వాయు మహా పురాణము
జ్యోతిః సన్నివేశము
శాంశపాయనుడు ఇట్లు చెప్పెను:
ఇది విని మునులు మరల సంశయము గలవారైరి. అపుడు వారు (తమ ప్రశ్నకు) లోమహర్షణుని మరల సమాధానము అడిగిరి. ఋషులనిరి మీరు ఈ గృహములు ప్రసిద్ధము అనిచెప్పితిరి. అవి ఏవిధముగ దేవగృహములగును. అవి జ్యోతిస్సులు ఎట్లు అగును. తెలుపుడు. ఇది అంతయును జ్యోతిస్సుల యొక్క నిశ్చయ (స్వరూప)మును చెప్పుడు అని అడిగిరి. అపుడు వారి మాటలను విని సూతుడు ఏకాగ్రచిత్తుడు అయ్యెను. ఈ విషయములో జ్ఞాన బుద్ధులైన మహాప్రాజ్ఞులచే చెప్పబడిన సూర్య చంద్రుల పుట్టుకను నేను మీకు చెప్పబోవుచున్నాను. ఇచట దేవగృహములు సూర్యచంద్రుల గృహము ఎట్లు అయ్యెను అను విషయము చెప్పబోవుచున్నాను. తరువాత, ఆకాశమునకు సంబంధించి నట్టియు, భూతములకు సంబంధించినట్టియు, పృథివికి సంబంధించి నదియునై మూడు విధములైన అగ్నియొక్క పుట్టుకను చెప్పెదను. రాత్రి తెల్లవారగానే అవ్యక్తజన్ముడైన బ్రహ్మ యొక్క మూలప్రకృతిగా ఉన్న ఈ జగము రాత్రి చీకటిచే ఆవరింపబడినది. ఆకాశాదులైన నాలుగు భూతములకు మిగిలినదైన ఈ భూమియందలి అగ్ని పార్థివాగ్ని అనబడును. మొదటిది సూర్యునియందు తపించునది. శుచి అను అగ్ని. వైద్యుతమును (విద్యుత్తు, మెఱుపు) వల్లవచ్చు అగ్నిని కూడ తెలుసుకొనవలెను. వైద్యుతము (మెఱుపువల్ల వచ్చునది) జాఠరము (అన్నజీర్ణకారియై కడుపులో ఉన్న అగ్ని), సౌరము సూర్యునినుండి వచ్చు అగ్ని)అని జలగర్భములైన అగ్నులు మూడు కావుననే నీరు త్రావుచు ఈ సూర్యుడు ఆకాశమున వెలుగుచున్నాడు. విద్యుత్తుతో ఆవేశింపబడిన వృక్ష సంబంధమైన అగ్ని నీటితో చల్లారదు. మానవుల కడుపులో ఉన్న జఠరాగ్నియు నీటితో చల్లారదు. మంటలతో గాని వెలుగుతోకాని ఉన్న అగ్ని (సౌరాగ్ని) పరమమైనది. జాఠరాగ్ని ప్రభావము కలది. మండలాకారమున వేడిలేనిది శుక్లమై (తెల్లనై) ప్రకాశించును.
సూర్యుడు అస్తమించగనే - సూర్యకాంతి యొక్క పావు భాగము అగ్నిని అవేశించును. కావున రాత్రియందు అది దూరమునుండి ప్రకాశించును. అగ్నియొక్క వేడి మరల ఉదయించు సూర్యుని అవేశించును. అకారణమున పార్థివాగ్నియొక్క పావుభాగముచే ఈ అగ్ని తపించును. కాంతియు వేడియును సూర్య అగ్నుల తేజస్సులు, అవి పరస్పరముగా ప్రవేశించుటచే పగటిని రాత్రిని సంతసింప చేయును. ఉత్తరపుదైన భూమి సగభాగమునను, దానినుండి ఈ దక్షిణ (అర్ధ) భాగమునను మరల సూర్యుడు ఉదయించుచుండగా, జలములందు రాత్రి ప్రవేశించును. రాత్రి ప్రవేశమువలన జలములు తామ్ర (ఎఱుపు) వర్ణముకలవి అగును. సూర్యుడు మరల అస్తమించుచుండగా పగలు జలములలో ప్రవేశించును. ఆ కారణమున రాత్రియందైతే తెల్లని జలములు సూర్యునిలో ప్రవేశించును. ఈ క్రమ యోగముతో భూమియొక్క దక్షిణోత్తర అర్థభాగములందు ఉదయము అస్తమయములలో నిత్యము పగలు రాత్రియు జలములందు ప్రవేశించును. తపించు (ఎండకాయు)చున్న సూర్యుని అందు కిరణములచే జలమును త్రాగుచున్న పార్థివాగ్ని దివ్యమై విమిశ్రమై శుచి అనబడును. వేయి కిరణములుగల ఆ అగ్ని గుండ్రనిదై కుండవంటిదై శుచి అనుపేరుకలది. అది తన వేయికిరణములచే అంతట (జలమును) తీసికొనును. ఆ శుచి అను దివ్యాగ్ని నదీ జలములను, సముద్ర జలములను, కూప జలములను మెట్టనేలలోని జలములను తీసికొనును. సూర్యుడు హిరణ్య (తేజో) మయుడు. అతని వేయి కిరణములు వర్షమును, చలిని, వేడిని స్రవింపజేయును. ఆ రశ్ములలో నాలుగువందల నాడులు చిత్రమూర్తులై వర్షించును. వందనములు (నమస్కార రూపములు) వంద్యములు (నమస్కరింపదగినవి) ఋతువములు (ప్రాచీనములు) నూతనములు, అమృతములు - ఈ పేరులుగల సమస్త కిరణములును వృష్టిని కలుగ చేయునట్టివి. మంచును ప్రవహింప చేయునవి ఆ రశ్ములకంటె వేరైనవి. అవి మూడువందలు. అవి చూడదగినవి, పవిత్రమైనవి, ప్రవహింప చేయునవి. గర్జనములు మెఱుపులు - ప్రవాహములునుకలవి, మంచును సృష్టించునవి, చంద్రులను పేరనున్న రశ్ములు అన్నియు పచ్చని కాంతిగల కిరణములు, శుక్లములు, కకుభములు, గోవులు, విశ్వభృత్తులు అను కిరణములు అన్నియు పేరునకు శుక్లములు. అవి మూడు వందలు. వేడిని సృష్టించునట్టివి. ఆ కిరణములచే (ఆశుచిఅను అగ్ని మనుష్య - పితృ దేవతలను సమానముగా భరించును) ఔషధములచే మనుష్యులను, స్వధచేత పితరులను, అమృతముచేత దేవతలను ముగ్గురిని మూటిచేత సూర్యుడు తృప్తి పొందచేయును. వసంత గ్రీష్మ ఋతువులలో ఆ మూడు రకముల కిరణములచేత సూర్యుడు తపించును. వర్ష ఋతువు నందును శరదృతువు నందును నాలుగింటిచే లాగును. హేమంత శిశిర - ఋతువులలో మూటిచే హిమమును సృజించును. ఓషధులందు బలమును కలుగ చేయును. స్వధచేత పితరులను తృప్తిపరచుచు సూర్యుడు అమరత్వమును, అమృత త్రయమును మూడింటిలో నియమించును. ఈ విధముగా సూర్య సంబంధమైన ఆ వేయి కిరణములు లోకార్థ సాధకములు. ఋతువునుపొంది జలము నందలి శీతోష్ణ ప్రవాహమును కలుగజేయును. ఈ విధముగ తెల్లనై ప్రకాశించు మండలమునకు సూర్యు మండలము అని పేరు. నక్షత్రములకు, గ్రహములకు, చంద్రునకును నిలచుటకు కారణమైనది. నక్షత్రములు, చంద్రుడును, గ్రహములును సూర్యుని నుండి పుట్టినవని తెలియవలెను.
చంద్రుడు, నక్షత్రాధిపతి సూర్యుడు గ్రహములకు రాజు, తక్కిన ఐదు గ్రహములు కామరూపులగు ఈశ్వరులు. అగ్ని, ఆదిత్యుడు. (అదితి పుత్రుడు) జలసంభవుడు చంద్రుడు అనబడినాడు. నారాయణుని బుధగ్రహముగా చెప్పుదురు. జ్ఞానవిదులు ఆతనిని దేవునిగా భావింతురు. రుద్రుని శనిగను తెలియవలెను. అతడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు. లోకమున స్వయముగా ప్రభువు శనైశ్చరుడు. మహాగ్రహమై ద్విజశ్రేష్ఠుడై, మెల్లగా పోవువాడు, దేవ - అసురులకు గురువులైన గురు - శుక్రులు. కాంతి కిరణములు కలవారైన మహాగ్రహములు ఈ శుక్ర గురువులు. బ్రహ్మయొక్క పుత్రులు ఆ శుక్ర, గురువులు, దైత్యుడు (దితి పుత్రుడైన రాక్షసుడు) మహేంద్రుడును ఆ శుక్ర, గురులకు అధిపతులుగా నిర్ణయింపబడిరి. సమస్త త్రిలోకములు సూర్యుడు మూలముగాగలవి. ఇందు సందేహము లేదు. దేవ - రాక్షస మనుష్యాత్మకమైన జగమంతయు ఈ సూర్యునిదే అగును.
సర్వలోకములలో వ్యాపించియున్న రవి తేజము రుద్ర, ఇంద్ర, ఉపేంద్ర (విష్ణువు), చంద్రుల యొక్కయు, స్వర్గవాసులైన దేవతలయొక్కయు, కాంతివంతములైన మరి ఇతరముల యొక్కయు సమస్తమైన కాంతియే. సూర్యుడు, సర్వాత్ముడు, సర్వలోకములకు ఈశుడు, సర్వమునకును మూలమైన పరమదైవతమూ అతని నుండియే బయలువెడలినది. ఓ బ్రాహ్మణులారా! జపముచే తెలియదగినవాడు, కాంతిమంతమైన గ్రహము, సుగ్రహమైన రవియే. ప్రాణులు సూర్యునియందు మృతి చెందుదురు. మరల మరల పుట్టుదురు. క్షణములు, ముహూర్తములు, దివసములు, (పగళ్ళు), రాత్రులు, పక్షములు, మొత్తమును, నెలలు, సంవత్సరములు, ఋతువులు, యుగములును వీనికి సూర్యుడు లేనిచో కాల గణనము ఉండదు. కాలము లేకున్న, వేదములేదు, దీక్షలేదు, ఆహ్నికక్రమము లేదు. ఋతువుల నామవిభాగమును లేదు. ఇక ఫలములకు మూలమైన పుష్పములను ఉండవు. పంటలు పండుటయును ఉండదు. గుణవంతములైన ఓషధిగణములు మొదలైనవి ఉండవు. జలమును ఎండజేసి జగమును తపింపజేయు సూర్యుడులేకున్న స్వర్గమర్త్య లోకములలో దేవతల వ్యవహారములే ఉండవు.
ఆ సూర్యుడే కాలము, అగ్ని, ద్వాదశాత్ముడు (పండ్రెండు రూపములు గలవాడు), ప్రజాపతి (బ్రహ్మ). ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! చరాచరములతో ఉన్న స్వర్గ మర్త్య పాతాళములు అను ఈ మూడు లోకములను ఎండగాసి తపింపజేయును. ఆ ఈ రవియే సర్వ లోకములకు సంబంధించిన తేజస్సులరాశి. వాయువుయొక్క కాంతులచే జగత్తునను, ఉత్తమమైన స్వర్గమునను నిలిచి, ప్రక్కభాగమును, పై భాగమును, క్రింది భాగమును అంతట తపింపచేయును. నేను ఇదివరకే సూర్యుని వేయి కిరణములను గూర్చి చెప్పితిని. వానిలో ఇంకను శ్రేష్ఠములైన సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వశ్రవము, సంపద్వసువు, ఆర్వావసువు, (స్వరాట్) అను ఏడు కిరణములు గ్రహముల జన్మలకు కారణములు. సూర్యరశ్మి క్షీణించిన చంద్రుని వృద్ధి చెందించుచు, తిర్యక్ (అడ్డముగను) ఊర్ధ్వ (పై భాగమునను) ప్రభావముగలదై సుషుమ్న మనబడును. హరికేశమను సూర్యరశ్మి ముందుగనే అనగా తూర్పున ఉండి నక్షత్రము పుట్టుకలకు కారణము అనబడినది. దక్షిణమున విశ్వకర్మ అను సూర్య కిరణము బుధుని వృద్ధి పొందించును. పశ్చిమమున విశ్వశ్రవములను సూర్యకిరణము శుక్రగ్రహ జన్మకు కారణమని పండితులు చెప్పుదురు. సంపద్వసువు అను సూర్యరశ్మి అంగారక గ్రహజన్మకు కారణము. అరవదైన అర్వావసువను సూర్యరశ్మి గురుగ్రహజన్మకు కారణము. స్వరాట్ అను సూర్యరశ్మి శనిగ్రహమును తృప్తిపరచును. ఈ విధముగ సూర్య ప్రభావమున అనగా సూర్య కాంతిచే గ్రహములు, నక్షత్రములు, తారకలు అన్నియు వృద్ధి చెందును. ఈ విశ్వమును, ఈ జగమును వృద్ధి చెందించును. మరిఅవి క్షీణింపవు. కావున వానిని నక్షత్రములు అందురు.
పూర్వము కిరణములచేత ఈ క్షేత్రములు పడిపోవును. తరువాత సూర్యుడు నక్షత్రత్వమును పొంది వారి క్షేత్రములను స్వీకరించును. ఈ లోకమున, పుణ్యముచేత తరించిన తారలు పుణ్యము క్షీణింపగా, గ్రహమును ఆశ్రయించుట వలనను, తెల్లవైనందు నను తారలను చీకటినుండి తరింప జేయునవైనందునను తారకలైనవి. దివ్యములైనవియు (ఆకాశమున ఉన్నవియు), భూమిపై ఉన్నవియు రాత్రికిసంబంధించినవియుగా చీకటులను, తేజస్సులను ప్రతినిత్యము ఆదానముచే చీకటుల ఖండించుటను, తేజస్సులను స్వీకరించుటను చేయుటచే సూర్యుడు ఆదిత్యుడైనాడు. తేజస్సును నీటిని (ఎండచే) కదిలింప చేయుటవలన సూర్యుడు సవిత అనబడును. ‘చంద్ర’ అను శబ్దము బహ్వర్థకము, ‘ఛది’ ‘ధాతువు’ ‘హ్లాదనము’ అనగా సంతోషమును తెలుపుతనము అమృతత్వము శీతత్వము. ఈ అర్థములలో భావింపబడును. సూర్యచంద్రుల యొక్క మండలములు దివ్యములు అనగా ఆకాశమున ఉండునవి, ప్రకాశవంతములు, అకాశమున పోవునవి. మండుచున్న తేజముతో నిండినవి. తెల్లనివి, గుండ్రని కుండతో పోలినవి, మంగళకరము లైనవి. అందులో చంద్రుని మండలము ఘనీభూతమైన జలరూపము అని చెప్పబడును. సూర్యుని మండలము ఘనీభూత తేజోరూపము. తెల్లనిది. సమస్త దేవతలు ఈ స్థానములందు అంతటను ప్రవేశింతురు. అన్ని మన్వంతరములలోను నక్షత్ర సూర్యగ్రహములను ఆశ్రయింతురు. అవి దేవగృహములే. ఆయా దేవతల పేరులుకలవి అగును. సౌరమండలము సూర్యుడు ప్రవేశించిన స్థానము. చంద్ర మండలము, చంద్రుడు ప్రవేశించిన స్థానము. శుక్రమండలము శుక్రుడు ప్రవేశించిన స్థానము. ఆతడు పదునాఱు వెలుగులుగలవాడైన ప్రతాపవంతుడు. గురుమండలము గురువు ప్రవేశించిన స్థానము. అంగారక మండలము అంగారకుడు ప్రవేశించిన స్థానము, శని మండలము శనిదేవుని స్థానము. సూర్య కిరణ సంయోగముల వలన తక్కిన గ్రహములు అన్నియు వెలుగుగలవి అగును. సూర్యుని విష్కంభము (విరివి) (వృత్త వ్యాసము) తొమ్మిదివేల యోజనములు అని చెప్పబడినది. ఆ సూర్యుని విస్తారము, మండలమున్ను పైదానికి మూడింతలు. సూర్యుని విస్తారమున కన్న చంద్రుని విస్తారము రెండింతలు. రాహువు యొక్క విశాలమైన స్థానము చీకటి మయముగా నిర్మింపబడినది. అది పర్వములలో సూర్యుని నుండి వెడలి చంద్రుని చేరును. చంద్రుని నుండి సూర్యుని చేరును. మరల ఇంకొక వరుసలో చంద్రుని చేరును. ఆకాశ కాంతిచే ప్రేరేపించును గాన స్వర్భానువు అని రాహువు పిలువ బడుచున్నాడు. చంద్రుని యొక్క పదునారవ భాగము శుక్రుడని విధింపబడినది. ఈ పదునారవ భాగము వ్యాసము నుండిగాని, మండలమునుండిగాని, యోజనము చివరినుండిగాని ప్రామాణికమని తెలుసు కొనవలెను. శుక్రునికంటె గురువు పావుతక్కువవాడు. గురువుకంటె కుజ, శనులు ఇద్దరును పావుతక్కువవారు. విస్తారము నుండిగాని, మండలము నుండిగాని, కుజ శనులకంటె పావుతక్కువవాడు. బుధుడు, తారా నక్షత్ర రూపములై శరీరము (ఆకారము) దాల్చిన వన్నియు విస్తారము ఉండిగాని, మండలము నుండిగాని బుధునితో సమతుల్యములు. తత్త్వజ్ఞాని సామాన్యముగా చంద్రయోగములును, విద్యా వృక్షములును, తారా నక్షత్రరూపములును పరస్పరము తక్కువగా చెప్పును. రెండువేల మూడు వందల నలుబది ఐదు వందల (2,34,500) యోజనములు పరస్పరముగ పూర్వాప నికృష్టములైనవి (తక్కువైనవి) మండలములు. సగము యోజనములు తక్కువవి కూడ గలవు. అంతకు తక్కువవి లేవు. వానికి పైననుండి దూరముగా పోవునట్టి మూడు గ్రహములు శని, గురువు, వక్రగ్రహమున్ను ఇవి మెల్లగా చరించునవి. వాని కంటె క్రింద వేరైనవి నాలుగు మహాగ్రహములు. అవి సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడును అనునవి. ఇవి శీఘ్రముగా (తొందరగా)చరించు గ్రహములు. ఎన్నికోట్ల తారకలు ఉన్నవో అన్ని కోట్ల నక్షత్రములు అంతటను కలవు. వానికి వీధులు నియమముగలదు. ఈ రీతిగ నక్షత్రమార్గము వ్యవస్థీకరింపబడినది. సూర్యుని యొక్క నీచ - ఉచ్చభావములలో అయన క్రమమును అనుసరించి, ఆ నక్షత్ర వీధులందే గమనముండును. పర్వములందు చంద్రుడు ఉత్తరాయణ మార్గమునందు ఉన్నపుడు, బుధుడు బుధ స్థానమును, రాహువు రాహు స్థానమును పట్టుకొని యుందురు. పుణ్యాత్ములయొక్క నక్షత్రములు అన్ని నక్షత్రములలో ప్రవేశించును. పుణ్యాత్ములయొక్క గ్రహములన్నియు ఈ అన్ని జ్యోతిస్సులందును ప్రవేశించును. బ్రహ్మచే నిర్మింపబడి, కల్పాదియందు ఏర్పడిన ఈ స్థానములు భూత ప్రళయము వరకును ఉండును. అన్ని మన్వంతరములలోను, దేవాలయములును, అభిమానులు, భూతప్రళయము వరకు ఉందురు.
భావ్యాభావ్యులై (ఉండతగినవారు, ఉండతగనివారునై) గడచిపోయిన సురా సురులతో పాటు దేవతలు గడచిన వారగుదురు. వర్తమానులైన తమ సురులతో పాటు దేవతలు గడిచిన వారగుదురు. వర్తమానులైన తమ సురులతోబాటు వారి స్థానములును (దేవ స్థానములు) ఉండును. ఈ మన్వంతరమున గ్రహములు వైమానికులు అనబడినవి. వైవస్వత మన్వంతరమున అదితి పుత్రుడైన వివస్వంతుడు సూర్యుడు. త్విషిమంతుడై (కాంతి మంతుడై) ధర్మపుత్రుడైన సోమదేవుడు వసువనబడినాడు. భృగువంశీయుడై దేవుడైన శుక్రుడు రాక్షసరాజ గురువు. గొప్ప తేజస్సుగలిగి దేవుడైన అంగిరసుని పుత్రుడగు అంగిరసుడు (గురువు) దేవగురువు అనబడినాడు. మనోహరుడైన బుధుడు త్విషి (కాంతి కిరణ) పుత్రుడు అనబడినాడు. వికల్పము నుండి అగ్ని పుట్టెను. యువకుడైన ఈ అగ్ని అంగారకుడు. నక్షత్ర - ఋక్షములతో పోవువారు దాక్షాయణులు అనబడిరి. సింహికా పుత్రుడైన రాహువు భూతములను సంతసింపజేయు రాక్షసుడు. వీరందరు చంద్ర ఋక్ష గ్రహసూర్యులందు అభిమానులుగా చెప్పబడిరి.
ఇక పై స్థానములు చెప్పబడినవి. అ స్థానములు గల దేవతలు గూడ చెప్పబడిరి. సహస్ర కిరణుడైన వివస్వంతుని యొక్క (సూర్యుని యొక్క) స్థానము శుక్లము (తెల్లనిది) అగ్నిమయము. వేయి కిరణములుగల సూర్యుని కాంతియొక్క స్థానము జలమయము. తెల్లనిదిగా ఉండును. తరువాత నల్లనిది, మనోహరుడైన పంచరశ్మియొక్క గృహము (ఐదు కిరణములయొక్క గృహము) అని చెప్పబడును. శుక్రునియొక్క స్థానముకూడ జల మయము. అది షోడశరశ్మి అనగా పదునాఱు కిరణములు కలది. తొమ్మిది కిరణములుగల యువకుడైన అంగారకునియొక్క స్థానము జలమయము. తొమ్మిది కిరణములుగలది. పండ్రెండు కిరణములుగల బృహస్పతి (గురువు) యొక్క స్థానము జలమయము, విశాలమైనది, పచ్చనైనదియుగా ఉండును. ఎనిమిది కిరణములుగల బుదుని యొక్క గృహము (స్థానము) జలమయమై, నల్లనైనది. రాహువు యొక్క స్థానము చీకటినిండినదై, ప్రాణులను పీడించు స్థానము. తారకలు అన్నియు జలమయములై, ఒకే కిరణముకలవి. పుణ్యకీర్తులకు ఆశ్రయమైనవి, రంగులో ఎక్కువ తెల్లనివి. ఘనీభవించి జలరూపములుగా ఉండును. కల్పాదిలో వేదములచే నిర్మింపబడినవి. ఎత్తైనందున ప్రకాశించు కిరణములచే తొందరగా కనబడును. అట్లే దక్షిణమార్గమునందున్న వాడై వీధిని ఆశ్రయించినవాడు. అట్లే కనబడును.
భూమియొక్క రేఖతో ఆవరింపబడిన సూర్యుడు పూర్ణిమ అమావాస్యలందు కనబడడు. కాలానుగుణముగా అస్తమించును. అందువలన ఉత్తర మార్గమందున్న చంద్రుడు అమావాస్యలనాడు కనడబడడు. కాని దక్షిణ మార్గమందు ఉన్న చంద్రుడు నియమముగా కనబడడు. విషువద్దినములందు (రాత్రి, పగలు సమముగా నున్న దినములందు) సూర్య చంద్రులు ఇద్దరును, నక్షత్రముల గతియోగముచే సమాన కాలమున అస్తమయమును సమానకాలమున ఉదయమును కలవారు అగుదురు. ఉత్తర మార్గములందు అస్తమ ఉదయములందు భేదములు లేక జ్యోతిశ్చక్రము (నక్షత్ర చక్రమును) అనుసరించుదురు. దక్షిణాయన మార్గమందున్నప్పుడు సూర్యుడు అన్ని గ్రహములకంటె క్రిందుగా చరించును. చంద్రుడు విశాల మండలము చేసికొని సూర్యునకు పైనచరించును. సమస్త నక్షత్ర మండలము చంద్రుని కంటె పైగా చరించును. నక్షత్రముల కంటె పైన బుధుడు, బుధుని కంటె పైన గురువును, గురున కంటె పైన శనియు, శనికంటె పైన సప్తర్షి మండలమును, ఆ సప్తర్షి మండలమునకంటె పైన, ధ్రువుడును నిలువరింపబడి ఉన్నారు. ఊర్ధ్వభాగమున తారాగ్రహముల అంతరములు (మధ్య దూరములు) రెండులక్షల యోజనములలో యథాక్రమముగ ఉండును. చంద్ర సూర్యులను ఆకాశమున గ్రహములు, దివ్య తేజస్సుతో, నియమక్రమము అనుసరించి నిత్య నక్షత్రములతో కూడును. అచటికి వెడలును. గ్రహములు నక్షత్రములు సూర్యుడును నీచలోను, ఉచ్ఛలోను, మార్దవములోను ఉన్నవారై వారి కలయికలోను విడువడినప్పుడును ప్రజలను ఒక మారుచూతురు. వీరు పరస్పరముగా (ఒకరి స్థానమున మరొకరుగా) ఉందురు. పరస్పరముగా కలిసి ఉందురు. పండితులు వారి సంయోగమును సంకరముగ భావింపరాదు. సహయోగము అనియే తెలియవలెను. అని ఓ ముని బ్రాహ్మణులారా! ఈ విధముగా భూమిపై గ్రహనక్షత్ర సూర్యులున్న జ్యోతిస్సుల యొక్కయు, ద్వీపముల యొక్కయు, సముద్రముల యొక్కయు, నదులయొక్కయు, పర్వతముల యొక్కయు అట్లే వర్షములయొక్కయు, సన్నివేశము మీకు నాచే చెప్పబడినది. ఈ గ్రహములే పూర్వము నక్షత్రములందు ఉండి ఉదయించిరి. చాక్షుష మన్వంతరమున వివస్వంతుడును. అదితి పుత్రుడును, గ్రహములలో మొదట గ్రహమైన, సూర్యుడు విశాఖా నక్షత్ర గణమున పుట్టెను. త్విషిమంతుడు (కిరణవంతుడు) ధర్మపుత్రుడును. సోముడును, విశ్వావసువును, శీతరశ్మియు అయిన చంద్రుడు, కృత్తికా నక్షత్ర గణమున పుట్టెను. పదునారు కిరణములు గలవాడును, భృగు పుత్రుడును, సూర్యుని తరువాత తారా గ్రహములలో శ్రేష్ఠుడును అయిన శుక్రుడు పుష్యమి నక్షత్రమున పుట్టెను. ఆంగిరస పుత్రుడును. పండ్రెండు కిరణములు గలవాడును. జగద్గురువైన బృహస్పతి గ్రహము, ఫల్గునీ నక్షత్ర గణములు అన్నింటను బుట్టినాడు. అంగారక గ్రహము తొమ్మిది కిరణములు గలిగి, ప్రజాపతిసుతుడై, పూర్వాషాఢా నక్షత్ర గణమందుబుట్టెను. సూర్యపుత్రుడైన శనేశ్వరుడు ఏడు కిరణములు గలిగి, రేవతీ నక్షత్ర గణమందుపుట్టెను. రోహిణీ నక్షత్ర గణమందు రాహుకేతు గ్రహములు పుట్టిరి. వీనిని తారలుగను (నక్షత్రములుగను) గ్రహములుగను తెలుసుకొనవలెను. శుక్రాది గ్రహములు జన్మ నక్షత్ర పీడలందు పై గుణమును పొంది నందున గ్రహభక్తులగువారు ఆ దోషముతో స్మృశింపబడుదురు.
ఈ గ్రహములు అన్నింటికిని ఆదియైనవాడు ఆదిత్యుడు. తారాగ్రహములకు శుక్రుడు మొదటివాడు. కేతువులకు ధూమకేతువు మొదటివాడు. నలుదిక్కుల విభజింపబడిన గ్రహములకు కాలరూపుడైన ధ్రువుడే మొదటివాడు. నక్షత్రములకు ధనిష్ఠా నక్షత్రము మొదటిది. అయనములకు ఉత్తరాయణము మొదటిది. ఐదేండ్లకు సంవత్సరము మొదటిది. ఋతువులకు శిశిరఋతువు మొదటిది. మాసములకు మాఘమాసము మొదటిది. పక్షములకు శుక్ల పక్షము. తిథులకు ప్రతిపత్తు అనగా పాడ్యమి మొదటిది. రాత్రింబగళ్లకు పగలును మొదటివిగా చెప్పబడినవి. ముహూర్తములలో రుద్రదేవతాక మైన ముహూర్తము మొదటిది. కనులు రెప్పపాటు కాలము కాలమునకు మొదటిదని కాలవేత్తకు సమ్మతమైనది. ధనిష్టా నక్షత్రము మొదలు, శ్రవణా నక్షత్రము వరకు జంట పంచవార్షికము అగును. అది సూర్యుని గతి విశేషముతో చక్రమువలె తిరుగును. కావున సూర్యుడు కాలము అనబడినాడు. అందుచే సూర్యుని ఈశ్వరునిగా తెలుసుకొనవలెను. సూర్యుడు నాలుగు విధములైన (పృథివి, జల, అగ్ని, వాయు రూపములైన) భూతములను పనులలో ఉంచువాడును పనుల నుండి తీసివేయువాడును అగును. ప్రయోజన నిశ్చయమువలన ఈ జ్యోతిస్సుల సన్నివేశమే లోక వ్యవహారమునకై, ఈశ్వరునిచే నిశ్చయింపబడినది. శ్రవణముచే పుట్టిన ఇతడు ధ్రువునిలో సంక్షిప్తుడైనాడు. చివరలలో అంతట వ్యాపించినవాడై వృక్షకారునిగా ఉన్నవాడు. బుద్ధిపూర్వకముగా భగవంతునిచే కల్పాదిలో ఈ విధముగా చెప్పబడినాడు. ఆతడు ఆశ్రయము కలవాడు. అభిమాని, అందరికిని జ్యోతిః స్వరూపుడు. విశ్వరూపుడు, వీడు ప్రధానము (ప్రకృతి) యొక్క అద్భుత పరిణామ రూపమైనవాడు. మనుష్యులకు గ్రహనక్షత్రాదుల రాకపోకలను నిజముగా మాంస నేత్రములతో చూచి లెక్కించి చెప్పు టకు సాధ్యపడదు.
పండితుడు వేద ప్రమాణము వల్లను, ప్రత్యక్ష ప్రమాణము వల్లను, అనుమాన ప్రమాణము వల్లను, హేతువువల్లను నిపుణముగా భక్తితోను పరీక్షించి శ్రద్ధవహించి లెక్కింపవలెను. జ్యోతిర్గణ మును విచారించునపుడు, కన్ను శాస్త్రము, జలము, వ్రాయ తగినది, గణితముఅను ఈ అయిదింటిని బుద్ధి సత్తములు హేతువులుగా తెలియవలెను.