వాయు మహా పురాణము
అనుషంగపాద కథనము
సూతుడు ఇట్లు అనెను:
తుర్వసుని పుత్రుడు వహ్ని, వహ్ని పుత్రుడు గోభానువు. గోభానువు సుతుడు వీరుడును, అపరాజితుడును అయిన త్రిసానువు. త్రిసానుసుతుడు కరంధముడు. కరంధమునిపుత్రుడు అవీక్షిత్తు, అవీక్షిత్తు పుత్రుడు మరుత్తు. మరుత్తునకు పుత్రులు లేరు. అవీక్షిత్తుపుత్రుడైన వేరొక రాజు మరుత్తను గూర్చి పూర్వము చెప్పబడెను. సంతానములేని మరుత్తు రాజుగా ఉండెను. పౌరవుడైన దుష్కృతుని మరుత్తునకు పుత్రునిగా అందరు కల్పించిరి. ఈ విధముగ యయాతి శాపముతోను, ముసలితనము సంక్రమించుటచేతను, పూర్వము పౌరవ వంశము తుర్వసు వంశమున ప్రవేశించెను. దుష్కృతునకు పుత్రుడు రాజైన శరూథుడు అనువాడు. శరూథునకు పుత్రుడు జానాపీడుడు. అతనికి నలుగురు పుత్రులు. పాండ్యుడు, కేరళుడు, చోళుడు, కుల్యుడు. వారి దేశములు పాండ్య దేశములు, కేరళ దేశములు, చోళ దేశములు, కుల్య దేశములు. ద్రుహ్యునకు ఇద్దరు పుత్రులు బభ్రువు, సేతువు - అని ప్రసిద్ధులు. సేతు పుత్రుడు అరుద్ధుడు, బభ్రుపుత్రుడు రిపువు. యుద్ధమున పాపియైన యౌవనాశ్వునిచే బలి నిహతుడు అయ్యెను. వారి యుద్ధము చాల గొప్పది. పదునాలుగు నెలలు జరిగెను. అరుద్ధుని పుత్రుడు గాంధారుడు అను రాజు. అతని పేరుతోనే గాంధారదేశమని ఒక పెద్ద దేశము పిలువబడుచున్నది. గాంధార దేశమున పుట్టిన గుఱ్ఱములు గుఱ్ఱములలో శ్రేష్ఠములు అయినవి. గాంధార పుత్రుడు ధర్ముడు. అతని పుత్రుడు ఘృతుడు. ఘృతునకు దుర్మదుడు పుట్టెను. అతనికి ప్రచేతసుడు పుట్టెను. ప్రచేతసుకు నూరుగురు పుత్రులు. వారు అందరును రాజులే. వారు అందరు మ్లేచ్ఛరాష్ట్ర అధిపులై, ఉత్తర దిక్కును ఆశ్రయించిరి. అనువు యొక్క పుత్రులు మువ్వురు. వారు మహాత్ములు, పరమ ధార్మికులును. వారు - సభాసరుడు, పక్షుడు, పరపక్షుడును, సభాసరుని పుత్రుడు విద్వాంసుడును రాజు అయిన కాలానలుడు. కాలానలునకు ధర్మాత్ముడై ధార్మికుడైన సృంజయుని కుమారుడు, వీరుడు రాజయిన పురంజయుడు. సృంజయునకు పుత్రుడు పురంజయసుతుడు మహాసత్త్యుడు అయిన జనమేజయుడు. జనమేజయ రాజర్షికి పుత్రుడు రాజు అయిన మహాశాలుడు. మహాశాలునకు పుత్రుడు ఇంద్రసముడైన రాజును, స్వర్గమున ప్రతిష్ఠింపబడిన కీర్తి కలవాడును, ధార్మికుడు అయిన మహామనుడు. సప్త ద్వీపేశ్వరుడైన రాజును, చక్రవర్తియు, మహాయశస్వియు అయిన మహామనునకు ప్రసిద్ధులైన పుత్రులు ఇరువురు. వారు ధర్మజ్ఞుడైన ఉశీనరుడు, ధార్మికుడైన తితిక్షువు, ఉశీనరుని భార్యలు రాజర్షి వంశజులైన ఐదుగురు. వారు - మృగా, కృమీ, నవా, దర్వా, ఐదవది దృషద్వతి. ఉశీనరుని పుత్రులు పై స్త్రీలయందు జనించిన ఐదుగురు. కులోద్వహులు. వారు మంచి గొప్ప తపస్సుచే వృద్ధులైన ధార్మికులు, మృగకు పుత్రుడు మృగుడు, నవకునవుడు, కృమికి కృమి, దార్వకు సువ్రతుడను ధార్మికుడును పుత్రులు. దృషద్వతికి ఔశీనరునకు గలిగిన పుత్రుడు శివి. శివికి శివపురము ప్రసిద్ధమైనది. మృగునకు యౌధేయ పురము, నవునకు నవరాష్ట్రము, కృమికి కృమిలాఅనుపురి, సువ్రతునకు వృష్టా అనుపురి రాజధానులు. శివి పుత్రులను గురించి వినుడు. శివికి శివులను నలువురు పుత్రులు లోక సమ్మతులు. వారు వృషదర్భుడు, సువీరుడు, కేకయుడు, మద్రకుడును. వారియొక్క విశాలములైన దేశములు వరుసగా - వృషదర్భములు, సూచిదర్భములు, కేకయములు, మాద్రకములు. తితిక్షువు యొక్క సంతానమును గురించి వినుడు. అతని పుత్రుడు తైతిక్షు వనువాడు రాజై, తూర్పు దిక్కున ప్రసిద్ధిచెందెను. అతడి కుమారుడు ఉశద్రథుడను మహాబాహువు. ఆతనికి హేముడు సుతుడు. హేముని సుతుడు సుతపుడు. అతని సుతుడు సుతులకే యశస్వియైన బలి. సంతాన వాంఛచే వంశము క్షీణించుచుండగా, మనుష్య యోనిలో పుట్టెను. ఆ బలి మహాయోగి, ఆ మహామనస్వి (విష్ణువుచే) బద్ధుడయ్యెను. ఆతడు చాతుర్వర్ణ్య కారులను నలుగురిని పుత్రులను భూమిలో జనింప చేసెను. అంగుని, వంగుని, సుహుని, పుండ్రుని, కళింగుని - బలి జనింపజేసెను. ఇది బలి జనితమైన క్షత్రియ సంతానము. బలికి సంబంధించిన (జన్మించిన) వారును, బ్రాహ్మణులును సైతము ప్రభువైన అతని వంశకరులు. ప్రీతి చెందిన బ్రహ్మచే ధీమంతుడైన బలికి. వరములు ఈయబడినవి. మహాయోగిత్వము, కల్పాయుఃపరిమాణకమైన ఆయువు, యుద్ధమున అజేయత్వము, ధర్మమున ప్రకృష్టమైన భావనయు, ముల్లోకముల దర్శనము, ప్రసవమున ప్రాధాన్యము, బలమున సాటిలేని తనము, ధర్మతత్త్వార్థదర్శనము, నియతమైన బ్రాహ్మణాది చతుర్వర్ణములకు స్థాపకత్వము. ఇవి బలికి బ్రహ్మ ఇచ్చిన వరములు. బ్రహ్మ ఈ వరములు ఈయగానే రాజైన బలి పరమమైన శాంతిని పొందెను. చాలా కాలము గడచిన తరువాత విద్వాంసుడైన బలి స్వస్థానమునకు వచ్చెను. వారియొక్క విశాలములైన దేశములు వంగ, అంగ, సుహ్లక, పుండ్ర, కళింగములు. వారియొక్క వంశమును వినుడు. బలియొక్క ఆ తనయులు అందరును బలియొక్క క్షేత్రము (భార్య)నందు మునివల్ల కలిగినవారు, దీర్ఘతముడను మునికి సుధేష్ణయందు పుట్టిన తేజోవంతులు.
ఋషులు ఇట్లు అనిరి:
“ఓ ప్రభూ! బలిపుత్రులు అయిదుగురును దీర్ఘతముడను ఋషిచే ఎట్లు క్షేత్రజులుగా పుట్టిరి? ఇది మాకు చెప్పుడు.”
సూతుడు ఇట్లు అనెను:
పూర్వము అశిజుడు అను ప్రసిద్ధి చెందిన ధీశాలియైన ఋషి ఉండెను. ఆ మహాత్మునకు మమత అను భార్య ఉండెను. అశిజునికి చిన్న సోదరుడును, దేవతలకు పురోహితుడును, గొప్ప తేజస్సు గలవాడును అయిన బృహస్పతి అన్న భార్య అగు మమతను సంగమించుటకు కూడ పోయెను. ఆ బృహస్పతిని ఇష్టపడనిదై మమత అతనితో - ‘నీ జ్యేష్ఠభ్రాత (అశిజుని) వల్ల గర్భవతినై అష్టమితనైన (ఎనిమిది నెలలైన) దానను. ఓ బృహస్పతీ! ఈ నా మహాగర్భము అశీజుని నుండి షడంగ వేదము అభ్యసించి, దాని ఉచ్చరించుచు మిక్కిలి దుఃఖించుచున్నాడు. నీవుకూడ వ్యర్థముగాని రేతస్సు కలవాడవు. కావున నన్ను భోగించుటకు తగవు. ఈ విధముగా ఉన్న ఈ సమయమున ఓ ప్రభూ! నీవు ఎట్లు తలంతువో!” అట్లే అని అనెను. ఇట్లు చక్కగా చెప్పబడిన ఆ మహావీర్యుడై మహాత్ముడైన బృహస్పతి కామము నిండిన ఆత్మగల తననునిలుపుకొన లేకపోయెను. ధర్మాత్ముడై (కూడ) బృహస్పతి ఆమెతో సంభోగించనే సంభోగించెను. అపుడు రేతస్సును వదులుచున్న బృహస్పతితో గర్భస్థుడైన శిశువు ఇట్లు పలికెను. వేదాధ్యయనముచేసి స్నాతక బ్రహ్మచారి అయినవాడు నేనున్న ఈ గర్భయోనిలో రేతస్సు ఉంచరాదు. ఇచట నిరువురు పుట్టుటకు అవకాశములేదు. నీవు కూడ వ్యర్థముగాని వీర్యము కలవాడవు. కాని, అంతకన్న పూర్వమే నేను ఇచట ఊపిరి పోసికొని వచ్చినవాడను అని అనగానే కోపించిన భగవత్ రూపుడును ఋషియును అయిన బృహస్పతి గర్భములో ఉన్నవాడును, అన్నగారి సుతుడునునై యాశిజుడైన అతనిని శపించెను. సర్వ ప్రాణులును కోరునట్టి ఈ సంభోగరేతస్రవణ కాలమున అజ్ఞానమున నన్ను ఇట్లు నిషేధించితివి కావున నీవు దీర్ఘమైన తమమున ప్రవేశింపగలవు (దీర్ఘతముడవు) కాగలవు అని శపించెను. తరువాత ఆ శాపమున దీర్ఘతముడను ఋషి జన్మించెను. ఆ తరువాత అశిజ పుత్రుడైన అశిజుడు విశాలకీర్తి కలవాడై తేజస్సుతో బృహస్పతివలె ప్రకాశించెను. తరువాత అన్నగారి ఆశ్రమమున నివసించెను. కామధేను సంతానమైన వృషభము నుండి గోధర్మమును వినెను. అతని అన్నయు, తండ్రి, సోదరుడును, అపుడు ఒక భవనము నిర్మించిరి. దీర్ఘతముడు అచట ఉండగా ఒక వృషభము అనుకోకుండా స్వేచ్ఛగా వచ్చెను. అది ఆవులతో గూడినదై యాగ ధర్మమునకై తెచ్చిన దర్భలను మేసెను. దీర్ఘతముడు కొమ్ములతో విసరుచున్న ఆ వృషభము కొమ్ములు పట్టుకొని నిలిపి వారించెను. అట్లు అతనిచే పట్టుకొనబడిన ఆ వృషభము ఒక్క అడుగైనను కదల్పలేక నిలిచెను. తరువాత ఆ వృషభము - ఓ బలవంతులలో శ్రేష్ఠుడా! నన్ను వదలుము. నాయనా! ఇంతవరకు నీవంటి బలవంతుడు నాకు ఎక్కడను తటస్థ పడలేదు. నేను ముక్కంటిని మోయుదును. భూతలమున పుట్టితిని. ‘ఓ బలవంతులలో శ్రేష్టుడా! నీ విషయమున సంతుష్టుడను అయితిని. వరము అడుగుము’ అనగానే దీర్ఘతముడు - జీవించు నానుండి విడిపించుకొని ఎక్కడికినిపోలేవు. కావున పరుల వస్తువులు హరించు నాలుగు కాళ్ల జంతువైన నిన్ను వదలను - అనగనే ఆ వృషభము దీర్ఘతమునితో ఇట్లనెను. “నాయనా! మాకు దొంగతనము మొదలగు ఏ పాతకమును లేదు. మేము అన్ని విధముల తినదగిన దానిని తినతగని దానిని, త్రాగతగినవానిని, త్రాగతగని దానిని ఎఱుగము”. చేయదగిన దానిని, చేయతగనిదానిని, కూడతగినదానిని, కూడదగని దానిని ఎఱుగము. ఓ బ్రాహ్మణా! మేము పాపులము కాము. ఇది గోవుల ధర్మమని చెప్పబడినది’ అని పలికెను. దీర్ఘతముడు ఈ విధముగ గోవుల ధర్మమునువిని ఆశ్చర్యపడి ఆ వృషభమును వదలి, శ్రవణ పరంపరగా వచ్చిన గోభక్తిచేత ఆ వృషభమును శాంతింపచేసెను. ఆవిధముగ శాంతించిన వృషభము వెళ్లిపోగానే, ఆ గోధర్మమునే భక్తితో మనస్సుతో (దానియందే) నిష్టావంతుడై, పరమాసక్తి కలవాడై స్వీకరించెను. తరువాత దైవవశమున మూఢచిత్తుడై విదిలించు కొనుచు, ఏడ్చుచున్నదియు, తన తమ్ముడైన యుతథ్య పుత్రుని భార్యయు అయిన ఆమెను కామించెను. దానిని గర్వమని తలంచి శరద్వంతుడు అతనిని క్షమింపలేదు. దీర్ఘతముడు గోధర్మమని బలాత్కరించి కోడలివంటి (తమ్ముని భార్య కోడలి వంటిదైనందున దానిని కామించెను. మానవులకు వ్యతిరేకముగ ప్రవర్తించు ఆతనిని చూచి ఆలోచించెను. ముందు అవశ్యముగా జరుగనున్న విషయమును అతనికి మృత్యువులేమియును తెలిసి. కోపముచే నెఱ్ఱనైన కన్నులు కలవాడై - “ఈమె కూడతగినది - కూడతగనిదియను విచారము లేక గోధర్మముతో (పశుధర్మముతో) కోడలిని కామవాంఛ తీర్చుటకై ప్రార్ధించితివి. నీవు చెడు ప్రవర్తనము కలవాడవు, నిన్ను వదిలిపెట్టుచునే ఉన్నాను. నీ కర్మతో నీవు వెళ్ళుము. నీవు గ్రుడ్డివి, ముదుసలివి. ఇతరులచే భరింపదగినవాడవు. కాని ఇపుడు చెడుగా ప్రవర్తించితివి. కావున వదిలి పెట్టబడితివి. నీవు దురాచారుడవని నా తలంపు” అనెను.
సూతుడు ఇట్లు అనెను:
అంత శరద్వంతునకు ఈ క్రూర కర్మయందు బుద్ధి కలిగెను. అనేక విధములుగా భయపెట్టి బాహువులతో పరిగ్రహించి (బంధించి) సముద్రకోష్ఠమున గంగాజలమున దీర్ఘతముని వదిలెను. అపుడు సముద్రుడైన (యోగముద్ర కలిగియున్న) అతనిని గంగ తన ప్రవాహముతో ఏడు దినములు మోయుచుండెను. ధర్మార్థ తత్త్వవేత్తయై రాజైన బలి తన భార్యలతో ఉండి, ఆ ప్రవాహముతో మునుగుచు - సమీపమునకు వచ్చిన ఆ దీర్ఘతముని చూచిరి. ఆ ధర్మాత్ముడై విరోచన పుత్రుడైన బలి అతనిని పట్టుకొని భక్ష్య భోజ్యములతో అతనిని సంతృప్తిపరచుచు అంతఃపురమున రక్షించెను. దానిచే సంతుష్టి చెందిన దీర్ఘతముడు బలిని వరమును కోరుకొమ్మనెను. దానవరాజైన బలి తనకు పుత్రులు కలుగునట్లు వరమడిగెను.
బలి ఇట్లు అనెను:
మహాభాగ్యవంతుడవై గౌరవము ఇచ్చు ఓ దీర్ఘతముడా! సంతానము కొఱకు నా భార్యతో ధర్మార్థములతో కూడిన పుత్రులను జనింపజేయగలవు అనగనే ఆ దీర్ఘతముడను ఋషి తథాస్తు (అట్లే అగుగాక) అని హితమును పలికెను. అపుడు రాజు అతని కడకు సుధేష్ణ అను తన భార్యను పంపెను. గ్రుడ్డియై ముదుసలియైన ఆ ఋషిని చూచి ఆదేవి ఆతని కడకు పోలేదు. కాని తన దాసిని చక్కగా అలంకరించి అతని కడకు పంపెను. ధర్మాత్ముడు వశియునైన ఆ ఋషి ఆ శూద్ర యోనియందు కక్షీవ చక్షుషులను మహౌజస్కులైన పుత్రులను పుట్టించెను. అ కక్షీవచక్షుషులను ఇద్దరిని చక్కగా శాస్త్రీయముగా వేదాధ్యయనము చేసినవారిగను, తత్త్వభావనతో ఈశ్వరులై - బ్రహ్మను (వేదమును, సాక్షాత్తు పరబ్రహ్మను) చెప్పువారిగను, తపస్సిద్ధులుగను, ధర్మమును ప్రత్యక్షము చేసికొన్నవారిగను, జ్ఞానులుగను, అత్యంతముగ సర్వశ్రేష్ఠులైనవారిగను చూచి విరోచన పుత్రుడైన బలి ఈ పుత్రులు నా పుత్రులేఅని ఋషితో అనెను. ఋషికాదని బలితో అనెను. తరువాత వీరు నా పుత్రులనియు అనెను. ఈమిషగా శూద్రయోనియందు నాకు పుట్టినవారు దేవోత్తములు. నన్ను అంధుని గను ముదుసలిగను తలచి నీ భార్య సుధేష్ణ నాకు అవమానముగా శూద్రురాలయిన దాసిని పంపెను అనగానే ఆ ఋషిసత్తముని శాంతింపచేసి బలిప్రభువు భార్యయైన సుధేష్ణను బెదరించెను. తరువాత ఆమెను మరల అలంకరించి ఋషికడకు పంపెను. అంత, దీర్ఘతమ ఋషి దేవితో ఇట్లనెను. “ఓ మంగళ స్వరూపురాలా! ఉప్పు కలిపిన పెరుగును శరీరము అంతయు పూసికొని వివస్త్రుడనుగా ఉన్న నన్ను పాదముల నుండి శిరము వరకు ఏవగించుకొనక నాకినచో నీవు కోరుకొన్న పుత్రులను పదయుదువు అన గానే ఆమె కూడ ముని చెప్పినది అంతయు చేయుచు అపాన (గుద) ప్రదేశము వరకు వచ్చి అసహ్యించుకొని ఆ భాగమున వదలివేసెను. అంత, ఋషి ఓ మంగళ మయురాలా! నీవు ఏ భాగమును వదిలితివో! ఆ భాగములేని పుత్రుని కనెదవు - అనెను. అంత, ఆ దేవి సుధేష్ణ “ఓ మహాభాగుడా! నీవు నాకు ఇటువంటి పుత్రుని ఇచ్చుట న్యాయముకాదు” అని దీర్ఘతమునితో అనెను.
ఋషి ఇట్లు అనెను:
“ఓ దేవీ! ఇది నీ అపరాధము. ఇది వేరొకతీరు కానేరదు. ఓ సువ్రతురాలైన దేవీ! ఇపుడు నేను నీకు పుత్రుని ఇచ్చెదను. అతనికి అపానము లేకయే యోగ్యస్థితి కలుగగలదు అని దీర్ఘతముడు ఆమె కడుపుపై స్పృశించి” ఓ శుద్ధమైన చిరునగవు గలదానా! నా శరీరము నుండి నీవు నాకిన పెరుగుతో నీ గర్భము చంద్ర కళలతో పూర్ణిమవలె నిండినది. నీకు దేవకుమారులతో సమానులును, తేజస్వులును, పరాక్రమము కలవారును, యాగముచేయువారును, ధార్మికులునైన ఐదుగురు పుత్రులు పుట్టుదురు” అని చెప్పెను. తరువాత సుధేష్ణకు అంగుడను జ్యేష్ఠ పుత్రుడు పుట్టెను. తరువాత, వంగుడు, కళింగుడు, పుండ్రుడు, బ్రహ్మయు పుట్టిరి. ఈ ఐదుగురు బలియొక్క క్షేత్రమున అతని వంశమును పొందినవారై పుట్టిరి. వీరు పూర్వము దీర్ఘతమునిచే బలికి ఈయబడిన పుత్రులు. అతని యొక్క సంతానములు ఒక కారణమును బట్టి బ్రహ్మచే అపహతములైనవి. కావున ఆ మహాత్మునకు తన అపత్య, అమాత్య, దారలయందు సంతానము కలుగకుండెను. కావున అతడు మనుష్య యోనియందే సంతానమును పుట్టించెను. తరువాత సురభి (గోవు) సంతుష్టురాలై దీర్ఘతమునితో ఇట్లనెను. నీవు తెలిసి ఈ విధముగ గోధర్మము ఆచరించితివి. కావున ఆ న్యాయముతోనే నిన్ను వదిలిపెట్టు చున్నాను. నీయొక్క ఆ న్యాయముచే ప్రీతుడనైతిని. కావున ఈనాడు ఈ దీర్ఘతమమును పోగొట్టు చున్నాను. నీ శరీరమున బృహస్పతికి సంబంధించిన తక్కిన పాపమును కూడ పోగొట్టుచున్నాను. నీ జరా, మృత్యు భయములను కూడ నిన్ను వాసన జూచి పోగొట్టెదను - అని వాసన చూడగనే దీర్ఘతమము నశించి దీర్ఘతముడు చూడగలిగెను. తరువాత ఆయుష్మంతుడును, యువకుడును, నేత్రములు కలవాడును అయ్యెను. గోవుచేత ఆ దీర్ఘతముడు తరువాత గౌతముడుగా మారెను. తరువాత కక్షీవంతుడు తండ్రితో బాటు గిరివ్రజమునకు వెళ్లి ఉద్దేశించిన విధముగా తండ్రికొఱకు విపులమైన తపము ఆచరించెను. తరువాత చాలా కాలమునకు తమస్సుతో భావింపబడి మనుజప్రభువై దోషములను పోగొట్టి బ్రాహ్మణ్యమును పొందెను. అంత, తండ్రి ఆతనితో నేను పుత్రవంతుడనైతిని, సత్పుత్రుడవై యశస్వివైన నీచేత కృతార్థుడనైతిని అనెను. యోగయుక్తాత్ముడైన అతడు బ్రహ్మచే అక్షయమును పొందెను. బ్రాహ్మణ్యమును పొందిన కక్షీవంతుడు వేయి పుత్రులను సృష్టించెను. నల్లని శరీరములుగల ఆ గౌతములు కక్షీవంతుని కుమారులు. ఇట్లు దీర్ఘతమసుని యొక్కయు వైరోచనుడైన బలియొక్కయు సమాగమము. వారిరువురి సంతానము కూడ చెప్పబడినది. బలి పాపరహితులైన ఆ అయిదుగురు పుత్రులను రాజ్యమునందు అభిషేకించి, కృతార్థుడై, అతడుకూడ యోగాత్ముడై యోగమును ఆశ్రయించి సర్వప్రాణులకును అదృశ్యుడై కాలాకాంక్షియై చరించుచున్నాడు.
అచట అంగుడను రాజర్షికిపుత్రుడు రాజైన దధివాహనుడు, సాపరాధయైన సుధేష్ణకు అనపానుడను రాజు పుత్రుడు, అనపానుని పుత్రుడు రాజైన విరథుడు, విరథుని పుత్రుడు విద్వాంసుడై రాజైన ధర్మరథుడు. ఈ శ్రీమంతుడైన ధర్మరథుడే విష్ణుపదము అను పర్వతము నందలి యజ్ఞమున మహాత్ముడైన ఇంద్రునితో కూడి సోమము త్రాగెను. ధర్మరథునకు కూడ రాజైన చిత్రరథుడు కలిగెను. అతని పుత్రుడు లోమపాదుడు, అతని పుత్రిక శాంత. అతనికి చండికుడు, అతనికి ఇంద్రుని వారించునట్టి వారణము ఉండెను. ఆతడు మంధువు యొక్క ఉత్తమ వాహనమును భూమికి తెచ్చెను. హర్యంగుని పుత్రుడు రాజైన భద్రరథుడు. భద్రరథునకు రాజైన బృహత్కర్ముడు. అతనికి బృహద్రథుడు, అతనికి బృహన్మనుడు పుత్రులు. బృహన్మనునకు రాజైన జయద్రథుడు, అతనికి రాజైన దృఢరథుడు, దృఢరథునకు విశ్వజేత జనమేజయుడును పుత్రులు. జనమేజయునకు అంగుడు, అతనికి రాజైన కర్ణుడు, కర్ణునకు శూరసేనుడు, అతనికి ద్విజుడును పుత్రులు.
ఋషులు ఇట్లు అనిరి:
“కర్ణుడు సూత పుత్రుడు ఎట్లు అయ్యెను. అంగవంశజుడు ఎట్లు అయ్యెను?”
సూతుడు ఇట్లు అనెను:
బృహద్భానువునకు రాజైన బృహన్మనుడు పుత్రుడుగా పుట్టెను. అతనికి ఇరువురు భార్యలు ఉండిరి. వారు ఇరువురును చైద్యుని పుత్రికలు. వారు యశోదేవీ, సత్య అనువారు. వారి వంశము వేరు వేరైనది. యశోదేవియందు జయద్రథుడను రాజేంద్రుడు పుట్టెను. బ్రహ్మ క్షత్రాంతరుడు (బ్రహ్మ క్షత్రముల మధ్యవాడు) సతియందు విజయుడని ప్రసిద్ధి గాంచెను. విజయునకు పుత్రుడు ధృతి. అతని పుత్రుడు ధృతవ్రతుడు. ధృతవ్రతుని పుత్రుడు మహాయశస్వి సత్యకర్మ - సత్యకర్మ పుత్రుడు అతిరథుడైన సూతుడు. అతడు కర్ణుని తీసి కొనెను. దాని వలన కర్ణుడు సూతజుడు. కర్ణుని విషయమున పూర్వము చెప్పబడినది అంతయు మీకు ఇప్పుడు చెప్పబడినది. వీరందరును అంగవంశరాజులు. నాతో చెప్పబడిరి. పూరువు యొక్క సంతానమును విస్తరముగను అనుపూర్వితోను వినుడు.
సూతుడు ఇట్లు అనెను:
పూరువునకు పుత్రుడు మహాబాహువై, రాజైన జనమేజయుడు. అతని పుత్రుడు అవిద్ధుడు, ఈతడు తూరుపు దిక్కును జయించెను. అవిద్ధునకు ప్రవీరుడు. అతనికి మనస్యువు, మనస్యునకు రాజైన జయదుడు. అతనికి రాజైన ధుంధువు. ధుంధువునకు బహుగవి, ఆతనికి సంజాతి, సంజాతికి రౌద్రాశ్వుడు పుత్రులు, ఆతని పుత్రులను వినుడు - రౌద్రాశ్వునకు ఘృతాచిఅను అప్సరయందు పదుగురు పుత్రులు పుట్టిరి. రజేయువు, కృతేయువు, వక్షేయువు, స్థండిలేయువు, హృతేయువు, జలేయువు, ఏడవవాడు స్థలేయువు, ధర్మేయువు, సన్నతేయువు, పదవవాడు వనేయువు. రద్ర, శూద్ర, మద్ర, శుభ, జామలజ, తల, ఖల, ఈ యేడుగురును, గోపజల, తామ్రరస, రత్నకూటి ఈ పదుగురు పుత్రికలు. వంశతః ఆత్రేయుడను పేరుతో ప్రభాకరుడనువాడు వారికి భర్త. అనాదృష్ణుడు రాజర్షియు అయిన రివేయువు అతని పుత్రుడు. రివేయుని భార్య తక్షకపుత్రియైన జ్వలన. ఈమె యందు రాజర్షి రంతినారుని కనెను. రంతినారుడు సరస్వతియందు మంగళకరులైన పుత్రులను కనెను. వారు త్రసువు, ప్రతిరథుడు, అతిధార్మికుడైన ధ్రువుడును, గౌరియని ప్రఖ్యాతి గాంచిన కన్యయు కలిగినది. ఆమె మాంధాతకు తల్లి. ప్రతిరధునకు థుర్యుడు, అతనికి కంఠుడు పుత్రులు. అతనికి సుతుడు మేధాతిథి. అతని వల్ల కంఠాయనులను ద్విజులు కలిగిరి. యమునకు ఇతిన అనుకన్య ఉండెను. ఆమె పుత్రులను కనెను. త్రసువు సుదయితుడును, మలినుడును, బ్రహ్మవాదియు అయిన ఉపదాతుని పుత్రునిగా పొందెను. తరువాత యమకన్య ఇతిన (ఇలిన) సుష్మంతుడు, దుష్యంతుడు, ప్రవీరుడు, అనఘుడు - అను నలుగురిని కనెను. తరువాత రాజశ్రేష్టుడైన చక్రవర్తియైన దుష్యంత పుత్రుడు జనించెను. శకుంతలయందు దుష్యంతునకు భరతుడు జనించెను. అతని పేర భారతమై నది. అశరీరవాణి దుష్యంతునితో ఇట్లనెను. తల్లి సంచివంటిది. పుత్రుడు తండ్రికి చెందిన వాడే. ఎవనిచే జనించునో వాడే వాడగును (తండ్రియే పుత్రుడగును). శకుంతల తన పుత్రుడు నీ పుత్రుడేయని సత్యము బలికినది. కావున దుష్యంత పుత్రుడైన దౌష్యంతిని భరింపుము. ఓ రాజా! రేతస్సున ధరించువాడు యముని ఇంటి నుండి పుత్రుని దీసికొని వచ్చును. ఈ గర్భమునకు నీవే ఆధానకర్తవు. శకుంతలను అనుమానింపకుము. భరతుడు ముగ్గురు స్త్రీలయందు పుత్రులను కనెను. కాని, రాజు తనకు అనురూపులుగా లేరని వారిని అభినందింప లేదు. కావున వారి తల్లులు కోపించినవారై ఆ పుత్రులను యమ నిలయమున కంపిరి (చంపిరి). అందువలన రాజునకు ఆ పుత్రులు జన్మ వ్యర్థమైనది. అందువలన అతడు (భరతుడు) మరుత్తులచే బృహస్పతియొక్క పుత్రుని భరద్వాజుని రప్పించి ఆ మరుత్తులచే యజ్ఞముల ద్వారా భరద్వాజుడు పుత్రుడుగా సంక్రమింప జేయబడెను. అచటనే మరుత్తులచే భరతునకై భరద్వాజుని ఈ జన్మసంక్రమణము జరిగినదని చెప్పుదురు.
పూర్వము భార్య ప్రసవించుటకు సమీపింపగా అశిజుడు భార్యతోనే ఉండెనట. తరువాత, బృహస్పతి తన అన్న భార్యను చూచి - ఓ మంగళకరమైనదానా! నిన్ను నీవు చక్కగా అలంకరించుకొని నాకు మిథునచర్యా సుఖము ఒసంగుమని అడిగెను. అనగనే - ఓ విభో! (సర్వ వ్యాపియైన విజ్ఞుడా!) నేను గర్భవతిని. ఈ గర్భము పరిణతమై తన వాక్కుతో వేదమును పలుకుచున్నది. నీవు గూడ వ్యర్థముగాని రేతస్సు (వీర్యము) కలవాడవు. ఈ నీ ధర్మము కూడ మిక్కిలి నిందింపబడినది - అని అన్న భార్య అనెను. అనగనే చిరునవ్వు నవ్వుచు బృహస్పతి - ‘ఏమైనను నాకు వినయమును ఉపదేశింపకుము’ - అని సంతసించుచునే బలాత్కారముగ ఆమెతో మిథున కార్యమును ప్రారంభించెను. ఆ విధముగ హర్షించుచున్న బృహస్పతితో ఆమె గర్భము (లోనున్న శిశువు) ‘ఓ తండ్రీ! బృహస్పతీ! ముందే నేను ఇచట ప్రవేశించి ఉన్నాను, మీరు అమోఘ రేతస్కులు. ఇద్దరికి ఇచట అవ కాశము లేదు’ అనెను. అనగనే కోపించి బృహస్పతి - ‘సర్వ ప్రాణులకు ఇష్టమైన ఈ సమయమున నన్ను నిషేధించుచున్నావు, కావున దీర్ఘమైన తమమున ప్రవేశింతువు’ - అని శపించెను. ఆ శిశువు తన పాదములచే తల్లి (యోని) ద్వారమును కప్పెను. బృహస్పతి యొక్క ఆ రేతస్సు ఆ శిశువు పాదముల మధ్యన నివారింపబడి చిన్న శిశువుగా మారి వెలువడెను. అప్పటికప్పుడే బృహస్పతి రేతస్సున పుట్టిన ఆ కుమారుని చూచి మమత (బృహస్పతి అన్న అశిజునిభార్య) ‘ఓ బృహస్పతీ! ఈ ద్వాజుని (ఇరువురికి పుట్టిన వీనిని) భరింపుము. నా గృహమునకు వెళ్లుదును అని వెళ్లిపోవగనే, ఆ క్షణముననే బృహస్పతి కూడ విడిచిపెట్టెను. “భరస్వబాఢమితి” - నిన్ను నీవే ప్రయత్నముతో భరించు కొనుము’ అని చెప్పబడుటచే తరువాత ఈతడు భరద్వాజుడు అయ్యెను. తరువాత, తల్లి దండ్రులచే వదిలిపెట్టబడిన ఆ శిశవును చూచి మరుత్తులు (మరుత్తులు అను దేవతలు) దయతో ఈ భరద్వాజుని తీసికొని అటనుండి వెళ్లిపోయిరి. ఆ కాలమున భరతుడు పుత్రలాభమునకై మరుద్దేవతలచే వరుసగా కామ్య - నైమిత్తికములైన యజ్ఞములు చేయుచుండెను. యజమాని భరతుడు తనకు వీనివలన పుత్రులు కలుగనందున పుత్రార్థమై మరల మరుత్సోమ యాగమునుచేసెను. ఆ మరుత్సోమయాగముతో మరుత్తులు సంతోషించిరి. తరువాత బృహస్పతి పుత్రుడును మనీషియు అయిన భరద్వాజుని పుత్రునిగా భరతునకు ఇచ్చిరి. భరతుడు భరద్వాజుని తన పుత్రునిగా పొంది, అపుడు ఇట్లనెను. ఓ ప్రభూ! సంతానము సంపాదింపబడగనే నీచేత ధన్యుడనైతిని. పూర్వము సంతానమునకై భరతుడు చేసిన యాగము వితథమైనది (వ్యర్థమైనది). కావున భరద్వాజుడు ఆ విధముగా వితథుడనబడెను. కావున దివ్యుడైన భరద్వాజుడు బ్రాహ్మణ్యము నుండి క్షత్రియుడు అయ్యెను. ద్విముఖ్యా యనుడు అనువాడు ద్వి పితృకుడు అనబడెను. తరువాత, వితథుడు పుట్టగనే ఆ భరతుడు స్వర్గమునకు పోయెను. వితథుని పుత్రుడు భువమన్యుడు. భువమన్యుని పుత్రులు మహాభూతములతో సాటియైన నలుగురు. వారు - బృహత్ క్షత్రుడు, మహావీర్యుడు, నరుడు, వీర్యవంతుడైన గాగ్రుడును. నరునకు పుత్రుడు సాంకృతి. అతని పుత్రులు ఇరువురు మహౌజస్కులు. గురువీర్యుడు, త్రిదేవుడు అను సాంకృతి పుత్రులు చిన్నవారు. గాగ్రుని పుత్రులు శినిబద్ధునివల్ల కలిగిరి. తరువాత గ్రాగ్యులు క్షాత్రముతో కూడిన ద్విజాతులు అనబడిరి. మహార్యుని పుత్రుడు భీముడు. అతని వల్ల ఉభక్షయుడు. అతని భార్య విశాల మువ్వురు పుత్రులనుకనెను. వారు - త్రయ్యారుణి, పుష్కరిణుడు, మూడవవాడు కపి. కపికి ఈ క్షత్రవరులు, తక్కిన ఈ ఇరువురికి మహర్షులును కలిగిరి. గ్రాగ్యులు సాంకృతులు, వీర్యులు క్షత్రో పేతులైన ద్విజాతులు. అంగిరసుని ఆశ్రయించిన పక్షమును బృహత్ క్షత్రునకు సంబంధించినదిగా చెప్పుము. బృహత్ క్షత్రుని పుత్రుడు సుహోత్రుడను ధార్మికుడు. సుహోత్రుని పుత్రుడు హస్తిఅనువాడుండెను. పూర్వము అతనిచేత ఈ హస్తినము అనుపురము నిర్మింపబడినది. హస్తినునకు కూడ మువ్వురు పుత్రులు పరమ ధార్మికులు. వారు - అజమీఢుడు, ద్విమూఢుడు, పురుమీఢుడును.
అజమీఢుని పుత్రులు శుభులు శుభకులోద్వహులు. మిక్కిలి గొప్పనై వృద్ధుడైన రాజు తపముయొక్క చివర పరమధార్మికులు. భరద్వాజుని అనుగ్రహమున కలిగిన అతని విస్తారమును వినుడు. అజమీఢునకు కేశినియందు కంఠుడు కలిగెను. అతనికి మేధాతిథి పుత్రుడు. అతని వల్ల కంఠాయనులైన ద్విజులు కలిగిరి. అజమీఢునకు ధూమిని యందు రాజైన బృహద్వసువు జనించెను. బృహద్వసువునకు బృహద్విష్ణువు, అతనికి మహాబలుడు, అతనికి బృహత్కర్ముడు, ఆతనికి బృహద్రథుడు, అతనికి విశ్వజిత్తు, అతనికి సేనజిత్తు, సేనజిత్తునకు లోక ప్రసిద్ధులైన నలుగురు పుత్రులు - రుచిరాశ్వుడు, కావ్యుడు, రాముడును, వత్సుడు ఆవంతికరాజు. ఈతనికి వారు పరివత్సరులు. రుచిరాశ్వుని పుత్రుడు మహాయశస్వి పృథుషేణుడు. పృథుషేణునికి పారుడు, పారునకు నీపుడు పుట్టిరి. నీపునకు నూర్వురు పుత్రులు. వారందరును నీపులని పిలువబడిరి. వారికి వంశకరుడు శ్రీమంతుడై రాజకీర్తి వర్ధనుడై, కాంపిల్యమున సమరుడను వాడు. అతనికి సమరుడు అన్న ఎక్కువ ప్రీతి. సమరునకు - పరుడు, పారుడు, సత్వదశ్వుడు - అను మువ్వురు పుత్రులు సర్వగుణోపేతులు. పారపుత్రుడు వృషువు ప్రకాశించెను. వృషునకు పుత్రుడు ప్రకృతి అనువాడు. సుకృత కర్మతో పుట్టిన సర్వగుణోపేతుడు. అతని పుత్రుడు విభ్రాజుడు. విభ్రాజుని పుత్రుడు అణుహుడను రాజు. ఈతడు శుకజామాత, ఋచీభర్త, మహాయశస్వి, అణుహుని పుత్రుడు మహాతపస్వి యైన బ్రహ్మదత్తుడు. అతని పుత్రుడు యోగసూనుడు. అతని పుత్రుడు రాజైన విష్వక్సేనుడు. విభ్రాజుని పుత్రులు ఇచట సుకృత కర్మతో రాజులు. విష్వక్సేనుని పుత్రుడు ఉదక్సేనుడు. అతనికి పుత్రుడు భల్లాటుడు. అతనిచే పూర్వము రాజు హతుడయ్యెను. భల్లాటుని పుత్రుడు రాజైన జనమేజయుడు. అతని కొరకు ఉగ్రాయు ధునిచే నీవులందరును నశింపజేయబడిరి.
ఋషులు ఇట్లు అనిరి:
ఉగ్రాయుధుడు ఎవని పుత్రుడు? ఏ వంశమునకు చెందినవాడు? ఎందులకు ఆతనిచే నీవులందరు నశింపజేయబడిరి?
సూతుడు ఇట్లు అనెను:
ద్విమీఢునకు విద్వాంసుడైన యవీనరుడు జనించెను. ఆతని పుత్రుడు ధృతిమంతుడు. ఆతని పుత్రుడు సత్యధృతి. ఇక సత్యధృతి పుత్రుడు ప్రతాప వంతుడైన దృఢనేమి. దృఢనేమి పుత్రుడు రాజైన సువర్మఅనువాడు. సువర్మపుత్రుడు ప్రతాపవంతుడైన సార్వభౌముడు. సార్వభౌముడని ప్రసిద్ధి చెందినవాడు అతడు పృథివిలో ఒకే రాజుగా ప్రకాశించెను. అతని మహావంశమున మహాత్పౌరవుడు నందనుడు. ఆ మహత్ పౌరవుని పుత్రుడు రాజైన రుక్మరథుడు అనువాడు. తరువాత రుక్మరథునకు సుపార్మ్ముడు అను రాజు. సుపార్శ్వుని పుత్రుడు సుమతి అను ధార్మికుడు. సుమతికి పుత్రుడు రాజై ధర్మాత్ముడైన సన్నతిమంతుడను ప్రభువు. అతని పుత్రుడు సనతి అనువాడు ఆతని పుత్రుడు కృతుడు. అతడు హిరణ్యనాభియొక్క శిష్యుడు. అతడు మహాత్ముడైన కౌథుముడు. ఆ కౌథుమునిచేత ఇరువది నాలుగు విధములుగా సామసంహితలు చెప్పబడినవి. అవి ప్రాచ్యములను పేరుగలవై కార్తములు (కృతుని నుండి వచ్చినవి) అని పిలువబడినవి. సామములలో సామమును పొందిన కార్తి (కృతుని పుత్రుడు) ఉగ్రాయుధుడు. అతడు వీరుడైన పౌరవనందనుడు. అతడు పరాక్రమించి, పృషతుని తాతయు మహాబాహువునైన నీలుడును పాంచాలాధిపతిని వధించెను. ఉగ్రాయుధుని పుత్రుడు మహాయశస్వి, క్షేముడు అనువాడు. క్షేమునకు సువీరుడు, సువీరునకు నృపంజయుడు, నృపంజయునకు వీరరథుడును జనించిరి. వీరిని పౌరవులు అందురు.
అజమీఢునకు నీలిని యందు నీలుడను రాజు కలిగెను. నీలునకు ఉగ్ర తపస్సుతో సుశాంతి అనువాడు కలిగెను. సుశాంతికి పురుజానువు, పురుజానునకు రిక్షుడు, అతని పుత్రుడు బేదులు, వారి పుత్రులు - ముద్గలుడు, సృంజయుడు, రాజైన బృహద్విషువు, చిన్నవాడు విక్రాంతుడు, ఐదవవాడు కంపిల్యుడు అనువారు. ఈ ఐదుగురి రక్షణకొఱకు తండ్రివారితో “మీ ఐదుగురికి ఈ అయిదు విశాల దేశములు కూర్చబడినవి” అని చెప్పెను. ఇవివారి సంరక్షణకు సమర్థములు. ఇవి పాంచాలములని ప్రసిద్ధములు. ముద్గలునకు కూడ మౌద్గల్యులను క్షాత్రముతో గూడిన ద్విజాతులు కలిగిరి. వీరు అంగిరసుని పక్షమును ఆశ్రయించిన కంఠముద్గలులు. ముద్గలుని జ్యేష్ఠపుత్రుడు మహాయశస్వియైన బ్రహ్మిష్ఠుడు. ఈతనివల్ల ఇంద్రసేన గర్భము ధరించి బధ్వశ్వుని కనెను. బధ్వశ్వునివల్ల మేనక మిథునమును కనెనని వినికిడి. ఆ మిథునము రాజర్షియైన దివోదాసు, యశస్వినియైన అహల్యయు. అహల్య శారద్వంతునివల్ల పుత్రుని శతానందునికనెను. ఆతని పుత్రుడు మహాయశస్వి, ధనుర్వేదపారగుడు అయిన సత్యధృతి. తన ఎదుట అప్సరసను చూచి సత్య ధృతికి శుక్రము స్ఖలించి రెల్లుగడ్డిపైన పడగా అది జంటగా మారెను. వేటకు వెళ్లిన శంతనుడు కృపతో ఆ జంటను స్వీకరించెను. ఆ కారణమున ఆ జంటలోని పురుషుడు కృపుడనియు, స్త్రీయైన గౌతమి కృపి అనియుఅనబడిరి. వీరికి శారద్వతులు అనికూడా పేరు వచ్చినది. ఋతథ్యుడు గౌతమ వంశీకుడు. ఆ పైన దివోదాసుని సంతతిని చెప్పెదను వినుడు.
దివోదాసుని పుత్రుడు బ్రహ్మిష్ఠుడైన మిత్రయుడు అను వసురాజు. ఆతని పుత్రుడు మైత్రేయుడు. వీరు గూడ సంశ్రితులు అనబడిరి. వీరు కూడ పక్షమును ఆశ్రయించిన క్షాత్రోపేతులైన భార్గవులు. అందులో చ్యవనుడు విద్వాంసుడైన రాజుకూడ. అతనివల్ల ప్రతిరథుడు కలిగెను. ఆతరువాత చ్యవనునివల్ల ధీమంతుడైన సుదాసుడు జనించెను. సుదాస పుత్రుడు సహదేవుడు. ఆతని పుత్రుడు సోమకుడు. వంశము క్షీణింపగా సోమకునితో పాటు అజమీఢుడు మరల జన్మించెను. సోమకుని పుత్రుడు జింతువు. అతడు హతుడుకాగా మహాత్ముడైన అజమీఢునకు సోమకదశలో నూర్గురు పుత్రులు కలిగిరి. వారిలో చిన్నవాడు పృషతుడు. ఈతడు ద్రుపదుని తండ్రి తండ్రి. పృషతునకు పుత్రుడు దృష్టద్యుమ్నుడు. అతని పుత్రుడు ధృష్టకేతవు. అజమీఢుని మహిషి ధూమిని పుత్రుని కోరెను. మరుసటి జన్మలో నూరేండ్లు చరింపనలవిగాని కఠిన తపము చేసెను. అగ్ని హోమము చేసి, పవిత్రమిత భోజనయై నిద్రలేనిది అయ్యెను. రాత్రింబవళ్లు సుమహా వ్రతయై ఆమె కుశల (దర్భల) యందే పరుండెను. ఆమె ధూమ్రవర్ణ కాగా ఆమెయందు వీర్యవంతుడైన అజమీఢుడు ధూమ్రవర్ణుడును సీతాగ్రజుడును అయిన ఋక్షుని (భల్లాకుని) కనెను. ఆ ఋక్షుని నుండి సంవరణుడు జనించెను. అతని నుండి కురువు జనించెను. ఈ కురువే ప్రయాగను పాదముతో ఆక్రమించి మహాతేజస్వియై చాలయేండ్లు ఈ క్షేత్రమును దున్ని కురుక్షేత్రముగా చేసెను. ఆ విధముగా దున్నగా అచట ఇంద్రుడు వర్షించి వరదుడై ప్రకాశించెను. ఆ క్షేత్రము పుణ్యమైనది. రమణీయమైనది. పుణ్యముజేసిన వారిచే సేవింపబడిన. ఆ వంశమున పుట్టిన రాజసత్తములు కురువులని ప్రసిద్ధిచెందిరి. కురువునకు ప్రియులైన పుత్రులు - సుధన్వుడు, జహ్నువు, పరీక్షిన్మహారాజు, అరిమర్దనుడైన పుత్రకుడు అనువారలు. సుధన్వుని పుత్రుడు మతిమంతుడైన సుహోత్రుడు. సుహోత్రుని పుత్రుడు చ్యవనుడు. అతని పుత్రుడు రాజై ధర్మార్థ కోవిదుడైన కృతుడు. ఈ మహాతపస్వి అనేక యజ్ఞములచేసి ఇంద్రసఖుడైన విశ్రుతుని, విద్యోపరిచరుని, వీరుడై అంతరిక్షమున పోగల వసువును కనెను. విద్యోపరిచరుని వల్ల గిరికయు ఏడుగురు పుత్రులును కలిగిరి. వారు - మహారథుడు, బృహద్రథుడు అని ప్రసిద్ధిగాంచిన భగధరుడు, ప్రత్యగ్రహుడు, మణి వాహనుడని చెప్పబడు కుశుడు, మాథైల్యుడు, లలిత్థుడు, ఏడవవాడు మత్స్యకాలుడు అనువారు. బృహద్రథుని పుత్రుడు కుశాగ్రుడని ప్రసిద్ధిగాంచినవాడు. కుశాగ్రుని పుత్రుడు వీర్యవంతుడైన ఋషభుడు. ఋషభుని పుత్రుడు ధార్మికుడైన పుష్పవంతుడు. అతని పుత్రుడు విక్రాంతుడు. ఆతడు రాజు సత్యహితుడును. అతని పుత్రుడు సుధన్వుడు. అతని పుత్రుడు ప్రతాపవంతుడైన ఊర్జుడు. ఊర్జుని పుత్రుడు నభసుడు. అతనికి ఆ వీర్యవంతుడు జనించెను. అతడు మొదలు రెండు ముక్కలుగా పుట్టెను. జరచేత అతడు అతికింపబడెను. జరతో సంధింపబడిన ఆ మహాబాహువు జరాసంధుడు అయ్యెను. మహాబలుడైన జరాసంధుడు సర్వక్షత్రమును జయించెను. జరాసంధుని పుత్రుడు ప్రతాపవంతుడైన సహదేవుడు. సహదేవుని పుత్రుడు శ్రీమంతుడును, సుమహాతపస్వియు అయిన సోమాధి. సోమాధికి శ్రుత శ్రవుడు. ఈతడు మాగధుడని పిలువబడెను.
సూతుడు ఇట్లు అనెను:
పరీక్షితుని పుత్రుడు జనమేజయుడు. శ్రుతసేనుని పుత్రునికి భీమసేనుడు అని పేరు. జహ్నువు సురధుడను రాజును పుత్రునిగా బడసెను. సురథుని పుత్రుడు వీరుడును రాజు అయిన విదూరథుడు. విదూరథుని పుత్రుడు సార్వభౌముడు. సార్వభౌముని పుత్రుడు జయత్సేనుడు, అతని పుత్రుడు ఆరాధి. అరాధికి మహాసత్త్వుడు, అతనికి అయుతాయువు పుత్రులు. అయుతాయువునకు అక్రోధనుడు, ఆతనికి దేవాతిధి పుత్రులు. దేవాతిథి పుత్రుడు ఋక్షుడు. ఈతనికి పుత్రుడు భీమసేనుడు. అతనికి దిలీపుడు పుత్రుడు. దిలీపుని పుత్రుడు ప్రతిపుడు. ఆతనికి నలుగురు పుత్రులు. వారు - దేవాపి, శంతనుడు, బాహ్లీకుడును - అను మువ్వురు. బాహ్లికుని పుత్రుడు సప్తబాహ్లీశ్వరుడు అను రాజు. బాహ్లీకుని పుత్రుడు మహాయశస్వి అయిన సోమదత్తుడు. సోమదత్తుని వల్ల భూరి, భూరిశ్రవుడు, శల్యుడును పుత్రులు. దేవాపి ధర్మమును పొందగోరి పరివ్రాజి (సర్వమును పరిత్యజించినవాడు) అయ్యెను. దేవాపి మునియై దేవతలకు ఉపాధ్యాయుడు అయ్యెను. ఈ మహాత్ముని పుత్రులు చ్యవనుడు, ఇష్టకుడును. శంతనుడు రాజు, విద్వాంసుడు, మహాభిషుడును. ఆ మహాభిషుని గూర్చి ఈ రాజైన మహాభిషుడు సమయ ప్రకారము ఏయే జీర్ణించిన రాజును స్పృశించునో! ఆ రాజు మరల యువకుడగును. అందువలననే వారు ఈతనిని శంతనుడని తెలియుదురు అని ప్రజలచే చెప్పబడెను. ఆ తరువాత ప్రజలలో శంతనుత్వము ప్రసిద్ధి చెందినది. ఆ ధర్మాత్ముడైన శంతనుడను రాజు జాహ్నవిని (గంగను) పెండ్లాడెను. ఆమె యందు ఆ ప్రభువైన శంతనుడు భీష్ముని పుత్రునిగా కనెను. అతడు భీష్ముడు పాండవుల పితామహుడు అనియు ప్రసిద్ధిగాంచెను. కొంతకాలమునకు శంతనుడు విచిత్రవీర్యుని పుత్రునిగా పడసెను. అతడు శంతనునకు ప్రియపుత్రుడు, ప్రజాహితము చేయువాడును అయిన ప్రభువు. కృష్ణద్వైపాయనుడు విచిత్ర వీర్యుని క్షేత్రమున ధృతరాష్ట్రుని, పాండురాజును, విదురునిని కనెను. ధృతరాష్ట్రునివల్ల గాంధారి నూరుగురు పుత్రులను కనెను. వారిలో దుర్యోధనుడు జ్యేష్ఠుడు. సర్వ క్షత్రమునకును ప్రభువు. రాణి మాద్రి, పృథయును పాండువు (పాండురాజు) యొక్క భార్యలు. పాండువు కొఱకు దేవతలచే ఈయబడిన పుత్రులను ఇరువురు పాండుభార్యలు కనిరి. యమధర్మరాజు వలన యుధిష్ఠిరుడు జన్మించెను. వాయువు వలన భీముడు జనించెను. ఇంద్రునివల్ల అర్జునుడు జనించెను. ఈతడు ఇంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడు. అశ్వినీదేవతల వల్ల మాద్రిజులుగా సహదేవ నకులులు జనించిరి. పాండవుల వల్ల ద్రౌపదికి ఐదుగురు పుత్రులు జనించిరి. ద్రౌపది యుధిష్ఠిరుని వల్ల జ్యేష్ఠుడైన శ్రుతివిద్ధుని (ప్రతివింధ్యుని) కనెను. హిడింబ భీమసేనుని వల్ల ఘటోత్కచుడను పుత్రుని కనెను. కాశి అను ఆమె భీమసేనుని వల్ల సర్వవృకుడు అను పుత్రుని కనెను. మద్రదేశకన్యయైన విజయ, సహదేవుని వల్ల సుహోత్రుడు అను పుత్రుని కనెను. చైద్యయైన కరేమతి (కరేణుమతి) యందు - భీమసేన పుత్రుడుగా నిర మిత్రుడు జనించెను. అర్జునుని వల్ల సుభద్రయందు రథియైన అభిమన్యుడు జనించెను. విరాటరాజకన్యయైన ఉత్తరయందు అభిమన్యునకు పరీక్షిత్తు జనించెను. పరీక్షిత్తు పుత్రుడు రాజైన జనమే జయుడు. అతడు శత్రువులు లేకుండా బ్రాహ్మణులను వాజసనేయికులనుగా స్థాపించెను. అపుడు కోపించిన వైశంపాయనుడే - ఓ దుర్బుద్ధీ! ఈ భూలోకమున నీ ఈ వచనము నిలువదు. నేను ఈలోకమున ఉన్నంతవఱకు ఇది గౌరవింపబడదు. తఱువాత, అంతటను ఉన్నప్పటికిని జనమేజయుడు, పౌర్ణమాస్య హవిస్సుతో దేవుని హోమము చేసి, బ్రహ్మను తెలిసికొన్నవాడై విభువుయొక్క యజ్ఞమున ఆతనికి బ్రహ్మకు ఇష్టునిగా (యజ్ఞము చేయబడిన వానిగా) చూచెను. పరీక్షిత్తు తనయుడై పౌరవుడైన జనమేజయుడు రెండు మారులు అశ్వమేధయాగమును చేసి, ఆ తరువాత వాజసనేయకము అయిన బ్రహ్మను ప్రవర్తింపచేసియు త్రిఖర్వి అయ్యెను. అశ్వకముఖ్యుల ఖర్వము ఒకటి, అంగని వాసుల ఖర్వము రెండు, మధ్య దేశముల ఖర్వము మూడు. ఈ విధముగ జనమేజయుడు త్రిఖర్వి అయ్యెను. తరువాత దుఃఖము వలన శపింపబడినవాడై బ్రాహ్మణులతో పాటు నాశమును పొందెను. ఆతని పుత్రుడు శతానీకుడు బలవంతుడు. సత్య పరాక్రమము కలవాడు. తరువాత బ్రాహ్మణులు జనమేజయ సుతుని శతానీకుని రాజ్యమందు అభిషేకించిరి. శతానీక పుత్రుడు ‘అశ్వమేథదత్తు’డయ్యెను. అతడు వీర్యవంతుడు అశ్వమేధ దత్తుని వల్ల పరపురంజయుడు జనించెను. ఇప్పటివాడు, మహాయశస్వి, ధర్మాత్ముడునైన వాడు, అధిసామకృష్ణుడు, అతడు భూమిని పరిపాలించుచుండగా మీచేత మూడేండ్లు నిర్వర్తింప అలవికానిదియు, పొందనలవికానిదియు అయిన ఈ దీర్ఘ సత్రము (యాగము) నిర్వహింపబడినది. బ్రాహ్మణోత్తములారా! రెండేండ్లు కురుక్షేత్రమున దృషద్వతియందు ఇది నిర్వహింపబడినది.
ఋషులు ఇట్లు అనిరి:
ఓ మహాబుద్ధిశాలీ! ప్రజలయొక్క భవిష్యమును వినగోరు చున్నాము. ఓ సూతుడా! రాజులచే కడచిన దానిని నీవు చెప్పితివి. ఇక రాజులతో పాటు భవిష్యము ఎట్లుండునో తెలుపకోరెదము. ఏది నిలువబోవుచున్నదో! ఏ రాజులు జనింపబోవుచున్నారో! ఒక యేడు ముందరనైనను పేర్లతో సహా ఆ రాజులను చెప్పుము. కాలము, యుగప్రమాణము, కలుగబోవు గుణదోషములు, ధర్మార్థకామముల వల్ల ప్రజలకు కలుగు సుఖదుఃఖములును, ఇది అంతయు చక్కగా లెక్కించి అడుగుచున్న మాకు సంపూర్ణముగ చెప్పుము. అనగానే బుద్ధిమంతులలోశ్రేష్ఠుడైన సూతుడు జరిగినది జరిగి నట్లు, చూచినది చూచినట్లు, విన్నది విన్నట్లు చెప్పెను.
సూతుడు ఇట్లు అనెను:
అద్భుతకర్ముడైన వ్యాసునిచే నాకు చెప్పిన విధముగ, భవిష్యమైన కలియుగమును, అట్లే మన్వంతరములను, తక్కిన జరుగబోవు వృత్తాంతములను అన్నింటిని చెప్పెద వినుడు. ఇకముందు ఏ రాజులు రానున్నారో! ఆ ఐలులును, అట్లే ఇక్ష్వాకులును, సౌద్యుమ్నులును (సుద్యుమ్న సంబద్ధులైనవారు) అయిన రాజులును - వీరియందే ఈ ఐక్ష్వాకమైన ఈ శుభ క్షేత్రము సంస్థాపింపబడును. భవిష్యమున పఠింపబడబోవు మీ అందరికి చెప్పెదను. వారి తరువాత పుట్టబోవు రాజులను గురించి కూడ చెప్పెదను. క్షాత్రులు, శకులు, పాఠశవులు (పరస్త్రీలయందు పుట్టినవారు - శూద్ర స్త్రీయందు బ్రాహ్మణునకు పుట్టినవారు), శూద్రులు, తక్కిన ద్విజాతులును, అంధులు, శకులు, పుళిందులు, యవనులతో పాటు తూలికలు, కైవర్తులు, ఆభీరులు, శబరులు, తక్కిన మ్లేచ్ఛ జాతులును - ఒక ఏడు ముందరగా ఈ రాజులను అందరిని పేరులతో చెప్పెదను. ఆ అధిసామకృష్ణుడు అను ఇతడు ఇపుడున్న పౌరవుని నుండి వచ్చిన రాజు. అతని వంశములో రాబోవు రాజులు అందరిని గురించి చెప్పెదను. అధిసామకృష్ణ పుత్రుడు నిర్వక్త్రుడు అనువాడు రానున్నాడు. నాగపట్టణము అనునది గంగతో గొట్టుకొనిపోవగా దానిని వదిలి కౌశాంబియందు సుఖవాసముగా ఉండగలడు. అతనికి కలుగబోవు పుత్రుడు ఉష్ణుడు. ఉష్ణునకు చిత్రరథుడు, చిత్రరథునకు శుచిద్రధుడు, శుచిద్రథునకు వృతిమంతుడు. అతనికి మహాయశస్వియు, మహావీర్యుడునైన సుషేణుడు, అతనికి సుతీర్ధుడను రాజును, సుతీర్ధునునకు రుచుడు, అతనికి త్రిచక్షుడు, త్రిచక్షునకు సుఖీబలుడును, సుఖీబలునకు రాజైన పరిప్లుతుడు, పరిప్లుతునకు సునయుడను రాజును, సునయునకు రాజైన మేధావియు, మేధావికి దండపాణియు, దండపాణికి నిరామిత్రుడు, నిరామిత్రునకు క్షేమకుడును పుత్రులుగా కలరు. ఈ ఇరుదియైదుగురు రాజులు రాబోవు పూర్వ (పూరు) వంశరాజులు. బ్రహ్మ క్షత్రియులకు కారణమైన వంశము దేవర్షి సత్కృతము. అది క్షేమకుని పొంది కలియుగమున చక్కని స్థితిని పొందగలదు. ఇట పురావిదులైన బ్రాహ్మణులు అనువంశికమైన ఈ శ్లోకమును గానము చేయుదురు అని ఈ పౌరవవంశము ఉన్నది ఉన్నట్లు చెప్పబడినది. ఇది ధీమంతుడై మహాత్ముడైన పాండు పుత్రుడైన అర్జునుని యొక్క వంశము. దీని తరువాత మహాత్ములైన ఇక్ష్వాకుల యొక్క వంశమును చెప్పెదను.
బృహద్రథుని పుత్రుడు వీరుడును రాజు అయిన బృహత్ క్షయుడు. అతనికి క్షయుడు, క్షయునకు వత్సవ్యూహుడు, అతనికి ప్రతివ్యూహుడు, అతనికి దివాకరుడును పుత్రులు. దివాకరుడు ఇపుడు రాజై అయోధ్యానగరిలో ఉన్నాడు. దివాకరునకు మహాయశస్వి సహదేవుడు పుత్రుడుగా కలడు. సహదేవునకు బృహదశ్వుడు జనింపగలడు. అతనికి భానురథుడు కలుగగలడు. అతనికి ప్రతీతాశ్వునకు సుప్రతీతుడు, అతనికి సహదేవుడు, అతనికి సునక్షత్రుడును సుతులుగా కలరు. సునక్షత్రునకు పరంతపుడైన కిన్నరుడు, అతనికి గొప్పవాడైన అంతరిక్షుడును కలుగగలరు. అంతరిక్షుని వల్ల సుపర్ణుడు, సుపర్ణుని వల్ల అమిత్రజిత్తు, అతని వల్ల భరద్వాజుడు, అతని వల్ల ధర్మియు, సుతులుగా కలుగుదురు. ధర్మికి కృతంజయుడు కలుగును. అతనివల్ల వ్రాతుడు, అతనివల్ల రణంజయుడును కలుగుదురు. రణంజయునకు వీరుడైన సంజయుడు కలుగును. సంజయునకు శాక్యుడు, శాక్యునకు శుద్ధోధనుడును కలుగును. శాక్యుని కొరకై శుద్ధోదనునకు రాహులుడు, ఆతనికి ప్రసేనజిత్తు, అతనికి క్షుద్రకుడును కలుగును. క్షుద్రకునకు క్షులికుడు, క్షులికునకు సురథుడు, సురధునకు సుమిత్రుడు చివరిరాజుగా జనింపగలడు. వీరు కలియుగమున రాబోవు ఐక్ష్వాకులు అనగా ఇక్ష్వాకు వంశమున పుట్టినవారు. బృహద్బలు వంశమున కలియుగమున జనింపబోవు వారు శూరులు, చక్కగా విద్యల నేర్చినవారు, సత్యసంధులు, ఇంద్రియముల జయించినవారును అగుదురు. ఐక్ష్వాకుల ఈ వంశము కలియుగమున సుమిత్రునితో అంతముకాగలదు. రాజైన సుమిత్రుని పొంది తరువాత సంస్థను పొందగలదు - నిది మానవమైన క్షేత్రము బలమని కూడ ఉదాహరింపబడినది.
ఈ తరువాత మగధదేశీయులైన బృహద్రథులను గురించి చెప్పెదను. వారు జరాసంధుని వంశమున సహదేవవంశము నందలి రాజులు. గడచినవారు, వర్తమానులు, భవిష్యత్కాలమున కలుగువారును. ప్రాధాన్యమును బట్టి వారిని గురించి చెప్పెద వినుడు. భారత సంగ్రామమున సహదేవుడు పడిపోయెను. అతని పుత్రుడు సోమాథి అను రాజర్షి. గిరివ్రజమున ఏబది ఎనిమిదిఏండ్లు రాజ్యము చేసెను. అతని పుత్రుడు శ్రుతశ్రవుడు అఱువది నాలుగేండ్లు రాజ్యము చేసెను. అయుతాయువు ఇరువది యాఱేండ్లు రాజ్యము చేసెను. నిరామిత్రుడు నూరేండ్లు రాజ్యము చేసి స్వర్గమునకు వెళ్లెను. సుకృతుడు ఏబదియేండ్లు రాజ్యము చేసెను. బృహత్కర్ముడు ఇరువది మూడేండ్లు రాజ్యమును చేసెను. సేనాజిత్తు ఇప్పటికిని ఈ భూమిని పాలించును. శ్రుతంజయుడు నలుబదియేండ్లు పాలింపగలడు. మహాబుద్దియు మహాభీమపరాక్రముడును అయిన మహాబాహువు ముప్పది అయిదుఏండ్ల రాజై భూమిని పాలించును. ‘శుచి’ ఏబది ఎనిమిది ఏండ్లు రాజ్యమున ఉండగలడు. క్షేముడు ఇరువది ఎనిమిదేండ్లు రాజు కాగలడు. వీర్యవంతుడైన భువతుడు అఱువది నాలుగు ఏండ్లు రాజ్యము చేయగలడు. ధర్మ నేత్రుడు నిండు ఐదేండ్లు రాజుగా కలడు. నృపతి ఏబది ఎనిమిదేండ్లు రాజ్యము అనుభవింపగలడు. సువ్రతుడు ముప్పది ఎనిమిది యేండ్లు రాజుగా ఉండగలడు. తరువాత సుమతి ముప్పది మూడేండ్లు రాజ్యమును చేయగలడు. సుచలుడు పండ్రెండేండ్లు రాజ్యము అనుభవింపగలడు. సునేత్రుడు నలుబది ఏండ్లు రాజ్యమును అనుభవింపగలడు. సత్యచిత్తు పృథివీ రాజ్యమును ఎనుబది మూడేండ్లు అనుభవింపగలడు. వీరజిత్తు ఈ భూమిని పొంది ముప్పది అయిదు ఏండ్లు ఏలగలడు. అరింజయుడు ఈ భూమిని పొంది ఏబదియేడేండ్లు ఏలగలడు. ఈ బృహద్రథులు ముప్పది రెండేండ్లు రాజులు అగుదురు. వారి రాజ్యము నిండు వేయేండ్లు ఉండును. బృహద్రథులు గతించి వీతిహోత్రులురాగా మునికుడు స్వామిని వధించి పుత్రుని ఆ స్థానమున అభిషేకింప గలడు. ద్వేషించుచున్న రాజులకు బలవంతముగ ముని సుతుడు ప్రద్యోతుడు రాజుకా గలడు. అతనికి సామంతులు నమస్కరింతురు. ఆతడు నీతి తప్పినవాడు. ఆ నరోత్తముడు ఇరువది మూడేండ్లురాజు అగును. తరువాత నలుబది ఏండ్లు పాలకుడు రాజగును. విశాఖ యూపుడు ఏబది ఏండ్లు రాజగును. అజకుని రాజ్యము ముప్పది యొక్క ఏండ్లు నడచును. అజకపుత్రుడు వర్తివర్ధనుడు ఇరువది ఏండ్లు పాలింపగలడు. ఇరువది ఎనిమిది యేండ్లు ప్రాద్యోతులు (ప్రద్యోతపుత్రులు) ఉండగలరు. ప్రాద్యోతులు ఐదుగురు (ప్రద్యోతుని) పుత్రులు వారియొక్క కీర్తిని మొత్తము ధ్వంసముచేసి శిశునాగుడు రాగలడు. అతని పుత్రుడు వారాణసిలో గిరివ్రజమును బొందగలడు. శిశునాగుడు రాజ్యవర్షములు నలుబది యేండ్లు కాగలవు. అతని పుత్రుడు శకవర్ణుడు. ముప్పది ఆరేండ్లు పాలించును. తరువాత క్షేమవర్మ ఇరువది యేండ్లు రాజు కాగలడు. అజాతశత్రువు ఇరువది అయిదు ఏండ్లు రాజు కాగలడు. తరువాత క్షత్రౌజుడు నలుబది ఏండ్లు రాజ్యమును పొంది ఉండగలడు. వివిసారుడు ఇరువది ఎనిమిది ఏండ్లు రాజు కాగలడు. దర్శకుడు ఇరువది అయిదు ఏండ్లు ఏలును. అతని తరువాత ఉదాయి ముప్పది మూడేండ్లు రాజుకా గలడు. నాలుగవ ఏట అతడు కుసుమపురము అను శ్రేష్ఠ పురము రాజధానిగా, గంగయొక్క దక్షిణ తీరమున రాజ్యము ఏలును. నందివర్ధనుడు నలుబది రెండు ఏండ్లు రాజు కాగలడు. మహానంది నలుబది మూడేండ్లు రాజ్యము ఏలగలడు. ఈ పదుగురు శైశునాగులు రాజులుగా కలరు. వారికాలము మూడు వందల అఱువది రెండేండ్లు కాగలదు. అంతే కాలము ఇతర రాజులు పాలింతురు. వీరితో బాటు రాజులు క్షత్ర బాంధవులు కాగలరు.
ఐక్ష్వాకులు ఇరువది నాలుగేండ్లు, పాంచాలురు ఇరువది అయిదు ఏండ్లు, కాలకులు ఇరువది నాలుగేండ్లు, హైహయులు ఇరువది నాలుగేండ్లును పాలింతురు. కళింగులు ముప్పది రెండేండ్లు, శకులు ఇరువది అయిదు ఏండ్లు, కురువులు ఇరువది అఱేండ్లు, మైథిలులు ఇరువది ఎనిమిది ఏండ్లు, శూరసేనులు ఇరువది మూడేండ్లు, వీతిహోత్రులు ఇరువది ఏండ్లును రాజ్యములను పాలింతురు. అందరు రాజులు (సరాసరి) సమానమైన కాలమునకు రాజులు కాగలరు. సర్వక్షత్రముల మధ్యన గొప్పవాడును, శూద్ర స్త్రీయందు మహానందుడను పుత్రుడును, కాలముచే ఆవరింపబడినవాడై మహాపద్ముడు అను రాజు జన్మింపగలడు. అప్పటి నుండి రాజులు శూద్ర యోనియందు పుట్టువారు కాగలరు. ఆ మహాపద్ముడు ఒకే రాజై ఏకచ్ఛత్రుడై ఉండగలదు. కానున్నది బలీయమైనందున సర్వ క్షత్రమును హరించువారిని పెరికివైచి ఇరువది యెనిమిదేండ్లు భూమిని పరిపాలింపగలడు. అతని పుత్రులు వేయి ఎనిమిదేండ్లు పరిపాలించిరి. వారు పండ్రెండుగురు రాజులు. మహాపద్ముని మరణానంతరమున వరుసగా వారు రాజులు అగుదురు. వారందరిని కౌటిల్యుడు పదునారింటి చేత పెరికివైవగలడు. నూరేండ్లు భూమిని పాలించి అతడు నందేందువు కాగలడు. కౌటిల్యుడు చంద్రగుప్తుడను రాజును రాజ్యమున స్థాపింపగలడు. చంద్రగుప్తుడు ఇరువది నాలుగేండ్లు రాజుకాగలడు.
భద్రసారుడు ఇరువది యైదేండ్లు రాజు కాగలడు. అవో(శో)కుడు ఇరువది ఆరేండ్లు రాజు కాగలడు. అతని పుత్రుడు కునాలుడు. ఎనిమిదేండ్లు రాజ్యముచేయగలడు. కునాల పుత్రుడైన బంధుపాలితుడు ఎనిమిది ఏండ్లు రాజ్యమును అనుభవింపగలడు. బంధుపాలిత పుత్రుడు ఇంద్రపాలితుడు పదేండ్లు పరిపాలింపగలడు. దేవవర్ముడను రాజు ఏడేండ్లు రాజ్యము ఏలును. అతని పుత్రుడు శతధరుడు రాజై ఎనిమిది ఏండ్లు పాలించును. బృహదశ్వుడు ఏడేండ్లు రాజు కాగలడు. అను నీతొమ్మండుగురు రాజులు నిండు నూట ముప్పది ఏండ్లు భూపరిపాలనా సుఖమును అనుభవింతురు. వారివలన భూమి చక్కగా ఉండగలదు.
సేనానియైన పుష్పమిత్రుడు బృహద్రథుని పెరికివైచి అరువదేండ్లు రాజ్యము చేయగలడు. పుష్పమిత్రుని పుత్రులు ఎనిమిది ఏండ్లు రాజులు కాగలరు. వారిలో జ్యేష్ఠుడు ఏడేండ్లు రాజు కాగలడు. తరువాత కుమారుడైన వసుమిత్రుడు పదేండ్లు రాజు కాగలడు. తరువాత కుమారుడైన ధ్రుకుడు రెండేండ్లు రాజ్యమేలును. అతని నుండి మూడేండ్లు పులిందకులు ఉండగలరు. రాజు ఘోషసుతుడు కూడ మూడేండ్లు రాజుగా ఉండును. ఆ తరువాత విక్రమిత్రుడు అనురాజు కొన్నియేండ్లు, భాగవతుడను రాజు పండ్రెండు ఏడులును ఉండగలరు. అతని కుమారుడు క్షేమభూమి పదియేండ్లు రాజు కాగలడు. ఈ పదుగురు తుంగరాజులు ఈ భూమిని పరిపాలింతురు. వారినుండి నిండు నూట పండ్రెండు ఏడులు బాల్యమునుండియు వ్యసనియైన (చెడు అలవాట్లుగల) అపార్థి వసుదేవుని ఈ రాజ్యము చేరగలదు? తరువాత శృంగములలో (శృంగ దేశములలో) దేవభూమియు వాని తరువాత ఇతరుడును రాజు కాగలరు. కంఠాయనుడను రాజు తొమ్మిదేండ్లు రాజుకాగలడు. ఆతని పుత్రుడు భూతిమిత్రుడు ఇరువది నాలుగు ఏండ్లు రాజుగా కలడు. అతని తరువాత పండ్రెండేండ్లు నారాయణుడు రాజుగా కలడు. అతని పుత్రుడు సువర్మయు పదేండ్లు రాజుకాకలడు. ఆ నలుగురు తుంగ కృత్యులైన రాజులై కంఠాయనులైన ద్విజులు. వారు రాబోవువారు, నమస్కరించిన సామంతులు గలవారు, నలుబది అయిదు గురు, వారి అంత్యకాలమున తరంధుడు రాజుకాగలడు. ఆతరువాత, సింధుకుడను ఆంధ్రజాతీయుడు, కంఠాయనుడైన సుశర్మను బలాత్కారముగా పెరకివైచియు, శృంగులకు మిగిలిన సైన్యమును నశింపచేసియు, ఈ వసుంధరను (భూమిని) పొందగలడు. ఆ తరువాత ఇరువది మూడేండ్లు సింధుకుడు రాజుగా కలడు. తరువాత భాతుడు ఎనిమిది ఏండ్లు తరువాతివాడు పదేండ్లును రాజులుగా కలరు.
తరువాత శ్రీ సాతకర్ణి రాజు కాగలడు. ఆతనిపుత్రుడు మహానుడు, ఏబది ఏడేండ్లు సాతకర్ణి రాజుగా పాలించును. అతని పుత్రుడు ఆపాదబద్ధుడు పదేండ్లు రాజు కాగలడు.
ఆ తరువాతివాడు ముప్పది ఏండ్లు పరిపాలించును. నేమికృష్ణుడు ఇరువది ఏండ్లు రాజుగా ఉండగలడు. ఆ తరువాత, ఒక నిండు సంవత్సరము హాలుడు రాజుగా కలడు. తరువాత పండ్రెండుగురు మహాబలులు రాజులు గాగలరు. పుత్రికషేణుడను రాజు ఇరువది యొక్క ఏండ్లు రాజ్యము చేయగలడు. సాతకర్ణి ఒక యేడు రాజు కాగలడు. ఇరువది ఎనిమిదేండ్లు శివస్వామి రాజు కాగలడు. గౌతమీపుత్రుడు (సాతకర్ణి) ఇరువది యొక్క ఏండ్లు మానవులకు రాజుకాగలడు. తరువాత, యజ్ఞశ్రీ సాతకర్ణి ఇరువది యొక్క ఏండ్లు రాజగును. ఆ తరువాత, విజయు (సాతకర్ణి)డు ఆఱేండ్లు రాజుకాగలడు. ఆతని పుత్రుడు దండశ్రీ సాతకర్ణి మూడేండ్లు పాలించును, పులోవాపి సాతకర్ణి ఏడేండ్లు రాజ్యము చేయగలడు. ఇతరులకు (రాజులకు) కూడ ఏడేండ్లు కాగలవు - ఈ రాజులు ముప్పదిమంది అంధ్రరాజులు - వీరు భూమిని పాలింతురు. వీరి రాజ్యపాలనా కాలము నాలుగు, ఐదు ఆఱు వందల ఏండ్లు. ఆంధ్రుల యొక్క సంస్థితులు వారి వంశములు ఐదు సంవత్సరములు. ఏడుగాగలవు. తరువాత ఆ భీరులు పదేండ్లు, గర్దభులు ఏడేండ్లు, తరువాత శకులు పదేండ్లు, యవనులు ఎనిమిదేండ్లు, తుషారులు పదునాలుగు ఏండ్లు, మరుండులు పదమూడు ఏండ్లు, మౌనులు పదునెనిమిది ఏండ్లును రాజులై పాలింతురు. అంధ్రులు మున్నూరేండ్లు (మూడు వందల సంవత్సరాలు) భూమిని పరిపాలింతురు. శకులు మూడు వందల ఎనుబది ఏండ్లు భూమిని పరిపాలింతురు. యవనులు ఎనుబది ఏండ్లు భూమిని పరిపాలింతురు. తుషారులు ఐదువందల ఏండ్లు రాజులై భూమిని పరిపాలింతురు. వృషలులతో బాటు తక్కిన మ్లేచ్ఛజాతులు మూడువందల ఏండ్లు భూమిని పాలింతురు. మ్లేచ్ఛులు పదకొండేండ్లు పాలింతురు. వారితో ఆవరింపబడిన కాలముతో తరువాత కోలికిలులను వృషులు పరిపాలింతురు. తరువాత, కోలికిలుల నుండి వింధ్యశక్తి కలుగగలడు. తొంబదియారేండ్లు తెలిసికొని భూమికి రాగలడు.
వృషులను, వైదిశకులను, భవిష్యులను గురించి వినుడు. నాగరాజైన శేషునకు పుత్రుడు స్వరపురంజయుడు. నాగకులోద్వహుడైన భోగిరాజు కాగలడు. చంద్రాంశుడైన సదాచంద్రుడు మొదటివాడు, రెండవవాడు నఖవానుడు. తరువాత ధనధర్ముడు. తరువాత నాలుగవవాడు వింశజుడు. తరువాత భూతినందుడు వైదేశమున రాజుగా కలడు. అంగదేశములకు నందనుని తరువాత మధునంది రాజుకాగలడు. ఆతని చిన్న సోదరుడు నందియశుడు. అతని వంశమున ముగ్గురు రాజులు కలుగగలరు. దౌహిత్రుడైన శిశుకుడు అనువాడు పురికయందు రాజయ్యెను. వింధ్యశక్తి పుత్రుడు గూడ వీర్యవంతుడైన ప్రవీరుడు. ఈతడు అఱువది ఏండ్లు కాంచనక అను పురిని పరిపాలింపగలడు. సమాప్తమైన శ్రేష్ఠ దక్షిణలుకల వాజపేయ యాగములచే యజ్ఞము చేయగలడు. అతని పుత్రులు నలుగురు రాజులుగా కలరు. వింధ్యకుల కులము గడచిపోగా బాహ్లిక రాజులు ముగ్గురు పరిపాలింతురు. సుప్రతీకుడు నభీరుడు ముప్పది ఏండ్లు పరిపాలింపగలరు. శక్యముడు అనురాజు మాహిషులకు మహీపతి (రాజు). పుష్పమిత్రులు పట్టమిత్రులును పదముగ్గురు రాజులుగా గలరు. మేకలయందు సత్తములు ఏడుగురు రాజులుగాగలరు. కోమలయందు మహాబలులు రాజులు అగుదురు. మేఘులు అని చెప్పబడు బుద్ధిమంతులైన రాజులు తొమ్మండుగురు. నైషధులను రాజులందఱు మనుక్షయమువఱకు ఉండగలరు. నల వంశమున పుట్టిన ఆ రాజులు వీర్యవంతులును మహాబలులును, మాగధులలో మహావీర్యుడు విశ్వస్ఫాని అనువాడు గలడు. అతడు విశ్వస్ఫాని సమస్త రాజులను పెరకివైచి అన్యవర్ణులను (రాజులుగా) చేయగలడు. కైవర్తులు, కంచకులు, పులిందులు, బ్రాహ్మణులు, వీరిని నానా దేశములందు రాజులుగా చేయగలడు. విశ్వస్థాని మహాసత్త్వుడు, యుద్ధమున విష్ణుసముడైన బలవంతుడు. విశ్వస్ఫాని రాజు నపుంసక ఆకారము కలవానివలె ఉండును. అతడు క్షత్రమును పెరికివైచి వేరొక క్షత్రమును రాజుగా చేయగలడు. ఆ బలవంతుడు దేవతలను, పితరులను, బ్రాహ్మణులను ఒక్కమారు మరల సంతృప్తిపరచి, గంగాతీరముచేరి శరీరమును త్యాగముచేయ ప్రయత్నించును. చివరకు అతడు తన శరీరమును సన్యసింప చేసి ఇంద్ర లోకమునకు వెళ్లగలడు. నవనాకులు అను రాజులు చంపావతీపురిని పరిపాలింతురు. రమ్యమైన మధురాపురిని ఏడుగురు నాగులు పరిపాలింతురు. గంగను అనుసరించి ప్రయాగను, సాకేతమును, మగధములను - ఈ జనపదము (దేశము) లను అన్నింటిని గుప్తవంశ రాజులు పరిపాలింతురు. నిషధులను, యదుకులను, శైశీతులను, కాలతోపకులను - ఈ దేశములను అన్నింటిని మణిధాన్యజులు పాలింపగలరు. కోశలములను, ఆంధ్రములను, పౌండ్రములను, సాగరములతో కూడిన తామ్రలిప్తములను రమ్యము అయిన దేవరక్షితమైన చంపాపురిని పరిపాలింతురు. కళింగములు, మహిషములు, మహేంద్ర నిలయములు - ఈ దేశములను గుహుడు పరిపాలించగలడు. కనకుడనువాడు స్త్రీ రాష్ట్రమును, భక్ష్యకములను పరిపాలింప కలడు. ఈ అందఱు రాజులు సమానమైన కాలముననే రాజులుగా ఉండగలరు.
ఈ భూమిలో యవనులు అల్పమైన ప్రేమ కలవారును, అసత్యవాదులుగను, మిక్కిలి కోపము కలవారుగను, అధార్మికులుగను ఉందురు. ధర్మములోను, అర్థములోను, కామములోను కూడ పై విధముగనే ఉందురు. ఆ రాజులు పట్టము కట్టిన రాజులుగా ఉండరు. ఆరాజులు యుగదోషములు గలవారై దురాచారులుగా ఉందురు. స్త్రీల బలాత్కా వధల చేతను, పరస్పర వధలచేతను యవనరాజులు కలిశేషమున భూమిని పరిపాలింతురు. కాలముతో వారు ఉదయించి ఉదయమును పొందు వంశములు కలవారుగను, ఉదయించి అస్తమించు వంశముకలవారుగను వరుసగా రాజులుగా కలరు. అంతటను దురాచారములు కాగలవు. అపుడు ఆ రాజులు ప్రజలకు వ్యతిరేకముగ ఉందురు. ప్రజల నశింప జేయుదురు. లోభులై అసత్యప్రియులుగా ఉందురు. వారి క్రమము గడచిపోగా, బహుస్త్రీలు కలయుగమున, ఆయువులోను, రూపములోను, బలములోను, పాండిత్యములోను అణువణువున భ్రష్టులగుచున్న వారుగా ఉందురు. ఆవిధముగ వారు ప్రజలలో గౌరవమును పొందినవారై జగమునందు ప్రభువులు అగుదురు. అపుడు ఆ రాజులు కాలోపహతులై నశింతురు. కల్కిచే కొట్టబడినవారై ఆ మ్లేచ్ఛులు అందఱును అంతటను వెళ్లుదురు. అధార్మికులైన ఆ మ్లేచ్ఛులు అన్ని విధముల మిక్కిలి వేదబాహ్యులు. నరులను పాలించునని అర్థమును చెప్పు నృప శబ్దము నశింపగా, కలియుగము సంధిలో ఉండగా, ధర్మము నష్టము కాగా, భార్యలు లేనివారై ప్రజలు కొందరే మిగులుదురు. కార్య సాధనములు లేనివారు, ఊరడింపులు లేనివారు, రోగబాధలచే పీడింపబడినవారు, వర్షాభావము చేతను, ఒకరికొకరు చంపుకొనుటచేతను దెబ్బతిన్నవారును, ప్రభువులులేని వారును, భయము చెందినవారును, జీవన వృత్తిని వదలి దుఃఖించినవారును, పురములను గ్రామములను వదలి వనములలో నివసించినవారును జనులు కాగలరు. ఈ విధముగా రాజులు నశింపగా, ప్రజలు గృహములను వదిలిపోవుదురు. స్నేహము నశింపగా భ్రష్టమైన స్నేహముకలవారై, మిత్రజనులు దుఃఖములను పొందినవారు అగుదురు. వర్ణ - ఆశ్రమముల నుండి భ్రష్టులై భయంకరమైన సాంకర్యమును పొందినవారై అపుడు ప్రజలు నదీపర్వతముల సేవించువారుగా అగుదురు. మానవులు నదులను, జలప్రాయమైన సాగర తీరములను, పర్వతములను, అంగదేశములను, కళింగ, వంగ, కాశ్మీర, కోసల దేశములను, ఋషికాంత గిరి ద్రోణులను సేవింతురు. ఆర్యులు మ్లేఛ్ఛ జనులతో గూడి హిమవత్పర్వతము యొక్క పృష్ఠభూమిని, లవణ సముద్ర తీరమును, అరణ్యములను చేరుదురు. మానవులు - లేళ్లు, చేపలు, పక్షులు, పులులు, వడ్లపిట్టలు, తేనెలు, కూరలు, పండ్లు - వీనిచే జీవనము గడుపుదురు. నారచీరలు, వివిధములైన ఆకులు, వృక్ష చర్మములైన నారలు, మృగాదుల చర్మములు స్వయముగా వస్త్రములుగ చేసికొని మునిజనులవలె ఉందురు. కాని మునిజనులుకారు. వారు విత్తనములతో కాష్ఠశంకువులతో క్రింద బీజాన్నములను సిద్ధము చేయువారై, మేకలను, గొఱ్ఱెలను, గాడిదలను, ఒంటెలను, పాలింతురు. మానవులు నీటికొఱకై నదీతీరములను ఆశ్రయించి నివసింతురు. రాజులను వ్యవహారముతో పరస్పరము బాధింతురు. అపుడు ధర్మమునందు వ్యవస్థితులైన నరులు మిక్కిలి గర్వితులు, సంతానము లేనివారును, శౌచాచారములు లేనివారును కాగలరు. ప్రజలు హీనాతి హీనమైన ధర్మములను అనుసరింతురు. అపుడు ఎవ్వడు కూడ ముప్పది ఏండ్లకు మించి జీవింపడు. దుర్బలులు, విషయ సుఖములలో తగుల్కొన్నవారును, ముసలి తనము మీదబడినవారును, ఆకులు, కంద మూలములు, ఫలములు ఆహారముగా కలవారును, నారచీరలు, దుప్పి చర్మములు - వస్త్రములుగా కల వారును, జీవనాధారమునకై వెదుకు వారును అయి భూమియందు చరింతురు. ఇట్టికాలమును కలియుగము అంతమున ప్రజలు పొందుదురు. దేవమానముతో వేయి ఏండ్లు కల కలియుగము క్షీణింపగా ప్రజలు కలియుగముతో పాటు నిఃశేషులు (మిగులనివారు) అగుదురు. సంధ్యాంశముతో బాటు కలియుగము నిశ్శేషముగాగా, కృతయుగము రాగలదు. సూర్యుడును, చంద్రుడును తిష్య - బృహస్పతులను (పుష్యమీ నక్షత్రము - బృహస్పతియు) ఒకే రాత్రియందు భరింప గలిగిన నాడు కృతయుగము అగును. ఇది అతీతములయు, వర్తమానములయు, భవిష్య త్కాలమున జరుగబోవునవియునైన మొత్తము వంశముల యొక్క క్రమము. వరుసగా మీకు చెప్పబడినది.
మహాదేవుని అభిషేకము నుండి పరీక్షిత్తు జన్మవఱకుఉన్న కాలము వేయి మఱియు ఏబదియేండ్లు. అట్లే మహాపద్మాంతరమని ప్రమాణము కూడ చెప్పబడినది. అంతరము ఎనిమిది వందల ముప్పదియాఱేండ్లు. ఇదే కాలాంతరమున రాబోవు అంధ్రాంతులకు కూడ తెలియవలెను. ఇవి భవిష్య పురాణజ్ఞులైన పండిత ఋషులచే అచట లెక్కింపబడినవి. ప్రతీపుడు రాజుగా ఉండగా సప్తర్షులు నూరేండ్లని చెప్పిరి. ఆంధ్రుల యొక్క కాలము ఇరువది యేడు వందలని నీవు భావింపవలెను. ఇరువది యేడు వఱకు ఉన్న సమస్త నక్షత్ర మండలమున క్రమముగా సప్తర్షులు నూరు నూరేండ్లుందురు. ఇది దివ్య సంఖ్యతో చెప్పబడిన సప్తర్షుల యుగము. ఆయా ఆఱవది దివ్యము అనబడినది. ఏడింటిచే దివ్యాహ్నములు అనబడినవి. స్తుతింపబడిన సప్తర్షులచేత వారికొఱకు దివ్యమైన కాలము ప్రదరిల్లును. సప్తర్షులలో పూర్వులు ఉత్తరదిక్కులో కనబడుదురు. కావున వారితో సమముగా ఆకాశ మధ్యమున క్షేత్రము కనబడదు. అందుచేత సప్తర్షులు నూరేండ్లు ఆకాశము నంటి ఉండిరని తెలుసుకొనవలెను.
ఇది నక్షత్రముల యొక్కయు ఋషుల యొక్కయు యోగమునకు నిదర్శనము. పరీక్షిత్తు కాలమున ఇరువది నాల్గవదైన ఆంధ్రాంశలో ఆ మతమున సప్తర్షులు నూరుమారులు మఘానక్షత్రయుక్తులుగా కలరు. అపుడు ప్రకృతివల్ల ఈ ప్రజలు మిక్కిలి ఆపదను పొందగలరు. అందరు ప్రజలు ధర్మార్థకామములలో అసత్య పీడితులు అగుదురు. అపుడు వర్ణాశ్రమ ధర్మమున శ్రౌత - స్మార్తములు శిథిలములుకాగా, దుర్బలాత్ములై మోహితులు అయి చివరకు శంకరుని చేరుదురు. శూద్రులు ద్విజులతో సహ కూడినవారు కాగలరు. బ్రాహ్మణులు శూద్రులతో యజ్ఞముల చేయింతురు. శూద్రులు మంత్ర యోనులు (మంత్రముల సిద్ధము చేయుటకు కారణభూతులు అగుదురు). అపుడు బ్రాహ్మణులు జీవన లాభమునకై శూద్రులను సేవింతురు. క్రమముగా ప్రజలు అణువణువున నశించుచుందురు. కృష్ణుడు స్వర్గమునకు వెళ్లిన దినమున యుగక్షయము. ఆ యుగ క్షయమున క్షీణింపగా మిగిలినవారు కూడ క్షీణింతురు. వచ్చినది కలియుగము, దాని సంఖ్యను వినుడు. మానుష సంఖ్యచే మూడు లక్షల అఱువది వేలయేండ్లు కలియుగము. దివ్య సంఖ్యలో అది వేయి ఏండ్లు. అది సంధ్యాంశమని చెప్పబడినది. అది నిఃశ్శేషమైనపుడు కృతయుగము వచ్చును. మీకు ఐలవంశము, ఇక్ష్వాకు వంశము భేదములతో సహ చెప్పబడినవి. వివస్వంతునకు సుమిత్రాంతముగా ఇక్ష్వాకువు వలన క్షేత్రమని చెప్పబడినది. సోమవంశవేత్తలు ఐలమైన నక్షత్రము సోమకాంతము అందురు. వీరు కీర్తివర్ధనులైన వివస్వంతుని పుత్రులుగా చెప్పబడిరి. గడచినవారు, ప్రస్తుతమున్న వారు, రాబోవు వారును అయిన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులును ఈ ఐలవంశము నందలివారే. ప్రతి యుగమున వేలకొలది మహాత్ములు గతించిరి. వారి నామధేయములు బహుళము లైనందున ప్రతి కులమున పరిసంఖ్యానము జరుగును (సంగ్రహింపబడును). అనేకమగుట వల్ల సంఖ్య పునరుక్తమగును. కావున నాచే చెప్పబడలేదు. ఈ వైవస్వత మన్వంతరమున నిమి వంశము సమాప్తి చేయబడును. క్షత్రము ప్రవర్తిల్లు ఏవాయ అను యుగము పేరునందు నిమి వంశము సమాప్తిచెందును. అది ఎట్లో చెప్పెదను వినుడు. ఇక్ష్వాకువంశమువాడుగా సమ్మతుడైన దేవాపియను పౌరవరాజు మహా యోగబలముతో కూడినవాడై కలాప గ్రామమునకు చేరెను. సువర్చుడను సోమపుత్రుడు ఇక్ష్వాకువంశము వాడేకాగలడు. ఇరువది నాల్గవ చతుర్యుగమున వీరు ఇరువురు క్షత్ర నాయకులు. ఇరువది యవ యుగమున సోమ వంశమునకు ప్రారంభముకాదు. దేవాపి శత్రువులు లేనివాడై ఐలవంశమునకు మొదటిరాజు కాగలడు. చతుర్యుగము (నాలుగు యుగముల సముదాయము)న వీరు ఇరువురు క్షత్రజాతి ప్రవర్తకులు అగుదురు. ఈ విధముగ సంతానము కొఱకు లక్షణమును అంతటను తెలిసికొనదగినది. ఆ కలియుగము క్షీణింపగా కృతయుగము రాబోగా మరల మొదటి త్రేతాయుగమున స్తుతింపబడిన సప్తర్షులతో బాటు క్షత్రియ గోత్రముల ప్రవర్తకులుగా కలరు. ద్వాపరాంశమున క్షత్రియులు ఋషులతో కూడి ఉండరు. కృతయుగ కాలము క్షీణింపగా, త్రేతాయుగమున వారు బ్రహ్మ క్షత్రియుల బీజార్థమై మరల జనింపగలరు. ఈ విధముగనే అన్ని అంతరములలోను ప్రతియుగమున సంతానార్థమై సప్తర్షులు రాజులతో కూడియుందురు. బ్రాహ్మణులచే క్షత్రజాతి సముచ్ఛేదమే సంబంధము అనబడినది. ఏడు మన్వంతరముల యొక్క ఆ సంతానములుకూడ వినబడినవి. యుగములయొక్క పరంపరయు, బ్రహ్మ క్షత్రముల పుట్టుకయు, వారి ప్రవృత్తి ఎట్లు జరిగినదో అట్లే ప్రవర్తించినవారి నాశముకూడ జరిగినది. ఆ సప్తర్షులే వారి దీర్ఘాయువు కలిగియుండుటను, నాశము లేమియును తెలియుదురు. ఈ క్రమ యోగముతో ఐల - ఇక్ష్వాకు వంశములవారు ద్విజులు. త్రేతాయుగమున జన్మించుచున్నవారై కలియుగము క్షీణించుచుండగా మరల వారు మన్వంతరము చివరి వఱకును యుగాఖ్యను పొందుదురు. జమదగ్ని పుత్రుడైన పరశురామునిచేత క్షత్రజాతి నిశ్శేషము చేయబడగా, కృత యుగమున సమస్త వంశములు కులములును రాజులైన క్షత్రియులచేత ద్వి వంశ కరణములు (రెండు వంశములకు సాధనములు)గా చేయబడినది. చెప్పెదను వినుడు. ఐలుని యొక్కయు ఇక్ష్వాకు నందుని యొక్కయు ప్రజ మారును. వరుస గట్టిన రాజులును, తక్కిన క్షత్రియ రాజులును మారిపోవుదురు. ఐలవంశమునను ఇక్ష్వాకు వంశమునను ప్రసిద్ధిచెంది రాజ్యాభిషేకము నందిన రాజులకు కులములకును నూరేండ్లు నిండును. భోజుల యొక్క విస్తారము రెండింతలు. క్షత్రము ముప్పది యేండ్ల కాలము నందును నలుదెసల వ్యాపించును. వారిలో గడచిన వారిని సమానులైన వారిని చెప్పెద వినుడు. ప్రతివింధ్యులు నూరేండ్లు, నాగులు నూరు, హయులు నూరు, ధృతరాష్ట్రులు నూరు, జనమేజయులు ఎనుబది, బ్రహ్మదత్తులు నూరు, శీరులను, వీరులను నూరు నూరు, తరువాత పులోములు నూరు, శ్వేత - వాశ - కుశాదులు, తరువాత గడచిన శత బిందువులు వేయి యేండ్లు పరిపాలింతురు. వారందరు లక్షదక్షిణలుకల యశ్వమేధములతో యాగము చేసిరి. ఈ విధముగా నూర్లకొలది వేలకొలది రాజర్షులు కడచిపోయిరి. వర్తమానమై వైవస్వతమన్వంతరమున లోకమున జనించినట్లుగా చెప్పబడిన వారి సంతతులను చెప్పెద వినుడు. వారి సంతానముల యొక్క విస్తరమును, పరంపరను తత్పూర్వాపర యోగక్రమముతో వేయియేండ్లు గూడ చెప్పశక్యము గాదు. వైవస్వత మన్వంతరమున ఈ రాజర్షులతో పాటు ఇరువది ఎనిమిది యుగాఖ్యలు గతించినవి. మిగిలిన వానిని వినుడు. తరువాత యుగాఖ్యులలో విశిష్టులైన వారు వైవస్వత క్షయమున రాజులతోపాటు ఇరువది నలుగురు రాగలరు. ఇది అంతయు సంగ్రహ - విస్తర యోగములతో మీకు చెప్పబడినది. బహుళమై నందున పునరుక్తము అయి ఉండవచ్చును. యుగములతో గూడ పునరుక్తి లేకుండ చెప్పసాధ్యముగాదు. వీరు యయాతి పుత్రులలో ఇరువది అయిదుగురు ప్రజలకు హితులు. అమితులు (పరిమితిలేనివారు) గా చెప్పబడినారు. వీరు నా లోకములను ధరింతురు. ఇచట చెప్పినవాడు ఈ లోకమున వరింపదగిన దానిని పొందును. దుర్లభములైన లౌకిక సుఖములను పొందును. ఆయువును, కీర్తిని, ధనమును, పుత్రులను, స్వర్గమును, చివరకు అనంతము (మోక్షము)ను అనుభవించును. దీనిని బుద్ధిలో ధరించుటవల్లను, వినుటవల్లను, వారు లోకములను ధరింతురు - అనునది మూడవ పాదము. ఓ బ్రాహ్మణులారా! విస్తరముగ నాను పూర్వితో మీకు నాచే చెప్పబడినది. మరి ఇంకేమి చెప్పవలెను? (37)
వాయుపురాణము మూడవ పాదము సమాప్తము.