వాయు మహా పురాణము
స్వరోత్పత్తి
అని ఈ విధముగా చెప్పి, అటు పిమ్మట సూతుడు అనెను:
ఓ మహామతియైన వాయుదేవా! నీవు చెప్పిన రహస్యములు లోకానికి అనుగ్రహము కలిగించునవి కావున తత్త్వమును అనుసరించి ఆశ్చర్యకరములు, శూలధారియైన శివుని యొక్క అవతారముల విషయమున నాకు సంశయము గలదు. మహాదేవుడైన శివుడు మిక్కిలి భయంకరమైన కలియుగమును పొంది, పూర్వములైన యుగములను వదలి అవతారమును పొంది, పూర్వములైన యుగములను వదలి, అవతారమును పరిగ్రహించుటలో కారణమేమి? ఓ ప్రభో ఈ వైవస్వతమన్వంతరము వచ్చినందున శివుడు ఏ విధముగా అవతరించెనో తెలిసికొన గోరుచున్నాను. నీకు ఈ లోకమునగాని, పరలోకమున గాని తెలియనిది ఏమియులేదు. భక్తులకు ఉపదేశించుటకై అడుగు చున్నాను. ఓ ప్రాజ్ఞా! ఆ మహామతము (గొప్ప వారికి ఇష్టమైనది) మేము వినదగినదైనచో చెప్పుము.
లోమశుడు అనెను:
అని ఈ విధముగ అడుగబడిన భగవంతుడు లోకహితము చేయుటలో ఆసక్తుడు, లోకములచే నమస్కరింపబడినవాడు మహాతేజోవంతుడు అయిన వాయువు ఓ గాధేయుడా! నీవు నన్ను అడుగుచున్నది మిక్కిలి రహస్యమైనది. దానిని అంతయు వరుసగా చెప్పెదను వినుము. పూర్వము అంతయు ఒకే సముద్రముగా ఉన్నది. దేవ మానముతో వేయి వర్ష ములు గడచినవి. అపుడు బ్రహ్మ ప్రజలను సృష్టింపగోరి దుఃఖితుడై చింతించెను. అట్లు చింతించు అతనికి ఒక కుమారుడు గలిగెను. అతడు దివ్యగంధము గలవాడై సుధను కోరినవాడై, దివ్యమైన శృతివేదమును ఉచ్చరించుచుండెను. శబ్ధము, స్పర్శ, రూపము, గంధము, రసములేని ఆశ్రుతిని ఉచ్చరించుచుండెను. దానిని దేవుడైన చతుర్ముఖుడు తెలిసికొనెను.
తరువాత బ్రహ్మ ధ్యానయుక్తుడై, భైరవుడైన శివుని మనస్సులో నిలిపి, ఈ మూడవ వాడెవ్వడు అని చింతించెను. ఆ విధముగ చింతించు అతనికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు లేని ఒక అక్షరము ప్రాదుర్భవించెను. ఆ తరువాత ఆ బ్రహ్మ లోకములలో ఉత్తమమైన తన మూర్తినిగూడ చూచెను. అపుడు ధ్యానము చేయుచు, తరువాత అక్షర పురుషుని గూడ మరలచూచెను. ఈతడు వర్ణమునందు ఉన్నవాడు, తెల్లని వాడు, ఎఱ్ఱని వాడు, పచ్చనివాడు, నల్లనివాడు, స్త్రీ కాదు. పురుషుడును కాడు. అట్టి విధమైన అతనిని చూచెను.
అది అంతయు చాలాకాలము పాటు తెలిసికొని ఆ అక్షరమును గురించి ధ్యానించు చుండెను. ఈ విధముగా ధ్యానించుచున్న (బ్రహ్మయొక్క కంఠమునుండి ఆ అక్షరము పైకి వెలువడెను. కేవలము ఒక్క మాత్ర గలది, గొప్పధ్వని గలది, తెల్లని వర్ణముగలది, చక్కగా నిర్మలమైనది అయిన ఆ ఓంకారం వేదమై ఉండవలెను. నాశములేని (అక్షరమైన) మహేశ్వరుడే అయి ఉండును.
తరువాత అక్షరమును ధ్యానించుచున్న బ్రహ్మనుండి పుట్టిన రక్త వర్ణుడు (ఎఱ్ఱని వాడు) మొదటి దేవుడు. ఋగ్వేదము అగ్నిమీళే పురోహితమ్ (అను మంత్రము మొదట గలది) అని మొదట గలదు. మహాతేజస్వియైన లోకకారకుడైన బ్రహ్మ ఈ ఋక్కును చూచి ఆ అక్షరము ఏమిటని ధ్యానించెను.
అట్లు ధ్యానము చేయుచున్న బ్రహ్మయొక్క ఆ అక్షరమునందు మహేశ్వరుడు రెండు మాత్రలు గల అక్షరముగా పుట్టెను. ఈశ్వరుడు కలిగియుండుటచే అది మూడు మాత్రలు కలదైనది. తరువాత బ్రహ్మ మరల ద్విమాత్రాకమైన అక్షరమునే ధ్యానించెను. దాని (అక్షరము యొక్క) ఛేదనము కలిగిన రక్తమును స్వీకరించి, ఆయజుస్సు ‘ఇషేత్వోర్జేత్వా వాయవస్థ దేవో వః సవితా పునః” అను మంత్రము మొదట కలదిగా జనించినది. తరు వాత యజుర్వేదమును ద్విమాత్రకమైన అక్షరమును చూచి, ఈశ్వరుడైన బ్రహ్మ ద్విమాత్ర మైన ఆ అక్షరమును మరల ధ్యానించుచుండెను. అట్లు ధ్యానించుచున్న బ్రహ్మకు ఓంకారము కలిగెను. తరువాత బ్రహ్మ ఆ అక్షరమైన ఓంకారమును ధ్యానించెను. తరువాత బ్రహ్మ దానినుండి పైకి బయలుదేరిన పచ్చని ఋక్కును చూచెను. అది “అగ్న ఆయా హివీతయే గృణానో హవ్యదాతయే” అనునది.
తరువాత మహాతేజస్వియైన బ్రహ్మ ఆ అక్షరమైన ఓంకారమును ప్రాతః సంధ్యలోను, మధ్యాహ్న సంధ్యలోను సాయం సంధ్యలోను మూడు మారులు ధ్యానించి, తమంతట తాముగా తనకు స్ఫురించిన వేదమును చూచెను. మూడు (అ.ఉ.మ్) వర్ణములు గలది, ప్రాతః కాలమున, మధ్యాహ్న కాలమున, సాయంకాలమునను చేయు యజ్ఞ స్వరూప మైనదియు అయిన ఓంకారము బ్రహ్మఅని గుర్తింపబడినది. మూడింటి సంయో గము వలన త్రివర్ణమైనది ఆ అక్షరము. లక్ష్యమై కనబడినదై, అలక్ష్యమై (కనబడనిదై) ప్రదృశ్యమై అనగా ఎక్కువగా కనబడినదై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి విహరించునదై మూడైనది. మూడు మాత్రలుకలది. మూడు పదములు కలది. మూడు యోగములు కలదియై ఆ అక్షరము శాశ్వతమైనది. కావుననే స్వయంభువైన బ్రహ్మ అ అక్షరమును ధ్యానించెను. కావుననే ఆ అక్షరము బ్రహ్మ. బ్రహ్మ యొక్క బ్రహ్మ రూపము పదునాలుగు ముఖములు గల దేవునిగా చూడబడును. కావుననే బ్రహ్మయొక్క ముందు ఓంకారమును చేర్చి పలుకుటచేత బ్రహ్మ తెలిసికొనబడును. ఆ బ్రహ్మ ముఖమునుండి పదునాలుగైన వివిధ స్వర వర్ణములు అగు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఏ, ఐ, ఓ. ఔ అను అచ్చులు) ద్వివ్యమై, మొదటిదైన ఆ ఓంకార అక్షరమున పుట్టినవి. ఆ ముఖము నుండియే అకారమునుండి పుట్టినవి. అరువది మూడు వర్ణములుగా చెప్పబడినవి.
తరువాత వర్ణముల యొక్క సాధారణ అర్థము కొఱకు, బ్రహ్మనుండి మొట్టమొదట ‘అ’కార రూపము నిలిచెను. అది మొదటి స్వరము (అచ్చు). తరువాత మన్వన్తరమున ఆ స్వరముల నుండి పదునాలుగు మహా ముఖములుగల మనువులు దివ్యములైన స్వర ములును పుట్టినవి. పదునాలుగు ముఖములుగల ‘అ’ కారం బ్రహ్మ అను పేర పిలువబడినది. అన్ని వర్ణములుగల ప్రజాపతి (బ్రహ్మ) బ్రహ్మ కల్పముగా చెప్పబడెను. అతని మొదటి ముఖమునుండి స్వాయంభువ మనువు వచ్చినట్లు స్మరింపబడెను. అతడు బ్రహ్మ యొక్క తెల్లనివర్ణముగల వాడని తెలియవలెను. ఆ బ్రహ్మ రెండవ ముఖము నుండి ‘ఆ’ కారము పుట్టినట్లు స్మరింపబడెను. అది పేరుతో స్వారోషమనువు రంగు తెలుపు మూడవముఖము నుండి యజుస్సులకు శ్రేష్ఠమైన ‘ఇ’ కారం బుట్టినది. ‘యజు’ అనగా ఆదిత్యుడు అతని నుండి యజుర్వేదము వచ్చినట్లు స్మరింపబడినది. ‘ఈ’ కారము రక్తవర్ణుడై ప్రతాపవంతుడైన మనువు. అతని నుండి క్షత్రియజాతి బయలుదేరెను. కావున క్షత్రియుడు రక్తవర్ణుడు. బ్రహ్మ నాలుగవ ముఖమునుండి ‘ఉ’కార స్వరము వచ్చినది. దాని రంగు తామ్రము (రాగివర్ణము) కావున (దాని నుండి పుట్టిన) మనువు తామసుడు అనబడెను. బ్రహ్మ ఐదవ ముఖము నుండి ‘ఊ’ కారము పుట్టెను. రంగుతో అది పచ్చనిది (అందు పుట్టిన) మనువుగూడ చరిష్టవుడు (అనువాడు) తరువాత బ్రహ్మ అరవ ముఖము నుండి ‘ఓం’ కారము పుట్టినది. అది కపిలవర్ణము కలది. దానినుండి వరిష్టుడు మహాతపస్వియు అయిన విజయుడు పుట్టెను. బ్రహ్మ ఏడవ ముఖమునుండి ‘ఋ’ కార స్వరము, వైవస్వత మనువును పుట్టిరి. అచట రంగు నలుపునపడినది. బ్రహ్మ ఎనిమిదవ ముఖమునుండి ‘ఋ’ కారము పుట్టినది. రంగు నలుపు, శ్యామాక్షరముతో సమానమైన వర్ణము గలవాడు అగుటచే దానినుండి సావర్ణి అను మనువు పుట్టినట్లు చెప్పబడినది. బ్రహ్మ తొమ్మిదవ ముఖమునుండి తొమ్మిదవ వర్ణమైన ‘ఇ’ కారము పుట్టినది. దాని రంగు ధూమ్ర వర్ణము. అందుపుట్టిన మనువుగూడ ధూమ్రుడు అనబడెను. బ్రహ్మ పదియవ ముఖమునుండి ప్రభువైన ‘ఇ’కారము పుట్టినది. దానినుండి సముడైన సవర్ణుడైన సావర్ణికుడు అను మనువు ప్రకాశించెను. బ్రహ్మ పదునొకండవ ముఖము నుండి ‘ఏ’ కారము. దాని రంగు పిశంగవర్ణము, మనువు పిశంగుడు. బ్రహ్మ పన్నెండవ ముఖము నుండి ‘ఐ’ కారము వెడలుటచేత అది పిశంగము అనగా భస్మముతో సమానమైన కాంతిగల పిశంగుడనువాడు మనువు (బట్టిరి). (బ్రహ్మ పదమూడవ ముఖము నుండి ‘ఓ’ కారము అది పంచవర్ణ సమాయుక్తము (ఐదు రంగులు గలది) ఉత్తమము. తరువాత బ్రహ్మయొక్క పదునాలుగవ ముఖము నుండి ‘ఔ’ కారము బుట్టినది. దాని వర్ణము కర్పూర (చిత్ర) వర్ణము సావర్ణి మనువు కల్పమును బట్టి ఈ వీరు మనువులు సర్పములు వాని రంగులును అని స్వరము నుండియు వర్ణము నుండియు తత్త్వమును అనుసరించినవి అని తెలియవలెను. ఏ కారణమువలన పరస్పరము సవర్ణములైన వర్ణములు వరింపబడినవో ఆ కారణము వలననే సవర్ణమగుట వలన అన్వయము చెప్పబడినది. కల్పమున పుట్టినవి సవర్ణములును, సమానములును అయినందున ఈ లోకమున సర్వసంధులు సవర్ణములు అగును. న్యాయ మును బట్టియు అర్థమును బట్టియు, వర్ణములు శిలల సమూహమువలె (యథాశైలం) ఏకము అగును. అందువలననే అభ్యాసమునుబట్టి సంధులు (వర్ణసంధులు) గూడ స్వరములే అని తెలియవలెను.