వాయు మహా పురాణము
నీలకంఠస్తవము
ఋషులు అనిరి:
ఓ మహాకాంతివంతుడా! సూతా! బ్రహ్మ నుండి ఏకాలములోను, ఏ దేశములోను ఇట్టి పుణ్యమైన ఆఖ్యానము జరిగినది. దీనిని జరిగినది జరిగినట్లు మాకు చక్కగా జెప్పుడు.
సూతుడు అనెను:
ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! వేయియేండ్ల యాగమందు జగత్తునకు ఆయువైన వాయువుచే చెప్పబడుచుండగా పూర్వము నేను విన్నది విన్నట్లు చెప్పెదను వినుడు. దేవదేవుడైన శివుని కంఠమునకు నలుపు ఎందులకో నేను చెప్పెదనువినుడు. శైలరాజైన హిమాలయము యొక్క ఉత్తరమున సరస్సులును, నదులును, మడుగులును కలవు. పవిత్రమైన ఉద్యానములలోను, తీర్థములతోను, దేవాలయములతోను ఎత్తైన పర్వత శిఖరములలోను గుహల లోను వాని ఉపవనములలోను, దేవభక్తులు, మహాత్ములు స్తుతింపబడిన వ్రతములుచేయు మునులు అచ్చటచ్చట యథావిధిగా మహాదేవుని స్తుతింతురు. ఋగ్వేద, యజుర్వేద, సామవేదములతోను, నృత్యములతోను, గీతములు, మొదలగు పూజలతోను, ‘ఓం’కారము తోను నమస్కారములతోను సదాశివుని అర్చింతురు. జ్యోతిశ్చక్రము బాగుగా తిరుగగా సూర్యుడు మధ్యమున వ్యాపించినవాడు నిశ్చయాత్ములై దేవతలందరు ఆ కథను వినుటకై కూర్చుందురు. తరువాత నియమముతో ఉండుటచే ప్రాణశేషులై ఉండిరి. వాయువు ‘నమస్తే నీలకంఠాయ’ అనెను. అదివినిన వారిలో ఆత్మభావము గలవారును, గొప్ప వ్రతములు చేయువారును, సూర్యునితోడుగా చరించువారును వాలఖిల్యులు అను ప్రసిద్ధి చెందిన మునులు ఉండిరి. వారు ఎనుబది ఎనిమిది వేలమంది. ఊర్థ్వ రేతస్కులు కావున ఆకులు, జలము, వాయువులను మాత్రమే భుజించువారై వాయువును ఇట్లు ప్రశ్నించిరి.
ఋషులు పలికిరి:
ఓ వాయు పండితోత్తమా! ఓ పుణ్యకార శ్రేష్టులారా! నీవు ‘నీలకంఠ’ అన్నది రహస్యమైనదియు, పవిత్రమైన వానిలో పుణ్యమైనది. కావున, ఓ వాయుదేవా! పార్వతీ పతియైన శివుని యొక్క కంఠమందలి నలుపునకు కారణమేమో! నీ అనుగ్రహమున వినదలచితిమి’ విశేషించి నీముఖము నుండియే చక్కగా తెలుసుకొనతలచితిమి. నీవు చెప్పిన మాటలు సారముతో కూడిన అర్థములు గలవై వెలువడినంత వరకు వినదలచితిమి. వాయువు మానవుని వర్ణోత్పత్తి స్థానములందు ఉండగా మాటల ప్రక్రియ చక్కగా నడుచుచుండును. ఓ వాయుదేవా! మానవులలో నీ వల్లనే మొదట జ్ఞానము, తరువాత ఉత్సాహ
మును కలుగును. నీవు కదులుచుండగనే తక్కిన వర్ణముల ఉచ్చారణలు జరుగును. వాక్కులు బయలువెడలక, వెనుకకే వెళ్ళినప్పుడు దేహబంధములు (దేహమునకున్న అవయవ బంధములు) దుర్లభములు అగును. ఓ వాయుదేవా! అచటగూడ నీ చక్కని ఉనికిగలదు. నీవు అంతట ఉండువాడవు గదా! నీవుతప్ప అంతటవుండు దేవుడు మరొకడు లేదు. ఈ నీవు జీవలోక మంతటను ప్రత్యక్షముగా ఉన్నావు. నీవు బ్రహ్మదేవుని తెలిసిన వాడవు. మనోనాయకుడైన ఈశ్వరుడు గూడ నీకు తెలియును. కావున ఈశ్వరుని కంఠదేశమున కలిగిన రూపవికారమైన నలుపుతనము దేనివల్ల జరిగినది? అని అడిగిన భావి తాత్ములైన ఆ ఋషుల మాటవినిన తరువాత లోకనమస్కృతుడు, మహాతేజస్వి అయిన వాయువు ఇట్లు మారుపలికెను.
పూర్వము కృతయుగమున బ్రహ్మ మానసపుత్రుడును, బ్రాహ్మణుడును, వేద నిర్ణయతత్పరుడును, ధర్మాత్ముడు అయిన వసిష్ఠుడను మహర్షి ఉండెను. అతడు మయూర వాహనుడును, మహిషాసురుని భార్యల మాంగళ్యచిహ్నమైన కంటికాటుకను దొంగిలించిన వాడును, కృత్తికా పుత్రుడైన కుమారస్వామిని (దేవ) మహాసేనుడు, మహాత్ముడు మేఘ గర్జనమువంటి కంఠధ్వని గలవాడును, ఉమాదేవియొక్క మనస్సుకు సంతోషము కలిగించు బాలక రూపమును ధరించినవాడును, క్రౌంచ పర్వత జీవితమును హరించువాడును. పార్వతీ హృదయనందనుడును, మహాబలుడును అయిన కార్తికేయుని (కుమారస్వామి) తో అడుగుచున్నాడు.
వసిష్ఠుడు భక్తితో:
“హరుని కుమారుడవగు నీకు నమస్కారము. ఉమాదేవి యొక్క గర్భస్వరూపుడవైన నీకు నమస్కారము. అగ్నియొక్క గర్భస్వరూపుడవైన నీకు నమస్కారము. గంగాగర్భ స్వరూపుడవైన నీకు నమస్కారము. రెల్లుగడ్డిగర్భస్వరూపుడవైన నీకు నమస్కారము. కృత్తికానక్షత్ర గణస్వరూపులైన షట్కృత్తికల సుతుడవైన నీకు నమస్కారము. పండ్రెండు నేత్రములు గల నీకు, ఆరు ముఖములుగల నీకు నమస్కారము. శక్తిఅను ఆయుధమును చేత ధరించిన నీకు నమస్కారము. దివ్యమై ఘంటధ్వజముగాగల నీకు నమస్కారము” అని ఈ విధముగా మహాసేనుడగు కుమారస్వామిని స్తుతించి ఆ నెమలి వాహనగాగల కుమారస్వామిని వసిష్టుడు. “శుభ్రమైన కాటుక కాంతిగలిగి కనబడుచున్న ఈ (నల్లని) వర్ణము, మల్లెపూవుతోను చంద్రునితోను సమానమైన శివుని కంఠమున ఎందుకు పుట్టినది? ఈ విషయములకును ఆప్తుడును, భక్తుడును, ఇంద్రియదమనశక్తి కలవాడనై నిన్ను అడుగుచున్న నాకు తెలియచేయుము మంగళముతో కూడినదియు, పవిత్ర మైనదియు, పాపములు నశింప జేయునదియు అయిన ఈ నీలకంఠ కథను పూర్తిగా నా ప్రీతికై నీవే చెప్పగల సమర్థుడవు” అని అడిగెను. అటు తరువాత, మహాత్ముడైన వసిష్ఠుని యొక్క మాటనువిని మహాతేజస్వియై, రాక్షస బలముల చంపిన కుమారస్వామి ఓ ప్రవక్తలలో శ్రేష్ఠ (వశిష్ఠు) నేను చెప్పు మాటలు వినుము. మహాత్ముడైన శివునకు పార్వతితో జరిగిన సంవాదమును పూర్వము ఉమాదేవియొక్క ఒడిలో కూర్చొని నేను విన్నది విన్నట్లుగా చెప్పెదను వినుము” అని పలికెను. ఇంకను చెప్పుచు...
కైలాస శిఖరము రమ్యమైనది. అనేక ధాతువులచే విచిత్రమైనది. అనేక వృక్షల తలచే వ్యాపించినది, చక్రవాక పక్షులతో ప్రకాశించినది, తుమ్మెదల గానములతో నిండినది. జడివానల చప్పుడులతోను, జలధారా పాతములతోను ప్రతిధ్వనితమైనది, మదించిన క్రౌంచపక్షుల యొక్కయు, నెమళ్ళయొక్కయు నాదములతో ప్రతిధ్వనించిన గుహలు గలది, అప్సరోగణములతో వ్యాపించినది, కిన్నరులతో ప్రకాశించినది, జీవం జీవకములు అనెడు వృక్షముల యొక్కయు, జాజి వృక్షముల యొక్కయు తీగలచే ప్రకాశించినది, కోకిల ధ్వనులచే మధురమైనది, సిద్ధ-చారణులు నివసించినది, గోవుల అంబారవములచే ఒప్పనది, క్రిందిగా మేఘగర్జన ధ్వనులు కలది? వినాయకుని భయముచే ఉద్విగ్నమైనది. ఏనుగులతో కూడిన గుహలు కలది, వినసొంపైన వీణావాదన ధ్వనులతో కూడినది, ఊయలలో ఊగు జనసమూహము గలది, స్త్రీ సంఘములు నివసించినది, ధ్వజములతో వ్రేలాడిన గంటల నాదములునిండినది. ముఖములతోను, మద్దెలలతోను, వాద్యవిశేషముల తోను, బలవంతులు చేతులు చఱచుటలతోను, ఆటలలో చరించు ధ్వనులతోను నిండిన భవనములు గలది. నవ్వులతోను, భయము పుట్టించు వికటములైన ముఖములతోను, విచిత్రములైన దేహ గంధములతో పీడింపబడిన గణపతులతోను, వజ్రములు, స్ఫటికముతో నిర్మింపబడిన మెట్లపైని, చిత్రములైన పట్టికలుగల శిలల పై భాగములతోను చుట్టబడినది, పులిముఖములు గలవారితోను, సింహముఖములు కలవారితోను, ఇంకను ఇతరములైన ఏనుగు గుఱ్ఱముల ముఖములు గలవారితోను, పిల్లి ముఖము గలవారితోను, క్రూరములైన నక్కల ఆకారముగల వారితోను, పొట్టి వారితోను, పొడుగు వారితోను బక్కచిక్కిన వారి తోను, బలిసిన వారితోను, వ్రేలాడు పెద్ద పొట్టలుగల వారితోను, పొట్టి పిక్కలుగలవారి తోను, వ్రేలాడు పెద్ద పెదవులుగలవారితోను, తాడిచెట్టువంటి పెద్దవైన పిక్కలుగలవారి తోను, గోవు చెవులవారితోను, ఒక చెవిగలవారితోను, పెద్ద చెవులు గలవారితోను, చెవులే లేనివారి తోను, అనేక పాదములు గలవారితోను, పెద్ద పాదములు గలవారితోను, పాద ములే లేనివారితోను, పెక్కుతలలు గలవారితోను, పెద్దతలలు గలవారితోను, ఒకే తలగలవారితోను, తలయేలేని వారితోను, పెక్కు కన్నులు గలవారి తోను, పెద్ద కన్నులుగల వారితోను, ఒకే కన్నుగలవారితోను, కన్నులేలేని వారితోను, ఈ విధముగా ఉన్న మహా యోగి భూతులైన వారిచే భూతపతియైన శివుడు చుట్టబడి ఉన్నాడు. అపుడు, పరిశుద్ధములైన ముత్యములు, మణులు వీనిచే అలంకరింపబడి బంగారు మయమైన మనోహరమైన శిలాతలమున సుఖముగా కూర్చొని ఉండి మన్మథ శరీరమును దహించిన శివునితో గిరిరాజపుత్రియైన...
పార్వతి:
“భూతభవిష్యత్తులకు ప్రభువై, వృషభధ్వజుడవైన ఓ భగవంతుడవైన మహాదేవా! నీ కంఠమున కమలముతో సమానమైనదియు, అంతగా మసకగానిదియునై, అంతగా స్పష్టము గానిదియు, నల్ల కాటుక సమూహముతో పోలినదియు కాని ఓ సంహారకా! దేవా! నీ కంఠమున ప్రకాశించుచున్నది. ఇది యేమి ? ఓ ఈశ్వర! నీ కంఠమునందుగల నలుపునకు కారణమేమి? ఇది అంతయు న్యాయానుసారముగ చెప్పుడు. నాకు చాలా కుతూహలముగా ఉన్నది” అని అడుగగా అంత పార్వతీప్రియుడైన శివుడు ఆపార్వతి మాటను విని మంగళముతో కూడిన కథను చెప్పసాగెను. “పూర్వము దేవదానవులచేత పాల సముద్రము మథింపబడుచుండగా దానిలో మొదట ప్రళయకాలాగ్నితో సమానమగు కాంతిగల విషము బయలువెడలినది. దానిని చూచి, దేవసంఘములును, రాక్షసులును విషాదముతో కూడిన ముఖములు గలవారై, అందరును బ్రహ్మ సమీపమునకు వెళ్ళిరి. మహాతేజస్వియైన బ్రహ్మ, భయపడిన దేవగణములను చూచి, “ఓ మహాభాగులారా! మీరెందుకు భయపడి ఉద్వేగము చెందిన చిత్తములు గలవారైతిరి? నేను మీకు ఎనిమిదింతల ఐశ్వర్యమును కల్పించి ఇచ్చితిని. మీరే కారణముచేత ఐశ్వర్యములు పోయిన వారైతిరి! మీరు ముల్లోకములకు ఈశ్వరులు. మీరందరు జ్వరము లేనివారు నేను సృజించిన సృష్టిలో నా ఆజ్ఞను తిరస్కరించిన వాడులేడు. అందరు విమానములలో పోవువారు. అందఱును స్వేచ్ఛగా చరించువారు. ఆధ్యాత్మికమునందును, ఆత్మకు సంబంధించిన విషయమునందును) ఆధిభౌతికమునందును (పాంచభౌతికముగా శరీరమునకు సంబం ధించిన విషయము నందును, ఆధి దైవికమునందును (దైవవశమున తటస్థించిన విషయమునందును) మీరు కర్మ విపాకముతో ప్రజలను ప్రవర్తింపజేయుదురు. కావున, సింహముతో పీడింపబడిన లేళ్ళవలె మీరెందులకు భయపీడితులు అగుచున్నారు? మీ దుఃఖమేమి? దేనిచేత మీకు సంతాపము గలిగినది? మీకు భయము ఎక్కడి నుండి వచ్చినది? ఇది అంతయు న్యాయమును అనుసరించి శీఘ్రముగా తెల్పుడు” అనెను.
తరువాత మహాత్ముడైన బ్రహ్మయొక్క మాటను విని ఋషులతోబాటు దేవతలు దైత్యేంద్రులు, దానవులును “ఓ మహాత్మా! దేవదానవులచే పాల సముద్రము మధింపబడు చుండగా కాలసర్పముతోను, తుమ్మెదలతోను సమానమైనదియు నీలమేఘముతో సమాన మైనదియు, ప్రళయకాల సంవర్తాగ్నితో సమానమైన కాంతిగలదియునై ఘోరమైనదైన విషము బయలు వెడలినది. అది కాలమృత్యువువలె బయటకు వచ్చినది. యుగాంతకాల సూర్యకాంతి గలది. ముల్లోకములు నశింపజేయు సూర్యుని వంటిది. అంతటను వెలుగులను విరజిమ్ముచున్నది. ఆ విధముగా కాలాగ్నికాంతితో పైకి లేచుచున్న విషముచే తెల్లని శరీరముగల జనార్దనుడైన విష్ణువు దహింపబడి నల్లని వాడయ్యెను. ఎఱుపు, తెలుపు శరీరముగల ఆ విష్ణువును నల్లనైనవానిగా చూచి దేవతలము అందరము భయపడిన వారమై నిన్నే శరణుచొచ్చితిమి” అనిచెప్పగా దేవరాక్షసులు మాటలను విని మహాతేజస్వియైన బ్రహ్మలోకముల హితమును గోరి బ్రహ్మ ఇట్లని మారుపలికెను. ఓ సమస్త దేవతలారా! ఋషులారా! మునులారా! వినుడు. పాల సముద్రము మధింప బడుచుండగా మొదట పుట్టిన ప్రళయకాలాగ్ని సమమై, కాలకూటమని ప్రసిద్ధి చెందినది. అది పుట్టినంత మాత్రముననే దానిచే, విష్ణువు నల్లగా మారినాడు. ఆ విషమును విష్ణువు, నేనును, ఆ సమస్త దేవతా శ్రేష్ఠులును ఒక్క శంకరుడు దక్క తక్కిన ఎవ్వరును సహింపలేరు అని చెప్పి పద్మగర్భమువంటి పసిడికాంతి గలవాడును, పద్మమున పుట్టి అయోనిజుడైన లోకపితామహుడైన బ్రహ్మ శివుని ఈ విధముగా స్తుతింప మొదలిడెను.
“ఓ విరూపాక్షా (మూడు కన్నులు గలవాడా!) నీకు నమస్కారము. అనేక నేత్రములు గల నీకు నమస్కారము. పినాక ధనువు చేతియందు గలవానికి నమస్కారము. వజ్రము చేతియందు గలవానికి నమస్కారము. ముల్లోకముల అధిపతికి నమస్కారము. భూతముల పతికి నమస్కారము. రాక్షస సంహారకునకు నమస్కారము. తాపసునకు నమస్కారము. ముక్కంటికి నమస్కారము. బ్రహ్మవైన నీకు నమస్కారము. రుద్రుడవైన నీకు నమస్కారము. విష్ణువైన నీకు నమస్కారము. సాంఖ్యతత్త్వరూపుడవైన నీకు నమస్కారము. యోగతత్త్వ రూపునకు నమస్కారము. భూతములకు శిలారూపుడవైన నీకు నమస్కారము. మన్మథ శరీరమును భస్మము జేసినవానికి నమస్కారము. మార్కండేయ రక్షణకై యమునకుగూడ యముడవైన నీకు నమస్కారము. రుద్ర రూపునకు నీకు నమస్కారము. దేవేంద్రరూపునకు నీకు నమస్కారము. దేవతల దేవునకు నమస్కారము. జటాజూటముగల నీకు నమ స్కారము. ఏకరూపుడవైన నీకు నమస్కారము. శివునకు నమస్కారము. వరదునకు నమస్కారము. త్రిపురాసురుల త్రిపురములను భస్మము జేసిన నీకు నమస్కారము. అందరూ వందనము జేయతగిన వాడవైన నీకు నమస్కారము. సప్తమాతృదేవతల పతికి నమ స్కారము. జ్ఞానస్వరూపునకు నమస్కారము. శుద్ధస్వరూపునకు నమస్కారము. ముక్తస్వరూపునకు నమస్కారము కేవల ఏకస్వరూపునకు నమస్కారము. కమలము వంటి హస్తములుగల నీకు నమస్కారము. దిగంబరునకు నమస్కారము. నెమిలిపింఛము (మాయాకిరాతడై) ధరించినవానికి నమస్కారము. వరుణస్వరూపునకు నీకు నమస్కారము. అగ్రునకు అందరికన్న ముందుండు వానికి నమస్కారము. ఉగ్రస్వరూపునకు నమస్కారము. విప్రస్వరూపునకు నమస్కారము. అనేకములైన కండ్లు గలవానికి నమస్కారము. రజోగుణ స్వరూపునకు నమస్కారము. సత్త్వగుణ స్వరూపునకు, తమస్స్వరూపునకు నమస్కారము. జన్మములేనివానికి నమస్కారము. పరమాత్మగా నిత్య స్వరూపునకు నమస్కారము. జీవాత్మగా అనిత్యస్వరూపునకు నమస్కారము. నిత్యానిత్య స్వరూపుడవైన నీకు నమస్కారము. (జగముగా) వ్యక్తస్వరూపునకు నీకు నమస్కారము. (జగదతీతముగా) అవ్యక్తస్వరూపునకు నమస్కారము. (విశ్వవ్యాప్తుడుగా) చింతింప (ధ్యానింప) తగినవానికి నమస్కారము. (విశ్వా తీతుడుగా) ధ్యానమునకు మించిన వానికి నమస్కారము. చింత్యాచింత్య స్వరూపునకు నమస్కారము. భక్తుల బాధలను నశింప చేయువానికి నమస్కారము. నరనారాయణ స్వరూపునకు నమస్కారము. ఉమాదేవీ ప్రియునకు నమస్కారము. శర్వునకు, ప్రళయమున భూతలములను నశింపచేయువానికి నమస్కారము. నంది చక్రములు చిహ్నములుగాగల హరిహర స్వరూపునకు నమస్కారము. పక్షము, ఒకటిన్నర మాసము, మాసము వీని స్వరూపునకు నమస్కారము. సంవత్సర స్వరూపునకు నమస్కారము. బహురూపములు గలవానికి నమస్కారము. బోడితలగలవానికి నమస్కారము. దండముగలవానికి నమ స్కారము. కవచము గలవానికి నమస్కారము. కపాలము చేతగల వానికి నమస్కారము. దిగంబర స్వరూపునకు నమస్కారము. నెమిలి పింఛము ధరించినవానికి నమస్కారము. ధ్వజము గలవానికి నమస్కారము. రథముగలవానికి నమస్కారము. బ్రహ్మచారికి (ఆత్మ బ్రహ్మయందు చరించు వానికి) నమస్కారము. ఋగ్వేదస్వరూపునకును, యజుర్వేద స్వరూపునకును సామవేద స్వరూపునకును నమస్కారము. సాంఖ్య పురుష స్వరూపునకు నమస్కారము. ఈశ్వర సాంఖ్య స్వరూపునకు నమస్కారము” ఈ మొదలగు నీ చరితములుగల ఓ దేవా! నీకు నమస్కారము” బ్రహ్మ చేసిన స్తుతిన వినిన
మహేశ్వరుడు:
“ఓ పార్వతీ! ఈ విధముగా దేవతలచే నమస్కారమునందిన నేను స్తుతింపబడితిని. బ్రహ్మనగు నా భక్తిని తెలిసి దేవదేవుడైన శివుడు గంగాజలముతో స్నానముచేసి శివము గలవాడును, మిక్కిలి యోగాతిశయముచే సూక్ష్మడును ధ్యానాతీతుడు అయ్యెను. శిరమున తడిసిన చంద్రుడుగూడ కనబడుటలేదు. ఈ రీతిగా పూర్వము భగవంతుడై లోకకర్తయైన బ్రహ్మచే వేదముల నుండియు వేదాంగములైన శిక్షాదులనుండియు పుట్టిన వివిధ స్తోత్రములచే స్తుతింపబడిన నేను ఆ మహాత్ముడైన బ్రహ్మనుగూర్చి సంతసించినవాడనైతిని. తరువాత నేను చిన్న మాటతో బ్రహ్మతో “ఓ భగవంతుడా! భూత భవిష్యత్ కాలములకు ప్రభువైన వాడా! లోకనాథా! జగత్పతే! బ్రహ్మా! నీ కొరకు నేనేమి జేయవలెను. సువ్రతుడా! చెప్పుము” అని అంటిని. ఈ మాటవిని కమలముల వంటి కన్నులుగల బ్రహ్మ మారుపలికెను. భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అధిపతియై జగత్కారణుడవైన ఈశ్వరా! వినుము. అంబు జేక్షణుడవైన ఓ భగవంతుడా! దేవదానవులచే సముద్రము మథింపబడు చుండగా నల్లని మేఘమువంటిదియు. ప్రళయాగ్ని వంటిదియు అయిన భయంకరమైన విషము ఉద్భవించినది. అది అకాలమృత్యువువలె పుట్టినది. యుగాంత సూర్యునివలె ప్రకాశిం చునది. ముల్లోకములను నశింపజేయు సూర్యునివలె వెలుగుచున్నది. అన్నివైపులా ప్రకాశిం చున్నది. దాని కొసలో కాలాగ్ని కాంతిగల విషము బయలువెడలినది. దానిని చూచి మేము భయపడి ఆశ్చర్యము చెందితిమి. కావున ఓ మహాదేవ! లోకహితమును కోరి ఈ విషమును త్రాగుము. నీవే ఆ మొదటి సముద్ర ఫలమును భుజించువాడవు. నీవే దానికి శ్రేష్ఠమైన సమర్థుడవు. ఓ మహాదేవా! నీవు దక్క ఆ విషమును సహించువారు ఎవ్వరూ లేరు. ముల్లోకములలో దీనికి సమర్థుడైన పురుషుడు ఎవ్వడును లేడు అని ప్రార్థించెను.
పరమేష్ఠియైన బ్రహ్మయొక్క మాటవిని, ఓ శ్రేష్ఠమైన ముఖము గలదానా పార్వతీ! సరియే అని ఆ బ్రహ్మ వాక్యమును స్వీకరించితిని. తరువాత యమునితో సమానమైన విషమును త్రాగుటకు ప్రారంభించితిని. ఓ ఉత్తమురాలా! దేవభయంకరమైన ఆ ఘోరవిషము త్రాగుచున్న నా కంఠము వెంటనే నల్లనైనది. కలువరేకువలె ఉన్నదియు, కంఠమున అంటియున్న సర్పమువలె ఉన్నదియు, నాగరాజైనతక్షకుని నాకుచున్నట్లున్న ఆ విషమును జూచి లోకపితామహుడైన బ్రహ్మ ఓ సువ్రతుడవైన మహాదేవా! ఈ కంఠముతో శోభించుచున్నావు అని అనెను.
బ్రహ్మమాటనువిని ఓ హిమాలయ పుత్రీ! యక్షులు, గంధర్వులు, భూతములు, పిశాచులు, ఉరగులు, రాక్షసులు, వీరందరు చూచుచుండగా భయంకరమైన ఆ విషమును నేను కంఠములో ధరించితిని. కావున, ఓ పర్వతరాజ పుత్రి! ఉగ్రతేజమైన కాలకూట విషమును కంఠములో ప్రవేశపెట్టుచుండగా చూచి దేవదానవ సంఘము మిక్కిలి ఆశ్చ ర్యము చెందెను.
ఓ మదించిన ఏనుగ నడకలవంటి నడకలుగల పార్వతీ! “తరువాత దేవగణము లందరు, దైత్యులు ఉరగులు, రాక్షసులు చేతులు జోడించినవారై గంగాజలముచే కొట్టబడి విడివడిన తల వెంట్రుకలుగల ఓ దేవదేవా! నీ యొక్క బలము వీర్యము పరాక్రమమును ఆశ్చర్యకరములైనవి. మఱి నీ యోగబలము కూడ ఆశ్చర్యకరమైనది. నీవే విష్ణువు నీవే బ్రహ్మవు, నీవే మృత్యువు, నీవే వరదుడవు, నీవే సూర్యుడవు, నీవే చంద్రుడవు, నీవే భూమివి, నీవే జలము, నీవే యజ్ఞము, నీవే నియమము, నీవే భూతకాలము, భవిష్యత్కాలమును నీవే. అన్నిటికిని అదివి (మొదలు) నీవే మరణము. నీవే స్థూలుడవు. నీవే సూక్ష్ముడవు. నీవే అగ్నివి. నీవే వాయువు, నీవే చరాచరమైన లోకమునకు కర్తవు. ప్రళయమున రక్షించువాడవు అని ఈ విధముగా చెప్పి దేవేంద్రులు అందరును ఉమాసహితుడనైన నాకు శిరస్సుతో నమస్కరించి, అడ్డరాని వేగములతో మేరువు దరికి వెళ్ళిరి”. అని శంకరుడు పార్వతితో చెప్పెను.
ఇది పరమ రహస్యము పుణ్యములు అన్నింటికన్న మహాపుణ్యము. నీలకంఠుని గురించిన విషయమును చెప్పినది ప్రఖ్యాతమై లోకప్రసిద్ధమైనది. స్వయముగా బ్రహ్మచే చెప్పబడినదియు, పుణ్యమై పాపములు నశింపజేయునది అయిన బ్రహ్మనుండి పుట్టిన కథను విని జ్ఞప్తియందు ఉంచుకొన్నవానికి లభించు మహాఫలమును గూర్చి విపులముగా చెప్పెదను. ఓ పార్వతీ! ఈ కథను విని ధారణచేసిన వాని శరీరమును స్థావరమైనదిగా జంగమమైనదిగాని అయిన విషము చేరిన వెంటనే ప్రభావము చూపక నశించిపోవును. భయంకరమైన అశుభము శాంతించును. చెడుస్వప్నములను పోగొట్టును. స్త్రీలకును, సభలో రాజునకును, ప్రేమ పాత్రుడగును. వివాదములో జయమును పొందును. యుద్ధమున శౌర్యమునందును. దారిలో పోవువాడు క్షేమమును, ఇంటనున్నవాడు నిత్య సంపదలను పొందును. ఓ శ్రేష్ఠ ముఖముగల పార్వతీ! జన్మాంతరమున గూడ అతని ప్రాప్తిని చెప్పెదను.వాడు నీలకంఠుడు, పచ్చని మీసములు గలవాడును. చంద్రుడు అలంకరించిన శరీరము గలవాడును. ముక్కంటియు, త్రిశూలము చేతగలవాడును, ఎద్దు వాహనము గలవాడును, పినాక ధనువును చేతబూనినవాడును, నందితో సమ బలుడు, శ్రీమంతుడును, నందితో సమానమైన పరాక్రమము గలవాడునునై తొందరలోనే నా ఆజ్ఞచే సమస్త లోకములందు చరించును. ఆకాశమున వాయువునకువలె అతని గమనమునకు అడ్డుండదు. నాతో సమబలుడై భూత ప్రళయము వరకు ఉండును. ఈ కథను విన్న నామానసభక్తుల ఈ లోకములోనిగతిని, పరలోకములోని గతిని ఓ పార్వతీ చెప్పెదను. బ్రాహ్మణుడు వేదమును పొందును. క్షత్రియుడు భూమిని జయించును. వైశ్యుడు (తన వ్యాపారమున) లాభమును పొందును. శూద్రుడు సుఖమును పొందును. వ్యాధితో బాధింపబడినవాడు ఆ వ్యాధినుండి ముక్తుడగును. కారాగార బద్ధుడు బంధనము నుండి విముక్తుడగును. గర్భవతి పుత్రుని పొందును. కన్య మంచి భర్తను పొందును. ఇహపర లోకముల రెండింటను నష్టపోయిన సమస్తమును తిరిగి పొందును. లక్ష గోవులను చక్కగా దానముచేసిన వాని కలుగు ఫలము ఈ ప్రభువైన నీలకంఠుని దివ్యకథను విన్న వానికి లభించును. పావుభాగముగాని, సగభాగమునుగాని, ఒక శ్లోకమునుగాని, శ్లోక సగ భాగమునుగాని నిత్యము పఠించువాడు రుద్రలోకమును చేరును. కుమారస్వామికి ప్రియుడైన, ప్రభువైన చంద్రశేఖరుడైన శివుడు పుణ్య ఫలములు మొదలగు నవిగల ఈ కథను తన దేవియైన పార్వతికి చెప్పి, పార్వతీదేవితో పాటు తన వాహనమైన వృషభముపై కిష్కింధగుహకు వెళ్ళెను. నాచేత దాటబడిన పాపహారమైన మహాపదమును చెప్పి వారికి వాయువు ఆ స్థానము ఇచ్చెను. తరువాత బ్రాహ్మణోత్తముడైన సూతుడు అఖిల సులక్షణ ములుగల సమస్తము అధ్యయనముతో పొంది సూర్యమార్గమును చేరెను.