వాయు మహా పురాణము
భువన విన్యాసము - 9
సూతుడు అనెను:
భద్రాశ్వుల నిజమైన స్వభావమును ఇప్పటి వరకును వర్ణింపబడినది. ఇక కేతుమాలుల స్వభావమును విస్తరముగా వినుడు. పశ్చిమమందుగల నిషధాచల శ్రేష్ఠము యొక్క పశ్చిమముగా సర్వదిక్కులయందు చెప్పబడిన ఏడు కులాచలముల గురించి, నదులను గురించి, విశేషించి జనపదములను గురించి విస్తరమును చెప్పుచున్నాను. వినుడు. విశాలము, కంబలము, కృష్ణము, జయంతము, హరిపర్వతము, అశోకము, వర్ధమానము అను ఈ ఏడు కులపర్వతములు, వాని సంతానము బహువిస్తారములైన ఇతర పర్వతములు, నూర్లకొలదియు వేలకొలదియు అయిన కోటి కోటి శతములని తెలియవలెను. వానితో గలిసిన జనపదములు నానాజాతి వ్యాకులములు, నానా ప్రకారములునై అనేక రాజులచే పరిపాలింపబడినవి.
భూమిలో అవి వాని వాని పేర్లతో విక్రమించినవై వివిధములుగా చెప్పబడినవి. జనపదములు నెలకొన్నవై అవి కీర్తనములతో నలంకరింపబడినవి.
వాటికి సమానమైన పేరుగల రాష్ట్రములు అనేకములు. అవి గిరుల మధ్యలో సమస్థానముల లోను విషమ (ఎగుడు దిగుడు) స్థానములలోను ప్రవేశించినవి. ఇచట పురమున నివసించు పౌరులు, గోవులు, మనుష్యులు, పావురములు. వాని ముఖములు గలవారు. భ్రమరులు, యూధులు, మాహేయాచల కూటకులు (శిఖరమున ఉండువారు) కూటకంబల (కూటముగ ఉండువారు) మౌషీయులు, గొంగళ్లు ధరించువారు. ఎలుకలతో ఉండువారు), సముద్రాంతరకులు (సముద్రాంతర్భాగమున ఉండువారు) కరంభవులు, కుచులు, శ్వేతులు, శుభులైన సువర్ణకంకణములుగలవారు, శ్వేతాంగులు, కృష్ణపాదులు, విహులు, కపిల కర్షకులు, అత్యాకరాలగోజ్వాలులు, హీనాదులు, వనపాతకులు, మహిషులు, కుముదాభులు, కరవాటులు, సహనత్కచులు, శుకవాసులు, మహావాసులు, వనాసులు, గజభూమి కులు, కుబేరులు (మిడిగ్రుడ్లు గలవారు) ధూమజులు, జంగులు, పంగులు, రాజీవులు, కోకిలలు, వాచాంగులు, మహాంగులు, మధౌరేయులు, సురేచకులు, పిత్తలులు, కాచలులు, శ్రవణులు, మత్తకాసికోలు, గోదావులు, బకులులు, వాంగులు, వంగకులు, మోదకులు, కలులు అను వీరు కేతుమాల దేశమున ఉండువారు పై పేరులలో యౌగికార్థములతో వారి స్వభావములు తెలియవచ్చును). ఆపై మహాభాగులు (గొప్ప అదృష్టవంతులు) మొదటిదియు, మంచి ప్రాకారము కలదియు, పుణ్యజలము కలదియు, మహాసర్పజములతో సేవింపబడినదియు అయిన మహానది జలములను త్రాగుదురు. కంబలా తామసీ, శ్యామా, సుమేధా, వకులా, భీమా, ప్రభంజనా, కాంచీ, కుశావతి, దక్ష, శాకవతీ, పుణ్యోదీ అను మహానదీ చంద్రావతీ, సుమూలా, ఋషభా అను నదీశ్రేష్ఠము, సముద్రమాలా, చంపావతీ, ఏకాక్షా, పుష్కలా, వాహాసువర్ణా నందినీ, కాళిందీ, పుణ్యజలములుగల మహానదియైన భారతీ, శీతలజలములుగల పాతికా, బ్రాహ్మీ, మహానదియైన విశాలా, పీవరీ, కుంభకారీ, నదీశ్రేష్ఠమైన రుషా, మహిషీ, మానుషీ, దండానదనదీ ఈ పై చెప్పిన నదులను (జలములను) ఇతరములైన ఉత్తమ నదుల జలములను కేతుమాల దేశవాసులు త్రాగుదురు. ఆ దేశమున ఉన్న ఉత్తమ నదులు అనేకములు. వానియందు దేవర్షులు, సిద్ధులు సంచరింతురు. అవి పుణ్య జలములు గలవి. పాపములను పోగొట్టునవి. ఈ విధముగా కేతుమాల ద్వీపము అనేక జనపదములచే మిక్కిలి ప్రసిద్ధమైనది. గొప్పనదులచే అలంకరింపబడినది. అనేక రత్నసమూహములచే అలంకరింపబడినది. నిండైనది. నిత్యము సంతుష్టమైనది. మంగళమైనది. ధనములచే ధాన్యములచే తక్కిన పదార్థముల చేతను మిక్కిలి సమృద్ధమైనది. జనావాసములచేత మిక్కిలి గొప్పగా సమృద్ధమైనది. మహానదుల చేత విభూషితమైనది.