ఋషివంశాను కీర్తనము

సూతుడు ఇట్లు అనెను:

ఈ విధముగ మహాత్ముడైన కశ్యపునిచే సృజింపబడి సమస్త స్థావర జంగమాత్మకమైన ప్రజలు ప్రతిష్ఠితులుకాగా వారిలో ఆధిపత్యమునందు అభిషేకించి, తరువాత వారి రాజ్యములను వివరముగ ఆదేశించుటకు క్రమముగా మొదలుపెట్టెను. బ్రహ్మ ద్వి జాతులయు, తీగలయు, గ్రహములతోడి నక్షత్రములయు, యజ్ఞములయు, తపస్సులయు, రాజ్యమున సోముని అభిషేకించెను. సమస్త అంగిరసులు రాజ్యమున బృహస్పతిని, భృగువుల రాజ్యమున కావ్యుని (శుక్రుని) అభిషేకించెను. ఆదిత్యులకు విష్ణువును, వసువులకు పావకుని, ప్రజాపతులకు దక్షుని, మరుత్తులకు వాసవుని, రాజుగా అభిషేకించెను. దైత్యుల రాజుగా దితినందనుడైన ప్రహ్లాదుని, సాధ్యులకు నారాయణుని, రుద్రులకు వృషభధ్వజుని, తరువాత దానవులకు విప్రచిత్తిని రాజుగా ఆదేశించెను. జలముల రాజ్యమున వరుణుని, రాజులకు, యక్షులకు, రాక్షసులకు, పార్థివులకు, ధనమునకును వైశ్రవణుని (కుబేరుని) రాజుగా ఆదేశించెను. పితరుల రాజ్యమున వైవస్వతుడైన యముని అభిషేకించెను. సర్వభూత పిశాచములకు గిరీశుడైన శూలపాణిని, శైలములకు హిమవంతుని, నదులకు సాగరమును, గంధర్వులకు చిత్రరథుని అధిపతులనుగా చేసెను. అశ్వములకు ఉచ్చైశ్రవమును రాజుగా అభిషేకించెను. తరువాత మృగములకు శార్దూలమును (పులిని), నాలుగు కాళ్ల జంతువులకు గోవృషభమును (ఆబోతు), సమస్త పక్షులకు పక్షిశ్రేష్ఠుడైన గరుడుని, గంధములకు మాతులమును (గంధ విశేషము) ఉమ్మెత్తను, శరీరములేని భూతములకు, శబ్ద - ఆకాశ బలములకును బలవంతులలో శ్రేష్ఠుడైన వాయువును, సమస్తములైన కోరలుగలవానికి శేషుని, నాగులకు వాసుకిని, సరీసృపములకు, సర్పములకు, నాగులకును తక్షకుని, సాగరములకును, నదులకును, మేఘములకును, వర్షింపబడిన దానికిని ఆదిత్యులలో ఒకడైన పర్జన్యుని అభిషేకించెను. సమస్త అప్సరోగణములకు కామదేవుని, క్రతువులకును, ఋతుసంబంధములైనవానికి మాసములకు పక్షములకు, విపక్షములకు (సప్తాహములకు లేక దినములకు) ముహూర్తములకు (రెండు గడియలు కాలములకు), పర్వములకు (అష్టమి, చతుర్దశి, కుహువు, పూర్ణిమ, రవిసంక్రాంతి), కలా (540 రెప్పపాట్ల కాలము 30 కాష్టల కాలము - కాష్ఠ (18 రెప్పపాట్ల కాలము) - మొదలగు కాల విభాగములకు, ఉత్తర దక్షిణాయన గతులకు, గణితమునకు, యోగమునకును, (కూడికకు మంచి చెడు మోసములకు) సంవత్సరమును ప్రభువుగా చేసెను. బ్రహ్మ రజస్సు యొక్క ప్రసిద్ధుడైన పుత్రుని సుధాముడు అను వానిని తూరుపు దిక్కున రాజుగా అభిషేకించెను. అట్లే రజస్సు యొక్క పుత్రుడైన అచ్యుతుని రాజుగా పశ్చిదిక్కున అభిషేకించెను. ఆతడు కేతుమంతుడు (ధ్వజముగలవాడు). మహాత్ముడును, (తన) సుతుడైన మనువును మనుష్యులకు అధిపతిగాచేసెను. ఈ సమస్త పృథివి వారివారి ప్రదేశాను సారముగ ఇప్పటికిని వారిచే ధర్మముతో పరిపాలింపబడుచున్నది.

వారు పూర్వము స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మచే అభిషేకింపబడిరి. రాజులు అభిషేకింపబడుదురు. వారు మనువులు అగుదురు. ఈ మన్వంతరములు గడువగనే రాజులు పోవుదురు. ఇట్లే మన్వంతరము రాగానే ఇతరులు మరల అభిషేకింప బడుదురు. గడచినవారును, రాబోవువారును అందరు మన్వంతరేశ్వరులు అనబడిరి. ఈ నరోత్తములచే రాజసూయమున పృథువు అభిషేకింపబడెను. వేదములో చెప్పబడిన విధానముగా ప్రతాప వంతుడైన పృథువు రాజుగా చేయబడెను. ఈ పుత్రులను పుట్టించి ప్రజాసంతాన కారణమున ఆ మహాభాగుడు ప్రజలకుపతియై ఈశ్వరుడు అయ్యెను. గోత్ర (వంశ) కాముడైన కశ్యపుడు పరమతపము ఆచరించెను. నాకు గోత్రకరులైన ఇద్దరు పుత్రులు కలుగుదురు గాక అని ధ్యానించెను. ఆ విధముగా ధ్యానించు మహాత్ముడైన కశ్యపునకు తరువాత బ్రహ్మ అంశలుగా మహాబలతేజోవంతులైన ఇరువురు పుట్టిరి. వారిద్దరు వత్సారుడు, అసితుడును - అను బ్రహ్మవాదులు (బ్రహ్మతత్త్వమును తెలిపి చెప్పువారు). వత్సారుని వలన నిధ్రువుడు, మహాయశస్వి అయిన రైభ్యుడును పుట్టిరి. రైభ్యుని సంతతి వారిని రైభ్యులుగా తెలియవలెను. నిధ్రువుని సంతానమును వినుడు. చ్యవనునకు సుకన్యయందు సుమేధసుడు పుట్టెను. నిధ్రువుని భార్య కుండపాయులకు (కుండలతో త్రాగువారికి) తల్లి. అసితునకు ఏకపర్ణయందు బ్రహ్మిష్ఠుడు పుట్టెను. శాండిల్యుల మాటను విని దేవలుడు సుమహా యశస్కుడు అయ్యెను. నిధ్రువులు, శాండిల్యులు, రైభ్యులు ఈ మువ్వురు తరువాత కశ్యపులు. వరప్రభృతులగు దేవతలు దేవులుని ప్రజలు (సంతానము). ఈ ప్రజలు మనువు యొక్క పదునొకండవ చతుర్యుగము (కృతాదికల్యంతము యుగము) గడువగా పుట్టినవారు. తరువాత మిగిలిన ద్వాపర యుగము నడచుచుండగా, మానసునకు చరిస్యంతుడు, అతనికి పుత్రుడు దముడు పుట్టిరి. అతని మానస దాయాదుడు (పుత్రుడు) తృణబిందువు.

ఆతడు మూడవ త్రేతాయుగ ప్రారంభమున రాజుగా ఉండెను. ఆతనికి ఇడవిడ అను కన్య ఉండెను. ఆమె రూపమున సాటిలేనిది. ఆ రాజర్షి ఆ కన్యను పులస్త్యునకు ఇచ్చెను. ఇడవిడయందు ఋషియైన విశ్రవసుడు పుట్టెను. అతనికి పౌలస్త్య కులమును వర్ధిల్లజేయు నలుగురు భార్యలుండిరి. దేవాచార్యుడైన బృహస్పతికి బృహత్కీర్తి అను పుత్రుడు ఉండెను. అతని కన్యను ‘దేవవర్ణిని’ అను దానిని ఆ విశ్రవసుడు పెండ్లాడెను. మాల్యవంతుని కన్యలైన ‘పుష్కోత్కట’ను ‘వాక’ను మాలియొక్క కన్యయైన కైకసిని కూడ విశ్రవసుడు పెండ్లాడెను. వారి సంతానమును వినుడు. దేవవర్ణిని జ్యేష్టుడైన వైశ్రవణుని కనెను. అతడు దివ్యమైన విధానముతోను, ఋషులనుండి పొందిన పాండిత్యముచేతను, రాక్షస రూపముతోను, ఆసురమైన బలముతోను కూడినవాడు. అతడు మూడు పాదములు కలవాడు, మిక్కిలి పెద్ద శరీరము కలవాడు, లావైన తలగలవాడు, గొప్ప ఆకారము కలవాడు, ఎనిమిది కోరలు కలవాడు, పసుపుపచ్చని మీసములు కలవాడు, శంకువు (మేకు) వంటి చెవులు కలవాడు, పొట్టి చేతులు కలవాడు, బలసిన బాహువులు కలవాడు, గోరోజనము వన్నె కలవాడు, మిక్కిలి భయంకరుడు, పరిణామశాస్త్రజ్ఞాన సంపన్నుడు. సత్యజ్ఞాన సంపదచే చక్కని జ్ఞానియైనవాడు. ఈ విధముగ విశ్వరూపమును ధరించిన పుత్రుని జూచి అతడి తండ్రి (విశ్రవసుడు) వీడు ‘కుబేరుడు’ అని స్వయముగా చెప్పెను. ‘కు’ అను శబ్దము నిందార్థకము, శరీరము ‘బేరము’ అనబడును (కవచముగా అవయవములు గలది). కుశీరుడు అగుటచే కుబేరుడని పేరిడబడినాడు. విశ్రవసుని పుత్రుడైనందునను, చెవులు లేనివానివలె ఉన్నందునను లోకమున ఈతడు వైశ్రవణుడు అను పేరు కలవాడు కాగలడు. బుద్ధి అను ఆమెఅందు కుబేరుడు ప్రసిద్ధుడైన నలకూబరుని కనెను. కైకసి (విశ్రవసుని వలన) రావణుని, కుంభకర్ణుని, శూర్పణఖ అను కన్యకను, విభీషణుని - ఈ విధముగ నలుగురిని కనెను. మేకువంటి చెవులు కలవాడు, పదితలలు కలవాడు, ఎఱ్ఱనివాడు, ఎఱ్ఱని తల వెంట్రుకలు కలవాడు, నాలుగు పాదములు కలవాడు, ఇరువది భుజములు కలవాడు, మహాకాయుడు, మహాబలుడు, పుట్టుకతోనే కాటుకవలె నల్లనివాడు, కోరలు కలవాడు, ఎఱ్ఱని కంఠము కలవాడు, రాజులు సేనగా కలవాడు, రూపముతో, బలముతో, జయముతో కూడినవాడు, సత్యబుద్ధి, దృఢమైనతనువు కలవాడై, రాక్షసులతోనే ధ్వనించు రావణుడు. ఆతడు సహజముగా భయంకరుడు, క్రూరుడు, రావణము (పెద్దగా అరచుట వలన) రావణుడైనాడు. ఆ రాజు (రావణుడు) పూర్వజన్మలో హిరణ్యకశిపుడుగా ఉండెను. ఆ రాజు అచట పదమూడు చతుర్యుగములు (కృత త్రేత ద్వాపర కలి యుగములు) రాక్షసుడుగా ఉండెను. బ్రాహ్మణులు సంఖ్యచే వాటిని ఐదుకోట్ల వర్షములు అనిరి. సంఖ్యావేత్తలు అఱువదియొక్క లక్షలని చెప్పిరి. ఆ రావణుడు అఱువది లక్షల యేండ్లు దేవతలకును ఋషులకును భయంకరముగా నిద్రలేకుండా చేసెను. ఇరువది నాలుగవ త్రేతాయుగమున రావణుడు తన తపము క్షీణించుటచే దశరథ పుత్రుడైన రామునితో పోరి తన గణముతో నాశము పొందెను. విశ్రవసునకు పుష్పోత్కట అందు మహోదయుడు, ప్రహస్తుడు, మహాపాంశుఖరుడు, కుంభీనస అను కన్యయును కలిగిరి. విశ్రవసునకు వాకయందు త్రిశిరుడు, దూషణుడు విద్యుజ్జిహ్వుడు, అసలిక అను కన్యయు రాక్షసులుగా జనించిన సంతానము. అను వీరు క్రూర కర్ములు, పౌలస్త్యవంశమున పుట్టిన వారును రాక్షసులు అయిన పదుగురును భయంకర బంధుజనము కలవారు. అందరును దేవతలకు గూడ సమీపింప అలవికానివారు, అందరును వరములు పొందినవారు. పుత్రు పౌత్రులతో కూడినవారు. సమస్త యక్షులకును, పౌలస్త్యులైన రాక్షసులకును, అగస్త్యులకును వైశ్వామిత్రులకును (అగస్త్య, విశ్వామిత్ర సంతతి వారికిని), క్రూరులై బ్రహ్మరాక్షసులై వేదాధ్యయనశీలురై, తపోవ్రతముల సేవించువారైన పైవారందరికిని సవ్యపింగళుడు, పౌలస్త్యుడు అయిన ఐడవిడురాజు. ఇతరులు గూడ యజ్ఞముఖులు. కావున రక్షోగణములు మూడు. యాతుధానులు, బ్రహ్మధానులు (పీడలను వేద విజ్ఞానమును ధరించువారు). వార్తులు దివాచరులు. ఈ నిశాచర గణములు నాలుగని కవులన్నారు. “పౌలస్త్యులు, నైరృతులు, అగస్త్యులు, కైశికులు” - అని ఈ ఏడు రాక్షసుల జాతులుగా చెప్పబడినవి. సహజముగా ఉన్న వారి రూపమును చెప్పెదను. వారు - గుండ్రని కండ్లు గలవారు, గోరోజన వర్ణము వారు, మహాకాయులు, పెద్దకడుపుగలవారు, ఎనిమిది కోరలు గలిగి మేకువంటి చేవులు గలవారు, పైకి నిక్కబొడిచికొన్న వెంట్రుకలు గలవారు. చెవుల వరకు చీలి ఉన్న నోరుకలవారు, ముంజగడ్డి వలె పొగబారి పైకి నిక్కిన తలవెంట్రుకలు గలవారు, లావైన తలకలవారు, తెల్లని కాంతి కలవారు, పొట్టివారు, బలిష్ఠమైన బాహువులు కలవారు, ఎఱ్ఱని ముఖము కలవారు, వ్రేలాడు పొడవైన నాలుక - పెదవులు కలవారు, వ్రేలాడు కనుబొమ్మలు - లావైన ముక్కులును కలవారు, నల్లని అంగములు కలవారు, ఎఱ్ఱని కంఠము కలవారు, లోతైన కండ్లు కలవారు, భయంకరులు, మహాభయంకరమైన కంఠస్వరము కలవారు, వికటస్వరూపులు కట్టబడిన పిండముల వంటి కండరములు గలవారు. లావైనవారు, ఎత్తైన ముక్కులు కలవారు, రాళ్లవంటి దేహములు గలవారు, బలమైనవారు, భయంకరులైన బంధుజనము కలవారు, క్రూరులు, సామాన్యముగా క్లిష్టమైన కర్మలు కలవారు, కుండలములతోను, భుజకీర్తులతోను అలంకరింపబడినవారు, కిరీటమును, తలపాగాను ధరించినవారు, విచిత్రమైన వస్త్రములు ఆభరణములును కలవారు, చిత్రములైన మాలలును, మైపూతలును కలవారు, అన్నము తినువారును, మాంసము తినువారును, పురుషులను తినువారునుగా ఉండిరి. రాక్షసులలో ఈ రూప సాధర్మ్యము (సమానత)ను పండితులు చెప్పిరి. వారికి సామూహిక బలములేదు. అంతయు మాయా కృతమైనందున ఆ బలము అంతయు నిజమైన బలముకాదు.

పులహునకు పుత్రులు అందరు మృగములు, కోరలుగల వ్యాళములు, భూతములు, పిశాచములు, సర్పములు, భ్రమరములు, ఏనుగులు, వానరములు, కిన్నరులు, యమ కింపురుషులు, తక్కిన మాయా క్రోధములకు వశవర్తులై వ్యాపించినవారు. ఆ వైవస్వత మన్వంతరమున ‘క్రతువు’ అనపత్యుడు (సంతానము లేనివాడు). అతనికి తేజస్సును సంక్షేపించి ఉన్న పుత్రుడుగాని, పౌత్రుడుగాని లేదు. తృతీయ ప్రజాపతియైన అత్రియొక్క వంశమును చెప్పెదను. ఆతనికి సుందరులై పతివ్రతలైన పదుగురు భార్యలు ఉండిరి. భద్రాశ్వునకు ఘృతాచి అను అప్సరసయందు పదుగురు పుత్రులు కలిగిరి. వారు భద్ర, శూద్ర, మద్ర, శలద, మలద, వేల, ఖల, గోచపల, మానరస, రత్నకూట - అనువారు పదుగురు. వారియొక్క భర్త ఆత్రేయ వంశకరుడైన ప్రభాకరుడను పేరుగలవాడు. అతడు భద్రయందు యశస్వియైన సోముని పుత్రునిగా పుట్టించెను. సూర్యుడు రాహువుచే హతుడై ద్యులోకము నుండి (ఆకాశము నుండి) భూమిపై పడబోవుచుండెను. అపుడు లోకము చీకటితో ఆవరింపబడెను. అప్పుడు ఈ సోముని చేత కాంతి ప్రకాశింప జేయబడెను. భూమిపై బడబోవుచున్న సూర్యునిగూర్చి బ్రహ్మర్షి “నీకు స్వస్తి అగుగాక” అని అనెను. ఆ బ్రహ్మర్షి మాట వలన సూర్యుడు ఆకాశమునుండి భూమిపై పడలేదు. మహాతపస్వియైన అత్రి శ్రేష్ఠములైన గోత్రములను (వంశములను) విస్తరింపజేసెను. దేవతలచేత అత్రిఘనుడై యజ్ఞములందు ప్రవర్తింపజేయబడెను. అతడు మహాతపమున భావిత ప్రభుడై ఆ పదుగురు స్త్రీలయందు తనతో సమానులై అనామకులైన పదుగురు పుత్రులను కనెను. వారు వేదపారగులైన స్వస్త్యాత్రేయులు అను ఋషులుగా ప్రసిద్ధిజెందిరి. అత్రికి ప్రసిద్ధమైన కీర్తికలవారు, బ్రహ్మిష్ఠులైనవారును మహౌజస్కులునైన వారి ఇరువురు పుత్రులు ఉండిరి. జ్యేష్టుడు దత్తాత్రేయుడు. అతని తమ్ముడు దుర్వాసుడు. చివరిది కూతురు అమెయందు ఒక అబల బ్రహ్మవాదిని అయ్యెను. అతని గోత్రాన్వయమున బుట్టిన నలుగురు భూలోకమున ప్రసిద్ధులు. వారు శ్యాములు, ముద్గలులు, బలారకులు, గవిష్ఠిరులు. వీరు మహౌజస్కులైన నరులపక్షము వారైన నల్గురు అనిరి. కశ్యపుని వలన నారదుడు, పర్వతుడు, అరుంధతియు పుట్టిరి. ఓసత్తములారా! అరుంధతికి పుట్టినవారిని వినుడు. నారదుడు అరుంధతిని వసిష్ఠునకు (భార్యగా) ఇచ్చెను. వృక్ష శాపము వలన మహాతేజస్వియైన నారదుడు ఊర్ధ్వరేతస్కుడు అయ్యెను. పూర్వము తారకాసురమయమైన ఆ దేవాసుర యుద్ధమున లోకము అనావృష్టిచే బాధితముకాగా, ఇంద్రుడు దేవతలతోపాటు వ్యగ్రుడు కాగా, ధీమంతుడైన వసిష్ఠుడు తన తపముతో ప్రజలను కాపాడి ధరించెను. ఇచట మూల ఫలరూపమైనది ఔషధము. ఆ ఔషధులను ప్రవర్తింపచేయుచు ఆ ఔషధములతోనే ప్రజలను కరుణతో జీవింపజేసెను. ఓ బ్రాహ్మణులారా! వసిష్ఠుడు అరుంధతియందు ‘శక్తి’ని పుట్టించెను. శక్తి వలన అదృశ్యంతి సాగరుని పరాశరుని కనెను. పరాశరుని వల్ల ‘కాలి’ కృష్ణద్వైపాయన ప్రభువును కనెను. ద్వైపాయనుని వల్ల అరణియందు గుణాన్వితుడైన శుకుడు పుట్టెను. పీవరియందు శుకుని కుమారులు అరుగురు పుట్టిరి. వారు భూరిశ్రవుడు, ప్రభువు, శంభుడు, కృష్ణుడు, ఐదవవాడు గౌరుడు, ఇక కన్య, కీర్తిమతి, యోగమాత, దృఢవ్రతురాలు. బ్రహ్మదత్తుని తల్లి, సాత్త్వ గుహుని భార్య. శ్వేతులు, కృష్ణులు, గౌరులు, శ్యాములు, సమూలకులైన ధూమ్రులు, ఊష్మపులు, దారకులు, నీలులు - వీరు పరాశరులు. వారు మహాత్ములైన పరాశరుల ఎనిమిది పక్షములుగా చెప్పబడినారు. ఆ తరువాత ఇంద్ర ప్రతిమ సంభవమును వినుడు. వసిష్ఠునకు కపింజలియైన ఘృతాచి యందు ‘కుశి’ అనువాడు పుట్టెను. వానికి ఇంకొక పేరు ఇంద్రప్రతిముడు. పృథువు యొక్క సుతవల్ల అతనికి (ఇంద్రప్రతిమునకు) పుత్రుడుగా వసువుపుట్టెను. అతనికి ఉపమన్యువు సుతుడు. అతనికి పుట్టిన వీరు ఉపమన్యువులు. మిత్రావరణులకు సంబంధించి, కుండినులని ప్రసిద్ధిగాంచి యేకార్షేయులైన ఇతరులుగూడ వసిష్ఠులని ప్రసిద్ధిచెందిన వారు. ఈ పదకొండు మంది వసిష్ఠుల పక్షములుగా చెప్పబడిరి. బ్రహ్మయొక్క మానస పుత్రులు వీరు ఎనమండుగురు - ప్రసిద్ధి చెందినవారు. వారి సోదరులు చక్కని మహాభాగ్యవంతులు. వారి వంశములు ప్రతిష్ఠితములైనవై దేవర్షిగణములతో నిండి ఈ ముల్లోకములను ధరించుచున్నవి. వారు నూర్ల కొలదియు, వేలకొలదియు అయిన సూర్య కిరణములవలె భూమి అంతయు వ్యాపించి ఉన్నవారు.