వాయు మహా పురాణము
జంబూద్వీప వర్ణనము
సూతుడు అనెను:
కర్ణికా మూలమని పూర్వము చెప్పబడినట్టిది డెబ్బదివేల యోజనములు క్రిందుగా ఉండును. దాని మండలము అనగా చుట్టుకొలత నలుబది ఎనిమిది వేలు యోజనములు. శైలరాజములచే చుట్టబడి కడురమ్యమైనది ఆ దేశము. మేరు మూలమని వేదము పల్కుచున్నది. ఆ పర్వత సహస్రములలో అనేక పర్వతములందు మిక్కిలి ఎత్తైనవి అయిన పర్వతములు సమస్త దిక్కులయందు చివర ఉండుటచే మర్యాదపర్వతములు లేక సరిహద్దు పర్వతములు అనబడినవి. అవి పొదలచేతను, గుహలచేతను సెలయేళ్ల చేతను శోభించుచున్నవి. అనేక దేవతామందిరములు రాజభవనములచేతను, నగరములచేతను, పూవులతో ఉజ్జ్వలములైన కొండచఱియలచేతను శోభించినవి. కొండనడుమనున్న పుష్పమాలా సమూహముల చేతను, ధాతువులతో అలంకరింపబడిన చఱియలచేతను, అనేకములైన సెలయేరులచే చుట్టబడి బంగారు వన్నెతోను, గోరోచనము వంటివన్నెతోను ఒప్పిన శిఖరములచే ప్రకాశించినవి. అనేక రత్నములు పొదిగిన బలిష్ఠులచే ఆ పర్వతములు అన్ని శోభించినవి. నూర్లకొలది పక్షులచే కూడుకొన్నవి, సాటిలేని పొదరిండ్లచే ఒప్పినది, సింహములు, పులులు, శరభ మృగములు (ఎనిమిది కాళ్లు గలిగి సింహమును గూడ చంపు మృగములు శరభములు), చామరమృగములు ఏనుగులు వీనిచే ఒప్పుచున్నవి. అనేక వర్ణములు, ఆకారములుగల అనేక విధములైన పర్వతములచే ఒప్పినవి. అందులో నొక్కొక్కటి పది పర్వతములుగలది. నల్లని ఆకారము కలిగియున్నను ఏడు రంగులు కలిసిన కిరణములు గల సూర్యుని ప్రకాశముగలది. బాహ్యములోను అభ్యంతరములోను అవి సమానముగా త్రివాహములుగా (మూడు వాహనములు కలవిగా తలంపబడుచున్నవి). తూర్పు దిక్కున జఠరము, దేవకూటము అను పర్వతములు రెండు. అవి దక్షిణోత్తర దిక్కుగా పొడవైనవి. (దక్షిణమువైపు) నీల పర్వతమువరకును, ఉత్తరమున నిషధ పర్వతము వరకును వ్యాపించి ఉన్నాయి. కైలాస పర్వతము, హిమవత్పర్వతమును దక్షిణోత్తరముల ఉన్న పర్వతములు రెండు. ఇవి తూర్పు వైపునకును పశ్చిమపు వైపునకును పొడవై వ్యాపించిన సముద్రము చివరను వెలసియున్నవి.
ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! పొడవైన బంగారు పర్వతము అను మేరువు యొక్క విష్కంభము (వ్యాసము Diametre)ను చెప్పెద వినుడు. మేరువు యొక్క క్రింద నాలుగు దిక్కులు గొప్ప పాదములు (ప్రత్యంత పర్వతములు=పెద్ద కొండచేరువన ఉన్న చిన్న కొండలు) గలవు. వానిచేత ధరింపబడినదై ఏడు ద్వీపములుగల భూమి చలింపదు (చక్కగా తిరుగును) వానియందు (పాదములందు)పదివేల యోజనముల పొడవని చెప్పబడినది. అవి దేవ, గంధర్వ, యక్షులకు నివాసములు. అనేక రత్నములతో శోభితములు. అనేకములైన సెలయేరులతోను కొండ నెత్తములతోను ఒప్పినవి. మనోహర గుహలతో నిర్మింపబడినవి. కొండనడుమన పుష్ప సమూహములతో మనోహరములైనవి. చిత్రములైన చఱియలుకలవి. మణిశిలతో ఉన్న గుహలచేతను, హరిదళపు ఉపరి తలములచేతను శోభించినవి. అంతటను సువర్ణమణులచే చిత్రములైనగుహలచే ఒప్పినవి. శుద్ధమైన ఇంగిలీకపు రంగుతోను ధాతువులచే అలంకరింపబడిన బంగారు వన్నెలచే నిండినవి, శ్రేష్ఠమైన బంగారమున చిత్రములైన పగడములచే నలంకరింపబడినవి. కాంతి గలవి. నూరు పర్వత సంధులుగలవి, సిద్ధులకు ఆవాసమైనవి, ఆనంద నిలయములైనవి. సిరులు గల గొప్ప (యేడు అంతస్తుల) భవనములచే అంతటను బాగుగా ప్రకాశింపబడినవి.
తూర్పున మందరమను పర్వతము, దక్షిణమున గంధమాదనమను పర్వతము, పశ్చిమమున విపులమను పర్వతము, ఉత్తరమున సుపార్శ్వమను పర్వతమును గలవు. వానియొక్క వేయి శిఖరములయందు వజ్ర వైడూర్యమణుల వేదికలు గలవు. వానియందు (నాలుగింటియందు) నాలుగు మహావృక్షములు ఉత్పన్నము లైనవి. అవి వేయి కొమ్మలు గలవి. చక్కని బలమైన వేరులతో చక్కగా నిలదొక్కుకొని ఉన్నవి. దట్టమై నల్లనై గుంపుగా ఉన్న ఆకులచే కప్పబడినవై అనేక విధములుగా ప్రాణులకు ఆశ్రయమిచ్చునవి. అనేకములైన మొక్కలచే ఎత్తైనవి. ప్రాణులచే అనుభవింపబడు మహా పుష్ప-ఫలములు గలవి. యక్ష -గంధర్వులచే సేవింపదగినవి. సిద్దులచే చారణుల చేతను సేవింపబడినవి. ఈ నాలుగు మహావృక్షములు ద్వీపమునకు ధ్వజము వంటివి.
మందర పర్వతపు శిఖరమున కేతురాజమను మహావృక్షము గలదు. అది పొడవైన కొమ్మలు శిఖరములు కలది. అది సర్వకాలములలో పూయునట్టి పెద్ద కడవలంతటి పుష్పములు గలది. ఆ పూవులు వికసించిన కేసరములుగలవి. గొప్ప సువాసనలు కలవి. మనోహరములైనవి. అట్టి పూవులచే ఆ వృక్షము శోభించినది. ఆ వృక్షము పిల్లవాయువుచే వీచబడినదై వేయి యోజనములకు మించి అంతటను తనపూవుల సుగంధముచే దిక్కులు నింపును.
ఓ ద్విజులారా! వరకేతువే భద్రాశ్వముఅను పేరుతో ప్రసిద్ధి చెందినది. అచట సాక్షాత్తుగా హృషీకేశుడు (విష్ణువు) సిద్ధ సంఘములతో పూజింపబడును. పూర్వము రుద్రుల సమూహముయొక్క తెలుపును హరించు దేవతాశ్రేష్టుడైన విష్ణువు సపరివారముగా అచటికి వచ్చెను. ఓ మానవ నాయకులారా! ఆ సమస్త ద్వీపము ఆ విష్ణువుచే చూడబడినది. అతని పేరనే భద్రాశ్వము అను పేర ఈ ద్వీపము పిలువబడినది.
దక్షిణమున ఉన్న పర్వతము యొక్క శిఖరమున, దేవసేవితమై ఎల్లప్పుడు పుప్పు ఫలములతోను మాలలతోను ఒప్పినదై, గొప్పవైన వ్రేళ్లు బోదెలునుగలదై, దట్టమైన రంగులతో నలంకరింపబడినదై ‘జంబువు’ అను మహావృక్షము ఉండును. అది ఎల్లప్పుడును నూతనములైన పుష్ప-ఫలములుగల శాఖలతో ప్రకాశించును. మిక్కిలి లావై, మెత్తనివై తీయనివై అమృతముతో సమానమైన ఆ వృక్షము యొక్క ఫలములు ఆ పర్వత శిఖరమున పడును. ఆ గిరి శ్రేష్ఠము యొక్క నెత్తమునుండి స్రవించు ప్రవాహమై తేనెలు ప్రవహించు జంబూనది అనెడి నది బయలుదేరినది. అచట జాంబూనదమను బంగారము పుట్టును. అది అగ్నికాంతి కలది. దేవతలకు అలంకారమైనట్టిది. సాటిలేనిది. పాపనాశనమైనది. దేవ, దానవ, గంధర్వ, యక్ష, రాక్షస, పన్నగులు, అమృతముతో సమానమైన తీయని ఆ జాంబూనద ధారను త్రాగుదురు. అది దక్షిణ ద్వీపమున ధ్వజము వంటిది. జంబువని లోకములలో ప్రసిద్ధిచెందినది. ఈ జంబూ వృక్షము పేరనే అతిప్రాచీనమైన జంబూ ద్వీపము ప్రసిద్ధి జెందినది.
పశ్చిమ దిక్కున ఉన్న విశాలమైన గొప్పదైన పర్వతముయొక్క శిఖరమున మిక్కిలిగా గొప్ప అశ్వత్థ (రావి) వృక్షము జన్మించెను. అది వ్రేలాడునట్టి శ్రేష్టమైన మాలలుగలది. బంగారముతోను, మణులతోను నిర్మించిన వేదికలుగలది. మిక్కిలి ఎత్తైన బోదెలు శాఖలు గలది. అనేక ప్రాణులకు నివాసమైనది అది కేతుమూల పర్వతము. కడవవలె లావైనవియు, తమరుచులతో సుఖమును ఇచ్చునవియు, అన్ని ఋతువులలో ఫలించునవియు, శుభకరములైన ఫలములతో కూడిన వృక్షములు అందు కలవు. కేతుమాల పర్వతము దేశీయులకు (విజయ) ధ్వజమువలె ఉన్నది. దేవతలచేతను, గంధర్వుల చేతను సేవింపబడినది ఆ కేతుమూల పర్వతము. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! కేతమాల అనుపేరు దాని నామకర్మలను అనుసరించి ఎట్లు వచ్చినదో నిర్వచనమును వినుడు. సముద్ర మథనము జరిగిన తరువాత, రాక్షస పక్షము ఓడిపోయెను, దేవేంద్రునిచే రచింపబడినదియు, అంతకు ముందు ఎవ్వరిని పొందనిదియునైన దేవేంద్రుని సుతప్రాయమైన పుష్పమాల ఒకటి, ఆ మహాయుద్ధ సమ్మర్దమున కలిగిన వృక్షముయొక్క పూలు లేకయే ఫలించు వృక్షమైన యశ్వత్థము (రావిచెట్టు) యొక్క బోదెయందు అంటుకొని యుండెను.
అదియట్లైనను గొప్ప సువాసన గలిగి, వాడనిదై అన్ని కోరికలు ఇచ్చునదై అనేకులైన సిద్ధులచేతను చారణులచేతను పూజింప బడుచున్నది. ఆ రావిచెట్టు యొక్క ధ్వజము నుండి దేవదత్తమైన గాలితో ప్రేరేపింపబడినదై ప్రకాశించును. మనోహరమైన దివ్య గంధమును వీచును. ఆ కేతు మాలలు గుర్తుగాగల ద్వీపము పశ్చిమమున చాల విస్తారముగా ఉన్నది. ఈ భూమిలోను స్వర్గమునను అంతట ‘కేతుమాల’ అని ప్రసిద్ధి చెందినది.
దాని ప్రక్కన ఉన్న ఉత్తర శిఖరమున కూడ ఒక మహావృక్షము ఉద్భవించినది. అది మఱ్ఱిచెట్టు. విశాలమైన బోదెగలది. అనేక యోజనముల చుట్టు వైశాల్యముగలది. అనేక సుగంధములతో ఒప్పిన పూలమాలల సమూహముగలది. ఊడలు వ్రేలాడు కొమ్మలు గలిగి సిద్ధ -చారణులతో సేవింపబడినదై ప్రకాశించెను. పగడపు కుండలవంటివియు తేనె తీపితో నిండినవియు అయిన ఫలములతో ఎల్లప్పుడు నిండిఉండును. అది ఉత్తర కురుదేశములకు ధ్వజము వంటి వృక్షముగా ప్రకాశించును. సనత్కుమారులకు తరువాత పుట్టిన వారును, మహాభాగ్యవంతులును అయిన కురువులు అను ఏడుగురు బ్రహ్మ మానసపుత్రులు ప్రసిద్ధులుండిరి. వారు అచట జ్ఞానమును పొందిరి. సాత్త్వికులైరి. పవిత్ర కీర్తిని పొందిరి. చివరకువారు అక్షయమై, క్షేమకరమై, సనాతనమైన పరాత్పరమైన లోకమును పొందిరి. మహాత్ములైన ఆ ఏడుగురి పేరుతో పిలువబడు నదీద్వీపము అది. దేవ లోకమునను, భూలోకమునను అవి ఉత్తర కురువులని ప్రసిద్దిపొందినవి. (35)