వాయు మహా పురాణము
ఋషి లక్షణము
సూతుడు అనెను:
యుగములలో పుట్టు ప్రజలను వినుడు. ఏ యుగమున అసురజాతి పుట్టుకయు, సర్ప, గో, పక్షి, పిశాచ జాతి పుట్టుకయు, యక్ష, రాక్షస జాతి పుట్టుకయు కలుగునో వారి జీవితము మొత్తము (నిండు)గా ఉండును. పిశాచులు, అసురులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సర్పములు - వీరు మృత్యు వధలు లేకుండా ఒక్క యుగము అంతయు జీవింతురు. స్థావరములతోబాటు మనుష్యులయొక్కయు, పశువుల యొక్కయు, పక్షుల యొక్కయు ఆయువు యుగధర్మములలో అంతటను వ్యాపించినది. కలియుగమునందు ప్రాణుల ఆయుష్యమునకు ఒక స్థితి కనబడదు. కలియందు మనుష్యులకు పరమాయువు నూరేండ్లు. దేవాసురుల ప్రమాణమునుండి ఏడంగుళములు తగ్గుచు (మానవుల ఎత్తు) నిండుగా నూటయేబది ఎనిమిది అంగుళములైనది. కలియందు పుట్టినవారిచే దేవ - అసురుల ఎత్తుల ప్రమాణము వారి ఎనుబది నాలుగు అంగుళములు. మనుష్యుని పాదములనుండి తలవరకుగల ఎత్తు తనఅంగుళ ప్రమాణముతో చెప్పబడినది. ఈ మనుష్యుని ఎత్తు ఇచట కలియుగమున తగ్గుచుండును. అన్ని యుగముల కాలములలోను, భూత భవిష్యత్ కాలములలోను తన అంగుళ ప్రమాణముతో నరుడు ఎనిమిది తాలముల ప్రమాణము కలవాడుగా ఉండును. (తాలము=బొటన వ్రేలు నడిమి వ్రేలు ఇవి రెండును చాచగా ఏర్పడిన నడిమికొలత) పాదమునుండి తలవఱకు తొమ్మిది తాలముల ప్రమాణము ఎత్తు కలవాడును, శరీర మధ్యమునకు సందులు లేక యాను కొనగలిగి మోకాళ్లవఱకు పొడవుగా ఉన్న బాహువులు (చేతులు) కలవాడు అసురులచేత గూడ పూజింపబడును. గోవులు, ఏనుగులు, దున్నపోతులు, కదలక స్థిరముగా ఉండు వృక్షాదులు వీనికి పై కాలయోగముచేత యుగయుగమున తరగుట పెఱుగుటయును కలుగుచుండును. పశువుల (యెద్దుల) మూపురము డెబ్బదిఆరు అంగుళముల ఎత్తు ఉండుననియు, ఏనుగల ఎత్తు సంపూర్ణముగా, ఎనిమిది వందల అంగుళములు ఉండుననియు గుఱ్ఱములకు ఐదువందల అంగుళములు ఉండును. తత్త్వదర్శనము చేసినందున మనుష్య శరీర సన్నివేశము వంటిదే దేవతల శరీర సన్నివేశము (కూర్పు) ఉండును. దేవతల శరీరము బుద్ధి అతిశయముతో కూడినదనియు, దేవతలను మించని మనుష్య శరీరమనియు చెప్పబడినది. ఇవి దేవ మనుష్యులను చుట్టియున్న భావములు. పశువులయొక్క, పక్షులయొక్కయు, స్థావరములైన వృక్షాదులయొక్కయు భావములను వినుడు. గోవులు, మేకలు, దున్నలు, గుఱ్ఱములు, ఏనుగులు, పక్షులు, పర్వతములు ఇవి ఇచ్చట (భూలోకమున) యజ్ఞ క్రియలలో అంతట ఉపయుక్తము లైనవి. ఆ రూపములలో ఉండియే అవి మరల దైవ స్థానములలో పుట్టును. దేవతలయొక్క శుభమూర్తులు వారి ఆశయమును అనుసరించిన ఉపభోగములు అగును. వాని యొక్క రూపములకు తగిన ప్రమాణములు కలిగిన, మనోహరములైన, సత్త్వభావములను తెలిసిన స్థావర జంగమములచే సుఖవంతులుగా అయిరి.
అందువలన శిష్టులను గూర్చియు, సత్పురుషులను గూర్చియు, సాధువులను గూర్చియు చెప్పెదను. ‘సత్’ అనునది బ్రహ్మయొక్క (వాచక) శబ్దం. బ్రహ్మవంతులు బ్రహ్మ సాయుజ్యమున ఉందురు. కావున వారు సంతులు అనబడుదురు. దశాత్మకమైన విషయమైనను అష్ట లక్షణములుగల కారణమునను కోపింపక సంతసించి ఉండువారు జితాత్ములు అనబడుదురు. సామాన్య ధర్మములందును, వైశేషిక (విశేష) ధర్మములందును బ్రాహ్మణ - క్షత్రియ వైశ్యులు యుక్తులై ఉందురు. కావున వారు ద్విజాతులు అనబడిరి. శ్రౌత - స్మార్త ధర్మముయొక్క జ్ఞానమువలన వర్ణాశ్రమములందు ఉన్నదియు స్వర్గమార్గము నందు ఆచరించునదియు ధర్మము అనబడును. విద్యను సాధించుట వలన సాధువు అనబడు చున్నాడు. బ్రహ్మచారియై గురువునకు హితుడై క్రియలను సాధించుట వలన గృహస్థుడు, సాధువు అనబడుచున్నాడు. అరణ్యమున తపస్సును సాధించుట వలన వైఖానసుడు సాధువు అనబడుచున్నాడు. ప్రయత్నము చేయుచున్న యతి గూడ యోగమును సాధించుట వలన సాధువు అనబడుచున్నాడు. గృహస్థుడును, బ్రహ్మచారియు, వానప్రస్థుడును, భిక్షుకుడును, ఈ విధముగ ఆశ్రమ ధర్మములను సాధించుటవలన సాధువులు ఇది ధర్మము, ఇది అధర్మము - అని చెప్పువారు అనబడినారు. అభిన్న దర్శనులు (జీవాత్మ పరమాత్మ ఐక్యమును చూచువారు దేవతలుకారు, పితరులు కారు, మునులునుకారు, మానవులును కారు, మానవులుగూడ (అభేదము జూచువారు) కారు.
ఇచట ధర్మాధర్మ శబ్దములు క్రియాత్మకముగా చెప్పబడినవి. కుశలాకుశల కర్మలు ధర్మాధర్మములు అనబడినవి. ధారణ అనగా ధృతి అను అర్థముగల (ధృ) ధాతువు వలన ధర్మముఅను శబ్దముచెప్పబడినది. ధరింపనపుడు, మహత్త్వము లేనపుడు, అధర్మము అని చెప్పబడును. ఇచట ఇష్టములను (కోరిన వానిని)పొందించు ధర్మములు ఆచార్యులచే ఉపదేశింపబడును. వృద్ధులు, లోభము లేనివారు, ఆత్మవంతులు, దంభములు లేనివారు మంచి వినయము గలవారు. ఏవంకరలు లేక చక్కగా నడచుకొనువారును - వీరిని ఆచార్యులుగా చెప్పుదురు. ఆచార్యుడు తాను ఆచరించినందున, ఆచారమును స్థాపించినందున, యమములతోను, మంచి నియమములతోను కూడినవాడై శాస్త్రార్థములను పరిశీలించియు చేయదగిన వానిని సమకూర్చుకొన్నందునను - అవి ఆచారములైనవి. సప్తర్షులు పూర్వుల నుండి తెలిసికొని, ఇచట (భూలోకమున) శ్రౌతమును (వేద ధర్మమును) చెప్పిరి. ఋక్కులు (ఋగ్వేదము), యజుస్సులు (యజుర్వేదము), సామములు (సామవేదములు), వేదాంగములును (శిక్షా, వ్యాకరణ, ఛందస్, నిరుక్త, జ్యోతిషములు) ఇవి శ్రుతి అనబడును. వీనిచే చెప్పబడిన ధర్మము శ్రౌతము. గడచిన మన్వంతరము యొక్క ఆచారమును స్మరించి ఆచారమును మరల ఋష్యాదులు చెప్పిరి. కావున వర్ణాశ్రమ విభాగమువలన పుట్టి స్మరింపబడి ధర్మము స్మార్తమైనది. ఈ రెండు విధములైన (శ్రౌతస్మార్త) ధర్మము ఇచట శిష్టాచారము అనబడును. శేష శబ్దమువలన శిష్ట శబ్దము ఏర్పడినది. శిష్టమయిన ఆచారము శిష్టాచారము. మన్వంతరములలో మిగిలి ఉన్న వారు ఇట ధార్మికులుగా ఉందురు. లోకసంతాన కారణమువలన ధర్మార్థముగా మిగిలిన మనువు, సప్తర్షులును ఉన్నది ఉన్నట్లుగా ఆచారమును చెప్పుదురు. పూర్వయుగమునుండి మిగిలి ఈ యుగమునఉన్న వారును ఇంతకు పూర్వము నాచే చెప్పబడినవారును అయిన శిష్టులచే ప్రతి యుగమున చక్కగా ఆచరింపబడినది ధర్మము. త్రయీ, వార్తా, దండనీతి, ఇజ్యా, వర్ణాశ్రమములును శిష్టులచేతను మనువుచేతను, పూర్వులచేతను మరల మరల ఆచరింపబడినవై పూర్వగత మైనందునను ఆ శిష్టాచారము (ధర్మము) శాశ్వతము. దానము, సత్యము, తపస్సు, లోభము, లేమి, విద్య, ఇజ్యా (యాగము చేయుట), ప్రజనీ (సంతానము) దయ - అను ఈ ఎనిమిదింటి ఆచరణములును, ఆచారము యొక్క లక్షణము. సమస్త మన్వంతరములలో శిష్టులును, మనువు సప్తర్షులును ఈ ఆచారము ఆచరించుటచే శిష్టాచారము అనబడినది. చెవులతో వినుటచే తెలిసినది శ్రౌతము స్మరించుట వల్ల వచ్చినది స్మార్తము - అనబడినవి. వేదాత్మమైన యజ్ఞము శ్రౌతము. వర్ణాశ్రమాత్మకమైనది. స్మార్తము. వాని ప్రత్యంగములను ధర్మముయొక్క లక్షణముగా చెప్పెదరు.
అధిక ధనమును చూచియు ఇతరులు అడిగినప్పుడు దాచకుండుట, జరిగినది జరిగినట్లు చెప్పుటయు - అనునిది సత్యము యొక్క లక్షణము. బ్రహ్మచర్యము, తపము, మౌనము, ఆహారములేమియు అనునవి తపస్సునకు మూలము. అవి భయంకరమై పొందుటకు అలవి గానివి. పశువులయొక్కయు, ద్రవ్య - హవిస్సుల యొక్కయు, ఋక్సామ, యజుర్వేదములయొక్కయు, ఋత్విక్కులయొక్కయు, దక్షిణలయొక్కయు సంయోగము యోగము అనబడును. తనయందువలనే సర్వ ప్రాణులయందును హితాహితములై సమముగా ప్రవర్తించిన దృష్టి అంతయు దయ అనబడినది. లాగబడినను, కొట్టబడినను ఏడువక, కొట్టక మనో, వాక్, కర్మలతో ఓర్పువహించి ఉండుట క్షమ అనబడును. మట్టిలో స్వామిచే (ధనస్వామిచే) రక్షింపబడుచున్నవి గాని, ఇతరుల సొమ్ములను దానము చేయకుండుట అలోభమని చెప్పబడును. మైధునము ఆచరింపకుండుట (స్త్రీ సంభోగము చేయకుండుట) దానిని చింతింపకుండుట, దానిని కల్పించుకొనకుండుట ఈ విధముగా దాని నుండి నివర్తించుట బ్రహ్మచర్యము. అది రంధ్రములేని దమము అనబడును. తనకైగాని, పరులకైగాని ఇంద్రియములను అసత్యముగా బ్రవర్తింపజేయ కుండుట శమముయొక్క లక్షణము. దశాత్మకమైన విషయమున ఎనిమిది లక్షణములుగల కారణముండగా ఎట్టఎదుట కొట్టబడియు కోపింపనివాడు జితాత్ముడని విశిష్టముగ భావింపబడును. న్యాయముగా వచ్చినదియు తనకు మిక్కిలి ఇష్టమైనదియునైన ద్రవ్యమును గుణవంతునకు ఈయవలెనని ఇచ్చుట దానలక్షణము. దానము అన్నది కనిష్ఠము, జ్యేష్ఠము, మధ్యమమని మూడు విధములు. అందులో సర్వమంగళమునకై (మోక్షమునకై చేయు దానము జ్యేష్ఠము. స్వార్థసిద్ధికై చేయు దానము కనిష్టము. సర్వ భూతములకు కారుణ్యముతో ఇచ్చునదియు బంధువులలో చక్కగా విభాగముజేసి ఇచ్చునది అధమము.
శృతి స్మృతులచే చెప్పబడినది వర్ణాశ్రమాత్మకమైనది ధర్మము, శిష్టాచారమునకు విరుద్ధము కానిది, సత్సాధువులను అంటి ఉన్నది ధర్మము. ఇష్టముగానివారిని ద్వేషింపకుండుట ఇష్టమైనవారిని అభినందింపకుండుట, ప్రీతి, తాపము, విషాదము - వీని నుండి మఱలి పోవుట, విరక్తత అనబడును. చేసిన వానిని చేయనివానిని చేర్చియుంచుట (చేయనట్లుగ భావించుట) సన్యాసము కుశలమును, అకుశలమును రెంటిని వదలుట త్యాగము అనబడును. ఈ అచేతనమున అవ్యక్తమునుండియు, అవిశేషమునుండియు వికారము కలుగును. చేతన - అచేతనత్వములు విజ్ఞానమే జ్ఞానము అనబడును. పూర్వము స్వాయంభువ మన్వంతరమున ధర్మతత్త్వజ్ఞులచేత చెప్పబడిన ఇది ధర్మముయొక్క ప్రత్యంగముల లక్షణము.
ఇచట మీకు మన్వంతర విధిని ఇతరేతర విధిని, చాతుర్వర్ణ్య విధిని వివరింతును. ప్రతి మన్వంతరమున వేరు శ్రుతి విధింపబడును. ఋక్కులు, యజుస్సులు, సామములు, భూతప్రళయము వఱకును ఒక శతరుద్రీయమును వదిలి ప్రతి దేవతను గూర్చి ఉన్నది ఉన్నట్లే ఉపయోగింపవలెను. విధియు, హోత్రమును, స్తోత్రమును పూర్వము వలెనే ప్రవర్తిల్లును, ద్రవ్యస్తోత్రము, గుణస్తోత్రము, కర్మస్తోత్రము అభిజనిక స్తోత్రము అని ఈ స్తోత్రము నాలుగు విధములు. మన్వంతరములు అన్నింటిలోనున్న దేవతలకు నాలుగు విధములగు బ్రహ్మస్తోత్రము ప్రవర్తింప చేయబడును. ఈ విధముగ మంత్ర గుణముల ఉత్పత్తియు నాలుగు విధములు. అథర్వ, యజుస్, సామ వేదములలో వేరు వేరుగా ఈ లోకమున ఆచరింప అలవికాని ఉగ్రతపమును ఋషులు ఆచరించుచుందురు. పూర్వ మన్వంతరములలో ఇచ్చట తపమాచరించు మునుల యొక్క సంతోషము వలనను, భయమువలనను, దుఃఖమువలనను, సుఖమువలనను, శోకమువలనను, మంత్రములు ఐదు విధములుగా పుట్టినవి. స్వేచ్ఛగా ఋషుల తపమును పూర్తిగా చూచుటచేత ఋషులు ఋషిత్వమును లక్షణములతో చెప్పెదను.
భూత భవిష్యత్కాలములలోని ఋషులు ఐదు విధములు. అందువలన ఋషుల పుట్టుకను, ఋషిసంబంధముల పుట్టుకను చెప్పెదను. ఏ ఎక్కువ తక్కువలు లేక సత్త్వ, రజస్, తమో గుణములు సమోము లైనపుడు సర్వ సంప్రళయము ఏర్పడును. దేవతలకు ఇంద్రియములకు అతిచారము వచ్చినపుడును అతిదేశము వచ్చినపుడును, జరిగినట్లే ఆత్మతత్త్వము చేతనమునకై ప్రవర్తించును. అందుచేత అబుద్ధి పూర్వకము కాకుండానే ఆత్మతత్త్వము చేతనతో అధిష్టింపబడును. చేప, నీరును కలిసి ఉన్నట్లే చేతనాధిష్టితమైన తత్త్వము గుణస్వరూపమై ప్రవర్తించును. కరణమగుట వలన దానికి కారణము గూడ ప్రవర్తించును. విషయమున విషయందగుట వలనను అర్థమున అర్థి అగుటవలన, కాలమును బట్టి పొందదగిన భేదములు కారణాత్మకములగను పుట్టినవి. ఆ భూతముల యొక్క భేదములు వాని పరస్పర భేదములవలన పుట్టినవి. సంసిద్ధికారణమైన కార్యము అప్పటికప్పుడే మారును. కొఱవి విఱుగుచు నొక్కమారుగ పైకి బోవును. అట్లే క్షేత్రజ్ఞుడు, (జీవుడు) ఒకే కర్మతో వివృత్తుడగును. (మార్పుచెందును) చీకటిలో మిణుగురుపురుగు అకస్మాత్తుగా కనబడినట్లే క్షేత్రజ్ఞుడు (జీవుడు) అవ్యక్తము నుండి మార్పుచెంది (వెలిగిన) మిణుగురు పురుగువలెనే స్పష్టమయి కనిపించును. ఆ మహాన్ (గొప్పవాడు, మహ ద్రూపుడు) సశరీరుడై ఎదుట ఉన్నచోటనే ద్వారశాలా ముఖమున ఉన్నవాడై విద్వాంసుడు ఉండును. మహానుడు తమస్సునకు బయట వైలక్షణ్యము వలన భావింపబడును. అచటనే తమస్సునకు చివర విద్వాంసుడు ఉండునని వేదము చెప్పును. పరిభ్రమించుచు మారుచున్న వాని నాలుగు విధములైన బుద్ధి పుట్టినది. జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, ధర్మం అనునవి - ఆ నాలుగు విధములు. ఇక, ఈ సావయవ స్పష్టములైన సాంసిద్ధికములు మహత్ స్వరూపుని సశరీరుడైన మహత్ స్వరూపుడు తిరిగి వచ్చుటవలన సిద్ధికలుగును. ఇచట పురము(శరీరము) నందు శయనించుటచేత గాని జీవుల యొక్క శరీరమున శయనించుట చేతగాని, పురమున శయనించుట వల్లను, క్షేత్ర జ్ఞానము వల్లను పురుషుడు అనబడుచున్నాడు. క్షేత్రజ్ఞుడు (జీవుడు) తన క్షేత్రమగు శరీరమును తెలిసికొనుటచే భగవంతుడైన మతి అనబడుచున్నాడు. బుద్ధితో శయనించుట వల్ల అతడు బోధాత్మకుడైనాడు. సంసిద్ధి కొఱకే వ్యక్తావ్యక్తము అచేతన మైనది. ఈ విధముగా క్షేత్రజ్ఞ (జీవ) రూపమైన నివృత్తి క్షేత్రజ్ఞు(జీవు)ని చే అభిసంహితమై (కూడినదై)నది. క్షేత్రజ్ఞు(జీవు)నిచే పూర్తిగా తెలియబడినవీడు భోగ్యమైన విషయము అని చెప్పబడినది.
‘ఋషి’అను ధాతువుగతియందును, శ్రుతి యందును, సత్యమునందును తరువాత తపస్సునందును వర్తించును. ఇది (గత్యాద్యర్థము) ఋష ధాతువున సన్నియతము కాగా బ్రహ్మచేత ఆ ఋషి ఆ అర్ధముననే స్మరింపబడెను. నివృత్తికి సమకాలముననే బుద్ధిచే స్వయముగా ఋషి వ్యక్తమయ్యెను. పరమితనిచే పొందబడును గాన పరమర్షి అనబడినాడు. మొదటినుండియు గత్యర్థకమైన ఋషధాతువు నుండి ఋషినామ నిర్వృత్తి జరిగి నందునను, ఋషి స్వయంభూతుడగుట వల్లను, ఆత్మర్షి అనబడినాడు. ఈశ్వరులు బ్రహ్మయొక్క మానసము నుండి స్వయముగా పుట్టిన వారు. గొప్పవాడు ఎదుట అందరితో ప్రశంసింపబడినవాడై, తక్కువగా లెక్కింపబడడు. ధీరులు అంతటను గుణములచే గొప్ప వానిని చేరుదురు. అందువలన మహర్షులుబుద్ధికంటె పరమమును చూచువారు. ఆ ఋషులు ఆ ఈశ్వరులకును శుభస్వరూపులు. వారు అహంకారమును తమస్సును వదిలి ఋషిత్వమును పొందిరి. అందువలన అ ఋషులు (పంచ భూతములకు ముందే తత్త్వ దర్శనులు (తత్త్వమును జూచువారు) ఋషి పుత్రులైన ఋషీకులు మైధునము వలన గర్భం నుండి పుట్టిన వారు. ఈ మహౌజస్కులు తన్మాత్ర (శబ్ద స్పర్శ రూప రసగంధము) లను, సత్యమును పొందుదురు. అంత వారు సత్యర్థులై పరములై సత్యదర్శనులు అగుదురు. ఋషులయొక్క పుత్రులైనవారు ఋషి పుత్రకులు, శ్రుతమును (వేదమును) దాని విశేషములను నిజముగా పొందుచున్నారు. కావున శ్రుతమును పూర్తిగా చూచువారై వారు శ్రుతర్షులు అగుదురు. అవ్యక్తాత్మ, మహాత్మ, అహంకారాత్మ, భూతాత్మ, ఇంద్రియాత్మ - అని ఆ ఋషులు జ్ఞానముగా చెప్పబడిరి. ఈ విధముగా ఋషుల జాతులు పేరులతో ఐదు - వానిని వినుడు.
భృగువు, మరీచి, అత్రి, అంగిరసుడు, పులహుడు, క్రతువు, మనువు, దక్షుడు, వసిష్ఠుడు, పులస్త్యుడు - అని వారు పదుగురు. మహాత్ములై ప్రవర్తించినందున ఆ ఋషులు మహర్షులు అనబడినారు. ఈ ఋషులు ఈశ్వరులయొక్క సుతులు. వారినిగూర్చి వినుడు. కావ్యుడు, బృహస్పతి, కశ్యపుడు, ఉశనసుడు, ఉతథ్యుడు, వామదేవుడు, అపోజ్యుడు, ఐశిజుడు, కర్దముడు, విశ్రవసుడు, శక్తి, వాలఖిల్యులు, ధరులు - అను వీరు జ్ఞానమున ఋషిత్వము పొందిన ఋషులుగా జెప్పబడినారు. ఋషిపుత్రులై గర్భమున పుట్టిన ఋషికులను గూర్చి వినుడు. వత్సరుడు, నగ్రహుడు, భారద్వాజుడు, బృహదుక్థుడు, శరద్వతుడు, అగస్త్యుడు, ఔశిజుడు, దీర్ఘతమర్షి, బృహదుక్ధుడు, శరద్వతుడు, వాజశ్రవసుడు, సువిత్తుడు, సువాక్కు వేషపారాయణుడు, దధీచుడు, శంఖమంతుడు, వైశ్రవణరాజు - అను వీరు సత్యము వలన ఋషిత్వమును పొందిన ఋషికులుగా జెప్పబడినారు.
ఈశ్వరులు, ఋషికులు, అట్లే చెప్పబడిన తక్కినవారును - వీరందరు మంత్రకర్తలు. వారిని గురించి పూర్తిగా వినుడు - భృగువు, కావ్యుడు, ప్రచేతసుడు, దధీచి, ఆత్మవంతుడు, జౌర్వుడు, జమదగ్ని, విదుడు, సారస్వతుడు, అద్విషేణుడు, అరూపుడు, వీతహవ్యుడు, సుమేధసుడు, వైన్యుడు, పృథువు, దివోదాసుడు, ప్రశ్వరుడు, గృత్సమదుడు, నభుడు - ఈ పంతొమ్మండ్రు ఋషులు మంత్రవాదులు. అంగిరసుడు, వేధసుడు, భారద్వాజుడు, బాష్కలి, అమృతుడు, గార్గ్యుడు, శౌని, సంహృతి, పురుకుత్సుడు, మాంధాత, అంబరీషుడు, ఆహార్యుడు, అజామీఢుడు, ఋషభుడు, బలి, పృషదశ్వుడు, విరూపుడు, కణ్వుడు, ముద్గలుడు, యువనాశ్వుడు, పౌరుకుత్సుడు, త్రాసదస్యుడు, దస్యుమంతుడు, ఉతథ్యుడు, భరద్వాజుడు, వాజశ్రవసుడు, ఆయాప్యుడు, సువిత్తి, వామదేవుడు, జౌగజుడు, బృహదుక్థుడు, దీర్ఘతపుడు, కక్షీవంతుడు - ఈ ముప్పది ముగ్గురు అంగిరస సోదరులు. వీరందరు మంత్రకర్తలు. ఇక కాశ్యపులను వినుడు.
కాశ్యపుడు, వత్సారుడు, విభ్రముడు, రైభ్యుడు, అసితుడు, దేవలుడు ఈ ఆఱుగురు బ్రహ్మవాదులు. అత్రి, అర్చిసనుడు, శ్యామావంతుడు, నిష్ఠురుడు, వల్గూతకుడు, ముని ధీమంతుడు, పూర్వాతిథి - వీరు అత్రులుఅనబడిరి. వీరు మంత్రకారులైన మహర్షులు. వసిష్ఠుడు, శక్తి, పరాశరుడు, నాల్గవవాడు ఇంద్రప్రమతి, ఐదవవాడు భరద్వసువు, ఆఱవవాడు మూత్రావరుణుడు, ఏడవవాడు కుండినుడు, ఎనిమిదవవాడు సుద్యుమ్నుడు, తొమ్మిదవవాడు బృహస్పతి, పదవవాడు భరద్వాజుడు. వీరు మంత్ర బ్రాహ్మణ కారకులు. వీరు కర్తలు, విధర్మధ్వంసకారులు. సర్వ శాఖీయుల బ్రహ్మకు (వేదమునకు) ఇది లక్షణముగా జెప్పబడినది.
హేతు శబ్దము హననార్థకమైన ‘హి’ ధాతువునుండి ఏర్పడిన ఇతరులచే లేవనెత్తిన వాదమును ధ్వంసము చేయునది. ఇతరులచే లేవనెత్తిన వాదమును ధ్వంసము చేయునది అను అర్థమున హేతుశబ్దము ఏర్పడినది లేదా గతి కర్మకమైన ‘హి’ ధాతువు వలన కార్యరూపమైన అర్థమును పొందును అను అర్థమున హేతుశబ్దము ఏర్పడినది వాక్యార్థమును నిశ్చయించునట్లుగా నిర్వచనమును చెప్పవలయును. ఏ దోషము వలన వాక్కు (మాట) నిందింపబడునో దానిని నిందగా ఆచార్యులు చెప్పుదురు. ప్రపూర్వమైన ‘శంసు’ ధాతువునుండి ప్రశంసాపదము ఏర్పడినది. గుణవంతమని చెప్పుట ప్రశంస. ఇది ఇదికాదు అని నిశ్చయింపలేమి సంశయము. ఇదియే చేయతగినది. అనునది విధి అనబడును. ఇతరులకు చెప్పబడుట వలన బుధులచే పరకృతి అనబడును. అతి మిక్కిలిగా చెప్పబడినది పురాకల్పము అనబడును. పూర్వపు పరాక్ర మించుటను చెప్పుట వలన పురాకల్పముయొక్క కల్పన జరుగును. మంత్ర బ్రాహ్మణ కల్పములచేతను. శుద్ధమై విస్తరమైన నిగమముల లేక వేదములచేతను నిశ్చయింపక చేయబడిన దానిని వ్యవధారణ కల్పనము అందురు. ఇది ఎట్లో అదిఅట్లే ‘ఇదికూడ ఎట్లో అదికూడ అట్లే - అని ఈ విధమగు బ్రాహ్మణుని యొక్క ఉపదేశము పదవది. అనునది బుధుడు బ్రాహ్మణునకు మొదట చెప్పిన లక్షణము. ఆ బ్రాహ్మణునకు ఆ వృత్తి ఉద్దేశింపబడినది. బ్రాహ్మణులచే వెంటనే వ్యాఖ్యగూడ ఉద్దేశింపబడినది. వేదవిధిచే చూడబడిన కర్మలలో మంత్రముల కల్పనము కూడ ఉద్దేశింపబడినది. ‘మంత్ర’ అను ధాతువునుండి మంత్రము (శబ్దము) వచ్చినది. బ్రహ్మ (వేదము) యొక్క రక్షణమువలన బ్రాహ్మణుడు అయినాడు. (వేద రక్షణము బ్రాహ్మణ లక్షణము). అల్పాక్షరములు కలదియు, సందేహములేనిదియు, సారవంత మైనదియు, విశ్వతోముఖమైన దియు (అంతట ప్రవర్తిల్లునదియు) ఆపు లేనిదియు, నిందలేనిదియు సూత్రమని సూత్రవేత్తలు చెప్పుదురు.