వాయు మహా పురాణము
తీర్థయాత్రా వివరణము
బృహస్పతి ఇట్లు అనెను:
ఒక్కమారు అర్చింపబడిన పితరులు సంతుష్టులు, అవ్యయులు (నాశము లేనివారు), యోగాత్ములు, మహాత్ములు, పాపరహితులు, మహౌజస్కులు (మహాతేజస్వులును) అగుదురు. స్వర్గ ప్రాప్తికై మరణించియు, సువిస్తరమై కోరిన ఐశ్వర్యమును మోక్ష ప్రాప్తిని క్రమమున అనుగ్రహింతురు. ఓ సౌమ్యులారా! వారి ఆ సరస్సులను, నదులను, పుణ్య తీర్థములను, దేశములను, పర్వతములను అట్లే ఆశ్రమములను నేను చెప్పెదను. అందులో ముల్లోకములలో పుణ్యమైనది అమరకంటక పర్వతము. ఆ పర్వత శ్రేష్ఠము పుణ్యమై సిద్ధచారణులచే సేవింపబడినది. పూర్వము ఇచట భగవంతుడైన అంగిరసుడు వేల ఏండ్లు, దశలక్షల ఏండ్లు, కోట్ల ఏండ్లును దుశ్చరమైన తపమునుచేసెను. అచట మృత్యువునకుగాని, అసుర, రాక్షసులకుగాని గతి (స్థానము) లేదు. అచట భయముగాని, అలక్ష్మి (దారిద్ర్యము)గాని భూమి ఉన్నంత వరకును లేవు. శృంగమాల్యవంతము యొక్క సంవర్తాగ్నివలె (ప్రళయాగ్నివలె) ఆ పర్వతశ్రేష్ఠము తేజస్సుతోను కీర్తితోను నిత్యము ప్రకాశించును. అచటి కుశలు సుగంధములై బంగారువన్నెకలవై చూడ ఇంపుగా ఉండును. దక్షిణపువైపున నర్మదానదిని తాకుచు శాంతములై ఉండును. పూర్వము భగవంతుడైన అంగిరసుడు, మహాతేజస్వియై ప్రస్తరార్థ కుశోత్తమములను (పరచుటకై వేసిన దర్భలను) స్వర్గ సోపానము (మెట్టు)గా చూచెను. అమరకంటక పర్వతమున ఆ దర్భలపై ఒక్కమారు పిండములు పెట్టిన ప్రాజ్ఞుని ఫలమును చెప్పెదను.
ఆ శ్రాద్ధము అక్షయమై పితరులకు ప్రీతిని పెంచును. ఆ క్షేత్రమును పొంది పితరులు ఎల్లప్పుడును అంతర్థానము చెందుదురు. అచట అంతటను వ్యాపించిన జ్వాలా సరస్సును పవిత్రసరస్సు ఇప్పటికిని కనబడును. శల్యము(ఎముక)లతోగూడిన ప్రాణులను విశల్యులను (ఎముకలు లేనివారినిగ) చేయునది కూడగలదు. అచట ఆ పర్వతోత్తమమున ప్రాగ్దక్షిణముగా (ఆగ్నేయముగా) సుడులతో కూడిన బావికలదు. కళింగదేశపు సగము ప్రక్కన పితరులకు ప్రీతిని పెంచునదియు, భూమిలో పరమక్షేత్రమని చెప్పబడినదియు అగు ఒక సిద్ధ క్షేత్రము కలదు. ఓ ఋషి శ్రేష్ఠులారా! అది దేవదైత్యులకును సమ్మతమైనది.
శుక్రుడు కూడ ఒక శ్లోకమును చెప్పెను. పితృపరాయణులై అమరకంటక పర్వతమును చేరి అచట శ్రాద్ధమున పితరులను సంతసింపజేయువారు లోకమున ధన్యపురుషులు అగుదురు. అచట అల్పమైన తపముతోనే సిద్ధిని పొందగలరు. సంశయము లేదు. అమరకంటక పర్వతమున ఒక్కమారే అర్చితులైన పితరులు స్వర్గమును పొందుదురు. రమ్యమైన మహేంద్ర పర్వతమున పుణ్యమైనది. ఇంద్రునిచే సేవింపబడినదికలదు. అచట ఎక్కిన వానికి బహుప్రీతి కలుగును. అచట శ్రాద్ధము మహాఫలమగును.
బిల్వము యొక్క క్రింద శిఖరమున యోగముతో గూడిన దివ్య చక్షువు ప్రవర్తిల్లును. ప్రాణులకు కనబడనిదై దేవునివలె భూమియందు చరించును. సప్త గోదావరమునను (సముద్రమున కలియునపుడు ఏడు పాయలుగా మారిన గోదావరీ నదీ ప్రాంతమునను), గోకర్ణ క్షేత్రమునను, తపోవనమునను శ్రాద్ధస్నానములుచేసి నరుడు అశ్వమేధ యాగ ఫలము అందును. ధూతపాప స్థలమునుచేరి స్నానము చేసి నరుడు పవిత్రుడు అగును. అచట దేవదేవుడు మహేశ్వరుడు అయిన రుద్రుడు తపముచేసెను. గోకర్ణమున బ్రాహ్మణులచే నాస్తికులకు నిదర్శనము (తార్కాణము) చూపబడినది. అచట పఠించు అబ్రాహ్మణునకు సావిత్రి సంపూర్తిగా నశించును. సిద్ధచారణులచే సేవింపబడిన దేవర్షి భవన శిఖరమును నియమముతో ఎక్కినవారు స్వర్గమును చేరుదురు. ఆ పర్వతము దివ్యములైన చందన వృక్షముతోను ఇంకను అనేక ఇతర వృక్షములతోను శోభించినది. అట నుండి ఎప్పుడును చక్కని రుచితోగూడిన జలములు ప్రవహించును. ఆ జలములనుండియే తామ్రపర్ణి అను పేరుగల నది బయలుదేరును. అది మహాభేదముగల స్త్రీవలె దక్షిణ సముద్రమును పొందును. ఆ నదీజలములు సముద్రములో కలిసినవెంటనే శంఖములై, ముత్యములై శంఖ మౌక్తికములు అగును. శంఖమౌక్తికములతో కూడిన జలమును తీసికొనివచ్చి వ్యాధులతోను, మనోవ్యాధులతోను బాధపడుచున్న నరులకు ఇవ్వగా ఆ ముక్తులైన నరులు అమరావతిని చేరుదురు. శంఖముల యొక్కయు ముత్యముల యొక్కయు చందనములవల్ల పాపము చేసిన పితరులనైనను నరులు తరింపచేయుదురు. చంద్రతీర్థమున, కుమారీ తీర్థమున, కావేరీ తీర్థమున, ప్రభవమైన అక్షయ తీర్థమున, శ్రీశైల పర్వత తీర్థములందును, వైకృతగిరియందును శ్రాద్ధ కరణమున పాపులైన పితరులు గూడ తరింతురు. ఉశిర పర్వతమున, పలాశములు (మోదుగులు), ఖదిరములు (చండ్రలు), బిల్వములు (మారేడు), ప్లక్షములు (జడలుగల జువ్వి), అశ్వత్థములు (రావి), వికంకతములు (పుల్లవెలగలు) - ఒక్కచోనున్న వృక్షములు కానబడును. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఇది సిద్ధమైన యజ్ఞీయ మండలము. ఇచట శరీరమును వదిలిన మనుజుడు వేగమే అమరావతిని చేరును.
ఈ యజ్ఞీయ మండలమున తనచే చేయబడిన కర్మలు జన్మాంతమున సిద్ధించును. పితరుల విషయమున చెడుగా చేసినకర్మలు సైతము ప్రయుక్తములు అగును. నదీ శ్రేష్ఠయై పుణ్యనదియైన నర్మదానది పితరులకూతురు. అందులో చేయబడిన శ్రాద్ధములు అక్షయము అగును. సిద్ధచారణ సేవితమై పుణ్యమైన మాఠరమను వనమున శ్రాద్ధము అక్షయమగును. ఆ ప్రసిద్ధమైన మహాగిరియందు పితరులు సక్తులై అంతర్ధానము నందుదురు. పుణ్యమైన వింధ్య పర్వతమున ధర్మాధర్మములకు తార్కాణము కలదు. అచట జల ధారను చూచిన వారు పాపధారను చూడరు. అనగా అచ్చటి జలధారను చూచినవారికి పారంపర్యముగ వచ్చిన పాపములు అన్నియు నశించును. ఆ ధారలోనే కొంతమంది పాపకర్ములకు పాపము కనబడదు. ఆ ధార సామాన్యముగ శుభకర్ములకు స్పష్టము అగును. కౌశలయందు పాపనాశనియైన మతంగుని బావి కలదు. అందులో స్నానము చేసినవారు స్వేచ్ఛగా ఆకాశమున తిరుగువారై స్వర్గమును చేరుదురు. కుమారకోశలా తీర్థమునను, పాలపంజర పర్వతమునను, సముద్రాంతమైన పాండుకులమునను, అట్లే పండారక వనమునను, పాపములేనిదై, విమలమైనదై, అభయమై ప్రభవమైన శ్రీవృక్షమునను, గృధ్రకూటమునను, జంబూమార్గమునను, యోగాచార్యుడై, ధీమంతుడైన అసితగురువు యొక్క పవిత్ర క్షేత్రమున, అసితానదియందు చేసిన శ్రాద్ధము ఎల్లప్పుడును అనంతఫలము కలది. పుష్కర క్షేత్రములలో శ్రాద్ధము అక్షయము, తపము మహాఫలము, మహోదధియందును ప్రభాసక్షేత్రమునను శ్రాద్ధము అక్షయము. కావున ఈ విధముగా నిర్దేశింపవలెను.
దేవికయందు వృషము అను సిద్ధనిషేవితమైన బావి కలదు. దాని జలములు గోవుల శబ్దముతో నిత్యమును చక్కగా ఎగిసిపడును. అది సర్వ పాపములనుండి యోగేశ్వరులతో ఎల్లప్పుడును కూడియుండును. అచ్చట శ్రాద్ధము చేసినవానికి కలుగు ఫలమును చెప్పెదను వినుము. అచటి శ్రాద్ధము అక్షయమై సర్వకామములను తీర్చునదై పితరులను ప్రీతులను చేయును. అచట జాతవేదము అను సాక్షాత్తుగా అగ్నియొక్క శిల ప్రాచీనమైనదికలదు. అచట అగ్నిప్రవేశము చేసినవాడు స్వర్గము పైభాగమున ఆనందించును. అట అగ్ని శాంతమై, మరల పుట్టినది. దానియందు దత్తము చేయబడినది అక్షయము అగును. దశాశ్వమేధిక తీర్థమునను, పంచాశ్వమేధిక తీర్థమునను ఉద్దేశించిన క్రతువుల ఫలము ఇచటి శ్రాద్ధమున కలుగును. సంశయములేదు. హయశరము అను ఒక ప్రసిద్ధ తీర్ధము కలదు. అది వెంటనే వరములను ఒసగునట్టిది. అచట శ్రాద్ధము అక్షయము. స్వర్గమున ఆనందింపచేయును. కుంభమున శ్రాద్ధదానము చేయుదురు. అది పాపనాశకమని తెలియవలె. అచట శ్రాద్ధము అక్షయము. జపహోమతపములు గూడ అక్షయములు. అజతుంగము అను శుభ తీర్థమున ఎప్పుడును పితరులకు తర్పణము చేయవలెను. అచట పర్వములందు దేవతల యొక్క ఛాయ కనబడును. అచట దత్తము చేయబడినది (శ్రాద్ధము మొ॥) భూమిలో అక్షయము అగును. అచట పాండవులు బాధలు లేనివారైరి. అది సర్వ పాపము లకు వెలియైన యోగేశ్వరులతో నిత్యము కూడియుండును. అచట శ్రద్ధ దానము చేసిన వానికి కలుగు ఫలమునుచెప్పెదను. ఆ శ్రాద్ధకర్తచే ఎల్లప్పుడును పితరులు సాక్షాత్తుగా పూజింపబడినవారు అగుదురు. ఈ లోకమున వశియైనవాడు (సర్వేంద్రియములను తన అధీనమునందు ఉంచుకొన్నవాడు) మరణించి స్వర్గలోకమున ఆనందించును. అట్లే సామాన్యముగా మిక్కిలి శ్రేష్ఠమై పుణ్యమైన శివము అను అడుగు కలదు. అచట పుణ్యమైన వ్యాససరస్సును, దివ్యమైన బ్రహ్మసరస్సును గలవు. ఋగ్, యజుస్, సామ వేదములు శిరస్సులుగాగల మహాత్ముడైన వశిష్టునియొక్క ఉజ్జంతము అను పుణ్యపర్వతముగలదు. అది కపోతము (పావురములు) పుష్పము అను పేరుకలది. వీనియందు బ్రహ్మ పంచమ వేదమును సృష్టించి చెప్పెను. ప్రాచీన ద్విజుడైన అగ్ని ఈ క్షేత్రములను పొంది పాపము నుండి విముక్తుడు అయ్యెను. ఈ క్షేత్రములలో చేసిన శ్రాద్ధము, జపహోమతపములును అనంతము అగును. పుండరీకము అను మహాతీర్థము శ్రాద్ధా దానములకు పుండరీకముతో రాజ్య చిహ్నమైన తెల్లగొడుగుతో సమానమైన ఫలము కలది. బ్రహ్మతీర్థము అను మహా తీర్థమున అశ్వమేధముతో సమానమైన ఫలమును కలిగించును. సింధు సాగర సంగమమున, పంచనదమునను శ్రాద్ధాది దానములు అక్షయములు అగును. మండవాయమను పర్వతమున కీరకాత్మమైన పుణ్యతీర్థము కలదు. అచట శ్రాద్ధదానము అక్షయము. సప్తహ్రదమున విశేషించి మానస(సర)మున, మహాకూటమున, వందమున, త్రికూట పర్వతమున, శ్రాద్ధాది దానము అక్షయము అగును. సంధ్యాకాలమున మహావేది యందు మహాద్భుతము కనబడును.
శ్రద్ధవహింపనివారిని ఆ సంధ్య చేరదు. చక్కగా వ్రతమును ధరించినవారిని అది చక్కగా వచ్చిచేరును. అచట జాతవేదమను సాక్షాత్తు అగ్నియొక్క శిల ప్రాచీనమైనది కలదు. అచట నిత్యము శ్రాద్ధములను అగ్నికార్యమును చేయవలెను. అవి ఎల్లప్పుడును అక్షయములగును. ఒక సాయాహ్నమును ఆశ్రయించి, ఎప్పుడును పితరులు అక్షయమును కోరువాడు ఒకడే అచట శ్రాద్ధమును చేయవలెను. కృతాత్ముడుగాని, అకృతాత్ముడుగాని మానవుడు స్వర్గ్యమార్గ ప్రదమను తీర్థమునందు తెలియబడును. ఆ తీర్థము వెను వెంటనే వరమును ఇచ్చునట్టిది. దానియందు సప్తర్షులు వైరములను వదలి స్వర్గమునకు వెళ్లిరి. ఇప్పుడుకూడ ఆ పోయిన వైరములే కనబడును. మానవుడు ఆ తీర్థశ్రేష్ఠమున స్నానముచేసి స్వర్గవాస సుఖమును పొందును. అచట నంది - సిద్ధులచే సేవింపబడిన ప్రసిద్ధమైన నివాస స్థానము కలదు. అచటి నందీశ్వరుని మూర్తి దురాచారులకు కనబడదు. సూర్యోదయమున సంచిష్యమునందు బంగారు యూపములు కనబడును. అవి ప్రదక్షిణముచేసి అంతర్థానముచెంది స్వర్గమునకు పోవును. కురుక్షేత్రము అంతటను అది విశేషించి పుణ్యమైన సుతీర్థము. అది యోగేశుడైన మహాత్ముడగు కృష్ణునకు సంబంధించినది. అచట పితరులకు నూవులను ఒసగిననచో, అది నిత్యము, అక్షయమని చెప్పబడినది. ధర్మరాజు నివేశించిన స్థానమున శ్రాద్ధము అక్షయమై కర్తకు ఓజస్సును కూర్చును. అమావాస్యయందు శాస్త్రీయముగా క్రమమును అనుసరించి చేసిన శ్రాద్ధదానము కూడ అక్షయమై ఓజస్సును కూర్చును. విశేషించి కురుక్షేత్రమున సన్నిహితులకును శ్రాద్ధము చేయతగును. అచట పితరులను అర్చించిన సత్పుత్రుడు ఋణవిముక్తుడు అగును. వినాశనమునను, సరస్వతీ నది యందును, ప్లక్ష ప్రశ్రవణమునను, వ్యాసతీర్థమైన సరస్వతియందును, విశేషించి బ్రహ్మక్షేత్రమునను, అక్షయశ్రాద్ధమును కోరినవాడు ఓంకార పఠనములతో శ్రాద్ధదానము చేయవలెను. అట్లే పర్వత శ్రేష్ఠమైనమైనాక పర్వతమునను, గంగయందు అంతటను ఓంకారపఠనములతో శ్రాద్ధదానము చేయవలెను. అట్లే యమునానది పుట్టిన చోట కూడ చేసినచో సర్వపాపముల నుండి విముక్తి చెందును. అచట ఉన్న అత్యుష్ణములును, అతిశీతలములు అయిన జలములు అందుకు నిదర్శనము. యముని అక్కయు మార్తాండు (సూర్యు)ని కూతురును అయిన పుణ్యనది యమున అచ్చట కలదు. అచట శ్రాద్ధముచేసిన అక్షయమగుని పూర్వము పితరులు చెప్పిరి. బ్రహ్మాను గ్రహహదమున స్నానము చేసినవాడు వెంటనే బ్రాహ్మణుడు అగును. అచటచేసిన శ్రాద్ధమును, జపహోమతపములును అనంతములు అగును. అచట మహాతపస్వియైన వశిష్ఠుడు స్థాణువై (మొద్దై) తిరుగు చుండును. అచట ఇప్పుడు కూడ వృక్షములు మణులతో అలంకరింపబడి ఉండును. అచట ధర్మాధర్మముల గురుత్వమును తెలియజేయు త్రాసు (తూకము జేయు త్రాసు) కనబడును. బ్రాహ్మణులు దానితో తీర్థముల యొక్క ఉత్తమ ఫలమును తూచుదురు. పితరుల కూతురు ‘యోగ’ అనునది, ‘గంధకాలి’ అని ప్రసిద్ధి గాంచిన నది కలదు. అది బ్రహ్మ యొక్క నాలుగవ అంశము పరాశరకులమును ఉద్ధరించిననది. వేదమును నాలుగు విభాగములుగా విభజించి, మహాయోగుడు, ధీశాలియు అయిన వ్యాసముని పుట్టుకకు కారకుడు పరారుడు.
అచ్ఛోదము అను సరస్సుకలదు. అచట అచ్ఛోదములను నది బయలుదేరినది. వారణ నియోగమున ఆమె మత్స్యయోనియందు మరల పుట్టెను. దాని ఆశ్రమము పుణ్యము. పుణ్యకర్తలచే సేవింపబడినది. అచట ఒకమారు చేసిన శ్రాద్ధ దానము అక్షయము. దానియందు యోగ సమాధానమున ఈయబడిన శ్రాద్ధాది దానము వెంటనే ఫలమును కలిగించును. కుబేర పర్వతమున, బారెడు ఎత్తైన వ్యాస తీర్థమున పుణ్యుడైన బ్రాహ్మణుడు శ్రాద్ధ దానము చేయవలెను. అది అనంతమై, అక్షయము అగును. అది నిత్యము సిద్ధులచే సేవితము. పాపాత్ములకు కనబడదు. ఈశాన్య దిక్కున నంద అను వేదియందును నివర్తనము ఉండదు అది సిద్ధ క్షేత్రము. దానిని పొందినయెడల, మరల మనుష్యుడు తిరిగిరాడు. ధీమంతుడైన మహాదేవునిచే మహాలయమున అడుగిడబడినది. ఈశ్వరుడు దేవ్యాలయమున ఒంటికాలిపై నిరాహారుడై ఒక దివ్యయుగము తపము చేసెను. ఉమాతుంగము అను పర్వతమున జలము ఉండెను. అట్టి ఉమాతుంగమున, భృగుతుంగమున, బ్రహ్మతుంగమున, మహాలయమున, కాద్రవతియైన శాండిలియందు, వామనుని గుహయందును, స్నానమాచరించిన జనుడు పవిత్రుడు అగును. అచ్చటచేసిన శ్రాద్ధము అక్షయము అగును. జపము, హోమము, ధ్యానము, తాను చేసిన ఏ పుణ్యమైనను, అవి అక్షయములు అగును. గురుభక్తులు నూరేండ్లు బ్రహ్మచర్యమును పూజింతురు. ఇవి మొదలైన తీర్థములలో స్నానముచేసిన వెంటనే సత్ఫలమును పొందును. అచటనే కుమారధార అను పాప ప్రణాశినిఅగు జలధార కనబడును. అచటకు వెళ్లుట - కూర్చుండుట వెంటనే సఫలములై కనబడును. శైలకీర్తిపుర సమీపమున పుష్కలములైన కామములను పొందును. సర్వ ప్రాణులకు కనబడనివాడై దైవమువలె భూమిపై చరించును.
కాశ్యపుని మహాతీర్థము కాలసర్పి అని ప్రసిద్ధి చెందినది. అక్షయమును కోరువాడు అచట నిత్యము శ్రాద్ధదానము చేయవలెను. శాలగ్రామము అంతటను శ్రాద్ధము అక్షయము అగును. అచట పాపికి తన దృష్టిచే ప్రత్యక్షముగ కనబడదు. అంతయు పరోక్షముగ ఉండును. ఆ పుణ్యప్రదమున దివ్యుడైన నాగరాజు ఉన్నందున అశిష్టులకు తిరస్కారము, శిష్టులకు ప్రవేశమును జరుగును. ఆ నాగరాజు సజ్జనుల పిండములను గ్రహించును, దుర్జనుల పిండములను గ్రహింపడు. మిక్కిలి ప్రదీప్తములైన సర్పములచేత అన్నము భుజించుటకు శక్యముకాదు. ఈ రెండు తీర్థములలో ధర్మము ప్రత్యక్షముగ కనబడును. దేవదారు వనమున కూడ దానిని నిదర్శనముగ చరింపచేయవలె. పుణ్యాత్ముడు ప్రయాగయందలి గంగయందు పాపములు కడుగబడుటను చూచును. అచట అతడు చేయు శ్రాద్ధము నిత్యము అక్షయము అని చెప్పబడును. కాలంజరమున, దశార్ణయందు, నైమిశమున, కురుజాంగలమునందు, వారాణసియందు, నగరియందు, శ్రద్ధతో శ్రాద్ధదానము చేయవలెను. వానియందు నిత్యము యోగేశ్వరుడు కృష్ణుడు ఉండును. కావున అచట శ్రాద్ధదానము అక్షయము అనంతమును అగును. తపము, హోమము, ధ్యానము మరే పుణ్యకర్మ అయినను రౌహిత్యమున, వైతరణియందు స్వర్ణవేదియందును చేయవలెను. అవి అక్షయములగును. పుణ్యాత్ములు సముద్రాంతమున ఒక్కమారే చేయుట కనబడినది. గయలోను, ధర్మపృష్ఠమున, బ్రహ్మ సరస్సునను అట్లే కనబడినది. గయలోను గృధ్ర కూటమునను చేయబడిన శ్రాద్ధదానము మహాఫలమును ఇచ్చును. అచట అంతట ఐదు యోజనముల వరకు మంచుపడును. పుణ్యమైన భరతుని ఆశ్రమమునగల అరణ్యము మిక్కిలి పుణ్యప్రదము అనబడినది. అచట మతంగుని స్థానము మాంసచక్షువునకు కూడ కనబడును. ఈ విధముగా పుణ్యమైన పంచవనము పుణ్యకర్తలచే సేవింపబడినది. అచట పాండువిశాల అను తీర్థము వెంటనే కనబడు నిదర్శనము. లగ్నమున పాపులు అచట త్రాసుల తూకములతోను, ధనువులతోను, వివిధములైన శస్త్రములతోను తేలియాడుదురు. అట్లే తృతీయమందును, పాదమునందును, స్వరములేని పాపమండలమందును, మహాహ్రదమునను, కౌశికియందును చేసిన శ్రాద్ధదానము మహాఫలము ఇచ్చును. ధీమంతుడైన మహాదేవుడు అనేక దేవయుగములు చేయుటకు అలవిగాని తీవ్రతపమునుచేసి ముండ పృష్ఠమున అడుగిడెను. ఇచట అల్పకాలములోనే ధర్మపరాయణుడైన నరుడు - పాము తన కుబుసమును వదిలినట్లు - తన పాపమును వదిలివేయును. సిద్ధులకు ప్రీతిని కలిగించునవియు, పాపములకు భయంకరములైనవియు, గొప్ప పడగలుగలవియు అయిన సర్పములచేత రాత్రింబవళ్లు రక్షింపబడును. కనకనంది అను పేరుగల తీర్థము ముల్లోకములలోను ప్రసిద్ధమైనది. అది ముండపృష్ఠమునకు ఉత్తరమున ఉన్నది, దేవర్షి గణములతో సేవింపబడినది. అచట స్నానము చేసిన యెడల స్వేచ్చగా చరించు పక్షుల రూపమును పొంది స్వర్గమున కెగసిపోవుదురు. అట్లే ఇచ్చట చేయబడిన శ్రాద్ధదానము అక్షయమైనది. అచట స్నానముచేసిన యెడల నరోత్తముడు మూడు ఋణములతో (దేవ పితృ గురు ఋణముల) నుండి విముక్తుడగును. అచట సరస్సుయొక్క తీరమున ఒక గొప్ప దేవాలయముగలదు. సిద్ధుడు దానిని ఆరోహించి, అచట జపించుచు అట నుండి స్వర్గము నకు వెళ్లును. ఉత్తరమున ఉన్న మానససరస్సును చేరి ఉత్తమ సిద్ధిని పొందును. అచటకు పోయిన, ఒక అద్భుత పురశ్రేష్ఠము కనబడును. అచట యథాశక్తి, యథాబలముగా శ్రాద్ధమును నిర్వర్తింపవలెను. అట్లుచేసినవాడు దివ్యములైన కామములను పొందును. మోక్షోపాయమును కూడ తెలిసికొనును. సరోవర శ్రేష్ఠమైన మానస సరస్సున మహాఅద్భుతము ఒకటి కనబడును. దివము నుండి జారిన మహాభాగ్యవతియైన గంగ అంతరిక్షముననే ప్రకాశించును (భూమిపై పడినట్లు కనబడదు). ఆకాశ, భూ, పాతాళముల యందు ప్రవహించు ఆ గంగాదేవి సోమపాదము నుండి భూమిపైకి జారినది. అక్కడ ఆకాశమున సూర్యునితో సమానమైన తోరణము కనబడును. అది బంగారముతో నిండి, దివ్యమై విశాలమైన స్వర్గద్వారమువలె ఉండును. అట నుండియే తూర్పు సముద్రము చివరిభాగము ప్రారంభమగును. అది సర్వ భూతములకును, విశేషించి ధర్మజ్ఞులకును పవిత్రతను కలుగచేయునది. చంద్రభాగము సింధువున్ను రెండును మానస సరస్సుతో సమానములు. దివ్య సింధునదీ శ్రేష్ఠము. పశ్చిమ సముద్రమును చేరును. హిమవంతము అను పర్వతము అనేక ధాతువులచే అలంకరింపబడి ఉండును. ఎనుబదివేల యోజనముల పొడవు కలది. అది సిద్ధ చారణులతో నిండి ఉండి, సిద్ధచారణులతో సేవింపబడినది. అచట సుందరమైన పుష్కరిణి కలదు. అది సుషుమ్న అని ప్రసిద్ధి చెందినది. అచట పుట్టినవాడు పదివేలయేండ్లు జీవించును. అచట చేయబడిన శ్రాద్ధ దానము ఆనంతమును మహోదయమును అగును. ఆ శ్రాద్ధము కర్తయొక్క పదితరముల పూర్వికులను అట్లే పదితరముల రాబోవువారిని తరింపచేయును. హిమవంతునిదంతయు పుణ్యము, గంగ అంతటను పుణ్యయైనది, సముద్రమును చేరు అన్ని నదులును, సముద్రములు - అన్నియు అంతటను పుణ్యములైనవే. వానిలో పుణ్యముకానిది లేదు. పండితుడు ఇవి మొదలుగాకల అన్నింటిలోను శ్రాద్ధమును నిర్వర్తింపవలెను. అచట స్నానము చేసి శ్రాద్ధాది దానములను చేసి పవిత్రుడు అగును.
కొండచరియలందును, కొండలయందును, కందరములందును (దరులందును), గుహలందును, దేవతలచే త్రవ్వబడిన బిలములందును ఏకాంతములైన నితంబ (పర్వత మధ్య) ప్రదేశములందును, పర్వతముల నుండి పారు సెలయేరులందును, నదుల యొక్క ఇసుక తిన్నెలందును, నదులు పుట్టు స్థానములందును, అట్లే పర్వతముల నుండి పారు సెలయేరులందును. అట్లే నదులయొక్క ఇసుక తిన్నెలందును, నదుల పుట్టు స్థానము లందును, నదుల సంగమములందును, మహోదధియందును, గోవుల గోష్ఠము నందును, సంగమము లందును, వనములందును, వస్త్రాదులతో తుడువబడనివియు, గంధాదులు పూయ బడనివి యునై మనోహరములైన ఆవులందును, ఆవుపేడతో పూతపూసిన పవిత్రమైన ఇండ్ల యందును, వీనియందు విధివిధానముతో నిత్యమును శ్రాద్దదానము చేయవలెను. సర్వ కామములను నెరవేర్పదలచినవారు ప్రదక్షిణ దిశగా వెళ్ళి పై చోట్లలో శ్రాద్ధము చేయవలెను. ఈ విధముగ ఈ సమస్త ప్రదేశములందు శ్రద్ధతో శ్రాద్ధమును జేయవలె. ఈ ఆచరణము చేత మేధావియై, నరుడు బ్రాహ్మీసిద్దిని పొందును. మూడు వర్ణములకు (బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులకు) శాస్త్రము చెప్పిన స్థానమునను, బ్రహ్మచర్య, గృహస్థ, వానస్థాద్యాశ్రమమునను కోపస్థానమును వదులుటచే, పితరుల పూజనము చక్కగా పొందబడును. శ్రద్ధ గలిగి జితేంద్రియుడై ధీరుడై తీర్థములను అనుసరించుచు పాపములను చేసినవాడైనను శుద్ధి చెందును. శుభకర్మలు జేసినవాని విషయమున ఇంక చెప్పవలెనా? ఆ బ్రాహ్మణుడు తిర్యగ్యోనిని (పునర్జన్మకై పశుపక్ష్యాది గర్భమును) పొందకలడు. చెడు దేశమున పుట్టడు. స్వర్గవాసి అగును. మోక్షోపాయమును తెలియగలడు. అశ్రద్ధ వహించువారు, పాపకర్ములు, నాస్తికులు, సంశయము గలవారు, కారణములు చూచువారును - వీరు అందరును తీర్థ ఫలమును పొందరు. గురుతీర్థమున పరాసిద్ధి (ఉత్కృష్టమైన సిద్ధి) కలుగును. అది తీర్థములలో ఉత్కృష్టమైన స్థానము. ధ్యానము తీర్థాధీనము. కావున బ్రహ్మతీర్థము సనాతనమైనది. ఉపవాసమున కంటె ధ్యానము శ్రేష్ఠము. అది (ధ్యానము) ఇంద్రియములను విషయములనుండి మరల్చును. ఈలోకమున మరలమరల ప్రాణములచే (వాయువులచే) ఉపవాసము నందు పరాసిద్ధి నిబద్ధమైనది. ప్రాణాపానములను సమముగాచేసి, ఇంద్రియములను, విషయములను, బుద్ధిని, మనస్సును సంయమనముచేసి అంతర్ముఖముగా మరల్చుట ప్రత్యాహారముగను అది సునిశ్చితమైన మోక్షోపాయముగను తెలుసుకొనవలెను. ఇంద్రియములలో మనస్సు బుద్ధ్యాదులకు ప్రవర్తకమై భయంకరమైనది. మానవుడు నిరాహారమువలన క్షీణతను పొందును. ఆహారము లేమిని తపముగా తెలియవలెను. బుద్ధి, మనస్సుల నిగ్రహమువలన రమ్యమైన బుద్ధికలుగును. కట్టెలులేని అగ్నివలె, సర్వపాపములు క్షీణించినపుడును, ఇంద్రియములు క్షీణించినపుడును, శుద్ధాత్మ పరినిర్వాణము చెందును. యోగి వ్యక్తా వ్యక్తము యొక్క కారణములనుండియు, గుణముల నుండియు, క్షేత్రజ్ఞుని వేరుగాచేయును. వానివలన యోగముతో యోగవేత్త అగును. అతనికి వ్యక్తావ్యక్తమైన గతిస్థానము (జ్ఞానప్రాప్తి స్థానము) లేదు. నిఃసంశయము సమీపమున ఉన్నవాడు, ఉండిలేనివాడు అగుచు ఏ కొద్దివాడుగ అయినను ఉండలేడనుట నిఃసంశయము. (15)