భువన విన్యాసము - 1

సూతుడు అనెను:

వరుసగా ఆ నాలుగు పర్వత రాజములయొక్క మనోహరములైన అనుబంధ ప్రదేశమును గురించి చెప్పెదను. అవి సర్వకాలములు (భూత, భవత్, భవిష్య) సర్వ ఋతువులు సమముగా గలవి. అనగా ఆ యా ఋతుచిహ్నములగు పూవులు గలవి. గోరువంకలు, నెమళ్ళు, చకోరములు, మదించిన చిలుకలు, గండుతుమ్మెదలు, చిత్రములైన ఇతర పక్షులు వీనిచే అంతట ప్రకాశించుచుండును. వెన్నెలపులుగుల నాదములు, బంగారు వన్నె పక్షుల నాదములు, మదించిన కోకిల నాదములు, మేకపోతుల నాదములు. చక్కని కంఠములుగల కాంచనపక్షుల నాదములు, ఊరపిచ్చుకల నాదములు, తక్కిన ప్రాణుల కూతల నాదములు-వీనిచే అంతట మనోహరమైనవై ఉండును. ఒక్కొక్కచోట మదముచే విజృంభించి, మధురములై అలసతతో ఉన్న తుమ్మెదల యొక్కయు, ఒక్కొక్కచోట కిన్నెరుల యొక్కయుగానములచే నిండి వనాంతములు ఉపగానము చేసినవి. అందమైన చిగురాకులతో ఒప్పిన తరువులు పిల్లవాయువులతో కదల్చబడి పుష్పవర్షమును కురియు చున్నవి. పిల్లవాయువులతో కదలుచు, ఊగుచున్న ఎఱ్ఱని చిగురాకులతోను, పూలగుత్తులతోను ఆ వృక్షములు కూడి ఉన్నవి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఒకచోట అనేక ధాతువులచే చిత్రమై మనోహరముగా ఉంచబడిన నూర్లకొలది శిలలచే శోభితములై ఉన్నవి. దేవ, దానవ, గంధర్వ, యక్ష, రాక్షస, పన్నగులచేతను, అప్సరో గణములచేతను సేవింపబడినవి.

తరువాత అచ్చట మనోహరములైన నాలుగు దేవతల ఉద్యానవనములు ఉన్నవి. అవి నాలుగు దిక్కులలో విశాలముగా వ్యాపించి ఉన్నవి. వాని పేర్లు. తూర్పు దిక్కున ఉన్నది చైత్ర రథము. దక్షిణపుది నందన వనము, పశ్చిమపుది వైభ్రాజము, ఉత్తరపుది సావిత్రి (సూర్యునిది) అనునది, ఈ మహావనములలో ఉన్న మనోహరములైన అనుబంధములు. పక్షుల కూతలు, వనములచే విస్తీర్ణములైన తీర్థములు, మహాపుణ్యములైన వనములు, గొప్ప ఏనుగులు, పాములు-వీనికి స్థానములు. మహాత్ములచే సేవింపబడిన ప్రదేశములు, మంచి రుచిగల నిర్మల జలములు, మంగళములు సుఖకరములు. ఉత్తములైన సిద్ధుల చేతను దేవతలచేతను, అసురులచేతను స్నానము చేయబడినవి. ఛత్రములు అంతటి ప్రమాణములు కలిగి, గొప్ప సువాసనలు కలిగి వికసించి విశాలదళములుగల మనోహరములైన కమలములచేతను కలువలచేతను ఆ జలములు శోభిల్లుచుండును. అట్టి జలములుగల మహా సరస్సులు నాలుగుకలవు.

తూర్పున అరుణోదయ (ఎఱ్ఱని నీరుగలది), దక్షిణమున మానసము, పశ్చిమమున సితోదము (తెల్లనీరుగలది), ఉత్తరమున మహాభద్రము అనునవి ఆ సరస్సులు. తూర్పున ఉన్న అరుణోదయ సరస్సునుండి ఏర్పడిన పర్వతములు ఎవ్వియో విస్తరముగా జెప్పెద వినుడు. సీతాంతము (చల్లని స్వభావము గలదియు) కుముంజము (గజిబిజిగా నున్న ముంజ గడ్డి గలదియు), సువీరము) (చక్కని వీరులుగలదియై సంవీరమను) ఒక పర్వత శ్రేష్ఠము కలదు. వికంకము (రాపులుగులు లేనిదియు) మణిశీలము (మణులే స్వభావ మైనదియు) అయిన వృషభమును తరువాత నీలము (నల్లనిదియు) రుచకము (మంగళ ద్రవ్యము గలదియు) సబిందువు (నీటిబొట్లు కలదియు) (మందరము వేణమంతము) వెదురు వృక్షములు గలదియు) సేమేధము (మంచి మేధాశక్తిగలవారుండు నదియు) దేవపర్వత నిషధమను కలదు. పర్వతము ఈ పర్వత శ్రేష్ఠములును, తక్కిన పర్వతములును మందరమునకు తూర్పున కలవు. అవి సిద్ధులకు ఆవాసములుగా ఉన్నవి.

మానస సరోవరము యొక్క దక్షిణపు వైపున ఉన్న మహా పర్వతముల పేరులను వినుడు. మూడు శిఖరములుగల పర్వతము (త్రిశిఖరము) శిశిరము అను పర్వత శ్రేష్ఠము, కల్దింగము, పతంగము, రుచకము, సానుమంతము, తామ్రాభము (రాగి యొక్క కాంతి గలది), విశాఖము, శ్వేతోదరము, సమూలము, విషధారము, రత్నధారము, ఏకశృంగము, మహా మూలము, గజశైలము, పిశాచకము, పంచశైలము, కైలాసము, పర్వతశ్రేష్ఠమైన హిమవంతము. అనునవి దేవతలు నడచిన ఉత్కృష్టములైన పర్వత శ్రేష్ఠములు దివ్య తేజముగల మేరుపర్వతము యొక్క దక్షిణ దిగ్భాగమున ఉన్నవి. ఓ బ్రాహ్మణోత్తములారా! సితోదర సరస్సు యొక్క పశ్చిమమున ఉన్న ఉత్తమములైన మహాశైలములు. సువక్షము, శిఖిశైలము, కాలము, వైదూర్యము, కపిలము, పింగలము, రుద్రము, సురసము, కుము దము, మధుమంతము అనునవి. - అంజనీ మకుటము, కృష్ణము, పాండరము, సహస్ర శిఖరము, పారియాత్రము, త్రిశృంగము అనునవి పశ్చిమ పర్వతోత్తమములుగా చెప్పబడినవి. శోభావంతమైన మహాభద్ర సరస్సుకు ఉత్తరమున ఉన్న పర్వతములను పూర్వము చెప్పిన వానిని వరుసగా చెప్పెదను. శంకుకూటము, మహాశైలము, వృషభము, హంస పర్వతము, నాగము కపిలము, ఇంద్రశైలము, సానుమంతము, నీలము, కనక శృంగము, శతశృంగము, పుష్పకము, మేఘశైలము, విరాజము, జారుధి, అనునవి పర్వత శ్రేష్ఠములు. ఇవి ఉత్తర పర్వతములు అనబడినవి. ఈ ప్రధాన శైలముల మధ్యనున్న స్థలులు (మెట్టు నేలలు), ద్రోణులు (పసులుమేయు కంచెలు-కొండ పల్లములు) సరస్సుల గురించి చెప్పుచున్నాను వరుసగావినుడు. (36)