పృథివీ దోహనము

శాంశపాయనుడు సూతునితో:

మన్వంతరములను యథార్థముగా తెలియకోరుచున్నాను. మన్వంతరములో ఉన్న దేవతలు అందరి క్రమమును కూడ తెలియచేయ ప్రార్థన అని ప్రశ్నించగా...

సూతుడు:

భూత-భవిష్య మన్వంతరములు ఎన్ని ఉండునో వానిని విస్తరముగను సంగ్రహము గను చెప్పెదను వినుడు. మొత్తం పద్నాలుగు మంది మనువులలో ఇంతకు పూర్వము స్వాయంభువమనువు, స్వారోచిషమనువు, ఔత్తమమనువు, తామసమనువు, రైవతమనువు, చాక్షుషమనువు-అను ఆరుగురుమనువులు గడచిపోయిరి. ఇక రాబోవు మనువులు ఎనమండుగురిని గూర్చి చెప్పెదను.

సావర్ణ మనువులు ఐదుగురు. రౌచ్యమనువు, భౌత్య మనువు, వైవస్వతమనువు అని వారు ఎనమండుగురు. ముందు గతించిన వైవస్వత మనువులను ఐదుగురిని గూర్చి అ మానవులను (మనువునుండి పుట్టిన వారిని) గూర్చి సమగ్రముగా వినుడు. నాచే చెప్పబడిన స్వాయంభువ మన్వంతరము గడచిపోయినది.

తరువాత రెండవ స్వారోచిష మన్వంతరముయొక్క ప్రజాసృష్టిని గురించి చెప్పబోవుచున్నాను. స్వారోచిష మన్వంతరమున తుషితులు, విద్వాంసులైన పారావతులు. వీరు రెండే గణములు. క్రతువునకు తుషతయందు పుట్టినవారు స్వరోచిషులు పారావతు లును, తక్కినవారును పండ్రెండుగల రెండు గణములు. ఛందమున (స్వేచ్ఛగా పుట్టినవారు ఇరువది నాలుగు. అపుడు వారు దేవతలు అనబడిరి. వారు దైవస్యశుడు, వామాన్యుడు, గోపుడు, దేవాయతుడు, మహాబలుడు, మహాబాహువు, ఆపుడు, వీర్యవంతుడైన మహాబలుడు, చికిత్వంతుడు, నిభృతోయుడు, అంశోయుడు అను పండ్రెండుగురు. వీరు క్రతువు యొక్క పుత్రులుగా వారు సోమపాయులు సోమమును త్రాగువారు దేవుడైన ప్రచేతసుడు, విశ్వేదేవులు, ప్రసిద్ధుడైన సమంజుడు, అరిమర్దుడైన యజిహ్ముడు, విద్యావంతులైన అజిహ్మానుడును, మహీయానుడును, మహాభాగులైన యజోషులు ఇరువురును, యవీయుడు, మహాబలుడు, హోతయు, యజ్వ. వీరందరు పరాక్రమించిన పరావతులు. వీరు స్వారోచిష మన్వంతరమున దేవతలుగా నుండిరి. అపుడు ఇరువది నలుగురు దేవతలు సోమపానము చేయువారు. అపుడు వారిలో ఇంద్రుడు కూడా ఉండెను. లోకప్రసిద్ధుడైన వైధుడు (విధికి సంబంధించినవాడు) గూడ వారిలో ఉండెను. వసిష్ఠపుత్రుడైన ఊర్జుడు, కాశ్యపుడైన స్తంభుడు, భార్గవుడైన ద్రోణుడు, ఋషభుడైన అంగిరసుడు, పౌలస్త్యుడైన దత్తాత్రి, ఆత్రేయుడైన నిశ్చలుడు, పౌలహుడైన నిధావంతుడును వీరు సప్తర్షులు. చైత్రుడు, కవి, ఉతుడు, కృతాంతుడు, విభృతుడు, రవి, బృహత్తు, గుహుడు, నవుడు-వీరు తొమ్మండుగురు కుమారులు. వీరు స్వారోచిష మనువు యొక్క వంశకరులైన పుత్రులు. వీరు పురాణమున లెక్కింపబడినారు. ఇది రెండవ మన్వంతరము. సప్తర్షులు, మనువు, దేవతలు, పితరులును ఈ నలుగురు మన్వంతరమునకు మూలము. వారియొక్క మధ్యన ప్రజలు ఉందురు. ఋషులకు పుత్రులు దేవతలు, పితరులు దేవపుత్రులు, ఋషులు దేవపుత్రులు-అని శాస్త్ర నిశ్చయము. మనువునుండి క్షత్రియులు వైశ్యులును పుట్టిరి. సప్తర్షులనుండి బ్రాహ్మణులు పుట్టిరి. ఇది సంగ్రహమన్వంతరమని చెప్పుదురు.

స్వాయంభువముతో స్వారోచిషము యొక్క విస్తారము తెలుసుకొనవలెను. స్వారో విషముయొక్క విస్తారము వందయేండ్లలో గూడ చెప్ప సాధ్యముకాదు. దానికి కారణము- ప్రతికులమున సంతానము యొక్క పునరుక్తి ఎక్కువగా ఉండుట. తరువాత ఔత్తమ మనువు యొక్క పర్యాయము మూడవది. అందు ఐదే గణములు చెప్పబడినవి. వానిని చెపెదను వినుడు.

సుధాములు, దేవతలు, వశవర్తులైన మరికొందరు, ప్రతర్దనులు, శివులు, సత్యులు పండ్రెండుగణములని చెప్పబడిరి. సత్యుడు, ధృతి, దముడు, దాంతుడు, క్షముడు, క్షాముడు, ధృతి, శుచి, ఈషుడు, ఊర్జుడు, జ్యేష్ఠుడు, వపుష్మంతుడును ఈ పండ్రెండుగురు. వీరు పేరులతో చెప్పబడినవారు. సుధాములైతే పండ్రెండుగురు. సహస్రధారుడు, విశ్వాత్ముడు, శమితారుడు, బృహద్వనువు, విశ్వధుడు, విశ్వకర్మ, మనస్వంతుడు, విరాట్టు, యశుడు, జ్యోతి, విభావ్యుడు, కీర్తిమంతుడు, అన్యానారాధితుడగు దేవుడు, వసుధిష్ణుడు, వివస్వనుడు, దినక్రతువు, సుధర్ముడు, ధృతవరుడు, యశస్వినులు, కేతుమంతుడు-అను వీరు ప్రమర్దను అని చెప్పబడిరి. హంసస్వరుడు, అహిహుడు, ప్రతర్దనుడు, యశస్కరుడు, సుదానుడు, వసుదానుడు, సుమంజనుడు, విషుడు, జంతువాహుడు, యతి, సువిత్తుడు, సునయుడు- శివులైన వీరు యజ్ఞయులైన పండ్రెండుగురు.

సత్యులయొక్క పేరులను గూడ నిష్ఠాపూర్వకముగా వినుడు. దిక్పతి, వాకృతి, విశ్వుడు, శంభువు, స్వమృడీకుడు, అధిపుడు, వర్చోధుడు, ముహ్యసర్వశుడు, వాసవుడు, సదాశ్వుడు, క్షేముడు, ఆనందుడు అను వీరు మరొక పండ్రెండుగురైన సత్యులుగా చెప్ప బడినారు. వీరే ఔత్తమ మన్వంతరమున దేవతలై ఉండిరి.

మహాత్ముడైన ఔత్తమమనువు యొక్క పుత్రులు పదముగ్గురు. వారు అజుడు, పరశుడు, దివ్యుడు, దివ్యౌషధి, నయుడు, అప్రతిముడగు దేవానుజుడు, మహోత్సాహుడు, ఔశిజుడు, వినీతుడు, సుకేతుడు, సుమిత్రుడు, సుబలుడు, శుచి-వీరు క్షత్రమును (క్షత్రియ జాతిని) సృష్టించువారు. ఇది రెండవ అంతరము. ఔత్తమ మన్వంతరమున స్వారోచిషునిచే జరిగిన సృష్టి పరిగణింపబడినది. విస్తరముగను అనుపూర్వీతోను తామసమన్వంతరము లోని వారలనుగురించి వినుడు. అటు తరువాత నాలుగవ పర్యాయమైన తామస మన్వంతర మునసత్యులు, స్వరూపులు, సుధీలు, హరులు అను నాలుగు గణములు ఉండినవి. తామసమన్వంతరమున పులస్త్య పుత్రుని పుత్రులు ఉండిరి. ఒక్కొక్కటి ఇరువది యైదు ఆ దేవతల గణము గలవు. నూరు ఇంద్రియములు తెలిసిన మునులు సత్యప్రాణులు, శీర్షణ్యులు (శిరసా నీయులు) తమస్సు అను మనువు ఎనిమిదవవాడు. ఆ మన్వంతరమున (తామస మన్వంతరమున) ఇంద్రియములు దేవతలు అనబడినారు. ప్రభుదేవులైన వారిలో శిబి ప్రతాపవంతుడైన ఇంద్రుడు. ఆ తామస మన్వంతరమున సప్తర్షులు ఉన్నారు. ఓ ఉత్తమ పండితులారా! వారి పేర్లను వినుడు. కాశ్యపుడైన హర్షుడు, కాశ్యపుడైన పృథువు, ఆత్రేయుడైన అగ్ని, భార్గవుడైన జ్యోతిర్ధాముడు, పౌలహుడైన వనపీఠుడు, వాసిష్ఠుడైన గోత్రుడు, పౌలస్త్యుడైన చైత్రుడును తామసమన్వంతరమున ఋషులు. ఇంతకు జనువండుడు, శాంతి, నరుడు, ఖ్యాతి, భయుడు, ప్రియభృత్యుడు, అవక్షి, పృష్టలోధుడు, దృఢోద్యతుడు, ఋతుడు, ఋత బంధువును-వీరు తామస మనువు యొక్క సుతులు. ఐదవ పర్యాయమున చారిష్ణవ మన్వంతరమున దేవతలయొక్క గణములను వినుడు. అమృతాభులు, భూతరాజులు, వికుంఠులు, సుమేధసులు-వీరు నాలుగు గణములుగా ఉన్నవారు. చరిష్ణు  మనువుయొక్క మంగళకరులైన పుత్రులు. వశిష్ఠ ప్రజాపతియొక్క పుత్రులు పదునాలుగురు. వారి గణములు నాల్గు. అవి మిక్కిలి ప్రకాశవంతములు. స్వత్రవిప్రుడు, అగ్ని భాసుడు, అమృతుడు, సుమతి, వారుడు, విరావుడు, వాచినోదుడు, స్రవుడు, ప్రశిరాశి, వాదుడు, ప్రాశుడు ప్రకాశవంతములు. అను నీ పదునలుగురు చారిష్ణవ మన్వంతరమున అమృతాభులుగను దేవతలు గను చెప్పబడిరి. మతి, సుమతి, ఋతుడు, సత్యుడు, ఆవృతి, వివృతి, మదుడు, వినయుడు, జేత, జిష్ణువు, సహుడు, ధ్యుతిమంతుడు, స్రవసుడు ఈ పేరులు అభూత రజసులవని అందురు. వృషభేత్త, జయుడు, భీముడు, శుచి, దాంతుడు, యశోదముడు, నాథుడు, విద్వాంసుడు, అజేయుడు, కృశుడు, గౌరుడు, ధ్రువుడు-వీరు వికుంఠులు అనబడినారు. ఇక సుమేధసులను వినుడు. మేధాః, మేధాతిధి, సత్యమేధుడు, పృశ్నిమేధుడు, అల్పమేధుడు, భూయోమేధుడు మొదలగువారును, ప్రభువు, దీప్తిమేధుడు, యశోమేధుడు, స్థిరమేధుడు, సర్వమేధుడు, అశ్వమేధుడు, ప్రతిమేధుడు, మేధావంతుడు, మేధాహర్త-వీరు సుమేధసులు అపుడు విక్రమించిన పౌరుషముగల ఇంద్రుడు వారికి ప్రభువుగా ఉండెను. పౌలస్త్యుడైన వేద బాహుడును, కాశ్యపుడైన యజువనువాడును, అంగిరసుడైన హిరణ్యరోముడును, భార్గవుడైన వేదశ్రీయు, వాసిష్ఠుడైన ఊర్ధ్వబాహువును, పౌలహుడైన పర్జన్యుడును, ఆత్రేయుడైన సత్యనేత్రుడును-వీరు రైవత మన్వంతరమున ఋషులు. మహాపురాణ సంభావ్యుడు, ప్రత్యంగపరహుడు, శుచి, బలబంధువు, నిరామిత్రుడు, కేతుభృంగుడు, దృఢవ్రతుడు - వీరు చరిష్ణువుని యొక్క పుత్రులు. ఇది అయిదవ అంతరము.

స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు అను నలుగురు ప్రియవ్రత వంశమునకు చెందిన మనువులు. ఆరవ పర్యాయమున చాక్షుష మన్వంతరమున వీరు దేవతలు. ఆద్యులు, ప్రసూతులు, భావ్యులు, పృథుకులు-మహానుభావులైన లేఖులును-అను అయిదుగురు దేవగణములు. దేవతల ఈ సర్గము మాతృనామములచే చెప్పబడును. అత్రియొక్క పుత్రుని మనుమలును, అరణ్య ప్రజాపతి యొక్క గణములును, వానియొక్క దేవతలలో ఒక్కొక్కడును అష్టకుడు (ఎనిమిది గలవాడు) అనబడినాడు. అంతరిక్షుడు, వసుహయుడు, అతిథియు, ప్రియవ్రతుడును, శ్రోతయు, మంతయు (మననము చేయు వాడు), సుమంతయు-వీరు ఆద్యులు అనబడినారు. శ్యేనభద్రుడు, పశ్యుడు, పథ్యనేత్రుడు, మహాయశుడు, సుమనుడు, సువేతుడు, రైవతుడు, సుప్రచేతనుడు, ద్యుతి, మహాసత్వుడు - వీరు ప్రసూతులు. విజయుడు, సుజయుడు, మనుడు, ఉద్యానుడు, సుమతి, సుపరి, అర్థపతియని చెప్పబడిన వాడును - వీరు భావ్యులు అను దేవతలు (గణము)గా జెప్ప బడి నారు. ఇక పృథుకులను గురించి వినుడు. అజిష్టుడు, శాక్యనుడు, దేవుడు, వానపృష్టుడును, శాంకరుడు, సత్య దృష్ణుడు, విష్ణువు, విజయుడు, మహాభాగ్యుడైన యజితుడునని వీరు పృథుకులను దేవతలు. అట్లే లేఖులను గూర్చి చెప్పెదను వినుడు. మనోజవుడు, ప్రవాసుడు, మహాయశస్కుడైన ప్రచేతసుడు, వాతుడు, ధ్రువక్షితి, అద్భుతుడు, వీర్యవంతుడు, అవనుడు, బృహస్పతియు-వీరు లేఖులు అనబడినారు.

అపుడు మహావీర్యుడైన మనోజవుడు వారికి ఇంద్రుడు అయ్యెను. భార్గవుడైన ఉన్నతుడు, అంగీరసునిసుతుడైన హవిష్మంతుడు, కాశ్యపుడైన సుధామ, వాసిష్ఠుడైన విరజుడు, పౌలస్త్యుడైన అతిమానుడు, పౌలహుడైన సహిష్ణువు, ఆత్రేయుడైన మధువు-ఈ యేడుగురును చాక్షుష మన్వంతరములోని వారు. ఊరువు, పూరువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్కు, కృతి, అగ్నిష్టుత్, అతిరాత్రుడు, సుద్యుమ్నుడును- అను ఈ తొమ్మండుగురు. పదియవవాడగు అభిమన్యుడును వీరు నాద్వలేయులైన చాక్షుష మనువు యొక్క సుతులు. ఇది ఆరవ మన్వంతరము. ఓ బ్రాహ్మణులారా! వైవస్వత మన్వంతరములోని ఆ మహాత్ముడగు వైవస్వతమనువు యొక్క సృష్టి అనుపూర్వీతోడను విస్తరముగను నేను చెప్పితిని అని పలికెను.

అప్పుడు ఋషులు:

కశ్యపాన్వయమున చాక్షుషునకు దాయాదుడు పుట్టెను అని చెప్పితివి గదా! అతనియొక్క వంశమున పుట్టిన ఇతరులను గురించి కూడ ఉన్నది ఉన్నట్లు మాకు చెప్పుము అని అడిగిరి. దానికి సూతుడు: చాక్షుషుని సృష్టిని సంగ్రహముగా మీకు విని పింతును. అతని వంశమున ప్రతాపవంతుడైన వేనపుత్రుడైన పృథువు పుట్టెను. ఇతర ప్రజాపతులు దక్షుడును ప్రాచేతసుడును కూడ పుట్టిరి. అత్రి ప్రజాపతి ఉత్తానపాదుని (తన) పుత్రునిగా స్వీకరించెను. ఈ దక్ష ప్రజాపతియొక్క పుత్రుడు రాజు అయ్యెను. స్వాయంభువ మనువుచేత ఒక కారణమున అత్రికి ఈయబడెను. ఓ బ్రాహ్మణులారా! చాక్షుషుని యొక్క రాబోవు మన్వంతరమును, దాని వెంటనే ఆరవదాని ఉపోద్ఘాతముతో బాటు చెప్పెదను. ధర్మునితో ధర్ముని పత్నియైన లక్ష్మియందు సూనృతురాలు, చతుర విత్తభావిని, శుభయు అయిన శుచిస్మితయు, ధ్రువుని తల్లి జన్మించినది. ఆమె ఉత్తానపాదుని వలన ధ్రువుని, కీర్తిమంతుని, అయస్మంతుని కనెను. అట్లే శుచిస్మితులైన మనస్విని స్వర-అను కన్యలను గూడ ఉత్తానపాదుడు కనెను. వారిరువురి పుత్రులు విశేషమైన కీర్తిని పొందిరి. వీర్యవంతుడైన ధ్రువుడు పదివేల దివ్యవర్షములు, విపుల యశస్సును కోరుచు, నిరాహారుడై తపము చేసెను. మొదటి త్రేతాయుగమున స్వాయంభువ మనువు యొక్క పుత్రుడైన అతడు సుమహాయశమును కోరుచు యోగముతో ఆత్మను ధరించెను. బ్రహ్మ అతనికి (ధ్రువునకు) జ్యోతిస్సులలో (వెలుగునట్టి నక్షములలో) ఉత్తమ స్థానము ఇచ్చెను. అది మహాభూత ప్రళయము వరకైనను మనోహరమైనది. అస్తమయముగాని, ఉదయముగాని లేనిది. మిక్కిలి అతిశయించిన అతని యొక్క సంపదను, మహిమను బాగుగా చూచి, దితి సుతులైన రాక్షసుల ఆచార్యుడు శుక్రాచార్యుడు ఏమి! ఈతని (ధ్రువుని) తపము యొక్క బలము. ఏమి ఈతని శ్రుతము! వైదిక పాండిత్యము! ఏమి ఈతని హుతము! (హోమము జేసిన గొప్పతనము! యజ్ఞముచేసిన ప్రభావము!) సప్తర్షులు ఈ ధ్రువుని తమపైన ఉంచుకొని ఉన్నారు. ధ్రువుని యందు స్వర్గ (ఆకాశ) మంటియున్నది. ఆతడు ఈశ్వరుడు స్వర్గాధిపతియైన ఇంద్రుడును. ఈ శ్లోకమును గానము జేసెను. ధ్రువుని వలన నాభూమి పుష్టిని, ‘భవ్యుని’ గనెను. వారిరువురు రాజులు, విభువైన ‘పుష్టి’ తన ఛాయను స్త్రీవి కమ్మనెను. అతని సత్య వచనమున అపుడు ఆమె (ఛాయ నీడ) వెంటనే స్త్రీ అయ్యెను. ఆమె దివ్యమైన శరీరచ్ఛాయ గలదియు, దివ్యమైన ఆభరణములచే అలంకరింపబడినదిగా ఉండెను. ‘పుష్టి’ ఛాయయందు అకల్మషులైన అయిదుగురు పుత్రులను కనెను. వారు ప్రాచీన గర్భుడు, వృషకుడు, వృకలుడు, ధృతి-అనువారు. ప్రాచీన గర్భుని భార్య ‘వర్చ’ ఆమె ఒక రాజును కనెను. ఆతడు పూర్వ జన్మలో ఇంద్రుడు. ఉదారధీ అనిపేరు. వేయి సంవత్సరముల చివర, ఆతడు ఒక్కమారు ఆహారమును తీసి కొనెను. ఈ విధముగ ఆవిభుడు మన్వంతరము గూడిన ఇంద్రత్వమును పొందెను. భద్రయను ఆమె ‘ఉదారధీ’ వలన ‘దివంజయు’ని గనెను. వరాంగి అను ఆమె దివంజయుని వలన రిపుని, రిపుంజయుని కనెను. ‘బృహతి’ అనుఆమె రిపుని వలన సర్వతేజోవంతుడైన చాక్షుషుని కనెను. చాక్షుషుడు వారుణ్యయైన ‘పుష్కరిణి’ యందు ‘మనువు’ను కనెను. పుష్కరిణి మహాత్ముడైన అరణ్య ప్రజాపతియొక్క పుత్రిక. ఓ మహాభాగా! మనువునకు వైరాజ ప్రజాపతి యొక్క కన్యయైన సద్వలయందు మంగళకరులైన పుత్రులు పదుగురు కలిగిరి. ఊరువు, పూరువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్కు, కవి, అగ్నిష్టుత్తు, అతి రాత్రుడు, సుద్యుమ్ను డును-అను తొమ్మండుగురును, అభిమన్యుడను పదవవాడును నద్యలయందు మనువునకు గలిగిన పుత్రులు. అగ్నేయి ఊరువు వలన మహాప్రభావ వంతులగు పుత్రులను కనెను. వారు అంగుడు, సుమసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, శివుడు అనువారు. అంగుని వలన సునీథ తమ సంతానముగా వేనుడను వానిని కనెను. వేనుని యొక్క అపచారము వలన సుమహత్తైన ప్రకోపము(జనులలో) గలిగెను. ఋషులు ప్రజ కొఱకై ఆవేనుని కుడి చేతిని మథించిరి. ఆ విధముగ వేనునిచేయి మథింపబడగా దానినుండి ఒక గొప్ప రాజు పుట్టెను. అతడు వైన్యుడను రాజు. అతడు పృథువని కూడ పిలువబడెను. అతడు తేజస్సుతో మండుచున్న వానివలెనుండి ధనువును, ధరించినవాడై కవచమును ధరించినవాడై పుట్టెను. క్షత్రియ జాతికే మొదట పుట్టిన ఆ వైన్యుడైన పృధువు సర్వ లోకములను రక్షించెను. రాజసూయ యాగముతో అభిషిక్తులైన వారిలో అతడు మొదటి రాజు. అతనిని స్తుతించుట కై పుట్టిన నిపుణులు సూత-మాగధులు. వృత్తికాములైన (జీవన వ్యాపారకాములైన) ప్రజల యొక్క భూమి అను ఈ గోవు ఆధీమంతుడైన మహారాజు చేతను, దేవతలచేతను, ఋషి గణములచేతను గూడి పంటలు పితుకబడినది. పితరుల చేతను, దానవులచేతను, గంధర్వుల చేతను, అప్సరోగణముల చేతను, యక్షులచేతను, తీగల చేతను, పర్వతములచేతను ఆయా పాత్రలలో పితుకబడుచున్న భూమి కోరినంతగా పాలను ఇచ్చెను. దానిచేత లోకములను ధరించెను అని చెప్పగా

ఋషులు:

“ఓ మహామతీ! పృథుని జన్మను విస్తరముగా చెప్పుము. ఆ మహాత్మునిచే వసుంధర (భూమి) ఏ విధముగా పితుకబడినది? దేవతలచేతను, నాగులచేతను, బ్రహ్మర్షులచేతను, యక్షులచేతను, గంధర్వులచేతను, అప్పరులచేతను పూర్వము భూమి ఏ విధముగా పితుకబడినది? వారియొక్క పాత్ర విశేషములను, పితుకువారిని, పితికినపాలను, అట్లే వత్స (దూడ) విశేషములను అడుగుచున్న మాకు చెప్పుము. పూర్వము కోపించిన మహర్షుల చేత ఏ కారణమున వేనుని చేయి మధింపబడినదో, అది అంతయు మాకు జెప్పుము అని అనిరి.

సూతుడు:

ఓ విప్రులారా! వైన్యుడైన పృథువు యొక్క జననమును మీకు వర్ణించి చెప్పెదను. ఏకాగ్రచిత్తులై పరిశుద్ధులై వినుడు. అపవిత్రునకును, పాపికిని, శిష్యుడుగాని వానికిని, అహితునకును, వ్రతము లేనివానికిని పుణ్యమైన పృథు జన్మమును ఏవిధముగనైనను, వర్ణించి చెప్పగలను. స్వర్గము ఒసగు నట్టిదియు, కీర్తినిచ్చు నదియు, అయువు నొసంగు నదియు, పుణ్యమై వేదములచే సమ్మతింపబడినదియు, రహస్యముగా ఋషులచే చెప్పబడి నదియు అయిన, ఈపృథు జన్మను అసూయ లేక యెవడు వినునో! ఏ మానవుడు బ్రాహ్మణులకు నమస్కరించి ఈ పృథు జన్మను (ఇతరులకు) వినిపించునో! వారు చేసిన పాపములను చేయని పుణ్యములను గూర్చి దుఃఖింపడు. ధర్మరక్షకుడైన ఈ రాజు అత్రితో సముడైన ప్రభువు. అత్రి వంశమున అంగుడు అను ప్రజాపతి జన్మించెను. వేనుడు అతనికి పుత్రుడు. అతడు తండ్రివలె మిక్కిలి ధార్మికుడు కాకుండెను. ఆ వేన ప్రజాపతి మృత్యు (యముని) సుతయైన సునీధ యందు మాతామహ (తల్లియొక్క తండ్రి) దోషముతో యముని పుత్రికి పుత్రుడు అయ్యెను. ఆతడు ధర్మమును వెనుకకు నెట్టి కామము వలన, లోభముతో ప్రవర్తించెను. ఆ రాజు ధర్మము వీడిన నియమమును స్థాపించెను. వేదశాస్త్రములను అతిక్రమించి అధర్మము నందు అత్యాసక్తుడయ్యెను. అతడు పరిపాలించు చుండగా ప్రజలు స్వాధ్యాయ వషట్కారములు లేనివారు (వేదాధ్యయనము లేనివారై యజ్ఞయాగములు చేయనివారు) అయిరి. సోమయాగములు లేనందున దేవతలు యజ్ఞము లలో సోమపానము చేయలేకపోయి, వేనప్రజాపతికి తన వినాశము దగ్గరకు రాగా ‘యజ్ఞము చేయరాదు, హోమము చేయరాదు’ అను క్రూర శాసనమునుచేసెను. బ్రాహ్మణులచే నేనే యజ్ఞముతో అన్ని యజ్ఞములలోను పూజింపదగినవాడను, (నా కొరకే యజ్ఞముల జేయవలెను) పూజింప తగినవాడను నేనే, నా విషయముగనే యజ్ఞము, హోమమును చేయయజాలను. అని శాసించెను. ఈ విధముగ మర్యాదను అతిక్రమించి అయుక్తమైన వాని స్వీకరించుచున్న వేనునితో అపుడు మరీచి మొదలగు మహర్షులందరు నిట్లనిరి. మేము అనేక సంవత్సరములు దీక్షలో ప్రవేశించెదము. ఓ వేనరాజా! అధర్మము ఆచరింపకుము. ఇది సనాతనమైన ధర్మము కాదు. నిస్సంశయముగా నీవు చావునకే పుట్టిన ప్రజాపతివి. పూర్వము నీవు ప్రజలను చక్కగా పాలించెదనని ప్రతిజ్ఞ చేసితివి అని ఈ విధముగ చెప్పుచున్న బ్రహ్మర్షులు అందరితో దుర్బుద్ధియై వచన కోవిదుడైన వేనుడు ఆ మాటలకు నవ్వి నేనుకాక మరొక ధర్మ స్రష్ట ఎక్కడ ఉన్నాడు? నాకు బోధ చేయగలవారు ఎవరు? వీర్యమునను, వైదిక జ్ఞానమునను, తపమునను, సత్యమునను, భూమిలో నాకు సమానులు ఎవ్వరును లేరు. నిజముగా నన్ను మీరు గొప్ప మహాత్మునిగా తెలిసికొనుడు. సమస్త లోకములకును విశేషించి ధర్మములకును నేనే కారణభూతుడను. నేను కోరినచో భూమినే కాల్చివేయగలను. నీటిలో కొట్టుకొని పోవునట్లు చేయగలను. మరల సృష్టింపగలను, మ్రింగివేయగలను. ఈ విషయమున ఆలోచింప పనిలేదు అని వేనుడు అనెను. ఈ విధముగ వేనుడు గర్వముతో స్తంభించుట వలన మిక్కిలి మోహితుడై ఋషులకు అనునయింప సాధ్యుడు కానప్పుడు ఆ మహర్షులు క్రుద్ధులై ఆ మహాబాహువులు గలిగి అగ్నివలె మండిపడుచున్న ఆ వేనుని నిగ్రహించిరి. తరువాత వారు మిక్కిలి కోపించిన వారై ఆ వేనుని ఎడమచేతిని మథించిరి. ఓ బ్రాహ్మణులారా! ఆ మథింపబడుచున్న వేనుని హస్తమునుండి పూర్వము ఒక అభిశ్రుతుడను, చక్కని వేదవిజ్ఞానియు, మిక్కిలి పొట్టివాడును, నల్లనివాడును నైన పురుషుడు ఉద్భవించెను. అతడు భయము చెంది, వ్యాకులము చెందిన ఇంద్రియములు గలిగి, చేతులు జోడించినవాడై నిలిచెను. ఆ విధముగ బాధ చెంది వివశుడైన అతనిని జూచి ఋషులు ‘నిషేద’ (కూర్చొనుము) అని అనిరి. అందువలన అతడు అనంత విక్రమము గలవాడై నిషాద వంశకర్త అయ్యెను. అతడు కూడ వేనుని పాపము వలన పుట్టిన ధీవరులను (జాలరులను) సృజించెను. తక్కిన వింధ్యవాసు లగు తుంబురులు, తువరులు, ఖసులు ఇంకను అధర్మము నందు అభిరుచి గలవారును వేనుని పాపము వలన పుట్టిరి.