వాయు మహా పురాణము
దాన ఫలము
బృహస్పతి ఇట్లు అనెను:
ఆ తరువాత శ్రాద్ధ సంబంధముగ దానములను, ఫలములను చెప్పెదను. సర్వ ప్రాణులను తరింప చేయునదియు, స్వర్గమునకు మార్గమైనదియు, సుఖము కలుగజేయు నదియు, లోకమున మిక్కిలి శ్రేష్ఠమైనదియు, స్వర్గమును ఇచ్చునదియు, తనకును కూడ ఇష్టమైనదియు అయిన సర్వమును పితరులకు అక్షయమును కోరి ఈయవలెను. పితరులకు అన్నము ఒసగువాడు బంగారముతో జేయబడి దివ్యమై సూర్యునితో సమానమైనదియు దివ్య అప్సరసలతో కూడినదియు అయిన విమానమును పొందును. శ్రాద్ధ కర్మలో క్రొత్తగా కప్పుకొను వస్త్రమును ఇచ్చువాడు ఆయువును, మిక్కిలి ఐశ్వర్యమును, రూపమును, పుత్రుని పొందును. శ్రాద్ధ కాలమున ధర్మవేత్త అయి జందెమును ఇచ్చినవాడు, చక్కని పానీయమును ఇచ్చినవాడు సర్వ బ్రాహ్మణులకు బ్రహ్మ (వేద-విద్యా) దానము చేసిన ఫలమును పొందును. శ్రాద్ధ కాలమున చక్కగా చేసిన కమండలువు ఇచ్చినవానికి మధు- క్షీరములను ఇచ్చు ఆవు లభించును. శ్రాద్ధమున చక్రముతో తూట్లుపడని కమండలువు ఇచ్చినవాడు పాలిచ్చునదియే కాక కోరికలను పిదుకునట్టి దివ్యమైన గోవును పొందును. పుష్పమాలలచే అలంకరింపబడిన పూర్ణశయ్యను ఇచ్చినవానికి ఆ శయ్య ఉత్తమమైన మేడయై, ఎచట ఉన్న అచ్చటికి వెంటాడివచ్చును. శ్రాద్ధమున యతులకు రత్నములు నిండినదియు, చక్కని ఆసనములు పాన్పులు భోజనములు-వీనితో కూడినదియు అయిన భవనమును ఇచ్చినవాడు స్వర్గముపైన ఆనందించును. ముత్యములు వైడూర్యములు గల వస్త్రములను, వివిధములైన రత్నములను ఇచ్చినవాడు పదివేల పదికోట్లు దివ్య వాహనములను పొందును. మహాఅగ్నితో సమమును, రత్నములతోను, కామములతోను కూడినదియు, సూర్య, చంద్రకాంతులు కలదియు, అక్షయము అయిన దివ్య విమానము పొందును. అది అప్సరసలతో చుట్టబడినదియు, కోరిన చోటికి మనో వేగముతో పోవునదియునై ఉండును. దాత ఆ విమానాగ్రమున అంతటను స్తుతింపబడుచు ఉండును. అతనిని దివ్య గంధములతోను పుష్ప వర్షములతోను తడుపుదురు. అచట గంధర్వులు అప్సరసలును గానము చేయుదురు. వాద్యములను వాయింతురు. ముఖ్యులైన కన్యలును యువతులును అప్సరోగణములతో కూడిన వారై మనోహరములైన సుస్వరములతో ఆతడిని ఎల్లప్పుడు మేలుకొల్పుదురు. నరుడు శ్రాద్ధమున వేయి గుఱ్ఱముల దానము చేసియు, నూరు రథముల దానము చేసియు, వేయి ఏనుగుల దానముతోను, యోగిని అను స్త్రీతో నివసించును. మానవుడు శ్రాద్ధమున నీరు లేనిచోట శృంగారముగ ప్రకాశించు వస్తువును పితరులకును యోగులకును దానము చేసిన వేయి బంగారు మాడల ఫలమును పొందును. జీవితము ప్రధానమయినందున వేరొక దానము విశిష్టమైనది కాదు. కావున సర్వప్రయత్నములతో ప్రాణాభిరక్షణమును చేయవలెను. అహింస సర్వదేవతలకన్న పవిత్రమై సర్వమును ఇచ్చునది. ప్రాణులకు జీవితదానము పరమము అని బుధులందురు. శ్రాద్ధమున గుర్తుంచు కొనదగిన బంగారు పాత్రలను ఇప్పింపవలెను. భక్ష్యములును, రసములును, సౌభాగ్యమును ఆ పాత్రములో చేరి ఉండును. శ్రాద్ధ భోజనమున సుందరమైన తైజస (బంగారు) పాత్రము ఈయవలెను. ఆ పాత్రమే కోరికలకుగాని, రూపమునకుగాని, ధనమునకుగాని స్థానమగును. శ్రాద్ధ కర్మలో వెండిదానినిగాని, బంగారు దానినిగాని ఈయవలెను అట్లిచ్చిన దాత మిక్కిలి ధర్మమును పొందును. వర్షపుకుండవంటి పొదుగుగల గోవును ఇచ్చిన వానిని గోవులును గో పుష్టియు చేరును. శిశిర ఋతువున బ్రాహ్మణులకు ఇంధనములను (కట్టెలను) ఇచ్చువాడు, చలికాలము రాగా బహుకష్టముగల అగ్నిని పొందకలడు. యుద్ధమున నిత్యము జయించును. సిరికలవాడై ప్రకాశించును. సుగంధములైన మాలలను పొందును. దాతను మనోహర యువతులు, శయనములు, ఆసనములు, రమ్యములైన భూములు వాహనములును సేవించును. శ్రాద్ధమునగూడ వీనిని ఇచ్చినవాడు అశ్వమేధ ఫలమును పొందును. ధర్మ శ్రాద్ధము రాగా, శ్రాద్ధ కాలమున ఇవి నివేదింపతగినవి. గుణయుక్తులైన బ్రాహ్మణుల స్మృతిని మేధను పొందును. శ్రాద్ధమున సత్కరించి నేతితో నిండిన పాత్రలను ఇప్పింపవలెను. కుండవంటి పొదుగులుగల అనేకధేనువుల (దాన) ఫలమును పొందును. ఈ లోకమునగూడ మంచి వాహనములుగల రథములతో ఆనందించును. శ్రాద్ధమున కోరినది ఇచ్చినవాడు పుండరీక యాగఫలము అందును. రమ్యమైన ఇంటిని ఇచ్చిన రాజసూయయాగ ఫలమును పొందును. పుష్పఫలములతో గూడిన వనమును ఇచ్చిన సౌరభము (కామధేను ఫలమును) పొందును. బావులు, తోటలు, చెరువులు, క్షేత్రములు (పొలములు), పల్లెలు, గృహములు - వీనిని ఇచ్చిన సూర్య చంద్రులు ఉన్నంత వరకు స్వర్గమున ఆనందించును. శ్రాద్ధమున రత్నములు పొదిగి పరచిన శయన మును ఇచ్చినవాడును, సూర్యచంద్రులు ఉన్నంతవరకు స్వర్గమున ఆనందించును. అతని పితరులు సంతసింతురు. అనంతమైన స్వర్గమును అనుభవింతురు. అతడు రాజులచే పూజితుడు అగును. ధనధాన్యములతో వర్ధిల్లును. ఉన్ని, పట్టు వస్త్రములు, శ్రేష్ఠమైన గొంగళ్లు, చర్మము, బంగారు పట్టా, రత్నకంబళి, శాలువ. ఈ దానములను యథావిధిగ శ్రద్ధతో బ్రాహ్మణులకు భోజనము చేయించి ఈయవలెను. నూరు వాజపేయ యాగముల ఫలమును పొందును. మంచి రూపములుగల అనేక స్త్రీలు, పుత్రులు, భృత్యులు, (నౌకరులు), సేవకులు, భూతములును వశమున ఉండురు. ఈ లోకమున ఆరోగ్యము ఉండును. పట్టు వస్త్రము, నారచీర, నూలుచీర, తెల్లని సన్నని వస్త్రము-వీనిని శ్రాద్ధమున ఇచ్చువాడు పుష్కలములైన కోరికల పొందును, సూర్యోదయము చీకటినివలె అలక్ష్మిని పోగొట్టును. నక్షత్రములలో చంద్రునివలె విమానాగ్రమున ప్రకాశించును. వస్త్రము సర్వదేవతలకు సంబంధించినదికదా. సమస్త దేవతలచే ప్రకాశించు నిండు చంద్రునివలె విమానాగ్రమున ప్రకాశించును. సమస్త దేవతలచే ఎక్కువగా వస్త్రము స్తుతింపబడినది. వస్త్రము లేనిచో క్రియలేదు. యజ్ఞములులేవు, వేదములు లేవు, తపములులేవు. కావున వస్త్రములు దానము చేయవలెను. విశేషించి శ్రాద్ధకాలమున దానిని దానము చేయవలెను. దాత ఆ యజ్ఞ వేదతపములు అన్నింటిని పొందగలడు. పై వానిని నిత్యము శ్రాద్ధమున నియతుడై తత్ప రాయణుడై ఇచ్చువాడు సర్వకామములను సర్వరాజ్యమును పొందగలడు. సర్వకామ సమృద్ధమైన యజ్ఞము యొక్క ఫలమును పొందును. భక్ష్యములను, అటుకులను, పెరుగుతో కలిపిన పేలపిండిని, పిండివంటలను, నేయి శర్కరలను, కృశరములను, మధుపర్కము, పాలపరమాన్నము, నేతి భక్ష్యములను, శ్రాద్ధమున ఇచ్చిన వానికి పెరుగు, కలితిలేని గవ్యము (నేయిపాలును), అనేక విధములైన భక్ష్యములు దానము చేసినవానికి అగ్నిష్టోమ యాగఫలము లభించును. కావున వర్షకాలములోను, మఘానక్షత్ర కాలములోను (సామా న్యముగా భాద్రపద బహుళ త్రయోదశి మఘానక్షత్రయుక్తము అగును) అన్నము శ్రాద్ధమున దుఃఖింపచేయును. అపూపాదులు కావని భావము. దానికై నేతితో బ్రాహ్మణులను భుజింప చేయవలెను. నేతిని భూమిపై వదలవలెను. గయలో శ్రాద్ధమున ఏనుగులను ఇచ్చిన దుఃఖము పొందడు. అన్నమును పాయసమును, నేతిని, తేనెను, మూలకందను, ఫలములను, వివిధములైన భక్ష్యములను ఇచ్చిన, ఈ లోకమున చచ్చినను పరలోకమున ఆనందించును. పాలు శర్కరలతో కూడిన అటుకులు నిత్యము ఇచ్చిన అక్షయము అగును. కృసరములతోను, చిరుసెనగలతోను కలిపిన సత్తును పేలాలను, గుగ్గిళ్లను వ్యంజనములతో పిండివంటలను, నేతిలో నాని మనోహరములైన భక్ష్యములను, పెరుగు- సత్తుపిండిని శ్రాద్ధమున బ్రాహ్మణులచేత భుజింపనీయవలెను. అతడు ‘పద్మ’ నిధులను పొందును. (నవ నిధులలో ‘పద్మ’మనునది ఒక నిధి) (శ్రాద్ధమున సత్కరించి, ప్రయత్నముతో క్రొత్త పంటల ఇచ్చినవాడు సర్వభోగములను పొందును. స్వర్గమునకుపోయి పూలను అందుకొనును. భక్ష్య, భోజ్యములను, చోష్యములను, పేయములను, లేహ్యములను సర్వశ్రేష్ఠములైన వానిని ఇచ్చిననరుడు సర్వశ్రేష్ఠుడు అగును. సౌమ్యమైన వైశ్వదేవమును, ఖడ్గ మృగ మాంసము శ్రేష్ఠమైనహవిస్సు, వీనిని ఈయవలెను. ఖడ్గమృగముయొక్క కొమ్మునుమాత్రము వదలివేయ వలెను. దీనితో అసూయను నశింప చేయగల్గుదుము. భోజనమున అతిథులకు చేతులు జోడించి ఆగ్రాసనము ఈయవలెను.వాడు సర్వ యజ్ఞక్రియలు ఉత్తమోత్తమ ఫలమును పొందును. మిక్కిలి వేడియై బిరుసులేని అన్నము ఆకలిగొన్న వానికి ఈయవలెను. అట్లే యత్నించి చమురుతో నానిన వ్యంజనమును భక్తిచే సత్కరించి ఈయవలెను. అన్నదానము చేసినవాడు బాలసూర్యునివలె ప్రకాశించునదై, హంస వాహన రూపమైన విమానమును మూడు కల్పకోటుల కాలము వరకును పొందును. అన్న దానమునకున్న ఉత్కృష్టమైనది ఈలోకమున ఏదియులేదు. అన్నము నుండి ప్రాణులు పుట్టుచున్నవి, జీవించుచున్నవి. సంశయము లేదు. జీవదానము కన్న ఉత్కృష్టమైన దానము ఈ లోకమున ఏదియు లేదు. అన్నములచేతనే ముల్లోకము జీవించుచున్నది. అది అన్న ఫలమే. అన్నమున లోకములు ఉండును. లోక దానమునకు అది ఫలము. అన్నము సాక్షాత్తు ప్రజాపతి. అతనిచే ఈ జగమంతయు వ్యాప్తమైనది. కావున అన్నముతో సమానమైన దానములు ఇంతవరకు లేవు. ఇక ఉండబోవు. పితృ భక్తుడైన మానవుడు భూమిలో ఉన్న రత్నములను, వాహనములను, స్త్రీలను వీటిని అన్నింటిని వెంటనే పొందును. ఎప్పుడును చేతులు జోడించి అతిథులకు ఆశ్రయము ఈయవలెను. దివ్యములైన ఆతిథ్యములతో వేలవిధముల ఆ దేవతలు ఎదురుచూతురు. ఈ అన్నింటిని భూమిలో దానము చేసినవాడు ఏకచ్ఛత్రాధి పతి అయిన రాజగును. మూడు రెండు తరువాత ఒకటి దానము చేయుటచే సుఖి అగును. దానములు పరమధర్మము. సత్కరించి పూజింపబడుట సిద్ధి. దానము వల్లనే త్రైలోకాధి పత్యము వ్యవస్థితము. పితృభక్తుడైన నరుడు రాజైనచో రాజ్యము నందును. నిర్ధనుడు అయినచో ఉత్తమ ధనమునందును. అతడు ఏ కోరికలను మనస్సుతో కోరు కొనునో, ఆతని పితరులు వానిని తెలియుదురు.