వాయు మహా పురాణము
జ్యామఘ వృత్తాంత కథనము
ఋషులు ఇట్లు అనిరి:
“మహాత్ములకు అపవస్యమైన భువనము (జగము) కార్తవీర్యునిచే ఎందులకు దహిం పబడినదో! తెలియవలెనను కుతూహలముగల మాకు తెలుపుడు. ఆ రాజర్షి ప్రజలను రక్షించువాడని చెప్పుదురు. రక్షించువాడైన ఆ కార్తవీర్యుడు ఎందుకు ఆ తపోవనమును నశింపచేసెను?”
సూతుడు ఇట్లు అనెను:
“సూర్యుడు బ్రాహ్మణ రూపమున కార్తవీర్యుని కడకు వచ్చెను. ‘తృప్తిని కోరిన వాడను, అన్నమును ఇమ్ము. నేను సూర్యుడను” అని అనెను.
రాజు:
“ఓ భగవంతుడా! దేనితో నీకు తుష్టి కలుగునో చెప్పుము. ఎటువంటి భోజనము ఈయవలెనని కోరుకొనుచున్నావు, నీవు చెప్పిన, విని దానిని నేను సిద్ధముచేయుదును అనెను”.
అందుకు సూర్యుడు:
“దానము చేయువారిలో శ్రేష్ఠుడా! చర, స్థావరములలో స్థావరమైన (కదలక ఉన్న) సర్వము ఆహారముగా ఇమ్ము. దానితో తృప్తుడను అగుదును. అన్యము నాకు తుష్టి కలు గదు అనెను. ఆ మాటలను వినిన రాజు మానుషమైన తేజస్సుతో స్థావరమైన సర్వమును దహించుటకు శక్యముకాదు. ఇక నీకే నేను ప్రణమిల్లుచున్నాను” అని పలికెను.
అందుకు సూర్యుడు:
“నీ విషయమున నేను సంతసించితిని. అంతట సుఖములైనవి, అక్షయములైనవియు అయిన శరములను ఇచ్చుచున్నాను. ఈ బాణములు ప్రయోగింపబడిన నా తేజముతో కూడినవై మండును. నా తేజముతో ఆదేశింపబడిన ఎడల మేఘ సాగరమును (వర్షము గురియు మేఘములను, జలములు నిండియున్న సాగరమును) ఎండింప చేయ గలవు. ఓ రాజా! ఆ ఎండినదానిని భస్మము చేయుదును. దానిచేత సంతసించినవాడను అగుదునని చెప్పెను. తరువాత, అదిత్యుడు కార్తవీర్యార్జును నకు బాణములను ఇచ్చెను. కార్తవీర్యుడు ఆ బాణములను ప్రయోగించెను. ఆ తరువాత సూర్యుడు విశాలమైన స్థావరమును అంతయు (భూమినంతయు) పొంది, ఆశ్రమములను, గ్రామములను, గొల్లపల్లెలను, నగరములను, తపోవనములను, రమ్యములైన వనములను ఉపవనములను ఈ విధముగా తూర్పువైపు అంతయు దహించెను. తరువాత దక్షిణమును దహించెను. అపుడు భూమి సూర్యునిచే తన తేజముచే దహింపబడినదై వృక్షములు లేనిదై, గడ్డి లేనిది అయినది. ఈ కాలముననే తపోనిలయమును ఆశ్రయించి, పదివేల ఏండ్లు జలవాసియైన వశిష్ఠమహర్షి వ్రతము సమాప్తిచెందగా, ఆ ముని పైకిలేచి కూర్చొనెను. ఆ మహర్షి(వశిష్ఠుడు)కార్తవీర్యార్జునునిచే దగ్ధమైన తన ఆశ్రమమును చూచెను. నేను మీకు ఇంతకుముందు చెప్పిన విధముగ రాజర్షిని శపించెను. కోపముతో
సూతుడు ఇట్లు అనెను:
“రాజర్షియైన క్రోష్ణువు యొక్క ఉత్తమ పూరుషమైన వంశమును వినుడు. అతని వంశముననే వృష్టికులోద్ధారకుడైన వృష్టి జన్మించెను. క్రోష్టువునకు మహా యశస్వియైన వృజినీవంతుడు అను ఒక పుత్రుడు కలడు. అతనికి స్వాహిపుత్రుడు జన్మించెను. అతడు స్వాహో వంతులలో శ్రేష్ఠుడు. స్వాహి పుత్రుడు దాతలలో శ్రేష్ఠుడైన రాజైన రశాదువు. రశాదునకు మొదటి పుత్రుడు మృతుడు. అతడు అప్త దక్షిణములై వివిధములైన మహా క్రతువులతో యజ్ఞము చేసెను. చిత్రములైన చిత్రకర్మలు చేయు చిత్రరథుడు అతని పుత్రుడు. వీరుడైన చిత్రరథుడు విపుల దక్షిణములైన యజ్ఞములను చేసెను. అతని తరువాత అతని పుత్రుడు శశబిందువు రాజర్షులకు అనుష్ఠితుడు, చక్రవర్తి, మహాసత్త్వుడు, మహావీర్యుడు, బహు సంతానము కలవాడు అని పురావేత్తలు ఆతని విషయమున గానముచేసిరి. ఆ శశబిందువు నకు నూరుగురు పుత్రులుండిరి. వారు ధీమంతులు, అనురూపులు, విశాలమైన ద్రవ్యము, తేజస్సు కలవారు. వారిలో ఆఱుగురు ముఖ్యులు. వారు మహాబలులైన పృథు షట్కులు అనబడిరి. వారు పృథుశ్రవుడు, పృథుయశుడు, పృథుధర్ముడు, పృథుంజయుడు, పృథుకీర్తి, పృథుందాత అనువారు. వీరు శాశబిందువులైన రాజులు. వీరిని గురించి పురాణములు పాఠశ్రవసుని అంతరునిగా చెప్పును. పూర్వము ఈ అంతరుడు యజ్ఞుని తనయుడు అయ్యెను. శుక్రుడు సుతధర్మాత్ముడై ఈ పృథివిని పొంది, ఉత్తమధాముడై నూరు అశ్వమేథములు చేసెను. అతని పుత్రుడు రాజర్షులకు అనుష్ఠితుడైన మరుత్తుడు. మరుత్త పుత్రుడు వీరకంబల బర్హియనబడెను. కంబలబర్హిషుని పుత్రుడు విద్వాంసుడైన రుక్మ కవచుడు. రుక్మకవచుడు పూర్వమురణమున వాడియైన బాణములచే ధనుర్దారులను చంపి ఉత్తమ మైన సంపదను పొందెను. అశ్వమేధముచే మహాయశస్వియై, బ్రాహ్మణులకు విత్తము ఒసగెను. రాజైన రుక్మకవచుని నుండి మరలక వీరహంతలైన అయిదుగురు పుత్రులుపుట్టిరి. వారు మహాసత్త్వులు, మహాబలులు. వారు రుక్మేషువు, పృథురుక్ముడు, జ్యామఘుడు, పరిఘుడు, హరి-అనువారు. తండ్రి, పరిఘుని, హరిని, విదేహదేశమున నిలిపెను. బ్రహ్మేషు (రుక్మేషువు) రాజు అయ్యెను. పృథురుక్ముడు వానిని ఆశ్రయించి ఉండెను. జ్యామఘుడు వారిని రాజ్యమును వదలి, సన్యాసమును స్వీకరించి ఆశ్రమమున ఉండెను. ఘోరమైన వనమున ప్రశాంతుడై జ్యామఘుడు బ్రాహ్మణులచే బోధితుడై, ధనుస్సును స్వీకరించి రథము కలవాడై, నర్మద యొక్క జలప్రాయ ప్రదేశమున ఏకాకియై వెళ్లెను. అటనుండి మేఖలా వృత్తికలను, ఋక్షవత్పర్వతమునకు వెళ్లి మరొక శుక్తిని ప్రవేశించెను. జ్యామఘునకు మిక్కిలి బలవంతురాలైన శైబ్య (శిబిపుత్రి) భార్య అయ్యెను. పుత్రుడు కలుగకున్నను రాజు మరొక భార్యను చేసికొనలేదు. అతనికి యుద్ధమున విజయము లభించెను. తరువాత అతడు కన్యను పొందెను. అపుడు ఆ రాజు ఆమె కోడలని అనెను. ఆమె కూడ నీకు ఇది కోడలుగా కోరదగినది. నీకు పుట్టబోవు పుత్రునకు ఈమె భార్య కాగలదు అని అనెను. అతని యొక్క ఉగ్రతపస్సుచే శైబ్య వైశ్యుని కనెను. సుందరియైన శైబ్య పరిణతురాలు అగుచునే విదర్భుడు అను పుత్రుని కనెను. విదర్భుడు ఆ కోడలియందు విద్వాంసులును, రాజపుత్రులును, శూరులును, రణ విశార దులునైన క్రథు-కౌశికులను కనెను. తరువాత నా సుధార్మికుడైన విదర్భుడు మూడవవానిగా లోమపాదుని కనెను. లోమపాద పుత్రుడు వస్తువు. అతని పుత్రుడు అహృతి. కౌశికుని పుత్రుడు చిది. అతని పుత్రులు రాజులు, చైద్యులు అనబడిరి. విదర్భ పుత్రుడైన కథువునకు పుత్రుడు ‘కుంతి’కుంతికి ధృష్ట సుతుడు పుట్టెను. అతడు పురోధృష్టుడు ప్రతాపవంతుడు. ధృష్ణుని పుత్రుడు ధర్మాత్ముడును శత్రువీరుల జంపువాడైన నిర్వృతి అతని పుత్రుడు దశా ర్హుడు. మహాబలపరాక్రమవంతుడు. దశార్హుని పుత్రుడు వ్యోముడు. అతని పుత్రుడు జీమూతుడు. జీమూత పుత్రుడు వికృతి. అతని పుత్రుడు భీమరథుడు. అతని పుత్రుడు రథవరుడు. ఆతడు దాత నిత్యము ధర్మరతుడు, శీల సత్యపరాయణుడును. అతని పుత్రుడు నవరథుడు, అతని పుత్రుడు దశరథుడు, అతని పుత్రుడు ఏకాదశరథుడు, అతని పుత్రుడు శకుని. అతనికి ధన్వియైన కరంభకుడు, అతనికి దేవరాతుడు, దేవరాతికి దేవక్షత్రుడు, అతనికి క్షత్రనందనుడైన దేవనుడు పుత్రుడు. దేవనునకు మధువు పుట్టెను. అతని మేధ ధనోత్పత్తి కారణమగును. మధువునకు మహాతేజస్వియైన మనువు, మనువశుడు. నందనుడు, మహాతేజస్వియైన మహాపురవశుడును పుత్రులు. పురవశునకు పుత్రుడు పురు షోత్తముడైన పురుద్వంతుడు. పురుద్వంతునకు భద్రవతియందు పురూద్వహుడు పుట్టెను. ఏకాక్షి భార్య అయ్యెను. ఆమెయందు సత్త్వుడు పుట్టెను. సత్త్వుని నుండి సత్త్వగుణ ముతో గూడి కీర్తి వర్ధనుడైన సాత్వతుడు పుట్టెను. మహాత్ముడైన జ్యామఘుని ఈ సృష్టిని తెలిసినవాడు సంతానవంతుడై, ధీమంతుడై, రాజైన సోమునియొక్క సాయుజ్యమును అందును. (33)