వాయు మహా పురాణము
జంబూ ద్వీపవర్ణనము
ఋషులు అనిరి:
ఈ విధముగా ప్రజా సన్నివేశమునువిని నిపుణ ఋషి శ్రేష్ఠులు. పృథ్వి యొక్క పొడవు వెడల్పులను గూర్చి సూతుని అడిగెను. ద్వీపములు ఎన్ని; సముద్రములు ఎన్ని? పర్వతములు గూడ ఎన్ని? ఓ ప్రభో! వర్షములు (దేశములు) ఎన్ని? వానిలోని నదులు ఏవి? మహాభూతముల ప్రమాణమేమి? లోకా లోకములు అను పర్వతములు ఏవి? వాని యొక్క క్రమ పరిమాణమేమి? అట్లే చంద్ర-సూర్యుల గతియు వాని క్రమపరిణా మమును ఎట్టివి? అని ప్రశ్నించిరి. అందుకు
సూతుడు వారికి ఇట్లు చెప్పెను:
ఇటు పిమ్మట పృథివి యొక్క పొడవు వెడల్పులను, సముద్రముల సంఖ్యలను, ద్వీపముల యొక్క విస్తరమును దేశములు ఎన్నియో? వానిలోని నదులు ఎన్నియో? మహా భూతముల ప్రమాణము, లోకాలోక (పర్వత)ములు వాని క్రమ పరిమాణము, అట్లే చంద్రసూర్యుల గమనములు- వీటిని అన్నింటిని చెప్పెదను. సప్త ద్వీపములలో ఉన్న వేల ద్వీపముల భేదములను ప్రమాణముతో నూరేండ్లకైనను చెప్పనలవి కాదు. మనుష్యులు తర్కముతో (ఊహతో) ప్రమాణములను చెప్పునట్టి సప్త ద్వీపములను గూర్చి చంద్రసూర్య గ్రహములతో బాటుచెప్పెదను. చింతింపరాని భావములను ఊహించి భావిం పరాదు. ప్రకృతుల కంటే పరమైనది! దానిని నిత్యము అనెదరు?
జంబూ ద్వీపమును గురించి ఉన్నది ఉన్నట్లుగా జెప్పెదను. అట్లే ఎన్ని యోజనముల విస్తారమున్నదో! ఎన్ని యోజనముల మండలాకారము ఉన్నదో చెప్పెదను వినుడు. ప్రమాణమును బట్టి అది నూట ఒక్క యోజనములు గలది. అనేక జనపదముల గ్రామ సమూహములతోను, సిద్ధచారణ గంధర్వులుగల పర్వతములతోను, వివిధములైన శుభములైన పట్టణములతోను కూడినది. అన్ని ధాతువులతో కట్టబడినట్లున్న శిలల గుంపుల నుండి ఏర్పడిన పర్వతముల చేతను, నదుల చేతను ప్రకాశించునది. జంబూ ద్వీపము విశాలమైనది. చక్కని శోభాసంపదలచే చుట్టబడిన బ్రహ్మ, (విష్ణు) స్వరూపములైన తొమ్మిది భువనములచే (జలములచే) చుట్టబడినది. అట్లే ఉప్పు సముద్రముచే అంతటను చుట్టబడి ఉన్నది.
జంబూ ద్వీపము అంతట సమానముగా విస్తరించినది. అందులో తూర్పునకు విస్తరించిన ఆఱు వర్షపర్వతములు గలవు. తూర్పు పడమర సముద్రములందు రెండు వైపులకు ఇవి చొచ్చుకొని పోయినవి. హిమవత్పర్వతము మంచుతో నిండినది. హేమకూట పర్వతము బంగారము గలది. బాలసూర్యునివలె లేతయెఱుపు గలిగి బంగారు నిండినది నిషధ పర్వతమని చెప్పబడును. నాలుగు వర్ణములు గలిగి సువర్ణ(బంగార మైన మేరు పర్వతము అన్నింటికన్న ఎత్తైనది, గుఱ్ఱపుగంతు వేయు ఆకారము గలది. పొడవు వెడల్పు సమముగా ఉండి మిక్కిలి ఎత్తైనది. ప్రక్కలయందు అనేక జాతిరంగులు గలదై బ్రహ్మయొక్క సృష్టి (చాతుర్వర్ణ్య సృష్టి) గుణముగలది. అవ్యక్త జన్ముడైన బ్రహ్మయొక్క (పుట్టుకకు స్థానమైన విష్ణువుయొక్క) నాభికమల) బంధనము నుండి ఈ నానావర్ణ సమూహము పుట్టినది. తూర్పువైపున ఈ మేరువు శ్వేత (తెలుపు) వర్ణముగలది. దానిచేత అది (మేరు పర్వతము) బ్రహ్మణ్యము (బ్రాహ్మణజాతికి చెందినది) అయినది. అట్లే ఈ మేరువు దక్షిణము వైపున పీతము పసుపు పచ్చనిది. దానిచేత వైశ్యవర్ణము మేరువునకు చెప్పబడినది. ఈ మేరువు పశ్చిమపు వైపున ఆకు పచ్చని వర్ణముతో మహా బలిష్ఠమైనది. దానిచేత మేరువు యొక్క శూద్రజాతిత్వము కనబడినది. దీనికి అనేక ప్రయోజనములు కారణములు. మేరువుయొక్క ఉత్తరపువైపున సహజముగానే ఎరుపు వర్ణముగలదు. దానిచేత మేరు పర్వతమునకు క్షత్రియత్వము వ్యక్తమగును. ఈ విధముగా మేరు పర్వతము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు కలదని చెప్పబడినవి. అవి మేరుపర్వతము యొక్క అయా వైపుల స్వభావమును బట్టి రంగును బట్టియు, పరిమాణమును బట్టియు వ్యక్తమైనవి. నీలము అను పర్వతము వైఢూర్యమణి శిలామయము. శ్వేతశృంగ పర్వతము బంగారు నిండినది. నెమలిపింఛపు రంగుగలిగి బంగారం నిండినది శృంగపర్వతము.
ఈ పర్వతరాజములందు సిద్ధులు, చారణులు నివసించుచుందురు. వీని యొక్క మధ్యశ్వాసము తొమ్మిదివేలు యోజనములు. ఇది మహామేరువు యొక్క శిరము మధ్యన, పొగలేని అగ్నివలె ఉండును. మేరువునకు దక్షిణమున వేది సగభాగము, ఉత్తర భాగమున తక్కిన సగభాగమున గలవు. ఇచట ఏడు వర్షములు (దేశములు) గలవు. వానియొక్క పర్వతములే వర్షపర్వతములు. అవి ఎత్తులో రెండేసి వేల యోజనముల విస్తీర్ణము కలవి.
జంబూ ద్వీపముయొక్క విస్తారము వలన పర్వతముల పొడవు ఇప్పుడు చెప్ప బడు చున్నది. వేయి రెండు వందల (1200) యోజనములుగల మధ్యనున్న రెండు పర్వతములు నీల పర్వతము మరియు నిషధపర్వతము అనునవి. వాని కన్న మిగిలినవి శ్వేతము, హేమ కూటము, హిమవంతము, శృంగవంతము అనునవి (నాలుగు నీల నిషధములతో గూడినచో ఆఱు) అనగా అవి తొంబదిరెండు ఎనుబది రెండు వేల యోజనముల పొడవు గలవి వాని మధ్యలో జనపదములు (జనావాస దేశములు) కలవు. ఆ వర్షములు (దేశములు) ఏడు.
ఒకచో గుమిగూడినట్లు ఉండుటచే ఎగుడు దిగుడులుగా ఉన్న పర్వతములచే చుట్టబడినవి. నదులయొక్క కోతలచే వ్యాపించి పరస్పరముగా (ఒకదాని నుండి మరొక దాని పైకి) పోనలవిగానివి. వానిలో భాగములుగా చేసికొని అనేకములైన ప్రాణులు నివసించును.
హైమవతమను వర్షము (పర్వతము, దేశము) భారత వర్షము అని ప్రసిద్ధి చెందినది. దానితరువాత పైది హేమకూటము. దానిని కింపురుష వర్షమందురు. హేమ కూటము కంటె పైది నైషధము. అది హరివర్షమని అనబడును. హరివర్షము తరువాత మేరువుపైది ఇలావృతము. ఇలావృతముపైది, నీలము. అది రమ్యకమని ప్రసిద్ధి చెందినది. రమ్యకము నుండి ఇంకను పైది శ్వేతము (పర్వతము) అది హిరణ్యకమని పేరుగాంచినది. హిరణ్యకము కంటె తరువాత శృంగవంతము. అది ‘కురు’ అనబడినది. ధనువువలె ఉనండువి, రెండు వర్షములు. ఒకటి దక్షిణమున రెండవది ఉత్తరమున ఉన్నవి. అక్కడ పొడవుగా ఉన్నవి నాలుగు వర్షములు. మధ్య ఉన్నది ఇలా వృతవర్షము నిషధమునకు పడమటి క్రిందన నున్న సగము వేది (వేదిచదునై చతురస్రమైన భూమి-దానిలో సగము) దక్షిణము (వేది) అనబడినది. నీలవంతమునకు పైగా ఉన్న సగము వేది ఉత్తరము (వేది) అనబడినది. దక్షిణ వేద్యర్ధమున మూడు వర్షములు, ఉత్తర వేద్యర్థమున మూడు వర్షములును కలవు. ఆ రెంటి మధ్యన మేరు మధ్యమైన ఇలావృతము కలదు. అది నీలవర్షమునకు దక్షిణముగను నిషధ వర్షమునకు ఉత్తరముగను ఉన్నది.
మాల్యవంతమను పర్వతము ఉత్తరముగా విశాలమైన మహాపర్వతము. వేయి యోజనముల విశాలమైనది. పూర్తిగా నల్లనిది. నిషధపర్వతమువలె పొడవైనది. దాని పొడవు ముప్పదినాలుగు యోజనములు. దాని పడమట వైపున గంధ మాదన పర్వతము కలదు. పొడవువల్లను విస్తారమువల్లను మాల్యవంత మనియే ప్రసిద్ధమైనది. పరిమళములుగా (అంతటను గుండ్రము, గోళము)గా ఉన్న రెండు, పర్వతముల మధ్య నున్న మేరువు మిక్కిలి ఎత్తైన పర్వతము. నాలుగు వర్ణములు గలది. మంచి బంగారువన్నె గలది. చతు రస్ర (నాలుగు వైపుల) సమముగా ఉన్నది. చక్కగా ఉన్నతమైనది. జలము మొదలగు ధాతువులు అన్నియు అట అవ్యక్తములై పైకి కనబడనిపై ఉత్పన్న మైనవి. ఆ అవ్యక్తమునుండి మేరుపర్వతము కర్ణిక (నడిబొడ్డు బీజము గలది) గాగల పృథివి అనెడు పద్మము పుట్టినది. అది నాలుగు మార్గములు గలది. ఐదు గుణములు గలది. (సూక్ష్మము గాక) మహత్తైనది. ఓ ద్విజసత్తములారా! అక్కడినుండి సమస్తములైనవృత్తులు (కృషి, పశుపాలనము, వాణి జ్యము, సేవ మొదలగునవి) పుట్టినవి. పూర్వము అనేక కల్పముల నుండి ఉపార్జితములై అనేక విధములైన పుణ్యములు గలిగి అత్మనిగ్రహము గలవారిచే చక్కగా పొందింపబడిన ఒక స్థూలస్వరూపము కలవాడు, సర్వవ్యాపియైన ఆత్మగలవాడు, సర్వపురుషులకు ఆదిపురుషుడై, పురుషశ్రేష్టుడైన విష్ణు స్వరూపుడు, మహాదేవుడు, మహాయోగి, జగత్తునకు జ్యేష్ఠుడు, సర్వలోకము లందుండువాడు, నాశము లేనివాడును ఐన మహేశ్వరుడు అవ్యక్తుడై అంతట ఉన్నను, వ్యక్తముగా ఒకమూర్తి గలవాడై పుట్టెను. అతని యొక్క ప్రాకృతికమైన మూర్తిమానవులవలె మాంసము, మేధస్సు, ఎముకలు, వీనివలన బుట్టినదికాదు. యోగము వలనను, ఈశ్వరుడై నందువలనను, అతడు సర్వాత్మలలో ఉన్నవాడే ఈతని కారణముగా కల్పశేషము మొదట సనాతనమైన (భూ)లోకమనెడి పద్మము పుట్టినది. కాలగతి ఇట్టిది. ఆ పద్మమున దేవదేవుడైన నాలుగు ముఖములుగల దేవుడు పుట్టెను. అతడు ప్రజాపతి, బ్రహ్మ, జగమునకు ఈశ్వరుడైన ప్రభువు. కమలమునకువలె ఆ పద్మోద్భవుని బీజములు సర్గము (సృష్టి)ను, సర్గ (సహజ)మైన మొత్తము ప్రజాసృష్టి ఇట విస్తరముగా చెప్పబడు చున్నది. విష్ణు సంబద్ధమై, కార్యరూపమై విష్ణునాభినుండి కమల నాళము పుట్టినది. దాని నుండి వన వృక్షములతో గూడి పద్మాకారమైన పృథివి పుట్టినది. ఓ ద్విజులారా! ఆ లోక పద్మము యొక్క విస్తార ప్రకాశమును నేను చెప్పెద వినుడు. అది విభాగములతో క్రమముగా వర్ణింపబడును.
దళములందు ఉన్న నాలుగు, మహాద్వీపములని ప్రసిద్ధి చెందినవి. తరువాత కర్ణిక యందు ఉన్నది మహాబలిష్ఠమైన మేరు పర్వతము. అనేక వర్ణములుగల దాని ప్రక్క భాగములలో తూర్పువైపున (శృంగము) శ్వేతము అనబడును. దక్షిణపు వైపున శృంగము పసుపువర్ణము, పశ్చిమపు వైపున ఉన్నది. శృంగము నల్లనిది. ఉత్తరపు వైపున ఉన్నది శోభించు ఎఱుపు వర్ణముతో కూడినది. ఆ మేరువు, శుభ్రమై రాజువలె నిలచి ప్రకా శించును. లేత సూర్యుని వర్ణమువంటి కాంతికలదై, పొగలేని అగ్నివలె ఉండును. ఎనుబది నాలుగువేల యోజనములఎత్తుగలది. క్రింద పదునారు (యోజనములు) లోతుగా భూమిలో ప్రవేశించినది. అంతే 16 యోజనములు విస్తరించినది. దీనియొక్క చుట్టు వైశాల్యము 16 వేల యోజనముల కంటె మూడింతలు. అనగా 48 వేల యోజనములు మండల ప్రమాణముతో అది త్రికోణములో సగముండును. త్రికోణమానము నందది చుట్టును. నలుబది ఎనిమిదివేల యోజనములు కలిగినట్టిది. చతురస్ర మానముతో అంతటి (మొత్తం) వైశాల్యము అఱువదినాలుగువేల యోజనములు కలదు. ఆ పర్వతము గొప్పది, దివ్య మైనది. దేవశక్తిగలది దివ్యౌషధులతో గూడినది. అది మొత్తము బంగారుతో నిండిన శుభములైన లోకములతో చుట్టబడినది. అక్కడ గంధర్వులు, ఉరగులు, రాక్షసులు మొద లగు సమస్త దేవగణములు ఉన్నవి. మంగళకరములైన అప్సరోగణములు అనేక పర్వత రాజములతోబాటు కనబడును.
ఆ మేరువు భువనములతో (లోకములతో) చుట్టబడినది. భూతములను పుట్టించి పెంచునది. దాని అనేక పార్శ్వములలో నాలుగు దేశములు నెలకొని ఉన్నవి. భద్రాశ్వ దేశము (తూరుపు) భరత దేశము, (దక్షిణము) పశ్చిమమైన కేతుమాల దేశము, చేసిన పుణ్యములకు ఆశ్రయములై ఉత్తరములైన కురు దేశములు. అంతట గుండ్రముగా ఉన్న ఆ (భూ) పద్మముయొక్క నడిబొడ్డు (దుద్దు) తొంబది యాఱువేల యోజనములు కలదు. దాని లోపలి వైశాల్యములు ఎనుబది నాలుగువేల యోజనములు. చుట్టు వ్యాపించిన దాని కేసరములు లేక కింజల్కముల సమూహములు మున్నూరు వేల ప్రమాణము కలవి. నూరు వేల యోజనముల పొడవుగలది. ఎనుబదివేల యోజనముల వెడల్పుగలది. ఆకర్ణిక, దాని యొక్క నాలుగు దళములు నాలుగు దిక్కులకు యోజనముల కొలది వ్యాపించినవి. అక్కడ పూర్వము నేను కర్ణిక అని చెప్పితిని. దానిని సంగ్రహముగా వర్ణించెదను ఏకాగ్రచిత్తులై వినుడు.
ఈ మేరువునకు అత్రిమహర్షి నూఱు అంచులు కలవు అనిచెప్పెను. భృగుమహర్షి వేయి అంచులుగలవు అనెను. సావర్ణి ఎనిమిది అంచులు గలది అనెను. భాగురి నాలుగు వైపుల సమముగా ఉండు సమతలము అనికాని, నాలుగంచులు కలదనికాని భావించెను. వార్షాయణి సముద్రమువలె తరగలు తరగలు ఉన్నది అనెను. గాలవుడు మూకుడువలె ఉన్నది అనెను. క్రోష్టుకి అన్నివైపుల గుండ్రముగా (గోళముగా) ఉన్నది అని చెప్పెను. ఈ మేరువు యొక్క ఏ ఏ ప్రక్క ఏ ఋషి (పై జెప్పిన ఋషులు) చూచెనో, ఆ ప్రక్క భాగమును మాత్రమే ఆఋషి ఆవిధముగా తెలిసికొనెను. ఒక బ్రహ్మకు మాత్రమే మేరు పర్వతము మొత్తము తెలియును. ఆ మేరు పర్వత శ్రేష్ఠము మణిరత్న మయమైనది. చిత్రమైనది. కావుననే అనేక వర్ణ కాంతులచే కూడినది. అనేక వర్ణముల సమూహము ఒక్కచోట చేరినట్లున్నది. బంగారు మయమైనది. ఎఱ్ఱనికాంతి గలది. మనోహరమైనది. వేయి పర్వత సంధులు (పర్వతములు) కలది. వేయి నీటిగుహలు కలది, వేయి కమలములు కలది. ఇట్టి దానినిగా మేరు పర్వతమును దెలిసికొనుము. మణిరత్నములు పొదిగిన స్తంభములచేతను, మణులతో చిత్రింపబడిన వేదికలతోను, బంగారముతోను మణుల తోను, పగడముల తోరణములతోను, చిత్రమైనది మేరువు. స్వర్గవాసులైన దేవతలయొక్క సిరులుగల నూర్లకొలది విమానయానములచేతను, వారి కాంతులచేతను, ప్రతి పర్వతము ప్రసిద్ధిని పొందును. ప్రకాశింపజేయబడిన చుట్టు ప్రక్కలు గలది మేరువు. ఆ మేరువుయొక్క వేయి పర్వతసంధులందు అనేకములైన నివాసభవనములు అలంకరించి ఉండును. వానిలో సమస్త దేవ సమూహములు అనేకులుగా నివసించి ఉన్నారు.
దేవతలకు వరిష్ఠుడు, దేవతలకే దేవుడైన వాడును, నాలుగు ముఖములు గలవాడును. బ్రహ్మవేత్తలలో శ్రేష్టుడు అయిన బ్రహ్మ ఆ మేరు పర్వతమున నివసించి ఉండెను. గొప్ప లోకములతో నిండి, కోరిన ఫలమును ఇచ్చు వేలకొలది సమస్త రాక్షసులచేతను, దిక్కులందు అనేకముగా వ్యాకులమైన, అచ్చటగల బ్రహ్మసభ బహు రమ్యముగా ఉండును. బ్రహ్మర్షి గణములచే సేవింపబడుచు మనోవతిఅను పేరుతో సర్వ లోకములందు ప్రసిద్ధిచెందినది. ఇచట ఈశాన మహావిమానము (భవనము) కలదు. అది నూరుగురు సూర్యులతో సమానమైన తేజస్సుగలది. మహిమ గలది. అచట ఋషి గణములతో కూడిన దేవతలు ఉన్నారు. వారు బ్రహ్మకు సంబంధించినవారే. బ్రహ్మకున్న తేజోరాశి అచట దేవతలకు కూడ ఉన్నట్లు చెప్పబడినది. అచట లక్ష్మీపతియైన విష్ణువు గలడు. సిరిగలిగి సహస్రాక్షుడైన ఇంద్రుడు దేవతలచేతను మహాయోగముగల దేవర్షుల చేతను ఉపాసింపబడుచుండును. అచట లోకపతియు, సూర్యునితో సమానమైన కాంతి కలిగిన, మహారాజైన మహేంద్రుని స్థానముగలదు. అది సర్వసిద్ధులచే నమస్కరింపబడినది. అది లోకమున క్రిందలోకము. ఉత్కృష్టమైన సంపదతో కూడినది. దేవశ్రేష్ఠులైన దేవతలచే సేవింపబడినదై ప్రకాశించుచుండును. తూరుపు దక్షిణముల మధ్యన ఆగ్నేయమున ఉన్న రెండవ అంతర (లోపలి) తటమున చిత్రములై నూర్లకొలది అనేక ధాతువులతో చక్కగా మనోహరమై ఉండును. మిక్కిలి తేజస్సు కలది, అనేక రత్నములు పొదిగిన ఉపరితలము గలది, అనేక స్తంభములతో కూడినది, బంగారముతో చేయబడిన ఉద్యానవనము అనేక రత్నములచే కట్టబడిన వేదికలు గలది, రహస్య మందిరములు కలిగి ఉత్తమములైన భవనములు వెలసియున్నది, ప్రసిద్ధమై నదిగా ఉండును. అచట భాస్కరమనియు జాతవేదస మనియు (అగ్ని) ప్రసిద్దమైన మహా విమానము కలదు.
అది తేజోవతి అను అగ్నియొక్క సభ. అక్కడ సుర శ్రేష్ఠుడైన సర్వదేవతల ముఖమైన అగ్ని ఉండును. అతడు వేయి జ్వాలలతో ఒప్పుచుండును. జ్వాలలే మాలలుగా గలవాడు. ప్రభయే ధనముగా గలవాడును అగు అగ్ని యచలఋషి గణముతో కూడిన దేవతలచే స్తుతింపబడుచుండును. దేవతా ప్రధానముగా జేయబడినది. (హవిస్సు) బ్రాహ్మణులచే హోమము జేయబడును. అది విశేషముగా చెప్పబడును. అనేక విభాగములతో కూడిన తేజస్సు, నిస్సంశయముగా సమస్తము అనుభవములోనికి చేరి, ఏక తేజస్కుడైన ప్రభువు అచ్చట కలడు. యుక్తిచేత కార్యకారణ మిశ్రితమై పృథక్త్వము గూడ (అతనిలో) ఉండును. సమస్త లోకములు తెలిసినవారు, అగ్నియే వీర్యముగా గలవారు. అగ్ని పరాక్రమములు అయిన మహాత్ములు మహాసిద్ధులు మహాభాగ్యవంతులును ఆ అగ్నికి నమస్కరింతురు.
మూడవ అంతరతటమున ఇట్లే మహాసభ ఉండును. అది వైవస్వతుడైన యమునిసభ. అది లోకమున మంచి నిగ్రహము గలదిగా ప్రసిద్ధిచెందినది. అట్లే నాల్గవ దిగ్దేశమున నైరృత్యధిపతి యొక్క సభ ఉన్నది. పేరు కృష్ణాంగన. అది ధీమంతుడైన విరూపాక్షునిది. ఐదవయంతర తటమున గూడ ఇట్లే మహాసభ కలదు. అది వైవస్వతు నిది. దాని పేరు శుభవతి. అది జలాధిపతి మహాత్ముడైన వరుణునిదని ప్రసిద్ధి చెందినది. మిక్కిలి ఉత్తమ దేశమై మంగళకరమైన ఆఱవ అంతరతటమున గంధవతి అను పేరు గలిగి సమస్త గుణములచే మిక్కిలి శ్రేష్ఠమైన సభగలదు. ఏడవ అంతర తటమున నక్షత్రాధిపతి (చంద్రుని) యొక్క సభగలదు. పేరు మహోదయ, శుద్ధమైన వైడూర్యమణులతో నిర్మించిన వేదికలు గలది. అట్లే ఎనిమిదవ అంతరతటమున మహాత్ముడైన ఈశానుని యొక్క యశోవతి అను సభకలదు. అది కాచిన బంగారువంటి మంచి వన్నెగలది.
ఏడంతస్తులు గల ఈ మహాభవనములు ఎనిమిది దిక్కులలో మంగళకరములై ఉన్నవి. ఇవి దేవతలలో ముఖ్యులై మహాత్ములైన ఇంద్రుడు మొదలుగాగల ఎనమండు గురికి చెందినవి. ఎల్లప్పుడు, ఋషుల చేతను, దేవగంధర్వుల చేతను, అప్సరసల చేతను మహోరగులచేతను ఇంకను పై స్థానములలో ఉన్న మహాభాగుల చేతను సేవింపబడినవి. వేద వేదాంగములు తెలిసిన వారు నాకపృష్ఠమనియు, దివమనియు, స్వర్గమనియు పర్యాయవాచక శబ్దములచే దేనిని పిలుతురో అదే మేరు పర్వతము. ఇది పుణ్యాత్ములైన సర్వ దేవతలకు నివాస స్థానము. అనాక అదే ఈ మేరు పర్వతము. ఇది పుణ్యాత్ములైన సర్వ దేవతలకు నివాస స్థానము, అనాక. పృష్టాదిశబ్దములతో జెప్పబడు స్వర్గము దేవతలకు లోకముగా ఉన్న ఈ మేరు పర్వతమున కలదని సర్వశ్రుతులయందు చెప్పబడినది. అనేక విధములైన నియమముల చేతను, బహు యజ్ఞముల చేతను, ఆత్మనిగ్రహము. గలవారి చేతను పెక్కు నూర్ల కొలది జన్మలలో సంపాదించిన పుణ్యముల చేతను మరి ఇతర సత్కార్యముల చేతను మానవులు ఈ దేవలోకమును పొందుదురు. దానిని స్వర్గమని కూడ అందురు. (34)