వాయు మహా పురాణము
భువన విన్యాసము - 12
సూతుడు ఇట్లు అనెను:
హిమవత్పర్వతము యొక్క ఎడమ ప్రక్కన కైలాసము అను పర్వతము గలదు. దాని యందు శ్రీమంతుడైన కుబేరుడు రాక్షసులతోపాటు నివసించును. అప్సరోగణముతో కూడి అలకాధిపుడైన కుబేరుడు అనందించుచుండును. కైలాసము యొక్క పాదమునుండి పుట్టిన మందమను నొక కలువలతోనిండి ఉండి, పుణ్యమై శీతజలము గల శుభమైనసరస్సు గలదు. అది శరత్కాల మేఘమువలె తెల్లనైనది. దానినుండి పుట్టి ప్రవహించినది శుభమైన మందాకినీ నది. దాని తీరమున దేవ సంబంధమైన నందనమను గొప్ప వనము గలదు.
కైలాసమునకు తూర్పు దక్షిణములుగా (ఆగ్నేయముగా) దివ్యప్రాణులు ఓషధులును గలిగి దివ్య ధాతువులతో నిండిన చిత్రమై చక్కని వెన్నెలగల (బంగారు) పర్వతమును గూర్చి వినుడు. అది చంద్రప్రభ అను పర్వతము. శుద్ధమైనది, రత్నమువలె ఉన్నది. దాని పాదమున గొప్పనై దివ్యమైన అచ్ఛోదము అను సరస్సుకలదు. దాని నుండి దివ్యమైన అచ్ఛోదయము అను ‘నది’పుట్టును. దాని ఒడ్డున దివ్యమై పెద్దదైన చైత్రరథము అను ఉద్యానవనము కలదు. ఆ చంద్రప్రభ గిరియందు మణిభద్రుడను కుబేరుని సేనాపతి క్రూరులైన యక్షులతో చుట్టబడి ఉండును. పవిత్రములైన మందాకినీ, అచ్ఛోదా నదులు భూమండల మధ్యగా ప్రవహించుచు మహాసముద్రమున కలియును.
కైలాసమునకు దక్షిణ పూర్వముగా (ఆగ్నేయముగా) శుభములైన సత్త్వములు ఓషధులుగలదియు, మిక్కిలి గొప్పనైనదియు, మనఃశిలతో (ఎఱ్ఱని శిలతో) నిండి దివ్యమైన పిశంగము అను పర్వతమునుగురించి (వినుడు). అదిఎఱ్ఱనిదై బంగారుశిఖరములు గల్గి సూర్య కాంతిగల గొప్ప పర్వతము. దాని పాదమున దివ్యమై గొప్పదైన లోహిమతఅను సరస్సు గలదు దాని నుండి లోక భావినియగు పుణ్యమైన సరయూనది గలదు. ప్రహేతృ తనయుడైన కుబేర సేవకుడై ఇంద్రియములను తన వశమునందుంచుకొని గ్రహవంతుడై అనంత పరాక్రమవంతుడైన బ్రహ్మపాతుడను రాక్షసుడు అట ఉండును.వాడు ఆకాశమున చరించువాడును భయంకరులైన వందల రాక్షసులతో కూడి ఉండును.
కైలాసమునకు పశ్చిమమున ముఖ్యప్రాణులు ఓషధులు కలదియు, బంగారు ధాతువుతో నిండినదియు, పర్వత శ్రేష్ఠమైన అరుణగిరి శ్రీమంతమై మేఘమువలె ఉన్న పర్వతము శివునకు ప్రియమైనది. అది బంగారు నిండిన మంగళములైన శిలాజాలములతో చుట్టబడినది. దాని నూర్ల శిఖరములు బంగారముతో కూడినవై ఆకాశమును రాయుచున్నట్లు ఉండును. అది మంచుతో చుట్టబడి దివ్యమై ఎక్కరాని ముంజనవంతమను శైలము. ఆ పర్వతమున దుమ్ముబారిన ఎఱ్ఱని వర్ణముగల గిరీశుడు (శివుడు) నివసించును. దాని పాదమునుండి శూలోదము అను సరస్సు పుట్టును. దాని నుండియే శైలోద అను దివ్యమైన ‘నది’ పుట్టును. అది చక్షుఃశతముల మధ్యగా లవణ (ఉప్పు) సముద్ర మును ప్రవేశించును. దాని తీరమున సురభి అను ప్రసిద్ధమైన దివ్యవనము కలదు.
కైలాసమునకు ఉత్తరముగా శివబలమును ఓషధులును గల గిరి కలదు. అచట గౌరమ అను గిరిగలదు. అది పసుపుపచ్చని వన్నెగల హరిత దళములను ఖనిజముతో నిండినది. శుభమైనది. బంగారు శిఖరము కలది. గొప్ప దివ్యమైన మణిమయమైన పర్వతము. దాని పాదమున గొప్పదియు, దివ్యమైనదియు, శుభమైనదియు, బంగారు ఇసుక కలదియు, సుందరమైనదియు అయిన బిందు సరస్సును సరస్సు కలదు. అచటికే భగీరథుడు వెళ్ళెను. రాజర్షియైన భగీరథుడు గంగనిమిత్తమై అచట పెక్కు ఏండ్లు ఉండెను. “గంగాజలమున తడిసి పవిత్రులై నా పూర్వపితరులు (ముత్తాతలు 1000 మంది) స్వర్గమునకు పోగలరు. అని అనుకొని అచట (త్రిపధగాదేవి) (గంగాదేవిని అతడు ప్రతిష్ఠింప చేసెను. చంద్రకిరణముల నుండి పుట్టిన ఆ గంగ ఏడు భాగములైనది. అచట మణిమయములైన యజ్ఞ యూప స్తంభములును, బంగారు పొదలునుగలవు. ఇంద్రుడు సమస్త దేవతలతో గూడి అచ్చట యజ్ఞముతో శివుని పూజించి కాంతిమార్గుడై నక్షత్ర మండలము వెంట ఆకాశమున వెళ్ళెను. దేవియైన (త్రిపథగ గంగ) రాత్రిలో తెల్లగా ప్రకాశించును. ఆ గంగ నక్షత్ర మండలములు ఆకాశమును (స్వర్గమును) భావించు చున్నదై భూమిని జేరునదై శివుని యొక్క శిరమునబడినదై యోగమాయచే శిరమున బంధింపబడినది. కోపించిన ఆ గంగ యొక్క కొన్ని బిందువులు భూమిపైబడి అచట సరస్సు ఏర్పడినది. దానిని బిందు సరస్సందురు. చిరునవ్వు నవ్వుచు శిరమున బంధించబడిన ఆ గంగ మనమున శంకరుని పడద్రోయుటకై ఆలోచించు చుండెను. ఈ శంకరుని ఆ ప్రవాహముచే కబళించి ఛేదించి పాతాళమున ప్రవేశింతును అనుకొనెను. గంగాదేవి యొక్క ఆ క్రూర చేష్టితములను తెలిసికొని ఆ నదిని శివుడు గంగ యొక్క మదమును తెలిసి కోపించి తన అంగములలోనే వెనుతిరుగ జేయదలిచి, వేగముగా భూమిపై పడబోయిన గంగను తన శిరముననే బంధించెను. ఈ సమయముననే తన యెదుటరాజైన భరతుని జూచెను. అతని శరీరము కేవలము (మాంసము లేక) ధమనుల నాడులతో మాత్రము వ్యాపించి క్షీణమై ఇంద్రియములు గూడ పనిచేయని స్థితిలోఉండెను. అది చూచి ‘ఈతడు పూర్వమే గంగానది విషయమై నన్ను సంతసింప జేసెను అని స్మరించి అతనికి ఇచ్చిన వరదానమును గూడ స్మరించి శివుడు తన కోపమును నిగ్రహించెను. ప్రతిజ్ఞా నిర్వహణమును గూర్చి బ్రహ్మయొక్క మాటకూడ విని, తన తేజస్సుతో కట్టివేయబడిన గంగానదిని భగీరథుని ఉగ్రతపముచే సంతుష్ఠుడై యా భగీరధుని కొరకై వదిలిపెట్టెను. ఆ విధముగా వదిలి పెట్టబడుచున్న గంగానది యొక్క ప్రవాహము ఏడు విభాగములను బొందెను. అందులో మూడు తూర్పు వైపునకును, మూడు పశ్చిమ వైపునకు బోయినవి. గంగానదీ ప్రవాహము ఏడుభాగములుగా అయ్యెను. నలినీ, హ్రాదినీ, పావనీ, అమనీ అను మూడు తూర్పునకు పోయిన భాగములు. సీతా, చక్షువు, సింధువు అను ఈ మూడు పశ్చిమ దిక్కునకు పోయినవి. వానిలో ఏడవది దక్షిణముగా అనుసరించినదై భగీరథియైనది. అందువలన భాగీరథి అనునది లవణ సముద్రమును ప్రవేశించెను. ఈ యేడును ఈ లోకమున హిమమను దేశమున ప్రవహించును.
బిందు సరస్సున పుట్టి శుభములైన ఆ ఏడు నదులు స్రవించుచు మ్లేఛ్ఛ ప్రాయములైన నానా దేశములందును పారుచు ఇంద్రుడు వర్షించు దేశముల చేరును. సిరింధ్రములు, కుంతలములు, చీనాదేశములు, బర్బరములు, యవనులు, ద్రుహములు, రుషాణములు, కుణిందములు, అంగలోకవరములు ఈ దేశములలో ప్రవహించుచు సీతానది సింధు మరుభూమిని రెండుగాజేసి పశ్చిమ సముద్రమును చేరును. ఆ తరువాత చీనమరు దేశములు, నంగణములు, సర్వ మూలకములు ఆంధ్రములతో పాటు తుషారములు, తంపాకములు, పహ్నవములు, దరదములు, శకములు ఈ దేశములలో ప్రవహించుచు ‘చక్షు’ నది సముద్రమును చేరును. కాశ్మీరములతో బాటు దరదములు, గాంధారములు, వరపములు, హ్రదములు, శివపౌరములు, ఇంద్రహాసములు, వదాతులు, సర్జయములు, సైంధవములు, రంధ్రకరములు, భ్రమరములు, ఆభీరములు, రోహకములు, శునాముఖములు సిద్ధచారణ సేవితములైన ఊర్థ్వ మనువులు, గంధర్వులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు, విద్యాధరులు, ఉరగులు, కలాపగ్రామకులు, పారదులు, సీగణులు, ఖసులు, కిరాతులు, పులిందులు, భరతులతోడి కురులు, పంచాలులు, కాశీయులు, మాత్యులు, మగధులు, అంగులు, బ్రహ్మోత్తరులు, వంగులు తామ్ర లిప్తులు అను ఈ జనపదములను గంగ శుభములుగా పవిత్రము చేయును. ఆ తరువాత వింధ్యచే అడ్డగింపబడి దక్షణ సముద్రమున ప్రవేశించును. తరువాత ‘హ్లాదిని’ పవిత్రయై తూర్పు ముఖమై వెళ్లెను. నిషాద జాతులుండు దేశములు ధీరులు, ఋషికులు నీలముఖులు, కేరళులు, ఉష్ట్రకర్ణులు (ఒంటిచెవులుగలవారు) కిరాతులు, కాలోదరులు, వివర్ణులు, స్వర్ణ భూషితులగు కుమారులు. వీరు ఉండు దేశములలో గంగ సముద్రము యొక్క మండలమున తూర్పు ముఖముగ మరలినదై ప్రవహించినది. తరువాత ‘పావని’ తూర్పు దిక్కునకే ప్రవహించినదై, అపథములను ఇంద్రద్యుమ్న సరస్సును అట్లే ఖరపదములను (గాడిదల మార్గములు గలవి), ఇంద్ర శంకుపథములను బ్రవహించుచున్నదై, మధ్యగాలేచి నమస్కారము లేనివారై బొంతల కప్పుకొను వారిని (దేశమును) చేరెను. ఇంద్రద్వీప సముద్రమున లవణ సముద్రమును ప్రవేశించెను.
తరువాత ‘నలిని’ వేగముగా తూర్పు దిక్కునకు వెళ్ళెను (ప్రవహించెను) ఇచట నది హంస మార్గములై (భూ మార్గములేని) హుహుకముల తోడి తోమర దేశములో ప్రవహించిరి. అది తూర్పు దేశములను సేవించుచు పర్వతములను బహువిధములు బ్రద్దలు గొట్టి కర్ణప్రావరణములను అశ్వముఖములను పొంది ఇసుక పర్వతపు మరు ప్రదేశములను చేరి విద్యాధర దేశములకు వెళ్ళెను. నేమి మండల కోష్టమున (అథః చక్రపు అంచుతో ఏర్పడిన) మండల ప్రదేశమున అది మహాసముద్రమున కలిసెను.
ఆ పెద్ద నదులయొక్క నదులును ఉపనదులును నూర్లకొలదియు వేల కొలదియు ఉన్నవి. అవి అన్నియు ఇంద్రుడు వర్షించిన వైపునకు వచ్చి చేరును. వస్వోకసా నదీ తీరమున నీటి పరిమళముతో ప్రసిద్ధిచెందిన హరిశృంగమున విద్వాంసుడైన కుబేరుడు వశియై ఇంద్రియనిగ్రహము కలవాడై నివసించును. ఆ మహాత్ముడు యజ్ఞములతో కూడినవాడు, అమిత తేజస్వి, మంచి పరాక్రమము కలవాడు. అచట కుబేరుడు అగస్త్యునిచేతను విద్వాంసులచేతను బ్రహ్మరాక్షసులచేతను చుట్టబడియుండును. ఈ నలుగురు కుబేరుని సేవకులై కుబేరునితో సమానులుగా తలంపబడినవారు.
ఈ విధముగనే పర్వతదాసులయొక్క పరస్పరముగా ధర్మముతోను కామముతోను అర్థముతోను రెండింతలైనదిగా తెలియవలెను.
హేమకూటము యొక్క వెనుక భాగమున సాయనమను సరస్సు కలదు. దాని నుండి మనస్విని, జ్యోతిష్మతి అను నదులు పుట్టును. నిషధమను పర్వతోత్తమమున తూర్పు, పడమరల సముద్రములను ఇరువైపుల ప్రవేశించిన విష్ణుపదము అను సరస్సు గలదు. దానినుండి గాంధర్వి నన్వలిఅను నదులు పుట్టినవి. మేరువు వెనుక భాగమున చంద్ర ప్రభ అను ఒక గొప్ప సరస్సుపుట్టినది. అచట శుభమైన బంగారము కలిగి పుణ్యమైన జంబూనది కలదు. నీలపర్వతమున తెల్లకమలమువలె శుభ్రమైన పయోదములను సరస్సు కలదు. దానినుండి పుండరీక, పయోద అను రెండునదులు బయలు వెడలినవి. శ్వేత పర్వతము నుండి ఫుణ్యమైన ఉత్తరమానస సరస్సు పుట్టినది. జ్యోత్స్న మృగకాంత అను రెండు నదులు దానినుండి బుట్టినవి. మధుమత్ అను పుణ్యమైన సరస్సుగూడ కలదు. అది భవునిచే నిర్మింపబడినది. కల్పవృక్షములతో నిండినది తేనెలు గలది. అంతట సుఖము గలది, రుద్ర కాంతమని ప్రసిద్ధిచెందినది. ఇచట ఇతరమైనవి గూడ ప్రసిద్ధములైన సరస్సులు కలవు. అవి పద్మములతోను, మీనములతోను, పక్షులతోను నిండినవి. పేరున రుద్రములు జయములు. ఇవి పండ్రెండు. సముద్రముల వంటివి. వానినుండి శాంత, మాధ్వీ అను రెండు నదులు పుట్టినవి. ఇచట భూమిని భేదించుకొని వచ్చిన (బుగ్గ) జలములు నదులై ప్రవహించు వాని జలములు కింపురుషులచే త్రాగదగినవి. ఋషభము అను భేరి ఆకారములో పొగనిండియున్న గొప్ప పర్వతము గలదు. తూర్పు నుండి వచ్చిన సంపన్నములైన నదులు ఉప్పు సముద్రములో గలియును. చంద్రకంకము ప్రాణము, మహాన్, అగ్ని, శిలోచ్చయము అను ఈ పర్వతములు ఉత్తరమువైపు పోయినవై ఉత్తరము వైపున పొడవై దక్షిణ సముద్రమున ప్రవేశించినవి. చంద్ర మైనాక పర్వతముల మధ్యన ఏ దిక్కైన ఆగ్నేయ దిక్కున సంవర్తకుడు అను అగ్ని కలడు. అతడు ఆ జలమును త్రాగును. అతని పేరు సముద్రమును ద్రావు శ్రీమంతుడైన ఆడగుఱ్ఱపు ముఖము ఆకారము గల ‘ఔర్వుడు’, మహేంద్రుడు తమ రెక్కలను ఛేదించును అను భయముచేత అప్పుడీ (పై జెప్పిన) పండ్రెండు పర్వతములు లవణ సముద్రమున బ్రవేశించినవి కదా! ఇదియే తెల్లని చంద్రునిలో కనబడు నల్ల కుందేలు ఆకారము, భారతదేశము యొక్క భేదములు తొమ్మిది అని చెప్పబడినవి. ఇక్కడ చెప్పబడిన భారతదేశమునకు ఇతర పురాణాదులలో జెప్పబడిన కొన్ని భేదములు కనబడుచున్నవి. ఆరోగ్య, ఆయుః ప్రమాణములచేత ధార్మికముగను, కామికముగను, ఆర్థికముగను గుణములచే వీనికి వర్ష పదము ఉద్దేశింపబడినది. భాగములుగా ఈ గుణములతో కూడిన ప్రాణులు కలవు. అవి నానాజాతులు. ఆయా జాతులు ఆయా వర్షములలో నివసించినవి.