది ఉన్నారు. ఆకల్పవాసులతో బాటు మహా(న్) ఫలమును పొందినవారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సద్భక్తులైన అపరజనులును. ఆ పదునాలుగు దేవ సంఘములు మహర్లోకమును తలంచి (భావించి) ఉద్వేగము కలవారై జనలోకమునకు పోవుటకై తలపెట్టిరి. విశుద్ధితో నిండినవారై మానసీసిద్ధిని పొంది ఆకల్పవాసులతో బాటు మహా(న్) ఫలమును పొందిరి. పదిమారులు (మంత్రము) ఆవృత్తి చేత జనలోకము నుండి స్వస్తపోలోకమునకు పోవుచున్నారు. అచట పదికల్పములు ఉండి మరల సత్యలోకమునకు పోవుచున్నారు. కల్పవాసులు ఈ క్రమయోగముతో భూలోక, భువర్లోక స్వర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకములకు పోవుచున్నారు.

ఈ విధంగా ఒకరొకరి నుండి వేలయుగములు గడచినవి. తిరుగులేని స్థానమైన బ్రహ్మలోకము గూడ పొందబడినది. ఒక ఆధిపత్యముదక్క ఐశ్వర్యములో రూపములో స్థానములో మాత్రము వారు బ్రహ్మతో సమానులగుదురు. అచట వారు సంతోషముతో ఉందురు. బ్రహ్మతో మిక్కిలి కలిసియున్నందున బ్రహ్మానందమును పొంది, తరువాత బ్రహ్మతోసహ వదిలిపెట్టబడుదురు (ముక్తి చెందుదురు). వారు స్వయముగా ముందు ప్రాకృతముగ, తప్పనిసరిగా జరగబోవు అర్థమునందు నానా భావముతో సంబద్ధులైనపుడు తాత్కాల భావులగుదురు. మేలుకొనియున్న వానికి స్వరూపముతో జ్ఞానము బుద్ధి పూర్వము అగును. అట్లే వారి జ్ఞానము తాత్కాలభావియగును.

అభిసూక్ష్మములైన భేదముల యొక్క ప్రత్యాహారమునందు (ఉపసంహారమునందు) భిన్నముగా ఉండును. కార్యములు కరణములును వానితోబాటే సృజింపబడును. నానాత్త్వ దర్శనమువలన ఆ బహ్మలోక నివాసులకు వినష్టమైన స్వాధికారము గలవారికి స్వధర్మమున ఉన్న వారికిని (తాత్కాల భావియైన జ్ఞానము ప్రవర్తించును) వారైతే తుల్య లక్షణులు, సిద్ధులు, శుద్ధాత్ములు, నిరంజనులు. ప్రకృతిలో కారణాతీతులు, స్వాత్మలోనే ఉండువారు. సర్గము (సృష్టి) మరల జరుపబడగా మరల వారికి కారణమగును. తత్త్వదర్శులైన వారు ప్రాకృతమైన (ప్రకృతి సిద్ధమై పామరులు చేయునదైన) సంయోగమున యుక్తులు అగుదురు. ఈ లోకమునకు మరలరాని మోక్షమునందున్నవారు చల్లారిన జ్వాల మరల పుట్టనట్లు, ఇచట మరల పుట్టరు.

అంత ఆ మహాత్ములు త్రైలోక్యము నుండి ఊర్ధ్వమునకు వెళ్లిరి. వారితోబాటు మహర్లోకమునుండి జనులు రారైరి. వారు పోగా మిగిలినవారు కల్పమునకు దేహమును పొందుదురు. గంధర్వులు మొదలు పిశాచుల వరకున్న (దేవయోనులు దేవజాతులు) మనుష్యులు, బ్రాహ్మణులు మొదలగువారు, పశువులు, పక్షులును, కదలలేనివి (పర్వతములు) ప్రాకునట్టి పాములున్ను, వీరందరు భూమిపై ఉండువారై ఉండగా, ఇచట వేయియై (అనంతములై) భాసించు సూర్య కిరణములు ఏడుగానయి అందొక్కొక్క రవి (సూర్యుడు) పుట్టును.

క్రమముగా ఆ సూర్యులు (ఆకాశముపైకి లేచుచున్నవారై మూడు లోకములను దహించి వేయుదురు. జంగమమును (తిరుగువానిని) స్థావరమును (కదలక ఉండువారిని), నదులను, సమస్త పర్వతములను (దహించివేయుదురు). అందులో అవి ముందే వర్షము లేనందున ఎండిపోయినవి. సప్త సూర్యులచే (నిప్పంటి) పొగరాజినవి. అపుడు ధర్మా ధర్మాత్మకములైన ఆ సమస్త స్థావర జంగమములు సూర్య కిరణములచే దహించి పోయినవి.

తరువాత పాపయుగము పోయినపుడు దహించిన శరీరములుగలవారు శుభ పాశాను బంధముగల యాయోనిచే వదలిపెట్టబడనివారై (జనలోకమునకు) వెళ్ళిరి.

ఆ తరువాత ‘జన’ లోకమున జనులు సమానరూపులుగా ఒప్పిరి. వారందరు సర్వ పరిశుద్ధులు, మానసీ సిద్ధిని పొందినవారు. అచట ఒక రాత్రి ఉండి పుట్టుక తెలియని బ్రహ్మ యొక్క సృష్టిలో, మరల బ్రహ్మయొక్క మానస ప్రజలుగా పుట్టుదురు. ఆ తరువాత ఆ త్రైలోక్యవాసులు జనలోకములో ఉండగా, సప్త సూర్యులచే ఆ లోకములు దహింపబడగా, వర్షముచే భూమియంతయు వరదలు పారగా ఆలయములు అన్నియు ధ్వంసము కాగా, సముద్రములు మేఘములు భూమిపైన సమస్త జలములు, వీనికి సంబంధించిన జలములు అన్నియు కలిసి ఏక సముద్రముగా అయినవి. పైపైగా వచ్చు ఆ నీరు అధికమైనపుడు ఈ భూమిని అంతయు నీరు కప్పినది. అపుడా భూమి అర్ణవము (సముద్రము) అను పేరుగలదైనది.

ఎందువలననగా వ్యాప్తి దీప్తులలో (సూర్యకాంతులలో) ప్రకాశించుచున్న వైనను, (మనకు) ప్రకాశించుటలేదు. ఆ కాంతులలో గూడ అంతట నీరుపారి వాటిని కప్పివేయుచున్నది. ఆ నీరు భూమి అంతటను వ్యాపించుట వలనను, తనోతి ధాతువు విస్తారము అను అర్ధము చెప్పుటచేతను, అవి (కాంతులు) అమ్భస్తనువులని (నీరు శరీరముగా కలవి అని) స్మరింపబడుచున్నవి. ‘అర’మన్నది శీఘ్రము అను అర్థమున నిపాతముగా కవులు చెప్పినారు. భూమి ఏకార్ణవమైనపుడు ఆ నీరు శీఘ్రముగా లేదు. కావున అవి నీరములు అయినవి. బ్రహ్మయొక్క ఒక పగలై అది యుగసహస్రాంతముగా, రాత్రి అంతయు నీరు రూపములో ఉండెను. ఆ తరువాత ఆ జలమున భూమిపై అగ్ని నశింపగా, ప్రశాంతమైన వాయువుగా, వెలుగులేని చీకటి అంతట ఉండగా దీనిని అంతయు అధిష్ఠించినవాడు బ్రహ్మ ఆతడే పురుషుడు, ప్రభువును, ఆతడు ఈ లోకము యొక్క విభాగమును మరల చేయతలచుచున్నాడు. అపుడు ఏకార్ణవమైన దానియందు స్థావర జంగమములు నష్టములు కాగా, ఆ బ్రహ్మపుట్టును. ఆ పురుషుడు సహస్రాక్షులు కలవాడు, సహస్రపాదములు కలవాడు, సహస్ర శిరములు కలవాడు, బంగారు వర్ణములు కలవాడు, ఇంద్రియములకు గోచరము కానివాడు. అపుడు నారాయణుడను బ్రహ్మ జలమున పరుండెను.

సత్త్వోద్రేకము వలన ఆతడు మేలుకొని లోకమును శూన్యముగా చూచెను. ఈ సందర్భమున నారాయణుని గూర్చి ఆపస్సులు అనగా జలముల పేరు విందుము. (ఆ జలములను) నాభిలో నింపి అచట ఉన్నాడు కావున నారాయణుడు అని స్మరింపబడినాడు. వేద మార్గమున నిర్వచింపబడిన ఆ పురుషుడు వేయి తలలు కలవాడు, మంచి మనస్సు గలవాడు, వేయి పాదములు కలవాడు, వేయి కన్నులు ముఖములును కలవాడు, వేయి బాహువులు కలవాడు. అతడు మొదటి ప్రజాపతి బ్రహ్మ. సూర్య వర్ణము గలవాడు, భువనమును రక్షించువాడు, ఒక్కడు, పూర్వము లేనివాడు. మొదటి ఇంద్రుడు హిరణ్య గర్భుడైన (బ్రహ్మయైన) మహాత్ముడైన పురుషుడు ఆతడు తమస్సునకు ఆవల ఉండువాడుగా కీర్తింపబడుచున్నాడు. కల్పాదిలో, రజోగుణముచే ఉద్రేకమునందిన బ్రహ్మయై ప్రజలను సృష్టించెను. కల్పాంతము వలన తమోగుణముచే ఉద్రేకమును జెందిన కాలుడై మరల ప్రజలను మ్రింగెను.

ఆ నారాయణుడనువాడే సత్త్వ గుణముచే ఉద్రిక్తుడై సముద్రమున పరుండుచు, తనను మూడు విధములుగా విభజించి ముల్లోకములలోను ఉండెను. ఆ మూడింటిచే (త్రివిధా విభక్త శరీరములచే) వారిని సృష్టించును మ్రింగివేయును, చూచును. అప్పుడు స్థావర జంగమ రూపమైన లోకము ఏకార్ణవము కాగా, నాలుగువేల యుగముల చివర, అంతయు జలముచే ఆవరింపబడగా, నారాయణుడు అను బ్రహ్మ వెలుగులేని సముద్రమున పరుండుచు, నాలుగు విధములైన ప్రజలను మ్రింగి, బ్రాహ్మీ రాత్రియందు నిద్రించిన కాలుని మహర్లోకము నుండి మహర్షులు చూతురు.

భృగువు మొదలగు ఏడుగురు మహర్షులు ఈ కల్పమున (ఉన్నపుడు) ఉండిరి. ఆ తరువాత ఆ విధముగా ఉండిన సప్తమహర్షులచే పరమైన మహర్లోకము పరిగత మాయెను. మొదట సత్యర్థమైన ‘ఋ’ ధాతువు నుండి ‘ఋషయః’ అన్న నామము (పదము) ఏర్పడినది. ఆ కారణమువలన ఋషి పరమైన (ఋషి శబ్దము పరముగా నున్న) మహత్ శబ్దము కావున మహర్షయః అయినది. అపుడు మహర్లోకమున ఉన్న ఆ సప్తర్షులచేత నిద్రించిన కాలము చూడబడినది. కల్పము ముగియగా, ఆ సప్తమహర్షులు సత్యాదులైరి. ఈ విధముగా బ్రాహ్మీరాత్రులు (బ్రహ్మమానములోని రాత్రులు) వేలకొలది ముగియగానే, ఇతర మహర్షులు గూడ అట్లే నిద్రించిన కాలమును చూచిరి. కల్పాదిలో పదునాలుగు సంస్థలను అనేక పర్యాయములు బ్రహ్మ కల్పించిన కారణముగా కాలము నిర్వచింపబడినది. ఆ కాలము కల్పాదులలో మరల మరల సర్వ భూతములకు స్రష్ట అగును. ఆ కాలమే వ్యక్తావ్యక్తుడైన మహాదేవుడు (శివుడు) అగును. ఈ జగమంతయు ఆ మహా దేవునిది. ఈ విధముగా రెండు కల్పముల యొక్క ప్రతి సంధి చెప్పబడినది. ఈ ప్రతి సంధి వర్తమాన భూత కాలముల మధ్యన మొదటి (ప్రారంభ) అవస్థ అగును. ప్రతి కల్పమున ఉన్నది ఉండినట్లు సంగ్రహముగా ప్రతిసంధి చెప్పబడినది. ఇప్పుడీ కల్పమును గూర్చి చెప్పెదను వినుడు. (7)