సృష్టి ప్రకరణము

తరువాత సూతుడు ఈ విధముగా పలికెను:

సర్వశ్రేష్ఠమగు పరాక్రమము, కర్మ, బుద్ధి మరియు తేజస్సు కలిగినట్టియు, అనంత సూర్యుల వర్చస్సు కలిగినట్టియు, ముల్లోకములను సంహరించి, సృష్టించునట్టియు, దేవదేవుడైన మహేశ్వరునికి నమస్కారము. ముల్లోకములలో పూజింపబడు ప్రజాపతులను, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, భృగువును, మరీచిని, మనువును మరియు, రజస్తమో ధర్మములు గల కశ్యపుని, వసిష్ఠుని, దక్షుని, అత్రిని, పులస్త్యుని, కర్దముని, రుచిని, సూర్యుని, క్రతువును, అంగిరస మహర్షిని, ప్రజాపతిని, మరియు పులహుని మనసా స్మరించి, శిరసా నమస్కరించెదను.

మరియు, ఇరువది ఒకటవ ప్రజాపతియగు చుక్రోధనునికి నమస్కరించెదను. పురాతనులు, శాశ్వతులు, తమ తమ శిష్య గణములతో కూడి ఉన్నవారు. ధైర్యము (జ్ఞానము)తో శోభించువారు అగు ఇతర ఋషులకు నమస్కరించెదను. తపస్సు, సదాచారము, దయలతో కూడిన బృహస్పతి శుక్రాది మునిపుంగవులకు నమస్కరించి కలి యొక్క పాపమును పోగొట్టే పురాణమును చెప్పెదను వినుడు:

ప్రజాపతియొక్క ఈసృష్టి సర్వశ్రేష్ఠమైనది. దీని యందు ఇంద్రుడు, దేవ గణములు, ఋషి గణములు విరాజిల్లుచున్నవి. తపోధనులు, మహా తేజశ్శాలురు అగు ప్రజాపతులు శుభమైన, సాటిలేని, పుణ్యశాలియగు, ఋషి పూజితమగు సృష్టిని కూడా వర్ణించెదను. బ్రహ్మ యొక్క పగలు ప్రారంభమయ్యే వేళలో ఆయన సృష్టి సామర్థ్యము, ఈ జగద్రూపముగా ప్రకటితమయ్యెను. వేదమునందు, స్మృతులయందు వర్ణింపబడి, వాయుదేవునిచే కీర్తింపబడిన ఈ మహామహిమాన్వితమగు సృష్టిని వివరించెదను.

ఈ పురాణము సుందరమగు సమాసములతో, విశిష్టమగు శబ్దములతో మనస్సునకు ఈశ్వరుని సంకల్పముచే ఆహ్లాదమును కలిగించును. దీని యందు ఈశ్వరుని సంకల్పముచే ప్రధానము నుండి బయలుదేరిన ప్రథమ సృష్టి నిబంధింపబడినది. జగత్కాంణము, ప్రమాణ గోచరము కానిది, ప్రకృతికి మూలము, ఆత్మరూపముగా హృదయగుహయందు ప్రకాశించే ద్రష్టయగు పరబ్రహ్మము వర్ణింపబడినది. క్షేత్ర స్వరూపము, మరియు అక్షర శబ్దవాచ్యుడు, అమృత స్వరూపుడు, శుద్ధ జ్ఞానస్వరూపుడు, నిత్యుడు అగు జీవుని స్వరూపము, ముల్లోకములకు పితామహుడగు బ్రహ్మను సృష్టించిన అప్రమేయుడు (ప్రమాణములకు అందనివాడు) అగు పరమాత్మ స్వరూపము నిరూపింపబడినవి.

రజోగుణ ప్రధానుడగు సృష్టికర్త సృష్టి కాలమునందు కర్మఫలానుసారముగా, క్షేత్రజ్ఞుని (జీవుని)తో గూడిన, పాంచ భౌతిక వికారములగు దేహములను సృష్టించి, ఆ ప్రాణుల ద్వారా వాటి వాటి సంతానము వృద్ధియగునట్లు ఏర్పరచెను. జగద్రూపముగా పరిణమించిన ప్రకృతియందు మహేశ్వరుడు సంకల్ప మాత్రముచేతనే, తన ఎనిమిది అవస్థా విశేషములను (మూర్తులను) సృష్టించెను. దేవతలు, అసురులు, పర్వతములు, వృక్షములు, సముద్రములు, మనువులు, మహారాజులు, ఋషులు, పితరులు, ద్విజులు, పిశాచములు, యక్షులు, నాగులు, రాక్షసులు, నక్షత్రములు, గ్రహములు, సూర్యుడు, సప్తర్షి మండలము, నిశాచరులు, మాసములు, ఋతువులు, సంవత్సరములు, రాత్రులు, పగళ్లు, దిక్కులు, కాలము, యోగములు, యుగములు, అయనములు, వనములు, ఓషధులు, లతలు, సరస్సులు, అప్సరసలు, పశువులు, విద్యుత్తు, వర్షము, మేఘములు, పక్షులు మొదలగు వాటిగతి, విభాగము ఈ పురాణము నందు వర్ణింపబడినవి. భూమి యందు, ఆకాశము నందు ఉండే సూక్ష్మ గమనముగల ప్రాణులు మరియు చెట్లు మొదలగు కదలని ప్రాణులు (అచేతనములు) ఇత్యాది సర్వప్రాణుల గతి, విభాగములు దీనియందుగలదు, ఛందస్సులు, వేదములు, ఋక్కులు, యజుస్సులు, సామలు, సోమము మరియు యజ్ఞము దీనియందు వర్ణింపబడినవి. ఆ బ్రహ్మ దేవుడు తన అభిమతమును అనుసరించి వివిధ ప్రాణులకు జీవికను కల్పించుటను చెప్పుటకు ముందుగా వైవస్వత మనువుయొక్క పుట్టుక వర్ణింపబడినవి. ముల్లోకములయందు పూజింపబడే ఇంద్ర, బృహస్పతి, మన్వాది ధీశాలుర పుట్టుకచే, ఈ సృష్టి పూర్ణమై ప్రకాశించినది. అట్టి ఆ పుణ్యాత్ముల ఉత్పత్తి కూడా వర్ణింపబడినది.

రుద్రుని శాపముచే దక్షుడు మనుష్య లోకములో జన్మించి, నియమబద్ధముగా జీవించుట, దక్షుడు రుద్రునకు ప్రతిశాపమును ఇచ్చుట. మన్వంతరములు మారుచుండుట, యుగములయందు జరిగు సృష్టి ప్రళయములు, ఋషి ధర్మము, యుగాదుల యందు దానివృద్ధి వర్ణింపబడును. ద్వాపరయుగములందు వేద విభాగముచేసిన వ్యాసుల క్రమము, కల్పములోని సంవత్సరముల సంఖ్య, లోకముల సంఖ్య, బ్రహ్మయొక్క దినములోని కాలమానము అను విషయములు ఈ పురాణములో నిబంధింపబడినవి.

అండజములు (గ్రుడ్డు నుండి పుట్టే పక్ష్యాదులు), ఉద్భిజములు (భూమి నుండి పుట్టే వృక్షాదులు) స్వేదజములు (చెమట నుండి పుట్టే నల్లులు మొదలైనవి), జరా యుజములు (గర్భమునుండి పుట్టే మనుష్యాదులు) అను నాల్గురకముల ప్రాణులు, స్వర్గాది లోకములను పొందు ధర్మాత్ములు, నరకములో యాతనలను అనుభవించు జీవుల వివరములు ఈ పురాణములో సోపపత్తికముగా వర్ణింపబడినవి. అత్యంతిక ప్రళయము (జగత్తు ఈశ్వరుని యందు విలీనమగుట), ప్రాకృతిక ప్రళయము (దేహము పతనమగుట), నైమిత్తిక ప్రళయము (నిద్రలోనికి జారుకొనుట), బంధ మోక్షములు, సర్వోత్కృష్టమగు ప్రాజాపత్య స్థానముతో కూడిన సంసారగతి దీనియందు వర్ణింపబడినవి. ప్రళయమునందీ బ్రహ్మాండములు జగత్కారణమగు ప్రకృతియందు విలీనమై ఉండుట, ఇత్యాది విషయములను అన్నింటిని ధీశాలురగు మీ ముందు నా బుద్ధిశక్తిని అనుసరించి ఆవిష్కరించెదను. ఓ విప్రులారా! వాయుదేవునిచే మహర్షులకు చెప్పబడిన పురాణమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పెదను. వినుడు.