వాయు మహా పురాణము
ప్రజాపతి వంశానుకీర్తనము
ఋషులు అనిరి:
బుద్ధిమంతుడైన సూతుడు చెప్పి రెండవ పాదమును విని, శాంశపాయనుడు అను క్రమముగా నీవు రెండవ పాదమును చెప్పితివి. మూడవ పాదమును ఉపోద్ఘాతముతో వివరించుము అని అడిగెను. ఈ విధముగా అడుగబడిన సూతుడు సంతుష్టాంతరంగుడై ఉపోద్ఘాతముతో బాటు విస్తరముగా మూడవ పాదమును మొదటి నుండి చెప్పెదను వినుడు. ఓ ద్విజులారా! మహాత్ముడైన ఇప్పటి వైవస్వతమనువు యొక్క సృష్టిని పూర్వాను క్రమముగా విస్తరముగా చెప్పుచున్నాను వినుడు. డెబ్బది యొక్క చతుర్యుగముల (కృతాది కల్యంత యుగముల) పూర్వమే దేవ గణములతోను, ఋషులతోను, దానవుల తోను, పితృ, గంధర్వ, యక్షులను దేవగణములతోను, రాక్షస, భూతగణములతోను, మనుష్యులతోను, పశువులతోను, పక్షులతోను చెట్లు మొదలగు స్థావరములతోను, మనువు మొదలు భవిష్యము వరకుగల ఆఖ్యానములతో (కథా ప్రవచనములతో)ను, వైవస్వత (మన్వంతర) సృష్టిని సూర్యునకు నమస్కరించి చెప్పెదను.
మొదట మన్వంతరమున గడచిన సృష్టులును, వానిని ప్రవర్తింప చేయువారును స్వాయంభువ మన్వంతరమున ఏడుగురు మహర్షులుగా ఉండిరి. చాక్షుస మన్వంతరము గడచి మరల వైవస్వతమన్వంతరమురాగా, మహేశ్వరుని శాపమువలన దక్షుని యొక్కయు, మహౌజస్కులై, మహాత్ములైన భృగువు మొదలగు ఋషులయొక్కయు ప్రాదుర్భావము జరిగినది. మరల ఆ సప్తర్షులు మానససృష్టిగా పుట్టిరి. స్వయంభువుడైన బ్రహ్మచే తన పుత్రులుగా చేయబడిరి. ప్రజాసంతాన కారులై పుట్టుచున్న ఆ మహాత్ములచే గ్రహ, నక్షత్రములతో అలంకరింపబడిన సృష్టి మరల ప్రవర్తింపబడినది. విశుద్ధమైన జ్ఞానము కర్మలును కల్గిన వారియొక్క (సప్తర్షుల యొక్క) సంతానమును సంగ్రహ విస్తరములతో అను క్రమముగ చెప్పెదను.
ఆ ఋషుల వంశములచేత పుట్టిన సృష్టి ఈ చరాచరములతో నిండినదై గ్రహ నక్షత్రములతో అలంకరింపబడినదై మరల ఆవిర్భవించినది. అతని ఈ వచనమును విని మునులకు సంశయము కలిగెను. తరువాత సంశయముతో గూడిన వారై ప్రశంసింపబడిన వ్రతములుగల ఆ మునులు సూతుని సత్కరించి పూర్వము సప్తర్షులు మానస సృష్టిగా ఎట్లు పుట్టిరి? బ్రహ్మచే వారు పుత్రులుగా ఎట్లు చేయబడిరి? ఓ పండితశ్రేష్ఠా! మాకు చెప్పుము అనిరి. తరువాత మహాతేజస్వియైన సూత పౌరాణికుడు శుభముగా ఇట్లుచెప్పెను. స్వాయంభువమన్వంతరము నందలి సప్తర్షులు మరల వైవస్వత మన్వంతరమునచేరి సిద్ధులైరట. వారు అప్పుడు శివుని శాపమునకుగురి అయిన వారై తపోలోకమును చేరలేదు. తరువాత వారు ‘జన’ లోకమునకు మరలి వచ్చిచేరిరి. అటు పిమ్మట ఆ మహర్షులు అందరు ఆ ‘జన’ లోకమున దారుణమైన క్రతువు ఏర్పడగా పరస్పరముగా ఇట్లనుకొనిరి. చాక్షుష మన్వంతరమున మనమందరము బ్రహ్మ (మానస) పుత్రులమై జన్మించెదము. దాని వలన శ్రేయస్సు కలుగును. స్వాయంభువమన్వంతరమున సప్తార్థముగా శపింపబడినవారై, ఈ లోకమున మరల జనించిరి. తరువాత జనలోకము నుండి దివమునకు (స్వర్గమునకు) వెడలిరి. మహాదేవుని యజ్ఞమున బ్రహ్మ వరుణ శరీరమును ధరించెను. సంతానేచ్ఛతో అగ్నిలో అతని శుక్రమును హోమము చేయుచుండగా దాని నుండి ఈ ఋషులు పూర్వము రెండవ మారుగా జన్మించిరి అని వినికిడి, భృగువు, అంగిరసుడు, మరీచి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వసిష్ఠుడును ఈ ఎనమండుగురు ఆ బ్రహ్మపుత్రులు.
అట్లే ఈతని (బ్రహ్మ) యొక్క విశాలమైన యజ్ఞమున దేవతలు అందరును వచ్చిరి. సమస్తములైన యజ్ఞాంగములును, వషట్కారమును, వేలకొలది సామములును, యజుస్సులును మూర్తిమంతములైనవి. అకారములను దాల్చినవి. పద క్రమములతో అలంకరింపబడిన ఋగ్వేదముగూడ అట మూర్తిమంతము అయ్యెను. వృత్తములతో గూడిన యజుర్వేదము, ఓంకారమే ముఖముగా ఉజ్జ్వలముగా వెలిగినదై, యజ్ఞమునకై జోడించిన సూక్తములు - బ్రాహ్మణములు, మంత్రములునుగలదై ఉండెను. సామవేదము గూడ వృత్తములతో ఒప్పినదై, సమస్త గేయములు ముందుగా ఉన్నదై, విశ్వావస్వాదుల తోను, గంధర్వుల తోను సంపాదింపబడి ఉండెను. బ్రహ్మ వేదము, అట్లే అది ఘోరములైన కృత్యావిధులతో కూడినదై, ప్రత్యంగిరస యోగములతోను గూడినదై రెండు శరీర - శిరములు గలది అయ్యెను. లక్షణములు, స్వరములు, స్తోభములు, నిరుక్త స్వరభక్తులును, ఆశ్రయమైన వషట్కారమును, నిగ్రహ - ప్రగ్రహములును (లక్షణములు). దీప్తమైన (మండిన) దీప్తి (వెలుగు) గల ఇలాదేవియు (భూదేవియు), పూర్వాది దిక్కులును, ఆగ్నేయాది కోణ దిక్కులును, వాకృతులును, దేవకన్యలును, పత్నులును, అట్లే మాతృ దేవతలును, ఆయువును - వీరందరును యజ్ఞము చేయుచున్న దేవుని (అగ్నిదేవుని) ఎదుట అంతటను ఆకారముగలవారై శరీరము దాల్చిన వరుణుని స్వరూపముతో ఆవిర్భవించిరి. వారందరిని జూచి స్వయంభువున (బ్రహ్మ)కు భూమిపై రేతఃపతనము అయ్యెను. అది బ్రహ్మర్షి భావనా విధానము వల్లనే జరిగినది. బ్రహ్మ దానిని స్రువముతో పరిగ్రహించి స్రుక్కులతో ఆజ్యము వలె మంత్రవంతముగా హోమము చేసెను.
దాని నుండి ఆ ప్రజాపతి (బ్రహ్మ) భూత సమూహమును సృష్టించెను. దానికి ముందుగనే యజ్ఞమందలి ఆ తేజస్సునకు లోకములలోని తైజసము అవిర్భవించినది. తమస్సుతో భావవ్యాప్యత్వ రూపమైన తమస్సు, అట్లే సత్త్వము, అట్లే రజస్సును జనించినవి. సగుణమైన తేజస్సు వలన ఆకాశమున తమమున నిత్యము (భూత గ్రామము) ఉన్నది. తమస్సు తేజస్సగుట వలన సర్వభూతములు జనించినవి. కర్మజులైన పుత్రులు దానియందు పుట్టినపుడు బ్రహ్మ తన శుక్రమును ఆజ్యస్థాలిలో (యజ్ఞపు నేతిపాత్రలో) తీసికొని హోమము చేసెనట. ఆ శుక్రము హోమము చేయబడగా దాని నుండి ప్రసవగుణముతో గూడినవారై శరీరములతో మిక్కిలి (అగ్నులవలె) ప్రకాశించినవారై సప్తమహర్షులు పుట్టిరి. అగ్నిలో శుక్రము ఒక్కమారు హోమము చేయగనే ఆజ్వాలతోనే కవి (శుక్రుడు) బయలు వెడలెను. ఆ తీరుగా మంటను భేదించుకొని బయలువెడలిన అతనిని బ్రహ్మచూచి, నీవు భగుృగుడవు అని పలికెనట. అందువలన అతడు భృగువు అయ్యెను. మహాదేవుడు శివుడు ఆ విధముగా జ్వాల నుండి బయలువెడలిన బ్రాహ్మణుని చూచి బ్రహ్మతో ఇట్లు అనెను. ఓ ప్రభూ! బ్రహ్మా! పుత్రకాముడనై, దీక్షితుడనైన నాకు ఈ భృగువు అను దేవుడు జనించెను. వీడు నా పుత్రుడు అగుగాక అని అనెను. బ్రహ్మదేవుడు అంగీకరించగనే మహాదేవుడు ఆ ‘భృగువును తన పుత్రునిగా చేసికొనెను. కావున వారుణులు భృగువులు అప్రభువైన భృగువు యొక్క సంతానము.
తరువాత రెండవ శుక్రము అగ్నిలో పడెను. ఆ అంగారములలో (శుక్రము) అంగములను కూర్చుకొని ప్రభువగు అంగిరసుడు అయ్యెను. ఆ విధముగ అంగిరసుని ఉత్పత్తిని చూచి అగ్ని బ్రహ్మతో ఇట్లనెను. ఓ బ్రహ్మా! నీ కొరకే నేను రేతస్సును ధరించితిని. ఈ రెండవవాడు నాకు పుత్రుడు అగు గాక - అని అడిగెను. అట్లే అగుగాక అని బ్రహ్మ సద సస్పతియైన అగ్నితో అనెను. కావున అంగిరసులు ఆగ్నేయులు అని మేమువింటిమి.
లోకకారియైన బ్రహ్మచే మరల అఱుమారులు శుక్రము హోమము చేయబడగా అందుండి ఆఱుగురు బ్రహ్మలు పుట్టిరి. అందులో మొదటివాడు మరీచి. మరీచుల (కిరణముల) నుండి పుట్టినవాడు. ఆ క్రతువునందు ఒక కొడుకు పుట్టెను. దానివలన అతడు క్రతువు అనబడెను. నేను మూడవ వానిని - అను అర్థముతో మూడవవాడు అత్రి (అహంత్రిః) అని కీర్తింపబడెను. నిశితములైన (వాడియైన) కేశములతో పుట్టినందున (తరువాతివాడు) పులస్త్యుడు అనబడెను. పొడవైన వెంట్రుకలతో పుట్టినందున (తరువాతి వాడు) పులహుడు అనబడెను. వసు (ధన) మధ్యము నుండి పుట్టిన (తరువాతి వాడు) వసుమంతుడై వసుధకు (భూమికి) ఆశ్రయుడై, తత్త్వజ్ఞులు అయిన బ్రహ్మవాదులచే వసిష్ఠుడు అనబడెను. ఈ ఆఱుగురు మహర్షులు బ్రహ్మ మానసపుత్రులు. లోకమునకు సంతాన కారులు, వీరిచే ప్రజలు వృద్ధి చేయబడిరి. బ్రహ్మ పుత్రులైన వీరు ప్రజాపతులు అనబడుదురు.
ఈ మహర్షుల చేతనే జనించిన పితరులు అను వేఱిక ఋషి గణములు ఏడు. లోకములలో ప్రసిద్ధములు. మారీచగణములు, భార్గవగణములు, అంగిరసగణములు, పౌలస్త్యగణములు, పౌలహ గణములు, వాసిష్ఠ గణములు, ఆత్రేయ గణములు - అనునవి లోక ప్రసిద్ధములైన పితృగణములు. ఓయి! వీరు సంగ్రహముగా పూర్వమే మూడు గణములుగా చెప్పబడిరి. అవి అపూర్వములు, ప్రకాశములు, జ్యోతిష్మంతములును - అని మూడుగా ప్రసిద్ధి జెందినవి.
వారికి రాజు యమదేవుడు. అహింసాది నియమములతో వీడిన పాపములు కల ఇతరులు ప్రజాపతులు. వారిని గూర్చి చెప్పెదను మీరు ఏమరుపాటులేక వినుడు. కర్దముడు, కశ్యపుడు, శేషుడు, విక్రాంతుడు, సుశ్రువుడు, బహుపుత్రుడు, కుమారుడు, వివస్వంతుడు, శుచిశ్రవుడు, ప్రచేతసుడు, అరిష్టనేమి, బహులుడు, ప్రజాపతి - అను ఈ మొదలగువారు ఇతరులును అనేకులు ప్రజాపతులు. దర్భలంత ఎత్తు గలవారును, మనోవేగము కలవారును, సర్వము అందుండువారును - ఐన వాలఖిల్యులను వారు పరమర్షులు సార్వభౌములునునై జన్మించిరి. భస్మవ్యపోహిని యందు (భస్మమును దూరము చేయుదానియందు) పుట్టినవారై బ్రహ్మర్షి గణముచే సమ్మతులై తపోవేదములందు పరాయణులైనవారు, వైఖానసులను ముని గణమువారు, అతని (బ్రహ్మ, అగ్ని) ఇంద్రియముల నుండి పుట్టిన అశ్వినీ దేవతలు చక్కని రూపములతో కూడినవారు. జన్మాక్షర జనులు విమలురై నేత్రములనుండి పుట్టినవారు అతని (బ్రహ్మ, అగ్ని) ఇంద్రియముల నుండి జ్యేష్ఠులైన ప్రజాపతులు పుట్టిరి. రోమకూపముల నుండియు అట్లే స్వేద (చెమట) మలము నుండియు ఋషులు పుట్టిరి. ఋతమున మాసములు, చిగురులు, పక్ష సంధులును, వత్సరములును, అహోరాత్రములును, దారుణములు (భయంకరములు) పుట్టినవి. రౌద్రమును లోహితము అందురు. లోహితము కనకము అనబడినది. అది మైత్రము అని (సూర్య సంబంధమని) తెలియవలెను. ధూమము పశువులు అనబడినవి. ఆ అగ్నిజ్వాలలు రుద్రులు అట్లే జనించిన ఆదిత్యులు (సూర్యులు). అంగారములనుండి పుట్టిన జ్యోతిస్సులు దివ్యమానుష రూపములు (దేవతలు మనుష్యులును) వేదమునుండి పుట్టిన బ్రహ్మ ఈ లోకమునకు మొదటివాడు. దీనిని సర్వకామదము అని అందురు. అచట కన్యను ఉదాహరించిరి. అచట దేవగురువైన బ్రహ్మ దేవతలచే ప్రసన్నుడు అగును. ఈ ప్రజాపతులు అందరు ప్రజలను పుట్టింతురు. వారు అందరు ప్రజాపతులు. వారు అందరును తపస్వులు, వారి అనుగ్రహమున ఈ లోకముల ఈక్రియలు ధరించును. బ్రహ్మ అగ్ని తేజమును వర్థిల్లచేయు జంటను వర్థిల్లచేసెను. అట్లే దేవతలలో వేద విద్వాంసులు అందరు రాజర్షులైరి. అందరును వేదమంత్ర పరులును, ప్రజాపతి గుణములతో పుట్టినవారును అయిరి. భూమిలో తపము అనంతమై బ్రహ్మస్వరూపమై, సత్య స్వరూపమై పరమమైనది అగును. ఓ ప్రభూ! ఈ మేము అందరము నీ సంతానరూపులమే. బ్రహ్మయు, బ్రాహ్మణులును, చరాచరములైన లోకములును నీ సంతానమే. మరీచి మహర్షిని మొదట ఉంచుకొని ఋషులతో బాటు దేవతలు - మేము నీ అపత్యములను (సంతానములను) కోరుచున్నామని సంతానమును కోరిరి. ఆ యజ్ఞమున మహాభాగులైన దేవతలు ఋషులతో గూడ నీ వంశమున పుట్టినవారై స్థానకాలాభిమానులు అయిరి. వారు ఈ ప్రజలను ఆ రూపముతోనే నిలుపరు. యుగాద్యంతముల దాక ఈ ప్రజలను నిలుపుదురు.
తరువాత లోకగురుడైన బ్రహ్మ పరుడని విచారింపక ఇట్లు పలికెను. ఈ విధముగా నిశ్చయించి, నాచేత దేవతలు సృష్టింపబడిరి. సంశయము లేదు. ఈ మహర్షులు మీ యొక్క వంశమున పుట్టిరి. వారిలో ప్రథమ ప్రజాపతి పూర్వమహాత్ముడైన ఆ భృగువు యొక్క వంశమును విస్తరముగను ఆనుపూర్వితోను చెప్పెదను. భృగువు యొక్క భార్యలు సాటిలేని వారు, ఉత్తమురాండ్రు, బాంధవ్యముకలవారు, శుభకరులైన వారు అయిన ఇరువురు ఉండిరి. అందులో ఒకటి హిరణ్యకశిపుని యొక్క కన్య ‘దివ్య’ అని ప్రసిద్ధి చెందినది. రెండవది పులోముని పుత్రిక పౌలోమి, శ్రేష్ఠురాలు, ఆమె భృగువు వలన దివ్యవేదవేత్తలలో శ్రేష్ఠుడైన కావ్యుని (శుక్రుని) కనెను. అతడు దేవాసురులకు ఆచార్యుడు, కవిసుతుడు, గ్రహరూపుడు అయిన శుక్రుడు. ఆ శుక్రుడు ఉశనుడు అని ప్రసిద్ధుడు. కావ్యుడు అను పేరుచేత అని పిలువబడినవాడు, సోమపులైన పితరుల మానసీ కన్యయు యశస్వినియు అయిన ‘అంగి’ అను శుక్రుని భార్య నలుగురు పుత్రులనుకనెను. భృగు-దివ్యల వల్ల పుట్టిన శుక్రుడు బ్రహ్మ తేజముతో కూడినవాడు. బ్రహ్మవేత్తలలో ఉత్తముడు. ఆ శుక్రునకు భార్య అయిన అంగియందు నలుగురు పుత్రులు పుట్టిరి. త్వష్ట వరూత్రి అను ఇరువురును, శండుడు, అమర్కుడు, అనువారు ఇరువురును. వారు ఆ సూర్యునితో సమానమైన కాంతి గలవారు, ప్రభావమున బ్రహ్మతో సమానులు. రంజనుడు, పృథురశ్మి, విద్వాంసుడైన బృహద్గిరుడును - వీరు వరూత్రియొక్క సుతులు. బ్రహ్మిష్ఠులు, సురులకు యాజకులు (యజ్ఞముల చేయించువారు). వారు ఇజ్యా (యాగ) ధర్మ వినాశముకొరకు మనువును చేరి కలిసిరి. ఆ విధముగా నిరసింపబడుచున్న ధర్మమును జూచి మనువు అనెను. వీరిచేతనే స్వేచ్ఛగా నిన్ను యాజనమును (యజ్ఞము జేయుటను) పొందించగలను (అని అనెను). ఇంద్రుని ఆ వాక్యమునువిని ఆ ప్రదేశమునుండి వారు తొలగిరి. వారు తొలగి కనబడకపోగా, ఇంద్రుడు ధర్మపత్నియైన చేతన అనుగ్రహముతో ముక్తురాలినిగా చేయించి, తరువాత అతడు ఆమెను అనుసరించెను. తరువాత ఇంద్ర వినాశనమునకై యత్నించుచున్న నాయకులను అక్కడికి వచ్చినవారిని, మరల ఇంద్రుడు చూచెను. చూచి ఇంద్రుడు ఆ దుష్టుల జంపి, తరువాత దక్షిణమునందు దేవదేవునియొక్క వేదియందు పరుండెను. అప్పుడు శాలవృకములతో (శాలలోని తోడేళ్ళతో) తినబడుచున్న వారియొక్క శిరములు పడినవి. అవి తరువాత ఖర్జూరములు అయినవి. ఈ విధముగ వరూత్రియొక్క పుత్రులు పూర్వము ఇంద్రునిచే హతులైరి. శుక్రునకు యజనియండు దేవయాని పుత్రికగా జనించెను. త్రిశరుడై మహాత్ముడైన విశ్వరూపుడు త్వష్టయొక్క పుత్రుడు అయ్యెను. విశ్వరూపుని తోబుట్టువుకూడ విశ్వకర్మయై యముడు అనబడెను. భృగువు వలన దేవతలైన భృగువులు పండ్రెండుగురు పుత్రులుగా జన్మించిరి. ప్రభువైన కావ్యుడు దేవియందు వారందరిని పుత్రులుగాకనెను. వారు భువనుడు, భావనుడు, అన్యుడు, అన్యాయతుడు, క్రతువు, శ్రవుడు, మూర్ధుడు, వ్యజయుడు, వ్యశ్రుషుడు, ప్రసవుడు, అజుడు, పండ్రెండవవాడు అధిపతియు అనబడిరి. వీరు దేవతలైన భృగువులు, పండ్రెండుగురు, యాజ్ఞికులును. (భృగువు వలన) పౌలోమి బ్రహ్మిష్ఠుడు వశియు విభుడు అయిన పుత్రునికనెను. అతడు ఎనిమిదవనెలలో గర్భ క్రూరమైన కర్మచే చ్యవనమగుట (జారిన వాడగుట) వలన చ్యవనుడు అనబడెను. తరువాత ప్రచేతసుని నుండి చేతనుడు చ్యవనుడు క్రోధుడైన ప్రాచేతను (చేతను) నుండి అధ్వానుడు, పురుషుని నుండి యజుడును జనించిరి. భార్గవుడైన చ్యవనుడు సుకన్యయందు ఆత్మ వానుడు, దధీచుడు అను ఇరువురు పుత్రులను కనెను. వారు ఇరువురు సాధుసమ్మతులు. దధీచివలన సరస్వతియందు సారస్వతుడు పుట్టెను. నహుష పుత్రియైన ‘రుచి’ అను మహాభాగ్యవతి ఆత్మవానుని పత్నియైనది. ఆ ఆత్మవానుని యొక్క తొడలనుండి, ఆ తొడలను భేదించుకొని ఋషియైన ‘ఔర్వుడు’ పుట్టెను. అతడు మహాయశస్వి, ఔర్వునకు మండుటగ్నివలె ప్రకాశించు ఋచీకుడు పుట్టెను. ఋచీకునకు సత్యవతి యందు జమదగ్ని పుట్టెను. భృగువునకు రుచి పర్యాయమున రౌద్ర - వైష్ణవములలో వైష్ణవాగ్ని యొక్క జమనము వలన (భుజించుట వలన) జమదగ్ని జనించెను. రేణుక జమదగ్ని వలన ఇంద్రునితో సమానమైన పరాక్రమము గలవాడును, బ్రహ్మ - క్షత్ర తేజముల నిండిన వాడును, అమిత తేజస్కుడైన పరశురాముని కనెను. ఔర్వునకు జమదగ్ని మొదలుగా గల పుత్రశతము కలిగెను. ఆ భార్గవులకు పరస్పరముగా వేల పుత్రులు కలిగిరి. ఋష్యంతరులలోను బాహులుగా అనేకులు భార్గవులు అనబడిరి. వారు - వత్సుడు, విశ్వుడు, అశ్విషేణుడు, పాండుడు, పథ్యుడు, శౌనకుడును. గోత్రముతో వీరు ఏడవవారు ఈ పక్షములు భార్గవ పక్షములుగా తెలియదగినవి.
అగ్నిపుత్రుడై ధీమంతుడైన అంగిరసుని యొక్క వంశమును వినుడు. అతని వంశమున గౌతమునితో పాటు భారద్వాజులు పుట్టిరి. దేవతలైన ఆంగిరసులు మహౌ జస్కులై ఇషుమంతులై (బాణములు కలవారై) ముఖ్యులైనవారు. మరీచిమహర్షి పుత్రి మారీచియైన సురూపయు, స్వరాట్టైన కర్దమ ప్రజాపతి పుత్రియైన కార్దమియు, మనుపుత్రి మానవియైన పథ్యయు - అను ఈ మువ్వురు అధర్వణుని (అంగిరసుని) భార్యలు. వీరు అంగిరసుని భార్యలు. వారియందలి సంతతిని చెప్పెదను. ఆ పత్నులందు అధర్వణునకు అంగిరసునకు కులోద్వహులైన దాయాదులు (పుత్రులు) పుట్టిరి. మహాతపస్సుతో భావించిన ఆత్మలు గలవారికి మహాతపస్సుతో పుత్రులు పుట్టిరి. సురూపయందు (అంగిరసుడు) స్వరాట్టైన గౌతముని బృహస్పతిని అవంధ్యుని వామదేవుని ఉతథ్యుని ఉశిజుని కనెను. పథ్యయందు ధిష్ణువను పుత్రుడు కలిగెను. మానసుడైన సంవర్తుడు ఆయస్యుడైన (నల్లని వాడైన) విచిత్తుడును కలిగిరి. ఉతథ్యుని పుత్రుడు శరద్వంతుడు, అశిజుడు (ఉశిజుడు) దీర్ఘతముడు. వామదేవజుడు బృహదుత్థుడు. ధిష్ణువు యొక్క పుత్రుడు సుధన్వానుడు. సుధన్వనుని పుత్రుడు ఋషభుడు. ఋషులు అని ప్రసిద్ది చెందినవారు. రథకారులైన దేవతలుగా జెప్పబడిరి. బృహస్పతికి ప్రసిద్ధుడును మహాయశస్కుడు అయిన భరద్వాజుడు కలిగెను. అంగిరసునకు సంవర్తుడు కలిగెను. ఇక అంగిరసులైన దేవతలను వినుడు. దేవతలైన అంగిరసులు బృహస్పతి కన్న చిన్నవారు. సురూపయందు ఔరసులైన అంగిరసుని పుత్రులు పుట్టిరి. వారు - ఔదార్యుడు, ఆయువు, దనువు, దక్షుడు, దర్భుడు, ప్రాణుడు, హవిష్మంతుడు, హవిష్ణుడు, క్రతువు, సత్యుడు - అను వారు పదుగురు. అయస్యుడు, ఉతథ్యుడు, వామ దేవుడు, ఉశిజుడు, భారద్వాజులు, శాంకృతికులు, గార్యులు, కాణ్వులు, రథీతరులు, ముద్గలులు, విష్ణు వృద్ధులు, హరితులు, వాయువులు, భాక్షులు, భరద్వాజులు, ఆర్షభులు, కింభయులు - ఈ పదియైదుగురిని అంగిరసుని పక్షము వారుగా గ్రహింపవలెను. ఋష్యంతరులలో బాహ్యులైన అంగిరసులు అనేకులు కలరు.
ఇక ఉత్తమ పురుషులుగల మారీచవంశమును చెప్పెదను. ఆ వంశమున స్థావర జంగమాత్మకమయమైన జగము పుట్టినది. మరీచి, అపోదేవతలను (నీటి దేవతలను) కామించెను. సంతానేచ్ఛతో వారినే ధ్యానించుచుండెను. ప్రజావంతుడై సర్వ గుణములతో గూడిన పుత్రుడుగూడ కలిగెను. చక్కని కాంతిగల దితి మనస్సుచే భావింపబడి నదై ఉండెను. ప్రభువైన మరీచి ప్రశస్తురాలైన ఆమె యందు పూజింపబడుచుండెను. తరువాత సమస్త జలములు (జలస్త్రీలు) పిలువబడిరి. మరీచి వారియందు నివసించెను. ప్రభువైన మరీచి తాను ఉంచిన ఆత్మకల వానిని ఒక పుత్రుని వారికి జనింపజేసెను. ఆ పుత్రుడు సాటిలేనివాడు. అరిష్టనేమి అను (రెండవ) పేరుగల కశ్యప ప్రజాపతి. వధౌవేశుడు సూర్యకాంతిగల మరీచుని పుత్రునిగా జనింపజేసెను. సత్పురుషుల వాక్యమును ధ్యానించుచు పుత్రార్థియై జలమందు ఏడువేల యేండ్లుండి ఆ మరీచి సాటిలేనివాడు అయ్యెను. కశ్యపుడు సూర్యునివలన విద్వాంసుడు అయ్యెను. అకారణమున అతడు బ్రహ్మతో సమానుడు. అన్ని మన్వంతరములలోను బ్రాహ్మణ అంశతో కన్యా నిమిత్తముగా జనించును అని చెప్పగనే ప్రజలు (సంతానములు) దక్షునిచే కోపింపబడిరి. అపుడు మరీచి పుత్రుడు కశ్యమును త్రాగెను. (ఇచట కశ్యము అనగా మద్యము.) బ్రహ్మ సంబంధము కశయని తెలియవలెను. బ్రహ్మనుండి వచ్చినది కశ్యము అనబడును. విప్రులు కశ్యమును మద్య మందురు. కశ్యమును (మద్యమును) పానము చేయుట వలన కశ్యపుడు అయినాడు. దక్షునిచే శపింపబడి కోపించినవాడై క్రూరముగా పలుకబడిన వాక్కులను నిర్వర్తించుటచే అతడు కశ్యపుడు అయ్యెను. కావుననే పరమేష్టియు బ్రహ్మయు అయి కశ్యపునిచే పలుకబడినది. కావుననే దక్షుడు తన కన్యలను కశ్యపునకు పెండ్లి చేసి ఇచ్చెను. ఆ కన్యలు అందరును బ్రహ్మవాదినులు. వారు అందరును లోకమాతలును అయిరి. ఈ వారుణమై పుణ్యమైన ఋషి సృష్టిని తెలిసినవాడు ఆయుష్మంతుడును, పుణ్యవంతుడును, శుద్ధుడును అయి ఉత్తమ సుఖమును పొందును. ఈ కథను బుద్ధియందు ధారణ చేయుటవలన, వినుటవల్లను సర్వపాపముల నుండి ముక్తుడగును.
ఆ తరువాత మునులు అందరు రోమహర్షునితో (సూతునితో) ఇట్లు అనిరి. ఆఱవదైన చాక్షుషమన్వంతర ప్రజాసృష్టి జరిగిపోగా ఈ వైవస్వత సృష్టి జరిగినది.
సూతుడు ఇట్లు అనెను:
స్వయంభువైన బ్రహ్మచేత ‘స్వయముగా ప్రజలను సృష్టింపుము’ అని ఆదేశింపబడినవాడై దక్షుడు జంగమములను స్థావరములును అగు ప్రాణులను సృష్టించెను. వైవస్వత మన్వంతరము వచ్చిన తరువాత ఇది జరిగినది. తరువాత దక్షుడు నాలుగు విధములైన ప్రజలను సృష్టింప మొదలిడెను. వారు - జరాయుజులు (మావి వల్ల పుట్టినవారు), అండజులు (గ్రుడ్లనుండి పుట్టినవారు), ఉద్బిజ్జులు భూమిని ఛేదించు కొని పుట్టిన తరులతాదులు, స్వేదజులు (చెమట వల్ల పుట్టినవారు) అను నాలుగు విధములైన వారు. పదివేల యేండ్లు ఘోరమైన, గొప్పదైన తపమునుచేసి, యోగఫలముల చేతను, విశేషించి అణిమాది సిద్ధుల చేతను సంభావింపబడి, శ్రీమంతుడైన దక్షుడు తనను విభజించి మనుష్యులను, ఉరగులను, రాక్షసులను, దేవతలను, అసురులను, గంధర్వులను దివ్యవిగ్రహములు (ఆకారములు) గల ప్రజలను, ఈశ్వరులైనవారిని రూపములోను, ద్రవ్యములోను, తేజములోను తనతో సమానులైనవారిని, అట్లే ఇతరులను స్థావరములును జంగమములును అయిన ప్రాణులను మానసికముగనే సృష్టింపదలచి అనేక విధములైన ప్రజలను, ఋషులను, దేవతలను, గంధర్వులను, మనుష్యులను, ఉరగులను, రాక్షసులను, యక్ష - భూత - పిశాచులను, పక్షులను, పశువులను, మృగములను సృష్టించెను. మనస్సుతో సృష్టించిన ఆప్రజలు చక్కగా వర్ధిల్లకుండిరి. అపుడు బుద్ధిమంతుడై మహాదేవుడైన భగవంతునిచే వేరుగా ధ్యానింప (చింతింప)బడినది. వివిధ ప్రజలను మైథున భావముతో సృష్టింప తలచెను. వీరణ ప్రజాపతియొక్క పుత్రియైన ‘అసిక్ని’ అను ఆమెను వహించెను (వివాహమై భార్యనుగా చేసికొనెను) ఆమె గొప్పతపముతో కూడినది. లోకమును ధరించునది. ఆమెచే ఈ సమస్త స్థావరజంగమాత్మకమైన జగత్తు ధరింపబడినది. ఇట కూడ ఉత్కృష్టురాలై వీరణ ప్రజాపతి పుత్రియైన ‘అసిక్ని’ని భార్యగా పెండ్లాడుచున్న ప్రాచేతసుని (దక్షుని) గూర్చి ఈ రెండు శ్లోకములను చెప్పుదురు. ప్రభువైన దక్షుడు నదీగిరులలో లక్షబావులను, అభిమానవంతులకు సర్పిణిని (ప్రవహించుదానిని) సృజించుచు వాని వెనుకనే అనుసరించి వెడలెను. అతనిని జూచి ఋషులు ఇట మొదటిది ప్రజలను ప్రతిష్ఠాపించగలదు అని అనిరి. రెండవది (అసిక్ని) దక్షప్రజాపతి యొక్క ప్రజలను (సంతానమును) ప్రతిష్ఠాపించగలదు అని అనిరి. ప్రాచేతసుడైన దక్షుడు ఇచట వీరిణి పుత్రి అగు అసిక్నిని భార్యగా పెండ్లాడెనో అచట అతడు కాలానుగుణముగా లక్షబావులచేరెను. ఆ తరువాత ప్రాచేతస ప్రభువు (దక్షుడు) తన అమితమైన యోజస్సుచే వీరిణి పుత్రియైన ‘అసిక్ని’ యందు వేవురు పుత్రులను జనింపజేసెను. వారిని చూచి ప్రజలను (సంతానమును) వృద్ధిపొందింపతలచెను. మహాతేజస్వియు, దేవర్షియు, ప్రియముగ మాట్లాడినవాడును బ్రహ్మపుత్రుడైన నారదుడు వారి నాశము కొరకును ఆత్మశాపమునకును వచనమును పలికెను. ఎవ్వడు విప్రుడు అని చెప్పబడునో అతడు కశ్యపునివాడు అనుట కృత్రిమము, ఆ పనిచేత బ్రహ్మర్షి నారదుడు దక్షశాపమున భయము చెందెను. తరువాత, ఎవ్వడు కశ్యపసుతునకు పరమేష్ఠియై ((బ్రహ్మయై) పుట్టెనో, అతడే ఇట దక్షశాపభయమున మరల కశ్యపునకు మానసపుత్రుడుగా జనించెను. ఆకారణమున అతడు (నారదుడు) రెండవ మానస పుత్రుడు అయ్యెను. అతడు (నారదుడు బ్రహ్మకు మొదట (మానసుడు)గా పుట్టినవాడు. అతనిచేతనే ఆ దక్షుని పుత్రులు అందరు హర్యశ్వులు అని ప్రసిద్ధులైరి. నిందకొరకై వారు అందరు నశింపజేయబడిరి. కావున దష్టులైరి. సంశయము లేదు. దానికి ప్రభువైన దక్షుడు కోపించినవాడై వాని నాశనమునకు బయలుదేరెను. కాని, బ్రహ్మర్షులను ముందిడు కొని బ్రహ్మచే యాచింపబడెను. దాని వల్ల దక్షుడు బ్రహ్మతో ఒప్పందమును చేసికొనెను. ఆ కన్యయందు నీ యొక్క (బ్రహ్మయొక్క) పుత్రుడు నా కొఱకు జనించు గాక - అని ఆ ఒప్పందము. తరువాత దక్షుడు తన ప్రియ పుత్రిని పరమేష్టికి (బ్రహ్మకు) ఇచ్చెను. ఆ బ్రహ్మవల్ల నారదుడు మరల జనించెను. ఆ నారద ఋషియు భయము నుండి శాంతించెను అనగా భయము వీడిపోయెను. అది విని ఆ విప్రులు మరల కుతూహలము కలిగినవారై ప్రవక్తలలో శ్రేష్ఠుడును తత్త్వార్థమును దర్శించు వాడును అయిన సూతుని అడిగిరి.
ఋషులు ఇట్లు అనెను:
దక్షప్రజాపతి పుత్రులును ప్రాచేతసాత్మజులునైన దక్షపుత్రులు మహాత్ముడైన నారదునిచే ఎట్లు నశింపచేయబడిరి - అని ఋషులు అడిగిరి. సూతుడు ఆ నిజమైన వాక్యమును తెలిసికొను కోరికతో బయలు వెడలి మధురమైన సర్వ గుణములతో కూడిన వచనమును పలికెను. దక్షపుత్రులు హర్యశ్వులనువారు. వారు వృద్ధి పొందగోరిన (దక్షుని) సంతానము. మహావీర్యులైన వారు నారదుని కడకు వచ్చిరి. నారదుడు వారితో ఇట్లనెను.
అయ్యో! మీరు చిన్న పిల్లవాండ్రు. భూతలమును తెలియరు. దాని అంతమును, ఊర్ధ్వమును, క్రిందు భాగమును తెలియరు. ప్రజలను ఎట్లు సృష్టించగలరు. భూమియొక్క ప్రమాణము ఎంత? సృష్టింపదగిన వారు ఎంతటివారు? సృష్టింపతగిన దానిని తెలియకయే వేరొక విధముగా మీరు ఏమి సృష్టింతురు? అది కొద్దిదైనను అచట దోషము కనబడు చున్నది.
ఆహర్యశ్వులు నారదుని మాటను విని వాయువుతో చేరి అన్ని దిక్కులకు చెల్లా చెదరుగా వెడలిపోయిరి. ఆ విధముగ వారు పరాభవము పొందిరి. వాయువుతో కలిసి తిరుగుచున్నవారు ఇప్పటికి మరలిరాలేదు. ఈవిధముగా ఆ మహర్షులు వాయు మార్గమును చేరి తిరుగుచునే ఉన్నారు. ఈ విధముగా తన పుత్రులు నష్టులు (కనబడనివారు) కాగా, ప్రాచేతసుడైన ప్రభువైన దక్షుడు మరల వీరిణియందు వేయిమంది పుత్రులను సృజించెను. ప్రజలను వృద్ధిచేయదలచినవారు శబలాశ్వులు అనబడిరి. మహౌజసులైన ఆ కుమారులందరును నారదుడు హర్యశ్వులు అన్నమాటను వినిరి, నారద మహర్షి చక్కగా అనెను, అని పరస్పరము అనుకొనిరి. మనముగూడ మన అన్నల మార్గముననే పోవలసియున్నది. సంశయము లేదు అనిరి. భూమి యొక్క ప్రమాణమును తెలిసికొని సుఖముగా ప్రజలను సృజింతము అని అనుకొని వారుగూడ అ(వాయు) మార్గముననే అన్ని దెసలకు వెడలిపోయిరి. సముద్రమునుండి నదులవలె ఇప్పటికిని వారు మరలిరారైరి. అప్పటినుండి అన్నలను వెదకుటలో ఆసక్తుడై పోవువాడు నశించును. తెలిసి ఆ పనిని చేయరాదు అనుకొనిరి. ఈశ బలాశ్వులు నష్టులు కాగా విభువైన దక్షుడు కుపితుడు అయ్యెను. నారదుని నాశమును పొందుము అనియు గర్భవాసమున ఉండుము అనియును శపించెను. ఆవిధముగ మహాత్ములైన శబలాశ్వులు పూర్వము నష్టులు కాగా దక్షుడు వీరణ పుత్రియైన వీరిణియందు ప్రసిద్ధలైన అఱువది కన్యలను సృజించెను. అపుడు ప్రభువైన కశ్యపుడు వారిని తన భార్యలుగా స్వీకరించెను. ధర్ముడు, భగవంతుడైన సోముడు, అట్లే ఇతర మహర్షులను కన్యలను స్వీకరించిరి. ఈ దక్షుని సమస్తసృష్టిని తెలిసినవాడు ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు, ధన్యుడు, ప్రజా (సంతాన) వంతుడును అగును.