వాయు మహా పురాణము
యోగోపసర్గ నిరూపణము
సూతుడు పలికెను:
ఆపైన (యోగముచే) తత్త్వమును దర్శించిన దేహికి (ఉత్పాతము రోగము) విఘ్నములు కలుగు విధమును, దోషములు పుట్టు విధమును చెప్పబోవుచున్నాను. యోగమును తెలిసి యోగ రోగియైనవాడు (యోగమును సరిగా అనుసరించనందున కలిగిన రోగములు గలవాడు) ఉపసృష్టుడు అనబడును.వాడు మనుష్య సంబంధములై వివిధములైన కోరి కలను, ఋతువును, స్త్రీలను, విద్యాదాన ఫలమును కోరును. యోగరోగి, అగ్ని హోత్రమును, హవిస్సును, యజ్ఞమును అట్లే వీని యజ్ఞశాలను, మాయాకర్మను, ధనమును, స్వర్గమును కోరును. వీడు కర్మలతో తగులుకొన్నవాడు. అవిద్యకు (అజ్ఞానమునకు) వశమైనవాడు. వానిని ఉపసృష్టుని (విఘ్నవంతుని గాపే వానిని యోగరోగిగాను తెలిసికొని వదిలి వేయవలెను. నిత్యము బ్రహ్మపరుడైన యోగి ఉపసర్గము యోగ విఘ్నము యోగ రోగము నుండి విముక్తుడగును. యోగరోగములను విఘ్నములను జయించినవాడును శ్వాసను జయించిన వాడును అయిన దేహికి గూడ సాత్వికములు రాజసములు తామసములు అయిన రోగములు కలుగుచుండును.
వినుటలో ప్రతిభ, దేవతల దర్శనము, భ్రమావర్తము (భ్రమలేకుండుట) అనునవి సిద్ధి లక్షణముగా గుర్తింపబడినవి. విద్య, కావ్యము, శిల్పము, సమస్తమును వాక్కుచే వరింపబడును. (అతని వాక్కులోనివి అన్నియును కనబడును). విద్యా ప్రయోజనములు గూడ అతనికి సంప్రాప్తించును. ఇది అతని ప్రభావమునకు లక్షణము (గుర్తు). నూరు యోజనముల దూరము నుండియైనను వినదగిన శబ్దములను వినును. సర్వజ్ఞడును, విధిజ్ఞుడు (బ్రహ్మజ్ఞుడు)ను అయిన యోగి పిచ్చివానివలె ఉండును.
మహాయోగియైనవాడు యక్షులను, రాక్షసులను గంధర్వులను, దివ్యులను (దేవతలను) మానుషులను (మనుష్యులను) తెలియును. ఇది అతని ఉపసర్గమునకు (రోగమునకు, ఉత్పాతమునకు) గుర్తు. దేవతలను, దానవులను, గంధర్వులను, ఋషులను పితృదేవతలను చూచును. అన్ని విధములుగా అతనిని ఉన్మత్తునిగా చెప్పవలెను. అంతరాత్మతో ప్రేరేపింప బడుచున్నవాడై భ్రమతో తిరుగుచుండును. భ్రమతో భ్రాంతి చెందిన బుద్ధిగలవాని యొక్క సమస్త జ్ఞానము నశించును. అంతరాత్మతో ప్రేరేపింపబడిన వానికి జనశ్రుతిగాని జీవనోపాయముగాని చిత్తమును నశింపజేయును. జీవనోపాయ చింతనముచే నిండిన బుద్ధిగలవానికి సమస్త జ్ఞానము నశించును.
మనస్సుతో తెల్లని వస్త్రమునుగాని, గొంగళినిగాని చుట్టుగా కప్పుకొని తరువాత వెంటనే పరమమైన బ్రహ్మను అనుధ్యానింపవలెను. ఆ కారణమువలన ఆత్మసిద్ధిని కోరువాడు తన యొక్క (ఆత్మ యొక్క) దోషములను, సంభవించిన ఉపసర్గములను యోగ విఘ్నదోష (రోగములను) మేధావియై వదిలివేయవలెను. ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, ఉరగులు మహాసురులును ఉపసర్గలలో రగులుకొని మరల మరల తిరుగు చుందురు. కావున యోగి ఎల్లప్పుడు యోగయుక్తుడై అల్పాహారియై, ఇంద్రియము లను జయించినవాడై, సుప్తుడై శిరమున సూక్ష్మములలో యోగధారణను నిలుపవలెను.
ఆ తరువాత, యోగయుక్తుడు, జతనిద్రుడు అయిన యోగికి చివర మరల ప్రాణములను పేరుగల ఉపసర్గలు కలుగును. మొదట యోగముతో సమస్త పృథివిని ధారణ చేయవలెను. ఆ తరువాత జలమును, ఆ తరువాత అగ్నిని, (వాయు రూపమైన ప్రాణముతో చిత్తము ఒకచో నిలుపుట యోగధారణ కావున వాయు భూతము ప్రత్యేకముగ జెప్పబడ లేదు. ఆ తరువాత ఆకాశమును, ఆ తరువాత నందం యొక్క మనస్సును, తరువాత దానికి పరమైన మనస్సుతో కూడిన బుద్ధిని యతి (యమము గలవాడు) అయినవాడు అతి ప్రయత్నముతో యోగధారణ చేయవలెను. సిద్ధుల యొక్క చిహ్నములను చూచి చూచి వదిలివేయవలెను.
పృథివిని యోగధారణ చేయువానికి పృథివీ మహాభూతము సూక్ష్మమై ప్రవర్తించును. జల (భూతములను యోగధారణ చేయువానికి జలమహాభూతము సూక్ష్మమగును. చల్లని రసము (జలము)లు అన్నియు సూక్ష్మములై అమృతముతో సమానమగును. తేజో భూతమును యోగధారణ చేయువానికి తేజో మహాభూతము సూక్ష్మమగును. తనను తేజస్సుగా భావించి, తన్ను తేజముగానే చూచును. తనను వాయువునుగా భావించి, తన్ను వాయువుగల మండలముగా చూచును. ఆకాశమును యోగధారణ చేయు వానికి ఆకాశ మహాభూతము సూక్ష్మమగును తనను వాయువులుగల మండలమైన మహాభూత వాయువునుగా భావించి వాయుమహాభూతము సూక్ష్మముగా అగును. తనను సూక్ష్మ వాయుమండలముగా చూచును. అచటి నుండి దానియొక్క ఘోష (శబ్దము) కూడ బయలు దేరును. అట్లే మనస్సును యోగధారణ చేయువానికి మనస్సు సూక్ష్మమై ప్రవర్తిల్లును. అపుడువాడు మనస్సుతో సర్వ భూతముల (ప్రాణుల) మనస్సునందును ప్రవేశించును. బుద్ధిచేత బుద్ధిని, యోగధారణ చేసినప్పుడు చక్కగా (అంతయు) తెలిసికొని మేలుకొను యోగజ్ఞుడైనవాడు ఈ ఏడు సూక్ష్మములను తెలిసికొని మేధావియై పరిత్యజించి తన బుద్ధిచే పరమాత్మను పొందును.
యోగ ఐశ్వర్య లక్షణమైన మాయా భూతమునందు యోగధారణయుక్తుడై అచటనే విడువరాని సంగమును పొంది, దాని చేతనే పూర్తిగా నశించును. కావున యోగియైన బ్రాహ్మ ణుడు సూక్ష్మములను పరస్పర సంసక్తములుగా తెలిసికొని బుద్ధిచేత పరిత్యజించి పరమును పొందును. దివ్య చక్షువులై, ఋషులైన మహాత్ములు గూడ సూక్ష్మ భావములందు సంసంక్తులై కనబడుదురు. అవి దోషములుగా వారియందు గుర్తించబడినను, ఎపుడైనను ఇందు (యోగవిషయమున) సూక్ష్మములందు నిశ్చయమును (ధారణను) చేయరాదు. ఐశ్వర్యము వలన రాగము కలుగును. విరాగము బ్రహ్మ అనబడును. ఏడు సూక్ష్మములను షడంగునిగా మహేశ్వరుని ప్రధానమును తెలిసికొని వినియోగమును తెలిసినవాడు పరబ్రహ్మను పొందును.
సర్వజ్ఞత్వము, తృప్తి, అనాది బోధము, స్వతంత్రత, ఎల్లప్పుడు లోపించు శక్తి, అనంత శక్తి. ఈ ఆరింటిని విధిజ్ఞులు విభువైన మహేశ్వరుని యొక్క అంగములందురు. నిత్యము బ్రహ్మయే ధనముగా గల యోగి ఉపసర్గల నుండి విముక్తుడగును. శ్వాసను, ఉపసర్గలను, రాగములను జయించిన యోగికి ఈ బహిఃశరీరమున యోగధారణ చేయుట అన్ని కోరికలకు సంబంధించినది అగును. యోగయుక్తుడైన బ్రాహ్మణుడు అయా చోటులలో ప్రవే శించి మనస్సు వర్ణించిన పంచ భూతములనైన ఆవేశింపగలడు. ముల్లోకములను కూడ కంపింప చేయగలడు. ఈ యోగశక్తిచేత ఈ లోకమున దేహమును వదిలిపెట్టి మరల దేహమును ప్రవేశించగలడు. యోగులకు సూర్యుణ్ణి మనోద్వారముగా చెప్పవలెను. ఆదా నాది క్రియలకు కూడ సూర్యుడు మనోద్వారమే అగును. ఈ విధానముచే సూక్ష్మవర్జితుడైన యోగి, ప్రకృతిని దాటి రుద్రలోకమున గొప్పవాడై పూజింపబడును.
అతడు ఐశ్వర్య గుణమును పొందినవాడును, బ్రహ్మభూతుడును అయిన ప్రభువునుగా చూడవచ్చును. అతడు సమస్త దేవస్థానములందును తక్కిన అంతటను ఉండక, మరలిపోవును. పైశాచిక స్థానముచేత తస్థాన ప్రయోగ విధారణచే, పిశాచములను, రాక్షస స్థానముచే రాక్షసులను, గంధర్వుల స్థానముచే గంధర్వులను, కుబేర స్థానముచే కుబేరజులను, ఇంద్ర స్థానముచే ఇంద్రుని, సోముని స్థానముచే సౌమ్యుని (చంద్ర సంబంధుని), ప్రజాపతి స్థానముచే ప్రజాపతిని సాధింపవలెను. బ్రహ్మ స్థానముచే తతాన (యోగధారణచే) (బ్రహ్మజ్ఞాన రూపియైన ప్రభువును దగ్గరగా పిలుచును. ఆ బ్రహ్మయందు సక్తుడైనవాడు ఉన్మత్తుడు. అతని నుండి సర్వము ప్రవర్తించును. నిత్యము (ఎల్లప్పుడు) బ్రహ్మరూపుడైన యోగి ఈ స్థానములను వదిలి వేయవలెను. స్థానములందు (యోగధారణ స్థానములందు) అంటి పెట్టుకొని ఉండని బ్రాహ్మణుడు సర్వగతుడగును.