దక్షశాపవర్ణనము

సూతుడు అనెను:

పూర్వపుదైన స్వాయంభువ మన్వంతరమున పుత్రులను సృజించు బ్రహ్మ నుండి ఆ జలములు పుట్టినవి. మనుష్యులు, అసురులు, దేవతలు కూడ పుట్టిరి. ఈ విధముగ తండ్రివలె భావింపబడుచున్న ఈ బ్రహ్మకే పితరులు జనించిరి. వారియొక్క స్వభావము ఇంతకు పూర్వము చెప్పబడినది. దాని విస్తరము కూడా చెప్పబడినది. ఇప్పుడు విస్తరముగా అది తిరిగి చెప్పబడును. దేవాసుర మనుష్యులను చూచి దేవుడు ((బ్రహ్మ) పలికెను. తండ్రివలె భావింపబడుచున్న అతనికి (బ్రహ్మకు) ఉపలక్షితులైన మధువు (వసంతుడు) మొదలగు ఆఱు (వసంత, గ్రీష్మ, వర్షాశరత్, హేమంత, శిశిరములు) ఋతువులు పుట్టినవి. ఆ ఋతువులను పితరులుగా చెప్పుదురు. ఋతవః, పితరో దేవాః, ఋతువులు పితృ దేవతలు అను అర్థముగల ఇది వేదనిబద్ధమైన శ్రుతి వాక్యము. గడచినట్టియు, రానున్నట్టియు, అన్ని మన్వంతరములలోని ఈ స్వాయంభువ మన్వంతరమున వీరందరు ముందు పుట్టిరి.

వారే (ఋతువులైన పితరులు) అగ్నిష్వాత్తులు అనియు, బర్హిషదులనియు వారికి పేర్లు. అగ్నిష్వాత్తులు అనబడువారు అనాహితాగ్నులైన పితరులు. వారిలో యజ్వానులు సోమపీథులైన పితరులు. బర్హిషదులు అనబడువారు అగ్నిహోత్రులైన పితృదేవతలని నిశ్చయమైన మతము.

చైత్రవైశాఖ మాసములు (వసంత) రసరూపములుగా తెలియవలెను. జ్యేష్టాషాఢ మాసములు (గ్రీష్మ) అగ్ని రూపములు. శ్రావణ, భాద్రపద మాసములు రెండవ వర్ష జీవ రూపములు అనబడినవి. ఆశ్వయుజ, కార్తీక మాసములు శరత్ సుధా (అమృతము) వంతములుగా చెప్పబడినవి. మార్గశీర్ష పుష్య మాసములు హేమంత మన్యు (కోపము) మంతములుగా జెప్పబడినవి. మాఘ ఫాల్గుణ మాసములు శిశిర ఋతు సంబంధములై ఘోరములైనవి. పైన చెప్పిన రెండేసి మాసములతో కూడిన ఆరు ఋతువులు, కాలము యొక్క దశలు. వీనిని ఋతువులు అందురు. ఇవి చేతనములును, అచేతనములును కూడా. ఋతువులు బ్రహ్మయొక్క పుత్రులు. అవి నెలల యొక్కయు నెలలోని సగము భాగముల యొక్కయు స్థానములందు అభిమానముగలవి. ఆ స్థానముగూడ ఋతువులు, ఋతుసంబద్ధములును. స్థానములయొక్క వ్యతిరేక సంబంధముచే వానిని స్థానాభిమానులుగా తెలుసుకొనవలెను. పగళ్ళు, రాత్రులు, నెలలు, ఋతువులు, అయనములు, సంవత్స రములు కాలావస్థాభిమానియొక్క స్థానములు. నిమేషములు (రెప్పపాటు కాలములు), కలలు (కల=540 రెప్పపాట్ల కాలము) కాష్ఠములు (కాష్ఠము-18 రెప్పపాట్ల కాలము), ముహూర్తములు (ముహూర్తము=రెండు గడియలు అనగా 48 నిమిషముల కాలము), పగళ్లు, రాత్రుళ్లు వీనియందు అభిమానులై కాలావస్థ (దశ) యందు అభిమానులై కాలావస్థల యందుండువారు అనగా దేవతలు తన్మయులై ఉండుటచేత తదాత్ములయిన వారిని గురించి చెప్పబోవుచున్నాను వినుడు.

పర్వణి యొక్క తిథులు, సంధ్యలు, పక్షములు, నెలలోని సగము భాగములు. రెండు సగము నెలలు నెల. రెండు నెలలు ఋతువనబడును. మూడు ఋతువులు అయనము ఆయనములు రెండు. దక్షిణాయనము ఉత్తరాయణము. సంవత్సరము సుమేకుడు. ఇవి స్థానులయొక్క స్థానాభిమానులగు దేవతల యొక్క స్థానములు. ఋతువులను సుమేక పుత్రులను ఎనిమిది విధములు. ఆఱుగురు ఋతు పుత్రులు (వసంత గ్రీష్మ వర్షా, శరత్, హేమంత, శిశిరములు). ఋతుసుతులు ఐదుగురు. ఋతు సంతానములు ఆర్తవ లక్షణము గలవారు. కారణము, స్థాణువులు (వృక్షములు) జంగమములు (పశుపక్ష్యాదులు) ఆర్త వేయువులు (వృక్షములు) జంగమములు (పశు పక్ష్యాదులు) ఆర్తవేయములుగనే (ఋతు సంబంధములు గలవిగనే) పుట్టుచున్నవి. (కావున) పితరులు ఆర్తవులు (ఋతు సంబం ధము గలవారు) ఇక పితామహులు (తండ్రి తండ్రి) ఋతురూపులే. సుమేకుని నుండి ప్రజాతులు పుట్టుచున్నారు, చచ్చుచున్నారు. కావున సంతానములకు సుమేకుడు ప్రపితా మహుడు (తాతకు, తండ్రి) స్థానములయందు వీరు స్థానికులై (స్థానముగలవారై) స్థానా త్ములుగా చెప్పబడినారు. ఆ స్థానము పేరుగా గలవారై తన్మయులగుట వలన తదాత్ములుగా తలపబడిరి. ప్రజాపతిఅని తలపబడినవాడే సంవత్సరుడుగా సమ్మతింపబడిన వాడు. సంవత్స రుడే అగ్నియని తలపబడినాడు. ద్విజులచే అతడు ఋతమనబడినాడు. ఋతువులు, ఋతమునుండి పుట్టినందున ఋతువులనుండి మాసములు ఆ ఋతువులును, వానికి పుట్టినవని తెలియవలెను. ఐదుగురు ఆర్తవులైన (ఋతు సంబంధముగల) సుతులును, రెండు పాదములు గల మనుష్యాదులకు, నాలుగు పాదములు గల గవాదులకును, అనగా అవులు మొదలగు జంతువులకు, పక్షులకును, ప్రాకునట్టి పాములకును, ఐదు స్థావరములకును కాలమును అనుసరించి వచ్చు ఆర్తవము (ఋతు రసము) పుష్పముగా తలపబడినది. ఋతుత్వము, ఆర్తవత్వము, పితృత్వము అనియు చెప్పబడినది. ఋతువులు ఆర్తవులు అయిన వీరందరు పితరులని తెలియవలెను. తరువాత వారినుండి సర్వభూత ములు ఋతుకాలము వలన పుట్టిరి. కావున ఈ పితరులుగూడ ఆర్తవములని మేము వింటిమి. అన్ని మన్వంతరములలోను, కాలాభిమానులు (దేవతలు) ఉన్నారు. స్థానాభి మానులైన వీరు అతిసంయమముతో ఉన్నారు.

అగ్నిష్వాత్తులు బర్హిషదులు అని పితరులు రెండు విధములని చెప్పబడిరి. ఆ పితరుల నుండి లోకప్రసిద్ధులైన ఇరువురు కన్యలు జనించిరి. వారు మేనా, ధారిణీ-అనువారు. వారిచేత ఈ విశ్వము ధరింపబడినది. శుభస్వరూపులైన తమ కన్యలను ఆ పితరులు వివాహ ధర్మార్థముగా ఇచ్చిరి. వారు ఇరువురు బ్రహ్మవాదినులు (బ్రహ్మను తెలిసి చెప్పు వారు) యోగినులుకూడా.

అగ్నిష్వాత్తులు అనబడు వారికి ‘మేన’ మానసీకన్య అనియు, బర్హిషదులకు ‘ధారిణి’ మానసీకన్య. శుభస్వరూపమైన ధారిణిని మేరువునకు భార్యగా ఇచ్చిరి. ధారిణిని ఇచ్చిన వారు సోమపీథులైన బర్హిషదులును పితరులుగా తలపబడిరి. ఇక అగ్నిష్వాత్తులు మేనను హిమవంతునకు భార్యగా ఇచ్చిరి. వారికి అనగా ధారిణీ మేనలకు పుట్టినవారు దౌహిత్రులు. ఆ దౌహిత్రులను చెప్పెద వినుడు. హిమవంతుని భార్య మేన మైనాకుని కనెను. నదీ శ్రేష్ఠమైన గంగ లవణసముద్రునకు భార్య. మైనాకునకు తమ్ముడు క్రౌంచుడు. ఆతడే క్రౌంచద్వీపము అనబడెను. మేరువుయొక్క భార్యయైన ధారిణి దివ్యౌషధులతో కూడిన మందరుడు అను పర్వతమును పుత్రుని గాను ప్రసిద్ధులైన మువ్వురు కన్యలను కనెను. వారు వేల, నియతి, ఆయతి-అనువారు. ఆయతి ధాతయొక్క భార్య. నియతి విధాతయొక్క భార్య. పూర్వము స్వాయంభువ మన్వంతరమున, వారియొక్క సంతానముగూడ చెప్పబడినది. సాగరునివల్ల ‘వేల’ ఒక అనిందితయైన కన్యను కనెను.

సావర్ణిచేత సాముద్రి కలిగినది. సాముద్రి ప్రాచీనబర్హిషుని భార్య. తరువాత సవర్ణయైన సాముద్రి ప్రాచీనబర్హిషునివల్ల పదుగురిని కనినది. వారందరు ప్రచేతసులను పేరుగలవారు. ధనుర్వేదమును సాంతముగా తెలిసినవారు. వారిలో ప్రభువై, స్వయంభువు పుత్రుడైన దక్షుడు చాక్షుష మన్వంతరమున త్ర్యంబకుని (శివుని) అభిశాపముచే పుత్రుడుగా పుట్టెను.

ఇది అంతయు విని, తరువాత శాంశపాయనుడు ఈ విధముగ సూతుని ప్రశ్నించెను. పూర్వము చాక్షుషమను వంశమున శివుని అభిశాపమువల్ల దక్షుడు ఎట్లు పుట్టెను? మాకు చెప్పుము. అని ఋషులు అడిగిరి. అప్పుడు సూతుడు శాంశపాయనుని పిలిచి శివుని శాపకారణ రూపమయిన దక్షుని కథను చెప్పదొడగెను. దక్షునకు ఎనమండుగురు కూతురులు ఉండిరని ఇంతకుముందే చెప్పితిని. తండ్రి వారిని వారివారి ఇండ్లనుండి తీసికొని వచ్చి తన ఇంట పూజించెను. వారిలో పెద్దది సతి, శివునియొక్క భార్య. రుద్రుని ద్వేషించుచు తన కూతురైన ఆ సతిని దక్షుడు పిలువలేదు. అల్లుడైన మహేశ్వరుడు మామయైన ఆ దక్షునియెడ ఎప్పు డును నమస్కరించలేదు. స్వభావసిద్ధమైన తేజస్సులో ఉండెను. తరువాత ‘సతి’ తన చెల్లెండ్రందరు తండ్రి ఇంటికి వచ్చిరని తెలిసి తండ్రి పిలువ కుండానే తన తండ్రి ఇంటికి వెళ్ళినది. తరువాత కోపముచే సహనము లేనిదై తండ్రితో ఇట్లనినది: ప్రభో! ఈ చిన్న వారందరిలో పెద్దదానినైన నన్ను అనిష్టురాలిగా అవమానించితివి. ఇక కూతురిపూజనే నిందితముగ చేసితివి. నేను అందరిలో పెద్దదానిని అట్టినాకు సత్కారము చేయుటకు నీవు అనర్హుడవు అని అనెను. ఇట్లనగనే దక్షుడు కండ్లు జేసినవాడై సతితో ఇట్లు అనెను. నీవు శ్రేష్ఠురాలవు వరిష్టురాలవు. ఎల్లప్పుడును నాకు పూజింపదగిన దానవు. కాని వారి భర్తలు నాకు ఎల్లప్పుడు మిక్కిలి ఇష్టులు. ఓ సతి వారందరు బ్రహ్మిష్టులు (వేదజ్ఞులు), తపమునందున్న వారు, మహా యోగులు, చక్కని ధార్మికులు. గుణములతో గూడ ముక్కంటి కన్న గొప్పవారై కొనియాడదగినవారు.

వసిష్ఠుడు, పులస్త్యుడు, అంగిరసుడు, పులహుడు, క్రతువు, భృగువు, మరీచి-వీరు శ్రేష్ఠులైన నా అల్లుండ్రు అతనికాతడే ఆత్మ (అతడెవ్వరిని గొప్పగా భావింపడు) నీకు ఆతడు శర్వుడు (నాశకుడు) అట్టివానిని నీవు ఎల్లప్పుడు సేవించు భక్తురాలవు. కావున నిన్ను పూజింపదలపను. శివుడు నాకు ప్రతికూలుడు అని దక్షుడు మిక్కిలి మూఢమైన చిత్తముతో పలికెను. ఆ విధముగ చెప్పబడినదై కోపించిన సతీదేవి ఇట్లనెను. “మాటలో, మనస్సులో, చేతలోను దోషములేని నన్ను నిందించితివి. కావున తండ్రీ నీ ఆత్మనుండి పుట్టిన ఈ దేహమును నేను త్యజించుచున్నాను అని చెప్పి, ఆ తరువాత, ఆ దేవి అవ మానము దుఃఖము సహింపనిదై మహేశ్వరునకు నమస్కరించి “ఎచ్చట నేను మరల ప్రకాశించు దేహముతో పుట్టుదునో, అచ్చట గూడ అజ్ఞానము లేని ధార్మికురాలనై మరల ధర్మప్రకారము ముక్కంటికి (శివునకు) ధర్మ పత్నీత్వమునే పొందుదును. ఆ శివునియందే యోగముచే కలిసి కూర్చున్న దాననై సమాధినందెదను” అని పలికి మనస్సుతో తనయొక్క యోగాగ్ని ధారణను ఆగ్నేయ దిక్కునకు సంబంధించిన అగ్నిధారణను ధరించెను. వెంటనే ఆగ్నేయ దిక్కు నుండి లేచిన వాయువుచే ప్రేరేపింపబడినదై అగ్ని సర్వాంగముల నుండి బయలువెడలి ఆమెను భస్మము జేసెను.

తరువాత శూలధారియై శంకర భగవానుడు సతియొక్క మరణమును విని, అట్లే దక్ష, సతులయొక్క సంవాదమును జరిగినది జరిగినట్లుగా తెలిసికొనెను. వెంటనే ప్రభువైన ఆ భగవంతుడు దక్షునియెడను ఋషులయెడను కోపించెను. ఓ దక్ష! ఏ కారణమున నా కొఱకై నాసతి అవమానింపబడినదో, తక్కిన కూతుళ్లు అందరు తమ భర్తలతో బాటు ప్రశంసింపబడిరో, ఆ కారణమున వైవస్వత మన్వంతరమున మరల మహర్షులు అ రెండవ యజ్ఞమున అయోనిజులై జన్మింపగలరు. చాక్షుష మన్వంతరమున బ్రహ్మచేత పవిత్రమైన హోమము చేయబడగా, దానిని భగ్నము చేయుదును అని శపించెను. చాక్షుష మన్వంతరమున చాక్షుషుడనువాడు రాజుగా కలడు. ఇతడు ప్రాచీన బర్హిషుని పాత్రుడు. ప్రచేతసుని పుత్రుడు. చాక్షుష మన్వంతరము రాగా శాఖులయొక్క కన్యయైన మార్షయందు దక్షుడను పేరుతోనే నీవు జన్మింపగలవు. అని శపించెను. ఓ దుర్మతీ! ఇంకను నేను అక్కడ గూడ నీకు విఘ్నమును చేయగలను. ఇచట ధర్మార్థ కామ పురుషార్థములతో గూడిన యజ్ఞాది కర్మలందు మాటిమాటికి విఘ్నము చేయుదును. నా కారణముగా నీవు ఋషులను క్రూర ముగ పలికినందున, ద్విజులు దేవతలతో బాటు నిన్ను యజ్ఞమున బూజింపరు. తరువాత ఆహుతిని హోమము చేసి క్రూరులై యజ్ఞ కర్మలలో నీరును వదు లుదురు. అట్లే నీవు యుగక్షయమువలన యాగక్షయమువరకు స్వర్గమును వదిలి ఇచటనే ఉండగలవు.

రుద్రుడు అనెను:

అన్ని లోకములలో భూలోకము మొదటిది. బ్రహ్మ ఆజ్ఞచే నేను దానిని ధరింతును. ఈ భూమియందు చుట్టియున్న లోకములు అన్నియు తేజస్సు కలవై ఉన్నవి. నేను వానిని ఎల్లప్పుడు ధరింతును. నీ అజ్ఞతో కాదు. దేవతలకు చాతుర్వర్ణ్యము కలదు. వారు కూడ ఒక్కచోట భుజింతురు. నేను వారితో కలిసి భుజింపను కావుననే భుజింప జేయు హోతలు వేరుగా హవిస్సులను ఇత్తురు. కావుననే అతడు అనగా రుద్రుడు దేవతలతో బాటు పూజింపబడడు వేరుగా హవిస్సీయబడి పూజింపబడును.

తరువాత అంతులేని తేజస్సుగల రుద్రునిచే అభివ్యాహృతుడైన (శపింపబడిన) దక్షుడు స్వాయంభువ మన్వంతరమున పూర్వపు ప్రజాపతిత్వమును వదిలి భూలోకమున మనుషు లలో పుట్టెను. గృహపతియైన దక్షుడు జ్ఞానములకు ఈశ్వరుడైన భగవంతుని (శివుని) తెలిసికొనెను. ఆ దక్షుడనువాడు దేవతలతో గూడి మహాయజ్ఞములతో శివుని పూజించెను. ఆ తఱువాత సతీదేవిని వైవస్వతమన్వంతరమురాగానే, శైలరాజైన హిమవంతుడు మేన యందు ఉమాదేవిగా జనింపజేసెను. ఆమె పూర్వము సతీదేవి, ఆ తఱువాత ఉమ అయినది. ఈమె భవునకు (శివునకు) సహచారిణీ వ్రతము చేయుటచే భార్యయైనది. ఈ భూలోకమున మన్వంతరములలో ఉండదలచినంత వఱకు ఆ శివుడు ఆమెచే విడువబడడు అనగా అర్ధనారీశ్వరుడగును. మరీచి పుత్రుడైన కశ్యపుని అనువ్రతయైన అదితిదేవివలె, సాధ్యుడైన నారాయణుని శ్రీ(లక్ష్మి) వలె, ఇంద్రుని శచీదేవివలె, విష్ణువును కీర్తివలె, సూర్యుని రుచివలె, వసిష్ఠుని అరుంధతివలె, మహేశ్వరుని ఉమ విడువలేదు. పైన చెప్పిన స్త్రీలందరు ఏమైనను తమ భర్తలను విడువలేదు. తరువాత తిరిగివచ్చు కల్పములలో గూడ వారు తమ భర్తలతోబాటు మరల జన్మింతురు. ఈ విధముగా ప్రాచేత దక్షుడు, చాక్షుష మన్వంతరమున ప్రాచీన బర్హిషుని పౌత్రుడుగను, ప్రచేతసుని పుత్రుడుగను పుట్టెను.

ఈ రెండవ మన్వంతరమున రుద్రుని శాపముచే పదుగురు ప్రచేతసులు వలన మార్షయందు మరల దక్షుడు పుట్టెను అని వినికిడి. మొదటి త్రేతాయుగమున పూర్వము వైవస్వతమనువునకు భృగువు మొదలగు మహర్షులందరు పుట్టిరి. ఈ విధముగ ధీమం తుడైన ముక్కంటికిని ప్రజాపతియైన దక్షునకును జాత్యంతరమువల్ల అనుబంధ ద్వేషము కలిగెను. కావున జాత్యంతరగతుడైనను, శుభాశుభములచే భావితుడైన వానికి ఇట ఎప్పుడు శత్రువుల ఎడ బాంధవ్యమును చేయరాదు. అనగా వైరులకు ఎప్పుడు వైరము విడువదు, అది ప్రాణిని విడువక నశింపజేయును అని ప్రసిద్ధి, శతృత్వము ప్రాణిని విడువదు. అది సహ జము కావున చక్కని తెలివితో నడుచుకొనవలెను. అని సూతుడు మహర్షులతో చెప్పెను.

ఋషులు అనిరి:

ప్రజాపతియై ప్రాచేతసుడైన దక్షునియొక్క హయమేధ యజ్ఞము ఎట్లు వినాశ మంది నది. దేవి స్వయముగా మరణించినదని కోపించిన సర్వాత్మకుడు ప్రభువైన శివుని దక్షుడు ఎట్లు శాంతింపజేసి అనుగ్రహింప చేసికొనెను? ఆ యజ్ఞము చివరకు ఎట్లు సాధింపబడెను? అని అడిగిరి.

సూతుడు అనెను:

ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! పూర్వము జ్యోతిష్కమను పేరుగలిగి సూర్య సంబంధము కలిగి, సకల రత్నములచే అలంకరింపబడి ముల్లోకములందు ప్రసిద్ధిచెందిన మేరు పర్వ తము యొక్క శిఖరము కలదు. అది ఇంతయని తెలియనలవి కానిది, దేని చేతను భిన్నముకానిది. సర్వలోకులచే నమస్కరింపబడినది. అన్ని ధాతువులచే అలంకరింపబడిన ఆ పర్వతరాజమందు పాన్పునందువలె మహాదేవుడు ప్రకాశించుచు కూర్చుని యుండెను. పర్వత రాజు కూతురు పార్వతియు ఎల్లప్పుడు ఆయన ప్రక్కనే ఉండెను. (మహాత్ములైన అదిత్యులును (ద్వాదశ సూర్యులు), అంతులేని ఓజస్సు (బలము) గల వసువులును, అట్లే మహాత్ములైన వైద్యులలో శ్రేష్ఠులైన అశ్వినులును, అట్లే గుహ్యకుల పరివారముగలవాడై యక్షులకు ఈశ్వరుడై, కైలాసనిలయుడై, ప్రభువై, రాజైన కుబేరుడును, మహామునియైన శుక్రుడును ఆ మహాత్ముడైన శివుని ఉపాసింతురు. సనత్కుమారుడు మొదలగు మహర్షులును అంగిరసుడు మొదలగు తక్కిన దేవర్షులును, విశ్వావసువు (సూర్యుడు)ను, గంధర్వు డును, అట్లే నారద, పర్వతులును, అప్సరోగణ సంఘములును అనేక పర్యాయములు ఇటకు వచ్చిరి. మంగళకరమై సుఖకరమైన అనేక సుగంధములతో నిండి పవిత్రమైన వాయువు వీచెను. అట్లే అన్ని ఋతువులలో పూయు పూవులతో పుష్పవంతములుగా వృక్షములు శోభించెను. అట్లే విద్యాధరులు, సిద్ధులు, తపోధనులును అచట పశుపతియైన మహాదేవుని చుట్టుగా ఉండి సేవింతురు. తరువాత నానా రూపములు ధరించిన భూత ములు సేవించును. అనేక రూపములు ధరించి సంతుష్టులైనవారు, అనేక ఆయుధములను ఎత్తి బయలు దేరిన వారు మహాబలులు మహాకోపిష్టులు అయి రాక్షసులు, పిశాచులును శివుని యొక్క అనుచరులై అగ్నితో సమానులైన వారచట ఉండిరి. భగవంతుడైన నందికూడ మండుచు స్వతేజముతో ప్రకాశించుచున్న శూలమును పట్టుకొని ఆ శివుని ఇష్టప్రకారమే ప్రవర్తించుచుండెను. సమస్త తీర్థ జలముల నుండి పుట్టినదియు, నదులన్నింటిలో శ్రేష్ఠమై దేవ రూపిణియైన, గంగగూడ ఆ దేవుడైన శివుని సేవించెను. ఈ విధముగా అచ్చట మహా భాగులైన దేవతలచేతను దేవర్షులచేతను బ్రకాశించుచున్నవాడై ఆ మహాదేవుడు ఉండెను.

పూర్వము దక్షుడు హిమాలయముపైన ఋషులు సిద్ధులు సేవించిన శుభదేశమైన గంగాద్వారమున యజ్ఞమును చేయుటకు ఆరంభించెను. తరువాత ఇంద్రుడు మొదలగు దేవతలు ఒకచో కలిసి ఆ దక్షుని యజ్ఞమునకు వెళ్లదలచిరి. అగ్నివంటి తేజముగల మహాత్ములైన అ దేవతలు ప్రకాశించుచున్న తమ తమ విమానములతో శివసంకల్పముతో గంగా ద్వారమునకు వెళ్లిరని వినికిడి. ఆ ప్రదేశము గంధర్వులతోను, అప్సరసలతోను, నిండినది. అనేక వృక్షములతోను, తీగలతోను చుట్టబడినది. ఋషి సంఘములతో చుట్టబడిన దక్షుడు ధర్మధారులలో శ్రేష్ఠుడు. భూమ్యాకాశములలోను స్వర్గలోకమునను ఉన్న అందరును ప్రజాపతియైన దక్షునికి చేతులు జోడించి, సమీపమునకు చేరిరి. ఆదిత్యులు, వసువులు, మరుద్గణములతోబాటు రుద్రులు ఇంద్రునితో సహ అందరును యజ్ఞభాగులై అటకు వచ్చిరి. ఊష్మపులు (ఆవిరిని పీల్చువారు) సోమపులు (సోమరసమును (త్రాగువారు) ఆజ్యపులు (నేతిని త్రాగువారు) అట్లే అశ్వినీదేవతలు, పితృదేవతలును, బ్రహ్మతోబాటు అచటికి వచ్చిరి. వీరును, తక్కిన అనేక భూతసమూహములును, అట్లే జరాయుజులును (మావినుండి పుట్టువారు) అండజములును (గ్రుడ్డు నుండి పుట్టువారు), స్వేద జులును (చెమటనుండి పుట్టు నవియు), అందరు దేవతలును తమతమ వాహనములతో గూడ వేద మంత్రములతో పిలువబడిన వారై, మండుచున్న అగ్నులవలె వెలుగుచున్నవారై, విమానములందున్నవారై ప్రకాశించుచున్నారు. వారిని జూచిన దధీచ మహాముని కోపా విష్ణుడై పూజింపతగని వానిని పూజించుట చేతను, పూజింపతగిన వానిని పూజింప కుండుటచేతను నరుడు మహాపాపమందును. ఇందు సంశయము లేదు అని పలికెను. ఇట్లు పలికి బ్రహ్మర్షి (దధీచుడు) మరల దక్షునితో పూజింపదగిన ప్రభువైన పశుపతిని ఎందులకు ఇట ఆహ్వానింపవైతివి? అని ప్రశ్నించెను. ఆ వాక్యములను వినిన

దక్షుడు:

“శూలమును ధరించి, జటలు గలిగిన రుద్రులు నాకు చాలమంది కలరు. వారు ఏకాదశ (పదునొకండు) అవస్థలలో ఉందురు. అంతకంటే వేరైన మహేశ్వరుని నేను ఎఱుగను. అని అనగా, దధీచుడు దేవతలందరును ఆహ్వానింపబడిరి. ఏ కారణముచేత శివుడు పిలువబడలేదు? శంకరుని కన్న మించిన వేరైన దైవమును నేనెఱుగను. కావున దక్షుని ఈ విశాల యజ్ఞము జరుగదని అనిపించుచున్నది అని పలికెను. అంతట

దక్షుడు:

ఓ శూరుడవైన దధీఛా! ఈ యజ్ఞమున సువర్ణపాత్రమున మంత్రపూతమై ఆహవ నీయాగ్ని యందు నిత్యమైన హవిస్సునంతయు ప్రభువై సర్వవ్యాపియై సాటిలేని విష్ణువునకే చేరునట్లు ఇత్తును. అని జవాబు ఇచ్చెను ఆసమయమున సాధ్యయైన సతీదేవి దేవతలు అందరు దక్షుని యజ్ఞమునకు వెళ్లినట్లు తెలిసికొని, పశుపతియైన శివునితో

ఉమ:

“భగవన్! ఇంద్రుడు మొదలైన దేవతలు ఎక్కడకు వెళ్లిరి? నాకు గొప్ప సంశయము కలుగుచున్నది. నిజముగా నిజమును చెప్పుము” అని అడుగగా.....

మహేశ్వరుడు:

ఉత్తమ ప్రజాపతియైన దక్షుడుఅను మహాభాగుడు హయమేధయాగము చేయుచున్నాడు. దేవతలందరు అక్కడికి వెళ్లిరి అని జవాబిచ్చెను. ఆ మాటలకు

సతీదేవి:

ఓ మహాభాగ్యవంతుడా! ఈ యజ్ఞమునకు నీవేల వెళ్ళవైతివి? ఏ కారణముచే నీవచటికి వెళ్ళుట నిషేధింపబడినది అని ప్రశ్నించెను. అందుకు

మహేశ్వరుడు:

ఓ మహాభాగ్యవంతురాలా! ఈ యజ్ఞములు అన్నింటిలోను నాకు భాగము కల్పింప బడలేదు. ఓ ఉత్తమురాలా! పూర్వాచారముచే ఏర్పడిన మార్గమున బుద్ధిమంతుడైన దక్షుని యొక్క యజ్ఞమున దేవతలు నాకు భాగమును ఈయరు. అనగా

సతీదేవి:

ఓ భగవంతుడా! నీవు సర్వదేవతలలో అధికగుణములచే విశిష్ఠ కాంతిమంతుడవు. తేజస్సుతోను, కీర్తితోను, సంపదచేతను జయించుటకు తిరస్కరించుటకు అలవిగాని వాడవు. ఓ మహాభాగుడా! ఈ పేరును ప్రతిషేధించుటచే నేను మిక్కిలి దుఃఖమును పొందితిని. ఓ పాపరహితుడా నాకు కంపము కూడ కలిగినది. అచ్యుతుడు, భగవంతుడు అయిన నా భర్త ఇవ్వేళ యజ్ఞము యొక్క సగభాగమును గాని లేదా మూడవ భాగమునుగాని పొందునట్టి ఏ దానమును ఏ నియమ వ్రతమును ఏ తపమును నేను చేయవలయును? అని విచారముతో చెప్పగా అచింత్యుడైన శివుడు ఈ విధముగ మాట్లాడుచు క్షోభజెందిన తన భార్యతో చిరునవ్వుతో ఓ! దేవతలకు ఈశ్వరురాలా! సన్నని నడుముగలదానా! నీకు తెలియదు. నీకు ఈ విధముగ పలుకుట తగదు? ఓ విశాలాక్షి సత్పురుషులు నేను ధ్యానముచే సర్వమును తెలియుదునని అందురు. ఈనాడు లోకత్రయము మోహముచే అన్ని విధములుగా విజ్ఞాన హీనముగా లేదు. యజ్ఞమున నన్ను స్తుతించువారు స్తుతింతురు. రథంతరమున (రథన్తర సామమున) గానము చేయదగిన సామమును (నాకై) గానము చేయుదురు. బ్రహ్మ సత్రమను యాగమున బ్రాహ్మణులు నన్ను పూజింతురు. అధ్వర్యులు యజ్ఞమునందు యజుర్వేద మంత్రములను చదువువారు నాకు భాగమును కల్పింతురు. అని ఆమెను ఓదార్చెను. అప్పుడు.....

సతీదేవి:

భగవంతుడా! పండితుడైనను సమస్త స్త్రీజనుల సభలలో తనను తాను స్తుతించుకొనును. రక్షించుకొనును. ఇందు సంశయములేదు. అనగా భగవంతుడైన శివుడు... ఓ దేవతలకు ఈశ్వరియైన దానా! నన్ను నేను స్తుతించుటలేదు. ఓ ఉత్తమురాలా! యజ్ఞ భాగము కొఱకు ఎవనిని సృష్టింతునో చూడుము, తెలిసికొనుము అనెను. భగవంతుడు శివుడు ప్రాణప్రియురాలైన భార్యతో ఇట్లు పనికి తన ముఖమునుండి పుట్టి కోపాగ్నిని పోలిన వానిని సృష్టించెను. ఆతడు వేయితలలుగలవాడు భగవంతుడు. వేయికాళ్లు, కండ్లు కలవాడు. వేయి ముద్గరములను (ఇనుపగుదియలు) ధరించినవాడు, బాణములుగ వేయి చేతులు గలవాడు, శంఖము, చక్రము, గద వీనిని చేతులలో ధరించిన వాడు. ఉజ్జ్వలముగ ప్రకాశించు ధనస్సులు గలవాడు. గండ్రగొడ్డలి కత్తి వీనిని ధరించిన దేవుడు మహాకోపముతో భయంకరుడు. భయంకరరూపముతో మండుచున్నవాడు. చంద్రరేఖ అలంకారముగా గలవాడు. పులిచర్మమును ధరించినవాడు. గొప్ప రక్తమును స్రవించునట్టి కోరలతో, క్రూరమైన పెద్ద ముఖమును ధరించినవాడు. పెద్ద కడుపు గలవాడు. మెఱుపు నాలుక గలవాడు. పెద్దగా వ్రేలాడు పెదవులు గలవాడు. వ్రేలాడు పెద్ద చెవులు కలవాడు. దగ్గరకు పోవుటకు అలవిగానివాడు. వజ్రాయుధముతో మెఱయు చేతులు గలవాడు. కాంతులతో మండుచున్నట్లున్న తలవెంట్రుకలు గలవాడు. జ్వాలల మాలలచే కప్పబడిన ట్లున్నవాడు. ముత్యాలహారములతో అలంకరింపబడినవాడు. ప్రళయ కాలాగ్నివలె తేజస్సుతో మండుచున్నవాడు. చెవులవరకు చీల్చినట్లున్న నోటి ఇరుచివరలు కలవాడు. నలుదెసలకు భయంకరుడు. మహాబలుడు. మహాతేజుడు. మహాపురుషుడునైన ఈశ్వరుడు. విశ్వమును హరించు గొప్ప శరీరముగలవాడు గొప్ప మఱ్ఱిచెట్టు మండలమువలె ఉన్నవాడు. ఒకే మారునూరు చంద్రులవలెను, మన్మథాగ్నివలెను ఉండి ఒక్క మారు మండుచున్నవాడు. తెల్లని వాడికోరలుగల నాలుగు పెద్ద ముఖములు గలవాడు. గొప్ప భయంకరమైన తేజముతోను బలముతోను సంతోషముతోను ఒప్పిన వాడు. ప్రళయకాల మందలి వేల సూర్యాగ్నుల కాంతిగలవాడు. వేల చంద్రులు నిర్మల కాంతిచే మనోహరుడు ఎక్కువగా ప్రకాశించిన ఔషధులుగల మంధర పర్వతమువలె ఉన్నవాడు. సుమేరు పర్వతముతోను, హిమాలయముతోను, కైలాస పర్వతముతోను సమానమైన కాంతి గలవాడు. ప్రళయకాల సూర్యునివలె ఉన్న వాడు. మహాబలవంతుడు. చక్కని ముక్కు కలవాడు. పెద్దముఖము కలవాడు. భయంకరమైన చెక్కిళ్లు కలవాడు. మండుచున్న కండ్లుకలవాడు. అగ్నిజ్వాలల చేతులచే కలుషమైన ముఖము కలవాడు. సింహచర్మము వస్త్రముగా గలవాడు. మహా సర్పములతో చుట్టబడినవాడు. తలపాగా కలవాడు. చంద్రుని ధరించినవాడు ఒకప్పుడు భయంకరుడు. ఒకప్పుడు సమముగా ఉండువాడు. అనేక విధములైన పుష్పములు ధరించిన శిరస్సుగలవాడు. బహువిధములైన గంధములను పూసికొన్నవాడు. అనేక రత్నములచే విచిత్రమైన శరీరముగలవాడు. అనేక ఆభరణములను అలంకరించుకొన్నవాడు. కొండ గోగు పూలమాలచే ప్రకాశించు చున్నవాడు. కోపముచే పైకితిరిగిన కండ్లు గలవాడు. అతడు ఒకచోట చిత్రమైన శరీరము ఉండునట్లుగా నాట్యము జేయును. ఒకచోట చక్కని స్వరముతో పలుకును. ఒకచోట ఆత్మయోగముతో ధ్యానముచేయును. ఒకచోట ఘనముగ మృదంగమును వాయించును. ఒకచోట విశ్వాత్ముడై గానము చేయును. ఒకచోట మాటి మాటికి ధ్వనిచేయును. జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, తపము, సత్యము, క్షమ, ధైర్యము, ప్రభుత్వము, ఆత్మజ్ఞానము (మొదలగు అన్నిటిని ఆక్రమించు గుణములతో కూడినవాడు. ఆతడు మోకాళ్లతో భూమిని ఆనుకొని నమస్కరించినవాడై చేతులు జోడించి నిలబడెను. ఓ దేవేశుడా! నేను నీకొఱకు ఏమి చేయవలెనో నీవు ఆజ్ఞాపింపుము అనెను.

మహేశ్వరుడు “దక్షుని యజ్ఞమును ఆవరించి ధ్వంసముచేసివేయుము” అని ఆ వీరభద్రునితో అనెను. ఆ శివుని ఆజ్ఞ విని, మహాబలుడైన వీరభద్రుడు దేవేశుడైన ఉమాపతి పాదములకు నమస్కరించి బోనులో నుండి వదలిన సింహమువలె, సతీదేవి తనకోపముతో యోగాగ్ని యందు దగ్ధయగుట తలచి ఆ దక్షుని యజ్ఞము ధ్వంసము చేసెను. కోపముచే మహాభయంకరురాలు, మహేశ్వరియైన భద్రకాళి’ తన (వీరభద్రుని యొక్క) సర్వసాక్షిగా వీరభద్రుని వెంబడించి వెళ్లినది.

ఇతడు కోపించిన భగవంతుడగు శ్మశానవాసియైన శివుడు వీరభద్రుడని ప్రసిద్ధిచెందినవాడు. దేవియైన సతియొక్క కోపమును చల్లార్చువాడు. ఆతడు తన రోమ కూపముల నుండి (వెంట్రుకల మొదళ్ళ నుండి) రౌద్రులను, గణేశ్వరులను సృష్టించెను. వారు రుద్రుని అనుసరించి వచ్చువారు, మహాబలవంతులు. రుద్రునితో సమానమైన బలపరాక్రమములు గలవారు. వారందరు రుద్రసేవకులు. వారందరు రుద్రునితో సమానముగ కాంతిగలవారు. అట్టివారు వేగముగా నూర్లకొలది వేలకొలది వచ్చిపడిరి. అంత కిలకిలఅను శబ్దము ఆకాశమును నింపుచున్నట్లు వ్యాపించెను. ఆ గొప్ప శబ్దముతో ఆ దేవతలు అందరును తిరుగుచుండిరి. వరుణలోకమున ఉండు బ్రాహ్మణులు గూడ కలతజెందిరి. అగ్నులు మండలేదు. సూర్యులు ప్రకాశింపలేదు. గ్రహములు కూడ ప్రకాశింపలేదు. నక్షత్రములు తారకలును వెలుగలేదు. గ్రహములు కూడ ప్రకాశింపలేదు. ఋషులు దేవతలును, దానవులును మాట్లాడలేకుండిరి. అవమానింపబడిన గణేశులు గణములును ఈ విధముగ చీకటినిండిన యజ్ఞమును నిశ్శేషముగ దహించుచుండిరి. భయంకరరూపులై మహాబలులైన ప్రమథ గణవీరులు సింహనాదము చేయుచుండిరి. భయంకరులైన మరికొందరు (యజ్ఞ మంటప వస్తువును) పగలగొట్టుచుండిరి. యూపస్తంభములను పెరికి వేయుచుండిరి. మరికొందరు అచటి వారిని మర్ధించుచుండిరి. మరికొందరు వికటనృత్యము చేయు చుండిరి. యజ్ఞములోనివారు వాయువేగ మనోవేగములతో పరుగులెత్తి పోవుచుండిరి. యజ్ఞ పాత్రములను ముక్కలుగాను చూర్ణముగను చేయుచుండిరి. అప్పుడు యాగస్థలములందు ఆకాశమునుండి రాలిన చుక్కలవలె యజ్ఞవస్తువులు తుత్తునియలై చెల్లా చెదరుగ బడి కనబడుచుండెను. దివ్యములైన అన్నములు పానీయములు భక్ష్యములు వీని యొక్క రాసులు పర్వతములవలె ఉండెను. పాలనదులు ప్రవహించుచుండెను. తక్కిన నేయి పాయసములు బురుదలుగా అయ్యెను. తేనె మీగడల పానీయములు దివ్యముగా ఉండెను. ఖండశర్కరలు ఇసుకకుప్పలవలె పడియుండెను. మనోహరములైన బెల్లపు కాలువలు షడ్రసములను ప్రవహించు చుండెను. ఉత్తర దక్షిణములను అంటి పడియున్న మాంసములు, వివిధములైన భక్ష్యములు ఇంక ననేక దివ్య భోజ్యములు పడి ఉండెను. లేహ్యములు (నాకి తినునవి) చోష్యములు (జుఱ్ఱిత్రాగునవి)ను ఉండెను. వీనిని అన్నింటిని తక్కిన ప్రమథ గణములు అనేక విధములైన ముఖములచే భుజించుచుండిరి. తరువాత అన్ని విధములుగా పొర్లాడుచుండిరి. క్రీడించుచుండిరి. వివిధ ఆకారములు గలవారై దేవతా స్త్రీలను ఒకచో ఉంచిరి.

రుద్రకోపముచే ప్రయోగింపబడిన రుద్రకల్పులైన ప్రమథులు సర్వ దేవతలచేత సురక్షితమైనను, దక్షయజ్ఞమును శీఘ్రముగా ధ్వంసము చేసిరి. అట్లే తక్కిన కొందరు సర్వభూత భయంకరమైన నాదములను చేసిరి. మరికొందరు యజ్ఞము యొక్క శిరమును ఖండించి భయంకరముగ గర్జించుచుండిరి. యజ్ఞపతియై దక్షుడైన దక్షప్రజాపతి మృగ(లేడి) రూపమున ఆకాశమున పరుగులిడ ప్రారంభించెను. తెలియరాని ఆత్మ స్వరూపముగల వీరభద్రుడు దక్షుని బలమును తెలిసికొని, ఆకాశమంతట వ్యాపించు మహత్స్వరూపుడై వెంటనే ఆకాశముననున్న దక్షుని శిరమును ఖండించెను. ప్రజాపతియైన దక్షుడు గూడ నశించిన ప్రాణము కలవాడయ్యెను. కోపించిన వీరభద్రుని పాదముచే దక్షుని శిరముపిండిగా చేయబడెను. ముసలితనముచే తిరస్కరింపబడిన తీవ్రమైన ఆత్మగలవాడై భూమిపైబడెను. విమలాత్మకులైన ముప్పది మూడు కోట్ల దేవతలు సింహబలుడై అగ్నిబలుడైన వీరభద్రునిచే పాశముచే బంధింపబడిరి. తరువాత ఆ సర్వదేవతలు మహాబలుడు మహాత్ముడైన వీరభద్రుని కడకువచ్చిరి. ఓ ప్రభో, రుద్రదేవా, సేవకులయెడ అనుగ్రహించి ప్రసన్నుడవు అగుము. కోపింపకుము. అని ప్రార్థించిరి. అంతట...

బ్రహాది దేవతలు ప్రజాపతియైన దక్షుడును, చేతులు జోడించినవారై మీరెవరో చెప్పుడనిరి. వీరభద్రుడు వారితో నేను దేవుడను కాదు. ఆదిత్యుడను కాదు. ఇచట భుజించుటకును రాలేదు. కుతూహలముతో కూడినవాడనై దేవేంద్రులను తిలకించుటకును కూడ రాలేదు. దక్షయజ్ఞ వినాశము కొఱకు ఇచటికి వచ్చిన వానినిగా నన్ను తెలుసుకొనుడు. ఈమెను రుద్రకోపమువలన బయలు వెడలిన భద్రకాళిగా తెలియుడు. దేవదేవుడైన శివునిచే పంపబడినదై ఇచటి యజ్ఞ సమీపమునకు వచ్చినది. ఓ రాజేంద్ర నీవు దేవుడైన ఉమాపతిని శరణు పొందుము. రుద్రుని కోపమైనను మేలు. రుద్రసేవకులకోపమునకు హద్దులు ఉండవు అని పల్కెను.

వీరభద్రుని మాటను విని ధర్మమును ధరించువారిలో శ్రేష్ఠుడైన దక్షుడు దేవేశుడై శూలముచేత ధరించిన మహేశ్వరుని సంతోషపెట్టసాగెను. యజ్ఞవాటిక అంతయు చెడిపోయినది. బ్రాహ్మణులు అందరు పారిపోయిరి. రుద్ర సంబంధమైన భయంకరమైన మహాగ్ని ఆకాశమున మృగశీర్షా నక్షత్ర రాశిని ఆవరించి మండినది. పరిచారకులు శూలములతో బిగిసిన ముఖములతో కూతలు పెట్టుచున్నారు. యూపములు తవ్వి పెఱికి వేయబడినవి. విరువబడి, ఇటు అటు వేయబడినవి. మాంసమును కోరిన గ్రద్దలు ఎగురుచున్నవి, వ్రాలుచున్నవి. తమరెక్కలు విదుల్చుటచే వచ్చిన ధ్వనులు అచటి నూర్లకొలది నక్కల కూతలతో కలిసి వ్యాపించినవి. ఈ విధముగ యజ్ఞవాటిక అంతయు దూషితమైనది.

ఆ తఱువాత బహుదృష్టులు గలవాడును, శత్రువుల జయించువాడునైన దేవదేవేశుడైన శివుడు ప్రయత్నముతోడ నిలకడతో ప్రాణాపాన వాయువులను నిరోధించి అంతట దృష్టిని విశేషముగా ప్రసారించి అకస్మాత్తుగా అగ్నికుండము నుండి (వెలుపలికి)వచ్చెను. వేల కొలది చంద్రసూర్యుల యొక్క తేజము ప్రళయమువలె ఉండెను. భగవానుడు నవ్వి దక్షునితో ఇట్లు పలికెను. నీ అజ్ఞానము వలన యజ్ఞము నష్టమైనది. ఇప్పుడు నీకు నా యందు ప్రీతికలిగినది. దేవతల గురువుతో గూడ వినిపించిన విషయమును చక్కగా చెప్పి చిరునవ్వు నవ్వి, నీకేమి చేయవలెనో చెప్పుమని అనెను. ప్రజాపతియైన దక్షుడు భయముచెంది శంకతో మిక్కిలి భయపడినవాడై కన్నీరు నిండిన ముఖము కన్నులు గలవాడునై, చేతులు జోడించి ఆ దేవదేవునితో భగవంతుడవైన నీవు ప్రసన్నుడవైనచో, నేను నీకు ప్రియుడనైనచో, నేను నీకు అనుగ్రహింప దగినవాడనైనచో, నాకు వరమీయతగినదైనచో, ఏది తినబడినదో నమలబడినదో, త్రాగబడినదో భుజింపబడినదో ఏది నశింపచేయబడినదో, చూర్ణము చేయబడినదో, విరిచి తొలగింపబడినదో అట్టి యజ్ఞసంభార మంతయు చాలాకాలముగా మహాప్రయత్నముతో కూర్చుకొనబడినది. అది నాకు మిథ్య (సత్యములేనిది. శూన్యము) కారాదు. నేనీ వరమును కోరుచున్నాను” అనెను.

“అట్లే అగుగాక” అని భగవంతుడై భగనేత్రహరుడైన హరుడు అనెను. ప్రజాపతియైన దక్షుడు మోకాళ్లతో భూమిపైకి వంగి ధర్మాధ్యక్షుడు మహాదేవుడు ముక్కంటియు అయిన శివునకు నమస్కరించి, ఆ శివునిచేత వరమును పొంది, వేయి ఎనిమిది (అష్టోత్తర సహస్ర) నామములచే ఆ వృషభధ్వజుడైన శివుని స్తుతించెను.