యజ్ఞప్రవర్తనము

“పూర్వము స్వాయంభువ మన్వంతరమున ఉన్న నాలుగు యుగములను వాని స్వభావమును, తత్త్వమును విస్తరముగా వినదలచితిమి” అని ఋషులు అడుగగా...

సూతుడు “పృథివి మొదలగువాని ప్రసంగమున నేను పూర్వము చెప్పినవారి చతుర్యుగమిది. దానిని చెప్పెదను వినుడు. ఇచట విస్తారముగా అంతట సంఖ్యచే చక్కగా లెక్కించి, యుగము, యుగభేదము, యుగధర్మము, యుగాంశకము, సంధ్యాంశకము, యుగ సంధానము-అను ఆఱు విధముల యుగనామములను వాని తత్త్వములతో ఇప్పుడు చెప్పెదను. లౌకిక ప్రమాణముతో తెలియబడిన సంవత్సరము మానుషము. ఆ సంవత్సరములతో లెక్కించి చతుర్యుగములను చెప్పెదను.

నిమేషకాలము (కనురెప్పపాటు కాలము) కాష్ఠ, కళలు, ముహూర్తకములు ఇవి కాలగణనలో కొన్ని (ఏకమాత్రకమై హ్రస్వమైన) లఘ్యక్షరము నిమేషకాల తుల్యమైనది. పదియైదు నిముషములు కాష్ఠ. ముప్పది కాష్ఠలు కళయని లెక్కింపవలెను. ముప్పది ముహూర్తములు ఒకరాత్రి పగలు గలిగినదియు, అహోరాత్రములను మానుషములు, దైవికములు అని సూర్యుడు రెండు విధములుగా విభజించిరి. అందులో పనిచేతలందు అహస్సు, పడుకొనుటకు రాత్రియు కల్పింపబడుచున్నవి. పితరుల రాత్రి, పగలు కలిసిన దినము అదే మానవుల ఒక మాసము. ఆ రాత్రి, పగలు విభాగము మానవుల కృష్ణ పక్షము, పితరులకు ఒక పగలు. అట్లే శుక్ల పక్షము వారికి పడుకొనుటకు రాత్రి. ముప్పది మానుష మాసములు పితరులకు ఒక్క మాసము, మూడువందల అఱువది మానుష మాసములు పితరులకు ఒక సంవత్సరము. మానుషమాసమున నూరేండ్లు పితృ మాసమున మూడేండ్లుగా లెక్కింపబడినవి. పితృమానమున నాలుగు మాసములు అధికములు అనబడినవి. లౌకిక మానమున మానుషమైన సంవత్సరము దేవమానమున ఒక రాత్రి. పగలు కలసిన దినము. ఈ శాస్త్రమున నిశ్చయము, ఇష్ఠము. దేవతల రాత్రి, పగళ్ళు, వర్షము మరి వారియొక్క విభాగము ఇట్లుండును. పైన చెప్పబడిన దేవతల రాత్రి పగళ్ళలో ఉత్తరాయణము పగలు దక్షిణాయనము రాత్రియు అగును. ఆ ముప్పది మాసములు దేవతల మాసము అనబడినది. నూరు మానుష మాసములు మూడు దివ్యమాసములు మరియు పది దినములును. ఇది దివ్యవిధి అనబడినది. మూడు వందల అఱువది ఏండ్లు దివ్య సంవత్సరము. ఇది మానుష మానముతో చెప్పబడినది. మానుష మానముతో మూడువేల ముప్పది వర్షములు సప్తర్షుల సంవత్సరము. మానుషములైన తొమ్మిదివేల తొంబదియేండ్లు క్రౌంచ సంవత్సరము అనబడును. మానుషమానముతో ముప్పది ఆరువేల వత్సరములు. దివ్యములైన నూరు సంవత్సరములు, ఇది దివ్యవిధి అనబడినది. మూడు మానవుల మాసములు లెక్కించిన నియుత (లక్ష) సంవత్సరములు మరియు అరువదివేల సంవత్సరములు (60,000) దేవమానమున వేయి సంవత్సరములు అని సాంఖ్యాదులైన జనులు చెప్పుదురు. ఈ విధముగ దేవమాన సంఖ్యతో కూడినది ఋషులతో చెప్పబడినది. యుగసంఖ్యా ప్రకల్పనము గూడ దేవమానముతోనే చూడవలెను.

భారత వర్షమున యుగములు నాలుగని పండితులు చెప్పుదురు. మొదట కృతయుగము తరువాత త్రేతాయుగము. ద్వాపరము కలియుగము అని ఈ యుగములను లెక్కింపవలెను. నాలుగువేల సంవత్సరములు కృతయుగము అందురు. అచటనైతే సంధ్య(లు) నూరే సంధ్యాంశములు అట్లే (నూరె). ఇతర సంధ్యలలోను మూడు సంధ్యాంశములలోను వేయి తొంబది తొమ్మిది (1099) ఉండును. త్రేతాయుగము మూడు వేలయేండ్లు అని సంఖ్య. దానికి మూడు వందల సంధ్యలు సంధ్యాంశములు అంతే (300). ద్వాపర యుగము రెండువేల యేండ్లని విద్వాంసులు అందురు. దానికిగూడ రెండు వందల సంధ్యము. సంధ్యాంశములు గూడ సంధ్యలతో సమానము (200). కలియుగము వేయి యేండ్లని విద్వాంసులు అందురు. దానికిగూడ ఒక నూరు సంధ్యలు సంధ్యాంశములు సంధ్యలతో సమానము (100). ఇది పన్నెండు వేలది అని యుగసంఖ్య చెప్పబడినది. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము.

ఈ విధముగా సంధ్యాంశములు లేకుండా, నాలుగుయుగముల కాలము చెప్పబడినది. సంధ్యాంశములతో గూడిన చతుర్యుగసంఖ్య నలుబది మూడు లక్షల ఇరువదివేలు. ఈ విధముగా చతుర్యుగముల పేర్లు సాధిక, అకృత, త్రేతాది యుక్తమై అది డెబ్బది ఒక్కటి అయినచో మనువుయొక్క అంతరము అనబడును. మన్వంతరము యొక్క సంఖ్యను వర్షాగ్రముతో వినుడు. అవి మానుష మానమున ముప్పది కోట్ల సంవత్సరములు. సాధికను వదిలి అరువదిఏడు లక్షల ఇరువది వేలసంవత్సరములు. ఇది మన్వంతరము యొక్క సంఖ్య అని పండితులచే చెప్పబడినది. ఈ మన్వంతరము యొక్క కాలము యుగములతో బాటు చెప్పబడినది. నాలుగువేల ఏండ్లతో కూడినది. మొదటి కృతయుగము త్రేతా యుగమును ద్వాపర యుగమును కలియుగమును చెప్పెదను. ఒకేసారి కలిసిన అర్థము (వస్తువు విషయమును) రెండు విధముల చెప్పరాదు. క్రమముగా వచ్చిన ఈ యుగ ద్వయము ఋషివంశ ప్రసంగమునను అట్లే వ్యాకులుడు అగుటచేతను నాచే నీకు చెప్పబడినది. అందులో త్రేతాయుగ ప్రారంభమున మనువు ఆ సప్తర్షులును శ్రుతి ప్రోక్తమైన ధర్మము, స్మృతి ప్రోక్తమైన ధర్మమున్ను బ్రహ్మచే ప్రేరేపింపబడినవి. ఋగ్, యజ్, సామవేదములందు చెప్పబడిన దారాగ్నిహోత్ర సంయోగము మొదలగు లక్షణములుగల శ్రాతమగు (శ్రుతిప్రోక్తమగు) ధర్మమును సప్తర్షులు చెప్పిరి. పరస్పరముగా వచ్చిన ధర్మము ఆచారరూపమై స్మార్తధర్మమైనది. వర్ణాచార ఆశ్రమాచారములతో గూడిన దాని స్వాయం భువ మనువు ధర్మముగా చెప్పును. సత్యముతోను, బ్రహ్మచర్యముతోను, వేదముతోను, తపస్సుతోను బాగుగా తపస్సుగల తపస్వుల ఆర్షేయ (ఋషిసంబంధమైన) క్రమముతోను, సప్తర్షులయొక్కయు, మనువుయొక్కయు త్రేతాయుగ ప్రారంభమున అబుద్ధి పూర్వకముగా మానవమాన ప్రకారముగా సంవత్సరములు సృష్టించబడినవి. అ ప్రమాణముతోనే కృతయుగ వర్ష(సంవత్సర) మానమును చెప్పెదను. అవి అంకెలలో పదునాలుగు లక్షలు కలికాలయుగమునకు నలుబది నాలుగు వేలు. ఈ విధముగ లెక్కించిన కాలము. విశేషించి కాలములలో లెక్కించిన కాలము. అక్రియా పూర్వకముగా తారకాది నిదర్శనములతో వెలువడిన మంత్రములు. అదికల్పమునందైతే దేవతల నుండియే స్వయముగా బయలు వెడలినవి. నాశమందైనను ఈ సిద్ధులు ప్రవర్తిల్లును. గడచిన కల్పములలో వేలకొలది మంత్రములు ఉండినవి. ఆ మంత్రములు వారి ప్రతిభాసము నుండి పుట్టినవి. సప్తర్షులచే ఋక్కులు (ఋగ్వేదము) యజుస్సులు (యజుర్వేదము) సామములు (సామ వేదమును) చెప్పబడినవి. మనువు స్మార్తధర్మమును చెప్పెను.

త్రేతాయుగ ప్రారంభమున కేవలము ధర్మ విశేషముగా వేదములు కూర్చబడినవి. ద్వాపరయుగమున ఆయువును సంరోధించుటవలన విశేషముగా వ్యాపించి ఉంచబడినవి. పూర్వము కలియందును ద్వాపరమునందును ఋషులును దేవతలును స్వయంభువుడైన బ్రహ్మచే జనన మరణములు లేనివారుగా దివ్యులుగాను సృష్టించబడిరి. ఆ యుగమున వారు యుగమును అనుసరించి ధార్మికులుగను, ప్రజలతో కూడిన వారుగను రాజ్యాంగములతో కూడిన వారుగను, వేదమును జెప్పువారుగను సమానమైన (సుఖ) ప్రయోజనము గలవారునుగా ఉండి, విశేషముగ క్రీడించుచుండిరి. క్షత్రియ జాతియొక్క కార్యారంభము యజ్ఞముగా గలవారు ఋషులు. రాజుయొక్క (యజ్ఞములలో ఈయబడిన) హవిస్సే యజ్ఞముగా కలవారు దేవతలు. పరిచారమే (ఉన్నత జాతుల సేవయే) యజ్ఞముగా గలవారు శూద్రులు. జపమే యజ్ఞముగా కలవారు బ్రాహ్మణోత్తములు. ఆ విధముగా త్రేతాయుగములో నాలుగు వర్ణములును (జాతులు) మిక్కిలి సంతుష్టులై ధర్మముచే రక్షింపబడినవారై నిత్యము క్రియావంతులై ప్రజా (సంతాన) వంతులై ఐశ్వర్యవంతులై సుఖులునై ఉండిరి. క్షత్రియులు బ్రాహ్మణులను అనుసరించి మెలగుచుండిరి. క్షత్రియులను వైశ్యులు, వైశ్యులను శూద్రులు అనుసరించి మెలగుచుండిరి. ఈ విధముగా అందరును పరస్పరముగా నియమబద్ధులై పెద్దలను అనుసరించుచుండిరి. వారి ప్రవృత్తులు (నడవడులు) శుభములు, ధర్మములు వర్ణాశ్రమానుగుణములు మనసుచే సంకల్పించిన దానిని వాక్కుతో పలికిన దానిని వారు తమ క్రియలతో ఆచరించెడివారు త్రేతాయుగమున కర్మ ఆరంభము వికలముగాకుండా సిద్దీంచెడిది. త్రేతాయుగమున ఆయువు మేధ, బలము, రూపము, ఆరోగ్యము, ధర్మశీలత - ఇవి సర్వ సాధారణములై అందరియందు ఉండెడివి.

బ్రహ్మ వారికి వర్ణాశ్రమ వ్యవస్థానములను ఆ విధముగానే చేసెను. కాని మరల ఆ ప్రజలు అజ్ఞానమువలన ఆ ధర్మములను పాలించలేదు. ఆ ప్రజలు పరస్పర విరోధముతో మనువును అనుసరించిరి. స్వాయంభువమనువు ఉన్నది ఉన్నట్లున్న నిజమును చూచెను. బ్రహ్మపురుషుడై శతరూపనుండి ప్రియవ్రత-ఉత్తానపాదులను పుట్టించెను. వారు మొదటి రాజులు. అది మొదలు దండధారులైన రాజులు పుట్టిరి. ప్రజలను రంజింప చేయుటవల్ల ఆ నరపాలురు రాజులైరి. వారు కప్పిపుచ్చుకొన్న పాపములు కలిగి, జయించుటకు అలవిగానివారు. ధర్మసంస్థాపనమునకై వారిని శాసించు శాస్త్రము నాచేత చేయబడినది. ఋషులైన బ్రాహ్మణులచే త్రేతాయుగమున వర్ణముల విభాగములు చక్కగా చెప్పబడినవి, తరువాత వేదసంహితలు మంత్రములును చెప్పబడినవి. అపుడు దేవతలచేత ఈ విధముగా యజ్ఞము ప్రవర్తింప చేయబడినది. అప్పుడు ఈవిధముగ శుక్లపక్ష యామముల సర్వసంభారములతోను జపములచే దేవతలు యజ్ఞమును నిర్వహింపజేసిరి. విశ్వభుక్కైన విష్ణువుతోబాటు మహౌజస్వియైన దేవేంద్రునిచే స్వాయంభువ మన్వంతరమున పూర్వము ఆ యజ్ఞములు ప్రవర్తింపబడినవి. సత్యము, జపము, తపము, దానములు త్రేతా యుగములో ధర్మమని చెప్పబడినది. క్రియా ధర్మము తగ్గును. సత్య ధర్మము ప్రవర్తించును.

తరువాత శూరులు, ఆయుష్మంతులు, మహాబలులు ప్రజలను శిక్షించు దండనీతి గలవారు, మహాభాగులు (అదృష్టవంతులు), యజ్ఞములను జేయువారు. బ్రహ్మను (వేదము లను పరబ్రహ్మను) చెప్పువారును, పద్మపత్రములవలె విశాలమైన కన్నులుకలవారు, విశాలవక్షము కలవారు చక్కని శరీర అవయవముల కూర్పుగలవారు, సింహములను గూడ చంపు శౌర్యముగలవారు, మహాప్రాణశక్తి గలవారు, మదపుటేనుగువలె ఠీవిగా నడచువారును, మహాధనుస్సును ధరించినవారునైన చక్రవర్తులు త్రేతాయుగమున ఉందురు. వారు సర్వలక్షణ సంపన్నులు, మఱ్ఱిచెట్టువంటి పరిమండలము కలవారు. ఆ బాహువులు న్యగ్రోధములు (మఱ్ఱిచెట్టువలె విశాలము) అయినవి. వారి బాహ్యంతరము గూడ న్యగ్రోధము అనబడినది. దేహికి ఎడమవైపుగా సమోన్నతమైనది సముచ్ర్ఛయ మగును. ఆవిధముగా సమోన్నతమైన వైశాల్యము న్యగ్రోధమండలమని తెలియ వలెను. చక్రము, రథము, మణి, భార్య, విధి, అశ్వములు, ఖగములు- ఈ యేడు సమస్త చక్రవర్తు లకును మహారత్నములు. చక్రము, రథము, మణి, ఖడ్గము, ధనుః శ్రేష్ఠము, ధ్వజము (జెండా) నిధియు - ఈ ఏడును ప్రాణహీనములు (రత్నములు). భార్య పురోహితుడు, సేనాని, రథకారుడు, మంత్రి, అశ్వము, గున్నయేనుగును ఈ ఏడును ప్రాణముతో కూడినవి (రత్నములు). ఈ రత్నములు దివ్యములు మహాత్ములకు సిద్ధించును. చక్రవర్తులు అందరికిని ఈ పదునాలుగు రత్నములు విధిగా ఉండదగినవి.

భూత భవిష్యత్ కాలములలోని మన్వంతరముల అన్నింటిలోను భూలోకమున చక్రవర్తులు విష్ణువుయొక్క అంశతో పుట్టుదురు. భూత, భవిష్యత్తులలోను, వర్తమానము నండును, త్రేతాయుగాడులలోను ఇచట చక్రవర్తులు విష్ణ్వంశతోనే పుట్టుదురు. ఆ రాజులకు ఇచట ఇవి క్షేమకరములు. బలము, ధర్మము, సుఖము, ధనము అను ఈ నాలుగు అద్భుతములు. ఇవి పరస్పర విరోధము లేకుండా సమముగా రాజులను చేరును. అణి మాదులైన యైశ్వర్యముతోను, ప్రభుశక్తితోను, వీనికి వేరైన తపస్సుచేతను, వీరు ఋషులను అవమానింతురు. బలముచేతను, తపముచేతను, దేవదానవ, మానవులను తిరస్కరింతురు. వీరి శరీరమున మానుషేతరములైన చిహ్నములతో కూడ జన్మింతురు. వెంట్రుకలతో ఫాలభాగమున కనుబొమల మధ్య సుడిగలవారు, చీపురు వంటి నాలుక గలవారు, ఎఱ్ఱని పెదవులు దంతములు గలవారు, రొమ్మునందు (విష్ణువునకు వలె) మచ్చ గలవారు పైకి నిక్కబొడిచిన వెంట్రుకలు గలవారు, మోకాళ్ళ వరకు బాహువులు గలవారు, జాలము వలెనుండు చేతులు గలవారు (అరచేతి వేళ్లు) సందులుగా ఉన్నవారు, వృషభ చిహ్నము గలవారు, మఱ్ఱిచెట్టువలె విశాలమైనవారు, సింహము వంటి భుజస్కంధము గలవారు, చక్కని జననాంగముగలవారు, గజరాజువలె గంభీరముగ నడచువారు, గొప్ప చెక్కిలి పైభాగము కలవారు, పాదములలో చక్రమత్స్యములు, చేతులలో శంఖ పద్మములును గలవారుగా ఉందురు. ఆ రాజులు ఎనుబదియైదు సంవత్సరముల వరకు ముసలితనము లేనివారై ఉందురు. వారియొక్క గమనములు సంగము లేనివి. అవి నాలుగు: అంతరిక్ష గమనము, సముద్రగమనము, పాతాళగమనము, పర్వత గమనము. త్రేతాయుగములో ఇజ్యా (యాగము) దానము, తపము, సత్యమును ధర్మముగా చెప్పబడినవి. అపుడు ధర్మము వర్ణాశ్రమ విభాగమును బట్టి నడుచుచుండెను. దండనీతి మర్యాదా స్థాపనమునకే ప్రవర్తిల్లు చుండెను. సమస్త ప్రజలు సంతుష్టులై పుష్టిగాను, రోగములేనివారుగను, పూర్ణమైన మనస్సు గలవారుగను ఉండిరి. త్రేతాయుగ విధిలో నాలుగు పాదములతో కూడిన ఒక్క వేదము చెప్పబడినది. అపుడు మానవులు మూడు వేలయేండ్లు జీవించి ఉందురు. పుత్రులతోను, మనుమలతోను వ్యాపించినవారై క్రమముగా వారు మరణింతురు. ఇది త్రేతాయుగములోని ధర్మము త్రేతాసంధిలో దానినివినుడు. త్రేతాయుగ విభాగము సంధ్యాపాదముతో ఉండును. సంధ్య యందలి స్వభావము యుగపాదముతో ఉండును. అని చెప్పగా, శాంశపాయనుడు సూతునితో పూర్వము స్వాయంభువ మను సృష్టిలో త్రేతాయుగ ప్రారంభమున యజ్ఞము యొక్క ప్రవర్తనము (జరుపుట) ఎట్లుండెనో! దానిని నాకు చెప్పుము అని అడిగెను. అప్పుడు సూతుడు కృతయుగముతో బాటు సంధ్యకూడ గడచిపోగా, త్రేతాయుగము వచ్చినపుడు కళఅన్నది ప్రవర్తిల్లగా మరల వర్ణాశ్రమ వ్యవస్థను ఏర్పరచిరి. ఓ శాంశ పాయన! ఆ సంభారములు అన్నియు సంపాదించి యజ్ఞము ఎట్లు నిర్వహింపచేయబడినదో వినుమని సూతుడు చెప్పెను.

త్రేతాయుగ ప్రారంభమున వర్ష సృష్టి జరిగి ఓషధులు పుట్టగనే, గృహములలోను, ఆశ్రమములలోను, పురములలోను, జీవనోపాయములైన వృత్తులు స్థిరముగ ఏర్పడగనే యజ్ఞము ప్రవర్తిల్ల చేయబడినది. వర్ణ-ఆశ్రమముల వ్యవస్థను ఏర్పరచి, వేద మంత్రములను సంహితను రచించి, లౌకికాలౌకిక కర్మలందు ఆ మంత్రములను జోడించియు, విశ్వాపాలకుడైన ఇంద్రుడు అపుడు సమస్త దేవతలతో గూడి సర్వ సంభారములతో సంపాదించిన యజ్ఞమును ప్రవర్తిల్ల చేసెను.

ఆ తరువాత అశ్వమేధయాగ విస్తారము జరుగగా, మహర్షులు వచ్చిరి. అందరు వచ్చి పవిత్రములైన పశువులతో హోమముచేసి యజ్ఞము చేయుచుండిరి. నిరంతరము జరుగు యజ్ఞకర్మయందు ఋత్విజులు వారి పనులలో నిమగ్నమైరి. ఆ తరువాత వెంటనే వేదములు (ఆగమములు) గానము చేయబడినవి. యజ్ఞమున యజుర్వేదమును చదువు (అధ్వర్యు శ్రేష్ఠులు తొందరగా తిరుగుచుండిరి. పవిత్రములైన పశుగణములు లభింపకుండినవి. యజ్ఞాహుతికై కోయబడినవి. దేవతలను యజ్ఞభాక్కులైన మహాత్ములను దేవహోతలు దేవతలకై హోమము జేయువారు పిలువగానే దేవతలకై హవిస్సు హోమము చేయబడినది. ఇంద్రియాత్మకులు, యజ్ఞభాక్కులైనట్టియు కల్పాదిలో ఉన్నవారు అయిన దేవతలను, కల్పాదులలో యజ్ఞముతో పూజింతురు. ప్రేషకాలమున లేచిన అధ్వర్వులైన మహర్షులు అందఱుకూడి దీనములై ఉన్న పశుగణములను చూచి ఈ యజ్ఞ విధి ఏమిటని ఇంద్రుని అడిగిరి. నీవు ధర్మమును పొందగోరి హింసచేయుట నీకు బలీయమైన ధర్మము. ఓ దేవ శ్రేష్ఠుడా! నీ యజ్ఞమున పశువధ అనిష్టము. ధర్మమును పడగొట్టుటకై పశువులతో నీచే అధర్మము ప్రారంభింపబడినది. ఇది ధర్మముగాదు. ఇది అధర్మము, హింస ధర్మమని చెప్పబడదు. నీవు కోరినచో వేదముతో యజ్ఞమును చేయుము. అవినాశ కారణమైన వేదశాస్త్రదృష్టమైన విధానముగల యజ్ఞముతో ధర్మమును నిర్వహింపుము. ఓ దేవేంద్ర! హింసకు తావులేనివియు, మూడేండ్ల ఉత్కృష్ట కాలముండి మొలవనట్టి యజ్ఞ బీజములతో యజ్ఞమును నిర్వహింపుము. ఓ ఇంద్రా! ఇది స్వయంభువైన బ్రహ్మచే పూర్వము చెప్పబడిన గొప్ప ధర్మము అని చెప్పగా.....

ఋషులు పలికిరి:

జంగమములచేతనా? లేక స్థావరములచేతనా? ఎవరిచే ఈ లోకమున యజ్ఞము చేయదగినది అని జెప్పబడినది? అని ఈ విధముగా తత్త్వదర్శములైన ముసులతో ఇంద్రుడు చర్చించెను. ఋషులు మహా ప్రాజ్ఞుడవైన ఓ రాజా! ఉత్తానపాదు నందు యజ్ఞవిధిని నీవు ఏ రీతిగా చూచితివి? తెలుపుము ఓ ప్రభూ! మా సంశయమును పోగొట్టుము. అని ఆ వివాదముతో ఖిన్నులై తత్త్వయుక్తులైన మునులుకూడ ఇంద్రునితో మాట్లాడి ఈశ్వరుడైన వసువును ఈ విధముగా అడిగిరి.

వారి మాటను విని, బలాబలమును విచారింపక, వేదశాస్త్రములను స్మరించి యజ్ఞతత్త్వమును వసువు వారికి రాజు ఉపదేశించిన విధానములతో యజ్ఞము చేయవలసి ఉన్నదని పలికెను. యజ్ఞబీజములు ఫలములు అయిన, పవిత్రములైన పశువులతో యజ్ఞము చేయవలెను. యజ్ఞము యొక్క హింసా స్వభావమును గూర్చి కూడ ఈ విధముగ నాకు ఇతడు చెప్పుచున్నాడు. దీర్ఘమైన తపస్సుతో గూడిన తారకాదుల దర్శనముతో మహర్షులచేత హింసాలింగ (లక్షణ)ము గల మంత్రములు చూడబడినవి. ఆ ప్రామాణ్యముతోనే నాతో కూడ చెప్పబడినది. అందువలన దానిని భావింపతగదు. ఓ బ్రాహ్మణులారా! ఆ మంత్రములే ప్రమాణములైనచో అట్లే యజ్ఞము జరుగుగాక, కానిచో మా మాట అసత్యమగును అని పలుకగా, ఈ విధముగా యుక్తాత్ములై తపోధనులైన మునులు ప్రత్యుత్తరములేని వారైరి. అబద్దములాడిన రాజు పాతాళమును ప్రవేశించినందున, పాతాళమున అతని యొక్క భవనమును చూచి మాటాడక మిన్నకుండుము”.

అని చెప్పిన వెంటనే రాజు పాతాళమును ప్రవేశించి ఊర్థ్వమున చరించువాడై వసువయి పాతాళమున చరించువాడు అయ్యెను. ఆ మాటతోనే అతడు భూతలమున నుండువాడు గూడ అయ్యెను. తరువాత ధర్మసంశయములను ఛేదించు రాజైన వసువు వచ్చెను. కావున బహుజ్ఞానియైనను ఒక్కడు సంశయము చెప్పరాదు. ద్వారములు గల ధర్మము సూక్ష్మము అయినందున దానిని దగ్గరగా తెలిసికొనుట అలవి కానిది. కావున దేవతలను ఋషులను దగ్గర చేర్చుకొని, స్వాయంభువమనువు తప్ప తక్కిన వారికి ధర్మము నిశ్చయముగ చెప్పసాధ్యముకానిది. కావున అహింస ధర్మమునకు ద్వారముగా మహర్షులు చెప్పిరి. కోటి సహస్ర ఋషులు తమ (అహింసా) కర్మచేత స్వర్గమునకు వెళ్ళిరి. కావున మహర్షులు దానమునుగాని, యజ్ఞమునుగాని ప్రశంసింపరు. తపోధనులు స్వల్పముగా తమ వైభవమును అనుసరించి కందమూలమును, ఫలమును, శాకమును, జలపాత్రమును ఈ విధముగ (హింసలేక) దానము చేసి స్వర్గ లోకమున సుప్రతిష్ఠితులు అగుదురు. ద్రోహము చేయకుండుట, లోభములేమి, ఇంద్రియ నిగ్రహము, ప్రాణులయెడ దయాభావము, తపము, బ్రహ్మచర్యము, సత్యము, కనికరము, క్షమ, ధైర్యము అను - ఇవి సనాతన ధర్మమునకు మూలము. ఇది సామాన్యముగా అబ్బదు. ధర్మము మంత్రాత్మకమైనది. యజ్ఞము, భుజింపకుండుట, తపము, యజ్ఞముతో దేవతలను చేరును. మరి, తపముతో వైరాగ్యమును చెందును. కర్మ సన్యాసమున బ్రాహ్మణ్యమునందును వైరాగ్యమున లయమును జూచును. జ్ఞానము వలన కైవల్యమును (పరమేశ్వ రైక్యమును) పొందును. ఈ అయిదును గతులు అనబడినవి. ఈ విధముగ పూర్వము స్వాయంభువ మన్వంతరమున ఋషులకును దేవతలకును యజ్ఞమును ప్రవర్తిల్లచేయుటలో గొప్ప వివాదము జరిగినది. తరువాత ఆ ఋషులు అద్భుతమైన మార్గమును చూచి, ఆ బలముతో వసువు (రాజు) యొక్క మాటను తిరస్కరించి, వచ్చిన దారిన వెడలిరి. దేవ సంఘములు పోవగనే దేవతలు యజ్ఞమును పొందుదురు. బ్రహ్మ నక్షత్రమయులైన రాజులు తపః సిద్ధులుగా చెప్పబడినారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మేధాతిథి, వసువు, సుమేధనుడు, విరజుడు, శంఖపాదుడు, రజుడు, ప్రాచీనబర్హి, పర్జన్యుడు, హర్ధానుడు మొదలగువారు రాజులు. వీరును, మరికొందరును రాజులు సిద్ధులై స్వర్గమునకు ఏగిరి. రాజర్షులు మహాసత్త్వులు అయిన వీరి కీర్తి సుప్రతిష్ఠితమైనది. కావున యజ్ఞమున కంటె తపము అన్నింటిలో బహుకారణములచే విశిష్టమైనది. పూర్వము బ్రహ్మచేత తపముచేత ఈ గమన శీలమైన విశ్వము సృష్టించబడినది. కావున ఆ యజ్ఞము అతిశయింపదు. ఇది తపోమూలకము. అందువలన స్వాయంభువ మన్వంతరమున యజ్ఞ ప్రవర్తనము ఈ విధముగ ఉండెడిది. అప్పటి నుండి ఈ యజ్ఞము యుగములతో బాటు ప్రవర్తిల్లెను.