వాయు మహా పురాణము
అగ్నివంశవర్ణనం
అభిమానుడైన అగ్ని స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మయొక్క మానస పుత్రుడు. అతని నుండియే స్వాహా జన్మించినది. పావకుడు, పవమానుడు (ఈతడే పావమానుడు) శౌరుడు అనబడు శుచియు ఈ ముగ్గురు స్వాహా పుత్రులు. నిర్మథనమున వచ్చిన పవమా నుడు శుచియైనవాడు. అతడు శౌరుడు అనబడును. పావకములు వైద్యుతములు వానికి స్థానములు. పవమానాత్మజుడు కవ్యవాహనుడనబడును. పావకుని నుండి వచ్చినవాడు సహరక్షుడు. శుచియొక్క సుతుడు హవ్యవాహుడు. అగ్ని దేవతలకు హవ్యమును మోయు వాడు. పితరులకు కవ్యమును మోయువాడు. అసురులకు హుతమును మోయువాడు సహరక్షకుడు. మువ్వురికి మూడగ్నులు.
వీరియొక్క పుత్ర పౌత్రులు ఇరువది నాలుగు మంది మరియు తొమ్మిది మంది. వేరువేరుగా వారి నామములను చెప్పెదను. విద్యుత్సంబంధమైన లౌకికాగ్నియైతే బ్రహ్మ యొక్క మొదటి పుత్రుడు అనబడెను. అతని పుత్రుడు బ్రహ్మొదనాగ్ని. అతడు భరతుడని ప్రసిద్ధి చెందెను. అతని అగ్నిముఖము నీటియొక్క రసరూపమైన శుక్ర సంబంధమైన తేజము పూర్వము, జల సముద్రమునందు అమృతము అధర్వునిచే మధింపబడినది. ఆ అథర్వుడు లౌకికాగ్ని దధ్యంచుడు. ఆథర్వుణుని కుమారుడు.
ఇక నిర్మంథుడని శుక్రులచే తలపబడిన పవమానుడు అను అగ్నిని గార్హపత్యాగ్నిగా తెలియవలెను. ఆ అగ్నినుండి ఇద్దరు పుత్రులు మొదటివాడు హవ్యవాహనుడు అనబడు ఆహవనీయాగ్ని. ఈతడు ప్రశంసింప తగినవాడు. రెండవవాడు యజ్ఞములో ప్రణీయమానుడు (కుండమునకు దీసికొనిపోబడువాడు) అగు శుక్రుడు అను అగ్ని అట్లే శంస్యుడు అను అగ్నికి సభ్యాగ్ని, ఆవసధ్యాగ్ని అను ఇరువురు పుత్రులు. బ్రాహ్మణులచే ఆహవనీ యాగ్నియని అభిమానింపబడిన శంస్యుడుఅను హవ్యవాహనాగ్ని పదునాఱు నదులను కామించెను.
ఆనదులు ఇవి: కావేరి, కృష్ణవేణి, నర్మద, యమున, గోదావరి, వితస్త, చంద్రభాగ, ఇరావతి, విపాశ, కౌశికి, శతద్రు, సరయు, సీత, సరస్వతి, హ్రాదిని, పావని ఈ నదులను శంస్యుడను ఆహవనీయాగ్ని కామించెను. ఆ అగ్ని ఈ పదునారు నదుల ధిష్ణీల యందు (ధిష్ణీలు, నదులలోనే ఒక విశిష్టమైన గర్భస్థానము) వేఱువేఱుగా తనను విభజించి ఉంచెను. తరువాత ఆ ఢిల్లీలలో అగ్ని జనించెను. ఆ ధిష్ణీలు, వ్యభిచారిణులు, వారిలో పుట్టినవారు ధిష్ణీలు (ధిష్ణయః) (ఆపేర వెలసిన అగ్నులు) ధిష్ణీలలో పుట్టినందున ఆ అగ్నులు ధిష్ణులు అని చెప్పబడినవి. ఈ విధముగ ఈ నదీపుత్రులు ధిష్ణులలోనే పుట్టిరి. ఆ అగ్నులలో (హోమ కుండములలో) విహరణీయములు (వెడల్పుగా పరుచదగినవి)గా ఉంచదగినవి (ఒకచోట ఉంచదగినవియు) ఏవో, అవి ఏవని అనబడునో సంగ్రహముగా చెప్పెదను వినుడు.
ఋతువు ప్రవాహణము అగ్నీధము తక్కిన ధిష్ణీలు ధ్రిష్ణి నామకములు ఈ అగ్నులు సుత్య సంబంధమైన దినమున సవన క్రమమును అనుసరించి వాని స్థానములలో విధింపబడును. ఇక చూపరానివియు, చెప్పరానివియు అయిన అగ్నుల క్రమమును వినుడు. సమ్రాట్ అను అగ్ని మొదటిది. ఉత్తరవేదికి సంబంధించిన కృశానువు అను అగ్ని రెండవది-సమ్రాడగ్నిని ఎనమండుగురు బ్రాహ్మణులు సమీపమున ఉండి ఉపాసింతురు. దాని క్రింద పర్షత్ అను వేరొక రెండవ అగ్ని ఇచ్చట కన్పడును. దానిని ‘నభస్’ అని అందురు. అది నాలుగుగ భావింపబడును. వానిలో బ్రహ్మజ్యోతి వసువు అనునది. బ్రహ్మస్థానమున ఉండునని చెప్పబడును. హవ్యనూ అనునది మొదట సృష్టింపబడినది. అది యాగమున భావింపబడును. తరువాత విశ్వము యొక్క అగ్ని సముద్రము. అది బ్రహ్మస్థానమున ఉండును. ఋతుధామము అన్నది జ్యోతిర్వంతమైన అగ్ని. అది యౌదుంబరియందు (మేడియందు లేక రాగియందు) ఉండును. బ్రహ్మజ్యోతియైనది వసువుఅను అగ్ని అది బ్రహ్మస్థానమున ఉండునని చెప్పబడును.
అజైకపాద్ అను అగ్ని ఉపాసింపతగినది. అది శాలాముఖములో ఉండును. ఉద్దేశింపతగనిదైనను అహిర్బుధ్న్య మనబడును. ఆ అగ్ని గృహపతి అని పిలువబడినది. ఈ అన్ని అగ్నులును శంస్యము యొక్క సుతులే. అవి బ్రాహ్మణులచే ఉపాసింప తగినవి. ఆ తరు వాత పరువదగిన అగ్నులను, వాని ఎనమండుగురు సుతులను చెప్పుదును. క్రతు ప్రవా హణము, అగ్నీధ్రము అచ్చటనుండు తక్కిన దిష్టులును, అగ్నులును సుత్యాదినపు అగ్నిలో సవనక్రమమున వానివాని స్థానములలో పరువబడును.
ఆ తరువాత హవ్యవాహనుడనబడు అగ్ని పౌత్రేయాగ్ని ప్రచేతసుడనబడు అగ్ని శాస్త్యగ్ని మొదటిది. సత్యమను అగ్ని రెండవది. అట్లే విశ్వదేవమను అగ్ని బ్రహ్మ స్థానమున ఉండును. అవక్షురచ్చావకము అను అగ్ని భూస్థానమున ఉండునని భావింపబడును. సవీర్యమైన ఉశీరాగ్ని నైష్ఠీయముగా సంభావింపబడును. ఎనిమిదవదియైన వ్యరత్తి అను అగ్ని మార్జారీయమనబడును. సౌమ్యము (సోమ సంబంధమైన దానిచేత గాని వేరొకదాని చేతగాని పరువతగిన అగ్నులు. రెండింటిలోని పావకుడు అను అగ్ని నీటికి గర్భము. ఆ అగ్నిని అవబృథమని తెలియవలెను. అది చక్కగా చేరి నీటిలో హోమము జేయబడును. ఆతని సుతుడు హచ్ఛయుడను అగ్ని (హృదయమున పండుకొను వాడైన అగ్ని) అతడు మానవుల జఠరములో ఉన్నాడు. జఠరాగ్నికి మన్యుమంతుడను విద్వాంసుడైన అగ్ని సుతుడు. అన్యోన్యముగా పైకి విజృంభించిన ఆ అగ్ని భూతములకు (ప్రాణులకు) మహా ప్రభువు, ఆ మన్యుమంతు డను అగ్నికి పుత్రుడు అతడు భయంకరుడైన సంవర్తకుడన బడినాడు. అతడు నీటిని త్రాగుచు, ఆడగుఱ్ఱపు ముఖము గలవాడై సముద్రమున నివసించును. సముద్రవాసియైన సంవర్తకాగ్నియొక్క పుత్రుడు సహరక్షుడనబడును. సహరక్షాగ్ని సుతుడు కాముడు అను అగ్ని. అతడు మనుష్యుల ఇండ్లను దహించును. కాముడను అగ్నికి సుతుడు క్రవ్యాదుడు అను అగ్ని. ఈ క్రవ్యాదుడను అగ్ని మరణించిన పురుసులను తినును. ఈ అగ్నులు అన్నియు ఈ విధముగా పాతకము అను అగ్నియొక్క పుత్రులుగా జెప్పబడిరి.
ఆ తరువాత శౌర్యాగ్నినుండి అసురులచే ఆవరింపబడిన గంధర్వులచే అరణి యందు మధింపబడిన అగ్ని. అగ్నిఅని చక్కగా ప్రజ్వలింపజేయబడును. పశుయాగమున తీసికొనిరాబడు అగ్ని, భగవంతుడైన ఆయువు అను అగ్ని. ఆయువు అను అగ్నియొక్క పుత్రుడు మహిమాన్ అనువాడు. ఆయన పేరుతో ‘శావాన్’ అను సుతుడు కలడు. పాక యజ్ఞముల యందు అభిమానియైన అగ్ని సవనుడు. సవనుడు అను అగ్నియొక్క పుత్రుడు మహాయశుడైన అద్భుతుడు. అద్భుతాగ్ని యొక్క పుత్రుడు వివిచి. అతడు గొప్పవాడు. అతడు ప్రాయశ్చిత్తమున (అగ్ని యందు) ఎల్లప్పుడు భీముల యొక్క హోమము చేయబడిన హవిస్సును భుజించును. వివిచి అను అగ్నికి సుతుడు అర్కుడు అను అగ్ని. అర్కాగ్నికి సుతులు వీరు - అనీకవానుడు, వాసృజవానుడు, రక్షోహుడు, పితృకృత్, అట్లే సురభి, వసురత్నాదులలో ప్రవేశించియున్న రుక్మవానుడు అనువారు, శుచిఅను అగ్నికి ఇది సంతానము. అగ్నులైతే పదునాలుగు. ఇవి అన్నియు యజ్ఞములలో తీసికొనిరాబడు అగ్నులుగా చెప్పబడినవి.
అది సృష్టిలో యామములతో (జాములతో) బాటు సురోత్తములచే గడచిన అగ్నులు స్వాయంభువమన్వంతరమున ముందు అవి అభిమానులు అను అగ్నులు. ఇవి: ఇచట చేతనాచేతనులలో విహరణీయములై పరువదగినవైన అగ్నులు. లోకమున ఆ అగ్నులు ముందు స్థానాభిమానులుగా ఉండినవి. మనువుయొక్క ప్రథమ మన్వంతరమైన పూర్వ మన్వంతరము పుణ్యులై మహాత్ములైన దేవతలతోబాటు శుక్లములైన జాములతో సుతులతో గడచిపోగా, కామ్యములు, నైమిత్తికములు, అజస్రములు (మాటిమాటికి చేయబడునవి) అయిన కర్మలందు (యజ్ఞములందు) ఇవి ఉండినవి. ఇవి నాచే చెప్పబడిన స్థానములు కలవియును అగును. భూతభవిష్యత్కాలము లందలి అన్ని మన్వంతరములలో గూడ అగ్నుల లక్షణము. వానిచేతనే (పై అగ్నులచేతనే) ప్రకటముగా చక్కగా చెప్పబడినది. ఈ అగ్నులన్నియు తపస్వినులు. అట్లే ఇవి అన్నియు అవబృథములు, ఇవి అన్నియు ప్రజాపతులు, జ్యోతిష్ఠంతములు కూడా-స్వారోచిషము మొదలగు ఏడు మన్వం తరములలో సావర్జ్యములు తెలియదగినవి. సమస్త మన్వంతరములలోను అచట ఉండు దేవతలతో బాటు ఈ అగ్నులు నానారూపములైన ప్రయోజనములతో ఉండును. అనాగతులైన దేవతలతోబాటు అనాగతాగ్నులు ఉండును. అని ఈ అగ్నుల విషయము (యజ్ఞ కుండమునకు తీకొనివచ్చుట) ఉన్నది ఉన్నట్లుగా నాచే చెప్పబడినది. తరువాత విస్తరము గను ఆనుపూర్వితోను పితరులకు సంబంధించినది చెప్పబడును. (29)