వాయు మహా పురాణము
భువన విన్యాసము - 2
అటు పిమ్మట సూతుడు మునులతో అనెను:
ఇట్లు శీతాంత్యపర్వత శ్రేష్ఠమునకును, కుముంజ పర్వతమునకును మధ్యనున్న కొండ పల్లములు పసులు మేయు కంచెలును, అనేక పక్షుల నాదములచే ధ్వనించినవి. అనేక ప్రాణులచే సేవింపబడినవి. మూడువందల యోజనముల పొడవైనవి. నూరు యోజనములు విశాలములైనవి. అచట చక్కని రసవంతమైన స్వచ్ఛమైన త్రాగు నీటిచే సుందరమైన సరోవరము ఉన్నది. అది మంచి సుగంధము గలిగి, ఓడలంతటి తెల్ల కమలములచేతను లక్షదళములుగల మహాపద్మములచే అలంకరింపబడినది. పెద్ద పడగలచే సమీపించుటకు అలవికాని మహాసర్పములు నివసించినది, అందలి జలము దేవదానవ గంధర్వులచే స్నానాదులచే స్పృశింపబడి పవిత్రమైనది. అది శ్రీసరస్సు అను పేరుగల సరోవరము. భూమియందును దివియందును ప్రకాశించినది. నిర్మల జలములతో నిండినది. సర్వ ప్రాణులకు రక్షణనిచ్చు గృహము వంటిది.
అచట పద్మవనమధ్యమున ఒక మహాపద్మముగలదు. అది కోటి దళములతో బాగుగా కదలాడుచుండును. ఉదయించు సూర్యుని తేజముగలది. నిత్యము వికసించునది. వాడి రాలిపోనిది. కదలాడుటచే పెద్ద మండలముగలది. చక్కని కింజల్కములతో ఒప్పినది, మదించిన తుమ్మెదలతో ధ్వనింపబడినది. ఆ పద్మమున నిత్యమును సాక్షాత్తుగా భగవతి యైన లక్ష్మీదేవియే ఉండును. (ఈ విధముగా) ఈ పద్మము ఆకారము దాల్చిన లక్ష్మీదేవికి ఆవాసము. ఇందు సంశయము లేదు.
ఆ సరస్సుయొక్క తూర్పు తీరము సిద్ధులునివసించినట్టిది. అచట నిత్యము పుష్ప ఫలములతో మనోహరమైన గొప్ప బిల్వవనముగలదు. అది నూరు యోజనముల వెడల్పై మూడు యోజనముల పొడవైనది. అర్ధక్రోశము ఎత్తైన శిఖరములు గలిగి వేల శాఖలతో గొప్ప బోదెలతో కూడిన వేలకొలది మహావృక్షములతో వ్యాకులమైనది. బంగారము వలె పచ్చనివియు, తెల్లనివియునై అమృతము వంటి రుచిగలవియు, దుందుభు లంతటి లావైనవియు, సువాసనగలవియు, క్షీణించిపోవుచున్నవియు, రాలిపోవు చున్నవియు అయిన మారేడు పండ్లచే ఆ భూమి అంతయు వెదజల్లబడినట్లు ఉండును. ఆ వనము శ్రీవనమని సర్వలోకములలో ప్రసిద్ధిచెందినది. గంధర్వులు, కిన్నరులు, యక్షులు, మహానాగులు, వీరిచేత సేవితమైనది. (నివసింపబడినది) ప్రతినిత్యము బిల్వ ఫలములనుతిను సిద్ధులచే వ్యాపించియున్నది. అనేక భూత (ప్రాణి) సంఘముల చేతను నిత్యము సేవింపబడినది. ఆ వనమున నిత్యము భగవతియైన సాక్షాత్తు లక్ష్మియే ఉండును. ఆమె సిద్ధ సంఘములచే నమస్కరింపబడినదై సన్నిహితురాలై ఉండును.
విశంకమను పర్వత శ్రేష్ఠమునకును మణిశైలమునకును మధ్యన నూరు యోజనముల వెడల్పు రెండుయోజనముల పొడవుగల ఒక విశాలమైన చంపక (సంపెంగ) వనము గలదు. అందు సిద్ధులును, చారణులును నివసింతురు. అది పుష్పలక్ష్మి (శోభ)తో చుట్టబడి ఎల్లప్పుడు తేజస్సుతో మండుచున్న దానివలె ఉండును. ఆ వనము అర్ధక్రోశ సమున్నతమైన శిఖరములతోను, పెద్ద బోదెలతోను ఆకులు గలిగి వికసించిన కొమ్మలు గల వృక్షములు ఉన్న శిఖరములచే ఎరుపు మించిన పసుపు (బంగారు) వర్ణముగలది. రెండు చేతుల వైశాల్యము గలిగి మూడు చేతుల పొడవు కలిగి, మణిశిలా చూర్ణమువలె ఎఱ్ఱనై తెల్లని కింజల్కములతో ఒప్పి, వికసించి సుగంధముగల మనోహరపుష్పములచే వ్యాపించి ఉండును. ఆ వనము అంతయు తుమ్మెదల నాదముచే నిండిఉండును. ఆ వనమునందు దానవులు, దేవ గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు, మహానాగులు నివసించుచుందురు.
అచట భగవంతుడైన కశ్యప ప్రజాపతియొక్క ఆశ్రమముగలదు. అది సిద్ధసాధ్య గణములతో వ్యాపించినది. అనేక వేదనాదములచే అలంకరింపబడినది. తరువాత రెండు పర్వతముల మధ్యన ఇంద్రనీలమణులచేతను, సన్నని ముంజగడ్డిచేతను ఒప్పినది. అచ్చట సిద్ధులు నివసించిన మహానదియైన ‘సుఖ’ అను నదియొక్క తీరమున, ఏబది యోజనముల పొడవై ముప్పదియోజనముల వెడల్పైన, అర్ధక్రోశము ఉన్నతమైన, తలలుగల మనోహరమైన తాటివనముగలదు. పెద్ద మూలములు (వేళ్ళు) గలిగి, మహాబలముగలిగి, స్థిరములై, దట్టమై, శుభములై, కలువలవలెను కాటుకవలెను ఉండి గుండ్రముగా ఉన్న పెద్ద (తాటి) పండ్లచే నిండిన వాసనయు రసమునుగల తాటిచెట్లతో ఒపి ఉండును. అది సిద్ధులు నివసించిన స్థలము.
అచట మహేంద్రుని గజశ్రేష్ఠమైన ఐరావతము యొక్క నివాసము కలదు. ఆ భద్రము అను ఏనుగు అచట నివసించుననియు, సర్వలోకములలో ప్రసిద్ధము. వేణుమంతము నకును సుమేధమను శైలమునకును ఉత్తరదిక్కున వేయి యోజనముల పొడవై నూరు యోజనముల వెడల్పైన, చెట్ల గుంపులతోను, తీగల గుత్తులతోను, అల్లిబిల్లిగ అల్లుకొన్న తీగలతోను ఒప్పినది. తరువాత గరిక వ్యాపించిన భూమి పచ్చిక బయలు ఏ జంతువులు లేనిదిగా కన్పడును. నిషధ పర్వతమునకును దేవ పర్వతమునకును ఉత్తరమున వేయి యోజనముల పొడవై, నూరు యోజనములు వెడల్పై, ఏకశిలామయమైన భూమి కలదు. అది వృక్షములు తీవపొదలునులేనిది. పాదమాత్రమైన నీటితో అంతటనిండి ఉన్నది. అవి మేరువునకు తూర్పుగా కొండపల్లములలో ఉండు కంచెలు, ఇవి అనేక ఆకారములు గలవి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! పూర్వ పూర్వ క్రమముగా ఉన్నవి ఉన్నట్లు వానిని గురించి ఇప్పటి వరకును నాచే చెప్పబడినది. (37)